మేఘసందేశం-06 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

భరతఖండంలో కవి అనగానే కాళిదాసు జ్ఞాపకం వస్తాడు. కవి అంటే అతనే. కవిత్వం అంటే అతనిదే. కవిత్వం అంటే రసికులు రుచి మరిగేటట్లు చేసినవాడు అతనే. అందుచేతనే కవికుల గురువు కాళిదాసు. అతని కవితాశోభను గురించి ఎవరు వివరంగా వర్ణించి చెప్పగలరు? ఆ పని చేయడంలో కొంతవరకూ కోలాచల మల్లినాథ సూరికి చెల్లింది. కాని, రమణీయార్ధ ప్రతిపాదకములైన అతని కావ్యాలు వ్యాఖ్యానించడం వివరించడం ఎవరి చేతనవుతుంది. సాహిత్యంలో అంతో, ఇంతో అభినివేశం కల్పించుకోవాలనుకునే ప్రతివాడూ కాళిదాసు కావ్యాలు అధ్యయనం చేయవలసిందే. లేకపోతే అతని సాహిత్య జ్ఞానం మిడిమిడి జ్ఞానం క్రిందనే లెక్క! కాళిదాసు సాక్షాత్తూ సరస్వతి – సందేహం లేదు. మల్లినాథుని విషయానికి వస్తే మల్లినాథ సూరి లేదా మల్లినాథుడు ఎంతో ప్రసిద్ధిగాంచిన తెలుగు కవి, సంస్కృత విమర్శకుడు. అతను విమర్శకుడిగా బాగా పేరు పొందాడు. సంస్కృతంలోని పంచమహాకావ్యాలకూ అతడు రాసిన భాష్యాలు ఆయనకి పేరు తెచ్చి పెట్టాయి. మహామహోపాధ్యాయ మరియు వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదులు పొందిన వ్యక్తి ఈయన. ఇతను రాచకొండరాజైన సింగభూపాలుడు మరియు విజయనగరాన్ని మొదటి దేవరాయలు పాలిస్తున్ననాటి వాడు. అతని రాతలను బట్టి అతను 1350-1450 మధ్య కాలపు వాడని తెలుస్తోంది. ఆయన పాఠక భేదాలను, వ్యాఖ్యల బేధాలను తెలుసుకొని చర్చించి మంచి చెడు తేల్చి వాటిలో గుణగ్రాహకమైన వాటిని స్వీకరించాడు.

సరైన పాఠాన్ని గ్రహించటానికి మల్లినాథుడు మూడు పద్ధతులు పాటించాడు.

1.ఒక్కోసారి వాటిని గూర్చి ఊరికే చెప్పటం.

2.మరోసారి వాటిని క్షుణ్ణంగా చర్చించి నిగ్గు తేల్చటం.

3. తనకు నచ్చిన పాఠాన్ని గ్రహించి మిగిలిన వాటిపై వ్యాఖ్యానం రాసిన వారినీ తిరస్కరించటం.

ఆయన వ్యాఖ్యానాలు ప్రామాణికాలుగా చెలామణిలో ఉన్నై. మనం మేఘసందేశంలోకి వద్దాం. యక్షుడు మేఘునికి మార్గ వివరాలను రాబోయే సుందర దృశ్యాలను చెప్పడం కొనసాగిస్తున్నాడు.

శ్లో.21. నీపం దృష్ట్వా హరితకపిశం కేసరై రర్ధరూఢై
రావిర్భూతప్రథమముకుళా: కందళీ శ్చానుకచ్ఛం
జగ్ధ్వారణ్యే ష్వధికసురభిం గంధ మాఘ్రాయ చోర్వ్యా:
సారంగాస్తే జలలవముచ: సూచయిష్యంతి మార్గం.

దీని భావం:

సారంగాలు అంటే అడవి సగం మొలిచిన కేసరాలతో, కింజల్కములతో అనగా పూవుల మధ్యభాగంలో సన్నని కాడ వంటిది ఉన్న పూలతో, కపిశవర్ణంగల అనగా ఆకుపచ్చ నలుపు ఎఱుపు రంగుల మిశ్రమంతో ఉన్నటువంటి నేలకడిమి పువ్వులను చూసి, తడినేల ఉన్న పచ్చికపట్టుల్లో మొలిచిన తొలిమొగ్గలుగల నేలఅరటిచెట్లను తిని, అక్కడి వనాలలో ఉన్న మిక్కిలి సువాసన గల భూమి యొక్క గంధాన్ని ఆఘ్రాణించి నీటి బిందువులు కురుస్తున్న నీ మార్గాన్ని సూచిస్తాయని ఎంత సుందరంగా చెప్పాడో చూడండి కాళిదాసు.

ముఖ్యమైన అర్ధములు: సారంగా: = జింకలు; కేసరై: = కింజల్కములతో; నీపం = కడిమి చెట్టు; జగ్ధ్వా = తిని; జలలవముచ: = నీటి తుంపరను వదలుతున్న; సూచ`ఇష్యంతి = తెలుపగలవు.

శ్లో.22.అంభోబిన్దుగ్రహణచతురాం శ్చాతకా౯ వీక్షమాణా:
శ్రేణీభూతా: పరిగణనయా నిర్దిశన్తో బలాకా:
త్వామాసాద్య స్తనితసమయే మానయిష్యంతి సిధ్ధా:
సోత్కంఠాని ప్రియసహచరీ సంభ్రమాలింగితాని.

దీని భావం:

ఓ మేఘుడా! నీవు వర్షించేటప్పుడు చినుకుల్ని పట్టుకోవడంలోనేర్పుగల చాతకపక్షుల్ని చూస్తున్నటువంటి బారులు తీరిన కొంగలను లెక్కపెడుతూ చేతుల్తో చూపుతున్న సిద్ధపురుషులు, నీవు ఉఱిమినప్పుడు ఉత్కంఠతో కూడుకొన్న ప్రియురాండ్ర సంభ్రమ ఆలింగనాలను పొంది, నిన్ను పూజించగలరు. ఉరుము ఉఱిమినప్పుడు ఆడవాళ్ళు భయపడి మొగవాళ్ళను కౌగలించుకోవడం అంటే భార్య అడక్కుండానే వచ్చి కౌగిలించుకొంటే మగవాళ్లకు చాలా గొప్ప ఆనందం కదా! అంతకంటే కావలసినదేమున్నది చెప్పు? అందువల్ల దానికి కారణమైన నిన్ను విశేషించి పూజిస్తారు సుమా! అని మేఘుడిని పొగిడి బుట్టలో పడేసి తన కార్యం జరుపుకుందామని యత్నిస్తున్నాడు యక్షుడు.

ముఖ్యమైన అర్ధములు: అంబోబిందు = నీటిచుక్కలను; కేసరై: = కింజల్కములతో; నీపం = కడిమి చెట్టు; జగ్ధ్వా = తిని; జలలవముచ: = నీటి తుంపరను వదలుతున్న; సూచ`ఇష్యంతి = తెలుపగలవు.

శ్లో. 23. ఉత్పశ్యామి ద్రుతమపి సఖే మత్ప్రియార్ధం యియాసో:
కాలక్షేపం కకుభసురభౌ పర్వతే పర్వతే తే
శుక్లాపాంగై: సజలనయనై: స్వాగతీకృత్య కేకా:
ప్రత్యుద్యాత: కథమపి భవాంగంతుమాశు వ్యవస్యేత్

దీని భావం:

ఓ నా స్నేహితుడా! నా ప్రీతి కోసం వేగంగా వెళ్ళదలచిన వాడివైనా, నీకు కొడిసె పూలచేత పరిమళిస్తున్న ప్రతి పర్వతమందు, బాగా చక్కని కాలక్షేపం అవుతుందని ఊహిస్తున్నాను. నిన్ను చూసిన ఆనందంతో, కనుల నీరు క్రమ్మి ఆనందబాష్పాలతో కూడిన నేత్రాలుగల మయూరాలు తమ చిరు చిరు కేకలచేత నిన్ను స్వాగతం స్వాగతం అని ఎదురుసన్నాహం చేసి పూజిస్తాయి సుమా! అయ్తే నువ్వు వాటిని అందుకొంటూ అక్కడే ఉండక శీఘ్రంగా బయలుదేరి వెళ్లడానికి ప్రయత్నించు మేఘుడా!

ముఖ్యమైన అర్ధములు: హేసఖే = ఓ మిత్రమా; మత్ప్రియార్ధం = నాకు ప్రియము చేయుటకు; ఉత్పశ్యామి = ఊహిస్తున్నాను; శుక్లాపాంగై: = తెల్లని కనులుగల నెమళ్ళు; ప్రత్యుద్యాత: సన్ = ఎదురుకోలు చేయబడి; వ్యవస్యేత్ = పూనుకొనవలెను.

శ్లో.24. పాండుచ్ఛా యోపవనవృతయః కేతకై స్సూచిభిన్నై
ర్నీ డారంభైర్గృహబలిభుజామాకులగ్రామచైత్యాః,
త్వయ్యాసన్నే పరిణతఫలశ్యామజంబూవనాంతాః
సంపత్స్యంతే కతిపయదినస్థాయిహంసా దశార్ణాః

దీని భావం:

మేఘుడా! నీవు దశార్ణదేశాల్ని చేరేటప్పటికి అ దేశాల తోటలు బాగా పూచినటువంటి మొగలిపువ్వులకాంతులతో స్వఛ్చంగా తెల్లగా ఉంటాయి. గ్రామాల్లో ఉన్నటువంటి రచ్చచెట్లు, కాకులు మొదలైన పక్షులు గూళ్ళు కట్టుకోవడంవల్ల కదులుతూంటాయి. నేరేడుచెట్లు ఫలాలతో మంచి నీలంగా ప్రకాశిస్తూ ఉంటాయి. హంసలు మాత్రం ఇక కొన్నిరోజులే అక్కడ ఉంటాయి.

ముఖ్యమైన అర్ధములు: త్వయి = నీవు; ఆసన్నేసతి = సమీపించగా; కేతకై: = మొగలి పూవులతోకూడినవి; నీడారంబై: = గూళ్ళు కట్టుకోవడం అనే పనులచేత; సంపత్స్యంతే = కాగలవు.

శ్లో.25. తేషాం దిక్షు ప్రథితవిదిశాలక్షణాం రాజధానీం
గత్వా సద్యః ఫల మవికలం కాముకత్వస్య లబ్ధా,
తీరోపాంత స్తనితసుభగం పాస్యసి స్వాదు యత్త
త్సభౄభంగం ముఖమివ పయో వేత్రవత్యా శ్చలోర్మి.

దీని భావం:

మేఘుడా! విను. దశార్ణదేశాలకు రాజధానియైనటువంటి విదిశాపట్టణం అన్ని దిక్కుల్లోను చాలా ప్రసిద్ధిచెందినది. అక్కడికి నీవు పోయినప్పుడు కాముకునికి కలుగు ఫలమంతా కలుగుతుంది. ఎలా అంటావా? ఆ పట్టణ సమీపంలో అక్కడ వేత్రవతి అనే గొప్ప నది ప్రవహిస్తోంది. అది మధురమైన తరంగాలతో కదులుతూంటుంది. దాని నీటిని బొమ్మముడితో కూడుకొన్న ప్రియురాలి అధరంలాగా తిన్నగా ఉఱుముతూ పానం చెయ్యి. అనగా అలా చేసినప్పుడే కాముకఫలం కలుగుతుందని యక్షుడు చమత్కారంగా చెప్తున్నాడు.

ముఖ్యమైన అర్ధములు: దిక్షు = దిక్కులయందు; ప్రథిత = ప్రసిద్ధమైన; తేషాం = ఆదశార్ణ జనపధముల; కాముకత్వస్య = కాముకుడైనదానికి; వేత్రవత్యా: = వేత్రవతీ నదియొక్క; చల్మోరి = కదులుతున్న అలలుగల; సభ్రూభంగం = బొమ్మముడితోగూడిన; పాస్యసి = త్రాగగలవు.

ముఖ్యమైన అర్ధములు: ఆరూఢం = యెక్కి ఉన్న; పధికవనితా: = ప్రవాసంలో ఉన్న వనితలు; ఉద్గృహీతా: = పైకి లాగబడిన; అలకాంతా: = కురుల కొనలు; అశ్వసంత్య = ఊరడిల్లినవారై; ప్రేక్షిస్యంతే = చూడగలరు; జాయాం = భార్యను; ఉపక్ష్యేత = నిర్లక్ష్యం చేయగలడు ?

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Comments are closed.