ప్రశ్న (కథ) – గీతాంజలి

స్వరూప స్కూటర్ని వేగంగా నడిపిస్తోంది. స్వరూప మనసు అతలాకుతలం అయిపోతోంది. పద్మ తల్లిదండ్రుల మీద ఆశ్చర్యం, కోపం, అసహ్యం కలగలిసిన భావంతో ఆమె చాలా అనిశ్చితంగా ఉంది. పదిహేను రోజుల క్రితం ఎనిమిది సంవత్సరాల పద్మని వాళ్ళ కాలనీ యువకుడే అయిన పదహారు సంవత్సరాల రమేశ్‌ స్కూల్లో చాక్లెట్లు పంచిపెడుతున్నారని అబద్ధం చెప్పి నిర్మానుష్యమైన స్కూల్లో సాయంత్రం వేళ తరగతి గదిలో పద్మపై లైంగిక అత్యాచారం చేశాడు. తర్వాత విపరీతమైన రక్తస్రావంతో స్పృహ తప్పిన పద్మని కర్రలతో విపరీతంగా కొట్టి చంపేసాడు. ఈ వార్త నగరంలో తీవ్రమైన సంచలనాన్ని రేపింది. పత్రికలన్నీ బానర్‌ వార్తగా ప్రచురించాయి. మహిళా సంఘాలన్నీ తీవ్రంగా ఖండించాయి. ‘వెలుగు’ పక్ష పత్రిక సబ్‌ ఎడిటర్‌గా తాను రిపోర్టింగ్‌కి వెళ్ళింది. పద్మ తల్లిదండ్రులు బిడ్డపై జరిగిన పాశవిక అత్యాచారం, హత్యలతో తల్లడిల్లి కన్నీరుమున్నీరై పోతున్నారు. పద్మని హతమార్చింది ఎవరో తెలియటం లేదు. పద్మ తల్లిదండ్రులతో పాటు అందరూ ”మాకేం తెలీదు, మాకేం తెలీదు” అన్నారు. పది రోజులు గడిచిపోయాయి. పద్మని రేప్‌ చేసి చంపింది వాళ్ళ కాలనీ యువకుడు రమేశ్‌ అని పోలీసుల పరిశోధనలో తేలింది.

తను ఈ రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళింది. పద్మ తల్లిదండ్రులు హాస్పిటల్‌ వెళ్ళారనీ అరగంటలో వస్తారనీ పక్క ఇంటివాళ్ళు చెప్పిన సమాచారం స్వరూపని దిగ్భ్రాంతిలో ముంచింది. మనిషి కోపంతో వణికిపోయింది. అసలు పద్మపై అత్యాచారం చేసి హత్య చేసింది రమేశ్‌ అని పద్మ తల్లిదండ్రులకు రెండు రోజుల తర్వాత తెల్సిందట. రమేశ్‌ తల్లిదండ్రులు తమ కొడుకు జీవితాన్ని కాపాడమనీ… పద్మ అక్క లత పెళ్ళికి ఉందనీ ముఫ్పై వేలు వాళ్ళకు అప్పజెప్పారట. బీదరికంతో మగ్గిపోతున్న వాళ్ళకు అంత డబ్బు చూసేసరికి బిడ్డపై జరిగిన అన్యాయం చాలా చిన్నదిగా అన్పించిందో.. ఇప్పుడిక ఏం లాభం లేదని అన్పించిందో… వాళ్ళతో చేయి కలిపి రమేశ్‌ పేరు బైటికి పొక్కనీయలేదు. ఆర్థిక పరిస్థితులు మనిషిని ఎంత హేయమైన స్థితికైనా తీసుకువెళతాయి… అత్యాచారానికి గురైన పద్మ అరుపులు, భయం, ఆక్రందనలు, కర్రలతో మోది చంపినప్పటి బాధాపూరితకేకలు… వీళ్ళకి అర్థం అయ్యేవుంటాయి… కానీ… కానీ… దరిద్రమూ వర్ధిల్లూ! స్వరూప ఆక్రోశంతో పద్మ వాళ్ళింటికెళ్ళి పద్మ తల్లిదండ్రుల్ని చడామడా తిట్టింది. వాళ్ళు కిమ్మనలేదు. పద్మ తండ్రి కళ్ళలో తెగించిన కాఠిన్యం… తల్లి కళ్ళలో నిస్సహాయపు కన్నీటి సంద్రం… ఆవేశంలో… ఆవేదనలో స్వరూప మనసు చిన్నాభిన్నం అయ్యింది. దారుణంగా చనిపోయిన చిన్నారి పద్మ కళ్ళ ముందు కదలాడుతోంది. రమేశ్‌ చేసిన పని కన్నా… పద్మ తల్లిదండ్రులు చేసిన పని అత్యంత దారుణంగా… మానవతకు… మానవ సంబంధాలకే మాయని మచ్చగా కనిపిస్తోంది. రిపోర్టింగ్‌ చాలా ఘాటుగా రాయాలి అని మనసులో అనుకుంది స్వరూప. ‘అయినా ఏం లాభం?’ నీరసంగా మళ్ళీ తనే అనుకుంది…

ఇంటి కాంపౌండ్‌లో స్కూటర్‌ పార్క్‌ చేసి లోపలికి వచ్చింది స్వరూప. డ్రాయింగ్‌ రూంలో స్వరూప ఆరేళ్ళ కూతురు నీహారిక టివిలో వస్తున్న ‘తూ ఛీజ్‌ బడీహై… మస్త్‌… మస్త్‌’ పాటకీ తానూ గొంతు కలిపి పాడేస్తోంది. సుధీర్‌ చేతిలో ఏదో పుస్తకంతో ఉన్నాడు. స్వరూపకు చిర్రెత్తుకొచ్చింది. వెళ్ళి టీ.వి. ఆఫ్‌ చేసింది. ‘ఆడుకో ఫో!” నీహారికను కసిరింది స్వరూప. నీహారిక సోఫాలోంచి ఛటుక్కుని లేచి మళ్ళీ టీ.వి. బోయింది. స్వరూప ”నీహారీ… వెళ్ళి ఆడుకో” కఠినంగా అంది. తల్లిగొంతులోని కాఠిన్యం నీహారికని మళ్ళీ టీ.వి. పెట్టనీయలేదు. ఇవే కదూ… ఈ పాటలూ… అశ్లీలాన్ని గుప్పించే మల్టీ ఛానల్స్‌ చూస్తూ… వెర్రిక్కిపోయి… యువకులు… ఏమీ చేయలేని ఎదిరించే సత్తాలేని బలహీనులైన పసిపాపల్ని… తమ కామానికి బలి చేస్తున్నారు. ”నాకేం తెచ్చావమ్మా”… గారాబంగా అడుగుతోంది నీహారిక… ”రేపు తెస్తా… ఈ రోజు వీలు కాలేదు.”

స్వరూప నీరసంగా సోఫాలో వాలింది. ”నువ్వెప్పుడూ ఇంతే”… బుంగమూతితో ఆటకు బయటకు వెళ్ళిపోయింది నీహారిక!

వొచ్చినప్పట్నుంచీ స్వరూప చిరు కోపాన్ని చూస్తున్న సుదీర్‌ లోపలికెళ్ళి చల్లని మంచి నీళ్ళు అందించాడు. తాగాక కాస్సేపు సేదదీరినట్లు అన్పించింది స్వరూపకు.

”ఏమయ్యింది నీ ఇంటర్వ్యూ…” పక్కన కూర్చుంటూ అడిగాడు సుధీర్‌! ఆవేదనతో… ఆవేశంతో… తను సేకరించిన వాస్తవాల్ని చెప్పింది స్వరూప! ఆశ్చర్యంతో… నోట మాటారానట్లు కూర్చుండిపోయాడు సుధీర్‌.

తర్వాత మెల్లగా… ”రిలాక్స్‌ రూపా! స్నానం చేసి రా…ఈ లోపల నేను అన్నం వేడి చేస్తాను” అన్నాడు వంట చేసానని సూటిగా చెప్పకుండా! భోజనం దగ్గర కూడా పర్యవంగా వున్న స్వరూపని మధ్య మధ్యలో మాట్లాడిస్తూ… కొద్దిగా తినేటట్లు చేశాడు సుధీర్‌!

”అమ్మా… నీకంటే నాన్నే వంట బాగా చేస్తాడు. ఆలుగడ్డ కూర ఎంత బాగుందో” కళ్ళు గుండ్రంగా తిప్పుతూ… ఇష్టంగా తింటూ అంటున్న నీహారిక లేత మొఖం… రెండేళ్ళే… రెండంటే రెండేళ్ళే నీహారిక కంటే పద్మ పెద్దది… ఎందుకో మళ్ళీ గుండె పట్టేసినట్లుగా ఊపిరాడినట్లుగా… అన్పించింది స్వరూపకు!

రాత్రి పదకొండున్నరదాకా… రిపోర్ట్‌ తయారు చేసి కూతుర్ని హత్తుకుని పడుకుంది స్వరూప అయినా నిద్రపట్టడం లేదు. మనసు అల్లకల్లోల సముద్రంలా ఎగిసి ఎగిసి పడుతోంది.

ఏమిటీ అత్యాచారాల పర్వం? రోజు రోజుకీ స్త్రీలపై ఎక్కువ అవుతూ… అందునా పసి ఆడపిల్లలపై! పాల వాసన కూడా మరవని మూడేళ్ళ పసిపిల్లల్ని కూడా వదలని పైశాచిక కాముకత్వం? చాక్లెట్‌ తిన్పిస్తారనో… బొమ్మలు ఇస్తారనో… ఎత్తుకు తిప్పుతారనో… ఎదురు చూసే పసిపిల్లల్ని అమానుషంగా నలిపేసే మగమృగాల పైశాచికత్యం! ఏమవుతుందో కూడా అర్థం కాక… తప్పించుకునే వీలుగాక. రెండు కాళ్ళ మధ్య రక్తస్రావంతో, గాయంతో… నొప్పితో విలవిల్లాడే పసికూనల బాధ వాళ్ళకు పట్టదా? ఉచ్చ పోయడానికి పనికొచ్చే భాగంగా మాత్రమే తెలిసిన తమ మర్మాంగంపై జరిగే హింస వాళ్ళనెంత భయభ్రాంతుల్ని చేస్తుందో కదా? పెద్దవాళ్ళే భయంతో ఆక్రోశిస్తారే? చిన్న చిన్న పసికూనలు వాళ్ళ మానసిక స్థితి ఎలా వుండాలి? రక్తస్రావంతో… చనిపోయిన పిల్లలూ…. చంపబడ్డ వాళ్ళూ ఎంత మందో? బ్రతికిన పిల్లలు? ఆ హేయమైన ఘటన వాళ్ళ అంతఃచేతనంపై వేసిన ముద్ర జీవితాంతం వెంటాడుతూ… మానసిక దుర్భలత్వాలతో జీవితాన్ని నాశనం చేస్కుంటూ… అసలు… అసలు చిన్నారి చిటికెన వేళ్ళు కూడా పట్టని వాళ్ళ మర్మాంగాల్లో మదమెక్కిన కొమ్ముల్లాంటి తమ మదపు ఆయుధాన్ని గ్రుచ్ఛాలన్న ఆలోచన… అసలది సాధ్యమా? పసి ప్రాణాలు పోతాయన్న కనీస ఆలోచన ఆ జంతువులకెందుకుండదో?

విపరీతమైన తలనొప్పితో లేచి అనాసిన్‌ వేస్కొంధి స్వరూప. ‘మా అక్క చక్కని చుక్క’… అని కలవరిస్తున్న నీహారిక తన స్నేహితుల కలల ప్రపంచంలో విహరిస్తోంధి.

– – –

తెల్లవారింది. స్వరూప – సుధీర్‌లు టీ త్రాగుతూ పేపర్‌ చూస్తున్నారు. నీహారిక తన రూంలో సంగీతానికనుగుణంగా శ్రుతులు సాధన చేస్తోంది. తన గొంతును తీగలా సాగదీస్తోంధి. సాధన అయ్యింది. తర్వాత తనూ అమ్మ నాన్నలతో పాటు కూర్చున్నది. నీహారిక రెండో తరగతిలోకి వచ్చింది. తెలుగులో వత్తులు నేర్చుకొంటోంది. ఆక్రమంలో పాపని తెలుగు పత్రిక చదవమంటాడు సుధీర్‌. టాబ్లాయిడ్‌ పత్రిక చిన్నగా వుంటుంది కాబట్టి దాన్నిష్టపడుతోంది నీహారిక! ఈ పేపరు నాది అని… అక్షరాలు… ఒత్తులు… కూడబలుక్కుంటూ చదువుతుంటుంది రోజూ? సిటీ పేపరు తీస్కుని చదవసాగింది.

”ఆరేళ్ళ పాపపై అత్యాచారం” – ”ళ”కు ‘ళ’ వత్తు ‘యా’వత్తూ కూడ బలుక్కుటూ… రెండు మూడుసార్లు ఆ వాక్యం చదివింతర్వాత… ‘అమ్మా! అత్యాచారం అంటే ఏంటి?” అంటూ తనదైన వచ్చీరానియాసలో అడుగుతోంది. అప్పటికే చదివి మనసు పాడైన స్వరూప ఆ ప్రశ్నతో ఉలిక్కిపడి సుధీర్వైపు నిస్సహాయంగా చూసింది.

సుధీర్‌ నీహారిక వైపు చూస్తూ… ”నీహారీ! ఇలారా నాన్నా మనం పిల్లల పేజీ చదువుదాము” అంటూ నీహారికను దగ్గరకు తీస్కున్నాడు.

ఇంతలో నీహారిక స్నేహితురాలు రమ్య వచ్చింది. ”నీహారీ… ఇదిగో నీ తెలు నోటుబుక్‌” అనుకుంటూ.. రమ్యను చూడగానే నీహారిక చెంగుమని తండ్రి ఒడిలోంచి దుంకి రమ్య దగ్గరికెళ్ళింది. ఇద్దరూ.. ఒకే స్కూలు ఒకే క్లాసు ఒకే బెంచి, ఎప్పడూ అతుక్కున్నట్లే వుంటారు. స్వరూప వాళ్ళ ఇంటికి రెండిళ్ళవతలే వాళ్ళిల్లు.

”వెళ్తా… నీహారీ స్కూలుకు తయారుకావద్దూ… అని బాల్కనీలోకి వెళ్ళింది రమ్య. నీహారిక ”మొత్తం రాస్కున్నావా” అంటూ రమ్ళ వెనకాల వెళ్ళింది. ”రాస్కున్నా… నీహారీ ఈ రోజ్‌ పువ్వు నాకియ్యవా” ఆశగా విచ్చిన గులాబీ వైపు చూస్తూ అడిగింది. రమ్య…! ”తీస్కోవే.. ఉండు మా అమ్మని కోసిమ్మంటా…” అంటూ ”అమ్మా… రమ్యకు గులాబీ కోసివ్వవా” అభ్యర్థనగా అడిగింది స్వరూపను నీహారిక.

స్వరూప గులాబీ కోసి రమ్యకిచ్చింది సంతోషంగా ”థాంక్స్‌ ఆంటీ” అంటూ… ”నీహారీ నువ్వు గులాబీ పువ్వు పెట్టుకో…” అని చెబుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది రమ్య!

మరుసటి రోజు సాయంత్రం ఆరున్నరకి నీహారిక మొఖం వేలాడేస్కుని ఇంటి కొచ్చింధి. ఆ రోజు త్వరగా ఇంటికొచ్చిన స్వరూప నీహారికకి ఇష్టమని మొక్కజొన్న వడలు చేస్తోంది. ‘అమ్మా’ అనుకుంటూ వంటింట్లో కొచ్చింది. ”ఏం రా” అని అడిగింది స్వరూప.

”మారేమో… రమ్యకు ఒంట్లో బాగోలేదని హాస్పిటల్‌కు తీస్కెళ్ళారట” …స్వరూప ఆశ్చర్యపోయింది. ”అదేంటిరా… నిన్న పొద్దున్న బాగానె వుందిగా” అంది. ”ఏమో మరి”… అంది డల్‌గా నీహారిక

కూరగాయల సంచితో లోపలి కొచ్చిన సుధీర్‌ ”ఏమిటీ” అన్నాడు, స్వరూప చెప్పింది. ”ఆలాగా మనం వెళ్ళి చూద్దాంలేమ్మా రాత్రికి” అన్నాడు సుధీర్‌. ”లేదు… ఇప్పుడే వెళ్దాం” అంటూ కళ్ళ నీరు నింపుకుంది నీహారిక. ”సరే… పద… వాళ్లింటికెళ్ళి హాస్పటల్లో చేరిందో కనుక్కొని వెళ్దాం” అన్నాడు సుధీర్‌. ”నువ్వురా…” అంటూ స్వరూప కొంగులాగింది నీహారిక… కాదనలేక… చేస్తున్న పని ఆపి బయల్దేరింది స్వరూప!

రమ్య వాళ్ళింటికి వెళితే వాళ్ళ నానమ్మగుడ్ల నీరు కక్కుకుంటూ… ముందు గదిలో కూర్చొని ఏడుస్తోంది. ఆమె చుట్టూ కాలనీ ఆడవాళ్ళ చేరి ఓదారుస్తున్నారు. అందరి ముఖాలు చిన్నబోయి వున్నాయి. స్వరూప తమ పక్కింటి జలజని ”ఏమిటి విషయం? ఏమయ్యింది” అని ఖంగారగా అడిగింది.

”క్వార్టరు నంబరు అరవై తొమ్మిదిలో వుంటారు చూడండీ…. శ్రీనివాస్‌ గాడు… వాడే ఆ జులాయి వెధవ… పెన్సిల్‌ చెక్కివ్వమని రమ్య వెళితే. తలుపులు మూసి రమ్మని ఆ పసిదాన్ని”…. చెప్పలేక గొంతు రుద్దమవడంతో ఆపేసింది జలజ.

స్వరూప గుండెలు గుభేల్మన్నాయి. చిన్నారి ఆరేళ్ళ రమ్యని… నిన్ననే ఇంటికొచ్చి ‘గులాబీ ఇవ్వవా ఆంటీ’ అని ఆశగా అడిగిన ఆ పసిదాన్ని… సుదీర్‌ వద్దకు వచ్చి విషయం చెప్తూంటే ధారగా కారే కన్నీళ్ళని అదుపు చేసుకోలేకపోతోంది స్వరూప, సుధీర్‌ ముఖం మ్లానమయ్యింది. నీహారిక ఏమీ అర్థం కాక బిక్కు బిక్కుగా చూస్తోంది. ”అమ్మా… రమ్యకేమయింది” అంటూ స్వరూప కొంగు లాగుతూ అడుగుతోంది. స్వరూప హాస్పటల్‌ పేరు కనుక్కొంది. ముగ్గురూ… హాస్పటల్‌కెళ్లారు.

మంచంపై నరకబడ్డ లేత కొమ్మలా పడివుంది చిన్నారి రమ్య. రమ్య పక్కనే వున్నారు రమ్య అమ్మనాన్నలు. ఏడ్చీ ఏడ్చీ ఉబ్బిపోయింది రమ్య అమ్మ నీరజ మొఖం. ఇంకా ఏడుస్తూనే ఉంది. రమ్య వాళ్ళ నాన్న రవిశంకర్‌ ఉబ్చిన కనురెప్పలతో భార్యను గుండెల్లో పొదుపుకుని ఓదారుస్తున్నాడు. రమ్య మగతగా పడుకుని వుంది. స్వరూప – సుధీర్లను చూడగానే వాళ్ళ మ్లానమైనాయి. నీరజ దుఃఖం కట్టలు తెంచుకుంది. స్వరూప ఆమెను దగ్గరకు తీస్కునీ ఓదార్చడానికి కూడా మాటలు రాక నీరజ వీపు నిమురుతూ ఉండిపోయింది.

సుధీర్‌, రవి శంకర్‌ను అడుగుతున్నాడు.

”పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చావా” అంటూ… లేదంటున్నాడు రవి శంకర్‌ ”పద… బయటకు పోదాం…” భుజం చుట్టూ చేయి వేసి తీసుకొని పోయాడు సుధీర్‌.

పెన్సిల్‌ చెక్కివ్వమని ఎదురింటికి వెళ్ళిందట రమ హోం వర్కు త్వరగా చేసి ఆడుకోవచ్చని. ఎదురింటి శ్రీనివాస్‌ పరమ జులాయి వెధవ. పదిహేడు సంవత్సరాలుంటాయి వాడికి. అప్పటికి నీరజ – రవిలు ఆఫీసు నుండి రాలేదు. నానమ్మకు పెన్సిల్‌ చెక్కరాదని విసుక్కుందిట రమ్య. ఆ సమయంలో శ్రీనివాస్‌ ఇంట్లో ఎవరూ లేరట. అదను చూస్కుని వాడు తలుపులు మూసి పాపపై అత్యాచారం చేసాడట. ఫ్రాకంతా రక్తంతో భయపడ్తూ ఆరుస్తూ… పసిది ఇంట్లోకొచ్చి నానమ్మ ఒడిలో పడి సృహ తప్పిందట. వెంటనే హాస్పటల్‌కి తీస్కాచ్చారట. రక్తం చాలా పోయిందట. పాప చాలా భయపడిపోయింది. పిచ్చి చూపులు చూస్తూ ”శ్రీనివాసంకల్‌” అని కలవరిస్తోందట. నీరజ – రవి శంకర్‌ చెప్పిన సారాంశం ఇదీ.

రాత్రి చాలా వరకూ హాస్పిటల్లో ఆ దంపతుల దగ్గరే కూర్చున్నారు స్వరూప-సుధీర్లు! ”రమ్యకేమయ్యింది అమ్మా” అని బెంగటిల్లిపోతున్న నీహారికకు రమ్యకు జ్వరం వచ్చిందని చెప్పారు. అక్కడికి పోలీసులు రావటంతో మరింత భయపడింది నీహారిక!

రాత్రి పది గంటలకు ఇంటికి చేరారు భారమైన హృదయంతో స్వరూప – సుధీర్లు. రాత్రి రాత్రంతా జాగరణ చేసింది స్వరూప. ఆమె మస్తిష్కమంతా తీవ్రమైన వత్తిడితో కాగిపోతోంది ఏమిటీ? ఎందుకు అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకక తల పగిలిపోతుంది స్వరూపకు.

– – –

పొద్దున్న లేచినప్పటయించీ ‘అమ్మా రమ్య దగ్గరికి పోదాం’ అంటూ వేధిస్తోంది నీహారిక – ”నేను ఆఫీసు నుంచి వచ్చాక ముగ్గురం పోదాం” అని నచ్చచెప్పి పనుల్లో మునిగిపోయింది స్వరూప.

తలనొప్పింకా తగ్గలేదు. నిన్న జరిగిన సంఘటన ఆమె హృదయాన్ని ఇంకా తొలుస్తూనే వుంది. కూరగాయలు కోస్తుందన్న మాటే కానీ ఆమె ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి.

”కమలానగర్‌లోని ఆరేళ్ళ బాలికపై అత్యాచారం” అన్న వార్తను చదువుతోంది నీహారిక.

”హాయ్‌! కమలానగర్‌ – మన కాలనీ పేరు. నాన్నా రమ్యపై అత్యాచారం ఎవరు చేసారు?” తండ్రిని ప్రశ్నిస్తోంది నీహారిక. అత్యాచారం మాట సరిగా పలకరావటం లేదు నీహారికకి! స్వరూప నిర్ఘాంతపోయి ”నీహారీ ఫో! పోయి స్నానం చేయి అంది” నీహారిక వెళ్ళలేదు. ఆ పాప మొఖం కోపంగా ఉంది.

”నువ్వేమో రమకు జ్వరం అన్నావు. జ్వరం వస్తే అమ్మలు అంత ఏడుస్తారేంటి? చెప్పు. రమ్యపై అస్తాచారం అంటే ఏంటి? నిన్న కూడా నువ్వు చెప్పలేదు”… మారాం మారాం చేస్తోంది నీహారిక.

సుధీర్‌… నీహారికను బుజ్జగిసూ స్నానానికి తీస్కెళ్ళాడు.

నీహారికకు జడ వేస్తోంది స్వరూప-మళ్ళీ ఏం ప్రశ్నిస్తుందోనని భయపడుతూ…

”అమ్మా…!” నీహారిక పిలిచింది.

”మరెమో” అంటూ వెనక్కి తిరిగి స్వరూప రెండు భుజాలపై చేతులు వేస్తూ…!

”నాకూ ఆరేళ్ళేగా… మరి నాపైన కూడా అస్తాచారం చేస్తారా ఎవరైనా” అని సమాధానం కోసం స్వరూప మొఖంలోకి చూస్తోంది. స్వరూప నిరుత్తరురాలైంది. ఆమె గుండె వేగం పెరిగింది. చెమటలు పట్టాయి. సుధీర్‌ ఉలిక్కిపడ్డాడు. ”చెప్పు”! అంటూ స్వరూప భుజాలు కదుపుతోంది నీహారిక!

స్త్రీల సమస్యలను, బాధలను కష్టాలను పేపర్లకెక్కించే స్వరూప, స్త్రీవాద కవితలను కథలనూ రాయటంలో దిట్ట అయిన స్వరూప దగ్గర సమాధానం ఉంటే కదా చెప్పటానికి.

”నీహారీ…” తేరుకున్న సుధీర్‌ పిలిచాడు. ”త్వరగా తెములు తల్లీ… ఆటో వస్తుంది.”అంటూ ”నువ్వెప్పడూ ఇంతే ఏమి చెప్పవు” అంటూ బుంగమూతి పెడుతోంది నీహారిక!

”రూపా త్వరగా జడ వెయ్యి!” స్వరూపను కుదిపి వాస్తవంలోకి తీస్కాచ్చాడు సుధీర్‌!

నీరసంగా జడ ముగించి లేచింది స్వరూప.

ఆ రోజు రమ్యను డిశ్చార్జి చేసారు.

స్వరూప ఆఫీసు నించే రమ్య వాళ్ళింటికి వెళ్ళింది. రమ్య మంచంపై పడుకుంది. నీరజ వంటింట్లో వుంది. స్వరూప రమ్యమంచంపై కూర్చుంది. వాడిపోయిన గులాబీలా ఎలా అయిపోయింది. స్వరూప కళ్ళ చెమర్చాయి. ”ఆంటీ-నీహారి రాలేదా?” నీరసంగా అడిగింది రమ్య. ”నేనాఫీసు నుంచే వస్తున్నా తల్లీ తర్వాత పంపిస్తాలే” అంటోంది స్వరూప ఇంతలో ‘రమ్యా’ అంటూ నీహారిక ప్రవేశించింది. రమ్య ముఖం వికసించింది.

స్వరూప వంటింట్లోకి వెళ్ళింది. నీరజ టీ చేస్తోంది. ఆమె చెంపలపై కన్నీరు ధారగా కార్తోంది. ”నీరజా ఊరుకో”… భుజంపై బాధగా చేయి వేసింది స్వరూప. ”నొప్పి… నొప్పి అని అదేడుస్తుంట…” భయంతో కలవరిస్తూ వణికిపోతుంటే ఏం చెయ్యలేక ఇలా ఏడుస్తున్నాను” అన్నది నీరజ.

”వాడ్ని పట్టుకున్నారట… వెధవ వారం క్రితం రమ్యకూ. నీహారికకూ చాక్లెట్టిచ్చాడట” అన్నది నీరజ కచ్చగా! ”పద… పిల్లల రూంలోకి వెళదాం”… టీ కప్పులు మోస్తూ… రమ్య రూంలోకి అడుగుపెట్టబోయిన నీరజ-స్వరూపలు ఆగిపోయారు.

”మరేమో… శ్రీనివాస్‌ అంకుల్‌ నా పాంటీ విప్పి అక్కడ నన్ను బాగా కొట్టాడు…! రక్తం వచ్చేసింది. నొప్పిపెట్టింది” అంటూ చెబుతోంది రమ్య. రమ్య కళ్ళల్లో నీళ్ళు…

నీహారిక భయ విహ్వాలంగా నోరు తెర్చుకుని వింటోంది.

”నాకు జ్వరం లేదు – మా అమ్మ అబద్దం చెబుతోంది” రమ్య అంటోంది.

నీరజ ఏడుస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. శిలలా నిల్చున్న స్వరూప మెల్లగా రమ్య వైపు కదిలింది.

– – –

రోజూ ఎనిమిదింటికే నిద్రపోయే నీహారిక ఎనిమిదిన్నర అవుతున్నా నిద్రపోవడం లేదు. తల్లితో రోజా కథ చెప్పించుకుని నిద్రపోయేది. ఆ రోజు స్వరూప కూడా కథ చెప్పే మూడ్‌లో లేదు. స్వరూప ఒళ్ళో తలపెట్టుకుని టీ.వి. చూస్తూ పడుకుంది. సుధీర్‌ చెన్‌పో – నవల ‘ఉప్పెన’ చదివే ప్రయత్నంలో వున్నాడు కానీ అతనూ పుస్తకం మూస్తూ తెరుస్తూ… అవస్తపడుతున్నాడు.

స్వరూప మెల్లగా ”నీహారీ” అంటూ పిలిచింది. ఊ కొట్టింది నీహారిక. ”నేను కొన్ని మాటలు చెబుతూ శ్రద్ధగా వింటావా” స్వరూప అడిగింది. ”ఊ చెప్పు…” టీవీ వైపు నించి తల్లి వైపుకి తిరుగుతూ ఉత్సాహంగా అంది నీహారిక.

”నానీ… మరి ఎవరైనా పెద్ద అబ్బాయిలు పెద్ద మగవాళ్ళు… నీ ఒళ్ళు ఇలా పిసికినా…” అంటూ తను నీహారిక పొట్టని… చేతులనీ తొడలనీ పిసికి చూపించుతూ… ”నిన్ను ముద్దులు పెట్టుకునందుకు ప్రయత్నం చేసినా… నీ పాంటీ విప్పాలని ప్రయత్నం చేసినా….” స్వరూప అతి కష్టం మీద ఒణుకుతున్న తన కంఠాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూంది.

సుధీర్‌… ”రూపా” అంటూ ఏమో చెప్పబోయాడు… ఆగమన్నట్టుగా చేయి చూపించింధి.

”నీ పాంటీల్‌ చేతులు పెట్టి ఏమన్నా చేసినా – వెంఠనే గొడవ చెయ్యాలి… వద్దని చెప్పాలి… అరవాలి. వాళ్ళని ముట్టుకోమని చెప్పినా… అసలు ముట్టుకోవద్దు”.

స్వరూప ముఖం ఎర్రబడ్డది. పెదాలు అదురుతున్నాయి. కళ్ళల్లో నీరు తిరిగింది.

నీహారిక తల ఎత్తి ముఖంలోకి చూసింది. ఆ కళ్ళ నిండా భయం ఉప్పెనలా కన్పించింది. ఆకాశంలో చందమామ కథనో… అడవిలో కుందేలు మామ గురించో… మాయల ఫకీరు గురించో కథలు చెప్పందేమో అనుకున్న అమ్మ కొత్త భాష…! భయం గొలిపే భాష ఆ చిన్నారికి అర్థమేకాలేదు. చటుక్కున స్ఫురించినట్లు, ”అమ్మా… శ్రీనివాసంకుల్‌ రమ్యకు చేసినట్లు పాంటీ విప్పి రక్తం కారేట్లు కొడతాడా నన్నూ” అంటున్న నీహారికనూ మాట్లాడవద్దంటూ గుండెలకదుముకుంది స్వరూప. మెల్లగా చిచ్చికొట్టి నిద్రపుచ్చింది. నీహారిక బెడ్రూంలో పడుకోబెట్టి సుధీర్‌ దగ్గర కొచ్చి అతని ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది స్వరూప.

ఆడపిల్లలను శరీరాలుగా చూడద్దని మగపిల్లలతో సమానంగా వ్యక్తులుగా చూడాలని కథలు వ్యాసాలు రాసే తను తన కూతురుకు అదీ ఆరేళ్ళైనా దాటని పసిదానికి, మగవాడినించి తన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో… మనసుకు గాయం కాకుండా ఎలా చూస్కోవాలో నేర్పిస్తోంది. చిన్న చిన్న పిల్లలు శరీరాలుగా ఎదగకముందే, ఆరేళ్ళకే వయసొచ్చేసినట్ల జాగ్రత్తలు చెప్పటం… ఎంత దుర్భరంగా వుంది? ఆడపిల్ల అంటే. మళ్ళీ శరీరమనే చెప్పాల్సిన స్థితిలో తనను తోసేసిన పరిస్థితుల్లో… ఎప్పటికీ మార్పు వస్తుంది?

”చిన్న పిల్లకు ఇవన్నీ ఎందుకురా చెప్పటం?” సుధీర్‌ అంటున్నాడు.

స్వరూపకు… చటుక్కున స్ఫురించింది. ఒక మానసిక వైద్యుణ్ణి… చిన్నపిల్లలపై జరిగే అత్యాచారాల విషయంలో ఇంటర్వూ చేయడానికి వెళ్ళింది.

”లేదు… సుధీర్‌! నేను సరిగానే చెప్పాను. చెప్పాలి కూడా… నేను ఆర్నేల్ల క్రితం ప్రముఖ సైక్రియాటిస్ట్‌ డా|| చంద్రశేఖరరావుని కల్పినప్పడు ఆయన ఏమన్నారో తెలుసా? పిల్లలపై లైంగిక అత్యాచారాలు నిత్యకృత్యంగా జరుగుతున్న ఈ సామాజిక నేపథ్యంలో… తల్లిదండ్రుల స్పర్శకూ… ఇతరుల స్పర్శకూ తేడాని గమనించేటట్లుగా పిల్లలకు చెప్పాలనీ, అత్యాచారం చేసేవాడు పాంటీ విప్పతీయడం, పిసకడం, తమను ఎక్కడంటే అక్కడ పట్టుకొమ్మని అడగడం… చేస్తే తిరస్కరించమని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలనీ చెప్పారు. అందుకే… నేను నీహారికకు చెప్పగలిగాను. సుధీర్‌… ఈ మాటలు నీహారికకే కాదు… రమ్యకు కూడా ఒక్క నాలుగు రోజుల ముందే చెప్పి వుంటే. ఎంత బాగుండేది…?” స్వరూప కంఠం రుద్దమయ్యింది.

”రూపా… తలుపులు మూసేసి… మృగంలా లేత చేతుల్ని విరిచి… వాడు అత్యాచారం చేస్తుంటే… చాక్లెట్ల కోసం ఆశపడే ఆరేళ్ళ పసిపిల్ల తనను తాను ఎలా రక్షించుకోగలదు” సుధీర్‌ అంటున్నాడు.

”నిజమే కదూ”… స్వరూప మనసులో అనుకుంది.

”పద పదవుతోంది, నిద్ర వస్తోంది” స్వరూపని లేపాడు సుధీర్‌.

”నువ్వెళ్ళి పడుకో సుధీర్‌ నేవస్తాను కొంచెంసేపయినాక…” అంటూ మళ్ళీ సోఫాలో ఒరిగింది స్వరూప.

సుధీర్‌ వెళ్ళిపోయాడు.

స్వరూప మళ్ళీ ఆలోచనల్లో కూరుకుపోయింది. ఈ రోజు తను ఈ విషయాలు తన కూతురుకు చెప్పగలిగినా… పరోక్షంగా ఆ పసి మనసులో… భయం విత్తనాలను… పురుషుణ్ణి… పురుషుడిగా – అంటే బలం కల ధృడమైన వ్యక్తిగా చూసే సజెషనుని, తనని స్త్రీగా బలహీనురాలిగా, శరీరంగా మాత్రమే చూస్కుంటూ… శరీరాన్ని రక్షించుకునే భావజాలాన్ని ఆ పసి మనసులోని అంతఃచేతనంపై అన్యాపదేశంగా ముద్రించింది.

మరి తను చేయగలిగింది ఏమిటి?

తను చేసింది సరి అయినదేనా?

స్వరూప చెవుల్లో పొద్దున్నే నీహారిక వేసిన ప్రశ్న రింగుమంటోంది. చాక్లెట్ల్‌… ఐస్‌క్రీమో లేకపోతే చందమామ కథలోని సందేహాల్నో అడగాల్సిన వయసులో… ”అమ్మా నాకూ ఆరేళ్ళేగా నాపైనా అత్యాచారం చేస్తారా?” అని అడిగితే… మరి తను ఇలానే చెప్పాలేమో?… ఏమో? స్వరూప అనిశ్చితంగా… తల విదిలించింది.*

  • – గీతాంజలి 
కథలుPermalink

2 Responses to ప్రశ్న (కథ) – గీతాంజలి

  1. భార్గవి says:

    నాకు ఒక పాప madam, 3 months తనకు,ఎంత కోరుకున్నానో పాప పుట్టాలి అని, వారం క్రితం చదివాను ఢిల్లీ లో 8 నెలల పాప మీద అత్యాచారం అని.. అది కూడా సొంత బావ. భయం వేస్తోంది Madam, ఇలాంటి సమాజం లో నా చిట్టితల్లి ని ఎలా పెంచాలి?ఎలా కాపాడుోవాలో అని… ఫస్ట్ టైం అనిపించింది Madam, భ్రూణ హత్య లు కరెక్ట్ అని. ఎలాగూ కాపాడు కొలెం .. కనీసం ఈ భాధ లు పడకుండా ఉంటారు..

  2. Venugopal Nakshathram says:

    మన ప్రస్తుత సమాజాన్ని చాలా ఆలోచింప చేసే కథ, ప్రశ్నిచే కథ . అబ్బాయి తల్లి తండ్రులు కూడా తమ పిల్లల చర్యలని గమనిస్తూ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం వుంది . చాలా బాగా చెప్పారు గీతాంజలి గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)