చారెడు మట్టికి
విశ్వ చైతన్యమంతా
నాతో నా యుద్దానికి
చూపుడు వ్రేలై దారిచూపిన్నట్టు
విచ్చుకునే చిన్న చిగురాకులు
నీకెవ్వరని ఏకాంతం
గది మూలకు దిగబడితే
కిటికీ రెక్క చాటునుంచి
కాసిని నీళ్లిస్తావా అంటూ
బుద్దుడై నవ్వే పూ మొగ్గలు
గుండె గడప దగ్గర
ఖాళీ కుర్చీని పూరిస్తూ
నా సాయంకాలానికి చేయి చాపి
చుక్కల దాకా ఈతకి
తోడొచ్చే ఆకుపచ్చ పడవలు
బాల్కనీలో నిశ్శబ్దంగా
రంగుల ముగ్గేసి …కుదురుగా
కూర్చున్న పూలకుండీలు
నా ప్రయాణాన్ని
పరిపూర్ణం చేస్తున్న ప్రకృతి
పేరంటాళ్లు..
– దేవనపల్లి వీణావాణి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~