బతుకు దారిలో వెలుగు చూసిన నంబూరి పరిపూర్ణ (వ్యాసం )-కాత్యాయనీ విద్మహే

బేబీ కాంబ్లే స్వీయ చరిత్ర చదివిన ప్రభావ గాఢత ఎద మెదడులను ఊపేస్తుండగానే నంబూరి పరిపూర్ణగారి స్వీయ చరిత్ర ‘వెలుగుదారులలో …’ నా అధ్యయనానికి అంది వచ్చింది.హైదరాబాద్ లోజరుగుతున్న ఆ పుస్తకావిష్కరణ గురించిన సమాచారం ఫేస్ బుక్ ద్వారా తెలియ వచ్చినా అమెరికాలో ఉండటంవల్ల ఆగస్టులో తిరిగి వెళ్ళాక కానీ దానిని సంపాదించి చదవలేను కదా అని సరిపుచ్చు కోవలసి వచ్చింది. జులై 9 న నెల నెలా వెన్నెల సాహిత్యవేదిక దశవార్షిక సభలో మాట్లాడ టానికి డల్లాస్ వెళ్ళినప్పుడు ఆ సభలో మాట్లాడటానికే వచ్చి వున్న దాసరి అమరేంద్ర గారి తో సంభాషణా వశాత్తు ఆ విషయం ప్రస్తావించానో లేదో ,వెంటనే ఆయన ‘మీ కోసం వుంది పుస్తకం’ అంటూ అక్కడికక్కడే నాకొక కాపీ ఇచ్చి సంభ్రమా నందాలు కలిగించారు. అలా ఆ పుస్తకం చదివే అవకాశం నాకు అనుకోకుండా ముందుగానే దొరికింది.

నంబూరి పరిపూర్ణ గారిని మొదటగా నాకు పరిచయం చేసిన సాహితీ మిత్రుడు దాసరి అమరేంద్ర. పాతికేళ్ల పై చిలుకు మాటే. సాహిత్య సభలకు ఢిల్లీ వెళ్ళినప్పుడు మా అమ్మ కథలు అంటూ ‘ఉంటాయి మాకు షస్సులు’ పుస్తకం ఇచ్చారు నాకు.మను షులను దగ్గరకు తీసి మంచి కొంచమైనా చెప్పాలన్న ఆర్తిని ప్రతిధ్వనించిన ఆకథల సారమే ఆమె మూర్తిమత్వం అని ఆ తరువాత తొలిసారి ఆమెను కలుసుకుని మాట్లాడి నప్పుడు నాకు అర్ధమైంది. మేము కలుసుకున్న సందర్భాలు తక్కువే అయినా ఆమెతో ఒక ఆత్మీయ బంధం నాలో నేటికీ నవనవ లాడుతూనే ఉంది.ఈ నాడు ఎనభై ఆరేళ్ల ఆమె బతుకు పుస్తకం ‘శిఖరారోహణం’ చేసిన మేరు నగ ధీర వ్యక్తిత్వదీప దర్శన మిచ్చిఆమె పట్ల గౌరవాన్ని మరింత పెంచింది. ఆ తల్లివేరు సంబంధం వల్ల దాసరి అమరేంద్ర ,దాసరి శిరీషల చిరకాల స్నేహం నన్నిప్పుడు మరీ మరీ పరిమళ భరితమై చుట్టేస్తున్నది.

తెలుగులో వచ్చిన స్త్రీల స్వీయ చరిత్రలలో ఇప్పటికి తెలియ వస్తున్నంత వరకు 1934 లో అచ్చయిన ఏడిదము సత్యవతి ఆత్మచరితము మొదటిది. దాదాపు డెబ్బై ఏళ్ల తరువాత వకుళాభరణం రాజగోపాల్ పరిశోధన వల్ల ఆ పుస్తకం వెలుగులోకి వచ్చింది. అలాగే కాళిదాసు పురుషోత్తంగారు పూనుకొని పొణకా కనకమ్మ గారి స్వీయ చరిత్రను అచ్చులోకి తెచ్చారు.ప్రచురణ కాలం ప్రకారం మాత్రం ఆత్మచరితము తరువాతి స్త్రీల స్వీయ చరిత్ర 1962 లో వచ్చిన సంగెo లక్ష్మీ బాయమ్మ ‘నా అనుభవాలు’. 1934 నుండి2017 వరకు ఈ 83 సంవత్సరాల కాలంలో వచ్చిన స్త్రీల స్వీయ చరిత్రలు 30. కాకతీయ విశ్వ విద్యాలయం తెలుగు విభాగం నుండి లావుడ్య సుజాత తెలుగులో 22మంది స్త్రీలు రాసిన స్వీయ చరిత్రలను పరిశీలనలోకి తీసుకొని పరిశోధన చేసింది. ఆమె లభించటం లేదు అని చెప్పిన స్వీయ చరిత్రలు నాలుగు ఉన్నాయి .అవి – మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమల,అడవి కొలను పార్వతి , పర్వతనేని ఉపేంద్ర రాసుకున్న స్వీయ చరిత్రలు.అవి కలిస్తే 26. సుజాత అసలే ప్రస్తావించని స్వీయ చరిత్రలు మూడు -ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ స్వీయ చరిత్ర ‘సాహితీ రుద్రమ’,వింజమూరి అనసూయ స్వీయ చరిత్ర ‘అసమాన అనసూయ’ (నా గురించి నేనే ) ,శారదా శ్రీనివాసన్ స్వీయ చరిత్ర ‘నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు.ఈ మూడు కలిపి 29. కొత్తగా ఇప్పుడు వచ్చిన నంబూరి పరిపూర్ణ స్వీయ చరిత్ర వెలుగుదారులలో … వాటికి జతపడింది. ఇలా తెలుగులో ఇప్పటికి తెలుస్తున్న స్వీయ చరిత్రలు 30.

తెలుగు సమాజంలో మహిళల అభివృద్ధి వికాసాల చరిత్రను మదింపు వేయా లన్నా, అవరోధంగా ఉన్న సామాజిక అసమానతలను ,అధికారాలను ధిక్కరిస్తూ వందేళ్లుగా స్త్రీలు చేస్తున్న ఆంతరిక బాహ్య యుద్ధాల స్వరూప స్వభావాలు తెలుసుకొనాలన్నా, ఆ క్రమంలో ఎంచుకొంటున్న ప్రత్యామ్నాయాలను గుర్తించాలన్నా స్త్రీల స్వీయచరిత్రలను మించిన చారిత్రక వనరు మరొకటి లేదు. నంబూరి పరిపూర్ణగారి స్వీయ చరిత్ర అటువంటి సారవంతమైన వనరు.
1

ఒక కథకురాలిగా ,స్త్రీసంక్షేమ శాఖలో పనిచేసి రిటైర్ అయిన మహిళగా తెలిసిన నంబూరి పరిపూర్ణ గారి స్వీయ చరిత్ర చదువుతుంటే మనకు అసాధారణ అనూహ్య అనుభవ పరంపరల మధ్య కాగి కాగి, కరిగి ఘనీభవించిన ఉక్కు మనిషి విశ్వరూపం, దానివెనుక వున్నతెలుగు సమాజం,దానిని నడిపిస్తున్న మనువాద సంస్కృతి , తలకిందుల సమాజాన్ని సరిచేసి నిలబెట్టాలన్న సంకల్పంతో సాగిన ఆర్ధిక రాజకీయ పోరాటాల గమనం -అన్నీఅర్ధమవుతాయి.

పుట్టుకతో అన్నీ అమరిన ,అవకాశాలను అంది పుచ్చుకోగల సామాజిక స్థాయి కాదు నంబూరి పరిపూర్ణ గారిది.కృష్ణా జిల్లా మాల దాసరి కుటుంబం లో పుట్టారామె.దాసరులు అంటే మాల వారిలో శ్రీవైష్ణవం స్వీకరించిన వాళ్ళు.వేదాధికారాన్ని, బ్రాహ్మ ణాధిక్యతను నిరసిస్తూ కులభేదాలకు తావులేకుండా భగవంతుడిని అందరికీ సమంగా అందుబాటు లోకి తెచ్చిన శైవ భక్తి ఉద్యమానికి పోటీగా ప్రచారంలోకి వచ్చిన వైష్ణవభక్తి ఉద్యమ ప్రభావం ఇది.ఆముక్తమాల్యదలోని మాలదాసరి ఈ సంప్రదాయంలో వాడే.ఆధునిక కాలంలో మాలపల్లి నవలలో రామదాసు కూడా ఈ కోవకే చెందుతాడు. శ్రీవైష్ణవం ఇచ్చిన జ్ఞాన చైతన్యాల వల్ల మాలవారిలో దాసరుల కు కొంత ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత అక్షరాస్య విద్యకు ,పౌరాణిక జ్ఞానానికి ,మత కర్మ కాండకు , వైద్యానికి సంబంధించినదని నంబూరి పరిపూర్ణ తన తండ్రిగారి గురించి,బావగారి గురించి చెప్పిన సందర్భాలలో వివరించారు.

నంబూరి పరిపూర్ణ తండ్రి లక్ష్మయ్య. తల్లి లక్ష్మమ్మ. ఆరుగురి సంతానం లో అయిదవది .ఆమెకు ఇద్దరు అన్నలు ,ఇద్దరు అక్కలు .ఒక తమ్ముడు.పరిపూర్ణ కు ఊహ తెలిసే వయసుకే పెద్దన్నకమ్యూనిస్టు రాజకీయాలలో ,చిన్నన్న స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములై ఉన్నారు. ఆ ప్రభావాలతో ఎదిగిన జ్ఞాన చైతన్యాలు ఆమెవి.
నంబూరి పరిపూర్ణ స్వీయ చరిత్ర ప్రారంభంలోనే 20వ శతాబ్దపు తొలి పాదంలో ఇంగ్లీష్ విద్యా వ్యవస్థలోని గ్రాంట్ స్కూల్ విధానం గురించి పరిచయం అవుతుంది మనకు. తను హనుమాన్ జంక్షన్ అవతల వున్న బొమ్ములూరు లో పుట్టిన విషయం చెప్తూ కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా లోని బండారిగూడెం నుండి తన తండ్రి గ్రాంటు స్కూలు పెట్టి అక్కడ స్థిరపడటం వల్ల బొమ్ములూరు తన జన్మస్ధలం అయిందని వివరణ ఇయ్యటమే కాక,గ్రాంట్ స్కూల్ అంటే ఏమిటో అవి ఎందుకు ఏర్పడ్డవో చెప్పారు. మాల మాదిగ పల్లెల్లో విద్యా వసతి కోసం అయిదవతరగతి వరకు చదువుకున్న వ్యక్తులను గుర్తించి వాళ్లకు ఆరునెలలు లోయర్ గ్రేడ్ ఉపాధ్యాయ శిక్షణను ఇచ్చి ఏడాదికి ఇంతమొత్తం అని బడి నిర్వహణకు నిధులను నిర్ధారించి ఏర్పరచిన ఏకోపాధ్యాయ పాఠశాలలే గ్రాంట్ స్కూళ్ళు. పరిపూర్ణ తండ్రి లక్ష్మయ్య అలాంటి శిక్షణ పొందే బొమ్ములూరులో బడిపెట్టి నడిపాడు. రెండవతరగతి చదివిన ఆమె తల్లి ఆయనకు సహాయకురాలుగా ఆ బడి నిర్వహణలో భాగస్వామి కావటం 1910 నాటికి విశేషమే.

పరిపూర్ణ 1931 జులై 1 నాడు పుట్టినట్లు స్కూల్ రికార్డ్ చెప్తుంది. పుట్టిన తేదీ అది కాకపోయినా సంవత్సరం అదే అయి ఉంటుందని పరిపూర్ణ చెప్పారు. తాను ఐదారేళ్ళ వయసులో ఉన్నప్పుడు 27 ఏళ్ళపాటు ఉపాధ్యాయుడుగా ,వైద్యుడిగా సేవలందిం చిన ఊరిని విడిచి తండ్రి బండారిగూడానికి మకాం మార్చాడని పరి పూర్ణ చెప్పిన దానిని బట్టి వాళ్ళు బండారిగూడెం తిరిగివచ్చిన కాలం 1936 గానీ 1937 గానీ అయి ఉంటుంది. 27 ఏళ్లపాటు ఆత్మీయతను పెంచుకున్న ఊరును వదిలిరావటం గురించిన ప్రస్తావన బట్టి నంబూరి లక్ష్మయ్య ,లక్ష్మమ్మ ఆ వూరు వచ్చి బడి పెట్టిన సంవత్సరం 1909 కానీ,1910 కానీ అయి ఉంటుందని చెప్పవచ్చు. పుట్టింటి ఆధ్యాత్మిక చింతన కారణంగా పన్నెండేళ్ళకే భగవద్గీత శ్లోకాలు చదవగలిగిన, రామాయణ పారాయణం చేయగల పరిజ్ఞానం పొందిన లక్ష్మమ్మ భర్తతో పాటు బడి నిర్వహణలో భాగస్వామి కావటం ,మంచి పంతులమ్మగా తాను కూడా జనం అభిమానాన్ని సంపాదించుకొనటం అత్యంత సహజంగా జరిగిపోయి ఉంటాయి. జ్యోతిబాపూలే ,సావిత్రీబాయి పూలే జంటను గుర్తుకు తెస్తారు మాలపల్లె పిల్లల చదువుల కోసం పనిచేసిన లక్ష్మయ్య,లక్ష్మమ్మ దంపతులు.
బడి పెట్టి మాల పిల్లలలకు అక్షరజ్ఞానం ఇస్తుండటం వల్ల,వైద్య సేవలు అందిస్తుండటం వల్ల,నటనా నైపుణ్యంతో వినోద విజ్ఞానాలను కలిగిస్తుండటంవల్ల సాటి మాల కులస్థులలో కాస్త పై స్థాయి జీవితం ,గౌరవం పరిపూర్ణ కుటుంబానికి లభించి ఉండవచ్చుగాక… కానీ లక్ష్మయ్య దంపతుల నివాసం మాలపల్లెలోనే అన్నవిషయం , అంద మైన రూపం,కమ్మగా పాడగల మంచి కంఠం,నటనాకౌశలం వున్నలక్ష్మయ్య నాటకాలు వేయటంలో శిక్షణ ఇయ్యగలిగింది దళితయువకులకు మాత్రమే అన్నవిషయం గమనిస్తే అవి కులం రీత్యా వారి వెలివేతనే సూచిస్తాయి. తల్లితండ్రీ చేసే బడి పని, తండ్రి చేసే ఆయుర్వేద వైద్యం , రెండెకరాల మాగాణి వ్యవసాయం ఉన్నా పరిపూర్ణ తల్లి,ఇద్దరు అక్కలు స్వంత పొలం పనులతోపాటు ఇతరుల పొలాల పనికి కూడా పోతే తప్ప సజావుగా కుటుంబం గడవని పరిస్థితి ఉందంటే దళిత శ్రామిక వర్గ పొలిమేర్లలోనే వాళ్ళ జీవన సంచారం సాగిందని అర్ధం అవుతుంది.బండారిగూడెంలో కొత్తగా కట్టుకున్న ఇల్లు వూరికి కాస్త దగ్గరదే అయినా అదీ మాలపల్లి లోదే కావటం ,మాలపల్లి కి కుడివైపు ఉన్న చర్చి బడిలో నాలుగవ తరగతి వరకు పరిపూర్ణ చదువుకొనటం ఆ విషయాన్నే దృఢపరుస్తాయి.

1940-41లో అయిదవతరగతి బడి చదువుకు బెజవాడ చేరటం తో నివాసం వేముల కూర్మయ్య గారి హరిజన హాస్టల్ లోనే అయినా నంబూరి పరిపూర్ణ జీవితం కొంతమేరకు కుల పరిధులను దాటిందనే చెప్పాలి. అరండల్ పేట మున్సిపల్ హై స్కూల్ ,గవర్నర్ పేట హైయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ ,ఆ తరువాత మద్రాస్ లో రామకృష్ణ మిషన్ వారి శారదా బాలికోన్నత పాఠశాల, ఆ పైన రాజమండ్రిలో బాలికల ప్రభుత్వ సెకండరీ ట్రయినింగ్ మరియు హై స్కూల్ -అలా ఆమె చదివిన బడులన్నీ అన్నివర్ణాలవారికి ప్రవేశం ఇచ్చేవే.ఇంటర్మీడియేట్ చదివిన కాకినాడ పి ఆర్ కాలేజీ బ్రహ్మసమాజ ఆదర్శాల ప్రకారం నడుస్తున్నది కావటం వల్ల కులమత వివక్షతలకు తావులేని వాతావరణం పరిపూర్ణకు లభించింది. ఈ చదువుల కాలంలో కమ్యూనిస్టు కుటుంబాల నుండి లభించిన స్నేహ సహకారాలు ఆమెను ప్రత్యేక కుల అస్తిత్వ చైతన్యం తో కాక ఒక మానవిగా ఎదగటానికి తోడ్పడి ఉంటాయి.అందువల్లనే బాగా చదివే విద్యార్థిగా, పాటలు, పద్యాలు చక్కగా పాడుతూ నటించగల మంచి కళాకారిణిగా సహవిద్యార్థులలో ,అధ్యాపకులలో తనకు మంచి పేరు, గుర్తింపు ఉన్నాయనే చెప్పుకోగలిగారామె.అధ్యాపకులు తగిన శిక్షణ ఇచ్చి తనను ఎట్లా తీర్చిదిద్దారో ,స్నేహం కనబరచి ప్రోత్సహించారో వివరించారు. అందువల్లనే కుల వివక్ష బాల్యంలో ఆమెకు ప్రత్యక్ష అనుభవం కాదు.

కుల వివక్ష పరిపూర్ణ అనుభవానికి వచ్చింది ఉద్యోగస్తురాలైన తరువాతే. 1950 నాటికి ఇంటర్మీడియేట్ పూర్తి చేసిన పరిపూర్ణ ఉద్యోగ జీవితం 1953 -54 నుండి అధ్యాపక వృత్తితో మొదలైంది. ఏలూరు లో ఒక మేనేజ్ మెంట్ స్కూల్ లో కొద్దికాలం పని చేసి సెయింట్ థెరిసా కాలేజీలో రెండేళ్లు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ శిక్షణ పొందారు.నూజివీడు మేనేజిమెంట్ మిడిల్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా కొంతకాలం, బాల విహార్ టీచర్ గా మరికొంత కా లం పని చేశారు .1958 నాటికి బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసులో సోషల్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజర్ గా కొత్త ఉద్యోగం లోకి ప్రవేశించి స్థిరపడ్డారు పరిపూర్ణ.

సోషల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజర్ గా హైద్రాబాద్ లో శిక్షణ తరువాత కృష్ణాజిల్లా చిట్టిగూడూరు కు మొదటి పోస్టింగ్ వస్తే అక్కడ ఉండటానికి ఆమెకు ఇల్లు దొరకలేదు. బ్రాహ్మణులు అధిక సంఖ్యాకులుగా ఉన్న ఆ వూళ్ళో దళిత కులం అయినందున ఆమెకు అద్దెకు ఇల్లు ఇయ్యటానికి ఎవ్వరూ ఇష్టపడలేదు. దానితో ఎంఎల్ ఏ అయిన అన్నగారి సిఫారసు మీద మరొక బ్లాకుకు బదిలీ చేయించుకొనక తప్పని పరిస్థితి ఆమెకుఎదురైంది . దేశానికి స్వాతంత్య్రం వచ్చి,రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఎనిమిది తొమ్మిదేళ్లకు జరిగిన ఘటన ఇది. రాజ్యాంగ న్యాయం కన్నా సామాజిక న్యాయమే బలమైన శక్తిగా ప్రభావం నెరుపుతుంటే దళిత శాసన సభ్యులు కానీ, న్యాయాధికారాలు కూడా కలిగి వున్నజిల్లా అత్యున్నత పాలనాధికారి కలెక్టర్ కానీ పౌర ప్రాధమిక హక్కులకు భంగంకలిగించే సామాజిక అన్యాయాన్ని సవరించలేని పరిస్థితులలో ఉండటం ,సర్దుబాట్లకు సిద్ధపడటం కన్నా పెద్ద విషాదం ఏముంది? సామాజిక సమానత్వం లేకుండా రాజ్యాంగం ద్వారా కల్పించబడిన రాజకీయ సమానత్వం వల్ల సాధించగల ప్రయోజనం గురించిన అంబేద్కర్ భయాలు ఎంత వాస్తవమైనవో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
ఉద్యోగ జీవితంలో ఆరుగురు మహిళా అధికారులతో తాను కలిసి పని చేసిన తీరును గురించి చెప్తూ ముగ్గురు అధికారులు-షిరీన్ షా ,శ్యామలరెడ్డి ,కృపావేణి తనతో స్నేహ సహకార సామరస్య వైఖరితో మెలిగారని,మరో ముగ్గురు -ఐనవోలు సత్యవతి ,రామకృష్ణమ్మ ,గురుదేవి –మాత్రం తనను బాగా వేధించారని చెప్తూ అందుకు కారణం అధికార వర్ణ అహంకారమేనని కూడా గుర్తించి చెప్పారు పరిపూర్ణ. వారి దృష్టిలో కులం రీత్యా క్రింది మెట్టుకు చెందిన తాను ఆత్మబలంతో తలెత్తుకు తిరగటమే అపరాధం అయిందని అంటుందామె.

ఇలాగే పరిపూర్ణ కుల అసమానతలకు ,వివక్షకు సంబంధించిన అనుభవాలను ప్రస్తావించిన మరో రెండు సందర్భాలు ఉన్నాయి. అవి ఒకటి సినిమా జీవిత సంబంధమైనది . మరొకటి దాంపత్య జీవితానికి సంబంధించినది.
2

నంబూరి పరిపూర్ణ గారిది నాటక కళాకారుల వంశం.బృందాలుగా ఏర్పడి చుట్టుపక్కల వూళ్ళకు వెళ్లి నాటకాలు వేసి వస్తుండే కుటుంబాలు వాళ్ళవి.తండ్రి నాటకాలలో ఆడవేషం కట్టటంలో,పద్యాలు ,పాటలు గొంతెత్తి పాడటంలో ప్రతిభాశాలి.ఈ వాతావరణం లో పెరిగిన పరిపూర్ణకు అతి సహజంగా నాటకాల పై అభిరుచి ఏర్పడింది.నాటకాలలోని పద్యాలు,పాటలు నోటపట్టాయి. రెండవ తరగతో, మూడవ తరగతో చదువుతున్న కాలంలోనే ముందస్తు అభ్యాసం ఏమీ లేకుండానే హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడి పాత్రను పోషించి మెప్పు పొందింది. విజయవాడ లో అయిదవ తరగతి చదువుతున్నప్పుడు యుద్ధ(రెండవ ప్రపంచ యుద్ధం)నిధి కోసం మున్సిపల్ స్కూల్ అధ్యాపక వర్గం విద్యార్థులతో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కదంబ కార్య క్రమంలో పాదుకా పట్టాభిషేక నాటకంలో భరతుడి వేషం ఆమెకు లభించింది. ఆనాటి ప్రదర్శనకు వచ్చిన ప్రముఖులలో సినీ నిర్మాత అయిన మీర్జాపూర్ జమిందార్ రంగరాయిణం గారు కూడా ఉండటం పరిపూర్ణ జీవితంలో ఒక మలుపుకు కారణం అయింది. ప్రహ్లాద సినిమాలో ప్రహ్లాదుడి పాత్రకు ఆమెను ఎంపిక చేసి పెద్దలను ఒప్పించి మద్రాస్ కు పిలిపించటం జరిగింది . ఆ సినిమా తరువాత తుకారాం సినిమాలో తుకారాం కూతురి పాత్ర ధరించే అవకాశమైతే వచ్చింది కానీ ఆ సినిమా పని మధ్యలోనే ఆగిపోయింది .ఆమె సినిమా జీవితం చిన్నదే అయినా స్వీయ చరిత్ర లో సినిమా రంగానికి సంబంధించిన తన బాల్యపు అనుభవాలను ,జ్ఞాపకాలను చాలా ఆసక్తికరంగా నమోదు చేశారు పరిపూర్ణ.ముఖ్యంగా ఆ నాడు తాను కలిసిన ,తనను ఆదరించిన ఎంతో మంది కళాకారుల గురించి హృద్యంగా పరిచయం చేశారు. సినిమారంగం చరిత్ర పై ఆసక్తిని కలిగించే సమాచారం ఇది.

అలా ఆమె పరిచయం చేసిన వ్యక్తులలో జి. వరలక్ష్మి ఒకరు.1926 లో పుట్టిన జి. వరలక్ష్మి పరిపూర్ణ కన్నా ఐదేళ్లు పెద్దది. ప్రహ్లాద సినిమాలో చిన్న ప్రహ్లాదుడి పాత్రకు పరిపూర్ణ ఎంపిక కాగా జి. వరలక్ష్మి పెద్ద ప్రహ్లాదుడి పాత్రకు ఎంపిక అయింది. మొదటి సగంలో పరిపూర్ణ ,రెండవ సగంలో వరలక్ష్మి ప్రహ్లాదుడి పాత్రలో కనబడతారు. పరిపూర్ణ తన తండ్రి తో మద్రాస్ చేరే నాటికి ఆమె అక్కడే వుంది. తల్లి ,అన్న ,ఇద్దరు తమ్ముళ్లు ,చెల్లెలు ఆమె తోటే ఉన్నారు. అప్పటికే బారిష్టర్ పార్వతీశం ,బొండాం పెళ్లి ,దక్ష యజ్ఞం సినిమాలలో నటిచిన అనుభవం వల్లనో ఏమో వయసు పదిహేనేండ్లే అయినా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొనే స్థితిలో ఉంది. అందువల్లనే పరిపూర్ణను ఆళ్వారుపేటలో తమ పెద్ద పెంకుటింటిలో ఒక గదిలో వచ్చి ఉండమని ఆహ్వా నించింది.పరిపూర్ణను చెల్లెలి వలె ఆదరించింది . అక్కయ్య అని ఆమె పట్ల పరిపూర్ణకు అభిమానం . ఆ సమయంలో వరలక్ష్మి ప్రేమ వాత్సల్యాలు ఎంతగా తనకు లభించాయో చెప్తూనే అంతగా తాను అక్కడ వాళ్ళ అమ్మగారి కుల ఆధిక్య అసహనాన్ని ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పారు పరిపూర్ణ. ఆ విషయంలో తరచు ఆమె కూతురితో గొడవ పడుతుండేదని, అది గమనించి వరలక్ష్మి ని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేని తన తండ్రి తమ నివాసాన్ని ఆక్కడినుండి మార్చేసాడని చెప్పారు పరిపూర్ణ.
3

ఇంటెర్మీడియట్ పూర్తవుతూనే పరిపూర్ణ వివాహం దాసరి నాగభూషణ రావు తో జరిగింది. అది పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లికాదు. కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న పరిపూర్ణను ఇష్టపడి రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకుడుగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన దాసరి నాగభూషణరావు కోరి చేసుకొన్నపెళ్లి.అప్పటికే కమ్యూనిస్టు రాజకీయాలలో తలమునకలుగా ఉన్న పరిపూర్ణ పెద్దన్న శ్రీనివాసరావుకు పార్టీ పెద్దలు దాసరి గురించి చెప్పి ఒప్పించారు. దానితో కుటుంబం నుండి పరిపూర్ణ వివాహానికి ఆమోదం లభించినట్లయింది.వివాహ ప్రతిపాదనలు పంపటంలో దాసరి అనుసరించిన పద్ధతిలోని నిజాయితీ -వర్ణాంతర వివాహం చేసుకోవాలన్నతన ఆదర్శo నెరవేరుతుందన్న ఆలోచన ఇన్నీ కలిసి తనను దాసరితో వివాహానికి సరే అనేట్లు చేశాయి అంటారు పరిపూర్ణ.

పరిపూర్ణకు పదమూడేళ్ల వయసుకే కమ్యూనిస్టు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. రాజమండ్రి జైలులో ఉన్న అన్నగారిని కలవటానికి తల్లితో పాటు రాజమండ్రి వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో వున్నప్పుడు రంగ స్థల భయం లేక చక్కగా చొరవ తో పాడగల పరిపూర్ణ సంగతి తెలిసి ఆమె చేత జన సమూహాలను సమీకరించిన చోటల్లా పాటలు పాడించటం మొదలు పెట్టారు. పార్టీ వారి కోరికపైన తల్లి తిరిగి వూరికి వెళ్ళిపోయినా ఆమె రాజమండ్రిలోనే ఉండిపోయింది. ఆ క్రమంలోనే పార్టీ ఆమె చదువు బాధ్యత స్వీకరించింది. పార్టీ అనుబంధ మహిళా సంఘం పనులు చేసింది. విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో భాగమైంది. ఇంటర్మీడియట్ చదువుతున్న కాలానికి కాకినాడ జిల్లా విద్యార్థి ఫెడరేషన్ లో చురుకుగా పనిచేస్తూ 1949 డిసెంబర్ లో రాష్ట్ర మహాసభల కోసం పనిచేసింది. ఆ సందర్భంగానే దాసరి నాగభూషణ రావు తో ఆమెకు పరిచయం అయింది. ఆ పరిచయమే పెళ్ళికి దారి తీసింది. అప్పటికి ఆమెకు పద్ధెనిమిదేళ్ళు. అయిదేళ్లుగా విప్లవ విద్యార్థి ఉద్యమంలో పని చేస్తున్న పరిపూర్ణకు ఉద్యమం పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తి నుండి పెళ్లి ప్రతిపాదన వచ్చినప్పుడు అది తన ఆదర్శాలకు ,ఆచరణకు బలం చేకూర్చేదిగా అనిపించటం సహజం. బహుశా ఆ కారణం గానే ఆమె దాసరి గారి పెళ్లి ప్రతిపాదనను ఆమోదించి ఉంటారు.

ఆమెకు ఉన్న మరొక ఆదర్శం వర్ణాంతర వివాహం చేసుకోవాలన్నది. ఇది ఆమెకు ఎక్కడ నుండి వచ్చింది? కమ్యూనిస్టు సంస్కృతిలో కులంతో నిమిత్తంలేని మానవ సంబంధాల మనుగడను ఆమె చూసింది.దర్శి చెంచయ్య నుండి మహీధర రామమోహనరావు వరకూ ఎందరి ఇళ్ళల్లోనో ఏ అరమరికలు లేకుండా మెలిగింది. ఆ వాతావరణం కలిగించిన ప్రేరణ నుండి అలా అనుకొని ఉండవచ్చు. అంతకన్నా ముఖ్యమైనది పరిపూర్ణ ప్రత్యేకించి ప్రస్తావించక పోయినా అంబేద్కర్ ప్రభావమేమో అనిపిస్తుంది. అది ఆమెకు చిన్నన్న దూర్వాసమహర్షి ద్వారా అందివుండాలి. కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్న అతనికి అంబేద్కర్ రచనలు ఆత్మీయమైనవి కావటం అతి సహజంగానే జరిగింది. ‘అంబేద్కరీయం’ అనే కావ్యమే రాసాడంటే అతనెంతగా అంబేద్కర్ తాత్వికతను అభిమానించాడో అర్ధం చేసుకోవచ్చు. ఆ కావ్యం అతను ఎప్పుడు రాశాడో కానీ ఆయన అవగాహన తప్పక పరిపూర్ణ వరకు ప్రసరించే ఉంటుంది. కుల నిర్మూలనకు కులాంతర వివాహాలే సరైనవి అని అంబేద్కర్ చాటి చెప్పిన మాట ఆ రకంగా పరిపూర్ణ జీవితాదర్శంగా పరిణమించి ఉండాలి. అయితే ఆమె వైవాహిక జీవితంలో ఆ రెండు విలువలు భగ్నమైన విషాదమే మిగిలింది.

పరిపూర్ణ 1949 లో పార్టీ ఆధ్వర్యంలో తమ పెళ్లి జరిగిందని చెప్పారు కానీ అసలు పెళ్లి ప్రస్తావన వచ్చిందే 1949 డిసెంబర్ క్రిస్టమస్ సెలవల సందర్భంగా జరిగిన విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర సభల తరువాత కనుక పెళ్లి 1950 ప్రారంభంలో జరిగి ఉండాలి.పార్టీ పై ఉన్న నిషేధాల కారణంగా కాపురం అజ్ఞాతవాసంలోనే సాగింది. 1951 మే నెలలో కూతురు శిరీష పుట్టింది.ఇక అక్కడి నుండి కుటుంబ బాధ్యత ను పరిపూర్ణ ఒంటరిగానే మోయవలసి వచ్చింది. ఒక బిడ్డతో మద్రాసు లో ప్రవాస జీవితం,ఏలూరు లో రెండవ బిడ్డ అమరేంద్ర పుట్టాక బతుకు తెరువు వెతుకులాటలో ఉపాధ్యాయ శిక్షణ పొందటం ,ఆదిపూర్తయ్యేసరికి మూడవ సంతానం శైలేంద్ర కలగటం -వాళ్ళ పోషణ కోసం ఉద్యోగాల వెతుకులాట- ఈ క్రమంలో కమ్యూనిస్టు కార్యరంగం నుండి పరిపూర్ణ నిష్క్రమణ అనివార్యం అయింది.

1952 ఎన్నికల సందర్భంలో కూడా మద్రాసు ప్రజానాట్యమండలి చేపట్టిన ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఊరూరూ తిరుగుతూ ప్రదర్శనలిచ్చిన పరిపూర్ణను ఒక దశాబ్ది కాలం పార్టీ పనులకు ఒక సాంస్కృతిక కార్యకర్తగా ,ఒక విద్యార్థిగా ,ఒక మహిళగా తన సమయాన్ని,గొంతును, హృదయాన్ని ,బుద్ధిని సమర్పించి పనిచేసిన ఆమెను నీ మానాన నీవు జీవించు అని పార్టీ వదిలేసిందనుకోవాలా? 1947 నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో క్రియాశీల పాత్ర వహించి, పోరాట విరమణ తరువాత ఎవరిళ్ళల్లో వాళ్ళు ఊపిరాడని జీవితం జీవించటానికి సర్దుకు పోవలసి వచ్చిన మహిళల బాధను ,అనుభవాలను చెప్పిన 1986 నాటి ‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకం గుర్తుకు రావటంలేదూ!?

దాసరి అఖిల భారత విద్యార్థి నాయకుడిగా ,ఆ తరువాత పార్టీ పూర్తికాలపు కార్యకర్తగా ,నాయకుడిగా ఎదుగుతూ ముందుకు సాగుతుంటే పరిపూర్ణ అదే వేగంతో వెనక్కి ,ఇంట్లోకి నెట్టబడింది.మగవాళ్ల జీవితానికి ,ఎదుగుదలకు ఏ రకంగానూ అవరోధం కాని పెళ్లి, పిల్లలు ఆడవాళ్ళ ‘సహజ బాధ్యత’ అయి జీవితాన్ని కుంచింప చేయటం లో పనిచేస్తున్న శక్తి పితృస్వామిక అసమ సాంఘిక న్యాయం తప్ప మరొకటి కాదు. దాసరి ఏ కమ్యూనిస్టు క్రియాశీల సౌందర్యాన్ని పరిపూర్ణలో చూచి ఇష్టపడి పెళ్లాడాడో ఆ క్రియాశీలత ను ఆమెలో సదా నిలిపి ఉంచటం గురించిన చింతన ఇంతైనా ఆ తరువాత కనబరచ లేకపోయారంటే అది కమ్యూనిస్టులు కూడా గుర్తించలేకపోయిన లేదా గుర్తించ నిరాకరించిన ఆ పితృస్వామిక దురహంకార లక్షణం వల్లనే అనుకోవాలి.

పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే దాసరి భార్యాపిల్లలను పలకరించటానికి ఒక నిమిషం సమయాన్ని కూడా వెచ్చించక పోవటం ,నిర్లిప్తంగా, నిష్పూచీగా ఉండటం, భార్యా బిడ్డలకు బొత్తిగా చనువివ్వక పోవటం ఇలాంటివన్నీ -పరిపూర్ణ ను అసంతృప్తికి ,బాధకు గురిచేశాయంటే సహజమే మరి. భార్యాబిడ్డల బాధ్యత ఏ మాత్రం పట్టక పోగా భార్య జీవితం పైన,జీతం పైన అధికారాన్ని చూపే అతని అహంభావం ఆమెకు సహించరానిదే అయింది .ఇవన్నీ అతని భూస్వామ్య కుటుంబ లక్షణాలని పరిపూర్ణకు తెలుసు. కానీ ఒక కమ్యూనిస్టుగా వాటి నుండి బయట పడటానికి అతను ఏ ప్రయత్నమూ చేయక పోవటం ఆమెను ఎంతో గాయపరిచింది. అన్నిటా సమత్వాన్ని కాంక్షించే ఆదర్శ కమ్యూనిస్టు నేతకు అవే భూస్వామ్య రీతులు ,అవే నీతులా అని ఆవేదనతో ప్రశ్నిస్తారామె. ఆ రకంగా పరిపూర్ణ పెళ్ళికి ప్రాతిపదిక అయిన కమ్యూనిస్టు విలువల పునాది కదలబారిపోవటం చూస్తాం.
అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆమె కు ఎప్పుడూ గౌరవమే. పార్టీ పనికి దూరమై ,పార్టీ లో నాయకత్వ స్థాయికి ఎదుగుతున్న భర్త తో అసంతృప్త అశాంత వైవాహిక జీవితం గడుపుతూ ఆత్మహత్య చేసుసుకొందామన్నంత విరక్తి కలిగిన దశలో కూడా బాల్యం నుండి పార్టీ అందిస్తున్న స్ఫూర్తి తో ధైర్యానికి పట్టుదలకు మారుపేరుగా ఉన్న తాను నిస్పృహకు గురికావటమేమిటని కూడగట్టుకొని నిలబడిన చైతన్యం ఆమెది. పార్టీ ఇచ్చిన సమానత్వ విలువలను వాస్తవాచరణగా మలచుకొనని వ్యక్తులపైనే ఆమె విమర్శ ,నిరసన.
ఇక రెండవది.వర్ణాంతర వివాహం. దాసరి నాగభూషణ రావు గారిది ఏ కులమో నాకు తెలియదు కానీ పరిపూర్ణ మాటలలో అతనిది భూస్థితి బాగా వున్నకుటుంబం, భూస్వామ్య కుటుంబం. ‘పెద్ద కుటుంబం వాడు’ అని అతని గురించి ఒక చోట చెప్పినది కులానికి సంబంధించిన మాటే అయి ఉండాలి. తన పట్ల పిల్లల పట్ల అతని పట్టని తనాన్ని గురించి బాధ పడుతూ పరిపూర్ణ ఒక సంఘటనను ప్రస్తావించారు. నాలుగేళ్ళ కొడుకు అమరేంద్ర ఆడుకొంటూ పడి చెయ్యి విరిగి నొప్పికి ఏడుస్తుంటే ఇంట్లోనే ఉన్న దాసరి కొడుకును దగ్గరకు తీసుకొని ఓదార్చటం కానీ ,ఆసుపత్రికి తీసుకువెళ్లి కట్టుకట్టించుకు రావటం కానీ చేయ లేదని చెప్పి “ నాకప్పుడు ఏమనిపించిందంటే మేము తన సాటి కులం వాళ్ళమయి ఉంటే బిడ్డమీద ప్రేమ కనబరచి ,ముద్దు చేసి ఉండేవాడేమోనని. నన్ను కోరి చేసుకుంటేనేం?తనలో పసితనం నించీ జీర్ణించిన కులాధిక్యత ,ఇటు నా హీన కుల దీన స్థితి ,నాకు పుట్టిన బిడ్డల్ని చులకనగా ,నిర్లక్ష్యంగా చూసేట్టు చేస్తున్నాయేమో అని …”

అట్లాగే తాను సోషల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజర్ ఉద్యోగానికి ఎంపిక అయినప్పుడు దాసరి ఆ ఉద్యోగం చేయటానికి వీల్లేదని అభ్యంతర పెట్టాడని ,ఆ సమయంలో తల్లి తన పక్షాన జోక్యం చేసుకొని మాట్లాడబోతే ఆయన ఆమెను కసురుకొనటమే కాక కొట్టటానికి లేచి మీదిమీదికి వెళ్లాడనిచెప్తూ ‘ఎంత అవమానకరమైన సంఘటన ఇది?అత్తగారు తన సాటి కులం మనిషయి ఉంటే కొట్టటానికి ఇలా ఎగబడేవారేనా అని మనస్సు కలుక్కుమంది.’అని వ్యాఖ్యానించారు పరిపూర్ణ.

ఈ రెండు సందర్భాలు అంత ఆదర్శంగా భావించి చేసుకొన్న వర్ణాంతర వివాహం పరిపూర్ణకు ఎంతటి చేదు అనుభవాన్నిచ్చిందో స్పష్టం చేస్తాయి.నిజానికి వేల సంవత్సరాలుగా ఊడలు దిగిన కుల వ్యస్థను ,అది సృష్టించిన అంతరాలను అధిగమించటం అంత సులభం కాదని పరిపూర్ణకు తెలియకపోలేదు. కుల ఆంక్షలు,బహిష్కరణలు తీవ్రంగా ఉండే ఆ నాటి పల్లె వాతావరణంలో తనను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోలేకపోయినా ఏలూరులో పసి బిడ్డతో ఒంటరిగా ఉన్నప్పుడు అత్తగారు ఆడబిడ్డలు తనపట్ల స్నేహంగా మానవీయంగా ప్రవర్తించటం గురించి కృతజ్ఞతతో గుర్తు చేసుకోగలిగిన పరిపూర్ణ భర్త గురించి అలా బాధపడిందంటే కోరి చేసుకొన్నవాడి సాహచర్యంలో, సంభాషణలో,ప్రవర్తనలో కుల న్యూనత ఎంత అనుభవానికి వచ్చిందో .. ఎంత గాయపరచిందో … ఊహించుకోవచ్చు. కమ్యూనిస్టుగా అతను అభివృద్ధి చేసుకొన్న,చేసుకోవలసిన జీవిత విలువల గురించిన నమ్మకాలు, అంచనాలు ,ఆశలు కూలిపోతున్నసందర్భం నుండి ఆమెకు అలా అనిపించటం సహజమే.

ముగ్గురు అన్న దమ్ములు ,ఇద్దరు అక్కల మధ్య పెరిగిన పరిపూర్ణకు మగపిల్లలను ఎక్కువగా ఆడపిల్లలను తక్కువగా చూసే పెంపకపు పద్ధతి ఏ నాడూ తెలియదు.తన విద్యా విషయక ఆసక్తులను కానీ ,కళా సాంస్కృతిక రంగ ఆసక్తులను కానీ కనిపెట్టి ప్రోత్సహించినవాళ్ళే అంతా. ఉన్న వూళ్ళో చదువు అయిపోతున్న సమయానికే పెద్దన్న శ్రీనివాస రావు ఆమెను బెజవాడ తీసుకు వెళ్లి వేముల కూర్మయ్య గారి హరిజన హాస్టల్ లో చేర్పించి చదువు కొనసాగించే వీలు కల్పించాడు. సినిమా అవకాశాల కోసం సెకండ్ ఫారం చదువు మధ్యలో ఆపేసి బొంబాయి వెళ్లి వచ్చినాక ఆరేడు మైళ్ళదూరం లో వున్న బడికి రోజూ వెళ్లి రావటం ఎట్లానో తోచక దిగులు పడుతున్న సమయంలో మళ్ళీ పెద్దన్నయ్య వల్లనే మద్రాస్ లో దర్శి చెంచయ్య గారి దగ్గర ఉండి చదువుకొనే అవకాశం లభించింది.తల్లీ తండ్రీ ఇద్దరూ ఉపాధ్యాయులు, విద్యా ప్రేమికులు కనుక అండ దొరికింది చాలని పరిపూర్ణను దూర ప్రాంతమైనా పంపించటానికి సంసిద్ధమయ్యారు తప్ప ఆడపిల్లను కొత్త వాళ్ళ మధ్యకు ఎలా పంపుతాం అనుకోలేదు. ఒక్క దాన్నే రైల్ ఎక్కించి పంపాలన్నప్పుడు మాత్రం చిన్నపిల్ల ఒక్క దాన్నీ ఎలా పంపటం అని కాస్త దిగులు పడ్డారు.చండ్ర రాజేశ్వర రావుగారూ ,సావిత్రమ్మ గారూ ధైర్యం చెప్పటం తో అదీ వదిలేశారు. 1943 లో పన్నెండు పదమూడేళ్ల పరిపూర్ణ తన చదువు కోసం గుర్తింపు చిహ్నంగా పార్టీ జండాను పట్టుకొని ఒంటరిగా మూడవ తరగతి రైలు పెట్టెలో ప్రయాణించి మద్రాస్ చేరిందంటే అద్భుతంగా లేదూ !? ఆ నాటికే ఆమెకు వంటబట్టిన కమ్యూనిస్టు జ్ఞాన చైతన్యాలు కూడా ఆశర్యకరంగానే అనిపిస్తాయి. ఆంధ్రా వీక్ ఉత్సవాల సందర్భంలో ఆమె పాడిన పాటలు విని ,గాన మాధుర్యానికి ముగ్ధుడై నేషనల్ వార్ ఫ్రంట్ రీజనల్ డైరక్టర్ గా పని చేస్తున్నగుర్రం జాషువా పిలిచి వేసవి సెలవలు రెండు నెలలు యుద్ధానుకూల ప్రచారకార్యక్రమంలో పాటలు పాడటానికి ఆహ్వానిస్తే ప్రపంచాధిపత్యం కోసం జతకట్టిన సామ్రాజ్య వాద దేశాలు సాగిస్తున్న యుద్ధాన్ని మన దేశ ప్రజలు ఎందుకు బలపర్చాలి అని ప్రశ్నించి,తిరస్కరించ గలిగిన విలువలు పన్నెండు పదమూడేళ్ళ వయసుకే ఆమె అభివృద్ధి చేసుకోగలిగింది అంటే ఆశ్చర్యం కాదూ మరి…!

పుట్టుకతో వచ్చిన కులం , మహిళ కావటం పరిపూర్ణను వేదనకు గురి చేసిన కాలం ప్రధానంగా పెళ్లి జరగటానికి ,విఫలమవటానికి మధ్య గడచిన పది పన్నెండేళ్ల కాలం. నంబూరి పరిపూర్ణ , దాసరి నాగభూషణరావు పెళ్లివరకు కమ్యూనిస్టు ఉద్యమ భాగస్వాములుగా సమాన స్థాయి మనుషులే . భర్తతో భార్య ఎందులోనూ , ఎప్పటికీ సమం కాదు అని చెప్పే మనుధర్మం ప్రకారం పెళ్లి కావటం వల్ల దాసరి భర్తగా పరిపూర్ణ కన్నా పై స్థాయి వాడైపోయినాడు. మహిళగా రెండవ స్థాయి, కులం వల్ల అయిదవ స్థాయి మనిషి అయిన పరిపూర్ణ అందువల్లే ఆయనకు లోకువ అయింది.మద్రాస్ సేవాసదన్ బడి చదువు నాడే -దానికి అనుబంధం గా ఉన్న హాస్టల్ యాజమాన్యం చూపే ధనిక పేద భేద భావాన్ని ,వివక్షను ధిక్కరించి ఆత్మగౌరవ చైతన్యంతో తానిక అందులో ఉండనని ధిక్కరించి వచ్చిన పరిపూర్ణ ఒక విశాల సామాజిక రాజకీయ జీవితాన్ని నిర్మించుకున్న తరువాత కూడా కులం,జండర్ కారణంగా దాంపత్య సంబంధాలలో వివక్ష అనుభవం అవుతుంటే ఎంత క్షోభకు గురి అయినారో వూహించు కోవలసిందే.
అయితే క్షోభను శాశ్వతం చేసుకొని క్రుంగి పోవటం పరిపూర్ణ స్వభావం కాదు. జీవితం పట్ల ప్రధానంగా ఆమెది సానుకూల వైఖరి.తన కష్టాలకు కారకులని ఎవరినో తిడుతూ కూర్చోటం కాక తన జీవితాన్ని తాను నిర్మించుకొనటం కోసం ఉద్యోగాన్ని ఊతగా చేసుకొని1960 నుండి జీవితంలో రెండవ పర్వం ప్రారంభించారు ఆమె.ఉద్యోగం చేస్తూ తల్లి సహాయంతో పిల్లల ను పెంచి ప్రయోజకులను చేశారు.పూర్వ ఉద్యమ అనుభవాల వాసన వల్ల ఉద్యోగ నిర్వహణలో భాగంగా గ్రామీణ మహిళల సంక్షేమం గురించి శ్రద్ధ పెట్టారు. ,దళితుల గురించి ప్రత్యేక సామాజిక కార్యకలాపాలను చేపట్టారు.సాహిత్య కృషి సాగించారు.ఈ క్రమం అంతటిలో వెలుగునే చూడటం పరిపూర్ణ గారి ప్రత్యేకత. తన ఎనభైఆరేళ్ల బతుకు పుస్తకానికి ‘వెలుగు దారులలో’ అని పేరు పెట్టటం దానినే సూచిస్తుంది. వివేకవంతులైన మనుషుల గమనం ఎప్పుడూ వెలుగు లక్ష్యం గానే సాగుతుంది. సాగాలి. వెలుగు వైపే తీసుకువెళుతుంది అనుకొని తొక్కిన దోవ ఒక్కొక్కసారి చీకటి గుయ్యారాలలోకి ఈడవవచ్చు,ఊబిలోకి లాగవచ్చు. అలాగని వెలుగే లేదనుకొనటం కానీ,దారుల మీద అపనమ్మకంతో నడకే వద్దనుకొనటంకానీ అభివృద్ధికర ఆలోచనలు కావు.చిన్నప్పటి నుండి సామాజిక అభ్యుదయానికి అభివృద్ధికి సంబంధించిన సమిష్టి చేతనతో పెనవేసుకొని పెరిగిన వ్యక్తిత్వం పరిపూర్ణను అలా అనుకోనియ్యలేదు. చీకట్లను ,చికాకులను అధిగమిస్తూ వెలుగువైపు చేసే నిరంతర ప్రయాణమే బతుకు అన్న పరిణితి వల్లనే ఆమె తన స్వీయ చరిత్రకు అలా పేరు పెట్టారనుకోవచ్చు.

పరిపూర్ణగారి స్వీయ చరిత్ర లో నాకు బాగా తెలిసిన సూర్య ముఖి గారు ,కె ఎస్ ఆర్ జి ప్రసాద్ గారు ఉన్నారు. వాళ్లిద్దరూ భర్యాభర్తలు. వరంగల్ లో ఉంటారు. బాల్యం నుండి వాళ్ళ పెద్దమ్మాయి సుధ స్నేహం వల్ల వాళ్ళింట్లో మెలిగినదాన్ని. వాళ్ళింటికి తరచు వచ్చే ఆవిడ అన్నగారు మహీధర రామమోహన రావు గారితో నా తొలి పరిచయమూ అక్కడే . మా సూర్యముఖి మేడం పరిపూర్ణగారికి రాజమండ్రి బడి చదువుల కాలపు స్నేహితురాలు. ఆమె అయిదవ ఫారంలో ఉండగా తూర్పు గోదావరి జిల్లా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి మహీధర జగన్మోహనరావు పరిపూర్ణను తమ ఇంట్లో ఉండమని తీసుకువెళ్లారు. ఆయన అన్న రామమోహనరావు,తమ్ముడు కృష్ణమోహనరావు కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబం అది.ఈ ముగ్గురు అన్నదమ్ముల చెల్లెలు సూర్యముఖి. ఆమెతో పరిపూర్ణకు అలా అక్కడ స్నేహం కలిసింది.ఇంటర్ చదువుతుండగా విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో కూడా ఇద్దరూ కలిసి పనిచేశారు. విద్యార్థి ఫెడరేషన్ ఉద్యమ నిర్వహణలో ఉన్న బలమైన నాయకత్వం గురించి ప్రస్తావిస్తూ పరిపూర్ణ కే ఎస్ ఆర్ జి ప్రసాద్ గారి పేరు కూడా ప్రస్తావించారు.అంటే అప్పటి స్నేహాలు, ఉద్యమాలు,ఉద్వేగాలు -అవే వారిద్దరినీ జీవిత సహచరులను చేశాయన్నమాట. పరిపూర్ణ జీవితం లో తారసపడిన వ్యక్తులు ఎక్కువమంది కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర నిర్మాణంలో ‘నేను సైతం’ అంటూ పనిచేసినవాళ్ళే. అలాంటి వాళ్ళ గురించి మరింత తెలుసుకొనటానికి ప్రేరణ ఇస్తుంది పరిపూర్ణగారి స్వీయ చరిత్ర.

ఈ స్వీయ చరిత్రలో రేడియా కళాకారిణిగా పరిపూర్ణ గురించి తెలియ చెప్పే విశేషాలు కూడా చాలా ఉన్నాయిమద్రాస్ లో చదువుకున్న ఏడాది కాలంలో రేడియోలో .పాటలు పాడటమే కాక అనేక నాటికలలో ప్రధాన భూమికలు పోషించారామె. ఆ సందర్భంగా రేడియోలో పనిచేసిన బాలాంత్రపు రజని కాంతరావు గారి నుండి తనకు లభించిన శిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పారు . ఆచంట జానకిరామ్ ,జలసూత్రం రుక్మిణనాథ శాస్త్రి ,ప్రయాగ నరసింహ శాస్త్రి మొదలైన సాహితీ ఉద్దండుల ఆధ్వర్యంలో మల్లిక్,రేడియో భానుమతి మొదలైన తనతోటి కళాకారుల గురించి కూడా ప్రస్తావించారామె.ఈ కాలపు నాటకాలతో పాటు బడి చదువుల కాలంలో వేసిన పౌరాణిక నాటకాలు, ప్రజానాట్యమండలి కళాకారిణిగా వేసిన అభ్యుదయ నాటకాలు -అన్నీ కలిపి నాటక రంగస్థల చరిత్రలో పరిపూర్ణ పాత్రను నమోదు చెయ్యవలసే వున్నది.

పరిపూర్ణగారిది తాతల నాటి నుండి సాహితీ వ్యవసాయం చేసిన కుటుంబం. తన తాతలు ఏడుగురిలో చిన్న శేషయ్య దాసు,వెంబదాసు ,శీతయ్య దాసు కవులు అని చెప్పిన పరిపూర్ణ వారి రచనలు పేర్కొని ఉంటే బాగుండేది. ఆలాగే తన అన్నలు ఇద్దరూ కూడా కవులు ,నాటక రచయితలు అని చెప్పిన పరిపూర్ణ చిన్నన్న దూర్వాసమహర్షి రాసిన నిరుపేద ,లోకాలోకనం, అంబేద్క రీయం అనే కావ్యాల పేర్లు చెప్పారుకానీ పెద్దన్న శ్రీనివాస రావు రచనలను వేటినీ ప్రస్తావించలేదు. తెలుగు దళిత సాహిత్య చరిత్రను సమగ్రం చేయటానికి ఈ సమాచారమంతా కావాలి. దానిని సేకరించి అధ్యయనం చేయవలసిన బాధ్యత వర్తమాన పరిశోధకులది.

సార్థక జీవితానికి ,సాఫల్య జీవితానికి నిలువెత్తు నిదర్శనం పరిపూర్ణ గారి జీవితం. దుఃఖ కారణమైన వ్యక్తులనైనా ,వ్యవస్థాగత శక్తులనైనా విమర్శించటమే కానీ ద్వేషించటం తెలియని తాత్విక స్థాయిని అందుకున్న పరిపూర్ణ జీవితం అది.అందుకే ఆమె స్వీయ చరిత్ర ఎంతో స్ఫూర్తి దాయకం.

-కాత్యాయనీ విద్మహే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)