ఇంతే మనం(కవిత )- అభిలాష

పుడుతూ ఏడుస్తాం,
చచ్చాక ఏడిపిస్తాం,
రెండిటి మధ్యలో నడిచే బతుకులో ఏడవాలి అంటే భయపడి చస్తాం!!

ఆ భయంతోనే!!
నమ్ముకునో,
అమ్ముకునో,
తాకట్టు పెట్టుకునో,
కొట్టుకునో,
పోగొట్టుకునో
బతుకులోనే నానా చావు చస్తాం….

చివరికి ఏం పొందామో ఆలోచిస్తే ప్రశ్నకి బదులుకి నడుమ ఊగిసలాడే గబ్బిలంలా వేలాడుతూ వుంటాం….

నవ్వాలి అనుకుంటాం!!
నిజానికి నవ్వం,
నవ్వాములే అని మభ్య పెట్టుకుంటాం,
లేకుంటే మనల్ని మనమే భరించలేం,
నవ్వేది ఏదీ శాశ్వతం కాదనే నిజం ఒప్పుకోలేం,
నవ్వాలనే పోరాడుతూ వుంటాం,
ఆ పోరాటంలో అసలు ఆనందాన్ని మనకి మనమే ఓడిస్తుంటాం,
ఆ ఓటమి మన గుండెకి చేరకుండా మళ్ళీ మభ్య పెట్టుకుంటాం,

ఏవో ఎంతో కూడబెట్టాలి అనుకుంటాం,
ఆ ఆత్రుతలో మనలో వున్నది ఊడగొట్టుకుంటాం,
ఏం లెక్కపెట్టుకోవాలో తెలియక అన్నీ లెక్క కట్టుకుంటూ బతికేస్తాం,
చివరాకరుకి పోగొట్టుకున్నదాన్ని తలచుకుని మనల్ని మనమే సావగోట్టుకుంటాం,

అశాంతిని, ప్రశాంతని ఇచ్చి కొనుక్కుంటాం,
మనోవేదనని, మనశ్శాంతి తాకట్టు పెట్టి అరువు తెచ్చుకుంటాం,
కష్టాలని, ఇష్టాలు మూట కట్టి చుట్టి పక్కన పెట్టి ఆహ్వానిస్తాం,
అభిమానాలని, ఆత్మ చంపుకుని మరీ దూరాన పారేస్తాం,
ప్రేమని, సొమ్ము తూకమేసి మరీ ఓడించి పారేస్తాం,
నవ్వుని వేదన తోడుతో చంపేస్తాం,

ఇంతే మనం,
మనం మనుషులం,
ప్రాణమున్న శవాలం,
భావాలున్న మరబోమ్మలం,
కళ్ళుండీ అంధులం,
కాళ్ళుండీ కుంటుతాం,
చెవులున్న వినిపించుకోలేం
మనసున్నా వాడలేం,

కావల్సినది ఏదో తెలుసుకోలేం,
పొందాల్సిన వాటిపై మనసు పెట్టలేం,
చూడాల్సిన ఆత్మ జ్ఞానాన్ని భరించలేం,
ఏదో పొందాలన్న ఆశని చంపలేం,
ఏదీ శాశ్వతం కాదని తెలిసి కూడా ఒప్పుకోలేం,

ఇంతే మనం,
మనం మనుషులం,
అన్నీ తెలిసిన అజ్ఞానులం,
ఏదీ కాదని తెలిసినా అంతా నాదని నమ్మే అల్పులం,
అశాశ్వతమైన ఆలోచనలతో పోరాటం చేసే వీరులం,
ఆవేదనతో కాపురం చేసే శూరులం,
అసూయ ద్వేషాలతో రగిలిపోయే ధీరులం,
ఏదీ కావాలో ఏదో అక్కర్లేదో తెలుసుకోలేని యోధులం,

ఇంతే మనం,
మనం మనుషులం,
అక్కరకు రాని విషయాలని వెంటాడుతాం,
అంది రాని వాటికోసం వెంపర్లాడతాం,
మనసుని ఛిద్రం చేసే వాటికి బానిసలవుతాం,
ఏదో పొందాలనుకుని వున్న వాటిని చేతులారా చంపుకుంటాం,

ఇంతే మనం,
మనం మనుషులం,
మనలో లేని మంటలు సృష్టించుకుని తగలబడిపోయే వినాసకులం,
ఇంతే మనం,
మనం మనుషులం….

– అభిలాష

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , Permalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
దడాల వెంకటేశ్వరరావు
దడాల వెంకటేశ్వరరావు
3 years ago

అవునా ఇది నిజమేనా మనమింతేనా? మనుషుల ఆశల్ని ఆశయాల్ని అదఃపాతాళానికి తోసేశారుకదండి. ఇదంతా మీ అభిలాషేనా? అంతా మనమే అనకుండా ఇంతే మనం అంటున్నారు. మనుషుల్ని మనుషులుగా చూద్దాం. మనుషులకున్న మానవత్వాన్ని గౌరవిద్దాం. నిరాసా వాదానికి దూరంగా ఉందాం. మనమేమిటో చెబుదాం. మనమెలాఉండాలో చెబుదాం. మమమంతా మనసున్న మనుషులమని చాటిచెబుదాం