కడపటి త్యాగపుటడుగు(కవిత)-జి.సందిత

ఎండకు గొడుగై
చలికిదుప్పటై
ఆకలదప్పులకు
అన్నపానీయాల జోలెయై
దిగులుసెలిదికి చెదిరిన నిదురకు ఓదార్పు జోలయై
తనబిడ్డను తనకన్నుకన్నా జాగ్రత్తగా
కాపాడుకున్న … .
నేటిమనిషిని కన్నమ్మ కన్నప్రేమను  చూస్తున్నాను

పట్టుతప్పుతున్న చేతులతో
మసకెక్కుతున్న కన్నులతో
నీలుక్కుపోతున్నకీళ్ళతో 
ఇంకిపోతున్న కన్నీళ్ళతో

చూసేందుకే అసహ్యంగా ….

తోలుకప్పిన ఎముకల కుప్పలా  
మూలుగుతూ కదులుతున్న  కన్నతల్లి అడుగుల్లో
నేటిమనిషిని కన్నమ్మ కన్నప్రేమనే  చూస్తున్నాను

నాగరిక  ధనార్జనానందపు అందాలగదుల్లో 
పాతరోతై అసహ్యంగా కన్నబిడ్డకడ్డెందుకంటూ 
వృద్ధాశ్రమపు సమాధిగదుల్లో చతికిల బడుతున్న మానవత్వపు విలువల్ని చూస్తున్నాను
తోయబడుతున్న నిస్సహాయతల్ని చూస్తూన్నాను.
స్పందించని మనసుతనాన్ని గర్హిస్తున్నాను.

– శ్రీమతి .జి సందిత (Sanditha)

బెంగుళూరు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to కడపటి త్యాగపుటడుగు(కవిత)-జి.సందిత

 1. వెంకటేశ్వరరావు says:

  కడపటి
  త్యాగపు
  టడుగు
  కన్నమ్మతో
  పాటూ
  కన్నయ్య
  కూడా
  వేస్తున్నాడు

  కడపటి
  అడుగు
  తడబడ
  కుండా
  గుండె
  చప్పుళ్ల
  మీదుగా
  పోనిచ్చే
  మనసు
  తనాన్ని
  కూడా
  చూస్తున్నాము