జ్ఞాపకం-27 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

అయినా ధైర్యం చేసి రాజారాంకి ‘స్పైనల్‌కార్డ్‌ సర్జరీ’ చేయించారు.
హాస్పిటల్లో నెల రోజు వున్నారు. ఆ నెల  రోజు బెడ్‌మీద వున్న రాజారాం నరకం అంటే ఎలా వుంటుందో చవి చూశాడు.

రాజారాంని హాస్పిటల్‌ నుండి డిశ్చార్జి చేశారు. హైదరాబాద్‌ నుండి ఆదిలాపురి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చాక అతన్ని గదిలో వుంచకుండా అతని పడకను హాల్లోకి మార్చారు. అలా అయితేనే అతను అందరికి కన్పిస్తాడు. అందరూ అతనికి అందుబాటులో వుంటారు. ఏదైనా అవసరమై పిలిచినప్పుడు ఎవరో ఒకరు వస్తారు. అతన్ని లేపడం, పడుకోబెట్టడం లాంటివి చేస్తారని. అలాగే చేస్తున్నారు. కానీ ఆపరేషన్‌ జరిగి 2 నెలు గడిచినా అతను తనంతటి తను లేచి కూర్చోలేక పోతున్నాడు. నిబడలేక పోతున్నాడు.

ఫిజియోథెరఫి చేపిస్తే నెమ్మదిగా అతనిలో మార్పు రావచ్చని డాక్టర్లు చెప్పారు. ఆదిలాపురిలో ఫిజియోథెరఫి చేసేవాళ్లు లేరు. ఒక ఫిజియోథెరఫిస్ట్‌ని సిటీ నుండి రప్పించటం అంటే ఖర్చుతో కూడుకున్న పని. రాఘవరాయుడు ఇప్పటికే తన  దాచుకున్న డబ్బుల్ని కూడా కొడుకు వైద్యం కోసం ఖర్చు పెట్టాడు. ఇప్పుడాయన దగ్గర డబ్బుల్లేవు. పోలయ్యతో  అదే విషయం చెప్పి బాధపడ్డాడు. ఒకప్పుడు తన కొడుకు గుండెకు చిల్లుపడిందని డాక్టర్లు చెప్పినప్పుడు డబ్బుల్లేక రాఘవయ్య గారి ఇంటికొచ్చి ఇలాగే బాధ పడ్డాడు పోలయ్య. అప్పుడు రాఘవయ్య తల్లి డబ్బు సాయం చేసింది. ఆ మహాతల్లి ఇప్పుడు లేదు. ఆమె మనుమడు బాధలో వున్నాడు. తనుకూడా ఏదో ఒకటి చేసి వాళ్లను ఆదుకోవాలి అని మనసులో అనుకుని ‘రాఘవయ్యా! నేను డబ్బు సాయం చెయ్యలేను. ఇంచుమించు ఫిజియోథెరఫిస్ట్‌ చేసినట్లే కొన్ని ఎక్సర్‌సైజ్ లు  రాజారాం చేత చేపిస్తాను. మనవూరి వి.డి.ఓ. గారికి యాక్సిడెంట్‌ అయితే నేనే చేపిస్తున్నాను. నువ్వేం దిగుపడకు రాజారాం నడుస్తాడు.’ అంటూ ఉదయం, సాయంత్రం మొద్దుపోలయ్య వచ్చి రాజారాం చేత కొన్ని ఎక్సర్‌సైజు చేయించి ఒళ్లంతా ఆకు పసరు పూసి వెళ్తున్నాడు.

దిలీప్‌ హైదరాబాదు వెళ్లి అక్కడ ఒక పేరున్న పత్రికలో బ్యూరో ఇన్‌చార్జీగా చేరాడు. ఫ్యామిలీని హైదరాబాద్‌కు మార్చుకుంటూ రాజారాంని చూసి వెళ్లాని హస్వితను తీసుకొని ఆదిలాపురికి వచ్చాడు.

కొద్దిసేపు రాజారాం దగ్గర కూర్చున్నారు హస్విత, దిలీప్‌. వాళ్లకి సులోచనమ్మ టిఫిన్‌ పెట్టి, కాఫీ ఇచ్చి మర్యాద చేసింది. ‘‘మీరు మాట్లాడుతూ ఉండండి ! హస్వినిని నా గదిలోకి తీసికెళ్తాను’’. అంటూ హస్వితను తన గదిలోకి తీసికెళ్లింది సంలేఖ. మాట మధ్యలో జయంత్‌ ప్రపోజల్‌ గురించి సంలేఖతో చెప్పింది హస్విత. సంలేఖ మౌనంగా వుందేతప్ప మాట్లాడలేదు. ఆమె ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అతను చాలా మారాడని చెప్పింది హస్విత. ఇప్పుడు కూడా మాట్లాడలేదు సంలేఖ. ‘‘అవకాశాలు  ఎప్పుడూ రావు, వచ్చినప్పుడు వాటిని అవమానించకుండా గౌరవించి హత్తుకు పోవాలి’’ గట్టిగా మందలింపుగా అంది హస్విత.

సంలేఖ వెంటనే లేచి పుస్తకాలు  ఉన్న షెల్ఫ్‌ దగ్గరకెళ్లి నిబడింది. అవసరం లేకపోయినా అందులో పుస్తకాలను అటు ఇటు మారుస్తూ వుంది. అది గమనించిన హస్వితకు సంలేఖ ఎందుకలా చేస్తుందో అర్థమై ఆ విషయాన్ని వదిలేసి వేరే కబుర్లు చెబుతూ కూర్చుంది.

దిలీప్‌ కూడా అదే సమయంలో రాఘవరాయుడు, సులోచనమ్మను కూర్చోబెట్టి రాజారాం సమక్షంలోనే జయంత్‌ గురించి మాట్లాడాడు. జయంత్‌ సంలేఖను పెళ్లి చేసుకుంటానన్నట్లు చెప్పాడు. ఆసక్తిగా విని జయంత్‌ కుటుంబం గురించి అడిగారు. అతని కుటుంబం గురించి దిలీప్‌కి పెద్దగా తెలియకపోయినా, ఇంటర్‌లో అతను తన రూమ్మేట్‌ అని, మంచి ఉద్యోగంలో వున్నాడని చెప్పాడు. ఆ రోజు తనతో హాస్పిటల్‌కి వచ్చింది జయంతే అని గుర్తు చేశాడు.. దిలీప్‌ ఏది చెప్పినా ఆలోచించే చెబుతాడని ఆ కుటుంబ సభ్యు అభిప్రాయం. అందుకే శ్రద్దగా వింటున్నారు. దిలీప్‌ రాఘవరాయుడిని ఉద్దేశించి ‘‘అంకుల్‌ ! జయంత్‌ ఇంకోమాట కూడా మీతో చెప్పమన్నాడు’’ అన్నాడు.

ఏమిటన్నట్లు అందరు ఒకేసారి చూశారు.

దిలీప్‌ చాలా ప్రసన్నంగా చూస్తూ ‘‘రాజారాం వైద్యం కోసం వాళ్లకి చాలా డబ్బు ఖర్చయి వుంటుంది. ఇప్పుడు కట్నం అడిగినా వాళ్లు ఇవ్వలేరు. మన సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల  పెళ్లి వాళ్లే చెయ్యాలి. కాబట్టి పెళ్లి చేసిస్తే చాలు  ఇంకేం వద్దు అన్నాడు. అతను కేవలం  సంలేఖ మీద వున్న ఇంట్రస్ట్‌తోనే అలా అంటున్నాడు అంకుల్‌ ! లేకుంటే అతని వివరాలను గనక మ్యారేజ్‌ బ్యూరో లిస్ట్‌లో వుంచి, నెట్‌లో పెడితే అమ్మాయి తల్లి, తండ్రులు  తప్పకుండా ‘క్యూ’ కడతారు. దీన్ని మీరు అర్థం చేసుకొని ప్రొసీడవ్వండి’’ అన్నాడు దిలీప్‌.

వాళ్లు వెంటనే ఏ విషయం చెప్పకుండా ‘‘మేము ఆలోచించుకొని నీకు ఫోన్‌ చేసి చెబుతాము దిలీప్‌ మాకు కొద్దిగా టైమివ్వు ! సంలేఖ అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా !’’ అన్నారు.

‘‘అలాగే’’ అంటూ దిలీప్‌, హస్విత కొద్ది సేపు కూర్చుని వెళ్లిపోయారు.

(ఇంకా ఉంది )

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలు, , , , Permalink

Comments are closed.