కోరుకున్న జీవితం(కథ ) – గంజాం భ్రమరాంబ

ప్రియాతి ప్రియమైన అమ్మా…

మనం ఒకే ఇంట్లో ఉన్నా, నా మనసులోని భావాలను నీకు తెలియజేయడానికి ఇలా ఉత్తరం వ్రాయక తప్పడం లేదు.

ఏమి చేయనమ్మా! నేను పొద్దున్నే నిద్ర లేవక ముందే క్లీనిక్ కి వెళ్లిపోతావు. రాత్రి నేను ఎంతసేపు మేలుకున్నా నిద్రపోయేలోపు ఒకరోజూ రావడం లేదు. ప్రతిరోజూ నాకొచ్చే కలలో మాత్రం ఫారిన్ లో రిసెర్చ్ వర్క్ చేస్తున్న నాన్న దగ్గరకు నువ్వూ నేను వెళ్ళి హాయిగా అక్కడి ప్రదేశాలన్నీ చూసి సంతోషంగా గడుపుతున్నట్లు ఎప్పుడూ అనిపిస్తుంది.అది ఎప్పటికైనా నిజమై తీరుందనే నమ్మకంతోనే ఈ బరువైన ఒంటరితనాన్ని మోయలేక మోస్తున్నాను.

అమ్మా…
నేనొకటి అడుగుతాను నిజం చెప్పూ… మనకు కోట్ల కొద్దీ ఆస్థులున్నాయి. కావలసినంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయినా తృప్తి పడకుండా పగలూ, రేయీ అని తేడా మరచిపోయి ఎందుకమ్మా ఎప్పుడూ పరుగులు తీస్తుంటావు?

మన హాస్పిటల్ కట్టిన కొత్తల్లో ఒకసారి మనమూ, అమ్మమ్మా, మామయ్యా వాళ్లూ అందరమూ తిరుమలకు వెళ్లాము. ఆ చక్కటి ప్రకృతిలో, ఆ కలియుగ వేంకటేశ్వరస్వామి దివ్యమంగళ దర్శనం అప్పుడు కూడా నీకు ఎప్పుడూ హాస్పిటల్ పైన ఆలోచనే కదా..

కాసేపైన బాహ్య విషయాలు పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండలేమా మనమూ.. మొన్న నా పదిహేడో పుట్టినరోజుకు నగరం లోని ప్రముఖులందరినీ పిలిచి గ్రాండ్ గా డిన్నర్ ఇచ్చావు. కోట్లు విలువ చేసే డైమెండ్ నెక్లెస్ కానుకగా ఇచ్చావు. వచ్చిన అతిధులు అందరూ నన్ను చూసి ” కావ్య చాలా అదృష్టవంతురాలు. డాక్టర్ గిరీష్ , డాక్టర్ సుధారాణి ల ఏకైక సంతానం. కావ్య పేరుతో కావ్యా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు.

ఇప్పుడు అది నగరంలోనే నెంబర్ వన్ పొజిషన్ లో గుర్తింపు పొందింది. డాక్టర్ గిరీష్ రిసెర్చ్ పూర్తి చేసుకొని ఫారిన్ నుంచి రాగానే దేశం లోని ప్రముఖ నగరాలలో ఈ హాస్పిటల్ బ్రాంచెస్ ఓపన్ చేస్తారు. ఇంత సంపదకు ఏకైక వారసురాలు కావ్య.పెట్టి పుట్టింది ” అంటూ గంటల సేపు పొగిడారు.

నాకు చాలా నవ్వు వచ్చింది మమ్మీ. ఎందుకో తెలుసా.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పెరిగింది ఆయాల చేతుల్లోనే. కనీసం కాసేపు ఆడుకోవడానికి, సరదాగా పోట్లాడటానికి కూడా తోబుట్టువులు ఎవరూ లేరు. ఈ కాలంలో ఎవ్వరినీ నమ్మలేము అని ఆడుకోవడానికి కూడా బయటకు పంపించవూ..స్నేహితులతో కలవనివ్వవు.

ఎంతసేపైనా ఇంట్లో కూర్చొని టీ.వీ చూడటం, ప్రాణం లేని బొమ్మలతో ఆడుకోవడం ఇదే అమ్మా ఏళ్ళ తరబడి నాకున్న కాలక్షేపం.

ఇప్పుడు కొత్తగా సెల్ఫోన్ భూతం వచ్చి పడింది. నాలాంటి ఒంటరివారిని ఎప్పుడెప్పుడు మింగేద్దామా అని చూస్తోంది. కనీసం మన కుక్కపిల్ల పింకీ గా పుట్టినా బాగుండేది. నీ కన్నా ముందు కార్లో ఎక్కి నీతో క్లీనిక్ కు వచ్చుంటాను. అంతెందుకు నీ స్టెతస్కోప్ అన్నా అయ్యింటే నీకు దగ్గరగా ఉండేదాన్ని కదమ్మా.

అమ్మా
నారూమ్ లోని కిటికీ గుండా చూస్తే మన వర్కర్స్ ఇళ్లు కనిపిస్తాయి.

సాయంకాలం పూట అక్కడ పిల్లలు ఆడుకోవడం, వాళ్ల అమ్మలు, పిల్లల్ని ముద్దుచేయడం, ప్రేమతో అన్నం తినిపిస్తుంటే..అదృష్టం అంటే అది అని అనిపిస్తుంది. నువ్వు ..నేను కాలు కింద పెట్టనవసరం లేకుండా అన్ని సౌకర్యాలు అమర్చావు. కానీ ఎంతో విలువైన, అవసరమైన అమ్మప్రేమను దూరం చేస్తున్నావు.

నన్నూ నీలాగ కాలాన్ని, కుటుంబాన్ని మరిచిపోయే డాక్టర్ ని చేయాలని కలలు కంటున్నావు.
డాక్టర్ వృత్తి అంటే నాకు చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి. దేవుళ్లకు ప్రతిరూపాలు వైద్యులు. కానీ నాకంటూ కొన్ని ఊహలు, ఆశలు ఉండటం తప్పుకాదుగా..

నీ కూతురుగా పుట్టానని నేను డాక్టరే అయితీరాలంటే మాత్రం నాకు సుతారమూ ఇష్టం లేదు. నా సమయం నా చేతిలో ఉండే ఉద్యోగం చేయ్యాలనిపిస్తుంది. చక్కగా వీణ నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. హాయిగా అప్పుడప్పుడు బంధువులతో కలిసి గడపాలనిపిస్తుంది.

నా జీవితాన్ని నాకు నచ్చేలా గడపడానికి అవకాశం ఇమ్మని నిన్ను వేడుకుంటున్నాను. హాయిగా నాకిష్టమైన సబ్జెక్టులో పి.జీ చేసి ఆర్థికంగా స్థిరపడి హాయిగా పెళ్లి చేసుకుని ముత్యాల్లాంటి బిడ్డలతో సంతోషంగా గడపాలని ఉందమ్మా.. దయచేసి నా కాళ్లూ చేతులు బంధించి, ఊపిరాడనివ్వని క్లినిక్ వ్యవహారాలు బలవంతంగా నా పైన రుద్దకు. నా ఆలోచనలకూ..నా ఆకాంక్షలకూ కొద్దిగా గుర్తింపు, విలువ ఇవ్వమ్మా…

ఈ ఒంటరితనం తెచ్చే సంపదకు నన్ను బంధీని చేయకు. నీకేమి తెలియదు చిన్నపిల్లవి అని నన్ను ఆపద్దు.చెప్పనివ్వు. చుట్టూరా ఆవరించిన ఒంటరితనం ఎన్నెన్నో విషయాలను అర్థం అయ్యేలా చేసింది. మనిషికి డబ్బు ముఖ్యమే గానీ ..మనిషి లోని మనసుకు మమతలూ అనురాగాలు ఇంకా ముఖ్యమని..

అందుకే నేను అమ్మమ్మ దగ్గరకు వెళ్లిపోతున్నాను. నీవు ఇవ్వని ఆప్యాయతను మీ అమ్మ దగ్గరే పొందాలనుకున్నాను. అది పల్లెటూరు కావచ్చు. కానీ అదే నా పాలిటి అనుబంధాలనిచ్చే కల్పవృక్షం. ఇద్దరు మామయ్యలూ వాళ్ల కుటుంబాలు, అమ్మమ్మ చూపే వాత్సల్యం అన్నీ నాకు కావాలి. లేగదూడల గెంతులు, చిలకల కిచకిచలూ, పిచ్చుకల కేరింతలు, తుమ్మెదల ఆహ్వానాలు నన్ను ప్రేమతో పిలుస్తున్నాయి.

మన గుడిగోపురం నుండి సన్నగా వినబడే గంటల సవ్వడి, చెరువు పై నుంచి వీచే చల్లని గాలులు, పచ్చని పంటపొలాలు, నలుగురూ కలిసి తినడం, పనులు చేసుకోవడం ఎంత గొప్ప అనుభూతిని అందిస్తాయో..
నీ డబ్బుతో అవన్నీ కొనివ్వలేవని తెలిసి..

నేను వెళ్లిపోతున్నాను.
నన్ను దయచేసి వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేయవద్దని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.

ఇట్లు..
నీ ప్రేమని ఆశించి..
అది అందివ్వలేవని అర్థం చేసుకుని..
అది దొరికే చోటు వెతుక్కుంటూ
వెళుతున్న.. నీ కావ్య..

– గంజాం భ్రమరాంబ

రచయిత్రి పరిచయం : 

గంజాం భ్రమరాంబ.. M.sc..MPhil..M.ed
ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు.. తిరుపతి వాస్తవ్యులు . 2560 పైగా కవితలు.. పద్యాలలో శతకం.. ఇరవైకి పైగా కథలు వ్రాసారు. గురజాడ అమెరికా ఫౌండేషన్ వారిచే జాతీయస్థాయి విశిష్ట పురస్కారం అందుకున్నారు. రెండు వేలకు పైగా కవితలు వ్రాసినందుకు.. సహస్ర కవితా చక్రవర్తినిగా తెలుగు కవితా వైభవం అను సంస్థ వారిచే గుర్తింపు పొందారు. ఇటీవల రాయలసీమ కళా సమితి వారిచే గుఱ్ఱం జాషువా స్మారక పురస్కారం అందుకున్నారు.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , Permalink

4 Responses to కోరుకున్న జీవితం(కథ ) – గంజాం భ్రమరాంబ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో