మేఘసందేశం-05 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

మేఘసందేశంలోకి వెళ్ళేముందుగా ఒక విషయం చెప్పుకుందాం. కాళిదాసు ఎక్కడా కావ్యాల్లో తనను గురించి ప్రస్తావించుకోలేదు. దీనివల్ల పరిశోధకులకు ఆతని కాలనిర్ణయం దుష్కరం అయిపోయిన విషయం ఎరిగినదే! ఆ విషయం అటు ఉంచితే ఆయనలోని “నిర్లిప్తత” ఇతని జీవన ధృక్పధం అని ఊహించుకోవచ్చును. అంటే ఏమియు పట్టించుకొనక పోవడం, ఉదాసీనత ఎందుకో అర్ధం కాదు. చరిత్ర/సాహిత్యకారులు ఈ విషయమై కొంత పరిశోధన జరిపారు. రఘువంశ ప్రారంభంలో ఈకవి తాను మన్దుడననీ, కవియశస్సు ప్రార్ధించే తాను పొగడ్తలు అందుకోగలిగిన ఫలం ఆశించినట్లైతే వామనుని వలె అపహాస్యపాత్రుడను కాగలననీ వ్రాశాడు. తిరిగి మళ్ళీ మాళవికాగ్నిమిత్రంలో ప్రాచీనమైనదల్లా యోగ్యమైనది కాజాలదనీ, నవ్యకావ్యమైనంత మాత్రంచేత అది నింద్యం కాజాలదనీ సహృదయులు ఈరెంటినీ అతిక్రమిచినవారనీ సూత్రధారుని ముఖతః పలికించాడు. ఇంతకంటే ఈకవి ఆత్మగతాభిప్రాయాలు ఇతని కావ్యాల్లో ఇంకెక్కడా లభించడంలేదు. ఈ కవి తన వ్యక్తిగత చరిత్ర విషయంలో అవలంబించిన మౌనాన్ని బట్టికూడా నిర్లిప్తమైన ఈతని జీవనశైలిని తెలియపరుస్తున్నది. అసలు ప్రాచీన కవితా సంప్రదాయాలలో కవికి నేటి కాలంలో ఉన్నటువంటి “స్వాతంత్ర్యం, అస్వాతంత్ర్యం” వంటి సమస్యలు అసలు బయలుదేరనేలేదు. ఆకాలంలో భారతీయకవులు భారతీయమైన ఆధ్యాత్మిక సంప్రదాయం సహజంగా ఆకళించుకొన్నారు. అప్పుడు వ్యక్తి స్వాతంత్ర్యం, సాంప్రదాయకమైన సాంఘికథర్మం అతిక్రమించి పెడదారులు తొక్కలేదు లేక యాంత్రికమైన ఒక్క శుష్కసంఘ శాసనానికి కట్టుబడనూ లేదు. ఆ ధార్మిక ధృక్పధంలో సంఘవ్యక్తులకు పరస్పరాశ్రితమైన సహకారం సహజంగా పెంపొందింది. కనుకనే ఆరోజులలో కవులెవ్వరూ వ్యక్తి చరిత్రలు తమ కావ్యాల్లో వ్రాసుకోలేదని అంటారు. అదీగాక భారతీయాధ్యాత్మిక సంప్రదాయాన్ని సంపూర్ణంగా ఆకళించుకొన్న కాళిదాసు తన వ్యక్తిత్వం విషయంలో గంభీరమైన ఉదాసీన వైఖరి అవలింబించి ఉంటాడు. అందువల్లనే ఈతని చరిత్ర నేటి పరిశోధకులకు ఇంత గడ్డు సమస్యగా పరిణమించింది. కాని ఆమహాకవి భౌతికవ్యక్తి జీవితం కాలగర్భంలో మరుగుబడిపోయినా, మనోహరమైన ఆతని ఆధ్యాత్మికత, ధార్మికత ఈ రెండిటినీ మించిన జీవితసౌందర్యార్చన ఆతని కావ్యాల్లో త్రిపధములై ఆతని కవితకు మందాకినీ గౌరవం కలిగించాయి. అందుకే ఆయన కవికుల గురువయ్యాడు.

మనం మళ్ళీ మేఘసందేశంలోకి వద్దాం. గత మాసాలలో యక్షుడు మేఘుడిని పొగడుతూ ఎలా అయినా తన కార్యం గట్టెక్కించాలని ప్రార్ధిస్తూ రక రకాలుగా శ్లాఘిస్తూ…. ప్రయాణ మార్గం వివరిస్తున్నాడు.

శ్లో.17. త్వామాసార ప్రశమిత వనోపప్లవం సాధు మూర్ధ్నా
వక్ష్యత్యధ్వశ్రమపరిగతం సానుమా నామ్రకూట:
న క్షుద్రో౭పి ప్రథమ సుకృతాపేక్షయాసంశ్రయాయ
ప్రాప్తే మిత్రే భవతి విముఖ: కింపునర్యస్తథోచ్చై:

దీని భావం : యక్షుడు మేఘునితో అయ్యా! నీవు, ఆమ్రకూటపర్వతంమీద ఏర్పడిన కార్చిచ్చు (దావాగ్ని)ని నీ ధారావర్షంచేత చల్లార్చి ఆమ్రకూటానికి చాలా మేలు చేశావు. కాబట్టి, నీవు మార్గాయాసంతో వెళ్ళినప్పుడు, ఆయన నిన్ను బాగా పూజిస్తాడు ఇంకా ఆదరిస్తాడు కూడా! లోకంలో అల్పుడైనా తనకు ఉపకారం చేసిన మిత్రుడు వచ్చినపుడు ఎవరైనా పూజించకుండా ఉంటారా? ఉండరు కదా! ఇక మరి అంతటివాడు నిన్ను పూజించకుండా, గౌరవించకుండా ఉంటాడా? చెప్పు? అంటూ పొగడ్తల మాలతో తబ్బిబ్బు చేస్తున్నాడు యక్షుడు.

ముఖ్యమైన అర్ధాలు: అసార = వర్షధారలచే; ప్రశమిత = చల్లార్చబడిన; వనోపప్లవం = కార్చిచ్చు; క్షుద్ర: అపి = నీచుడు కూడా; ప్రాప్తే సతి = తనను చేరినప్పుడు; సుకృతాపేక్షయ = ఉపకార స్మరణతో; కింపున: = ఆవిషయంలో ఇంక చెప్పవలసినది ఏమున్నది.

శ్లో. 18. ఛన్నోపాంతః పరిణతఫలద్యోతిభిః కాననామ్రై
స్త్వయ్యారూఢే శిఖరమచలః స్నిగ్ధవేణీసవర్ణే
నూనం యాస్యత్యమరమిథునప్రేక్షణీయా మవస్థాం
మధ్యే శ్యామః స్తన ఇవ భువః శేషవిస్తారపాండుః

దీని భావం: అడవిమామిళ్లు పండి ఆమ్రకూట పర్వతం చుట్టూ క్రమ్ముకొని, తెల్లగా కనిపిస్తున్నాయి. నున్ననైన జడతో సమానమైన వర్ణంగల నీవు, దాని శిఖరంమీద వ్రాలినట్టైతే, చుట్టూ తెల్లగ, మధ్యలో నల్లగా, ఉన్నట్టి, భూమియొక్క స్తనమో అన్నట్లుండి, దేవ మిథునాలకు చూడ్డానికి వేడుక కలిగిస్తుంది.

ముఖ్యమైన అర్ధాలు: పరిణత = బాగుగాపండిన; ద్యోతిభి: = ప్రకాశిస్తున్న; కననామ్రై: = అడవి మామిడి చెట్లు; ఆరూఢేసతి = ఎక్కినప్పుడు; స్తన: ఇవ = స్తనమువలె, వక్షము వలె; మిధున = జంటలు; ప్రేక్షణీయాం = చూడదగిన; నూనం = ఖచ్చితంగా; యాస్యతి = పొందగలరు.

విశేషము: మామిడి పండ్లు పాండు వర్ణంతో ఉంటాయి. పర్వతం చుట్టూ చెట్ల పండ్లతో తెలుపు రంగులోను, మధ్యలో మబ్బు రంగులో నల్లగా ఉండడం వల్ల కాళిదాసు అలా స్తనంతో పోల్చి వర్ణించడం జరిగింది.

అలంకారం: మేఘాన్ని జడతో పోల్చడం ఉపమాలంకారము. దేవతా మిధునాలు (జంటలు) భూమియొక్క స్తనమువలె చూస్తారని చెప్పడం వూహించడం ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. ఈ రెండు అలంకారాలు గమనించినట్లైతే ఒకదానిపై మరొకటి ఆధారపడిలేవు. విడి విడిగా ఉన్నై. ఇలా ఉంటే అలంకారికులు “సంసృష్టి” అంటారు. అయితే దీనికి వ్యతిరేకంగా పరస్ఫరం అలంకారాలు ఆధారపడి ఉన్నట్లైతే అది “సంకరం” అంటారు.

చిన్న ఉదాహరణతో చూద్దాం.
సంసృష్టి : తిలతండుల న్యాయమును గమనిస్తే, తిలలు, బియ్యం వేరు చెయ్యడం కుదురుతుంది కదా!
సంకరం : క్షీరనీరన్యాయమును గమనిస్తే ఒకసారి పాలలో నీళ్ళు కలిపితే విడదీయడం హంసకు తప్ప అన్యులకు సాధ్యం కాదు కదా!

శ్లో.19. స్థిత్వా తస్మి న్వనచరవధూభుక్తకుంజే ముహూర్తం
తోయోత్సర్గ ద్రుతతరగతి స్తత్పరం వర్త్మ తీర్ణః
రేవాం ద్రక్ష్యస్యుపలవిషమే వింధ్యపాదే విశీర్ణాం
భక్తిచ్ఛేదైరివ విరచితాం భూతిమంగే గజస్య.

దీని భావం: ఆ ఆమ్రకూటపర్వతమందు కిరాతస్త్రీలు అక్కడి పొదరిండ్లలో విహరిస్తూంటారు. వారి విహారాలు చూడ్డం నీకు ఒక లాభం సుమా! అని అన్యాపదేశంగా చెప్పడం. అక్కడ నీవు కొంచెం సేపు వర్షించు. దాంతో కొంచెం తేలికపడితే, నీవు శీఘ్రంగా వెళ్ళవచ్చు. అలా అలా కొంతదూరం వెళ్ళిన తర్వాత, రాళ్లతో ఎచ్చుతగ్గయిన వింధ్యపర్వత పాదమందు వ్యాపించి ఉన్న నర్మదానది కనిపిస్తుంది. అది అచ్చం ఏనుగు దేహమందు చేసిన సింగారంలా నీకు కనిపిస్తుంది. దాన్ని కూడా నీవు చూడవచ్చు అని యక్షుడు అన్ని పర్వతాలను వనాలను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తున్నాడు.

ముఖ్యమైన అర్ధాలు: వనచర = కిరాతుల యొక్క; కుంజే = పొదరిళ్ళు గల; తోయ ఉత్సర్గ = నీటిని విడుచుట వలన; ద్రుతతర = అతివేగము గల; ఉపల విషమే = రాళ్ళు రప్పలతో ఎగుడు దిగుడుగా ఉండడం; విశీర్ణా = చెల్లచెదురుగా ఉన్న; రేవాం = నర్మదా నదిని; ద్రక్ష్యసి = చూడగలవు.

శ్లో.20. తస్యాస్తిక్తై ర్వనగజమదైర్వాసితం వాంతవృష్టి
ర్జంబూకుంజప్రతిహతరయం తోయమాదాయగచ్ఛేః
అంత:సారం ఘన తులయితుం నానిల: శక్ష్యతి త్వాం
రిక్త: సర్వో భవతి హి లఘు: పూర్ణతా గౌరవాయ.

దీని భావం: ఓ మేఘుడా! నీవు అక్కడ వర్షించిన తర్వాత సుగంధములైన అడవి ఏనుగుల మద జలం చేత పరిమళింపచేయబడిన, నేరేడుపొదలచేత ఆపబడిన నర్మదా నది వేగంగల, ఆ నర్మదానది నీటిని తీసుకొని వెళ్ళు. నీటిని విసర్జించడం, గ్రహించడం మేఘ లక్షణం కదా! ఆ నీటిని గ్రహించడం వల్ల నీకు లోపల బలం కలుగుతుంది. బరువుగా ఉన్న నిన్ను అప్పుడు ఏవాయువూ కదిలించి చెదరగొట్టలేదు కదా!

ముఖ్యమైన అర్ధాలు: తిక్తై: = మంచి వాసనగల; జంబూ = నేరేడు చెట్లచే; ఆదాయ = త్రాగి; అనిల: = వాయువు; తులయితుం = త్రోయటానికి; లఘు = చులకన; గౌరవాయ = గొప్పదనానికి (భారమునకు)
అలంకారం: రిక్తుడు (అనగా బలం లేనివాడు ) లోకంలో అందఱికీ చులకన అవుతున్నాడు. లోపల సారం (బలం) ఉన్నవాడు గౌరవం పొందుతున్నాడని అన్యాపదేశంగా చెప్పడం అర్ధాన్యాసాలంకారం అవుతుంది.

–  టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)