మేఘసందేశం-07 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

 

మహాకవి కాళిదాసు గురించి వ్రాసిన తన వ్యాసంలో శ్రీ అరోబిందో భారతజాతి తనకున్నదంతా కోల్పోయినా, వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణం, వ్యాస మహాభారతం, కాళిదాస గ్రంధాలూ మిగిల్తే చాలు. అవి మన ఆలోచనా విధానాలకీ, విశ్లేషణకీ, మనం నిర్మించుకున్న సంస్కృతికీ, మన నైతిక, మానసిక, తాత్విక, రస సిద్ధులకీ వాటి పరిణామ క్రమానికీ, మనం జీవితాన్ని వైభవోపేతం చేసుకున్నపద్ధతులకీ, సాధనలకీ ప్రతీకలన్నది శ్రీ అరోబిందో పరిశోధించి మనకి అందించిన సత్యం. కొన్ని వేలసంవత్సరాల క్రితం, భారతదేశంలో ప్రజలు రకరకాల జీవన విధానాల మీద ప్రయోగాలు చేశారు. వాటిలో ముఖ్యంగా చెప్పవలసినవి మూడు రకాల ప్రయోగాలు.

మొదటిది నైతిక జీవనాన్ని, రెండవది తార్కిక జీవనాన్ని, మూడవది రసమయ జీవనాన్ని ఆధారంగా చేసుకున్నవి. నైతికజీవనాన్ని వాల్మీకి మహర్షి, తార్కికజీవనాన్ని వ్యాస మహర్షి, వివరిస్తూ ప్రతిబింబిస్తూ శ్రీమద్రామాయణ, మహాభారతాల్ని అందించారు. కొన్ని వేల సంవత్సరాల తరువాత, ప్రజాజీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుని, ప్రజల్లో జీవితాన్ని పండగలా చేసుకోవాలనే ఆరాటం మొదలైంది. ఆ రసమయ ప్రపంచాన్ని మనకందించడం లోనూ, తన సృజనాత్మకతతో పరిపుష్టం చేయడం లోనూ, అలాంటి జీవితాన్ని ఆనందించడానికి సరైన మానసికస్థితుల్ని తెలియజెయ్యడం లోనూ, మార్గదర్శకుడైన వాడు మహాకవి కాళిదాసు. వాల్మీకి, వ్యాసులని వ్యతిరేకించకుండా, ఆ ధర్మాన్ని చాటుతూనే, జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం అన్న ప్రక్రియని తనవైన కొత్త భావాల్తో కవిత్వరూపంలో ఆవిష్కరించిన స్రష్ట. రసమయ జీవితాన్ని తరవాత తరాల కోసం రకరకాల రంగుల్లో చిత్రీకరించిన తొలికవి. ఆ తరవాత వచ్చిన కవులు ఈతని పంథాలోనే పయనించారు. రసమయ భావప్రపంచాల్ని కావ్యాలుగా మలచారు. కాని, ఏ కవులూ కాళిదాసుకున్న ప్రతిభావ్యుత్పత్తుల్ని ప్రదర్శించలేకపోయారన్నది అందరూ ఒప్పుకున్న సత్యం. మనం మేఘసందేశంలోకి వద్దాం. యక్షుడు మేఘునికి మార్గ వివరాలను రాబోయే సుందర దృశ్యాలను చెప్పడం కొనసాగిస్తున్నాడు.

శ్లో.26. నీచై రాఖ్యం గిరిమధివసే స్తత్ర విశ్రామహేతో
స్త్వత్సంపర్కాత్పులకితమివ ప్రౌఢపుష్పైః కదంబైః
యః పణ్యస్త్రీ రతిపరిమళో ద్గారిభిర్నాగరాణా
ముద్దామాని ప్రథయతి శిలావేశ్మభిర్యౌవనాని.

దీని భావం: ఓ మేఘుడా! విను. ఆ విదిశాపట్టణ సమీపంలో నీచైర్గిరి అనే పేరు గల కొండ ఒకటి ఉంది. ఆ కొండమీద చాలా చక్కగా వికసించిన పూలు గల కడిమిచెట్లున్నాయి. ఆ చెట్లతో ఆ కొండ నీరాకతో నీ సంపర్కంవల్ల గగుర్పాటు చెందినట్లుంటుంది. దయచేసి ఆ కొండమీద కాసేపు విశ్రమించు. పుణ్యస్త్రీల రతిపరిమళాల్ని వెడలగ్రక్కుతున్నటువంటి ఆ గిరి గుహలు, వాస్తవానికి విదిశాపురజనుల అధిక యౌవనాలను ప్రకటిస్తూంటాయని చెబుతారు. నీవు తప్పక దర్శించవలసిన ప్రదేశమది.

శ్లో.27. విశ్రాంతః సన్వ్రజ వననదీతీరజాతాని సించ
న్నుద్యానానాం నవజలకణై ర్యూథికాజాలకాని,
గండస్వేదాపనయనరుజాక్లాంతకర్ణోత్పలానాం
ఛాయాదానాత్క్షణపరిచితః పుష్పలావీముఖానాం.

దీని భావం: ఓ మేఘుడా! నీవు ఆ నీచైర్గిరియందు శ్రమదీర్చుకొంటూ అక్కడ నెలకొని ఉన్న అడవులందలి నదుల ఒడ్డుల్లో ఉన్న తోటల్లో పూచినటువంటి మల్లె మొగ్గలను నీ క్రొత్త నీటిచుక్కలచేత కొద్దిగా తడుపు. చెక్కిళ్ల మీద చెమటను పోగొట్టి ఆ బాధతో వాడిన నల్లకలువలు చెవికొనల్లో గల పువ్వులు కోస్తున్న స్త్రీల ముఖాలకు అవి గొప్ప ఛాయను ఇచ్చి కాసేపు పరిచయం గలవాడవై పొమ్ము. అనగా అక్కడ పువ్వులు కోస్తున్న స్త్రీలు చాలా మంది ఉంటారు. వారికి ఎండచేత ఏమాత్రం చెమట పట్టకుండా ఛాయను దానం చేయగలవు కదా అని నీకు చెప్తున్నాను. ఇక్కడ ఛాయ అంటే “నీడ” అని “కాంతి” అని రెండు అర్థాలు గా తీసుకోవచ్చు. ఏవరైనా నీడను ఇస్తే సంతోషిస్తారు. మరి కాంతి మాటేమిటి? అక్కడ స్త్రీల యొక్క ముఖాలు సహజకాంతివంతాలు కదా! కానీ వారిపై సూర్యకాంతివల్ల వారి ముఖాల్లోని కాంతి మాయమైంది. ఇపుడు నీవు అక్కడకు వెళ్ళడం వల్ల సూర్యకాంతి పడకపోవడంతో వారి ముఖకాంతి మరల వారికి తప్పక చేరుతుంది. అలాంటి దృశ్యం వారికే కాక నీకూ ఎంతో ఆనందం కలిగిస్తుంది. అలా చేయడం వలన వారికీ నీకూ కొంత పరిచయం కూడా కలుగుతుంది. ఆ విషయం నీకు ఇంకా సంతోషం కలిగిస్తుంది. ఎందుకంటే మగవారికి పర స్త్రీలు అందునా అందమైన స్త్రీల పరిచయాన్నిమించిన ఆనందం ఏముంటుందిగనక? కాని, అది అందాన్ని చూసి ఆనందించే విధంగా ఉండాలి.

శ్లో.28. వక్రః పంథా యదపి భవతః ప్రస్థితస్యోత్తరాశాం
సౌధోత్సంగప్రణయవిముఖో మాస్మభూరుజ్జయిన్యాః,
విద్యుద్దామస్ఫురితచకితైర్యత్ర పౌరాంగనానాం
లోలాపాంగైర్యది న రమసే లోచనై ర్వంచితః స్యాః.

దీని భావం: ఓ మేఘుడా! అలా ఉత్తరదిక్కుగా సాగి పోతున్న నీకు వెంటనే తగిలే ఉజ్జయినీ మార్గం కొంచెం వంకరైనదైనప్పటికీ ఆనగర మేడల పైభాగాలను చూడడానికి అనాసక్తతను చూపవద్దు. ఎందుకంటావా?
అక్కడి స్త్రీలు నీ మెఱుపులను చూచి భయపడతారు. అప్పుడు వారి బెదరుచూపులు చాల చాలా అందంగా ఉంటాయి. ఆ సౌందర్యాన్ని చూడకపోతే నీ జన్మ నిష్ఫలం. చివరకు మోసపోయినవాడవవుతావు. అందువలన తప్పక చూసి తీరవలసిందే! అని చెప్తున్నాడు.

శ్లో.29. వీచిక్షోభస్తనితవిహగశ్రేణికాంచీగుణాయాః
సంసర్పంత్యాః స్ఖలితసుభగం దర్శితావర్తనాభేః,
నిర్వింధ్యాయాః పథి భవ రసాభ్యంతరః సన్నిపత్య
స్త్రీణామాద్యం ప్రణయవచనం విభ్రమో హి ప్రియేషు.

దీని భావం: ఓ మేఘుడా! నీవు ఉజ్జయినీ పట్టణానికి పోతూ పోతూ చేరువయ్యే మార్గమధ్యంలో, నీకు “నిర్వింధ్య ” అనే గొప్ప నదిని కలుసుకుంటావు. గుర్తుంచుకో! ఈ నిర్వింధ్యానది, వింధ్య పర్వతానికి ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంటుంది. గమ్మత్తు ఏమిటంటే ఆ నది అలల కదలికలకు హంసలు, కొంగలు ఇంకా అనేక జాతుల పక్షులు, వింత వింత ధ్వనులు చేస్తూంటాయి అక్కడ. ఆ పక్షుల పంక్తులు కనులకింపును కలిగిస్తాయి. ఆ నది సుళ్ళు సుడులు తిరుగుతూ చాలా సుందరంగా ప్రవహిస్తూ ఉంటుంది. నేను నిన్ను కోరేదేమిటంటే నీవు ఆ నదిని తప్పక దర్శించి ఆ నదీజలాలను తీసుకొని మరింత రసాంతరంగుడివి (నీటితో నిండినవాడివి) కావాలని నా కోరిక.

ఈ శ్లోకంలో విశేషాలు గమనిస్తే మూడు పాదాలకు ఒక అంతరార్థం గోచరిస్తుంది. కాళిదాసు నిర్వింధ్యా నదిని స్త్రీతో పోలిస్తే అక్కడ ఉన్న రకరకాల హంసలు, కొంగలు అనే పక్షుల సమూహాలు ఆ నదీ మాత మొలనూలు అవుతుంది. సుడి ఆమె నాభిగా భావించాలి. తొట్రుపాటు ప్రవాహం స్త్రీల యొక్క సహజ సుందరగమనం కదా! ఆ నది నుండి మేఘుడు గ్రహించే రసం శృంగార రసం. మనం గమనిచగలిగితే రసం అనే పదానికి ఉన్నటువంటి అనేకమైన అర్థాల్లో “జలం” అనే అర్థాన్ని కాళిదాసు శృంగారరసార్థాన్ని రసరమ్యంగా ప్రయోగించాడని మనకు అర్ధమవుతుంది.

      వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)