రాజ్యాంగ నైతికతకు నెత్తుటి ప్రశ్న ఎండ్లూరి సుధాకర్‌ కవిత్వం (సాహిత్య వ్యాసం )- డా. ఎం.ఎం. వినోదిని

తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతం ‘మూస’ ధోరణిలో చిక్కుకు పోవడం వలన ఆధునిక సాహిత్య విమర్శ చీకటి గోడల మధ్య నలిగిపోతూ అక్కడక్కడే తిరుగుతూ ఉంది. సాహిత్యం అనేకానేక అంశాల సమాహారం. ఆయా కవులు , రచయితల నేపథ్యం, దృక్పథం, సైద్ధాంతిక అవగాహనను బట్టి వారి సాహిత్య రచన సాగుతుంది. అటువంటి రచనల్లో ప్రాంతం, కులం వంటివి కూడా ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అస్తిత్వవాద సాహిత్యం రావడం మొదలయ్యాక అందాకవున్న సాహిత్య విమర్శ పరికరాలు కేవలం కొన్ని అంశాలను పరిగణనలో ఉంచుకుని మాత్రమే విమర్శ చేయడానికి పనికి వస్తాయి తప్ప ఒక రచనను సమూలంగా విమర్శ చేయడానికి పనికిరావని తేలిపోయింది. సాహిత్యంలో స్త్రీవాదం, దళితవాదం, ముస్లింవాదం, ప్రాంతీయవాదం వంటి వాదాలు ఆయా రచనలు, సిద్ధాంతాల ప్రాతిపదికన కొంత మేరకు నూతన విమర్శ విధానాలను రూపొందించుకునే ప్రయత్నం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈ క్రమంలోనే సాహిత్యాన్ని ‘‘రాజ్యాంగ నైతికత’’ దృక్పథం నించి చూడాలన్న ప్రతిపాదన ఓల్గాగారు చేయడం నాకు చాలా ఆనందాన్ని కల్గించింది.

ఎందుకంటే ఎం.ఎ., స్థాయి విద్యార్థుకు సాహిత్య బోధన చేస్తున్న నాకు చాలాసార్లు ఆయా రచనల గురించిన విశ్లేషణలో – చరిత్ర, సామాజిక సందర్భం, రచయిత నేపథ్యం లేదా రచయిత సమకాలీన సమాజ స్థితి, రాజకీయ స్థితి వంటి అనేక అంశాను చర్చించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం కలిగేది. ముఖ్యంగా ప్రాచీన సాహిత్యంలోని కొన్ని కావ్యాలు లేదా కొన్ని కావ్యాల్లోని కొన్ని పద్యాలు ప్రస్తుత రాజ్యాంగ దృక్పథానికి, కొందరు ప్రజల హక్కులకు భంగం కలిగించేవిగా ఉన్నాయన్నది నా దృష్టి కొచ్చాక నేను కొన్ని వ్యాసాలు కూడా రాయడం జరిగింది.

ఆ వ్యాసాల మీద చాలా ప్రశంసతోపాటూ ‘విమర్శ’ కూడా వచ్చింది. ఎందరో విమర్శకులు, అస్తిత్వవాదులు, అధ్యాపకులు ఇలాంటి ‘విమర్శ’ రావడం అవసరం అని భావించారు. అలాగే కొందరు విమర్శకులు విమర్శకుల్లా కాకుండా ప్రాచీన సాహిత్యాన్ని ప్రేమించే (గుడ్డిగా) వాళ్లుగా నాపై విరుచుకు పడ్డారు. కానీ ఇప్పుడు ‘రాజ్యాంగ నైతికత’ దృక్పథం నించి సాహిత్యాన్ని పునర్విమర్శ చేసే ఈ మార్గం ` నా విమర్శక ఆలోచనలకు నైతిక బలాన్నిచ్చింది. ఈ నేపథ్యం నించి ప్రస్తుత నా పేపరును ప్రతిపాదిస్తున్నాను.

సమకాలీన వచన కవుల్లో ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్‌ కవిత్వానికున్న ప్రత్యేకత- వచనలాలిత్యం, శబ్ధ సౌందర్యం. దళిత కవిత్వం ఉద్యమంగా రావడానికి ముందే మొదలై దళిత కవిత్వంతో కల్సి ప్రయాణిస్తూ ఒక వైపు భావుకుడిగా, ఒకవైపు దళితకవిగా ముఖ్యంగా మాదిగ జీవితాన్ని ప్రతిబింబించే కవిగా, మరోవైపు సమకాలీన సామాజిక విషయాలకు ప్రతిస్పందించే కవిగా తన భావాలను వైవిధ్యంగా అభివ్యక్తీకరించడం ఎండ్లూరి సుధాకర్‌ కవిత్వ ప్రత్యేకత.

దళిత కవిత్వం దళిత జీవితాన్ని ప్రతిబింభిస్తుంది. దళితుల విముక్తిని కోరుతుంది. సామాజిక సమానత్వాన్ని, స్వేచ్ఛని కాంక్షిస్తుంది. అవమానాలు, ఆకలి, అభద్రతలతోపాటు దక్కని హక్కుల కోసం నిలదీస్తుంది. ఈ క్రమంలోనే ఎండ్లూరి సుధాకర్‌ కవిత్వం ఈనాటి సమానత్వం మీద స్వేచ్ఛమీద నిరసన ప్రకటన చేస్తుంది. ‘నేనింకా నిషిద్ధ మానవుణ్నే/ నాది బహిష్కృత శ్వాస’’ అనడం వెనక 60 ఏళ్ల స్వాతంత్య్రపు వైఫల్యం ఉంది. రాజ్యాంగం ప్రకటించిన హక్కుల ఉల్లంఘన ఉంది.

1.సమానత్వం :
భారత రాజ్యాంగం 3 వ భాగంలో సమానత్వపు హక్కు ప్రకటించబడింది. 15 వ అధికరణం కుల, మత, లింగ వివక్షతలకు తావే లేదు అని ప్రకటించింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన (1950 జనవరి 26) ఇన్ని దశాబ్దాల తరువాత కూడా ఇంకా ఈ దేశంలో బహిష్కృతులున్నారు, నిషిద్ధ మానవులున్నారు. వాళ్ల ఇళ్లు ఇంకా ఊరి బయటే ఉన్నాయి. వారి జీవనం ఇంకా వెలివాడల్లోనే మగ్గిపోతాఉంది.

2. అంటరానితనం – స్వేచ్ఛ :
అధికరణం – 15 :
ఏం చెప్పింది? : “ కేవలం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం లేక వాటిలో కొన్నింటి ప్రాతిపదికన ఏ వ్యక్తినీ రాజ్యం వివక్షతకు గురిచేయరాదు” అని చెప్పింది.
హిందూ మనువాదం చేసిన సామాజిక నియమావళిని – ఈ అధికరణం ఏనాడైనా అధిగమించిందా? దళితుల విషయంలో ఒక్క రోజైనా ఈ అధికరణం అమలయిందా? అమలయ్యే అవకాశం ఉందా అసలు?

‘‘నేనింకా నిషిద్ధ మానవుణ్నే!
నాది బహిష్కృత శ్వాస
నా మొలకు తాటాకు చుట్టి
నా నోటికి ఉమ్మిముంత కట్టి
నన్ను నలుగురిలో
అసహ్య మానవ జంతువుని చేసిన మనువు
నా నల్లని నుదిటి మీద బలవంతంగా
నిషిద్ధ ముద్ర లేసినపుడే
నా జాతంతా
క్రమక్రమంగా హత్య చేయబడింది.’’ (వర్తమానం, పేజి 54)

నడిస్తే నేల మీద పాదముద్రలు పడకూడదని, ఎక్కడా ఉమ్మడానికి కూడా వీల్లేదని తాటాకులు, ఉమ్మి ముంతలు కట్టుకొని తిరిగేలా ‘మనుధర్మం’ దళితులను శాశ్వత నేరస్తులుగా చేసి శిక్షలు ఖరారు చేసింది. ప్రత్యేకంగా ఏ నేరం చేయనక్కరలేదు. మాదిగ కులంలోనో, మాల కులంలోనో, మరో దళిత కులంలోనో పుడితే చాలు! ఇటువంటి అమానవీయ(Barbarian) స్మృతిని హిందూధర్మం పేరిట సమాజం ఆచరణలో పెట్టింది. ఊళ్లోకి రానివ్వకుండా కట్టడి చేసింది. ఈ సామాజిక భావజాలం వెనుక, సంస్కృతి పేరిట జరిగిన ఈకుట్ర వెనుక బ్రాహ్మణీయ భావజాలం, మనుధర్మం వుంది. బ్రిటీష్‌ పాలన కాలం లోనూ బ్రిటిష్‌ వాళ్లు మొత్తం భారాతీయుల్ని అణచి వేస్తుంటే- బ్రాహ్మణీయ ఉన్నత కులాలు దళితుల మీద పెత్తనం చేస్తూనే ఉన్నాయి. బ్రిటిష్‌ వాళ్లకు వ్యతిరేకంగా గాంధీ ఆధ్వర్యంలో స్వాతంత్య్రోద్యమం ముమ్మరంగా ఉన్న కాలంలోనే దళితుల నీటి అవసరం కోసం నిరంకుశ హిందూ మనువాద బ్రహ్మణ సమాజం మీద అంబేద్కర్‌ మహద్‌ చెరువు పోరాటం సాగించాడు. బ్రిటిష్‌ పాలన నుంచి భారత దేశం విముక్తం అయింది. కానీ మను వాదపు నిరంకుశత్వంనించి మాత్రం దళితజాతి విముక్తం కాలేదు. ఈనాటికీ దళితులకు ప్రధాన గ్రామంలో భాగస్వామ్యం దక్కలేదు. ఊరి చివరి ఇళ్లు స్వేచ్ఛకు, స్వాతంత్య్రానికి నోచుకోలేదు.

‘‘ ఆయుధాల పేర్లు మారాయి
అంకె సంఖ్యలూ పెరిగాయి
మారనివల్లా మా హత్యలే
ఇప్పుడు మా శవాలు మాకు సంచలన వార్త కాదు
శవాలపై హంతకులు పట్టే సానుభూతి కొత్తకాదు
ఊరేగింపుల మీద రాజకీయ మేఘాల ఓట్ల కన్నీరూ కొత్త కాదు
నిన్నటి చరిత్ర బొటన వేళ్లనే కోసింది.
వర్తమానం ఐదు వేళ్లనీ నరికేస్తుంది’’ (వర్తమానం, పేజి: 55)

అధికరణం – 14 :
ఈ అధికరణం చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది. చట్టం నుంచి ప్రజలందరికీ సమాన రక్షణ లభిస్తుంది. పౌరులకి గల ఈహక్కుని ప్రభుత్వం ఏ పౌరునికి నిరాకరించరాదని రాజ్యాంగం చెబుతుంది. ప్రజలందరికీ సమాన రక్షణ అనే ఈ అధికరణం దళితుల విషయంలో ప్రతినిత్యం విఫలమవుతూనే ఉంది. 1985 జులై 17న జరిగిన కారంచేడు మారణకాండ, 1991 ఆగస్టు 6న చుండూరులో జరిగిన హత్యాకాండ ఈ దేశంలో దళితులపై నిరంతర అణచివేతకు ప్రతీకలు. రాజ్యాంగం ఎంతో భరోసా ఇచ్చినప్పటికీ, హక్కులు కల్పించినప్పటికీ – బ్రాహ్మణీయ మనువాద భావజాలం ఈ సమాజం నిండా విస్తరించి ఉన్న కారణంగా హక్కులు, హామీలన్నీ విఫమవుతూనే ఉన్నాయి.

రాజ్యాంగం ప్రకటించిన హక్కులను ప్రజకు అందేలా చూసే బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలు సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. ప్రజల హక్కులను బాధ్యతలను – అందరికీ అర్థం అయ్యేలా చేయాలి. తరతరాలుగా ఉన్న సామాజిక అంతరాల కారణంగా కొన్ని కులాల వారి మనస్సుల్లో పేరుకొని పోయి ఉన్న ‘ఉన్నత’ భావన – కొన్ని కులాల వారి మనస్సుల్లో ఉన్న తక్కువ భావన చెరిగిపోవాలి. అలాంటి మానసిక పరివర్తన సమాజంలో రాకుండా ‘సమానత్వం’ సాధ్యం కాదు.
దళిత సమాజం దృష్టిలో ఇవాల్టికీ స్వేచ్ఛ, సమానత్వం అనేవి ఎండమావులే! రాజ్యాంగంలో ఉన్న వాటి ఉనికి సమాజంలో లేదు. అందుకని – రాజ్యాంగం హామీ ఇచ్చినా, దళితులు ఆ హామీని నమ్మి హాయిగా, స్వేచ్ఛగా ఈ దేశంలో బతకలేకపోతున్నారు.

‘‘నేనేనాటికైనా నలుగురి మధ్య స్వేచ్ఛగా బతగ్గలనా?
నలుగురూ కలిసి
నా వృషణాల మీద తన్నినప్పుడు
నా జాతి మర్మాంగాలను క్రూరంగా కోసేసినపుడు
నా స్త్రీలని రాక్షసంగా చెరచి చంపినపుడు
నన్నింకా తుంగలో తొక్కి సంచుల్లో కుక్కుతున్నప్పుడు
లోలోపల అంటరానితనపు ఫర్మానాలు అచ్చువేసుకుంటున్నప్పుడు
నమ్మకమంటే నాకింకా అనుమానమే’’ (నల్లద్రాక్ష పందిరి, పేజి: 102)

సమాజంలో మార్పు రాకుండా రాజ్యాంగం ప్రకటించిన హక్కుల వైఫల్యాన్ని ఆపడం సాధ్యం కాదు. అగ్రకులాలు మానసిక పరివర్తన పొందకుండా వారి తరతరాల వారసుల మనసుల్ని కుల అసమాన విభజనతో కలుషితం చేసినంత కాలం దళితుల సమానత్వం, స్వేచ్ఛ అనే రాజ్యాంగ హక్కులను వొట్టి మాటలుగానే చూడాల్సి వస్తుంది.

ఎండ్లూరి సుధాకర్‌ కవిత్వంలో ‘స్వేచ్ఛ’ కోల్పోయినతనం గురించి అనేక చోట్ల ప్రస్తావన ఉంది. ఈ రాజ్యం తన పౌరులకు ఇచ్చిన హక్కుల్లో ‘స్వేచ్ఛ’ ప్రధానమైంది. బ్రిటిష్‌ వలసవాదం నుంచి ఈ దేశం స్వేచ్ఛ పొందినా దేశీయ బ్రాహ్మణీయ మనువాదం నించి మాత్రం కింది కులాల ప్రజలు స్వేచ్ఛ పొందలేదు. ఒకవైపు మనువాదం- మరోవైపు పూడల్‌ సమాజం దళితుల స్వేచ్ఛను హరిస్తున్నాయి. కవి తన సహజ సౌందర్యమైన నిత్య జీవిత ఆనంద ప్రయాణంలో కాలిలో ముల్లులా గుచ్చుకున్న ఇలాంటి సంఘటనను కవి మర్చిపోలేదు.

‘‘ అడ్డరోడ్డూ
ఆచారి వీధీ
మామిడితోపు
మాదిగపేటా
మసీదు గల్లీ
అన్ని వీధులూ నావే
ఒక్క అగ్రహారం తప్ప’’ (నల్లద్రాక్ష పందిరి, పేజి: 142)

తన బాల్యంలో సైకిలెక్కి ఊరంతా తిరిగిన ఆనందక్షణాలను కవిత్వీకరించిన కవి అగ్రహారం తనకు ప్రవేశాన్ని నిషేధించిన సంగతిని మర్చిపోలేదు. ఈ దేశంలో ఈనాటికీ దళితులకు కొన్ని వీధుల్లో ప్రవేశాన్ని కొన్ని కులాలు నిషేధించాయి. కొందరి ఇళ్ల ముందు చెప్పులు వేసుకుని నడవకూడదు, విప్పి, చేతిలో పట్టుకొని నడవాలి. మహబూబ్‌నగర్‌ లాంటి జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో దళిత స్త్రీలు చీరను మొకాళ్ల కింది వరకే కట్టాలి. గిలకల వరకూ కట్టే ఆచారమే లేదు. కొన్ని గ్రామాల్లో ఈ నాటికీ దేవాలయాల్లో ప్రవేశం నిషిద్ధం. ఈ అనాగరిక ఆచారం ఏ కాలం లోనో, ఏ ప్రాంతం లోనో లేదు. మన కాలం లోనే మన హైద్రాబాదుకి అటుఇటుగా 100 కి.మీ. దూరంలో ఉంది.

3. బాల్యం – శ్రమ – ఆకలి – విద్య
భారత రాజ్యాంగం, పీఠికలోనే ‘సమానహోదా’ను అందరికీ వాగ్ధానం చేసింది. సమాన అవకాశాల్ని అందించడం లక్ష్యంగా ప్రకటించింది. కానీ ఆ మాటలు కాగితాలు దాటి నిజ జీవన ఆచరణలోకి రాలేదు. కనీసం ‘ఆకలి’ తీర్చే హామీ ఇవ్వలేదు. ఒకపక్క అంటరానితనం నిరంతరం వెంటాడుతుంటే మరోపక్క ఆకలి దళిత జీవితాలను ‘గుప్పెడుముద్ద’ కోసం బానిసలుగా మారుస్తుంది.

‘‘ మన బతుకంతా
అన్నం వెతుక్కోవడంతోనే సరిపోయింది
బుక్కెడు మెతుకులు కళ్లజూడటమే
ఈ జీవితానికి గొప్పవరమైపోయింది
మన బతుకులే కాదు
చివరికి మన మెతుకులు కూడా
అంటరానివే అయ్యాయిరా దాసూ’’ (నల్లద్రాక్ష పందిరి, పేజి: 62)

ఎండ్లూరి సుధాకర్‌ కవిత్వంలో అంటరానితనంతోపాటు ఆకలి కూడా అంతర్లీనంగా ధ్వనిస్తూ అక్కడక్కడా కొన్ని వ్యాక్యాల్లో పైకి కన్పిస్తుంది. దళిత జీవనం మీద నిరంతరం పెత్తనం చేసే అతిపెద్ద డైనోసార్‌ ఈ ఆకలి.

‘‘నా మెతుకు మీద దొంగ చేతులు ఎగబడుతున్నాయి
నా హక్కుల పత్రం మీద అపరిచిత సంతకాలు కనబడుతున్నాయి’’ (నల్లద్రాక్ష పందిరి, పేజి: 102)

నిరంతరం శ్రమ చేసేది దళితులు. పొలం దున్నడం మొదలు, విత్తనాలు నాటడం, కలుపుతీయడం, కావలి కాయటం, పంట నూర్చడం, సంచులకెత్తడం వరకు చాకిరీ చేసేది దళితులే! కానీ- పంట సంచులు చేరేది మాత్రం అగ్రకులాల భూస్వాముల, దొరల ఇళ్లకు. భూమి లేని కూలీలుగా దళితులు ఎంత పంట పండించినా అది నోటిదాకా రావడానికి అనేక ఆటంకాలు. దళితులకు హక్కుగా దక్కాల్సిన తిండిగింజలు కూడా దక్కడం లేదు. రాజ్యాంగం తిండి హక్కును ఒక ప్రాథమిక హక్కుగా, ఒక చట్టంగా రూపొందించలేకపోయింది.

‘‘బుక్కెడు బువ్వకోసమో – దోసెడు గంజికోసమో ఆ పిల్ల
మా గుడిసెల ముందు బౌద్ధ భిక్షువయ్యేది-
పేగులు ఏడుస్తున్నాయో పెదవులు నవ్వుతున్నాయో
నాలుగు ముఖాలవాడు కూడా నుదురు చూసి చెప్పలేడు
అన్నానికి కళ్లులేవుగానీ
ఉంటే ఎండిన మెతుకులు కూడా చెమ్మగిల్లి ఉండేవి
అంటరానితనానికి ఆకలికి మధ్య
ఆ పిల్ల చెరువెండిన చేప పిల్లలా గిల గిలా తన్నుకునేది’’ (నల్లద్రాక్ష పందిరి, పేజి: 48)

‘డక్కలిపిల్ల’ కవిత దళిత బాలిక ఆకలిని చిత్రించింది. మాల మాదిగల కన్నా కింది కులం డక్కలి కులం. సంచార జాతులైన డక్కలి కులస్థులు స్థిర నివాసం లేనివాళ్లు. ఆ కుటుంబాల్లో ఏపూటకు ఆ పూట తిండి సంపాదించుకుని తినే పరిస్థితి ఉంది. ` పిల్లలకి చదువులేదు, మంచి జీవితం లేదు. ఈ స్థితిలో స్వాతంత్య్రం కానీ, రాజ్యాంగం కానీ ఇన్నేళ్లుగా ఏ మార్పూ తేలేకపోయింది. ఆధునిక సమాజం తమ పిల్లలకు కొసరికొసరి తినిపించే ఈ కాలంలో ఆకలితో పోరాటం చేనస్తున్న దళిత బాల్యానికి రాజ్యాంగం ఏ భరోసా ఇవ్వలేకపోయింది.

‘‘ నా కళ్ల ముందు ఒక చీమ కూడా విడిపోయి
ఏకాకి కావడం నేనిష్టపడను
నాదేశంలో చిన్న కుక్క పిల్ల కూడా
ఆకలితో చచ్చిపోవడం భరించలేను ’’ (నల్లద్రాక్ష పందిరి, పేజి: 156)

అంటారు ఎండ్లూరి సుధాకర్‌. ఆకలిచావులు ఈ దేశంలో కొత్తకాదు. కానీ లక్షల కోట్లతో దేశం అభివృద్ధివైపు సాగుతుందని చెబుతున్న పాలకవర్గం, శాసన నిర్మాతలు ఇంకా కడుపు నిండా తిండి తినలేకపోతున్న పౌరుల హక్కులను కాపాడలేకపోతున్నారు.

డక్కలి పిల్ల కవితలో కవి సంచార జీవనంలో చదువులేక`స్థిరనివాసం లేక తెగిన గాలిపటమై- బాల్యం లేకుండా పోయిన బాలిక గురించి మాట్లాడితే, ‘స్వరపరికరం’ కవితలో పెండ్లి మేళంలో వాయిద్య బృందంలో పని చేసే బాలుడి శ్రమను గురించి కవి తల్లడిల్లడం కన్పిస్తుంది.

‘‘ మౌన బాల్యానికి వాడొక ప్రతీక
తన చిన్న ప్రపంచాన్ని ఒంటరిగా చప్పరిస్తూ
శ్రుతి పేటికపై జోగుతూనో, హార్మోనియం రెక్కలాగుతూనో
నిదురపోగుల్ని లోలోపల ముడివేసుకుంటూ
విసనకర్రలా అటూఇటూ జోగుతూ
రే పగళ్లతాడు మీద స్వర ప్రస్తానం చేస్తుంటాడు
రాత్రి ముహుర్తాలు ఆకలినిమంట కలుపుతాయి

భుజానికి స్కూలు సంచిలా
మెడలో సుతిపెట్టె
చినిగిన చొక్కా నిక్కరుతో-
చిన్న పంచె ముక్కతో
ముడి వేసిన జుట్టుతో నిలువుబొట్టుతో
పెండ్లి మేళంలో ‘వృద్ధబాలుడిలా కన్పిస్తాడు’’ (నల్లద్రాక్ష పందిరి, పేజి: 172)

అంటూ సాగిన కవితలో దుఃఖం, ఆర్ధ్రత పెనవేసుకొని ఉంటాయి. బానిసత్వాన్ని అనేక రూపాల్లో విస్తరింపజేసి అనేక పద్ధతుల్లో ఇంకా కొనసాగిస్తున్న దేశం మనది. బాలకార్మిక వ్యవస్థని ఇన్నేళ్లుగా ఇంకా కొనసాగిస్తూ వస్తున్న దేశం మనది.రాజ్యాంగంలోని ‘21A` అధికరణం విద్యాహక్కుని హమీ ఇస్తుంది. 12-12-2002 తేదీన 86 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అధికరణం రాజ్యాంగంలో అదనంగా చేర్చబడింది. దీని ప్రకారం ఆరు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత.

ఈ హక్కును నేరవేర్చడానికి ప్రభుత్వం అవసరమైన విధి విధానాలను రూపొందించుకుని అమలు పరచవసింది. అయితే ఇప్పటికీ 30% పైగా ప్రజలకు చదువులేని స్థితి దేశంలో ఉంది. అందునా దళిత, బహుజన, మైనార్టీ వర్గాల పిల్లలు 60% పైగా హైస్కూలు స్థాయి దాటకుండా బడిమానేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇంకా హోటళ్లలో, మెకానిక్ షెడ్లల్లో, వ్యవసాయ రంగంలో, ఇటుక బట్టీల్లో, పెద్ద ధనవంతుల ఇళ్లల్లో పిల్లలు పనిచేస్తూ ఉన్నారు. బస్టాండ్లలో, రైళ్లలో సిగ్నళ్ల దగ్దర కూలీలుగా, అనాథలుగా బిక్షం ఎత్తుకుంటున్నారు. నిర్బంధ విద్యా చట్టం పేరిట, సర్వశిక్షా అభియాన్‌ పేరిట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కూడా పూర్తి విజయాన్ని సాధించలేకపోయాయి. విద్య ప్రయివేటీకరణ వలన ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా అవకాశాలు పూర్తిగా సన్నగిల్లి పేద దళిత బహుజనులకు చదువు మరింత దూరమైపోతుంది.

ఆదేశిక సూత్రాల్లోని- అధికరణం 39-E బాలకార్మికులుగా పిల్లలతో పనిచేయించడాన్ని నివారించాల్సిందని ఆదేశించింది. పిల్లల శ్రమశక్తి, ఆరోగ్యం దోపిడీ కాకూడదని ప్రకటించింది. అదే విధంగా అధికరణం 39-F స్వేచ్ఛాయుతమైన, గౌరవప్రదమైన పరిస్థితుల ప్రభావంతో ఆరోగ్యకరమైన పద్ధతిలో పిల్లల అభివృద్ధికి తగిన అవకాశాలు, సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని ప్రకటించింది. కానీ ఇంకా కొన్ని కులాల పిల్లలు కనీసం ఈ దేశపౌరులుగా గుర్తింపేలేని స్థితిలో ఉన్నారు. కవి చెప్పిన డక్కలిపిల్ల లాంటి వాళ్లు ఈ ప్రభుత్వాలకింకా కన్పించనేలేదు.

‘‘ గుంజల చుట్టూ పిల్లలు గునగునా ఆడుతుంటే
పెండ్లి పందిట్లో ఆడని బాలుడు వాడొక్కడే
గోలగోలగా భోజనాల వేళ పిల్లలు ఆవురావురుమంటుంటే
ఆకలిని కళ్లతోనే నెమరేస్తూ
చివరి బంతికోసం గుటకలేస్తుంటాడు
ఏడుపొచ్చినా ఎత్తుకునేవాళ్లుండరు
అర్ధరాత్రులు బలవంతంగా
రెప్పలు మూసుకుపోతుంటాయి’’

అంటూ ఎండ్లూరి సుధాకర్‌ చెప్పిన దుర్భర బాల్యావస్థను దళిత సమాజం మోస్తూ ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హామీలన్నీ అగ్రకుల రాజకీయ నేతల సాక్షిగా, పాలక వర్గాల అసమర్థత, నిర్లక్ష్యం సాక్షిగా ఉల్లంఘనకు గురవుతూనే ఉన్నాయి.

4. మతం – స్వేచ్ఛ:
అధికరణం- 15,25,26 లు మతస్వేచ్ఛకు, మతవిశ్వాసాలు కలిగి ఉండే హక్కుకు హామీ ఇస్తున్నాయి. మతం కారణంగా రాజ్యం ఏ వ్యక్తినీ, వివక్షకి గురిచేయరాదని ప్రకటిస్తున్నాయి. రాజ్యాంగ పీఠికలో ‘లౌకికత్వం’ అనే మాటను చేర్చడం ద్వారా రాజ్యం అధికారికంగా ఏమతాన్నీ ప్రోత్సహించదని, అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తుందని స్పష్టం చేసింది. కానీ భారతదేశం సర్వవేళలా ‘హిందూదేశం’గా తన ఉనికిని అధికారికంగా చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రాజ్యాంగం సాక్షిగా ఈ అధికరణలన్ని కళ్లకు గంతలు కట్టబడి మోసానికి గురవుతూనే ఉన్నాయి.

1992 డిసెండర్‌ 6న మెజారిటీ హిందూ మతోన్మాదులు రాజ్యాంగం సాక్షిగా, ప్రధాని కార్యాయం సాక్షిగా బాబ్రీ మసీదుపై దాడి చేసి కూల్చేయడం జరిగింది. కూల్చివేతకు కొన్ని సంవత్సరాల ముందునించి హిందూమతోన్మాద శక్తులు మసీదు కూల్చివేతకు మద్దతుగా హిందూ సమాజాన్ని కూడకట్టేందుకు దేశం అంతా రథయాత్రలు నిర్వహించడం జరిగింది. అనేక చోట్ల బహిరంగ సభల్లో సంఘ్ పరివార్ నేతలు బాబ్రీని కూల్చి మందిరం నిర్మిస్తామని పబ్లిగ్గా ప్రకటించడం జరిగింది. ఇటుకలు సేకరించడం జరిగింది. అంత బాహాటంగా రాజ్యాంగానికి సవాల్‌ విసిరినా, హక్కుల ఉల్లంఘన చేసి తీరతామని పదేపదే చెప్పినా రాజ్యం/ ప్రభుత్వం`వారిని నిలువరించడంలో విఫలమైంది. తద్వారా`మైనారిటీ మత ప్రజల రాజ్యాంగ హక్కులు విఫలమయ్యాయి. బాబ్రీ కూల్చివేత అనంతరం హిందూత్వ తీవ్రవాదులు ముస్లిముల ఇళ్లమీద దాడి చేసి, తగలబెట్టి, స్త్రీలపై అత్యాచారాలు చేసి, అనేకమందిని అతిక్రూరంగా చంపేశారు. ఈ సంఘటనలకు చాలా మంది రచయితలు స్పందించారు. ఈ ఉల్లంఘనకు కదదిలిపోయిన ఎండ్లూరి సుధాకర్‌ – ‘షకీలా’ కవిత రాశారు.

‘‘ కత్తిదిగిందో
కుత్తుక తెగిందో
సాయిబుగారి రూప సంధ్య వికసించదు-
గుండె జల్లెడయిపోయిన
ఒంటరి షకీలా-
ఏ చీకటి ముళ్ల కంచె పట్టేసిందో-
…. నా జహాపనా!
ఎక్కడున్నావ్‌
ఎక్కడ చిక్కుకున్నాడో-
ఏ ఆసుపత్రి వరండాలో చివరి ఊపిరి తీస్తున్నాడో-
ఏ మార్చురీ గదిలో అనామక శవమై చితికిపోతున్నాడో-
…. దేవుళ్లారా – దేహం చిరునామా చెప్పండి’’ (నల్లద్రాక్ష పందిరి, పేజి: 161)

అంటూ చివరి చూపుకైనా దొరకని తన భర్త శవం కోసం వెతుక్కునే ‘షకీలా’ దుఃఖాన్ని ఈ కవిత ప్రతింబింబించింది. బొంబాయి నగరంలో ముస్లిమ్‌ వాడలకు వాడలు దాడులకు గురయ్యాయి. వేలాది మంది ముస్లిములు హత్యగావించబడ్డారు. రాజ్యాంగంలో మైనార్టీల కోసం ప్రకటించబడ్డ హక్కులు, పౌరులకు ఇవ్వబడిన హక్కులు హిందూత్వ తీవ్రవాదుల చేతిలో కాలరాయబడ్డాయి. ముస్లిములకు సంబంధించిన ఆస్థులను ధ్వంసం చేయడం ద్వారా ఆస్థిహక్కును హామీ ఇచ్చిన 31వ అధికరణం ఉల్లంఘనకు గురైంది. అయితే ఈ ఉల్లంఘనలు అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగినవి కావు, అలవాటుగా జరిగినవీకావు, కాకతాళీయంకాదు స్పృహతో, చైతన్యంతో, ముందస్తు ప్రణాళికతో, జన సమీకరణతో ప్రభుత్వం సాక్షిగా, పోలీసుల సాక్షిగా జరిగాయి.

ఈ దేశంలో క్రైస్తవ మైనార్టీలు కూడా హిందూత్వ తీవ్ర వాదుల నించి నిత్యం దాడులను ఎదుర్కొంటున్నారు. గ్రాహం స్టెయిన్స్‌ లాంటి వాళ్లను బహిరంగంగా చంపేసే పరిస్థితి ఈ సమాజంలో ఉంది. క్రైస్తవ నన్స్ పై అత్యాచారం చేసి చంపేసిన చరిత్రా ఉంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వ సంస్థల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడటం వలన మైనారిటీ ప్రజల్లో అభద్రత పెరిగి పోయింది. ఒకనాడు దళితులుగా వివక్షను, హింసను ఎదుర్కొన్న వారు ఇప్పుడు దళితక్రైస్తవులుగా మరింత హింసను, అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాలను గురించి ఎండ్లూరి సుధాకర్-

‘‘ మధ్య రాత్రులు ఒలీప కొమ్మల పక్షులై
ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు బిలీవర్లు
భయంకర నినాదాల బుసలతో
వర్ణశత్రువు మూక విరుచుకు పడింది
ప్రభురాత్రి భోజనం కుంకమ పాలయింది
సిస్టర్లు మానభంగాల సిలువలయ్యారు
కన్నె మరియమ్మ కంట్లో కారుతున్న రక్తాశ్రువులు “ (నల్లద్రాక్ష పందిరి, పేజి: 98)
అని చెప్తూ రాజ్యాంగపు వైఫల్యాన్ని తన కవిత్వంలో ప్రతిబింబించారు. మతమైనార్టీల వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు`అధికరణం`21- A కాలరాయబడింది.

5. రైతుల ఆత్మహత్య:
ప్రస్తుత తెలంగాణా ప్రాంతంలో, రాయసీమలో ప్రతిరోజూ ఏదో ఒకచోట రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. పది పదిహేనేళ్ల క్రితం వరుసగా కొనేళ్లపాటు కేవం పత్తిరైతు ఆత్మహత్యలు జరిగాయి. అప్పుడు చాలా మంది కవులు దీనికి స్పందించి కవిత్వం రాశారు. ఎండ్లూరి సుధాకర్‌ రాసిన ‘దూదిపూల దు:ఖం’ అట్లాంటి కవిత. భారతదేశం వ్యవసాయ దేశం. ‘రైతులు దేశానికి వెన్నెముక’ అని చెప్పుకునే దేశం- కాని ఇవి కేవలం మాటలు మాత్రమే! నిజానికి సరైన ప్రభుత్వ సహకారంలేని రంగం వ్యవసాయ రంగం. చిన్న, సన్నకారు రైతులు, పేద రైతులు, దళిత, బహుజన చిన్నకమతాల రైతులు- కనీస ఆదాయం పొందలేక పోతున్నారు. నీటి వసతి లేక, పరపతిలేక, విత్తనాలపై హక్కు, సార్వభౌమత్వం లేక అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అటువంటి రైతులకు మద్దతుగా రాసిన కవిత-

‘‘ నా రైతాంగమా!
ఈ రాజ్యాంగమే నీ మరణానికి మొదటి ముద్దాయి
పత్తిపూల పాడెమీద మిత్తిరైతును చూస్తూ
పత్తిచేలోని దూదికళ్లన్నీ
దుఃఖంతో ఎర్రబారుతున్నాయి’’ (నల్లద్రాక్ష పందిరి, పేజి:66)

అంటూ ముగుస్తుంది. ఈ కవితలో కవి ఏకంగా రాజ్యాంగాన్నే రైతు మరణానికి తొలి ముద్దాయిగా ప్రకటించి బోనెక్కించారు. రాజ్యాంగం అధికరణం 48 వ్యవసాయ, పశుగణాభివృద్ధికి హామీ ఇచ్చింది. వ్యవసాయరంగాన్ని, పాడిపరిశ్రమను శాస్త్రీయంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని ఈ అధికరణం కాగితాలపై హామీ ఇచ్చింది. కానీ నిజజీవితంలో రైతులు ప్రభుత్వంనించి ఏ సహకారం, హామీ అందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, గ్లోబలైజేషన్‌ విస్తరణలో భాగంగా విదేశీ కంపెనీల విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారాలను మార్కెట్‌కు తరలింపజేస్తున్నాయి. విత్తనాలపై సార్వభౌమత్వం కోల్పోయిన రైతులు గ్లోబల్‌ కంపెనీలపై ఆధారపడక తప్పడం లేదు. ఈ క్రమంలో అప్పులపాలై ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ రాజ్యాంగ ఉల్లంఘనకు రాజ్యమే పాల్పడుతూ ఉంది. కంచే చేను మేసిన స్థితి ఇది.

6. పర్యావరణం :
రాజ్యంగంలోని, అధికరణం 48A అడవులు, వన్యప్రాణులు, పర్యావరణ సంరక్షణను హామీ ఇచ్చింది. కానీ ఈ అధికరణం అమలు విషయంలో వైఫల్యాలే ఎక్కువ. పర్యావరణ మార్పుని ప్రకృతి లో వైపరీత్యాన్ని కవి ఎండ్లూరి సుధాకర్ కవిత్వం చాల స్పష్టంగా ప్రతిబింబించింది.

‘‘ ఋతువుల తల్లి
ప్రకృతి శిశువు కోసం
పాడెను సిద్ధం చేసుకుంటుంది
పర్యావరణ పర్యాటకుల్లారా!
పదండి ఊరేగింపులో పాల్గొందాం
అప్పటికి కాని మనకు భస్మ వైరాగ్యం రాదు
రండి తరుసేవకుల్లారా
దేశమంతా హరితాలయాలు నిర్మిద్దాం’’ (నల్లద్రాక్ష పందిరి, పేజి: 24)
అంటూ పర్యావరణ పరిరక్షణావశ్యకతను, రాజ్యాంగం ఇచ్చిన హామీని ప్రజలే కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ కవిత ప్రకటించింది.

7. రాజ్యాంగ రక్షణ ప్రకటన :
ఒక దళితుడిగా, అంటరానితనం అవమానం ఎదుర్కొన్నవాడిగా కవి గొంతు రాటుదేలింది. కలం పదునెక్కింది. రాజ్యాంగం అమలులోకి వచ్చాక జరిగిన కొన్ని కోట్ల ఉల్లంఘనల తర్వాత, కవి తన భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తున్నాడు.

‘‘ కాలం చాలా స్పష్టంగా మాకు శత్రువవుతూ ఉంది.
పెరిగిన మా ఛాతీ మీదుగా ఖడ్గం దూసుకొస్తుంది
రాజ్యాంగం రాసిన వారసత్వానికి
జైళ్లూ, సంకెళ్లూ, చావులూ బహుమానాలవుతున్నాయి
మా మధ్యన కలుపు మొక్కలు
మా హరిత శ్వాసల్ని నొక్కుతున్నాయి
మా చావుకి వెల కూడా నిర్ణయించబడింది
మాకిప్పుడు కావాలిసింది నెత్తుటి రొక్కం కాదు
మాకేం కావాలో కోరుకునే నిర్భయపు గొంతుక
కొత్త రాజ్యాంగం కొత్త దేశం కొత్త భూమి కొత్త ఆకాశం’’ (నల్లద్రాక్ష పందిరి, పేజి: 114)
(నల్ల ద్రాక్ష పందిరి, పి.114)

రాజ్యాంగం ఇచ్చిన హామీలు అన్నీ ఉల్లంఘనకు గురవుతూనే ఉన్నాయి. దళితులు ఈ దేశంలో నిరంతర హింసను, అణచివేతను ఎదుర్కొంటున్నారు. దళితులపై దాడులు చేసి, చంపి, తగలబెట్టే హంతకులు ఏ శిక్షా పడకుండా యదేచ్ఛగా విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు తేలిపోతున్నాయి.

ఇటువంటి స్థితిలో కవి ‘కొత్త రాజ్యాంగం, కొత్త దేశం’ కాంక్షిస్తున్నాడు. ఈ హిందూత్వ తీవ్రవాద సమాజం రాజ్యాంగాన్ని కాక ఆటవిక మనుస్మృతినే ఇంకా విశ్వసిస్తూవుంది. దాని వికృత వికట చేష్టల ముందు రాజ్యాంగం పదేపదే విఫలమై పోతూ ఉంది. ఈ సమాజం మనసులో మనువు రాసిన అవమానీయ స్మృతే అనధికార రాజ్యాంగంగా ఈ దేశాన్ని ఏలుతుంది.
అస్తిత్వ చైతన్యం రాజుకున్నాక దళిత సమాజం ఇన్నాళ్లూ కోల్పోయిన హక్కుల్ని సాధించుకునే ప్రయత్నంలో రాజకీయ ఉద్యమ నిర్మాణాన్ని జరుపుతోంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు వారసులైన దళితులు ఆయన రాసిన రాజ్యాంగం సాక్షిగా ఇన్నేళ్ళుగా వైఫల్యాలను ఎదుర్కొన్నారు. కానీ ఇవాళ అదే అంబేద్కర్‌ స్ఫూర్తిగా పునరుత్ధాన వాగ్ధానం చేస్తున్నారు.

‘‘ ఇవాళ నాది అగ్నిముఖం
నా చేతులు వజ్రాయుధాలు
నేనిపుడు నడిచే ఖడ్గాన్ని
నన్నెవరూ తాకలేరు
నేను నిద్రలేచిన పులిని
నా కదలిక సింహస్వప్నం
నా తాత ముత్తాతల నాటి అంటరానితనపు దస్తావేజుల్ని
నా తరతరాల అక్రోశాల కన్నీటి కైఫీయత్తుల్ని
నా జాతి వేలిముద్రల దరిద్రపు చీకటి చరిత్రల్ని
నడిరోడ్డు మీద చించి పోగులు పెడుతున్నాను
భూతకాలం గొంతు మీద కాలు పెట్టి
భవ్యిష్యత్తు గుండెల్లో నిర్భయంగా సంతకం చేస్తున్నాను
ఏ నాటికైనా
నా పాదముద్రలు చారిత్రక రథ్యలవుతాయి………….’’
(నల్లద్రాక్ష పందిరి, పేజి. 118)

ఇట్లా తమ రాజ్యహక్కునీ, రాజ్యాంగహక్కునీ సాధించుకునేందుకు దళితులు సిద్ధమవుతున్నారు. కవి ఎండ్లూరి సుధాకర్‌, ఉద్యమ చైతన్యాన్ని ఆవాహన చేసుకుని హక్కుల సాధన, ఆత్మగౌరవ సాధన లక్ష్యంగా తన కవిత్వ ప్రకటన చేశారు.
భారత రాజ్యాంగం పౌరులందరికీ సమాన మైన హక్కులను, అవకాశాలను వాగ్దానం చేసినప్పటికీ- అవి అమలు జరగడంలో దళితులకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతుంది. రాజ్యాంగం సాక్షిగా కొందరు సర్వ హక్కులనూ యధేచ్చగా అనుభవిస్తుంటే ఇంకొందరు తమ కనీస హక్కులను సాధించు కోడానికి నిరంతర పోరాటం చేయాల్సి రావడం స్వతంత్ర భారతంలో విషాదం. ఈ దేశంలో దళితులు తమ హక్కుల సాధనకోసం సామాజిక రాజకీయ పోరాటాలతో పాటు సాహిత్య పోరాటం కూడా చేస్తున్నారు. ఈ హక్కుల ఉల్లంఘన స్థితిని కవి ఎండ్లూరి సుధాకర్ తో పాటు మొత్తం దళిత కవి సమాజం ఎంతో బలంగా వ్యక్తీకరించింది. వ్యక్తీకరిస్తుంది.

                                                                                                                            – డా. ఎం.ఎం. వినోదిని

అసిస్టెంట్ ప్రొఫెసర్,

తెలుగు శాఖ,  యోగివేమన విశ్వ విద్యాలయం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.