మృగాల మధ్య!(కథ)-వేణు నక్షత్రం

గోడపై వ్రేలాడుతున్న మ్యూజికల్ క్లాక్  ఉన్నట్టుండి చిన్నగా సంగీతం వినిపించింది.    అంతవరకూ నిశ్శబ్దంగా ఫైళ్లలో ముఖాన్ని దూర్చిన రవీంద్ర గడియారం వంక చూశాడు, సమయం అయిదు గంటలయ్యింది.   ఉదయం నుండీ కనీసం లంచ్ కూడా చేయకుండా చాలా వరకు ఆఫీసు పనిలో బిజీ వున్నాడు  రవీంద్ర. ఇంక ఓపిక లేక ఫైలన్నీ సర్ది,  బైక్ స్టార్ట్ చేసి ఇంటి వైపు బయలు దేరాడు.   ఒక  అర్థ గంట తర్వాత రోడ్డు పై హైదరాబాద్ ట్రాఫిక్ ని జయించి  ఓ వీరునిలా విజయ గర్వముతో  ఇల్లు చేరుకున్నాడు రవీంద్ర.   పది  కిలో మీటర్లు దూరంలో  కూడా లేని ఆఫీస్ నుండి ఇంటికి రావడానికి దాదాపు ఒక గంట పడుతుంది  మరి!   స్నానం  చేసి, ఫ్రెష్ అయ్యి  న్యూస్ పేపర్ పట్టుకొని  ఆరాం కుర్చీలో కూర్చుని గడియారం వంక చూసాడు. దాదాపు ఆరు గంటలు అవుతుంది, అప్పటికే రావాల్సిన వంట మనిషి కాంతమ్మ ఇంకా రాలేదు. కడుపులో రైళ్లు పరుగెడుతున్నాయి.   ఓ అయిదు నిమిషాలు న్యూస్ పేపర్ తిరిగేసి లేచి,  రోడ్డు వైపు చూస్తున్నాడు.   మామూలుగా కాంతమ్మ ఎప్పుడూ ఆలస్యం చేయదు,  మరి ఈ రోజే ఎందుకు ఆలస్యం అయినట్టు?   అసలు వస్తుందా లేదా ?
    
                          అతని ఆలోచనలకు అడ్డుకట్టలా  దూరం నుండి మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ వస్తుంది కాంతమ్మ.    మోకాలు నొప్పుల వళ్ళ మామూలుగా నడవ లేక పోతుంది.   ఆపరేషన్ చేయించుకోమంటే..  “ఇద్దరమూ మంచాన పడితే  నాకెవరు చేస్తారు, మంచానికే పరిమితం అయిన నా రాజయ్య కు ఎవలు పెడ్తారు ?” అంటుంది. వయసు అరవై వరకూ ఉంటుంది, కానీ  జీవితం లో కలిగిన ఆటు పోట్ల వళ్ళ అప్పుడే డెబ్బయి ఏండ్ల దానిలా కనిపిస్తుంది.  బక్క పలచని శరీరం.  ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం,  భర్త రాజయ్య ఆల్విన్ కంపినీలో  ఫిట్టర్  గా చేసేవాడు. యాభై ఏండ్లకే మాయదారి  పక్షపాతం వచ్చి కాళ్ళు చేతులు పని చేయకుండా పోయాయి.   ట్రీట్మెంట్ కోసం కంపెనీ ఇచ్చిన పైసలు, కొడుకు వ్యాపారం కోసం తీసుకొని తల్లి తండ్రులకి మొండిచేయి చూపాడు.  వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులోళ్ల తో పడలేక బొంబాయి పారిపోయాడు.  అక్కడే ఏదో ఉద్యోగంలో చేరి అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడట.  అవసరానికి ఆదుకుంటాడనుకున్న కొడుకు,  పండుగ పబ్బాలకి మాత్రమే  దొంగలా వచ్చేవాడు ఎవరికీ తెలియకుండా!    ఆ తర్వాత భార్య మాటను ఎదిరించలేక పూర్తిగా రావడమే మానేసాడు.   అంత వరకూ బయట కాలుపెట్టని  కాంతమ్మ,  కుటుంబ భారం  అంతా  ఇప్పుడు తన భుజాలపై  వేసుకొని,  పది ఇళ్లలో  పనిచేస్తూ మంచం లోంచి  కదలని భర్తను పోషిస్తూ, తన కడుపు నింపుకుంటుంది.  

     “చమించాడయ్యా .. ఇయ్యాల పొద్దెక్కువయి పోయినాది ” అన్న  కాంతమ్మ మాటలతో తన ఆలోచనలను  పక్కకు పెట్టి ఈ లోకం లోకి వచ్చాడు రవీంద్ర, చిన్న తప్పుని కూడా దాచుకోని రకం. 
     ” ఆ అదే.. ఇంకా రాలేదేమిటా అని చూస్తున్న, రాజయ్య మంచిగున్నాడా ?” 
     “మా రాజయ్య కు ఇయ్యాల అంబలి తాగాలనిపిస్తేనో  కాసొచ్చానయ్యా, అంబలి  ఉడికెతందుకు  జెర ఎక్కువ టైం అయ్యింది, ఏం నాస్త  చెయ్యమంటారు? “
     “బాగా ఆకలిగా వుంది , తొందరగా కావలి కాబట్టి ఉప్మా చేస్తావా ? ”  అన్నాడు రవీంద్ర . 
          పదిహేను నిమిషాల్లో వేడి వేడి ఉప్మా అందించింది కాంతమ్మ,  “నువ్వు కూడా తెచ్చుకో, ప్రొద్దున్నుండీ ఏం తిన్నావో , తినలేదో! నీ ముసలాయనకు తినిపించడంలో ఉన్న శ్రద్ధ నీవు తినడంలో ఉండదు!” ప్లేటు అందుకుంటూ 
    ఆక్షేపించినట్టుగా అన్నాడు రవీంద్ర .    ఉప్మాలో కొంచెం రాజయ్య కోసం కట్టుకొని రెండు ముద్దలు తిని అయ్యిందనిపించుకుంది.    కాంతమ్మకు తన భర్త పై గల ప్రేమకు ఆశ్చర్య పడడం రవీంద్ర వంతయ్యింది. 
    ” ఆ కొంచం తినక పోతే నీ రాజయ్య కు ఏమి  కాదులే , నీవే తినేసేయ్,  భోజనం వండిన తర్వాత తీసుకెళ్దువులే ” కాంతమ్మను తమాషా పట్టించాలని అన్నాడు రవీంద్ర . 
   “అది కాదు బాంచెన్, ఈ రెండు ముద్దలు తింటే కడుపు నిండదు, కాలు నిండదు కానీ మా ముసలాయనకు ఉప్మా అంటే చాలా ఇష్ష్టం. ఆయన మంచిగున్నప్పుడు నన్నుకాదని ఎక్కడా ఏదీ తినేవాడు కాదు, ఏది తిన్నా నాకు తెచ్చేవాడు.  నన్ను ఎన్నడూ పనికి పంపేవాడు కాదు, నేనంటే మా చెడ్డ ప్రాణం.   ఆ మాయదారి పచ్చవాతమ్ వచ్చి నా బతుకిట్లా అయ్యింది కానీ ”   కండ్లల్లో నీరు ఉప్పెనలా పెల్లు బిక్కుతుండగా, వస్తున్న దుఃఖాన్ని ఆపుకోడానికి ప్రయత్నిస్తూ  చెప్పింది కాంతమ్మ.
   అడిగితే కానీ తన విషాదగాధని  ఎవ్వరికీ వినిపించదు.  శారీరకంగా బక్క పలచన, అనుకోని  జీవనభారం  క్రుంగ దీసినా ఎప్పుడూ చలాకీగానే ఉంటుంది, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది.   ”ఎంత అలసినట్టున్నా ఎప్పటికీ పోరాడి గెలిచే మనస్తత్వం  ఆమెది, అందుకే మా వీధిలో వున్న అందరి మనసు గెలుచుకుంది, అందరూ ఆమెను వారి కుటుంబ సభ్యురాలిగానే చూసేవారు. 

    “అవును దొరా ,  గా అయోధ్యలో ఏమో లొల్లి జరుగుతుందట గదా? గదేం లొల్లి ?  తన పరిస్థితిని తలుచుకుని క్రుంగి పోయినట్లు కనిపించే మనస్తత్వం కాదు కాబట్టి  వెంటనే వేరే టాపిక్ లోకి వచ్చి అడిగింది కాంతమ్మ . 
   “నీకెవరు చెప్పారు ఆ సంగతి? అయినా నన్ను దొర  అనొద్దు అన్నాను కదా !”  ఆశ్చర్య పోతూ అన్నాడు రవీంద్ర. 
 “నిన్న కృష్ణారావు సారు ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్ల అందరూ ఇచారంగా వుంటేనూ ఏందని అడిగితే,  వాళ్ళ కొడుకు కూడా పోయిండట అయోధ్యకు! ఆడ ఎట్లుండో ఏమో అని భయపడుతున్నారు. ఇంట్ల కూడా చెప్పకనే పోయిండట, అదేదో సేవనట కదా !”  చాల విచారంగా చెప్పింది,  పరుల కష్టాలను తన కష్టాలుగా భావించే కాంతమ్మ . 
“కరసేవ అయ్యుంటది” అన్నానో లేదో వెంటనే “ఆ.. అదే అన్నరు సారూ ”   అని నా జవాబు కోసం ఎదురు చూస్తుంది.

   “రామజన్మ భూమి- బాబ్రీ  మసీదు”  విషయం  ఎలా చెప్పాలో అర్థం  కాలేదు రవీంద్రకి, చెప్పడానికి ఆలోచిస్తున్నాడు.  ఒకే మతం వారయినా ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారిని చాల మందిని చూసాడు రవీంద్ర.  ఎవరి ఇష్టం వారిది, ఎవరు ఏ విధంగా స్పందిస్తారో చెప్పడం కష్టం.  ఎందుకైనా మంచిది కాంతమ్మ మతం ఏదో తెలుసుకొంటె, ఆ మతానికి అనుకూలంగా చెప్పొచ్చు అనుకున్నాడు రవీంద్ర. తన ఇంట్లో గత నాలుగైదు ఏండ్ల నుండి పని చేస్తున్నా ఆమె కులము, మతము బయట పడలేదు, తెలుసుకోవలసిన అవసరము కూడా రాలేదు.  ప్రతి ఆదివారం రవీంద్ర ఫామిలీ తో కలిసి  జీసెస్ కి ప్రార్థన చేస్తుంది.  అంత మాత్రాన ఆమెని క్రిష్టియన్ అనడానికి వీల్లేదు,  ఎందుకంటె ఎదురింటి కృష్ణారావు వాళ్ళతో గుడికి వెళ్తుంది .  ప్రతి ముస్లిం పండుగ ఖాన్  ఫ్యామిలీతో జరుపుకుంటుంది, అచ్చం ముస్లిం లాగే  వాళ్ళు ఏది చేస్తే తాను అది చేస్తుంది.   ఇప్పుడు రవీంద్రకి నిజంగా ఇంట్రెస్టింగా వుంది కాంతమ్మ కులము, మతం కనుక్కోవడానికి.  కానీ అడగడానికి మొహమాటం అడ్డు వస్తుంది .
కాంతమ్మ మతం కనుక్కోవడం ఇప్పుడు తన ముందు ఒక పెద్ద ఫజిల్.  ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాడు.

      ” కాంతమ్మా.. నీకు ఏ దేవుడు అంటే ఇష్టం? ” ఇలా అయినా బయట పడుతుందేమో అని అడిగేశాడు. 
“అయ్యా .. బాంచెన్, ఇప్పుడు గా సంగతి ఎందుకు సారూ? నాకు ఇప్పుడు మీరే దేవుళ్ళు.   ఆ ఖాన్ సాపు, కృష్ణారెడ్డి సారు మీరే  నన్ను ఆదుకోకుంటే .. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుండేదో!  నా కులం, మతం ఎప్పుడో మర్చి పోయిన!  అవి మాకు ఎన్నడూ గింత తిండి పెట్టలేదు.  మా ఆయనకు పచ్చవాతం వచ్చి మంచాన పడితే మా కులపోళ్ళంతా వచ్చి అయ్యో పాపం అన్నోళ్లే గానీ ఎవ్వరూ మా కాలేకడుపులకి ఇంత ఆసరా కాలేదు. కొడుకు ఒక్కసారి వచ్చి చూసి పోయిండు కానీ,  వాని పెళ్ళాం తో  లొల్లి అయితది అని ఒక నెల గాసం కొనిచ్చిపోయిండు.
 
 ఏ పనంటే ఎరుగని నేను, ఏం పని చేయాలో తోయలేదు.  మా ఎదురింటి ఖాన్ సాబ్  రోజూ మా ఇద్దరికీ తిండి పెట్టె వారు. ఎన్ని రోజులు అట్లా పెడతరు అని నేను వాళ్ళింట్ల ఏదన్నా పని చేస్తాను అంటే వాల్లొద్దన్నరు. అట్లయితే వాళ్ళు పెట్టే  తిండి వద్దన్నా! అప్పుడు సరే బట్టలు ఉతుకుమన్నారు,  అది మా కులపోళ్లకు నచ్చలేదట.  సాయబుల ఇంట్ల పనిచేస్తావా?  నిన్ను కులంల కేలి తీసేస్తా అన్నారు.  అవసరానికి గింత తిండి పెట్టని వాళ్ళు- వాళ్ళ కులం! నాకెందుకు?   గప్పటినించి ఎవరన్నా ఏంటోళ్లు  అంటే   మేము, తుర్కుళ్ళమో, తెలుగుళ్ళమో, కిరస్తానేమో కాదు, మేము గరీబోళ్లం అంటా”    కనీళ్ళు తుడుచుకుంటూ  గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది  కాంతమ్మ. 

     “అయినా .. ఏకులమయినా , మతమయినా  ఎందుకు దొరా ? ఏదో కష్ట మొచ్చినప్పుడు  ఆ మతానికుండే  దేవుడ్ని  ‘దేవుడా నీవే రచ్చించాలి ‘ అని మొక్కేతందుకే కదా? మంచిగున్నప్పుడు ఎంత మందికి  గుర్తొస్తడు దేవుడు?   నాకు దేవుడసుంటోళ్లు మీరే వున్నారు కదా! ఇంకా వెరే  దేవుడు ఎందుకు?” సమాజాన్ని ప్రశ్నిస్తున్నట్టు కాంతమ్మ కళ్ళల్లో చాలా ధీమా!   క్లాసులో పాఠాలు కూడా ఇంత శ్రద్ధగా విన్లేదు రవీంద్ర.   కానీ కాంతమ్మ చెప్పేది  ‘జీవన వేదాంతం’ లా తోచింది రవీంద్రకి. 

“ఎంత చక్కటి ఫిలాసఫీ చెప్పింది.  మన సమాజంలో ఎందరో ఇట్లాంటి వారు.  ఆకలి కడుపులకు అన్నం పెట్టని కులమెందుకు? మతమెందుకు? ” ఆలోచనలో పడిపోయాడు రవీంద్ర.      “అయ్యో .. నేను నీ ప్రశ్నకు  జవాబు చెప్పలేదు కదా,  విను.  అయోధ్య లో ఇప్పుడు వున్న మసీదు  స్థలం  రామునికి సంబంధించింది అట,  అందుకే అక్కడ మసీదు తీసేసి గుడి కట్టాలని ఈ కర సేవకులు బయలు దేరారు .  హిందూ ముస్లిం లకి  బాగా గొడవలు అయ్యేట్టున్నవి” తనకు తెలిసింది  చెప్పాడు రవీంద్ర .  శ్రద్ధ గా విన్నది కాంతమ్మ.  ఎంత వరకు అర్థం అయ్యిందో కానీ  కాంతమ్మ ముఖం మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే  వుంది.  ఇంకా ఎలా చెపితే బాగుండేదో ఇంకా ఆలోచిస్తున్నాడు రవీంద్ర.

“నేనెల్లొస్తానయ్యా .. పొద్దెక్కువ అయిపొయింది!”  అన్న కాంతమ్మ మాటలతో తన ఆలోచనలకు స్వస్తి చెప్పి వాస్తవిక ప్రపంచంలోకి వచ్చాడు రవీంద్ర.   కాంతమ్మ  వెళ్తున్న వైపే ఆశ్చర్యంగా చూడసాగాడు, ఇప్పుడు అతని కళ్ళకు ఆమె మామూలుగా కనిపించడం లేదు, బోధి వృక్షం క్రింది  గౌతమునికి జ్ఞానోదయం అయినట్లుగా కాంతమ్మ మాటలతో రవీంద్రకి జ్ఞానోదయం అయ్యింది.  కాంతమ్మ  కులం తెలుసుకోవడానికి  చేసిన ప్రయత్నాకి  తనపై తనకే  సిగ్గేసింది రవీంద్రకి . 

      డిసెంబర్ 7, 1992:    ఉదయాన్నే రోజూలాగే  ‘టీ’ తాగుతూ న్యూస్ పేపర్  తెరిచాడు రవీంద్ర.  పెద్ద పెద్ద అక్షరాలతో ప్రముఖంగా  కనిపిస్తుంది ఒక వార్త” బాబ్రీ  మసీదు కూల్చివేత, దేశ మంతా రెడ్ అలెర్ట్ ”  తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు.  రేడియో ఆన్ చేసాడు.  దేశమంతా కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేత.  తన గుండె వేగంగా కొట్టుకోసాగింది.  ఒక్క రాత్రి లోనే దేశ వ్యాప్తంగా వందల మంది హతం.  మరోసారి ఘోరకలి తప్పదన్నమాట.   మంత్రులని మార్చడానికి మత కల్లోలాలే  మార్గంగా చేసుకున్న రాజకీయ నాయకులు, ఇప్పుడు లేపిన ఈ మతకల్లోలాలు ఎవరిని ఉద్ధరించడానికి?  ఎవరి బ్రతుకుల్లో చిచ్చు పెట్టడానికి?  ఎవరి ప్రాణాలతో చెలగాటం ఆడడానికి?   అతని మనస్సు ఎందుకో కీడు శంకిస్తుంది.   బయటంతా కర్ఫ్యూ.  అలవాటు లేని వంటతో ఎలాగో తంటాలు పడి, చేతులు కాల్చుకొని ఆకలిని జయించగలిగాడు.   పాత పేపర్లు తిరగేస్తూ , రేడియోలో వార్తలు వింటూ గడిపాడు ఆ రెండ్రోజులు.  పనేమీ లేక, బయటకు పోలేక రెండు రోజులు గడపడానికి చాలా కష్టం అయ్యింది.

రెండ్రోజుల తర్వాత:
మధ్యాహ్నం  రెండు గంటలు, కర్ఫ్యూ  సడలించినట్టు వార్త.  అది కేవలం పిల్లలకు, స్త్రీలకు మాత్రమే.   కొద్ది  కొద్దిగా అల్లర్లు సద్దు మణుగుతున్నాయి అనడానికి సాక్ష్యం ఈ కర్ఫ్యూ సడలింపు.  ఏదో అలికిడి అయితే తలుపు వైపు చూశాడు రవీంద్ర, ఆశ్చర్యానికి గురి కావడం రవీంద్ర వంతయ్యింది!   అలాగే చూస్తుండి పోయాడు.  
“ఏంది సారూ, అట్లాగే చూస్తూ వున్నారు?” ఆశ్చర్యంగా అంది కాంతమ్మ పరధ్యానంలో వున్న రవీంద్రని చూస్తూ. 
“బయట అంత అల్లర్లు జరుగుతుంటే  ఇప్పుడు రాకపోతే  ఏం?  ఎవరు రమ్మన్నారు నిన్ను? పో .. వెళ్ళిపో!  అసలే రోజులు బాగాలేవు, అసలే ఎవర్ని నమ్మేట్టు లేదు, ఎప్పుడేమవుతుందో ఎవరికీ తెలియట్లేదు. ఈ రెండు మూడు రోజులూ ఏదో వండుకుని తింటాలే, నీవెళ్ళు” కంగారుగా అన్నాడు రవీంద్ర, ఆ మాటల్లో ఎంతో ఆత్మీయత చోటుచేసుకుంది. 
 “అయ్యో సారూ , రెండ్రోజుల్నించి ఏం తిన్నవో , తినలేవో !  ఎట్లయిపోయినవ్ చూడు. అయినా  ఇక్కడ అందరూ నాకు  తెలిసిన మనుషులే  కదా? నన్నేమి చేస్తారు?”  అంటూ రవీంద్ర మాటలని ఏ మాత్రం లెక్క చేయకుండా  వంటింట్లో కెళ్ళి వంట చేయడం ప్రారంభించింది.
“అందరూ నాకు  తెలిసిన మనుషులే ” నాకెందుకో ఈ మాటలకి అర్థం కొత్తగా వినిపిస్తుంది.  నిన్నటి వరకూ ఒకరికి ఒకరు అన్నతమ్ములుగా మెదిలిన వారు,  కులాలు-మతాల పేరుతో  రాత్రికి రాత్రే విడిపోవడం, కత్తులు దూసుకోవడం, రెండ్రోజుల తర్వాత వచ్చిన ఆ  న్యూస్ పేపర్ నిండా అవే వార్తలు.
  అర్ధ గంటలో, ఫ్రిడ్జ్ లో  నిలువవున్న కూరగాయలతో  వంట పూర్తి చేసింది కాంతమ్మ.  రెండ్రోజులుగా అతనేమీ తిన్నాడో , అతనికే తెలియదు. వంటింట్లోంచి మంచి వాసనొస్తుంటే, ఇగ ఆగలేక   ఆవురావురుమని లొట్టలేసుకుంటూ తింటుంటే కాంతమ్మ కొంచెం అన్నం తన భర్త కోసం తీసుకుంది. రవీంద్ర వైపు చూసింది, ఏదో ఆలోచిస్తూ, తినడంలోనే మునిగి పోయాడు. అతను ఎటూ చూసేటట్టు లేడు. “సారూ ! ఆ ఖాన్ బాబు గారింటి కెల్లాల,  లేటయింది నేనెల్తా ! ” అంటూ కాంతమ్మ  వెళ్లి పోయింది.    
 
అప్పటివరకూ కాంతమ్మ అక్కడనే వున్నదని గ్రహించ లేక పోయాడు రవీంద్ర.  రెండు రోజులకే అంతో ఇంతో తినుకుంటూనే ఇలా ఉంటే, ప్రపంచంలో తిండి లేని వారు ఏ సోమాలియాలోనో, రువాండాలోనో  పాపం, తిండి లేక ఎండిన ఎండిన ఆ శరీరాలు చూస్తుంటే తరుక్కు పోయేది. అట్లాంటి వారి ఆకలి ముందు తనది ఎంత?  అసలు సోమాలియా దాకా ఎందుకు, ఆ కాంతమ్మే రెండ్రోజులుగా తన భర్తకు ఏమి పెట్టిందో, తానేమి తిన్నదో ?  తన వృత్తి ధర్మాన్ని తప్పకుండా తన పొట్ట నిండకున్నా,  ఇతరులకు పంచ భిక్ష పరమాన్నాలు పెట్టాలనే కాంతమ్మ తపన ముందు తన ఆకలి ఏ పాటిది?  ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ  ఇంకా తినలేక పోయాడు రవీంద్ర. ఏవేవో ఆలోచనలు, సమాధానం దొరకని ప్రశ్నలు!  

భోజనం ముగించి, లేచి టేప్ రికార్డర్ ఆన్ చేసి సోఫాలో ఒరిగాడు రవీంద్ర  ఏదో ఆలోచిస్తూ… 
” క్యా మిల్గయా  భగవాన్ తుమే దిల్కో చూపాకే, అర్మాన్ కి నగిరీమె మేరే ఆగ్ లగాకే ”  అంటూ నూర్జ హాన్ గొంతు టేప్ రికార్డర్ లో వినవస్తుంటే ఎప్పుడో నిద్రలోకి జారాడు రవీంద్ర. 

 రాత్రి తొమ్మిది కూడా కాలేదు,  కానీ అర్ద రాత్రి లాగా వుంది బయట.  “గుడ్డి కన్ను తెరిస్తే నేమి, మూసేస్తే నేమి” అన్నట్లుగా ఆ వీధి లైట్లు ఎప్ప్పుడూ  వెలగవు.  చిమ్మ చీకటి,  ఇళ్లు   దుకాణాలు అన్నీ మూసి వేసి వున్నాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా  నిశ్శబ్దంగా వున్నాయి. వీధిలో చెత్త కుండీ దగ్గర ఎంగిలి ఆకుల కోసం  ఎదురు చూస్తున్న  కుక్కలు ఆకలి తో తమలో తామే అరుచుకుంటున్నాయి, కరుచుకుంటున్నాయి.   ఉన్నట్లుండి  ఒక పెద్ద కేక ఆ చిన్న వీధి నిండా ప్రతిధ్వనించింది.   ప్రతి ఇల్లు ఆ ధ్వనితో దద్దరిల్లింది. అంత వరకూ మంచి నిద్రలో వున్న రవీంద్ర టేప్ రికార్డర్ కట్టేసి మెల్లిగా కిటికీ తెరచి చూసాడు.  ఆ వీధిలో ఒక్కక్క  కిటికీ తెరచుకుంటున్నాయి.   ఆ దృశ్యం వారందర్నీ నిశ్చేస్టులని చేసింది, ప్రతి ఒక్కరిని కదిలించి వేసింది.  అంతకు ముందు ఏమి జరిగిన బయటకురాని వారు, తమ భద్రత గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక్కొక్కరుగా  తలుపు తెరచి వీధిలోకి వస్తున్నారు.  అక్కడ చాలా మంది మూగారు, ముగ్గురికన్నా ఎక్కువ మంది ఒక్క దగ్గర  ఉండకూడదు అనే కర్ఫ్యూ నియమాలు ఎవ్వరూ పట్టించుకోలేదు.  ఆ దృశ్యం చూసిన రవీంద్ర కుప్ప కూలిపోయాడు,  అప్రయత్నంగా కళ్ళ నుండి కన్నీటి ధారలు  ప్రవహిస్తున్నాయి.   ఆ దృశ్యమే .. కాంతమ్మ రక్తపు మడుగులో చావు బ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుకుంటుంది!
అసలేం జరిగింది అంటే  .. అప్పుడే ఖాన్ వాళ్ళ ఇంట్లో పని చేసి ఇంటికి వెళుతుండగా అటుగా వచ్చిన అల్లరి మూక కంట పడింది కాతమ్మ. “దేఖ్ రే  కోయీ ఆరయ్,  రెడీ .. (చూడండి .. ఎవరో వస్తున్నారు .. రెడీ గా వుండండి )”  ఆ మాటలు విన్నది కాంతమ్మ .   వాళ్ళని చూసి కొంచెం భయపడినా,  వాళ్ళు తననేమి చేస్తారులే  అనే ధైర్యం తో అలాగే నడుస్తూ వెళుతుంది.   “అరే..  ఓ ఔరత్  హై రే  …( ఆ వచ్చేది స్త్రీ లాగా వుంది )”   కొంచెం సానుభూతి స్వరం తో ఒక ముష్కరుడు. 
“తో క్యా ..  ఓ ఔరత్ హుయే తోఖ్యా ? , హిందూ హుయేతో ఖ్యా ? ముసల్మాన్ హుయేతో ఖ్యా ?  హమ్ కు  తో కౌంట్  హోనా,  పైసా హోనా ..” (మనకు ఎవరరైతే ఏంటి ? స్త్రీ, హిందూవా .. ముస్లిమా  సంబంథం లేదు,  ఎంత మందిని చంపాము అన్నది ముఖ్యం, దానికి తగ్గ పైసలు తీసుకోవడం ముఖ్యం )”  ఖర్కశంగా అన్నాడు  ఇంకొకడు,  లీడర్ అయ్యుంటాడు.  

తల్వార్  నిఖాల్  .. డాలో …  ( కత్తి తీయండి .. ఎసెయ్యండి) అంటూ  లీడర్ ఆజ్ఞలను పాటిస్తూ  ఆ ముష్కర మూక  కాంతమ్మని  కత్తుల్తో  నిర్దాక్షణ్యంగా  దొరికిన చోట పొడిచి పారిపోయారు.  కాంతమ్మ ఆర్తనాదం  ఆ వీధిని తట్టి లేపింది.  అప్పటికే చాలా రక్తం పోవడంతో  కాంతమ్మ స్పృహలో లేదు.

   “అయ్యో పాపం బంగారం లాంటి  మనిషిని  ఎట్లా పొడవ బుద్దయింది ఆ కసాయి వాళ్లకి,  వాళ్ళ  చేతులిరిగి పోను, వాళ్ళ  మీద మన్నుపడ ” తిట్ల దండకం అందుకుంది కృష్ణారావు భార్య. 
   “వాళ్ళు కనుక నాకు కనపడితే అక్కడే ఖతం చేస్తుంటి బద్మాష్ గాళ్ళను,  మన గల్లీకి  వచ్చేందుకు ఎంత ధైర్యం వాళ్ళది ”   కోపంతో  పళ్లు కొరుకుతున్నాడు  ఖాన్ .  
       శ్వాస చూసాడు రవీంద్ర, ఇంకా బ్రతికే వుంది.   ఏ మాత్రం ఆలస్యం చేయకుండా  ఆ ప్రక్క సందులో నిలిపి  వున్న రిక్షా తీసు కొచ్చాడు రవీంద్ర.   ఖాన్ మరి కొందరి సహాయం తో దగ్గర లోని నర్సింగ్ హోమ్ కి   చేర్చారు .  వెంటనే రక్తం ఎక్కించాలన్నారు డాక్టర్లు, చాలా మంది ముందుకొచ్చారు రక్తం ఇవ్వడానికి. ఖాన్ రక్తం సరిపోయింది, వెంటనే రక్తం ఎక్కించి గాయానికి సర్జరీ చేసి  ఐ సి యు లో ఉంచారు కాంతమ్మని. ఇరవై నాలుగు గంటలు దాటితే కానీ ఏమీ చెప్పలేమన్నారు డాక్టర్లు .

      హాస్పిటల్ వద్ద మూగిన జనం తలో మాట ఆముష్కరులని తిడుతున్నారు.   ఏ పెద్ద కార్పొరేటరో, ఒక పొలిటికల్ పార్టీ లీడరో హాస్పిటల్లో జాయిన్నయ్యినంత హడావిడి జరుగుతుంది బయట. అంతమంది అభిమానులని తన నిస్వార్థ సేవతో,   ప్రేమతో సంపాదించుకుంది కాంతమ్మ. ఆమె పరిస్థితి చూసి కన్నీరు పెట్టని వారు ఎవరూ లేరు అక్కడ.    

       కాంతమ్మ బాధ్యత రవీంద్ర తీసుకొని,  కాంతమ్మ భర్త రాజయ్య బాగోగులు ఖాన్ ఫ్యామిలీ చూసుకునేట్టుగా ఒక అంగీకారానికి వచ్చారు.  హాస్పిటల్ లో వున్న కుర్చీపై  కూర్చుని కాంతమ్మనే చూస్తున్నాడు రవీంద్ర. మనసు అంతా కాంతమ్మ చుట్టే తిరుగుతుంది.   కేవలం తన బ్రతుకు తన కొరకు కాదు, పది మందికి సహాయపడాలి అనే మనస్తత్వం కాంతమ్మది.   తమ  పిల్లలను స్కూల్ కి పంపాలి అంటే  కాంతమ్మ కావాలి,   ఇంకా చిన్న పిల్లలకి తిని పించాలంటే కాంతమ్మ కావాలి, ఆడించాలంటే  కాంతమ్మ కావాలి,  పెద్ద వాళ్లకి మాగజినో, న్యూస్ పేపరో  కావాలంటే కాంతమ్మ .. అమ్మాయికి షాంపూ కావాలన్నా,  ఇలా ఎవరికి ఏ అవసరం వచ్చినా కాంతమ్మ .. కాంతమ్మ! అందుకేనేమో, ఈ రోజుల్లో అక్కడేదో జరిగింది అనగానే, తలుపులు, కిటికీలు బిగించుకొని ఎవరితో నాకేంటి అని తమ స్వార్థాన్ని తాము చూసుకుంటున్న వారు, కాంతమ్మకు జరిగిన ఈ అన్యాయాన్ని మాత్రం ఎవ్వరూ సహించలేక పోయారు.  రెక్కలు ముక్కలు చేసుకుని, రెండు దశాబ్దాలుగా మంచానికే పరిమితం   అయిన తన భర్తను పోషిస్తూ, ఎందరికో తలలో నాలికగా తయారయ్యింది.   తానేమి తిన్నా, తినకున్నా, తనపై ఆధారపడ్డ వాళ్ళకి,  ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంది.  అందుకే కర్ఫ్యూ ని సైతం లెక్క చేయక తన బాధ్యతని నిర్వర్తించడానికి బయలుదేరింది . 

 ” మీ ఉప్పు తింటున్న, మీ పప్పు తింటున్న, మీ మేలు కన్నా నేను కోరేదేమీ ఉంటుంది?” అనేది.  కట్టుకున్న వాడు తనకేమీ సంపాదించి పెట్టలేడని తెలిసికూడా,  మొక్కవోని  ధైర్యంతో  తన భర్తకు అందిస్తున్న ప్రేమ, ఆదరణ  ఎంత మంది భర్తలు పొందగలుగుతున్నారు  ఈ రోజుల్లో?   “అందరూ  తెలిసిన మనుషులే  కదా? నన్నేమి చేస్తారు?” అన్న కాంతమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి రవీంద్రకి. తన చుట్టూ మనషుల రూపంలో తిరుగున్న మృగాలు  ఉంటారని తెలుసుకోలేక పోయింది కాంతమ్మ. వారికి అధికారమొక్కటే ముఖ్యం, మనుషుల ప్రాణాలతో లెక్కే లేదు.  అధికార పీఠం కోసం సమాజంలో జరుగుతున్న ఏ ఒక్క అవకాశాన్ని, ఘటనని  వారు వదలుకోరు.  ఏ సంబంధం లేని అమాయకులు ఈ దారుణ మారణహోమాలకి సమిధలవ్వక తప్పదా ?  ఈ రాజకీయ ఘోరకలికి అంతే లేదా ? ”  ఇలా ఎన్నో అర్థం కాని , గమ్యం లేని ప్రశ్నలు తన మదిలో సుడులు తిరుగుతుంటే…  ” అమ్మా …” అన్న  కాంతమ్మ మూలుగుతో వాస్తవిక ప్రపంచంలోకి వచ్చాడు రవీంద్ర.    అతని  ఆనందానికి అంతులేదు.  ఆ ఒక్క మాట తనకు ఎంతో ఎనర్జీనిచ్చింది.  శరీరం పులకరించి పోయింది.  ఆతృతగా  . ”  డాక్టర్ .. డాక్టర్ ”  అని పిలుస్తూ కాంతమ్మ దగ్గరికి పరుగెత్తాడు  రవీంద్ర.   చాలా  సంతోషంగా వున్నాడు.  కాంతమ్మను పలకరిద్దామనుకుంటే  మాటలు రావడం లేదు,  కానీ రవీంద్ర కన్నా ముందే  కాంతమ్మ మెల్లిగా నోరు  తెరచి  కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుండగా, లేని  శక్తి నంతా కూడకట్టుకొని “మా రాజయ్య,  రాజయ్య..ఎట్లున్నాడో ”    రాజయ్య గురించే తన ఆరాటమంతా !  ఆశ్చర్య పడడం  మరోసారి రవీంద్ర వంతయ్యింది.  అతని కళ్ళలో నుండి అప్రయత్నంగా రెండు  ఆనంద భాష్పాలు  నేలరాలాయి. చావు  బతుకుల మధ్య కూడా  తన భర్త గురించే!  అది ఏ  బంధమో ?  ఏ  జన్మ అనుబంధమో? రోజూ చూసే కాంతమ్మ ఇప్పుడు ఒక మహోన్నత వ్యక్తిగా,  భర్త కోసం యమధర్మ రాజుని ఎదిరించిన సావిత్రిలా !  

– వేణు నక్షత్రం 

nakshathram@gmail.com

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

4 Responses to మృగాల మధ్య!(కథ)-వేణు నక్షత్రం

 1. BUCHIREDDY GANGULA says:

  వేణు గారు
  కథ సూపర్ సర్
  ==============================
  బుచ్చిరెడ్డి గంగుల

  • Venugopal Nakshathram says:

   ధన్యవాదములు బుచ్చి రెడ్డి గారు

 2. ashwin says:

  మానవత్వాన్ని మించిన మతమేదీ లేదని నిరూపించారు ఈ కథ ద్వారా . మంచి ప్రయత్నం.

 3. రాజేశ్వరి says:

  చాలా బావుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)