నా భర్త నన్ను రేప్‌ చేశాడు!!!(కథ)-గీతాంజలి

నేను విజ్ఞాన జ్యోతి హాస్పిటల్లో మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నాను. ఆ రోజు డ్యూటీకొచ్చేప్పటికీ ఆలస్యమైంది. పేషంట్స్‌ వర్సగా ఎదురు చూస్తున్నారు. నన్ను చూడగానే రమాదేవి అనే పేషంట్‌ ఆత్రంగా లేచి నిల్చుంది చేతిలో రిపోర్ట్స్‌తో… కళ్ళల్లో ఏదో భయం కనపడుతున్నది. ఎప్పట్నించి ఎదురు చూస్తున్నదో మొదటి నంబరు ఆమెదే.

నార్మల్‌ ఉన్నాయా మేడమ్‌ రిపోర్ట్స్‌ ఏమన్నా ఫరక్‌ ఉన్నదా అని అడిగింది రమాదేవి చాలా భయం నిండిన దిగులు చూపులతో. ఏం చెప్పాలి? ఆమె భర్త చెడు తిరుగుళ్ళు తిరిగి – ఆమెకి అంటించిన హెర్పిస్‌ అనే లైంగిక పరమైన అంటువ్యాధి ఆమెకీ అంటుకున్నట్లు పాసిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది.

మూడు రోజుల క్రితం రమాదేవి హాస్పిటల్‌కు వచ్చింది. గత సంవత్సరం నించీ ఆమెకి తన జననాంగాల చుట్టూ ముత్యాల్లాంటి గుల్లల్లా పుండ్లు వచ్చి నొప్పి, మంట దురదతో బాధ పడ్తున్నదనీ, ప్రతీసారి భర్త వేడి అయిందనీ ఏవో క్రీములు తెచ్చిస్తాడనీ ఆయనకి కూడా అదే విధంగా గుల్లలు వస్తాయనీ చెప్పింది. ఈసారి అతనికి తెలీకుండా ఆమె హాస్పిటల్‌కి వచ్చింది. పరీక్ష చేసిన వెంఠనే నా కర్థమైపోయింది. వెంటనే వైరల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష చేయించాను. అదే చెప్పాను. రమాదేవి ముఖం రక్తంతో ఎర్రబారింది. బద్మాష్‌ ముండా కొడుకు ప్రతీసారి ఒట్టు తీస్కున్నాడు మేడమ్‌ పిల్లల మీద. మొన్నొకసారి ఏదో హోటల్ల ఒకమ్మాయితోని మా మరిది చూసి చెప్పిండు. ఇంక నేను పక్కా చేస్కున్న మీ దగ్గర్కి వచ్చినా ఇప్పుడేం చెయ్యాల మేడం… రమాదేవి కంఠం దుఃఖంతో ఒణుకుతుంటే అడిగింది. ”మందులు వాడాల్సిందే. ఇది చాలా మొండి వ్యాధి తగ్గినా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ముందు నీ భర్త చెడు తిరుగుళ్ళు మాన్పించు ఈ సంగతి మీ పుట్టింట్లో అత్తింట్లో చర్చించు. ఇలానే తిరిగాడంటే నీకు ఎయిడ్స్‌ గూడా అంటిస్తాడు” అని చెప్పి సెక్స్‌లో పాల్గొన్న ప్రతీసారి కండోమ్‌ వాడమని చెప్పాను. కండ్లల్లో నీరు తిరుగుతుంటే తలవంచుకుని వెళ్ళిపోయింది రమాదేవి. మొన్న వచ్చినప్పుడే ఆమెకి ఒక మహిళా సంఘం అడ్రసు ఇచ్చాను. ఇటువంటి రమాదేవిలను వారానికి ఒక పది మందిని చూస్తుంటాను ప్రతీసారి బాధే మిగులుతుంది.

ఈ లోపల హడావుడిగా ఎవర్నో స్ట్రెచర్‌ మీద తీస్కొచ్చారు. వెంఠనే లేచి పరిగెత్తాను. స్ట్రెచర్‌ మీద ఒకమ్మాయి ఉంది పదహారు పదిహేడేళ్ళ వయస్సుంటుంది. మనిషి భయంతో బిక్క సచ్చిపోయి ఉంది. నిలువెల్లా ఒణికిపోతున్నది. వెక్కిళ్ళు పడుతున్నది అమ్మా… అమ్మా అంటున్నది. ఆమె చేతిల నిండా గోరింటాకు ఉన్నది. మెడలో కొత్తగా మెరిసిపోతున్న పసుపుతాడు ఉంది. చేతి నిండా ఆకుపచ్చా ఎరుపు మట్టి గాజులు, ఒక్కో బంగారు గాజు వేస్కొని ఉన్నది. గాజులు విరిగి ఆమె చేతులకు గుచ్చుకుని ఉన్నాయి రక్తం కారుతోంది. ఆమె పాదాలకు రక్తపు మరకలు ఇంకా పోని గోరింటాకు రాసిన – పసుపులతో కల్సిపోయినాయి. ఏదో జరగరానిదే జరిగింది. జుట్టంతా చిందరవందరై పోయింది. ముఖమంతా గోళ్ళ రక్కులు, కమిలిన గుర్తులు, మచ్చలు, కనురెప్పలపైనా, పెదాలు, చెవులు, గెడ్డం, బుగ్గలపైనా అవే గాట్లు. కింది పెదవి చిట్లి రక్తం గడ్డ కట్టింది. చేతులపైన రక్కులు. కళ్ళనిండా విషాదం… భయం నిండి తెర్లాడుతున్న కన్నీళ్ళు. ఆమెతో బహుశా ఆమె అత్త మామ ఉన్నారు. ఆమెకు ఏమయ్యింది అని అడిగాను వాళ్ళను. ఏం కాలేదు భార్య భర్తల మధ్య ఏదో చిన్న గొడవ, అన్నాడా మగ మనిషి నిర్లక్ష్యంగా నీకెందుకన్నట్లుగా చూస్తూ. మీకు ఈమె ఏమవుతుంది అని అడిగా. నా కోడలు కొడుకు భార్య. లగ్గమై పది దినాలైతున్నది అన్నాడు చిరాగ్గా. జర చూడమ్మ జల్ది మల్ల ఆమె తల్లిగారు వాళ్ళు వస్తే మంచిగుండదు అంటుంది ఆమె అత్త… ఇంక వీళ్ళు చెప్పరని ఆమెనే అడుగుదామని ఆమెను కేసువాలిటీలోకి తీస్కెళ్ళమని స్టాఫ్‌కి చెప్పి నేను అనుసరించాను.

ముందుగా ఆమెను పరీక్షించాను. జననాంగాల నించి తీవ్రంగా రక్తస్రావమవుతున్నది. అక్కడ మూడంగుళాల పొడవులో చీలిపోయింది. మనిషి నిలువెల్లా ఒణికిపోతున్నది. తొడలు, మోకాళ్ళు, కాళ్ళు కదిలిపోతున్నాయి. దాదాపుగా షాక్‌లో ఉంది. నా కర్థమయ్యింది ఆమె పరిస్థితి. ఆమెను ఓ.టి. టేబుల్‌ మీద పడుకోబెట్టి… ఏమయ్యింది చెప్పమ్మా అని లాలనగా అడిగాను. ఆమె ఒక్కసారి దుఃఖంతో ఒణికిపోయింది. తనను తాను తమాయించుకొని నా భర్త నన్ను రేప్‌ చేసాడు. బాగా కొట్టాడు అంది. నేను ఆశ్చర్యపోయాను. తేరుకొని రేపా? నీ భర్తనా అని అడిగాను. ఆమె అవునన్నట్లుగా తల ఊపింది.

****                                                        ***                                                    ***

ఆమెకు ముందుగా చేయవల్సిన శస్త్ర చికిత్స చేయసాగాను. ఎందుకంటే రక్తస్రావం ఆగాలి. లేకపోతే ఆమె షాక్‌లోకెళ్ళిపోతుంది. ఇంటిదగ్గర ఎంత రక్తం పోయిందో… చకచక ఛీలిపోయిన ఆమె యోని నాళాన్ని కుట్టేసాను. ఆమెకు మందులు ఐవీ ప్లూయిడ్స్‌ ద్వారా ఎక్కుతున్నాయి. ఆమె గాయానికి కుట్లు వేస్తుంటే ఆమె నడుము ఒణికిపోసాగింది. ఆ మృగం చేసిన గాయానికి ఆమె కింది భాగం రెండుగా ఛీలిపోయింది. నా మనసంతా దుఃఖంలో తడిసిపోయింది. చిన్న పిల్ల… ఇంకా పసిదే మైనరు… ఆ మృగానికి మనసెలా వచ్చింది? మృగానికి మనసుంటుందా?

 ****                                                        ***                                                    ***

ఆమెని రేడియాలజీ డిపార్ట్‌మెంటుకు పంపించాను. ఆమె చేయి విరిగింది… ఎముక ఫ్రాక్చర్‌ అయింది ఆ దుర్మార్గుడి వల్లె… ఆమెను రూంలోకి షిఫ్ట్‌ చేసాను.

****                                                        ***                                                    ***

మేడమ్‌!

నా పేరు సాత్విక… పెళ్ళై పదిహేను దినాలవుతున్నయ్‌. చదువుకుంటానంటే ఇంటర్‌ మాన్పించి పెళ్ళి చేసిరు. నాకు ఆయన్ను చూస్తేనే భయ్యం నా కంటే పదిహేనేండ్లు పెద్ద. మొదటి రాత్రి అంటేనే ఒణికిపోయిన. నా అదృష్టం నాకు నెల వచ్చింది. ఐదు రోజులు తప్పించుకున్న. ఆరో రోజు మల్ల శోభనం ఏర్పాటు చేసిరు. ఆయన నా మీద చెయ్యి ఎయ్యంగనే కళ్ళు తిరిగి పడిపోయిన రెండు దినాలు తప్పించుకున్న. భయంతోని అత్త దగ్గర్నే పండుకున్న. మా మామ మా నాయనకు ఫోన్‌ చేసి పిల్లకు ఏమ్‌ నేర్పలే మీరు మొగన్ని చూస్తనే ఒణుకుతున్నది మా పిల్లడి జీవితం ఖరాబయ్యేతట్లున్నది అని తిట్టిండు. మల్ల కూడా అట్లనే కళ్లు తిరిగి పడిపోయిన తెలివి వచ్చినంక నా మొగుడు నన్ను బాగా కొట్టిండు. జుట్టు బట్టి డొక్కలో కాలితోని గుద్దిండు మల్ల తెలివి తప్పి పడిపోయిన.

ఇంక నాతోని కాదని వీళ్ళకు తెల్వకుండా నా తల్లిగారి ఊరు పారిపోయిన. మా నాయన నన్ను బాగా కొట్టిండు. దీన్ని నువ్వు సరిగ్గా పెంచలే అని అమ్మని కూడ కొట్టిండు. మల్ల నన్ను మా మామ కాళ్ళ ముందు పడేసి మీ పిల్ల ఏమన్న జేస్కోరి అని ఎల్లిపోయిండు.

ఆ రోజు గూడ నన్ను గదిలోపట్కి పంపిరు. పంపే ముందు అత్త గీపారి కూడ అట్లనే చేస్తివంటే మంచి గుండదన్నది. మా ఆడబిడ్డ మా తమ్ముని జీవితం ఖరాబు చెయ్యకు నేను చెయ్యలేదా మొగనితో కాపురం నీకంటే నాలుగేండ్లే పెద్ద నేను అని తిట్టింది.

నా భర్త నన్ను దగ్గర్కి తీస్కుని అదుముకోబోతే నేను భయంగా నాకు నెల ఉందని – కడుపునొస్తందని చెప్పినా ”ఏం ఫర్వాలేదు కలవచ్చు… నెలున్నప్పుడు కలిస్తే మగోల్లకేం కాదు” అంట నన్ను మల్ల తన వైపుకు గుంజుకున్నడు. నేను అబద్దం చెప్పింది తెల్సిపోతే ఎట్లా అని భయమైంది నాకు. కానీ తప్పించుకుందమని నెల ఉందంటే ఇడ్సి వెడ్తడని అట్ల చెప్పినా. నేను ఆయన్ని వదిలించుకుని నా వల్ల కాదని ఒదిలెయ్యమని అన్న అంతే ఆయన కోపంతోని రెచ్చిపోయిండు. అతను నన్ను కోపంతో పిచ్చెక్కినట్లు కొట్టటం మొదలుబెట్టిండు. కాళ్ళతో చేతులతో కర్రతో బెల్టుతో బాదిండు. అర్దగంట సేపు నన్ను కొడ్తనే ఉండు. నేను ఏడుస్తూనే ఉన్నా నన్ను కొట్టడం ఆపమని అతని కాళ్ళమీద బడి రెండు చేతులు జోడించి బిచ్చమెత్తుకున్నా అయినా అతను ఆగలేదు నన్ను కోపంతో నెట్టేస్తే కిటికీ మీద కెళ్ళిపడ్డా చెయ్యి విరిగింది. ఇంతలో మా అత్తా ఆడబిడ్డా లోపట్కి వచ్చిన్రు మా మామ గూడ వచ్చి ‘చంపున్రి లంజెను’ అని తిట్టిండు. మా మామను మా అత్త బయటకు పంపించింది. ‘దీన్ని మంచం మీద వెయ్యి కొడకా’ అని కొడుకుకు చెప్పింది. నా చంపలు వాయగొట్టి ”లంజెదానా ఇంకెన్ని రోజులు సతాయిస్తనే నా కొడుకును మంచోడు కాబట్టి ఉంచుకున్నడు ఓరుస్తున్నడు” అన్నది. నా మొగుడు నన్ను ఎత్తి మంచం పైన వేసిండు. మా ఆడబిడ్డె నా చేతులు విరిచి పట్టుకున్నది. మా అత్త నా కాళ్ళు పట్టుకున్నది. ‘కానియ్యరా. ఈ రోజు ఇది ఎట్ల తప్పించుకుంటదో చూద్దారి.. పని కానియ్యు కొడుక’ అన్నది కొడుకుతోని. నా మొగుడు నా నోట్లో బట్ట కుక్కి నా మీద జంతువు తీరు పడ్డడు… రక్తం ధారలు కట్టింధి… బాధతోని లుంగలు చుట్టుకుపోయిన బెడ్‌షీట్‌ అంతా రక్తంతోని తడ్సిపోయింది. ‘అరె… సస్తదేమోరా దవాఖానాకు కొంటవోదం నడురి’ అని నన్ను బట్టలు మార్చి ఇక్కడకు తీసుకు వచ్చిరు… మేడమ్‌ మా నాయనే నన్ను వీండ్లకు అప్ప చెప్పిండు నేను వీళ్ళతోని ఉండ మేడమ్‌ అని వెక్కి వెక్కి ఏడుస్తూ సాత్విక రెండు చేతులు ఎత్తి నమస్కరించబోయి విరిగిన చెయ్యి నొప్పితో అమ్మా అని అరిచింది. ఆమె ఎక్స్‌రే రిపోర్ట్స్‌ చూసాను ముంజెయ్యి ఎముక విరిగింది… ఆర్దో డాక్టర్‌కు కబురు చేసాను. ఆమె చెప్పింది విన్నాక నా మనసు బాధతో కోపంతో రగిలిపోయింది. ఇంతలో సాత్విక వాళ్ళ అమ్మ – నాన్న వచ్చారు. వాళ్ళమ్మ సాత్వికను పట్టుకొని అయ్యో బిడ్డా అని కదిలి కదిలి ఏడుస్తున్నది. వాళ్ళ నాన్న వైపు తిరిగి ‘ఈ జంతువు దగ్గర్కి పంపద్దంటే పంపినవ్‌ నువ్వసలు మనిషివేనా’ అని అరిచింది. నేను ఆమెను ఓదారుస్తూ నీ భర్తపైన పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌.ఐ.ఆర్‌. వేయమని చెప్పాను.

‘ఏం చెప్తున్నవ్‌ డాక్టరమ్మ గీ పోరి మగని మాట ఇంటె అయిపోతుండే గదా. ఆమె భర్త మాట ఇని ఉంటే గింత దాకా వచ్చి ఉండేదా… పెళ్ళాం ఉండుడు దేనికి మగన్ని సుఖపెట్టని ఆడది ఆడదేనా’ అన్నాడు సాత్విక నాన్న కోపంగా… నేను ఆశ్చర్యపోయాను. ఒక్కసారిగా సాత్విక తల్లి వైపు చూసాను. ఈమె కూడా వీడితో ఎంత హింసను అనుభవించి ఉండచ్చు కదా… అన్పించింది. నిప్పుని దాచుకున్న కొలిమిలా అన్పించింది ఆమె నాకా క్షణం. ”చాల్‌ తియ్యు బిడ్డను గింత హింస బెడితే ఆల్లను కడగాల్సింది పోయి బిడ్డనే అంటున్నావ్‌ నేను నీతో బరించింది చాలు కానీ… నా బిడ్డె దాని మొగనితో బరించదు, ఏమనుకున్నావో” అన్నది సాత్విక తల్లి ఎర్రబడ్డ కళ్ళతో భర్తని చూపుడు వేలితో బెదిరిస్త… ‘పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్త… బిడ్డకెంత రక్తం పోయిందో గిట్ల ఎముకలు ఇరిగేతట్లు కొడ్తర బాడ్కవులు’ అని అర్చింది. నిప్పుల కొలిమిలోంచి అగ్ని పైకి లేచినట్లు అన్పించింది నాకు.

‘భర్తకైనా భార్య సమ్మతి లేకుండా ఆమెతో బలవంతపు సెక్స్‌ చేసే అధికారం లేదు. అతను ఆమెను రేప్‌ చేయడమే కాదు ఎముకలు విరగ్గొట్టేంతగా హింసించాడు. శరీరమంతా గాయాలే రక్కులే తర్వాత, ఆమె యోని చాలా లోతుగా కట్‌ అయ్యి చాలా రక్తం పోయింది.’ అన్నాను కోపంగా వాళ్ళ మామ వైపు తిరుగుతూ. అక్కడే ఉన్న అత్తమామలు కోపంగా నా వైపు చూస్తున్నారు. ‘భర్త సంసారం చేస్తే రేప్‌ అంటావేందీ డాక్టరమ్మ పిసగానీ లేసిందా ఇగో ఎంకట్‌రెడ్డీ నడు డిశ్చార్జి చేపియ్యు ఇంటికి తొల్కవోదం’ అన్నాడు కోపంగా సాత్విక మామ… సాత్విక తండ్రితో. భార్యను బయటకు బలవంతంగా లాక్కుపోతూ… ‘సాయంత్రం కల్ల ఇంట్ల ఉండాల కోడలు’ అని తర్జనితో సాత్విక తండ్రిని బెదిరించాడు. ‘నువ్వు రేప్‌ అంటున్నవు గానీ… చూడు డాక్టరమ్మ… నా అల్లుడు ఏమన్నా పరాయి ఆడదాన్ని రేప్‌ చేసిండా చెప్పు. కాదు కదా స్వంతం భార్యనే కదా చేసింది. సాత్విక అతని భార్య ఆయన ఏమన్నా చేస్కుంటడు…’ అని అన్నాడు… ‘స్వంత భార్యని రేప్‌ చేసినా అది నేరమే’ అనే నేను కోపంగా అంటునే ఉన్నా… ఈ లోపల నేను రహస్యంగా ఫోన్‌ చేస్తే కొద్దిగా ఆలశ్యమైనా లోకల్‌ లేడి ఎస్సై వచ్చింది. సాత్విక తండ్రి బిత్తర పోయాడు. ‘ఏ… ఇది ఘరేలూ మామ్లా పోలీసులెందుకొచ్చిరు ఈడకి నడ్వుండి. నేనేం కంప్లైంటు ఇవ్వను పోండ్రి’ అని అరిచాడు లేడీ ఎస్సై ముందు. ‘నువ్వు బయటకెళ్ళు ముందు’ అని ఎస్సై అతన్ని బయటకు పంపింది. ఈ లోపల సాత్విక అత్తా మామా కూడా హాస్పిటల్‌ నించి బయటకు వెళ్ళిపోవడం కన్పించింది.

గది తలుపులు మూసేసింది ఎస్సై నానించి అంతా విన్నది మెడికల్‌ రిపోర్ట్స్‌ – సర్జికల్‌ రిపోర్ట్స్‌ చెక్‌ చేసి నోట్‌ చేస్కుంది. సాత్విక వైపు వెళ్ళి – ‘చెప్పు బిడ్డా ఏమైంది’ అని అడిగింది. ‘నా భర్త నన్ను రేప్‌ చేసాడు’… సాత్విక స్థిరంగా ధైర్యంగా చెబుతోంది…! గదిలోంచి బయటకు వచ్చాను. గది బయట ఆడవాళ్ళు – గర్భిణీ స్త్రీలు చేతుల్లో రిపోర్ట్స్‌తో దిగులు కళ్ళతో నా కోసం ఎదురు చూస్తున్నారు.

– గీతాంజలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలుPermalink

Comments are closed.