కాఫీ విత్ కామేశ్వరి- మాలా కుమార్

రచయిత్రి; చెంగల్వల కామేశ్వరి

“అనుదినమ్ము కాఫీయే అసలు దిక్కు

కొద్దిగానైనా పడకున్న అసలు చిక్కు

కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు “

అని మిథునం సినిమాలో కాఫీ దండకం చెప్పారు బాలుగారు. మరి అంత గొప్ప కాఫితొ “కాఫీ విత్ కామేశ్వరి” అంటూ ఉదయమే కాఫీ కాప్పుతో వచ్చేసిన కామేశ్వరిగారి కమ్మని కబుర్లు వినటం(చదవటం)ముఖపుస్తక పాఠకులకు కొన్ని నెలలు వీనుల విందును కలిగించాయి. ఆ కబుర్లు మళ్ళీ మళ్ళీ వినేందుకు పుస్తక రూపం లోకూడా వచ్చేసాయి.

“జీవితం లాంటి పాఠశాల ఎక్కడా లేదు. అందులో మనమంతా నిరంతర విధ్యార్ధులమే!రకరకాల పరీక్షలు, గెలుపులు, ఓటములు, ధూషణలు, భూషణలు, తిరస్కారాలు అన్నీ కలగలుపే. ” అంటూ రచయిత్రి ఈ కాఫీ కబుర్లల్లో జీవితం లో మనము ఎదుర్కునే ఎన్నో కోణాలను రసరమ్యంగా అవిష్కరించారు. ఏది చదివినా ఇది మన అనుభవం లాగానే ఉందే అనిపించేట్టుగా ఉన్నాయి. అందుకే అందరి ఆదరణను పొదాయి ఈ కబుర్లు.

మరి ఇంత మంచి కబుర్లు చెప్పిన చెంగల్వల కామేశ్వరి గారి తో పరిచయం చేసుకుందాము.

నమస్కారమండి కామేశ్వరి గారు

1. మీకు రచనలు చేయాలి అని ఎప్పుడనిపించింది?

జ; నాకు రచనలు చేయాలని అనుకోకుండానే నాలో కల్గిన భావాలు నా మనస్పందనుగుణంగా రాసుకోవడం అలవాటుండేది.

కాని నా దస్తూరి బాగోదని భయపడేదాన్ని. కొంత మంది రచయితల దస్తూరి చూసాక నా దస్తూరే బాగుందనిపించి పత్రికలకు పంపేదాన్ని.

. 2. మీరు ఏమేమి రచనలు చేసారు?

జ; నేను వివిధ పత్రికల లో సుమారు ఎనభయికి పైగా కధలు రాసాను అన్నీ ప్రచురితాలే! ఏభయి కవితలు రెండువందల పై చిలుకు వ్యాసాలు రాసాను.

3. కాఫీ విత్ కామేశ్వరి వ్రాయాలని ఎందుకనిపించింది? అందులో మీరు చాలా విషయాలు చర్చించారు కదా అవన్నీ మీ అనుభవాలేనా? అవి రాస్తుండగా మీ అనుభవాలేమిటి?

“కాఫీ విత్ కామేశ్వరి” ముఖపుస్తకంలో సరదాగా మిత్రులతో మాట్లాడినట్లు ఉండాలని మొదలుపెట్టాను. కొన్ని అనుభవాలు నచ్చిన విషయాలు నచ్చని విషయాలు నా బాల్యంలోని మధురస్మ్రతులు అన్నింటిని ఉదయాన్నే మొదటి కాఫీలా పరిమళాల కబుర్లు చెప్తుంటే చిశేష స్పందన రావడం ఒకరోజు రాయకపోయినా ఎందుకు రాయలేదు ? అని అడగటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఉత్సాహంతో వరుసగా మూడు నాల్గు నెలలు రాసాను. అప్పటికే చాలామంది అవన్నీ బుక్ గా వేయించమని చెప్పడం గమనించిన మా అమ్మాయి అవన్నీ పుస్తకంగా ప్రచురించడానికి ముందుకు రావడంతో పుస్తకం గా ప్రచురించాక కూడా మరిన్ని నెలలు కాఫీ విత్ కామేశ్వరి కంటిన్యూ చేయమని పలువురి ప్రోత్సాహంతో ఇంకా రాస్తున్నాను. అవన్నీ ఛాయ్ విత్ చెంగల్వల గా పుస్తకంగా త్వరలో రాబోతోంది.

4. మీకు రచనల్లో ఏమైనా అవార్డ్ లు వచ్చాయా? అవార్డ్ ల మీద మీ అభిప్రాయం ఏమిటి?

జ; నాకు అవార్డ్ లు రాలేదు కాని కొన్ని బహుమతులు సత్కారాలు జరిగాయి!నా ఉధ్దేశ్యంలో అవార్డ్స్ అన్నీ ప్రోత్సాహకాలే!

5. మీకు రచనలల్లో ఏ ప్రక్రియలంటే ఇష్టం?

జ; నాకు రచనల లో కధలు వ్రాయడమే ఇష్టం! తక్కువ పేజీల లో కధ కధనం ముగింపు ఇవ్వడం రచయితలకు ఒక సవాల్ గా అనిపిస్తుంది.

6. మీ రచనలల్లో మీకు నచ్చిందేమిటి? నచ్చనిదేమిటి? ఎందుకు వివరంగా చెప్పగలరా?

జ; నా రచనల లో ఇటీవల రాసిన ఈ “కాఫీ విత్ కామేశ్వరి” అంటే ఏదో మక్కువ ఏర్పడింది. ఎందుకంటే ఒక ఇరవయి కధలకు ఒక నవలకు రావల్సినంత పేరు వచ్చింది. కేవలం ఫేస్బుక్ లో రెగ్యులర్ గా రాసిన ఈ వ్యాసాలకి ఎందరో తమ జ్ఞాపకాలను తవ్విపోసుకుని ఆనందించారు. మంచిగా స్పందించారు. మొదటి ప్రచురణ పుస్తకాలు ఒక్క నెలలోనే అయిపోవటం ఆనందదాయకం

7. మీకు ఈ కాలం రచనలు నచ్చుతాయా? పాతకాలంవా?

జ; నాకు పాతకాలం రచనలే నచ్చుతాయి. ఇప్పటి రచనలు కొందరివే బాగుంటాయి.

8. మీ అభిమాన రచయత ఎవరు?

జ; నా అభిమాన రచయిత్రి యద్దనపూడి సులోచనరాణి

9. మీకు రచనలు కాకుండా ఇంకే కళలల్లోనైనా అనుభవం ఉందా?

జ; నాకు రచనలు కాకుండా పాక కళ తప్ప మరేది రాదు.

ఓ ఐతే మీ ఇంటికి వస్తే కమ్మని విందుభోజనం పెడతారన్నమాట. ఐతే తప్పక వస్తాను. మీరు మీ సమయాన్ని నాక్కు కొంత కేటాయించి , నా ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి కామేశ్వరిగారు.

“కాఫీ విత్ కామేశ్వరి”పుస్తకు కావలసిన వారు రచయిత్రి నంబర్కు ఫోన్ చేసి పొందవచ్చు.

రచయిత్రి నంబర్; 9849327469

  • మాలా కుమార్ 

  • ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖిPermalink

One Response to కాఫీ విత్ కామేశ్వరి- మాలా కుమార్

  1. చెంగల్వల కామేశ్వరి says:

    చాలా బాగా రాసారు మాలా గారూ మీ సమీక్ష పొందడం మేము రాసిన పుస్తకానికి ఒక కొత్త సొబగు అద్దినట్లే! మీరు రావాలే కాని ఖానా విత్ కామేశ్వరి గా రెడీ గాఉంటాను
    చెంగల్వల కామేశ్వరి