రాగి చెంబు మిల మిలా …

రాగి చెంబు – నానీ చేతిలో తళ తళా మెరుస్తోంది. ఆ తామ్ర చెంబు –
శంకరాభరణం నిర్మలమ్మ మామ్మ మర చెంబు అంత అమూల్యమైనది.
ఏడేళ్ళ వయసులో పల్లకిలో పెళ్ళికూతురిగా , కూర్చుంది –
తన పక్కన తనకెంతో ఇష్టమైన ఈ తామ్ర పాత్రిక –
ఈ ఎర్రని చెంబు సృష్టించిన కథలు అబ్బో, ఎన్నెన్నో!
ఈ వేళ, నానీ సెల్లార్లోకి దిగింది .
భూతల గృహ విభాగం – అదే, సెల్లార్ లో
తులసి చెట్టుకి పూజా పునస్కారాలు చేయాలి కదా –
అందుకని ఉదక సహిత చెంబును జాగ్రత్తగా పట్టుకుని దిగింది నానీ.
మంత్రోఛాణలో ఎక్స్ పర్ట్ నానీ. శ్లోకాలు మననం చేసుకుంటూ వచ్చింది.
ఆ గేటు దగ్గర క్రీనీడలో ఎవరో ఉన్నారు,
“ఎవరదీ?” గదమాయించింది.
వార్తలలో – చదువుతూనే ఉంది,
రేడియోలో వింటూనే ఉంది, – అంటే –
ఆమె దూరదర్శన్ జోలికి ఆట్టే వెళ్ళదు,
సోఫాలో కాళ్ళూపుకుంటూ సోమరిగా కూర్చుని,
నమ్కీనుల్ని నెమరేస్తూ – చూడటమంటే చిరాకు.
వాడు కనుక దొంగే ఐతే –
ఇదిగో, ఈ చెంబుతో వాడి నెత్తిన మొట్టేయడం ఖాయం.
“నేను, మామ్మగారూ, మునిసిపాలిటీ వర్కర్ని.”
మునిసిపాలిటీ అనే మాటను పలుకుతున్నప్పుడు, వాని మొహంలో – తానే కలెక్టర్ ని అన్నంత ఠీవి మెరుపు!!!
ఉద్యోగాలు, హోదాలు – తేడాలు – తెలీవు, కనుక –
“ఐతే ఏమిటంట!?”….. – ఒక్క క్వశ్చన్ మార్కుతో – వాడి మొహం – వాడి మొహం లాగే – ఉండిపోయింది, కొన్ని క్షణాల సేపు – వాడి పోయి, ఐతే అతగాడి ఇట్లాంటి అనుభవాలు – అప్పుడప్పుడూ తటస్థ పడుతుంటాయి కాబట్టి, సెకండ్లలో తేరుకున్నాడు.
“ఇంకుడు గుంతలు తవ్వడనికి – వచ్చాను.”
“గుంటలు తవ్వుతావా? ఇక్కడ ఖాళీ ఎక్కడుంది? వెళ్ళు వెళ్ళు.”
మనవళ్ళు ప్రదీప్ – ప్రవీణ్ – అనురాగ్, మనవరాలు మినూ ఉరఫ్ మృణాళిని ;;;;;;;;;;;
ఫ్రెండు పెళ్ళికి, ప్లస్ అదేమిటో ట్రెక్కింగ్ అంటూ అందరూ వెళ్ళారు.
వాళ్ళకి ఈ వర్క్ డ్యూటీని బదాలయించేది కోడలు.
తులసి కోటకు పసుపు మెత్తింది.
వాడి అదృష్టం బాగుండి, నానీ కోడలు మెట్లు దిగి వచ్చింది.
షిఫాన్ చీర, చేతిలో వ్యానిటీ బ్యాగ్,
“సూపర్ బజార్ దాకా వెళ్ళి వస్తాను, అత్తమ్మా, మీకు ఏవైనా కావాలా?”
“మూల కూర్చూనే ముసలమ్మని, నాకేం అవసరమౌతాయి”
“కాస్త గుర్తు తెచ్చుకోండి, ఆనక, మళ్ళీ లిస్టు చెబితే నేనే వెళ్ళాల్సొస్తుంది, శోష పడుతూ. ,మందులు, అవీ ……..”
“ఆ. ఔనేవ్, విక్సు, అమృతాంజనం, బర్నాలు, ఎర్ర మందు ……. “
“సరి సరి , సరే – , అమృతాంజనం, బర్నాల్సూ – ఇప్పుడు మార్కెట్ లో లేవు గానీ, అట్లాంటివే తెస్తాను లెండి.”
“ఆ కాడికి నన్ను అడగడమెందుకు, గొప్ప శ్రద్ధ ఉన్నదానిలా.”
ఆమె మనసులోనే అనుకున్నా –
నాటకంలో స్వగతం లాగా ప్రకాశంగానే గొణుక్కుంటూనే ఉంటుంది.
కోడలికి అలవాటే, కాబట్టి – ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తుంది – అనడం కంటే –
అసలు శ్రవణేంద్రియాలలోనికి జొరబడనీయదు –
అనడం సబబు.
మున్సిపాల్టీ కుర్రాడు – “అమ్మా” తన ఉనికిని తెలిపాడు.
“వీడి మొహం మీద అన్ని గంట్లు పెట్టుకుని, ఇంకు, సిరా గుంటలు – తవ్వుతాడట.”
“హమ్మయ్య, ఈ అత్తా కోడళ్ళ వగ్ధాటికి ఇప్పటికైనా కళ్ళెం పడింది.” సినిమాలో అల్లు అర్జున్ లెవెల్లో అనుకుని, మనసులోనే సంబరపడిపోతూ, నిట్టూర్చుకున్నాడు.
“ఐతే. సరే. టవ్వు.” అంటూ అత్తగారికి ఆమె స్పెషల్ మొబైల్ కాల్స్ కు మాత్రమే పరిమితమైనది – ఇచ్చింది.
“మీరు రావడానికి ఎంతసేపౌతుంది?” వాడి బాధ వాడిది –
ఇటు చూస్తే సాదాసీదా చేనేత చీర కట్టులో మామ గారు,
తన పని పూర్తి ఐనాక,
కనీసం – టీ నీళ్ళకు కూడా నాలుగు రూపాయలు
తన చేతిలోకి వచ్చే సూచనలేవీ కనబటం లేదు,
చిన్నమ్మ గారే గతి ……. “
“అర గంటలో వచ్చేస్తాను. నీ పని పూర్తి ఔతుందా, అప్పటికి!?”
క్వశ్చన్ లాంటి వ్యాఖ్యానాన్ని వదిలి, బైకుపై వెళ్ళింది.
తీరా సందు మలుపు తిరుగుతున్నప్పుడు ఆమెకి, డౌట్ వచ్చింది,
‘ఒక వేళ వాడు – దొంగ ఈతే ….. అసలే రోజులు బాగో లేదు …… ‘
అప్పుడప్పుడూ కోడలికి –
‘అత్తమ్మ యొక్క వాడుక నుడి ‘వచ్చేస్తుంటుంది.
[ ‘అత్తమ్మ యొక్క usage – వాడుక నుడి’]
వెనక్కి వచ్చింది, “అదేమిటి కోడలా! మళ్ళీ ఏం మర్చిపోయావు …… “ అత్తమ్మ నోటి నుండి – తర్వాత వెలువడుతున్న –
ప్రెజెంట్ కంటిన్యువస్ డైలాగులను గాలికి అప్పజెప్పేస్తూ,
కోడలు మేడమీదికి గబగబా వెళ్ళింది, తలుపుకు తాళం వేసింది,
నాలుగు అరటి పళ్ళు, ఒక ఆపిలు పట్టుకుని,
“అత్తమ్మా, ఇవిగో” అని ఆమెకు ఇచ్చింది.
ఐతే తాళం వేసావా, ఇంక క్రిష్ణాష్టకం,
విష్ణు సహస్రం, శివ పంచాక్షరి – మిగిలినాయి ….. “
భగవంతుడు సర్వాంతర్యామి,
ఇక్కడే ఉండి, ఇంకుడుగుంట,
పనిని సవ్యంగా చేసేటట్టు చూస్తూ ఉండండి, చాలు.
నేను పావు గంటలో వచ్చేస్తాను.”
ఇప్పుడే కదా, అర్ధ గంటలో వస్తానని చెప్పి, పావు నిముషం పట్ట లేదు, ఊ….. ”
మున్సీడు [= మునిసిపాల్ట్ ఈ కుర్రాడు ] టేపు తీసి,
అత్యంత శ్రద్ధతో మట్టిలో కొలతలు కొలవడం మొదలెట్టాడు.
“అక్కడ తవ్వుతున్నావు –
అది నైఋతి దిక్కు, పల్లం పనికిరాదు.”,
అంటూ నానీ అభ్యంతరం.
“మరైతే ఈ మూల తవ్వుదునా?” తన మాటను ఆజ్ఞగా శిరసా వహించే అర్భకుడు ఒక్కడు ఇన్నాళ్ళకు దొరికాడు,
నానీ మనసు ఆనందంతో నిండిపోయింది.
“ఆ నై వా యీ అని చెప్పారు పెద్దలు,
అంటే ఆగ్నేయ, నైరుతి, వాయవ్య, ఈశాన్యాలు –
నాలుగు దిక్కులు … “
మునీడు అంత కన్నా రాటు దేలినవాడు,
నానీ వాక్కులు ప్రతి అక్షరాన్నీ వదలకుండా వింటున్నాడు,
అని చూసే వాళ్ళకు అనిపిస్తుంది,
కానీ – వాని వీనులలోకి –
జీరో పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతమైనా వెళ్ళదు, అది అంతే!
ఆమె చూపిన జాగా – వెడల్పు తక్కువ.
కొంచెం పని తగ్గింది కదా అని రిలీఫ్ ఫీల్ అయ్యాడు మునీడు –
మళ్ళీ టేప్ కొలతలు వేసి, గడ్డ పలుగుతో ఐమూలగా గీసాడు.
అలనాడు అమర శిల్పి జక్కన, రువారి మల్లిటమ్మలు కూడా
ఇంత దీక్షగా కొలతలు వేసి ఉండరు.
నానీకి పూజ, ధ్యానం కుదరడం లేదు.
చకచకా సగం లోతు చెక్కాడు మినీడు.
ఏదో టైమ్ పాస్ అవ్వాలి కదా,
“మామ్మ గారూ, మీ చెంబు తళతళా మెరిసి పోతుందండీ,
మీ పనామె బాగా తోముతుంది లాగుంది.”
‘వీడి మొహం …… నా చెంబు, పంచపాత్రల మీద కళ్ళు పడ్డాయే’
చీర కొంగులో ఆ అమూల్య వస్తువులను ఉండలాగా చుట్టి, మడిచి,
బొడ్లో దోపుకుంది.
కొత్త పెళ్ళి కూతురినైనప్పుడు – ఒడి కట్టు బియ్యం మోసాను,
ఈ నాటికి మళ్ళీ మోస్తున్నాను –
అప్పటి ఒడి కట్టు బియ్యం కంటే ఎక్కువే ఉంది ఈ చెంబు మూట.’
నడుముకు ఉన్న చెంబు చెరగు మూటను తడుముకుంటూ అనుకున్నది.
తాతగారు – అనగా నానీ మగడుగారు – ఆటో దిగి – లోనికి వచ్చారు.
:
నానీ భర్త సూట్ కేసును కింద పెడుతూ
“ఏమిటీ, ఏదో పనిని అజమాయిషీ చేస్తున్నావల్లే ఉంది.”
“చెప్పా పెట్టకుండా వచ్చేసారే, ఊళ్ళో అంతా కులాసానా” పలకరిస్తూ “కోడలు బజారుకెళ్ళింది. అదిగో, పంపు వస్తున్నది,
మంచి నీళ్ళు తాగండి.”
ఆయన రైల్ స్టేషన్ లో కొన్న వేపపుల్లతో పళ్ళు తోముకున్నాడు.
“తాతగారూ, ఇంకా పందుంపుల్లలు వాడుతున్నారా?”
“డెబ్భై ఏళ్ళు పైబడ్డాయి, ఐనా నా పన్ను ఒక్కటి కూడా కదల్లేదు.”
టూత్ పేస్టు ప్రకటనకు మల్లే – నోరు తెరిచి పళ్ళు చూపించాడు.
“నిజమేనండి, మా అన్నకు నెల కిందట రెండు పళ్ళు ఊడిపోయాయి.” , వాదన పెట్టుకునే కన్నా ఒప్పుకోవడం బహు సులువు, సుఖమున్నూ.
మునీడు – అంగీకారం విభాగం – గుత్తకు పుచ్చుకున్న మానవుడు మరి.
ముఖసమ్మర్జనం అయ్యింది, ఇంతలో కోడలు పిల్ల రానేవచ్చింది.
“అదేమిటి, అటు తవ్వావు?”
@
“మామ్మగారు ఇక్కణ్ణే తవ్వమన్నారు.”
నేను నిమిత్తమాత్రుణ్ణి – అన్న ఫోజుతో మునీడు ఉవాచ.
కోడలికి కోపం వచ్చే సూచనలు ……..
:
నానీ గబగబా మూలకు వెళ్ళి,
గోంగూరను – ఆకు ఆకునూ సున్నితంగా వలుస్తున్నది,
సీరియస్ గా మొక్క మీదకి వంగి,
ఓరగా కోడలు వైపు చూసుకుంటూ.
“సరే, త్వరగా కానియ్యి.”
“ఓ రెండొందలు ఉంటే ఇవ్వండమ్మా.”
నానీ ఆ మూలనుంచి గట్టిగా అన్నది
“అదేంటి, మున్సిపాలిటీ పని కదా,
ఇంటింటికీ ఫ్రీగా ఇస్తున్నామని,
పేపర్లో, టీవీలలో – గవర్నమెంటు – అనౌన్స్ వస్తున్నై.”
“నీవి పాము చెవులు కాంతం.”
“మరైతే మీవి పిల్లి కళ్ళు.”
@ టిట్ ఫర్ టాట్, మామ్మా, మజాకా!?
“మామయ్యా, ఎంతసేపైంది వచ్చి, రండి.” అంటూ –
కుర్రాడికి ద్విశత రూప్యములు ఇచ్చి,
మేడ మీదికి దారి తీసింది.
అందరి భోజనాదులు ఐనాయి, కిందకివచ్చారు,
మునీడు ఇంకొంచెం లోతు తవ్వాడు. పక్కనే సిమెంటు బస్తా ఉన్నది.
“మూడొందలు ఇవ్వండి.”
“ఇందాక టూ హండ్రెడ్ తీసుకున్నావు కదా.”
ఈసారి నానీ డ్యూటీని ఆయన – తన భుజస్కంధాల పైన వేసుకున్నాడు.
అదీగాక, భార్యామణి ఎదుట –
ఇంగ్లీష్ వర్డ్స్ ని యూస్ చేసే ఛాన్సును వదులుకోడు,
ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాడు.
“మరే, టూ హండ్రెడ్ రూపాయలు తీసుకుని,
ఇట్లాగ రొక్కించడం ఏం బాగులేదబ్బాయ్.”
“మీ ఇష్టం.”
వీర లెవెల్లో సిమెంటు బస్తాని భుజం మీద వేసుకున్నాడు,
‘వెళ్ళి పోతున్నాను, కాస్కోడి ‘ అన్నట్లుగా నిటారుగా –
అటెన్షన్, స్టాండర్టీజ్ భంగిమ పెట్టి,
గేటుకు అభిముఖంగా నిలబడ్డాడు.
కోడలు పిల్ల పర్సు తెరిచి, మూడు వందలు సమర్పించుకున్నది.
మున్సిపాలిటీ పిలగాడు నాలుగు వైపులా రాళ్ళు పేరుస్తున్నాడు,
వాటిని విప్పి మళ్ళీ మళ్ళీ పేరుస్తున్నాడు పేరుస్తున్నాడు
పేరుస్తూ…..నే ఉన్నాడు.
:
నానీ అండ్ కో – నిలుచున్నంత సేపు నిలబడ్డారు.
ఆనక విసుగు పుట్టి, అందరూ ఇంటోకి వెళ్ళి పోయారు.
వాళ్ళు అటు వెళ్ళగానే, ము||కుర్రాడు టకటకా
బోలు రాళ్ళన్నీ పేర్చేసాడు,
దోసెడు సిమెంటు పదార్ధాన్ని – పుంజీడు నీళ్ళలో రంగరించాడు.
ముఖ్య మంత్రి – శిలాఫలకం పైన సుకుమారంగా – అద్దిన రీతిలో –
పామి, తతిమ్మా సిమెంటు గోతం మొత్తం –
మోసుకుంటూ వెళ్ళిపోయాడు.
“కింద గేటు తెరిచి, మర్చిపోయారు?” ఆఫీసు నుండి –
ఏదో ఫైలు కోసం వచ్చిన కొడుకు అడిగాదు.
నానీ కిందకు దిగి చూసింది “వాడు, గేటు బార్లా తీసి, వదిలేసి, వెళ్ళిపోయాడు. చెప్పి వెళ్ళాలని ఇంగితం లేదు.”
రుసరుసలాడుతూ అన్నది.
ఏమైతేనేం, కొన్ని రాళ్ళు పేర్చిన కళాఖండం
ఆవరణలో వెలిసింది అన్నమాట.
నానీ యధాప్రకారం మిల మిలా మెరుస్తున్న ప్లేటు, ఉద్ధరిణ, వగైరాలు, పూజ సామగ్రి పట్టుకుని తులసమ్మ దగ్గరికి వచ్చింది.
“ఇదిగో తాతీ”
“అదేం పిలుపూ …. “
“నేను నానీని గదా, అందుకని మీరు తాతీ ……”
“పిలుపు ఏదైతేనేం, ప్రేమలో మిళాయిస్తే అందంగానే ఉంటుంది.”
“అబ్బో సంబడం. ఇప్పుడు ముందస్తుగా చెయ్యాల్సింది,
సూర్య నమస్కార, ప్రాణాయామాలు.
ఊరికెళ్ళి అన్నిటికీ తిలోదకాలు ఇచ్చారనిపిస్తున్నది.”
“ఇదిగో తూర్పు తిరిగి దణ్ణం – పెడుతున్నా, చూడు మరి,
ఆనక ఇవే దెప్పిపొడుపులు, ఆపనే ఆపవు కదా.”
ఆవిడ తులసి కోటకు పసుపు పూసింది.
కళ్యాణ తిలకం మోస్తరు కుంకుమను తీర్చిదిద్దింది.
మంత్ర పఠనాదులతో – ప్రదక్షిణం కూడా చేసింది.
భర్తను “నందివర్ధనం, గరుడవర్ధనం పూలను కోయండి.
వయసు మీద పడింది, నా వల్ల అవడం లేదు”
“మరె నేనొక్కణ్ణే పడుచు వాణ్ణి, కోసి,
నీ కొప్పున తురుముదునా. ఉండు మరి.” ఆవిడ కిసుక్కున నవ్వింది.
నెమ్మదిగా కూర్చుంటూ, చెంబుని – పక్కన పెట్టింది.
అంతే, దభేల్ మని చప్పుడు …..
ఏమిటా అని చూసేసరికి, గోడ కూలి ఉంది.
అది నిన్న పజ్ఝెనిమిదేళ్ళ మునీడు చేసిన నిర్మాణం.
ఇంకుడు గుంట [ water pit] – అతి నైపుణ్యంగా
వాడు పేర్చి పెట్టిన బొంత రాళ్ళు,
చెంబు బరువుకే కూలాయి.
“చెంబు బరువును కూడా ఓపలేక – పొయ్యింది ఆ కుడ్యం – భామా!”
‘అసలే చిరాకు – ‘అన్ని నోట్లు, కోడలిని అడిగి, చేతిలో పుచ్చుకున్న కుర్రకుంక, పచ్చి మోసం చేసాడు.’
ఆమెకు ఉక్రోషం పొంగుకొస్తున్నది.
భర్త పైన చిర్రుబుర్రు లాడుతూ,
““చాల్లెద్దురూ, నవ్వెలా వస్తుంది, ఈ పెద్దమనిషికి,
నాకర్ధం కాదు ఈ ముసలాయన వాలకం.”
గట్టిగా అన్నది.
“కాస్త గుంతలోకి వంగి, ముందు నా చెంబు తియ్యండి.”
“ఈ వయసులో వంగమటావూ…. “
ఆమె కళ్ళలో రౌద్రం ఎరుపు చూసి, సరసానికి సమయం కాదు –
అను జ్ఞానోదయాదులు కలిగిన వాడై, ఇంకుడు గుంతలోకి దిగాడు.
తవ్వి పోసిన మట్టి, మోకాలు లోతుకు కూరుకున్నాయి.
అదృష్టం బాగుండి, ఆఫీసుకు బయలుదేరుతున్న – కొడుకు వచ్చాడు.
“అయ్యో, నాన్నా” అంటూ నిమ్మళంగా లాగాడు.
“ఇదిగో, చెంబు” చేతిలో కెంపు వన్నె పాత్ర,
“జాగ్రత్త.” , చెబుతూ, కింద సెల్లార్ లో జరిగిన సంఘటనను గూర్చి – భార్యకు ఫోన్ చేసి చెప్పి, బైకు స్టార్ట్ చేసి, వెళ్ళిపోయాడు.
“నీ చెంబు గట్టిదే”
“మరే, మన పెళ్ళి నాటి వస్తువు. ఒక్క సొట్ట కూడా పడ లేదు.”
ఆ రాగి పాత్రను అపురూపంగా చూసుకుంటూంటే –
ఆది దంపతుల ఇద్దరి బుగ్గలు సొట్టలు పడ్డాయి.
ఆ చెంపల సొట్టలలో కిరణాలను గుమ్మరిస్తూ
ఉదయ సూర్యుడు నవ్వాడు.
                                                                                                      – రచన :- కాదంబరి 

కథలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)