మా నాన్నే విశాల ప్రపంచం (కవిత )- అనిశెట్టి రజిత

మా నాయినమ్మకు మా నాన్న
బంగారు కొండ
మా తాతయ్యకు మా నాన్న
కొండంత అండ
మా అమ్మకు మా నాన్న
నిండైన కుండ
మాకేమో మా నాన్న
ప్రపంచం నిండా..

ఎన్ని కతలు  ఎన్ని వింతలు 
విడ్డురాలతో హాస్యపు జల్లులు 
లోకం తెలిసిన నాన్న చెప్పే
విశేషాలూ  విషయాలూ  వింటూనే
లోకం పోకడలు తెలుసుకున్నవాళ్ళం..

నాన్నను చూసి మానవ సంస్కారం
అలవర్చుకున్నాం
నాన్న వల్ల  సమాజాన్ని పరిచయం
చేసుకున్నాం

ఆడ పిల్లల మైన మేము స్వేచ్ఛగా
రెక్కల ల్లార్చి విహంగించాం
నాన్న ప్రజాస్వామికత  వల్ల

నిశ్చంతగా నియమబద్ధంగా ఎదిగాం.

మా నాన్న జన ప్రేమికుడు
నిత్య చిరునవ్వుల  రేడు
తన భుజాల మీద మమ్మల్నేకాదు
మా ఇంటినీ ఎత్తుకున్న ధీరుడు
సున్నితమైన హృదయాంతరంగుడు
జీవనోత్సాహరాగానికి సాక్షీభూతుడు !

బతుకు వ్యవసాయంలో
కష్టాల గాయాలతో అలంకృతుడు !
నిఖార్సైన కార్మికుడూ కర్షకుడూ !
అనుబంధాలను ఆవిష్కరించినవాడు!
మాకు మా నాన్నే ఈ సుందర
సువిశాల ప్రపంచం అనిపిస్తాడు..

                                             -అనిశెట్టి రజిత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink

One Response to మా నాన్నే విశాల ప్రపంచం (కవిత )- అనిశెట్టి రజిత