తెలుగు నృత్య నాటక రచనలో వేదాంతం పార్వతీశం(సాహిత్య వ్యాసం )- డా.లక్ష్మణరావు ఆదిమూలం

ISSN 2278-478

తెలుగు సాహిత్యంలో నాటక ప్రక్రియకి ఒప్క ప్రత్యేక స్థానం ఉంది . కోరాడ రామచంద్రశాస్త్రి, కొక్కొండ వెంకటరత్నం పంతులు, పరవస్తు వెంకట రంగాచార్యులు, వావిలాల వాసుదేవశాస్త్రి ఆధునిక తెలుగు నాటక రచనా ప్రారంభ విషయాన ప్రథములు. కందుకూరి వీరేశలింగం, కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమ కవి, వడ్డాది సుబ్బారాయుడు ఆధునిక తెలుగు నాటక ప్రదర్శనారంభ విషయంలో ప్రథములు.

ఆధునిక నాటక రచన 1860 ప్రాంతాల్లో ఆరంభంకాగా నాటక ప్రదర్శన మాత్రం 1880 లో ప్రారంభమయ్యింది. ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం “మంజరీ మధుకరీయము”. దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి 1860 ప్రాంతాల్లో రచించాడు. ముద్రణ మాత్రం 1908లో జరిగింది. సంస్కృతంలోనుంచి నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. అదేవిధంగా ‘ఆంధ్రా జాన్సన్‌ ‘గా సుప్రసిద్ధులైన కొక్కొండ వెంకటరత్నం పంతులు 1871 ప్రారంభంలో ఆంధ్రుడైన వారణాశి ధర్మసూరిసంస్కృతంలో రచించిన “నరకాసుర విజయము” అనే వ్యాయోగమును ఆంధ్రీకరించాడు. ఇది 1872 లో ప్రకటితమయింది. అదే విధంగా రిఫార్మర్ పండిట్ అని ప్రసిద్ధికెక్కిన పరవస్తు వెంకట రంగాచార్యులు 1872 ప్రాంతాల్లో కాళిదాసు రచించిన “అభిజ్ఞాన శాకుంతలము”ను ఆంధ్రీకరించడం జరిగింది. ఇదిలావుంటే వావిలాల వాసుదేవశాస్త్రి ఆంగ్ల నాటక ఆంధ్రీకరణకు మార్గం వేశాడు. జూలియస్ సీజర్ నాటకాన్ని “సీజరు చరిత్రము” అను పేరుతో 1874 లో ఆసాంతం తేటగీతిలో ఆంధ్రీకరించాడు. ఇది 1876 లో ప్రకటితమయింది. తెలుగులో పద్య నాటకాన్ని, విషాదాంత నాటకాన్ని రచించినవారిలో వాసుదేవశాస్త్రి ప్రథముడు.

ఆధునిక నాటక రచనకు ఆద్యులు వారైతే, ఆధునిక నాటక ప్రదర్శన ఆరంభ దశకు కందుకూరి వీరేశలింగం పంతులు, కొండుభొట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి, నాదెళ్ళ పురుషోత్తమకవి, వడ్డాది సుబ్బారాయుడులు రూపకర్తలు. వీరేశలింగం సంభాషణ రూపాన “బ్రాహ్మ వివాహము” అను ప్రహసనమును తన “హాస్య సంజీవని” అను పత్రికలో రచించాడు. అనంతరం “వ్యవహార ధర్మబోధిని” అనే నాటకాన్ని ప్రకటించాడు. ఇది వ్యావహారిక భాషలో రచించబడింది. వ్యావహారిక భాషలో ఆసాంతం రచన సాగించడం ఆనాడు ఒక సాహసం. పైగా ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకమిది.

1880 లో వీరేశలింగం నాటక సమాజాన్ని స్థాపించి “రత్నావళి”, “చమత్కార రత్నావళి” అను రెండు నాటకాలను ప్రదర్శించాడు. తెలుగునాట తొలి నాటక సమాజాన్ని స్థాపించిన ఘనత వీరేశలింగందే. ఇతడి స్వతంత్ర రచన అయిన “వ్యవహార ధర్మబోధిని”, సంస్కృత నాటక అనువాదమైన “రత్నావళి”, ఆంగ్ల నాటక అనుసరణ అయిన “చమత్కార రత్నావళి” ప్రదర్శన భాగ్యం పొందిన తొలి తెలుగు నాటకాలు. ఇది 1880 లో జరిగింది. అందుచేత 1980 వ సంవత్సరం తెలుగు నాటకరంగ శతజయంతి సంవత్సరం అయింది.

తెలుగు సాహిత్యంలో నాటకాన్ని, సంస్కృతంలోని దశవిధ రూపకాల్ని పరిశీలించి, కూచిపూడి నృత్యరూపకాలను ఒక అంచనా వేయవచ్చు. తెలుగులో నాటకంకాని, నాటికకిగాని కొన్ని నిర్ధిష్ట క్షణాలు ఉన్నాయి. దశరూపకాలకు క్షణాలున్నాయి. వీటికి కొద్దిగా భిన్నంగా సాగుతుంది కూచిపూడి నృత్య రూపకాలు కూచిపూడి కళాకారులు తమ ప్రదర్శనకు అనువుగా సంప్రదాయ బద్దంగా రచించుకున్నవి ఈ కూచిపూడి నృత్య రూపకాలు . వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే కూచిపూడి నృత్య రూపకాలో ఈ క్రింది క్షణాలు కన్పిస్తాయి.

వస్తువు , సంస్కృత ఛందస్సు ,దర్వు , రంగాలు ,వచనం ,కైవారం , ప్రార్ధను ,చూర్ణిక , దండకం , మంగళం , సూత్రధారుడు ఇవే కాకుండా పాత్రలు , ఆహార్యం, వేదిక, అంకరణలు తప్పనిసరి. సర్వసాధారణమైనవి. ఇవి ప్రయోగానికి అవసరమైనవిగా చెప్పవచ్చు.

వేదాంతం పార్వతీశం పార్వతీశం రచించిన నృత్యరూపకాలు ఎరుక, అర్ధనారీశ్వర, దక్షయజ్ఞం, ప్రవరాఖ్య, పేరణి శంకరప్ప, దాదీనమ్మ మొదలైనవి.

‘ఎరుక’ నృత్యనాటికలో ‘సోదె’ ప్రధానంగా సాగుతుంది. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంటూ సోదెమ్మ చెప్పే సంఘటనలు ఇతివృత్తం. ఆధ్యాత్మికంగా, అరిషడ్వర్గాలు, కర్మేంద్రియ పంచకాలు, జ్ఞానేంద్రియాలు, మనిషి సత్‌ప్రవర్తన విధానాన్ని వివరిస్తుంది సోదెమ్మ.

‘అర్ధనారీశ్వరుడు’ నృత్య నాటికలో శివుడు, భృంగిని అందరూ క్షేమమేకదా. ముల్లోకాలు అని అడుగగా, అందరూ క్షేమమేకాని స్వామి ఇంద్రలోకం, బ్రహ్మలోకం, వైకుంఠమున అందరూ మీ స్వామి అర్ధనారీశ్వరుడై సంచరిస్తున్నాడట నిజమేనా అని అడిగారు. అది విని వెంటనే వచ్చానని చెబుతాడు. అర్ధనారీశ్వరుడిగా మారిన వృత్తాంతాన్ని తెలియజేస్తాడు.

మరొక నృత్య నాటిక ‘దక్షయజ్ఞం’. దక్షుడి కుమార్తె అయిన సతీదేవి తన తండ్రికి ఇష్టంలేకపోయినా శివుడిని వివాహం చేసుకుంటుంది. దక్షుడు చేస్తున్న యజ్ఞానికి ముల్లోకాలోని దేవతల అందరికి ఆహ్వానం అందుతుందికాని శివుడికి, సతీదేవికి ఆహ్వానం రాదు. అయినా తన పుట్టింటికి వెళ్తానని సతీదేవి శివుడిని అడిగి యజ్ఞం వద్దకు వెళ్తుంది. దక్షుడు సతీదేవి, భర్త అయిన శివుడిని అవమానిస్తాడు. ఆ పరాభవానికి బాధతో సతీదేవి అగ్నికి ఆహుతి అవుతుంది. అది తెలుసుకుని శివుడు ఉగ్రరూపుడై దక్షయజ్ఞాన్ని నాశనం చేస్తాడు.

‘మోహినీ భస్మాసుర’ నృత్యనాటికలో ‘వృకాసురుడు’ అనే రాక్షసుడు శివుని కోసం తపస్సుచేసి వరం పొందుతాడు. ఆ వరప్రభావంతో వృకాసురుడు ఎవరి తపై చేయి పెడితే వారు భస్మం అయిపోతారు. అప్పటి నుంచి వృకాసురుడికి భస్మాసురుడు అనే పేరు వచ్చింది. ఆ భస్మాసురుడు శివుని తలపైనే చేయి పెట్టాని ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు. శివుడు భస్మాసురుడిని భరించలేక విష్ణువుని ప్రార్ధిస్తాడు. విష్ణువు మోహిని రూపంలో వచ్చి ఆ భస్మాసురుడిని మోహంలో ముంచి తన చేతిని తన తలమీదనే పెట్టుకునేలా చేస్తాడు. ఆ విధంగా భస్మాసురుడు భస్మం అయిపోతాడు.

‘ప్రవరాఖ్య’ నృత్యరూపంలో ‘ప్రవరుడు’ ఒక సద్‌ బ్రహ్మణుడు. నిత్యం అగ్నిహోత్రునికి పూజలు చేయడం, తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం, అతిధిమర్యాదలు చేయడం ఇతని దినచర్య. ఒకరోజు సిద్దుడు వలన  హిమాయాలు చూడటానికి వెళ్తాడు ప్రవరుడు. అక్కడ గంధర్వకన్య వరూధిని ప్రవరుడిని చూసి ఇష్టపడుతుంది. ప్రవరుడు ఆమెతో వాదిస్తాడు. చివరకు అగ్నిహోత్రుడిని ప్రార్ధించి ప్రవరుడు ఆకాశ మార్గంలో ఇల్లు చేరతాడు. వరూధిని అంటే ఇష్టపడే గంధర్వుడు ప్రవరుని రూపంలో వచ్చి వరూధినికి దగ్గర అవుతాడు.

ఈ నృత్య నాటకాలను శిష్యులతో అనేక ప్రదర్శనలు ఇచ్చారు . తరవాత కాలంలో చాలా మంది నర్తకులు ఈ నృత్య నాటకాలను తమదైన శైలిలో నృత్య కల్పన చేసి ప్రదర్శంచడం జరిగింది . తన నృత్య రచనల ద్వారా తరవాత తరంలో నృత్య రచనలు చేస్తున్న వారికి మార్గదర్శకమైయ్యారు.

                                                                                                  – డా.లక్ష్మణరావు ఆదిమూలం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.