వానంటే భయంలేదు(కవిత ) -డా|| కె.గీత

వాన నిలువెల్లా
వెయ్యి నాలుకలతో
విరుచుకుపడినా
భయం లేదు నాకు
గాలి ప్రచండమై
విను వీధికి
విసిరేసినా
బాధ లేదు నాకు
ఈ గాలీ,
ఈ నీరూ
ఇవి లేకేగా
ఇన్నాళ్లూ
కళ్లకు కన్నీటి
కాయలు కాసింది!
రాత్రంతా
చెట్ల విలయతాండవం
గొప్ప మహోధ్రుత
వర్షోద్రేకం
ఆకాశం విరిగి
నేలను కూలినట్లు
రోజంతా
చిల్లులు పడ్డ
గగన తలం
ఈ నీరేగా
ప్రాణాధారం-
రాత్రంతా
నిద్ర పోతున్న
ఇంటి తలనెవరో
భయంకరంగా
గీరుతున్నారు
హోరున
వేల నీటి చేతుల్తో
అద్దాల తలుపుల్నెవరో
దబా దబా బాదుతున్నారు
అంతలోనే
బాదం చెట్టు
బాల్యపుటింటి మీద
పడ్డప్పటి జ్ఞాపకం ఎందుకో
పెంకుటిల్లు చిల్లు పడి
ఇల్లే వరదైనప్పటి
దు:ఖం
చెరువు కట్టలు తెంచుకుని
ఊరు మునిగి
తడిసి ముద్దైన బట్టలు తప్ప
ఏమీ మిగలని
శవాల్లాంటి
మనుషులెందరో
మెట్ట మీది
మా ఇంటి అరుగు మీద
కళ్ల ల్లో వరదలతో
ఇప్పుడూ కనిపిస్తున్నారెందుకో
అర్జునా ఫల్గుణా…
పార్థా… కిరీటీ….
ఉరుముల్నీ
మెరుపుల్నీ
తప్పించుకునే
మహా మంత్రాలు
పనిచేస్తాయో లేదో గానీ
నాలుక చివర
పదే పదే
వెంటాడుతున్నాయి
ఇప్పటి
వానంటే
భయం లేదు నాకు
వేల వానలు
ముంచెత్తినా
వారమేసి రోజులు
నీళ్లలోనే
బతికి బట్టకట్టిన
మా ఎవరికీ
వానంటే భయంలేదు
వరదంటే బాధా లేదు

                                                           – డా|| కె.గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , Permalink

Comments are closed.