*”మర చెరలో చిక్కిన బాల్యం”*(కవిత )-డేగల అనితాసూరి

ఎప్పుడూ టచ్ స్క్రీన్ తోనే
చేతులు కళ్ళు కట్టిపడేసుకున్న
అమ్మా నాన్నలకు
ఉప్పెక్కించుకునే తీరికెక్కడిది?
జీడిపాకం సీరియళ్ళకై అంగలార్చే
అమ్మమ్మలు తాతయ్యలకు
పేదరాశిపెద్దమ్మ కథలు చెప్పే ఓపికెక్కడిది?
ర్యాంకుల రాట్నానికి మెదళ్ళను కట్టే
విలువలు మరిచిన చదువులకు
ఫీజుల వసూళ్ళపై తప్ప
ఆటలు వ్యక్తిత్వ వికాసాలపై శ్రద్ధెక్కడిది?
కుంచించుకుపోయిన కుటుంబ వ్యవస్థలో
ఇరుకు ఇళ్ళలో చేరిపలకరింపులు మరిచిన
ఇరుగుపొరుగులతో బాల్యస్నేహాల బంధమెక్కడిది?
అందుకే…
ఆకర్షణమత్తుతో ఆహ్వానించే
అంతర్జాల మాంత్రికుని కబంధహస్తాల్లో
పొంచివున్న ముఖపుస్తక సందేశాలు
అసాంఘిక మాధ్యమాల ఇనుపసంకెళ్ళు
బ్లూవేల్ వంటి భ్రష్ఠుపట్టిన ఆటలకు చిక్కి
బాల్యం విలవిల లాడుతోంది
మానసిక ఒత్తిడిని పెంచే
మరబొమ్మల వేటకు బలి అవుతోంది

                                                      -డేగల అనితాసూరి,

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , Permalink

One Response to *”మర చెరలో చిక్కిన బాల్యం”*(కవిత )-డేగల అనితాసూరి

 1. dvraoji says:

  టచ్ స్క్రీన్
  అమ్మానాన్నల్ని
  గప్చిప్ గా
  కూర్చోబెడుతుంది
  అమ్మమ్మ
  తాతయ్య లకు
  కాలక్షేపమవుతుంది
  ఎక్కడున్నా
  ఎప్పుడైనా
  స్నేహ సంబంధాల్ని
  శాశ్వతంగా
  నిలబెడుతుంది
  ఎవరికివారు
  కష్టపడకపోతే
  రోజు గడవదు.
  ఎలా కలిసుంటాం
  ఉద్యోగాల చదువు
  చదవక పోతే
  ఫ్యూచర్ ఉండదు.
  ఎలా ఆటలాడుతాం
  ఆలోచించి
  నిర్ణయాలు
  తీసుకోకపోతే
  బ్రతుకు ఉండదు.
  అందరూ
  అన్నివేళలా
  ఒకేలా ఉండలేరు
  ఉండబోరు
  మనిషి
  మార్పు
  కోరుకుంటాడు
  హాయిగా
  ఆనందంగా
  జీవించడానికి
  ఎల్లవేళలా
  మార్గాలు
  వెతుకుతూ
  వెళతాడు
  మళ్లీ
  తిరిగి
  రాడు