గజల్ కాదు గజ్జి (గలీజ్ )శ్రీనివాస్ లాంటి సంఘటనలు ఇంకా ఎన్నాళ్ళు ?- భండారు విజయ.

గజల్ శ్రీనివాస్ గలీజు జీవితం ఇప్పుడు కుమారి పరచిన ప్రపంచ పుస్తకం. గతంలో అతనిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికినీ సాక్షాధారాలు నిరూపించ బడక పోవటంతో అతనిపై ఎటువంటి కేసులు నమోదు కాలేక పోయాయి. మెడిపండు చూడ మేలిమై వుండు పొట్టవిప్పిచూడ పురుగులున్నట్లుగా గజల్ లోపలి గుజ్జంతా గజ్జిరూపంలో ఇలా బయటపడటం చాలామందిని ఆశ్చర్య పరిచింది. చాలామందైతే ఇప్పటికీ నమ్మశక్యం కావట్లేదని వాదించేవారు ఉండటం ఇంకా పచ్చినిజం. అలాంటి గజల్ శ్రీనివాసు లోపలి అపరిచితుడిని చాలా తెలివితో, ధైర్యంతో, ఆత్మనిబ్బరంతో, సహన, సమయానుకూలతతో ఆమె చూపించిన తెగువ అద్భుతం.

పిల్లిని ఒక గదిలో వేసి బంధిస్తే పులి పిల్లై ఎలా ఎదురు తిరిగి తనను తాను రక్షించుకొనే ప్రయత్నం చేస్తుందో సరిగ్గా ఆమె అలాగే ప్రతిస్పందించి నిజాన్ని భయటపెట్టానని ఆత్మస్థైర్యంతో చెప్పటం వెనుక ఆమె ఆత్మగౌరవం దాగివుండడటం ముదావహం. ఆమె పుట్టి పెరిగిన వాతావరణం, సంప్రదాయం, సంస్కృతీ, విద్యాబుద్దులు చాలామందిని అబ్భురపర్చటమే కాదు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పరిపూర్ణమైన పరిపక్వతతో ఆమె చెప్పే ప్రతి మాట ఒక తూటాలా పేలాటం నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలవంచవల్సి వచ్చింది.. ఒక టీవీ చానల్ కు నేను కూడా వెళ్ళటం జరిగింది.

ఆధ్యాత్మిక ముసుగులో వి ఐ పిలుగా, బడాబాబులుగా, పెద్దమనుషులుగా, ఆదర్శమూర్తులుగా, బాబాలుగా, ప్రవచకులుగా లేదా బోధకులుగా, మహారాజులుగా, స్వామిజీలుగా సమాజంలో కీర్తించబడుతున్న అనేకానేక మహానుభావుల చరిత్రలన్నీ స్త్రీలను నీచాతినీచంగా కించపర్చుతూ, శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, లైంగికంగా హింసిస్తూ ఉన్నవే. అందులో గజల్ శ్రీనివాసు మొదటివాడు కాదు చివారివాడు కూడా కాదు. ప్రలోభాపేక్షలు చూపి నయాన, భయాన లొంగ దీసుకొని తమ తుచ్ఛమైన కోరికలు, అవసరాలు తీర్చుకోవటానికి స్త్రీలను పావులుగా లేదా వస్తువులుగా ఉపయోగించుకోవటం వెనుక తరతరాల పితృస్వామిక భావజాలం బాగా పనిచేస్తుందని..దానిని బద్దలు కొట్ట వల్సిన అవసరం ఎంతైనా ఉందని..దానిని గజల్ శ్రీనివాస్ విషయంలో చాలా చాకచక్యంతో కుమారి చేయగల్గటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిoదని..ఆమెను అభినందించటం ఆ చానల్ ముఖంగా జరిగింది..

మనువాదాన్ని నెత్తిన పెట్టుకుంటూ పితుస్వామ్య వ్యవస్థను అమలుచేస్తున్న దేశంలో స్త్రీలు నస్వతంత్రులుగా అణచివేయ
బడుతుండటం, దానిని ఒక కట్టుదిట్టమైన పథకంతో అమలు పర్చటానికి లేదా రుద్దటానికి ఇలాంటి సంఘటనలు ఉపకరిస్తూ వస్తున్నాయని చెప్పవచ్చు. అన్ని ఆధారాలతో, సాక్షాలతో ఒక బాధితురాలు పోలీసుల వద్దకు వెళ్లి వాటిని చూపి కేసును నమోదు చేసిందంటే ఆమె నిజాయితీ, నిబద్దతలను గుర్తించ కుండా చాలామంది గజల్ శ్రీనివాసు గారి మూర్ఖ అభిమానులు, ఆయనగారి స్నేహ శిఖామణులు తిరిగి ఆ అమ్మాయిపై డాడీ చేయటం, ఆమె వెనుక ఏవో శక్తులు ఉన్నాయని, రాజకీయ ఎత్తుగడులలో భాగమని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆమెను తప్పుపట్టే ప్రయత్నం చేయటం వారి పురుష అహంకారానికి నిదర్శనం. అందుకు ఆంధ్రప్రదేశ్ ఓ మంత్రిగారు గజల్ శ్రీనివాసుకు మంచి వ్యక్తీ అని కితాబులు ఇవ్వటం సదరు నేరస్తుడిని కాపాడాలనే ఉద్దేశ్యం కాకా మరేం ఉంటుంది?.

బాధితురాలు అంత స్పష్టంగా కేవలం నాలా మరో స్త్రీ అతని భారిన పడకుండా వుండటం కోసమే నేను ఇంత శ్రమకోర్చి సాహసోపేతమైన పని చేసానని చేబుతుంటే, శ్రీనివాసు గారి స్నేహితులకు, హితులకు పాపం కోపం బాగా వస్తోంది. ఆమెకు ఇష్టం లేకపోతే ఆమె అక్కడినుండి వెళ్ళిపోవచ్చు కదా అని అమాయకంగా అడగటం మీడియాలో చుసిన వారిని చాలా ఆశ్చర్య పరుస్తోంది. .. చేసిన పాపం తలా పిడికెడు అన్నట్లుగా ,,పాపం అమాయక చక్రవర్తిని ఇంకా అందలమేక్కిద్దామని చూడటం సిగ్గుపడవలసిన విషయం. అంటే పురుషులు కోరితే కోర్కె తీర్చేయాలి. లేకుంటే అక్కడినుండి నోరు మూసుకొని తప్పుకొని వెళ్లిపోవాలి అంతేగాని పేరు, ప్రతిష్టలున్న పెద్దమనిషి పరువును ఎలా తీస్తారన్న పురుషాహంకార ప్రశ్నలను సంధించటం ఇంకా ఎప్పుడు మానుకుంటారో అర్ధంకాని స్థితి నేడు సమాజంలో ఇంకా నెలకొని వుండటం శోచనీయం. అలాగే ఉండాలన్నశ్రీనివాస్ స్నేహితుల సమర్ధింపు మాటలు అందుకు ఉదాహరణలు.

కోతికి కొబ్బరికాయ ఇచ్చిన చందంగా మన కొన్ని తెలుగు టీవి చానళ్ళ వారికి ఈ సంఘటన పండుగ వాతావరణాన్ని అందించింది . కాస్త సాక్షి టీవి యాంకర్ స్వప్న బాధితురాలి పేరును ప్రకటించకుండా గుంబనంగా, మార్దవంగా, అనునయంగా, ధైర్యాన్ని ఇస్తూ ఆమెనుండి చాలా విషయాలు చెప్పించగల్గింది. ఇలా అనటం కన్నా బాధితురాలే చాలా స్పష్టమైన అవగాహనతో ఏది చెప్పవచ్చు, ఏది చెప్పరాదో కూడా నిర్ణయించుకొని మరీ ఆ అమ్మాయి చెప్పటం జరిగింది. చాలా మటుకు స్వప్న (యాంకర్) హుందాగా వ్యవహరించింది. ఇక NTV యాంకర్ మాత్రం ఆమె పేరును ఉచ్చరిస్తూ కనీస సభ్యత, గోప్యత లేకుండా ఆమెను నకశిఖ పర్యంతరం స్క్రుటినీ చేసినట్లుగా, పోలీసులు కూడా చేయలేదేమో ఆ అమ్మాయిని అన్నంతగా ఇంటరాగేషన్ చేసిందనే చెప్పవచ్చు. ఆమె వేసిన ప్రశ్నలన్నీ అభ్యంతరకరమైనవే. గుచ్చి గుచ్చి అడుగుతున్నానని అనుకోకు అలా అడిగేది నాకోసం కాదు నిన్ను ఇలాకూడా విమర్శిస్తారుకదా అంటూ తనను తాను కప్పిపుచ్చుకుంటూ చాలా ఉచ్చుకత చూపటం టీవి వీక్షించే వాళ్లకు ఎబ్బెట్టుగా అనిపించటం..చాలామంది ఈ విషయంలో చర్చలు కూడా జరపటం విచారకరం.

అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం చాలా స్పష్టంగా, అదరకుండా బెదరకుండా, ఎవరినీ అవమానపర్చకుండా, కించపరచకుండా తన ఈ స్థితికి కారణమైన గజల్ శ్రీనివాసును కూడా దూషించకుండా సార్ అని సంబోధించటం నిజంగా ఆమె సంస్కారానికి నిదర్శనం . ఒక్క భాషాదోషం లేకుండా హుందాగా తన అభిప్రాయలు చెప్పటం వెనుక ఆమె ఆత్మస్థైర్యం దాగివుంది. ఆడపిల్లలు ఎప్పుడు పురుషుల మనోభావాల కింద అణిగి మణిగి ఎందుకు వుండాలి అ/, స్త్రీలు ఎమన్నా పురుషుల లైంగిక వాంచలు తీర్చే వస్తువులా? పురుషుల్లాగే స్త్రీలు అన్నింట్లో వారితోపాటు ఎందుకు సమానులు కారు? స్త్రీలు ఆత్మగౌరవంతో బతుక కూడదా? ఎప్పుడు స్త్రీలు పురుషుల అహంకార క్రీనీడల్లోనే జీవించాలా? లాంటి ప్రశ్నలతో పాటు ఒక అమ్మాయి ధైర్యంతో, సాహసంతో ఎన్నో కష్టాలు శ్రమలకు ఓర్చి నిజాన్ని సాక్షాధారాలతో పాటు ప్రవేశపెడితే నన్ను అభినందించి నాకు సపోర్టు ఇవ్వవల్సినది పోయి నన్ను ఆత్మన్యునతాభావంలోకి నేట్టివేయాలని ప్రయత్నించటం, అలాంటి ప్రశ్నలు మీడియా వాళ్ళు కూడా వేయటం ఏ సభ్యతకిందకు వస్తుంది? నాలాగే మీ ఇంట్లో మీ చెల్లెలో, అక్కో, అమ్మో అవమానాలు పడితే, ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తే మీ వాళ్ళను మీరు ఇప్పుడు నన్ను వేస్తున్న ప్రశ్నలే వేస్తారా? ఇదే మీ సంస్కారమా? అదే మానవత్వమా? వంటి ఘాటు ప్రశ్నలను కురిపించి తన మనోధైర్యాన్ని ప్రదర్శించిన బాదితురాలుకు సభ్య సమాజం అండగా నిలిచి ఆమెకు న్యాయం జరిగేంతవరకు ఆమె పోరాటంలో భాగస్వామ్యం కావటం ఇప్పుడు మనముందున్న కర్తవ్యం. గజల్ శ్రీనివాస్ వంటి గోముఖవ్యాఘ్రాల బారిన పడకుండా అమ్మాయిలను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైన వుంది. అoదుకు మనం కుమారికి అండ దండలను అందించ వల్సిన అవసరం ఎంతైనా వుందని చెప్పక తప్పదు.

– భండారు విజయ.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలుPermalink

Comments are closed.