నారింజ రంగు జ్ఞాపకం(కవిత ) – కె.గీత

నారింజ రంగు శిశిరం మీంచి

వీచే మధ్యాహ్నపు చలిగాలి

నా చెవుల్లో

నీ వెచ్చని జ్ఞాపకాన్ని గుసగుసగా నింపింది

నీకోసం వేచి చూసే

కను రెప్పల కొసల్లో

ఒక్కొక్క సన్నివేశమూ

కన్నీటి చుక్కై

వేళ్లాడుతున్న

ఎదురుచూపు

నిన్ను చూసే మొదటి క్షణం కోసం

ఆగకుండా కొట్టుకునే

నాడి కంటే

బలమైనదేదో

వణికిస్తూంది

మెడని దారమై అల్లుకున్న

గాఢ పరిష్వంగ పరవశం

గడియారపు ముల్లుని

పదే పదే వేడుకుంటూంది

వీడ్కోలు దిగులు పోసుకున్న

కనుపాపల్లో

మధ్యాహ్నాం

కాస్త నారింజ రంగు

జ్ణాపకాల

మెరుపుని తాటించింది

అప్పుడెప్పుడో

పెదవులు నిశ్శబ్దంగా

ఆన్చిన చోట

పుప్పొడై

తాకినప్పుడల్లా

చేతికంటుకునే

పరవశం

నీ కోసం

బుట్టెడు

వెలుగుల్ని

వాకిట్లో

పదిలపరుస్తున్న

మధ్యాహ్నపు

నును వెచ్చని

శిశిరాన

రాలిపడిన

మొదటి జ్ఞాపకాన్ని

గుండెల కద్దుకుని

అడుగుతున్నాను

మళ్లీ త్వరగా కనిపించవూ!

—-

                                                             -కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , Permalink

Comments are closed.