ముందడుగు వేస్తున్న కవయిత్రుల సమ్మేళనం- కొండేపూడి నిర్మల

కవిత్వానికి వచనానికి ఖచ్చితమైన సరిహద్దు రేఖ వుంది. అది తెలుసుకోకపోతే ఈ ప్రక్రియ క్రమంగా మరణించే ప్రమాదం వుంది. మనం ఎక్కడ తేలిపోతున్నామో అక్కడ దిగి నిలబడటానికి కావలసిన చోటు వెతుక్కోవాలి. సాహిత్య ప్రక్రియల్లో కవిత్వానికి, అందులోనూ కవులకి, అందులోనూ కవయిత్రులకి ఇప్పుడు దక్కుతున్న ప్రాతినిధ్య౦ చూస్తే చాలా బాధ కలుగుతోంది. అకవిత్వానికి వేదికలపై ఊరేగింపులు జరుగుతున్నాయి. వాసి ఎప్పుడే పోయింది రాసి మాత్రం గుట్టలుగా వుంది. ప్రచార సాధనాలు ప్రకటనలకు రాజకీయ కుమ్ములాటలకి ఇచ్చిన విలువ సాహిత్యానికి ఎప్పుదూ ఇవ్వవు. బ౦డెడు అనాసక్తికరమైన ముఖ పుస్తక వేదికలమీద ఎక్కడో ఒకచోట మినుకుమనే మెరుపు కవితలు సొంత గోడలకు వేలాడుతున్నాయి. అన్నిటిని పోగేస్తే ఒక ఇంద్ర ధనుస్సు అవుతుందేమో. ఆ పని ఎవరు చేస్తారు? కవయిత్రుల సంఖ్య పెరుగుతున్నందుకు సంతోషించాలో లేక ఈ అసాహిత్య అనాదరణ వాతావరణానికి వారసులు అవుతున్నందుకు విచారి౦చాలో తెలిడంలేదు. ఇంకోపక్క కనీసపు ఆసక్తి , అభినివేశం లేకు౦డా “మాకూ వుంది లెండి దురద, మేమూ రాస్తాము లెండి కపిత్వం ..” అని కొందరు ఒక గొప్ప ప్రక్రియని అవమానిస్తు౦టే, మనకి కోపం కూడా రావడంలేదేమిటి ? కోపానికి పూర్వ రూపం ప్రేమ కదా. మనకి కవిత్వం మీద వుండాల్సినంత ప్రేమ లేదా ? లేకపోతే వచనం వేరు కవిత్వం వేరు అని ఎందుకని సాధికారికంగా చెప్పలేకపోతున్నాం. క్రియారూపంగా ఎ౦దుకని నిరూపించలేకపోతున్నాం.

ఇదిగో … ఈ ఆలోచన ఒక్కటే మన కవయిత్రుల సమ్మేళనానికి రూపం ఇచ్చింది. ఘనమైన పేర్లు, ఎజెండాలు, అద్యక్ష పీఠాలు గట్రా పటాటోపాలు లేకుండా ఇద్దరు ముగ్గురు కవయిత్రుల౦ కలిసి చర్చించుకుని. ఫేస్ బుక్ వాల్లో పోస్ట్ చేశాం . స్పందన ఇచ్చిన వారితో బాటు ఇతర కవయిత్రులకు వాట్సప్ గ్రూప్ ద్వారా ఆహ్వానం పంపి౦చాం. అంతే. వారంలోగానే కవియిత్రుల సమ్మేళనం జరిగిపోయింది.

ఇది ఒక చిన్న కదలిక . సంచలనం . కుల మత, ప్రాంతీయ బేధం లేకు౦డా కవిత్వం మాత్రమే తమ చిరునామాగా వున్న అందరూ పాల్గొనవచ్చు అనే మా అనే విశాల దృక్పధం అందరికి నచ్చింది. దాదాపు ఇరవై మంది దాకా తమ అంగీకారం తెలిపారు. ఎప్పుడో రాసిన పాత కవిత్వాలు చదువుకోవడం కాకుండా , ఒక సమకాలీన సమస్య గురించి ముందుగా నిర్ణయించుకున్న అంశం మీద మాత్రమే కవిత్వం రాయాలని నిర్ణయించుకున్నాం. దానివల్ల ఆ సమస్య మీద ఆలోచన పెట్టడం , తెలుసుకోవడం, చదువుకోవడం సమస్యని పరిశీలించడం లాంటి అనేక ప్రయోజనాలు ఏక కాలంలో జరుగుతాయి. తర్వాత నిరంతరం కవిత్వం రాయడం అనే ప్రక్రియకి అలవాటు పడతా౦. ఈ కృషి వల్ల నిర్మాణ పరంగా కవిత్వం చిక్కబడుతుంది.

మొదటి కవితా సమ్మేళనం లో కవితా వస్తువు విద్యార్ధులు- ఆత్మ హత్యలు .

ఇది ఎంత క్లిష్టమైన సమస్యో చెప్పనవసరం లేదు. ఇందులో శీలా సుభద్ర,- ‘భద్రం చెల్లి’ అనే కవితలో జీవితాన్ని ఊరికొయ్య ఆక్రమించిన తీరు గురించిదాన్నించి తప్పించుకోవాల్సిన మెలకువ గురించి హృద్యంగా రాశారు.
కొండేపూడి నిర్మల –‘ ఉయ్యాల వర్సెస్ ఉరితాడు’ కవితలో ఉయ్యాలని ఉరితాడుకి నడిపించిన వ్యవస్థ దుర్మార్గం గురించి చెబుతుంది. ఎవరేజ్ కుర్రాడుగా పుట్టడమే నేరమా అని అడిగిన తల్లి వేదన కనిపిస్తుంది.
రేణుకా అయోల – ఉరివేసుకోకముందు కవితలో , చదువు గోడలు దగ్గరగా జరిగి ఇరుకైన వైనాన్ని గురించి రాసింది.

స్వాతి శ్రీపాద, ‘అమ్మకి విన్నపం’ కవితలో బిడ్డ ఒక తల్లికి రాసిన ఉత్తరం చదివితే గుండే నీరవుతుంది
శాంతి ప్రబోధ – నేరం మొక్కడి కాదు సుమా అనే కవితలో విద్యార్ధుల ఆత్మహతలకు పెద్దలే కారణమని చెబుతూ వారి బాధ్యతను గుర్తు చేసింది

భండారు విజయ ,’ నక్షత్రాలు వెదజల్లుతున్నాయ్’- కవితలో నిచ్చెన మెట్ల వ్యవస్ఠలో నలిగి చివికిపోయిన బాల్యం గురించి వేదనతో కలవరించారు.

సమ్మెట విజయ “ఆపండి ఇక ఆప౦డి “ కవితలో వ్యవస్థ లో వున్న అవ్యవస్థ రూపాన్ని గురించి కలత చెందారు
శైలజా మిత్ర ‘నిశ్శబ్ద యంత్రాలు’ కవితలో విద్యార్ధి అంటే విద్యను ఆర్జించేవాడెకాని తప్ప ఆర్జించలేని విగతజీవి కాదని చెబుతుంది.

మెర్సీ మార్గరెట్ తన “తలాష్” కవితలో తలకి చుట్టుకున్న దువా ప్రశ్నాపత్రపు చెరసాల అంటుంది
అరుణా నారద భట్ల తన కవితలో సమస్య రూపాన్ని వ్యక్త౦ చేశారు .

సి.హెచ్. ఉషారాణి , ‘కలలు కోల్పోయిన సీతాకొక చిలుక’ కవితలో బాల్యం బలవుతున్న తీరు గురించి బాఢ పడింది .

సమస్య పట్ల అంకిత భావాన్ని , మా కార్యక్రమం పట్ల మద్దత్తుని ఫ్రక టిస్తూ ప్రముఖ రచయిత్రి సాయి పద్మ వైజాగ్ నుంచి తమ కవిత మాకు పంపడం చాలా సంతోషం అనిపించింది.

ఆనాటి కవి సమ్మేళనంలో కవయిత్రులు అక్షరబద్ధం చేసిన ఆవేదన అందరి గుండెల్ని బరువెక్కించింది.
సమస్యకు కారణాలు కూడా మాట్లాడుకున్నాం. ఆ కవితల్లో కొన్ని నేటి నిజం పత్రికలో అచ్చయ్యాయి.ఇంకా కొన్ని అచ్చు కావాల్సి వుంది

రెండవ కవయిత్రి సమ్మేళనం – మూడ నమ్మకాలు –దొంగ బాబాలు

మనం తల్చుకుంటే ప్రభుత్వాల్నే మార్చగల౦. లేమా? గెలవలేమా? దొంగ బాబాల్ని, మూడ నమ్మకాల్ని , తిప్పికొట్టలేమా? ధన , మాన, ప్రాణ, పరువు మర్యా దల్ని కోల్పోయిన తర్వాత కాదు ముందే కనిపెట్టాలని కొందరు దొంగలు దొరికాక ఇప్పుడు అందరూ ఒప్పుకుంటారు.

మూఢ నమ్మకాలు -దొంగ బాబాలు –  అనే అంశామ్మీద జరిగిన కవయిత్రుల సమ్మేళనంలో పాల్గొన్నవారు వరగా ఎడమనుంచి –
సమ్మెట విజయ, ఉషారాణి, రమాదేవి, లీల, నిర్మల, జ్వలిత, అరుణ నారద భట్ల , రే నుకా అయోల , సుహాసిని , శాంతి ప్రబోధ, భండారు విజయ, హిమ బిందు 

అయితే మరి దొరకని దొంగల్ని ఏం చేద్దాం ? దొరికేవరకు ఆగుదామా? ఈలోగా పాదాభివందనాలు చేద్దామా ? ఈ మధ్య ‘మా౦చి’ బాబాలంతా ఒకటై దొంగ బాబాల వల్ల తమకు చెడ్డపెరోస్తోందని వాపోయారు. అయితే ఈ మ౦చి అంటే ఏమిటి ? మ౦చి బాబాల అవసర౦ మాత్రం మనకి వుందా ? ఇది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న.
అలాగే మూఢ నమ్మకాలు అనగానే , చాతబడి , బాణామతి, చిల్లంగి , జంతుబలి, మానవబలి , జోగిని, మాతంగి – అని అందరూ చెబుతారు. కానీ శకునం, దిష్టి, చెడుచూపు, మ౦చిరోజు/ చెడ్డరోజు, హస్తవాసి , పాదం పెట్టిన వేళ, జాతకాలు, వాస్తులు, బల్లి , పిల్లి, బొద్దిక శాస్తాలు, గ్రహణ స్నానాలు గట్రా మ౦చివేనా ?

మ౦చి బాబాల్లాంటివేనా ? వాటిని పాటిద్దామా ? పోనీ ముదిరేదాకా మోసపోదామా? ఇది పిచ్చి అయితే అది తలకి కట్టిన రోకలి కాదా?

ఒక మూడ విశ్వాసం ఏ స్థాయివరకు వ్యక్తిగతంగా వుండి ఎక్కడనుంచి సామాజికం అవుతుంది ? అని అదిగితే ఎవరి కొలబద్దలు వారికున్నాయి.

వ్యక్తిగతమ౦తా రాజకీయమే అని వాదిస్తున్న చోట ఈ కోణంలో చర్చ జరగాల్సిందే . కొన్ని విషయాలు మాట్లాడినప్పుడల్లా గొడవలు అయిపోతున్నాయి. సమాజంలోనే కాదు కుటుంబాల్లో కూడా.
మనం వీటి గురించి నిరంతరం పోరాటం చెయ్యాల్సివస్తుంది. స్నేహాలు, బంధుత్వాలు చెదిరిపోతూ వుంటాయి. నిరాశతో కూడిన అలసట వస్తుంది.

ఐరనీ ఏమిటంటే ఇవి నమ్ముతున్నవారు కూడా ఆద్దమైన బాబాల చుట్టూ తిరిగి , నానా గంగాల్లో మునిగి అలాగే అలిసిపోతున్నారు. మనం మన ఆలోచనల్ని, ఆత్మగౌరవాన్ని నమ్మినట్టే వాళ్ళు కూడా ఎవరో కల్పొంచిన భయాల్ని భ్రమల్ని నమ్ముతారు. ఆలోచిస్తే గుండే తరుక్కుపోతుంది.

ఈ పరిస్థితిని ఒక కవయిత్రిగా మీరెలా సమీక్షిస్తారు ?

ఆడవాళ్ళుగా మనం అనేక నమ్మకాలకు బలయిపోతున్నాం. మనుషుల్ని నమ్మి, ప్రభుత్వాల్ని నమ్మి, మానవసంబంధాల్ని నమ్మి , చరిత్రలో, సంస్కృతిలో , స౦ప్రదాయాల్లో కనబడుతున్న వివక్షని హింసని కూడా కళ్ళు మూసుకుని నమ్ముతున్నాం . అలా నమ్మదానికే మనం పుట్టాం అనుకుంటున్నాం.

ఇప్పుడు అదనంగా మూఢనమ్మకాల్ని బాబాల్నినమ్మాలా ? అవసరమా? ఒకడు పట్టుచీర కట్టి కార్తీక దీపం పెట్టమ౦టాడు ఇంకోడు అదే చీర విప్పి దిగంబర పూజ చెయ్యమ౦తాడు. ఎక్కడ చూసినా ఒకే ,దగా దగా కుడి ఎడమల దగా దగా ఈసారి ఇదే మన కవితా వస్తువు. కలాలు ఎక్కుపెట్టండి. పదునైన కవిత్వం రాయండి. అని పిలుపు ఇచ్చాం.

నవంబరు నెల 11 వ తేదీన రెండవ మూఢ నమ్మకాలు దొంగబాబాలు అనే వస్తువు మీద రెండవ కవిసమ్మేళనం జరిగింది.

ఇందులో పాల్గొన్న కవయిత్రులు, వారి కవితా శీర్షికలు, వస్తు పరిచయం క్లుప్తంగా – .

కొండేపూడి నిర్మల,- రాతి కన్నీరు – కవితలో మూఢ నమ్మక౦ వెనక , బాబాల మనుగడ వెనక వున్న మతం, రాజ్యం, వ్యవస్థ రూపాల్ని విమర్శ చేసింది .

రేణుకా అయోల – సర్కస్ డేరా –దొంగ బాబాలు మనుషుల్ని సర్కస్ లో చిలకల్లా ఆడితున్నాడు , అందరూ సిద్ధం కండి మోస పొండి – అని వ్య౦గ్యాస్త్రాలను సంధించింది.

శాంతి ప్రబోధ – నేనేం చెయ్యను? , కడుపులో చెయ్యిపెట్టి కష్టాలన్నీ/తోడేసి ఆశీస్సులు అందిస్తామనే/ స్వాముల ముసుగులోని సోంబేర్ల/జనంసొమ్ముతో యజ్ఞయాగాలు చేసే నేతలూ../ఉన్న గడ్డమీద/ఆవు చేలో మేస్తుంటే .. దూడ గట్టున మేస్తుందా ?- అంటూ నేటి వ్యవస్థకు ఒక వాత పెడుతుంది

జ్వలిత – నీ అగ్గెంత ?, – అనే కవిత లో స్త్రీలను బహిష్కరించిన అనేక దుర్మార్గాల్ని చిట్టా తీసి చూపెడుతూ పితృస్వామ్యపు పునాదుల్నికదిలించింది.

షాజహానా – ఉన్నది ఒకటే జిందగీ ,- అనే కవితలో పునర్జన్మల వున్న నమ్మకాల్ని, భ్రమల్ని చెదరగొడుతూ ఈ జన్మలో వున్నదే నిజం , వున్నది ఒకటే జిందగీ అనే విషయాన్ని సూటిగా నాటారు.

కొండపల్లి నీహారిణి – ఇప్పటి ప్రశ్న – బొమ్మల బంతుల గ౦తుల నుండి, ఆశల అలా పువ్వులు రాలినట్లు, అని సమస్యను చిత్రిక పట్టింది.

లక్ష్మి సుహాసిని, – మూసి వాయిన౦ – అనే కవితలో ఒక మూఢ నమ్మకం ఎనక వున్న నిస్సహాతని ప్రశ్నించింది.
భండారు విజయ –‘ నేనెవరో నాకు తెలియదు’ అనే కవితలో – మూఢ నమ్మకాలే సంప్రదాయం అయినచోట/ కనిపించిన ప్రతి చెట్టు దేవతీ కూర్చుంటుంది/ కొమ్మకు వేలాడే ప్రతి దీపం స్వామై పోతాడు / రుద్రాక్షలు ధరించిన ప్రతివాడు మహారాజై పోతాడు – అని సరాసరి స్వామీజీల దుర్మార్గాన్ని ఎండగడ్తుంది.

సమ్మేట విజయ – ఊపిరాడని క్షణాలు కవితలో , విచ్చుకోవలిసిన మొగ్గ/ మొదట్లోనే కుంచించుకు పోయి/మూఢనమ్మకాల్లో కూరుకుపోయింది../బలహీనతలు ఆవరించి బుర్ర పనిచేయనంది/ఎవరేంచెప్పినా అదే నిజమని నమ్మేసింది/అని నమ్మకానికి కారణాన్ని అందులో వున్న విషాదాన్ని కనిపెట్టింది.

ఉషారాణి – మన్నుతిన్న పాములు – మనిషి నుండి పారిపోయి./మనసు నుండి పారిపోయి/అసలేమీ లేని రికామీలోకాల్లో/మన్నుతిన్న పాముల్లా మారిపోవడం/ఎంత సుఖమోకదా /ఎంతైనా అజ్ఞానంలో ఉండే ఆనందమే వేరు- అని బాధపడింది .

అరుణ నారద భట్ల,- మాయ వెలుగులో –కవిత – కొన్ని నిస్సహాయ క్షణాల్లో మనుషులు జీవితాన్ని నిర్ణయించే నమ్మకాలై /భగవంతుడో ,బాబానో , అమ్మనో ఎలా ఆశ్రయిస్తారో అని బాధితుల పక్షాన కన్నీరు కురిపించారు.
అమూల్య కప్పగంతు – ఖమ్మ నుంచి తను కవి సమ్మేళనం కి రాలేక పోతున్నందుకు విచారిస్తూ , “ అతనో మంచి బాబా” అనే కవిత పంపించింది . వావివరసల కర్థాలు అతని నిఘంటువులో వ్యతిరేక పదార్థాలు../కళ్లకు కనిపించే వారంతా కామదాహ కేంద్రాలు…/భక్తంతా చెప్పు కిందేసి తొక్కేసే బూటకాలే…/వంచనలు, వయాగ్రాలు, కామసూత్రాల పరుపులపై పవళింపులే…/ఎగబడి చూసిన చూపులు ఇప్పుడు తెగబడిన చెప్పులయ్యాయ్‌ – అని బాబాల “వ్యక్తిత్వ వికాసాన్ని”నిరసనగా రాసింది.

దూరాభార౦ వల్ల ఇందులో స్వయంగా పాల్గొనలేని వారు తమ కవితలు ప౦పి సమస్య పట్ల తమ సంఘీభావాన్ని తెలిపారు. వారిలో దేవన పల్లి వీణావాణి ఒకరు. తను డేరా బాబా సంఘ తనకు స్పందిస్తూ “తెలుస్తుందా” అనే శీర్షికతో వాట్సప్ కి పంపారు. .

ఆనాటి మా కవిత్వం విని చర్చలో పాల్గొనడానికి ప్రముఖ రచయిత్రి దాసరి శిరీష వచ్చారు. సభ నిర్వాహకురాలు హిమాబిందు మౌనంగా వి౦టున్నట్టు కనిపిస్తూనే కీలకమైన ప్రశ్నలు వేశారు. సాహిత్య అభిమానులు రమాదేవి , గోపాలుని లీల తదితరులు శ్రద్ధగా విని నచ్చిన విషయాలు నోట్ చేసుకున్నారు. వీరిలో రమాదేవి ఈసారి తను కొత్తగా కవిత్వం రాసి తెస్తానని చెప్పడం స్పందన తాలూకు విజయంగా కనిపిస్తోంది.

కవిత్వానికి ముందు ఆసక్తికరమయిన చర్చ కూడా జరిగింది.

స్త్రీలు ఎందువల్ల ఈ మూఢనమ్మకాలకు , బాబాలకు లొంగిపోతున్నారు ? అనే కోణంలో మా దృష్టికి వచ్చిన కొన్ని అంశాల్ని ఒక జాబితా తయారు చేశాం . అది ఇలా వుంది

• అనేక కారణాల వల్ల స్త్రీలలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఒక వర్గంలో గృహ హిస, సామాజిక హింస , భద్రత లేనితనం వల్ల జీవితం సంక్షోభమైపోయింది . దీనివల్ల ఎవరితో పంచుకోవాలో తెలియక ఎవరు ఏది చెబితే అది నమ్ముతున్నారు. .

• ఈ పుట్టలో ఈ పాముందో అనుకుంటూ ఏదో ఒక బాబాబా ని నమ్మడం వల్ల కష్టాలు తొలగిపోతాయని వస్తారు.

• డబ్బు, తీరిక వున్న ఇంకో వర్గం నలుగుర్ని కలవడానికి వేదిక లేక గుళ్ళు, బాబాల సందర్శనాలు ఎంచుకుంటారు. కొత్త చీరలు నగలు కొనుక్కోవడానికి అలంకరించుకోవడానికి ఈ వేదికలు పనికొస్తున్నాయి.

• భక్తి అనేది ఫ్యాషన్ గా మర్రిపోయింది. ఎందుకంటే భక్తి పేరుతో చేసే పూజల్లో యాత్రాల్లో స్టేటస్ ని చూపించుకోవచ్చు.

• ఫ్రెండ్స్ దగ్గరికి వెడుతున్నాను అంటే అభ్య౦తార పెడతారు . అదే పూజలు స్వామీజీలు ఆ౦టే ఏమి అనరు. ఇది పనిలోంచి ఒకరకమయిన రిలేక్సేషన్ కూడా .

• నిజమైన భక్తి వుందా అంటే చెప్పడం కష్టం . అందరూ చేస్తున్నారు మనం చెయ్యకపోతే ఎలా అని కొందరు చేస్తున్నారు.

• పెట్టుబడిదారులు, న్యూస్ చానల్స్ నిర్వహిస్తున్న పూజల్లో అయితే ఎక్కువమంది కేవలం టీవీలో లో కనిపించడానికే చేస్తారు. ఏ రోజు ఎరంగు చీర కట్టుకురావాలో కూడా పూజలో చెబుతున్నారు. దీనివల్ల బట్టల షాపులకి గిరాకీ, పూజా వస్తువులు వాళ్ళే సప్లై చేస్తున్నారు కాబట్టి ఆరకంగా డబ్బు ఒక దోపిడి, ఒక నమ్మకంతో వెళ్ళినవాళ్ళకి పది రకాల నమ్మకాలు మూటకట్టుకుని వస్తున్నారు.

• అసలు ఆడవాళ్ళకి ఇవి కాక ఇంకేం వున్నాయో తెలీక కూడా వెడతారు చాలా మంది .

నిజంగా ఈ మూఢ నమ్మకాల వల్ల , బాబా వచనాల వల్ల ఎవరికయినా మేలు జరిగిందా అనే ప్రశ్న వేసుకున్నా౦.
ఒక పూజ చెయ్యడం వల్ల అనుకున్న పని జరగకపోతే అది వినియోగదారుల చట్టం కింద కోర్ట్ కి ఎందుకు వెళ్లకూడదు అనిపించింది. కానీ ఏదో ఒక మేరకు రచయితలతో సహా అందరూ ఈ ఆధ్యాత్మిక బావాన్ని నమ్ముతారు. కాబట్టి ప్రవచనాలు మనశ్శాంతిని ఇస్తాయి , అని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మిక వాదం మంచిదే కదా అని ఒకరు చెప్పారు. ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నవాటిలో అన్నీ స్త్రీలకి దళితులకి అనుకూలంగా వున్నాయా ? అనే ప్రశ్నకి కొన్నిలేవు కానీ , కొన్ని వున్నాయి అని ఒకరు చెప్పారు.
మూసి వాయిన౦ – శీర్షికతో సుహాసిని చదివిన కవిత చర్చకు దారి తీసింది. అది తెలంగాణా సంప్రదాయ౦ కాదు అని ఒకరు అన్నారు.

ఆంధ్రాలో ఇప్పటికీ నడుస్తున్న ఒక మూఢ నమ్మకం ఇది. ఒక తెగ కాదు అన్ని కులాల్లోనూ వుంది. దీనిమీద కధలు, సినిమాలు కూడా వచ్చాయి. ఈ కవితకు కారణమైన సుహాసిని వేదన కూడా నాకు తెలుసు. సమస్యని అర్ధ౦ చేసుకోయడానికి వివరణ ఉపకరిస్తుందనే ఉద్దేశ్యంతో మాత్రమే ఇది రాస్తున్నాను.

వరకట్న హత్యకు బలి అయిన కూతురికి పదకొండోరోజు సుమ౦గళీ వ్రతం పేరిట చేసిన చాటల నోము ఇది.
ఆ తల్లి ఎవరో కాదు సుహాసిని ప్రాణ స్నేహితురాలు. ఆ కూతురు ఎవరో కాదు తన కూతురి స్నేహితురాలు. అంటే ఒక మతం తాలూకు నమ్మకం ముందు మనిషి చైతన్యం కూడా ఎలా మూగబోతుందో అనేది తన బాధ. ఆ కవిత చదివిన వెంటనే చెమ్మగిల్లిన కళ్ళతో అలా కాసేపు వుండిపోవడం అందరు గమనించే వుంటారు. . సతీ సహగమనం చేసి గుడి కట్టడం లాంటిదే ఇది కూడా . ఎంత చదివి ఎన్ని ఊళ్ళేలినా తల్లీ కూతుళ్ళు ఒకర్నొకరు, భర్తల ఆయువు ను బట్టి సుమగళులుగా గౌరవించుకుంటారు వితంతువులుగా దూరం పెడతారు. కూతురి మరణం తాలూకు వేదన, సుమ౦గాళీగా పోయిందనే ఆలోచన తగ్గిస్తుంది. అంటే మతం తల్లీకూతుళ్ల బంధానికి కూడా మలినం చేస్తుంది. ఆ భాడకు కన్నీటి రూపం ఈ కవిత.

“బతికుండగానే ఉరివేయబడ్డ సుమంగళి కూతురికి /ఓ పిచ్చి తల్లి ఇస్తున్నది వాయిన౦ /ఈ మా౦గల్యాన్ని తగలేయ్యా ఎప్పటికి మారగల౦- “ అని కవయిత్రి గా బాధపడుతుంది సుహాసిని.

ప్రస్తుతం వున్న హిందుత్వ పోలిసింగ్ వ్యవస్థలో మత ప్రసక్తి తగ్గించి మాట్లాడితే మ౦చిదేమో అని ఒకరు సూచించారు. స్త్రీలు ఎదుర్కొంటున్న హి౦సకి మతానికి ప్రత్యక్షంగానే సంబంధం వుందని , మన మూడాచారాల పునాదుల్లో వున్నది కూడా మతమే అని కొందరు ఇంకా అంగీకరి౦చడం లేదు . కాబట్టి మంచి బాబాలు , మ౦చి నమ్మకాలు వుండాలి అని అభిప్రాయ పడ్డం కనిపిస్తోంది

అయితే వీటిని నమ్మకాలు అనాలా? భయ భక్తులు అనాలా ? ఇవి అసలు అవసరమా ? మనిషికి ఇవి బలాన్ని ఇస్తాయా? బలహీనత ఇస్తాయా ? అనే దిశగా ఇంకా భారీ ఎత్తున చర్చ జరగవలసిన అవసరం వుంది. అది కూడా డిసెంబరులో నిర్వహింహుకోవాలి అనుకుంటున్నాం.

మనం ఆటవిక సమాజం నుంచి నాగరికత సంతరించుకున్నాక ఒక చట్టం రాజ్యాంగం రాసుకున్నాక చట్టానికి భయపడాలి, దేవుడికి కాదు. నేరము శిక్ష వున్నాయి. వాటి నుంచి తప్పించుకోలేము .

 పాపం పుణ్యం, స్వర్గం , నరకం లాంటి పదాలు చాలా తికమక పెడతాయి. కాగా పాపం చేసినా వారికి పాప పరిహారాలు కూడా వున్నాయని. .చెప్పడంవల్ల నేరస్తులు చెలరేగిపోతారు. . బాబాల చుట్టూ తిరుగుతారు. సమాజం ఇలాగే వుంటుంది. సోమరి పోతుల్లాంటి బాబాల్ని తరిమికొట్టి, రాజ్యము ,చట్టము, నేరము, శిక్షా, హక్కులు బాధ్యతలు అనే పదాల్ని దాని సారాన్ని సామాన్య జనానికి గుర్తు చెయ్యాలి. అనిపించింది. ఈ విషయాల్ని రచనల ద్వారా చర్చల ద్వారా వెలుగులోకి తేవాలని అనుకున్నాం. బాఃద్యత ఇంకా పెరిగింది. విద్యార్ధుల ఆత్మహత్యలు అనే అంశం మీద లాగా ఏకాభిప్రాయాలు కాక మత ప్రసక్తి వుండటంవల్ల ఊహించినట్టుగానే దీనిపై భిన్న అభిప్రాయాలు వచ్చాయి. ఇవి చర్చకి బాగా ఉపయోగపడ్డాయి. వస్తు తీవ్రతని బట్టి డిసెంబరులో కూడా దీని మీద పెద్ద ఎత్తున సెమినార్ నిర్వహించుకోవడం అవసరం అనిపించింది .ఆ ప్రయత్నం లోనే వున్నాం.

– కొండేపూడి నిర్మల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య సమావేశాలు, , , , , Permalink

Comments are closed.