మేఘసందేశం-04 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

కాళిదాసు మేఘసందేశం శ్లోకాల్లోకి వెళ్ళేముందు ఆయన గురించి ప్రచారంలో ఉన్న ఒక చిన్న కధ చెపుతాను. ఇది యదార్ధమా? లేక కట్టుకధా? అనే విషయం పక్కన బెడితే ఇందులో అనేక విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఒకరోజు మహాకవి కాళిదాసు మండు వేసవిలో వేరే పట్టణానికి బయల్దేరాడు. మధ్యాహ్నసమయానికి ఒక చిన్న కుగ్రామానికి చేరుకున్నాడు. విపరీతంగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడట. ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆ పాపను చూసి “పాపా! నాకు చాలా దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వు” అని అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక.. “మీరెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇవ్వగలను” అని బదులిచ్చింది. కాళిదాసు వెంటనే “నేను ఎవరో తెలియకపోవడం ఏమిటి? గొప్ప పండితుడను. ఎవరిని అడిగినా నా పేరు చెబుతారని అన్నాడు. అహంకార పూరితమైన ఆ మాటలు విని బాలిక పక పక నవ్వి “మీరు అసత్యమాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితేనే నీళ్లు ఇస్తాను” అంటుంది. అప్పుడు కాళిదాసు కొంచెంసేపు ఆలోచించి “పాపా! నాకు తెలియదు. గొంతు ఎండిపోతోంది. ముందు నీళ్లు ఇవ్వు” అని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక వినిపించుకోకుండా “ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం” అని చెప్పి “ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?” అని మళ్ళీ అడుగుతుంది. “అమ్మాయీ! నేను బాటసారిని” అన్నాడు కాళిదాసు. దానికి ఆ అమ్మాయి…”చూశారా! మళ్లీ అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి. మీరేమో అలిసిపోయారు కదా. ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు!” అనేసి గుడిసెలోకి వెళ్లిపోయింది బాలిక.
దాహానికి తట్టుకోలేక…. ఆ గుడిసె ముందే నిలబడి.. “మాతా! నీళ్లు ఇవ్వండి. దాహంతో చనిపోయేలా ఉన్నాను” అని మరింత ప్రాధేయపడ్డాడు కాళిదాసు. ఆ సమయంలో లోపలి నుంచి ఓ పండు ముదుసలి ఒకామె బయటకు వచ్చి.. “మీరెవరో సెలవివ్వండి.. నీళ్లిస్తాము” అన్నది. కాళిదాసు మరింత దీనంగా ” ఓ తల్లీ! నేను అతిథిని” అని బదులిచ్చాడు. దానికి ఆ అవ్వ “మీరు అసత్యం చెబుతున్నారు, ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎపుడు తిరిగి వస్తాయో ఎవరికీ తెలియదు” అంటుంది. కాళిదాసు మరింత దాహంతో బాధపడుతూ “అమ్మా! నేను సహనశీలిని దయచేసి నీళ్లు ఇవ్వు” అని మరింతగా వేడుకుంటాడు. కానీ ఆమె “మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నాయనా! నీవెవరు?” అని నిలదీసి అడిగింది. ఇక కాళిదాసుకు ఓపిక నశించి కోపంతో “నేను మూర్ఖుడను. ఇప్పుడైనా మంచినీళ్లివ్వండ”ని అడిగాడు. దానికి ఆ అవ్వ మళ్ళీ నవ్వుతూ..”ఇదీ అసత్యమే సుమా! ఎందుకంటే ఈ రాజ్యంలో ఇద్దరే ఇద్దరు మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పి పండితుడు అనుకుంటున్నాడు” అని అంటుంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. నాయనా! కాళిదాసూ.! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ…. అహంకారం కాదు నాయనా! కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష పెట్టాను” అని జలమును అనుగ్రహిస్తుంది. ఈ నీతి కధలో కాళిదాసుకు గర్వభంగం మాట అటుంచితే, ఆకలి, దాహం ఎంత బలవంతమైనవో, అలుపెరుగని సూర్య చంద్రులనే బాటసారులగురించి, ధనం, యవ్వనం ఎంత క్షణికమైనవో, భూదేవి, వృక్షాలు ఎంత సహనశీలురో, మూర్ఖులు ఎవరో తెలుసుకోవడం ప్రధానం. అనాటి నుండి కాళిదాసు ప్రజలకు మరింత చేరువయ్యే కవిత్వం, కేవలం రాజులను మాత్రమే కాకుండా ప్రజలనుసైతం రంజింపజేసే కవిత్వం రాయాలని నిశ్చయించుకున్నాడట.

మళ్ళీ మనం మేఘసందేశం లోకి వద్దాం.

శ్లో.14.అద్రేః శృంగం హరతి పవనః కిం స్విదిత్యున్ముఖీభి
ర్దృష్టోత్సాహశ్చకితచకితం ముగ్ధ సిద్ధాంగనాభి:
స్థానాదస్మాత్సరసనిచులా దుత్పతోదఙ్ముఖ: ఖం
దిఙ్నాగానాం పథి పరిహర౯ స్థూలహస్తావలేపాన్

భావం : ఓ మేఘుడా! నీవు ప్రయాణానికి బయలుదేరినపుడు అమాయకులైన, ముగ్ధులైన సిద్ధవనితలు గాలి కొండశిఖరాన్ని తీసుకొని పోతున్నాడేమో? అని భయపడి బెదరు చూపులు చూస్తారు. అవన్నీ నీకు మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయిలే! అంటూ, చల్లని నేల ప్రబ్బలి చెట్లుగల ఇక్కడినుండి లేచి, దిగ్గజాలు, తొండాలు విసురుతూంటే, త్రోస్తూ, ఉత్తరదిక్కుగా ఆకాశంలోకి ఎగురు అని చెప్తున్నాడు.

విశేషాలు: సిద్ధులు అనబడే వారు దేవతల్లో ఒక జాతివారు. ఈ జాతుల్లో విద్యాధరులు, అప్సరసలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు గుహ్యకులు, సిద్ధులు అనే వారు దేవజాతి విశేషాలుగా భావిస్తారు. వీరిలో సిద్ధ జాతి వారికి అణిమాది సిద్ధులు ఉంటాయి అంటారు. ఆ శక్తులు మొత్తం ఎనిమిది రకాలు. అవి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. వీటిని సాధిస్తే ఎవరైనా సిద్ధులవవచ్చు.

ఈ శ్లోకంలో ఉన్న ఇంకో విశేషం ఏమిటంటే మేఘం కొండంత ఉందని చెప్పడం. అలాగే ఇంకో విషయం గమనిస్తే సిద్ధ వనితలు బెదరు చూపులు మేఘుడికి ఎలా ఉత్సాహాన్ని ఇస్తాయి అంటే ఒకరి బెదరు ఒకరికి వేడుకగా ఉంటుందా? అంటే కాళిదాసు భావన అదే! పిల్లిని చూసి ఎలుక, కుక్కను చూసి పిల్లి బెదరడం లాంటిదే! మేఘుడు దిగ్గజంలా ఉన్నాడని అంటున్నాడు కాళిదాసు. గజం అంటే ఏనుగు, మరి దిగ్గజాలు అంటే…దిక్కుల్ని మోసే ఏనుగులు అన్నమాట. మనకు ప్రధాన దిక్కులు నాలుగు. విదిక్కులు కూడా నాలుగే! వీటిని మోసే ఏనుగులను గురించి తెలుసుకోవాలి. తూర్పు దిక్కును ఐరావతం, ఆగ్నేయాన్ని పుండరీకం, దక్షిణ దిక్కును వామనం, నైరుతిని కుముదం, పడమర దిక్కును అంజనం, వాయవ్యమును పుష్పదంతం, ఉత్తర దిశను సార్వభౌమం, ఈశాన్య దిశను సుప్రతీకం అనే గజాలు మోస్తూ ఉంటాయి. దేవాలయాలలో కూడా మందిరాల క్రిందుగా నాలుగువేపులా గజాలు ఉండడం మనకు పరిచితమే కదా! అందుకే మేఘుడిని యక్షుడు మరీ ఎక్కువగా పొగిడేస్తూ “దిగ్గజాలనే త్రోసిరాజనగలవాడవు సుమా! అని మేఘుడిని పొగడ్తలతో పడేస్తున్నాడు.

ముఖ్యమైన అర్ధాలు: అద్రే: = పర్వతము యొక్క కొమ్ము; ఉన్ముఖీభి: = ముఖాలు పైకెత్తినటువంటి; చకిత చకితం = భయం భయంగా; సరసనిచులాత్ = తడితో కూడిన మెట్ట ప్రబ్బలి చెట్లు కల; ఉదజ్ముఖ: = ఉత్తరంవైపు ముఖం కలది; హస్తావలేపాన్ = తొండములు విదుల్చడం; ఉత్పత = పైకి ఎగురుము.

శ్లో.15. రత్నచ్ఛాయా వ్యతికర ఇవ ప్రేక్ష్య మేత త్పురస్తా
ద్వల్మీకాగ్రా త్ప్రభవతి ధనుఃఖండ మాఖండలస్య
యేన శ్యామం వపు రతితరాం కాంతి మాపత్స్యతే తే
బర్హేణేవ స్ఫురితరుచినా గోపవేషస్య విష్ణోః

భావం : మేఘునితో యక్షుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. రత్నాలయొక్క నానావిథములైన కాంతులు కలసి ఉన్నట్లు, ఎదుట ఉన్న పుట్టయొక్క శిఖరభాగం నుండి ఇంద్రధనుస్సు పుడుతోంది. ఆ ఇంద్రచాపంచేత నీ దేహం, గోపవేషం ధరించి, పింఛంతో ప్రకాశించే శ్రీకృష్ణుని శరీరంలా ప్రకాశిస్తుంది అంటున్నాడు.

విశేషాలు : మొదట ఉత్తరదిక్కుగా ఎగురు అని చెప్తూ… ఎదురుగా ఉన్న ఒక పుట్ట పైభాగంలో ఉన్న రంధ్రం నుండి ఒక ఇంద్రధనుస్సు పుట్టడం చూశాను సుమా! అది ఎలా ఉందో తెలుసా! అంటూ మేఘుడుని శ్రీకృష్ణునితో పోల్చి ఉబ్బి తబ్బిబ్బు అయేట్టు పొగుడుతున్నాడు. యక్షుడు కార్యసాధకుడు, తెలివైనవాడు. ఇంకో విషయం ఏమిటంటే.. ఇంకా పూర్తిగా ఆ ఇంద్రధనుస్సు పుట్టలేదు. అందుకే మహాకవి “ఆఖండలస్య ధనుఃఖండం” అనే పదం అన్నాడు. అంటే అర్ధం ఆఖండలుని ధనుస్సు యొక్క ముక్క లాగా అని. సరే! ఆఖండలుడు అంటే ఇంద్రుడు. శత్రువులను ఖండించువాడు అనే అర్థంలో ఆయనకు ఆ పేరు వచ్చింది కాబట్టే ఇంద్రునికి విశేషణంగా ఆఖండల శబ్దాన్ని వాడి, ధనుశ్శబ్దంతో కలిపేశాడు కాళిదాసు. ఇంకా శ్రీకృష్ణుడిని గురించి చెప్తూ గోపవేషం ధరించిన విష్ణువు లాగా అన్నాడు. కృష్ణునిది మామూలు కాంతి కాదు “అతితరకాంతి” అంటే యెక్కువ కాంతిగా ఉందట. అందువల్ల మనం మామూలు నలుపని భ్రమపడరాదు. ఇంద్రధనుస్సు ఎన్ని వర్ణాలతో ఉందో! “విబ్జియార్” (vibgyor) కదా! అదే పద్మరాగాది రత్నకాంతులతో ఉందని చెప్పడం మరి. నవ రత్నాలు కదా! అవి మరకతం, పద్మరాగం, ముత్యం, పగడం, నీలం, పుష్యరాగం, వజ్రం, గోమేధికం, వైఢూర్యం. ఇన్ని రంగులతో ఇంద్రధనుస్సు శోభిస్తుందని చెప్పడం.
ముఖ్యమైన అర్ధములు: వ్యతికర ఇవ = కలయికలాగ; అఖండలస్య = ఇంద్రుని యొక్క; పురస్థాత్ = ముందు భాగము; వల్మీకాగ్రాత్ = పుట్టయొక్క కొన నుండి; గోపవేషస్య = గోపబాలకునివేషంలో; బర్హేణ ఇవ = నెమలి పింఛం లాగా; ఆప్స్యయతే = పొందగలరు.

శ్లో.16. త్వ య్యాయత్తం కృషిఫల మితి భ్రూవికారా నభిజ్ఞైః
ప్రీతిస్నిగ్ధైర్జనపదవధూలోచనైః పీయమానః
సద్యః సీరోత్కషణసురభి క్షేత్ర మారుహ్య మాలం
కించి త్పశ్చా ద్వ్రజ లఘుగతి ర్భూయ ఏవోత్తరేణ

భావం = ఓ మేఘమా నీవు వర్షించినట్లైతే పైర్లు పండుతాయి. అందువల్ల పల్లెపడుచులు,నిన్ను ప్రేమగా చూస్తారు. భ్రూవిలాసాలు తెలియని వారి చూపులు నీకు తెలుస్తాయి. దున్నిన కొండభూములపై నీవు వర్షిస్తే, పరిమళం కల్గుతుంది. కొంచెం పడమరగా పోయి, తిరిగి ఉత్తర దిశగానే వేగంగా ప్రయాణించు సుమా!

విశేషాలు: కృషి అంటే ఆరోజుల్లో అర్ధం వ్యవసాయం. కృషీవలుడు అంటే వ్యవసాయదారుడు అని అర్ధం. మరి ఈ రోజుల్లో దీని అర్థం “కృషితో నాస్తి దుర్భిక్షం” అని అనడం కష్టపడితే, పట్టుదలవుంటే దేన్నైనా సులభంగా సాధించవచ్చంటారు. అసలు శ్లోకం ఏమిటంటే “కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం| మౌనేన కలహం నాస్తి నాస్తి జాగ్రతో భయం|| “. సరే! ఇక్కడ కాళిదాసు “వధువులు” అనే పదం వాడాడు. దానికి స్త్రీలు అని అర్థం అనుకోవచ్చు. పెండ్లికూతుళ్లు అనే అర్థం ఇంకోటి. నవ వధువు అంటాం కదా! “ప్రీతిస్నిగ్ధైః లోచనైః” అనడంలో ఏమాత్రం కూడా కృత్రిమత్వం లేని అసలు సిసలు ప్రేమతో తడిసిన కళ్లని చెప్తున్నాడు కాళిదాసు. ఆయన ఉపమలంటే అంతే మరి. ఎంత సుందరంగా అన్నాడో కదా! అలాగే “భ్రూవిలాసాలు” అంటే స్త్రీలు కనుబొమలను రకరకాలుగా త్రిప్పడం మనకు తెలిసినదే కదా! మాలం అనే పదం కూడా ఈ శ్లోకంలో ఉపయోగించాడు. దాని అర్ధం దున్నిన కొండభూములపై, వర్షిస్తే మంచి సువాసన వస్తుందంటున్నాడు. నేలపై చినుకులు పడ్డాక తడిసిన మట్టివాసన ఎంత బావుంటుందో మనకు సుపరిచితమే కదా!

ముఖ్యమైన అర్ధములు: త్వయి = నీయందు; సీర = నాగలి; ఉత్కషణ = దున్నుట; ఆరుహ్య = యెక్కి; పశ్చ్చాత్ = పడమర వేపు; భూయ: = మరలా; వ్రజ = వెళ్ళుము.

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)