అట్టాడ అప్పల్నాయుడు నవలలు ` వస్తు వైవిధ్యం ( సాహిత్య వ్యాసం )-గెడ్డవలస రవికుమార్‌.

ISSN 2278-478

వర్తమాన ఉత్తరాంధ్ర సాహిత్య, సాంస్కృతిక కేంద్ర బిందువు, ఉత్తరాంధ్ర నవలా దీపధారి అట్టాడ అప్పల్నాయుడు గారు 1978లో తన తొలి కథ ‘‘పువ్వుల  కొరడా’’తో సాహితీ రంగ ప్రవేశం చేసి, అప్పటికే ఉత్తరాంధ్ర నేపథ్యంలో రచనలు   చేసిన ప్రముఖులు … రావిశాస్త్రి, భూషణం, కారా మాష్టార్ల ప్రభావంతో అనతికాలంలోనే సుప్రసిద్ధ కథకుడుగా ఎదిగి ‘శతాధిక’ కథలను  వ్రాసి వర్తమాన ‘కళింగాంధ్ర కథ’ను పరిపుష్టం చేశారు.

అప్పల్నాయుడు గారు తన రచనా వ్యాసంగాన్ని ఒక్క కథకు మాత్రమే పరిమితం చేయలేదు. నవల , నాటిక, నాటకం, వ్యాసం, కాలమ్‌ మొదలగు ప్రక్రియలకు విస్తరించారు. “Art is  for art sake “అన్నది ప్రాచీన ఆలంకారికుల మతం . “Art is for society sake “అన్నది ఆధునిక విమర్శకుల అభిప్రాయం .  ఈ సామాజిక దృక్పథంతో తన ప్రక్రియలన్నింటిలోనూ ఉత్తరాంధ్ర నేపథ్యంతో కూడిన వస్తు స్వీకారం చేసి ఆ ప్రాంతపు అస్థిత్వంతో పాఠకులను జాగృతపరుస్తున్న నిత్య చైతన్యశీలిగా అవతరించారు.

అప్పల్నాయుడుగారు వ్రాసిన తొలి నవల ‘పునరావాసం’. ఇది 1996లో వెలువడినది. శ్రీకాకుళ ప్రాంత గిరిజన రైతాంగ పోరాట నేపథ్యంలో సాగినది. శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం దగ్గర్లోని కొండ ప్రాంతం ‘జమ్మొలస’ కేంద్రంగా జీవిస్తున్న సవరలు / గిరిజనులు  పోడు వ్యవసాయం చేసుకుంటూ తమదైన కట్టుబాట్లు, నాగరికతతో జీవనం సాగిస్తుండగా పల్లపు ప్రాంత వ్యాపారులు , నాయకులు వారి ఉత్పత్తులను మరియు వ్యవసాయ భూములను ఆక్రమిస్తారు. అప్పటికే శ్రీకాకుళం కేంద్రంగా సాగుతున్న నక్సల్బరీ ఉద్యమం కారణంగా గిరిజనుల పట్ల సానుభూతి గల ఉద్యమ నాయకులు కొందరు గిరిజనులతో మమేకమై నడిపిన గిరిజన రైతాంగ పోరాటాన్ని ప్రభుత్వం అణచివేస్తుంది. ఉద్యమ నాయకులను నిర్దయగా మట్టు బెట్టింది.

ఉద్యమం అణచివేసిన తరువాత గిరిజనులను ఉద్యమాల నుండి విముక్తి చేసి వారిని జన జీవన స్రవంతిలోనికి తీసుకురావడానికి ప్రభుత్వం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థలను  ఏర్పాటు చేసి వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియలో భాగంగా కోలనీల  నిర్మాణంలో జరిగిన మోసాలు, నాగరికుల చేతుల్లో వంచనకు గురి కావటం, అధికారుల అవినీతి చర్యలు , కాంట్రాక్టర్ల దోపిడీలు , గిరిజన స్త్రీలను చెరచుట వెరసి ‘పునరావాసం’ గిరిజనులకు ఉద్దేశించినదైనా అది అవినీతిపరులకు, దోపిడీదారులకు అడ్డాగా మారిన వైనాన్ని ఈ నవల చిత్రీకరించింది. ఈ పునరావాస ప్రక్రియ ద్వారా అక్కడి గిరిజనుల  జీవితాలు  ఎలా సంక్షోభంలోకి నెట్టి వేయబడ్డాయో ఈ నవల వాస్తవంగా, విమర్శనాత్మకంగా, కళాత్మకంగా ఆవిష్కరించింది.

నవలలోని ప్రధాన పాత్రలు  కంఠుడు అతని మనుమరాలు  బంతి జీవిత సంఘటనల  నేపథ్యంలో రచయిత గిరిజన రైతాంగ జీవన చిత్రణ మరియు వారి సంస్కృతి, నాగరికత, సంప్రదాయాలు , కట్టుబాట్లు, పండుగలు , జీవన సంఘర్షణలు , పోరాటాలు , త్యాగాలు , ‘అన్న లు గిరిజను ల వ్యవహారాలలో నిర్ణాయక పాత్ర పోషించుట మొదలగు అంశాలను సూక్ష్మదృష్టి  తో ఆవిష్కరించారు.

రెండవ నవల ‘ఉత్కళం’ (సూర్యోదయం అని అర్థం). ఇది 2001 లో వెలువడినది. 1947కు పూర్వం ఉత్తరాంధ్రలో నడిచిన జాతీయోద్యమాన్ని ప్రతిబింబించింది. రచయిత జ్ఞాపకం, అధ్యయనాల మీద ఆధారపడి వ్రాయబడిన నవల. పేరులోనే రచయిత ఉద్దేశ్యం వ్యక్తమవుతుంది. నవలలో జాతీయోద్యమంతో పాటు సమాంతరంగా సాగిన జమీందారీ వ్యతిరేక పోరాటోద్యమం కూడా వివరించబడిరది. ముఖ్యంగా మైదాన ప్రాంత  రైతాంగ జీవన చిత్రణ ఇందలి వస్తువు.

నవలలోని పాత్ర కాశియ్య కల్లు గీత కార్మికుడు. ఇతని కొడుకు కరువులో పుట్టినందు వలన కరువోడు అయినాడు. ‘‘నా చిన్నపుడు ఈ భూమి నెవరు పుట్టించారని అడిగేవాణ్ణి, మా నాయిన బదులు  చెప్పలేక పోయేవాడు. పెద్దయ్యాక భూమి ఎవరి చేతిలో ఉందో తెలిసింది. అప్పటికీ యిప్పటికీ తెలిసిన విషయం ఏమిటంటే… పేదా రోదాకి యివి రోజులు  కావు, పేదరికం పోతేగాని బతుక్కి  విలువుండదని !’’ ఇది కరువోడి జీవితానుభవం. అతని అనుభవ సారమే ఉత్కళం నవల.

‘‘ప్రభుత్వమేమి సేయు` ఊరక పన్నులు  వేయు’’ అన్నారు పెన్నేటిపాటలో విద్వాన్‌ విశ్వం. బ్రిటిష్‌ ప్రభుత్వం విపరీతంగా పన్నులు  వేసి సామాన్య రైతులను కృంగదీయుట నవలలోని ఇతివృత్తం. ‘‘ఇదిగో ఈ తెల్ల  దొరలొచ్చిం తర్వాత మరీ ఘోరం’’ అన్నది కరువోడి అవగాహన. ‘‘మునుపు రాజావారూ, వారి బలగమూ, యిపుడు వాళ్లకి తోడు తెల్ల దొరలూ , వాళ్ల బలగమూ కలిసింది. మనకేమి మారింది బతుకు?’’ అన్నది గుంపస్వామి ప్రశ్న. ఇది ఒక చారిత్రక ప్రశ్న. అన్ని పాలనా దశలోనూ కొనసాగుతున్న అసమానతల పై ఒక శ్రమజీవి వ్యాఖ్య ఉత్కళం నవల .

ఈ నవలలో జాతీయోద్యమం ఒక ఎత్తయితే, ఈ ఉద్యమాన్ని చిత్రించే నవలను కొందరు సినిమాగా తీయడం, ఈ నేపథ్యంలో నిర్మాత, డైరెక్టరు, రచయిత మొదలగువారు ఆ నవలలోని ప్రాంతాలలో తిరుగుతూ అక్కడి ప్రజలతో గత` వర్తమానాంశాలను చర్చించటంతో పాటు నవలలోని రైతాంగ ఉద్యమాన్ని షూట్‌ చేస్తుంటే తుది దశలో పోలీసులు  కలవరపడి షూటింగును ఆపివేయించటం మరో ఎత్తు. ఈ సందర్భంలో డైరక్టరును పిలిచి సినిమా యిచ్చే మెసేజ్‌ ఏమిటని అడుగగా ‘‘బానిసత్వం నుంచి స్వాతంత్య్రాన్ని పొందాము. స్వాతంత్య్రాన్ని మనం ఏం చేస్తున్నాము? స్వాతంత్య్రం కోసం చేసిన త్యాగాలేమయినాయి? ఎవరు త్యాగాలు  చేస్తే భోగాలెవరనుభవిస్తున్నారు? ఆలోచించమని మెసేజ్‌’’ ఇస్తుంది అంటాడు. ఇది నవలకు ముగింపు సన్నివేశం.

రాచరికం, ఆంగ్లేయపాలన పోయిన తర్వాత ప్రజాస్వామ్య పాలన ప్రజలకీ, దేశానికీ ఉపకరించలేదన్నది నవలలోని కథకుడి అభిప్రాయం. పరాయి పాలనకు స్వపరిపాలనకు మధ్య చరిత్ర కొనసాగింపును బేరీజు వేసిందీ నవల. పైకి రాజకీయంగా మార్పు వస్తున్నట్లు కన్పిస్తున్నా, ప్రజల జీవితంలో వచ్చిన మార్పు ఏమీ లేదని, దోపిడీ కొనసాగుతూనే ఉందని, అసమ వ్యవస్థలో ఎప్పుడైనా ‘‘కర్రవున్నోడిదే గొర్రె’’ అన్న  కల్లు గీత  కార్మికుడైన కాశియ్య అనుభవం వాస్తవమని ఈ నవల ప్రతిపాదిస్తుంది.

అశోకుని కాలం  నుంచి మొదలైన పరాయిపాలన, దోపిడీ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని నేటికీ ఎలా కొనసాగుతున్నాయో, ఆవిష్కరించి, మన సమాజంలో నిజమైన మార్పు రావలసిన అవసరాన్ని రచయిత గుర్తు చేశారు.

మూడవదైన ‘అనగనగనగా ఒక రాజ ద్రోహం’ నవల 2005లో వెలువడినది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఉత్కళం నవలకు కొనసాగింపుగా వ్రాయబడినది. ఉత్కళం నవల చివరలో స్వతంత్ర జీవితాల  కోసం త్యాగాలెవరు చేశారు ? భోగాలెవరనుభవిస్తున్నారు అన్న ప్రశ్న కన్పిస్తుంది. ‘‘ఇంకొంచెం ముందుకొచ్చాక 1990 తర్వాత మరో పదేళ్ళలో పెద్దమార్పు. సారా బిజినెస్‌, దొంగనోట్ల మార్పిడి, రియలెస్టేట్‌, ఇసుక కాంట్రాక్టింగ్‌, ఇక్కడి సంపదను విదేశాలకు చేర్చు ఏజెన్సీ లు , రకరకాల అన్యాయ పద్ధతుల్లో సంపాదించే వర్గం` దాన్నెవరో  లంపెన్ కేపిటల్‌ అన్నారు. ’’. అని ఉత్కళం నవలలోని జయప్రకాష్‌ వ్యాఖ్యానం.

‘అనగనగనగా ఒక రాజద్రోహం’ నవలలో రాంబిల్లి విశ్వనాథం ఈ లంపెనైజ్‌ అయిన పొలిటీషియన్‌. మన దేశంలో 1990 – `2004 మధ్య ఎల్‌.పి.జి వ్యవస్థ అమలైన తర్వాత రాజకీయాలను ఈ నవల ప్రతిబింబించింది. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, కొన్ని కులాల  రాజకీయాధిక్యత, రాజకీయ కుటుంబాల్లో అధికారం కోసం కొట్లాటలు, అసంతృప్తివాదుల కుట్రలు , గ్రూపులు  మొదలగు అన్ని అంశాలు  నవలలో ప్రస్తావనయ్యాయి. వీటన్నింటికీ ప్రతినిధి రాంబిల్లి విశ్వనాథం పాత్ర.

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోవడాన్ని గూర్చి చెప్పడం ఈ నవలలోని మరో అంశం. రాంబిల్లి విశ్వనాథం మరడాన ధనలక్ష్మిని వివాహం చేసుకోవడం వెనుక ఆమె ఆస్తిపాస్తులు  మరియు ఆమె తండ్రి సీతంనాయుడి సర్పంచి పదవీ ప్రముఖమైన ఆర్థిక/ రాజకీయ   కారణాలగా కన్పిస్తాయి.

గత రెండున్నర దశాబ్దాల  కాలంలో రాజకీయ వ్యవస్థ తన ప్రజాస్వామిక స్వభావాన్ని కోల్పోయి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న స్థితిని ఈ నవల చిత్రించింది. ‘‘ఈ గవర్నమెంటుని నమ్మలేం! మరే గవర్నమెంటుని నమ్మాలి? ఏదయినా దెయ్యాలన్ని ఒకటే, రకరకాలుగా పీక్కుతింటాయి’’. అన్నది వర్తమాన రాజకీయ వ్యవస్థపై నవలలోని పాత్ర సూరప్పడి వ్యాఖ్య. అంతేకాదు ‘‘రౌడీలు  వేరేగా రాజకీయ నాయకులు వేరేగా యిప్పుడున్నారేటి ? పదవిలో ఉంటే నాయకుడూ, పదవి లేకపోతే రౌడీ అంతే! గుడిలోపల వుంటే విగ్రహం, గుడి బయట వుంటే మెట్టు. అదే రాయి అదే తేడా!’’ అన్నది నర్శింహులు  తీర్పు. పదవిలో వుంటే దోచుకు తినడం, పదవి లేనపుడు ప్రజల గురించి, దోపిడీ గురించీ మాట్లాడే అవకాశవాద రాజకీయాల గురించి ఈ మధ్య జి.ఆర్‌. మహర్షి ఒకచోట ‘‘పదవి ఉంటే ధనం` పదవి పోతే జనం’’ అని అన్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో రాంబిల్లి విశ్వనాథం పాత్ర ద్వారా ఈ సత్యాన్ని ఆవిష్కరిస్తుందీ నవల. వర్తమాన రాజకీయ చరిత్రకు విమర్శనాత్మక, కళాత్మక వ్యాఖ్యానం ‘అనగనగనగా ఒక రాజద్రోహం’.

సాధారణంగా ఎవరైనా దేశ ప్రయోజనాలకు/ భద్రతకు/ సార్వభౌమత్వానికి భంగం కలిగించే పనులకు పాల్పడితే అది రాజద్రోహం అవుతుంది . పాలకులే/ నాయకులే ఈ పని చేస్తే ఎవరిది రాజ ద్రోహమని ఈ నవల ప్రశ్నిస్తుంది.

నాలుగవది ” నూకలిస్తాను ” నవల . ఇది 2012 లో వెలువడింది .ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాజెక్టుల పేరుతో , కంపెనీల పేరుతో , నేల మనుషుల్ని నేల నుండి దూరం చేసి వారి బతుకులను చిద్రం చేయడం భారత ప్రభుత్వ అభివృద్ధి నమూనాగా మారిపోయిన వైనాన్ని ఈ నవల చిత్రీకరించింది .  ఉత్తరాంధ్రలో కాపులు  (వీళ్ళు తూర్పు కాపు), వెలమలు , కాళింగులు  అక్కడి వనరుల మీదా, అధికారాల మీదా ఈ కులాల మధ్య సాగిన స్నేహం, సంఘర్షణలలో సామాన్యులు  నలిగిపోవడమే ‘నూకలిస్తాను’ నవలా ఇతివృత్తం. ‘‘లోకంలో రెండే వర్గాలున్నాయి… భయపెట్టే వర్గం, భయపడే వర్గం! మనం మొదటి వర్గానికి చెందినోళ్ళం, భయపెట్టి బతకాలి’’ అని తత్త్వజ్ఞానాన్ని బోధించుకుని బతుకు సాగించాడు నగిరెడ్డి కృష్ణమనాయుడు. యించుమించు ఇదే తత్త్వాన్ని మరో రకమైన పదజాలంతో బోధించుకున్నవాడు లంక  రామినాయుడు. ఈ యిద్దరూ నవలలో మొదట రాజకీయ ప్రత్యర్థులు .

అయితే వీరిరువురి  పిల్లలూ   తండ్రుల తత్త్వసారాన్ని మరింత మెరుగు పరుచుకుని ‘‘భయపెట్టేవారూ, కొల్లగోట్టేవారు ప్రత్యర్థులు  కారాదనీ (ఏకం సత్‌) మరియు ఈ భయపెట్టుట,కొల్ల గొట్టుట దృశ్యమానం కాగూడదనీ (బ్రహ్మ స్వరూపం వలే) సంతానం బోధపరిచింది. యిప్పుడు ఇరువురు నాయుళ్ళూ ప్రత్యర్థులు కారు  -.  కొల్ల గొట్టేవాళ్ళూ, కొల్ల గొట్టబడే వాళ్లు  జీవన నేపథ్యాలను రచయిత ఈ నవలలో వ్యక్తం చేశారు.

పార్వతీ శంకర్రావులు  వెలమ  కులానికి చెందిన పేదలైన భార్యాభర్తలు . పార్వతి స్వయం సహాయక బృంద నాయకురాలిగా రాణించి, భార్యాభర్తలు  కష్టపడి ఇల్లు  కట్టుకుంటారు. గృహప్రవేశం నాటికి కష్టార్జితం పోగా అప్పులు మిగిలాయి . అదే సమయంలో కృష్ణమ నాయుడి కొడుకు  మంత్రి దృష్టి ఊరిలోని పంతులు చెరువు భూమి పై పడింది .  అక్కడ ఫ్యాక్టరీని నిర్మించాలని అతడి ఆలోచన. అయితే అక్కడి సామాన్య రైతులు  అంగీకారం కావాలి. అందులోనూ పార్వతి దంపతుల  ‘భూమి నిర్ణయం’ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో గృహ ప్రవేశానికని వచ్చిన ముత్యాలమ్మ (పార్వతి అత్త) కుమార్తెల  వివాహ ప్రస్థావన ద్వారా కూన దశరథుడు ఎలాగైనా పంతుల చెరువు భూమిని అమ్మించేలా చేయాలని ప్రణాళిక రచిస్తాడు. చివరికి పార్వతీ శంకర్రావులు గృహప్రవేశం జరుగకుండానే రైతు కూలీలుగా చెన్నయ్‌ మెయిలు లో వలస పోతారు.

స్వతంత్రం వచ్చిన ఆరు దశాబ్దాల  తర్వాత కూడా పాలకులు  దేశ ప్రజలకు స్థిరమైన, నమ్మకమైన జీవితాన్ని కల్పించలేకపోవడం, చిన్న సంస్కరణలనే గొప్పవిగా ప్రచారం చేసుకుంటూ కాకుల్ని కొట్టి గద్దలకు వేసే రాజకీయ కుతంత్రాలను వాస్తవికంగా ఈ నవల ఆవిష్కరించింది.

గెడ్డవలస రవికుమార్‌.

పరిశోధకుడు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

బొమ్మూరు .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

సాహిత్య వ్యాసాలు ​, , , , Permalink

Comments are closed.