ఖడ్గచాలనం

అదిగో లబ్‌డబ్‌మని చప్పడు మొదలయింది. అమ్మ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అంటే నాన్న ఇంటికి వచ్చాడన్న మాట! నాన్న ఇంటికొస్తే ఇంట్లో ఒక బీతావహ వాతావరణం మొదలవుతుంది. ఇల్లు ఇల్లులా అనిపించదు. క్రూరమృగాలు సంచరించే కీకారణంలా మారిపోతుంది. ఆయన ఇంట్లో లేకపోతే మృగం ఎప్పడు ఏ క్షణంలో వచ్చి తన మీద దాడి చేస్తుందో తెలియని అమాయక కుందేలులా అమ్మబితుకు బితుకు బితుకుమంటూ వుంటుంది. ఆయనింట్లో వుంటే ఆహారం కాబోయే కుందేలులా వజ వజ వణుకుతూ వుంటుంది.

అమ్మ పొట్టలో వెచ్చగా పెరుగుతున్న నాకు మూడో నెల నిండినప్పట్నించీ ఈ చప్పుడు గాభరా గాభరా ఎక్కడో తుపాకీ పేలితే ఆర్తనాదాలు చేస్తూ, రెక్కలు దబ దబ లాడించుకుంటూ ఎగిరే ప్రయత్నం చేసే పక్షుల అరుపుల్లా భయంభయంగా వినిపించడం అలవాటయింది. అమ్మ గుండె చప్పడులో భయం, వేదన, ఆక్రోశం, నిస్సహాయత, దుఃఖం నిండిపోయి ఆమె జీవన సంగీతం నాన్నలాంటి క్రూరుడి చేతిలో చిక్కి శృతి లయ తప్పిన గానంలా అనిపిస్తుంది.

నాన్నంటే అమ్మకెందుకింత భయం? నాకు మొదట్లో అర్థం అయ్యేది కాదు. కానీ క్రమక్రమంగా నాకన్నీ అర్థమవసాగాయి. నాన్న పచ్చి తాగుబోతు. రోజూ తాగొచ్చి అమ్మను విపరీతంగా కొడతాడు. అమ్మ పొట్టలో నేను ఉన్నానని తెలిసి కూడా స్పృహ లేకుండా కొట్టేవాడు. స్నానానికి నీళ్ళు సరిపడా పెట్టకున్నా, నీరు మరీ చల్లగా ఉన్నా, వేడిగా ఉన్నా కొట్టేసేవాడు. పొద్దున్నే నాలుగు గంటలకు అమ్మే లేచి అన్ని మెట్లు దిగి నీళ్ళ పంపు పెట్టాలి, వేడి వేడి కాఫీ చేసి భయపడుతూ నాన్నని లేపితే ‘ఛత్‌! నీయవ్వ’ అని దానికొక బూతు మాట జోడించుతూ లేచేవాడు. కాఫీలో ఏది ఎక్కువైనా, తక్కువైనా అమ్మగూబ పగిలి పోవాల్సిందే, ఒక రోజు కాఫీలో చక్కెర తక్కువయిందని కాఫీ కప్పు అమ్మ మీదకు విసిరేసాడు. అమ తప్పించుకో చూసినా లాభ లేకపోయింది. వేడి కాఫీ అమ్మ చేతులపై పడి అమ్మ చేతులు ఎర్రగా కాలిపోయాయి. అప్పుడమ్మ గొంతులోని ఆర్తనాదం నన్ను కదిలించేసింది. ఇంకో రోజు నీళ్ళ వేడిగా వున్నాయని ఆ నీళ్ళన్నీ అమ్మపై గుమ్మరించి చెంపలు వాయించేసాడు. వణుకుతూ, పరిగెడుతూ, అల్లల్లాడుతూ నాన్న ఫ్యాక్టరీకి పోయేవరకు ప్రాణాలుగ్గబెట్టుకుని ఆరోగ్యం బాగోలేకున్నా సేవలు చేసేది…

నాన్న చాలా క్రూరుడు. చినప్పటి నుంచీ ఇలానే వుండేవాడట. నానమ్మ వచ్చినప్పుడు అమ్మకు చెబుతుండేది. ‘నువ్వే సరుకుపోవాలి సుధీరా! వాడికి కోపం తెప్పియ్యకు – వేళకు అన్నీ సక్రమంగా అమర్చకపోతే రాక్షసుడే. ఆ మొదటిది వీడితో వేగలేకనే విడిపోయింది’ అని నాన్నకు అమ్మ రెండో భార్యట. మొదటి భార్య నాన్న రాక్షసతనంతో వేగలేక నాలుగేళ్ళు భరించి విసిగిపోయి విడాకులు తీసుకున్నదట. అమ్మ పెళ్ళి అయి సంవత్సరన్నరే అయింది.

రాత్రి అయిందంటే అమ్మ గుండె చప్పుడు రెట్టింపయేది. నాన్న క్రూరుడు, తాగుబోతేకాదు కాముకుడు కూడా! ఔను! నాన్న బిడ్డనే నేను చెబుతున్నాను, నా తండ్రి గురించి. అమ్మ బాధతో విలవిల్లాడేది ఒద్దు ఒద్దని అరిచేది కన్నీటితో కాళ్ళు పట్టుకుని ప్రార్థించేది. నాన్న వినేవాడుకాదు. సిగరెట్లతో అమ్మ బుగ్గల మీద, పెదాల మీద, చన్నుల మీద, నడుం మీద వాత పెట్టేవాడు. అమ్మ బాధని మునిపళ్ళతో నొక్కుతూ శబ్దాన్ని బయటకు రానిచ్చేది కాదు! కానీ ఎంత సేపని అలా చేస్తుంది. ఏడ్చేది, ”ఒద్దానే! నీ…” అనుకుంటూనే అమ్మ చేతులు విరిచిపెట్టి మరీ చేసేనాడు ఇదంతా! ఒక్కోసారి రక్తనాళాలు తెగిపోయేలా వచ్చే అరుపుల్ని నోల్లో చెంగుకుక్కుకుని మింగేసేది. ఆ దుఃఖ తరంగాలు అమ్మ పాట్టని తాకి నాకు తగిలేవి. నేను విలవిల్లాడుతూ – అమ్మ బొజ్జలో కదిలిపోయేదాన్ని. ఒక్కోసారి ఆ కామంధుడు బ్లేడుతో కూడా అమ్మని చేతుల మీద, ఎక్కడంటే అక్కడ కోసేవాడు. అమ్మరెక్కలు తెగి రక్తసిక్తమయి దిక్కులేని పావురంలా రోదించేది. నేను అమ్మపొట్టలోనే ఏడ్చేదాన్ని. ఇలా నానా రకాలుగా చిత్రహింసలకు గురిచేసేవాడు. ఒక్కోసారి అమ్మ తప్పించుకుని పారిపోవాలని చూసేది నాన్న చేతుల్లోంచి, కానీ, ఆ గది, ఆ ఇల్లు దాటి ఎటుపోతుంది? వెంటాడి, వేధించేవాడు ఆ రాక్షసుడు. అమ్మ లేత పెదాలు రక్తాలోచ్చేటట్లుగా కొరికేవాడు. అమ్మ బుగ్గలపై కచ్చులు పడేట్లుగా కొరకేవాడు. అమ్మ నిస్సహాయంగా ఆ బాధని భరించేది. నాకైతే అమ్మ వాడిని చంపేస్తే బాగుండునని అనించేది.

బాధను తట్టుకోలేక అమ్మ కడుపు పట్టుకుని విలవిల్లాడేది. అలాంటపుడు అమ్మ పొట్ట చిన్నగా అయిపోయేది. నేను ఊపిరాడక అమ్మ పొట్టపైకొచ్చేసే దాన్ని, పైనించి అమ్మ చేతివేళ్ళ తగిలేవి. లోనుంచి అమ్మ వెక్కిళ్ళు వినిపించేవి. అమ్మా నిన్నెలా రక్షించను?

అమ్మ పుట్టింటి వాళ్ళు చాలా బీదవాళ్ళు. అమ్మకు నాన్నలేడు. అమ్మమ్మ ఎంతో కష్టపడి అమ్మను పెంచి, పెళ్ళి చేసింది. పెళ్ళికే అమ్మమ్మ జీవితాంతం సంపాదించిందంతా ఖర్చయి పోయింది. నాన్న మొదటి భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్ళిపోయిందని ప్రచారం చేశారు. నాన్న శారీరకంగా హింసించే సాడిస్ట్‌ అన్న విషయాన్ని మరుగుపరచారు.

అమ్మమ్మ వాళ్ళకి తెలిసిన వారు ఈ సంబంధం కుదిర్చారట. అమ్మమ్మ వచ్చినప్పడల్లా ఆమె ఒళ్ళో తలపెట్టుకుని అమ్మ పొగిలి పొగిలి, కదిలి కదిలి ఏడ్చేది. అమ్మ కన్నీటిలో ఈదుతున్నట్లు అనిపించేది నాకు. అమ్మమ్మ కూడా నిస్సహాయంగా వుండిపోయేది. ”ఊకో బిడ్డా భరించుకోవాల్నె!” అనేది అమ్మ ఒళ్ళు నిమురుతూ – నాకు కోపం వచ్చేసేది. ఎందుకు భరించాలి? అమ్మ ఒంటి మీది సిగరెట్‌ వాతలు, బ్లేడు కోతలు చూసి ఒకసారి అమ్మమ్మ నాన్నని అడిగింది. ”ఉట్టిమనిషి కాదాయె, గట్టు సతాయించకు కొడుకా” అని భయం భయంగానే!

ఆ రాత్రి అమ్మకు – రోజు కంటే ఎక్కువ నరకం బోనస్‌గా దొరికింది. ”లంజ! నీ అమ్మకు చెబుతావా ఇప్పడు రమ్మన ెనీ అమ్మను” అని ఆ రోజు అమ్మకు వాడు వాతలెక్కడ పెట్టాడో తెలుసా? అమ్మ జననాంగాల మీద! అవును! నా ప్రసవానికి- రుధిరోష్టవాలతో సిద్ధమవుతున్న అమ్మ జననాంగాల మీద వాడు సిగరెట్టు వాతలు పెట్టాడు. అమ్మ పెట్టిన ఆక్రందనలకు ఆ గది దద్దరిల్లింది. కేకలు బయటకు పొక్కకుండా నోరు మూసేశాడు నాన్న. రోజూ వాడి కామానికి అమ్మ సున్నితమైన శరీరాన్ని ఎలా అంటే అలా దుర్మార్గంగా వాడుకునేవాడు. మనిషిగా పూర్తిగా ఎన్నిసార్లో పతనమయినా, ఆ రోజు వాడి క్రూరత్వానికి పరాకాష్టగా అమ్మను గాయపరిచాడు. నేను రగిలిపోయాను. నిస్సహాయంగా, క్రోధంగా, అసహ్యంగా, ఆందోళనతో అమ్మ పొట్టలో అటు ఇటు కదిలిపోయాను. వాడ్నేం చేయను?

అమ్మే కాదు రోజు ఎంతో మంది స్త్రీలు నాన్నలాంటి మగమద మృగాల విషపు కోరలకు బలవుతున్నారు. వీళ్ళంతా ఎందుకు నిస్సహాయంగా పురుషుల దౌర్జన్యాలను భరిస్తున్నారు? పురుషులెందుకు స్త్రీలపై దౌర్జన్యాలు చేస్తున్నారు? వారికెవరిచ్చారీ హక్కు? స్త్రీలెందుకు ప్రతిఘటించరు?

నాన్న రోజు అమ్మ మీద అత్యాచారం చేస్తాడు, శారీరకంగా హింసిస్తాడు. అమ్మ ఏడుస్తూనే – మౌనంగానే అన్నీ భరిస్తుంది. ఎందుకు? తిరగబడి ఎందుకు కొట్టదు? తనూ బ్లేడుతో కొయ్యదు? సిగరెట్టుతో వాడికి వాతలు ఎందుకు పెట్టదు? బహుశ నాన్న చాలా ధృడంగా వుంటాడు, అమ్మ సన్నగా వుంటుంది. నాన్న ఒక్కతోపు చేత్తో తోస్తే అమ్మ తూలి పడుతుంది. అమ్మ కత్తిలాంటి ఆయుధంతో నాన్నని పొడిచి విముక్తి చెందవచ్చునే? ఊహు! కాదు శరీరం కాదు దీనికీ కారణం ఇంకా ఏవో వున్నాయి. నాకర్థం కావట్లేదు! ప్రశ్నలు ప్రశ్నలు! ప్రశ్నలు!!

ఒకసారి పక్కింట్లో నీరజ అనే అమ్మాయిని ఎవరో రేప్‌ చేశారు. సినిమాకు స్నేహితురాలితో వెళ్ళి వస్తుంటే ఎవరో ఈ అమ్మాయిని తుప్పల్లోకి లాక్కెళ్ళి అత్యాచారం జరిపారట. స్నేహితురాలు తప్పించుకుని ఇంటికొచ్చి చెప్పేలోగా నీరజ జీవితం నాశనం అయింది. అమ్మవెళ్ళి ఓదార్చింది. నీరజను గుండె కదుముకుని ఏడ్చింది. ఇద్దరి ఏడ్పులు నన్ను విపరీతంగా కదిల్చివేశాయి. నీరజ ఎవరో పరాయివాడిచేత ఒకసారి అత్యాచారానికి గురికాబడితే అమ్మ-రోజూ ప్రేమతో మానవత్వంతో సహజీవనం సాగించాల్చిన నాన్నతో అత్యాచారానికి గురికాబడుతోంది. ఎంత దారుణమైన విషయం? నీరజ వాళ్ళమ్మ – అమ్మను పట్టుకుని ”సుధీరా! నా బిడ్డ జీవితం ఏంకాను?” అని కదిలి కదిలి ఏడుస్తోంది.

నాకు అమ్మపాట్టలో ఏడో నెల నడుస్తోంది. అమ్మతో, అమ్మ బాధలతో, కన్నీళ్ళతో అనుబంధం ఎక్కువవుతోంది. అమ్మ రోజూ పేపరు చదువుతుంది పక్కింటి నుంచి తెప్పించుకుని, అమ్మ చదువుతుంటే వార్తలు నాకూ తెలుస్తాయి మిగతా విషయాల్లాగే.. ఆ వార్తలు చదువుతుంటే చాలా భయం, ఆశ్చర్యం, అసహ్యం, ఆందోళన కలుగుతున్నాయి. ఈ రోజు మరీ దారుణమైన వార్త. కిటికీలోంచి ఆరేళ్ళ పసిపిల్ల టి.వి. చూస్తుంటే – ముసుగు వేసి తీస్కెళ్ళి అత్యాచారం చేశారట. 12, 13 ఏళ్ళ మగపిల్లలు. ఆ అమ్మాయికి విపరీతమైన రక్తస్రావం అయిందట. నా మనసు వికలమైపోయింది. అలాగే ఇంకో రోజు 12 ఏళ్ళ జ్యోతిని చాక్లెట్టు ఆశపెట్టి 15 ఏళ్ళ శ్రీనివాస్‌ అనే అబ్బాయి తీసుకుపోయి రేప్‌ చేసి కర్రలతో మోది కతులతో పొడిచి చంపాడు. ఆరు సంవత్సరాల పసిపిల్లల నించి 60 ఏళ్ళ ముసలమ్మల వరకూ అందరూ ఈ మగమృగాలపైశాచిక కోర్కెలకు బలవుతున్నారే ఏమిటి? వీరి కామానికి శైశవమూ, ముసలితనమూ ఏవీ అడ్డురావా? బ్రిటన్‌లో ఒక త్రాగుబోతు తండ్రి భార్యతో గొడవపడి 13 నెలల తన పసిబిడ్డపై భార్య ఎదురుగానే అత్యాచారం జరిపాడట. ఎంత అమానుషత్వం, దారుణం, హేయం!!!

మొన్న జయంతి అత్యాచారం హత్య, నిన్న పొన్నమ్మ చావు, అత్యాచారం ఏమిటిదంతా? తమ తుచ్చ కామం తీర్చుకోవడానికి స్త్రీల శరీరాలు అంత సులభంగా లభ్యమయ్యే వస్తువులా? ఎక్కడుందీ లోపం? పురుషుల ఆలోచనల్లోనా? స్త్రీల శరీరాల్లోనా? అమ్మ ఈ వార్తలు చదివి బెంగటిల్లిపోయేది. తన పొట్ట మీద చేతిని పెట్టి నువ్వు ఆడపిల్లవి మాత్రం కాకు అని చాలా గాఢంగా అనుకొనేది. నేనాడపిల్లనైతే? నాకెందుకో భయం వేసింది.

నాన్న ఒక రోజు ఇంట్లో ఉండి అమ్మను ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. కడుపులోని నేను ఆడా మగా అని తెలుసుకోవడానికి. స్కానింగ్‌ చేయిస్తాడట. ఆయనకు మగపిల్లాడే కావాలంట. ఆడపిల్లని కంటే నిలువునా నరికేస్తాడట అమ్మని! అమ్మ వజ వజ వణికి పోయింది. అంటే నేనెవరో తెలిసిపోతుందన్నమాట. స్కానింగ్‌లో నా మర్మాంగాలు కనిపిస్తాయి- నేను మగనో ఆడనో తెలిసిపోతుంది. ఆడపిల్లనైతే అమ్మనా-నీరజనా, జ్యోతినా, జయంతినా అత్యాచారానికి గురై చనిపోయిన ఆరేళ్ళ మున్నీనా, అరవై ఏళ్ళక్కూడా అత్యాచారానికి గురైన సత్యమ్మనా- వీరందరిలో ఎవరినౌతాను?

మగాడైతే? నాన్నలా-నాన్నలాంటి, మిగతా మగ మద మృగాల్లా అవుతానా?

అమ్మతోపాటుగా నాకూ టెన్షన్‌ పెరిగింది. నా కళ్ళు ముడుచుకుపోయి ఇన్ని రోజులూ నాకు నేనెవరో తెలియలేదు. స్కానింగు జరిగింది. రిపోర్ట్‌లో నేను ఆడపిల్లను అని తెలిసిపోయింది. ఆస్పత్రిలోనే నాన్న ముఖం జేవురించింది. అమ్మ నిలువునా భయంతో, చమటతో తడిసిపోయింది. నేను ఆడపిల్లను అయినందుకు అమ్మ, అమ్మలాంటి ఇతర స్త్రీలు ఇంతటి భీతావహక్షణాలను అనుభవించాలా? ఒక జీవి భూమి మీదకు వచ్చే ముందు తరవాత జాతిని బట్టిసుఖదుఃఖాలు నిర్ణయమైపోయి వుంటాయా?

ఆ రాత్రి అమ్మని నాన్న మళ్ళీ నరకానికి గురి చేశాడు. నా సాక్షిగా అమ్మతో రాక్షస రతి కొలిపాడు. నాన్న అమ్మతో స్త్రీజాతి నిస్సహాయ స్థితిలో జరిపినట్టు అనిపించలేదు. సమస్త స్త్రీ జాతి నిస్సహాయ స్థితితో జరిపినట్లు అన్పించింది. అమ్మ పొట్టలో వున్న నన్ను బెదిరిస్తున్నట్లు అనిపించింది. నాలో వేదన పెరగసాగింది. నా లోపల నెలల నుంచీ రగులుతున్న ఘర్షణ ఉధృతమైంది. అసలు నేనెందుకు పుట్టాలి? పుట్టక ముందే నా ఉనికి ఇంత భీతావహంగా, అయోమయంగా ఉంటే? పుడితే? ఆ క్షణం నన్ను నేను ప్రయత్న పూర్వకంగా చూసుకున్నాను. స్కానింగ్‌ తీసేటప్పుడు ఆ వెలుగులో ఇంకా స్పష్టంగా చూసుకున్నాను. నా జననాంగాలు నన్ను భయపెట్టాయి: ఈ జననాంగాల మీదే కదూ మగవాళ్ళు నిర్దాక్షిణ్యంగా కామంతో కళ్ళు మూసుకుపోయి మదమెక్కిన పోతుల్లా పొడిచి పొడిని అత్యాచారం చేసేది. ఈ జననాంగాల మూలంగా ఎంతటి అమానుషాల్ని అత్యాచారాల్ని – రేపు పుట్టి పెరగబోయే నేను ఎదుర్కోవాలి? అమ్మలా ఎంత బానిస బతుకు బతకాలో? వద్దు! నేను భరించలేను. ఏదో చేయాలి. ఏం చేయాలి? నాలోని సమస్త జీవశక్తుల్నీ ఉపయోగించి ఈ పురుషజాతికి బుద్దోచ్చేలా, నా శరీరాన్నే ఒక ఆయుధంగా మార్చాలి. అమ్మ కన్నీళ్ళకు, అతాచారాలకు గురైన, గురవుతున్ననా సమస్త స్త్రీ జాతి కన్నీళ్ళకు ప్రతీకారం తీర్చుకోవాలి. దావాలనంలా ఉడికి పోతున్నాను, అస్థిరంగా కదిలిపోతున్నాను అమ్మా! నా నిర్ణయం జీవితాన్ని ఇంకా నరకప్రాయం చేయొచ్చు కానీ అమ్మా! నీవీ త్యాగం చేయక తప్పదు. అందాకా – అమ్మా నన్ను కమించవూ?

– – –

అదొక ప్రైవేటు ఆస్పత్రి అంతా హడావుడిగా వుంది. ఆ రోజు సుధీర ప్రసవించింది. ఆమె రెగ్యులర్‌గా చూపించుకునే ఆస్పత్రి అది. డాక్టర్లు అందరూ ఆశ్చర్యంతో, విభ్రమంతో గుసగుసలు పోతున్నారు. సిటీలోని ప్రముఖ గైనకాలజిస్టులు శాస్త్రవేత్తలు అందరూ అక్కడ వున్నారు. సుధీరకు స్కానింగ్‌ చేసి ఆడపిల్ల అని ధృవపరచిన సోనాలజిస్ట్‌ కూడా అక్కడే వున్నారు. అందరూ ఇదెలా సాధ్యమని బుర్రబద్దలు కొట్టుకుంటున్నారు. అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసిన విషయం ఏమిటంటే పుట్టిన పాపకి జననాంగాలు లేవు. జననాంగం స్థానంలో మొసతేలిన, కోనుగా వున్న ముట్టుకుంటేనే కస్సుమని గుచ్చుకునే ఒక కొమ్ము లాంటి నిర్మాణం వుంది. మూత్రం పోసే నిర్మాణం అటు-ఇటూ స్త్రీ మర్మావయవాన్ని పోలివున్నా క్రింది భాగం పూర్తిగా కొనతేలి ఎద్దు కొమ్ములాంటి నిర్మాణం వుంది. పాప మిగతా అంతా ఆరోగ్యంగా వుంది. పాప కళ్ళు మాత్రం మిలమిల మెరుస్తున్నాయి. లోకాన్ని జయించిన సంతృప్తి ఆ కళ్ళ మెరుపుల్లో ప్రతిఫలిస్తోంది.

  • గీతాంజలి
  • ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
కథలుPermalink

One Response to ఖడ్గచాలనం

  1. dvraoji says:

    ఇది కథా
    దీన్ని కథ అంటారా
    ఇలాంటివి అవసరమంటారా