మేఘసందేశం-03 -వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

“ఉపమా కాళిదాసస్య” అని ప్రతీతి. కాళిదాసు ప్రయోగించినన్ని ఉపమలు ఏ కవీ ప్రయోగించి ఉండకపోవడంతో ఆ పేరు వచ్చింది. కానీ ఆయన ఉత్ప్రేక్షలు, అర్ధాంతన్యాసాలు కూడా బాగానే వాడినట్లు అతని కావ్యాలు చదివితే అర్ధమౌతుంది. కోమల సుదరమైన ప్రకృతిని వర్ణిస్తాడు. పర్వత, ఋతు, వన, ఆశ్రమ వర్ణనలు సహజంగా ఉండి అతడి ప్రకృతి పరిశీలనను తెలుపుతుంది. వాల్మీకి తర్వాత ప్రకృతి వర్ణనలు రమణీయంగా చేయగల నేర్పు ఉన్నవాడు కాళిదాసు మాత్రమే అంటారు ఆయన కావ్యాలు చదివినవారు. కాళిదాసు కవితా విలాసం ముఖ్యంగా శృంగార పరంగా సాగినప్పటికీ తర్వాతి స్థానం ప్రకృతికే ఇస్తాడు. ఆవిషయం మనం మేఘ సందేశంలో దర్శించవచ్చు. మనం మళ్ళీ కధలోకి వద్దాం.

జరిగిన కధ: కుబేరుడు యక్షగణానికి రాజు. ఆయన వద్ద ఉన్న ఓ యక్షుడు ఉద్యోగధర్మ నిర్వహణలో చిన్న తప్పిదం చేశాడు. కుబేరుడు కోపించి ఒక సంవత్సర కాలం ఇల్లు విడిచి వెళ్ళాలని శాపం ఇచ్చాడు. ఆ యక్షుడు రామగిరి అనే ప్రాంతంలో నివాసం ఉన్నాడు. ఎనిమిది నెలలు అతిభారంగా గడిచిపోయాయి. ఆషాఢమాసం వచ్చింది. ఒకనాడు యక్షుడు తన భార్యను తలుచుకొని దు:ఖిస్తూ మేఘాలను చూసి, ఆ మేఘుడిని తగినవిధంగా సంభావించి తన భార్యకు తన సందేశాన్ని వినిపింప వలసినదిగా కోరాడు. మేఘుడా! నీవు నాపని మీద ఆకాశంలో పయనిస్తూ ఉండగా తమ పురుషులు దూరదేశాలకు పోయినందువల్ల ఇంటనే ఉండి విరహబాధను అనుభవిస్తున్నటువంటివారు నిన్ను చూడగానే తమ ప్రియులు వస్తారు అనే నమ్మకం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. విరహంతో బాధపడుతున్న ప్రియురాలిని ఎవడు విడువగలడు? అని పరి పరి విధాలుగా వాపోతున్నాడు యక్షుడు. (ఇక చదవండి)

శ్లో.9. తాం చావశ్యం దివసగణనాతత్పరా మేకపత్నీ
మవ్యాపన్నా మవిహతగతి ర్ద్రక్ష్యసి భ్రాతృజాయాం
ఆశాబంధః కుసుమసదృశం ప్రాయశో హ్యంగనానాం
సద్యః పాతి ప్రణయి హృదయం విప్రయోగే రుణద్ధి.

భావం : ఓ మేఘమా! నీవు ఎటువంటి ఆటంకములూ లేకుండా అక్కడకు వెళ్ళి, నేను వస్తానని ఎదురు చూపులు చూస్తూ.. రోజులు లెక్కపెడుతూ, నా పైన ప్రేమ కలిగిన నా భార్యను తప్పక దర్శించగలవు. పుష్పముల వలె కోమలమైన స్త్రీలు తమ ప్రియుల ఎడబాటువల్ల బాధతో పతనావస్తకు చేరుకున్నప్పటికీ ఆశ అనే బంధం మాత్రమే ప్రాణలు నిలపడానికి తొడిమవలె పని చేస్తుండి అని యక్షుడు చెప్తున్నాడు.

విశేషం ఏమిటంటే… ప్రేమ కలిగిన స్త్రీల బ్రతుకు పుష్పంతో సమానమైనది. భర్తలతో వియోగం ఏర్పడినపుడు, వారి బతుకుపుష్పం రాలిపోతుంది. అయితే తొడిమ, పువ్వును రాలిపోకుండా పట్టి, ఉంచుతూంటుంది. ఆ తొడిమే ఆశ. అలాగే పతివ్రత, నీకు వదినె అయిన, నా భార్య కూడా నేను రావడానికింకా ఎన్ని రోజులున్నాయో అని లెక్కిస్తూ, ప్రాణం ధరించి ఉంటుంది. అటువంటి ఆమెను నీవు తప్పక చూడగలవు అంటున్నాడు యక్షుడు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే.. మేఘునితో యక్షుడు బంధుత్వం కలిపాడు. “నేను నీ సోదరుడిని” అంటున్నాడు. కాబట్టి యక్షునిభార్య మేఘునికి వదిన అయింది. వరుస కలుపడం ఎందుకంటే, పరాయి స్తీని చూడవచ్చా? సందేహం మేఘునకే కాదు, పాఠకునికి కూడా! అందుకే కవి సందేహ నివృత్తి చేస్తున్నాడు. ఇక్కడ అర్ధాంతన్యాసాలంకారం ఉంది.

ముఖ్యమైన అర్ధములు: అవిహతగతి = అడ్డులేని ప్రయాణం; తత్పరాం = నిమగ్నమైన; భాతృజాయాం = అన్న భార్య (వదిన); ద్రక్ష్యసి = చూడగలవు; సద్య:పాతి = వెంటనే పడిపోయేదాన్ని; రుణద్ధి = అడ్డగించును.

శ్లో.10.మందం మందం నుదతి పవన శ్చానుకూలో యథా త్వాం
వామశ్చాయం నదతి మధురం చాతకస్తే సగంధః
గర్భాధానక్షణపరిచయా న్నూనమాబద్ధమాలాః
సేవిష్యంతే నయనసుభగం ఖే భవంతం బలాకాః

భావం : మేఘుడా! శుభశకునాలు కనబడుతున్నాయి. పని పూర్తి అవుతుందంటున్నాడు. నీకు అనుకూలంగా గాలి వీస్తోంది. ఎదురు గాలి లేదు. వాలు గాలి ఉంది. అది నిన్ను త్వరగా ముందుకు వెళ్ళేలా తోస్తూ ఉంటుంది. చాతకపక్షి, మధురంగా కూస్తోంది. ఈ రెండు శుభశకునాలు ఎదురవడమే గాక ఇంకో శుభశకునం కూడా ఉంది. అదేమంటే బెగ్గురు పక్షుల వరుస (ఆడుకొంగలు) అవి కన్నులకు ఇంపై నిన్ను తప్పక సేవిస్తాయి సుమా! అంటున్నాడు. అలా కొంగల దర్శనం శుభసూచకం మిత్రమా నీకు అని చెప్తున్నాడు.

విశేషం: చాతకపక్షిని గూర్చి చూద్దాం. దీనినే వానకోయిల అని కూడా అంటారు. ఈ పక్షి, వర్షం పడుతున్నప్పుడు మాత్రమే నోరు తెరచి ఆ నీటిని త్రాగుతుంది. ఈ విధంగా మేఘానికి చాతకానికి సంబంధం ఉంది.అందువల్ల దగ్గర సంబంధం అన్న విధంగా కవి వాడాడు.

నల్లని మేఘాలతో ఆకాశం నిండి ఉన్నప్పుడు, తెల్లనికొంగలబారు ఆకాశంలో కనిపిస్తే మన కన్నులకు ఇంపుగా ఉంటుంది కదా! అందువల్లనే దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు మల్లీశ్వరి చిత్రంలో “నల్లని మబ్బులు గుంపులు గుంపులు – తెల్లని కొంగలు బారులు బారులు” అని రాయడం, మేఘసందేశము కావ్య ప్రభావం ఆయనపై ఉన్నదని మనం నిస్సంశయంగా చెప్పవచ్చు.

ముఖ్యమైన అర్ధములు: సగంధ: = గర్వముతోగూడిన; వామ: = ఎడమభాగంలో; ఖే = ఆకాశంలో; నయనసుభగం = కన్నులకు ఆనందం కలిగించేది; భవంతం = నిన్ను; బలాకా: = బెగ్గురు పక్షులు;

శ్లో.11. కర్తుం యచ్చ ప్రభవతి మహీముచ్ఛిలీన్ధ్రా మవంధ్యాం
తచ్ఛృత్వా తే శ్రవణసుభగం గర్జితం మానసోత్కాః
ఆకైలాసా ద్బిసకిసలయచ్ఛేదపాథేయవంతః
సంపత్స్యంతే నభసి భవతో రాజహంసాః సహాయాః

భావం : మేఘుడా! నీ గర్జన పుట్టగొడుగులను పుట్టిస్తుంది. తద్వారా భూమిని ఫలవంతంగా మారుస్తున్స్తుంది. అపుడు భూమి సంతానవంత మౌతుంది. వినడానికి కూడా నీ ఉఱుము బహు సొంపుగా ఉంటుంది. ఆవిధమైన నీ ఉఱుమును విని, మానస సరోవరానికి పోవాలని ఆరాటపడే రాజహంసలు లేలేత తామరతూండ్ల ముక్కల్ని దారిలో తినడానికి ఆహారంగా చేసుకొని, అలా అలా నీకు కైలాసపర్వతం దాకా ఆకాశంలో, సహాయంగా వస్తాయి సుమా! మానస సరోవరం కైలాస పర్వతం పక్కనే కాబట్టి నీకు అవన్నీ నీకు తోడు వస్తాయి అని చెప్పడం.

విశేషములు : ఉఱుముకి పుట్టగొడుగులకు (శిలీంధ్రాలకు) నిజంగా సంబంధం ఉంటుందో లేదో వృక్ష శాస్త్రజ్ఞులు చెప్పాలి. ఇక్కడ కేవలం కవి రాసిన దానిని బట్టి చూస్తే ఉఱుముకి, శిలీంధ్రాలను పుట్టించే శక్తి ఉందని తెలుస్తోంది. ఉఱిమిన వెంటనే మేఘం వర్షిస్తుంది కదా! అందువల్ల శిలీంధ్రాలు పుడతాయని అనుకోవడం సమంజసంగా తోస్తోంది. ఉఱుము పంటలకు కారణభూతమౌతుంది అనడంలో ఔచిత్యం ఇదే!

ఉఱుము వినడానికి సొంపుగా ఉంటుందా? వాన కారు కోయిలలకు వినసొంపే! ఇక రాజహంసల విషయానికొస్తే, పక్షి జాతిలో అగ్రగణ్యమైనవి కదా అవి! అందమైనవి. ముక్కు, కాళ్లు ఎఱ్ఱగా ఉంటాయి. శరీరం అంతా తెలుపు. అవి లేత తామరతూండ్లు ఆహారంగా గ్రహిస్తాయి. అటువంటివి రాజహంసలతో కలసి నీ ప్రయాణం సాగుతుంది సుమా! అంటూ మేఘుడికి ఉత్సాహం కల్గిస్తున్నాడు యక్షుడు. ఒంటరి ప్రయాణం బదులుగా నలుగురితో ప్రయాణం చేస్తే నీకు దారిలో శ్రమ, అలసటలు ఉండవు అని చెప్తున్నాడు.

ఇప్పుడు యక్షుడు నివసించే రామగిరి నుండి కైలాసము లోని మానససరోవరం వరకు ప్రయాణ విశేషాలు మనకు చెప్పాడు.

ముఖ్యమైన అర్ధములు: ఉచ్చిలీంధ్రాం = పుట్టగొడుగులు మొలిచినదానిగా; అవంధ్యాం = పంటలు పండునట్లు; గర్జితం = ఉరుమును; బిసకిసలయ = లేత తామర తూండ్ల; ఛేద = ముక్కలే; పాధేయ వంత: = దారిలో ఆహారంగా కలవై.

శ్లో.12.ఆపృచ్ఛస్వ ప్రియసఖ మముం తుంగ మాలింగ్య శైలం
వంద్యైః పుంసాం రఘుపతిపదైః రంకితం మేఖలాసు
కాలే కాలే భవతి భవతా యస్య సంయోగ మేత్య
స్నేహ వ్యక్తి శ్చిర విరహజం ముంచతో బాష్ప ముష్ణం.

భావం : ఓ మేఘుడా! ఈ చిత్రకూట పర్వతం శ్రీరాముని పాదస్పర్శచేత చాలా మహిమ కలది. ఆయన పాద ముద్రలు ఈ పర్వతం పై పడ్డాయి. కాబట్టే జనులు ఈ పర్వతాన్ని పూజిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరము వర్షాకాలంలో నీవు కలసినప్పుడు చాలా కాలం ఎడబాటు వలన వేడి కన్నీటిని విడిచి తన స్నేహాన్ని నీకు తెలియజేస్తుంది. ఆవిధంగా నీకు ప్రియ సఖుడు, కాబట్టి ఒక్కసారి ఇతనిని ఆలింగనం చేసుకొని, వీడుకోలు చెప్పు అంటూ కొండలకు మబ్బులకు ఉండే స్నేహబాంధవ్యాన్ని తెలియజేస్తున్నాడు కవి.

విశేషాలు : యక్షునికి, మేఘునికి ఇద్దరికీ ప్రస్తుతం ఆశ్రయమిస్తున్నది చిత్రకూటపర్వతం. కనుక తనకూ ప్రియసఖుడే! మేఘునికి కూడా ప్రియసఖుడే! ఎందుకంటే మేఘాలు పర్వతాలను రాసుకుంటూ పూసుకుంటూనే గదా తిరుగుతాయి. అలా పరస్పర మిత్రత్వం ఉంది అంటున్నాడు. రామునికీ గతంలో కొంతకాలం ఆశ్రయం ఇచ్చినవాడు ఆవిధంగా రామునికీ ప్రియసఖుడే! ఇక ఉన్నతుడు అనడంలో ఆకారం చేత చాలా ఎత్తైనవాడు అని, మీదు మిక్కిలి రాముని పాదాలను శిరస్సున ధరించి, చిత్రకూటుడు మరింత ఉన్నతుడయ్యాడు. అనడంలో రామపాదస్పర్శచేత పవిత్రుడు అయ్యాడు సుమా! అని అర్ధం. ఎందుకంటే మిత్రత్వం, మహత్త్వం, పవిత్రత్వం ఉన్నవారు ఎవరైనాసరే సంభావనార్హులుగా భావింది సముచితంగా గౌరవించవలసినవాళ్లు. ఇంకో విషయం ఏమిటంటే దూరప్రాంతాలకు వెళ్ళేముందు ఎవరైనా మిత్రులు లేక బంధువులను మనం కౌగలించుకొని వీడ్కొలు చెప్తూ ఉంటాం. అలాగే పర్వతానికి చెప్పమని అంటున్నాడు. ఇది ప్రయాణసమయాల్లోని మర్యాద. గత శ్లోకంలో ప్రయాణ సమయంలో చూచుకోవలసిన శకునాల గురించి చెప్పి ఇపుడు వీడ్కోళ్ళను గురించి తెలియ జేశాడు కవికులశేఖరుడు కాళిదాసు.

ముఖ్యమైన అర్ధములు: తుంగం = ఎత్తైనది; పుంసాం = జనులకు; మేఘలాసు = చరియలపైన; ఆపృచ్ఛస్వ = వీడ్కోలు తీసుకొనుము; ముంచత: = వదలుతున్న.

శ్లో.13. మార్గం తావచ్ఛృణు కథయత స్త్వత్ప్రయాణానురూపం
సందేశం మే తదను జలద శ్రోష్యసి శ్రోత్రపేయం
ఖిన్నఃఖిన్నః శిఖరిషు పదం న్యస్య గంతాసి యత్ర
క్షీణః క్షీణః పరిలఘు పయః స్రోతసాం చోపభుజ్య

భావం :
మేఘుడా ! ఇప్పుడు, నీ ప్రయాణానికి అనుకూలమైన మార్గాన్ని చెప్తాను విను. ఆ తరువాత నీకు వినసొంపై నా భార్యకు చెప్పవలసినసందేశాన్ని కూడా చెప్తాను. నేను చెప్పబోయే మార్గంలో, నీకు శ్రమ కలిగినప్పుడు, పర్వతాలమీద నిలిచి, విశ్రాంతి తీసుకొనివెళ్లవచ్చు. ఒకవేళ నీవు క్షీణించిపోతే (బలహీనమైతే) నదుల్లో స్వాదు జలాన్ని త్రాగి, వెళ్లవచ్చు.

విశేషాలు: ఏదైనా సుదూర ప్రయాణం చేయదలచుకొన్నవారు, మొదట ఒక పధకం వేసుకుంటారు. ఏమేమి వస్థువులు అవసరమవుతాయి? అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అని. అపుడే క్షేమంగా ప్రయాణం చెయ్యగలుగుతాము. కాశీకి వెళ్ళే యాత్రికులు మధ్యలో సత్రాలున్న దారిని వెళ్ళేవారని అర్థమవుతుంది. మరి చిక్కిపోతే, తేలికైన నీరు తాగమంటున్నాడు? అదేమిటి? తేలికైన అనే అర్థంలో “పరిలఘు” అనే పదాన్ని కవి ప్రయోగించాడు. నీరు తేలిక ఎప్పుడవుతుంది? ఆవిరైనపుడే కదా ? ఆ ఆవిరే కదా మేఘం. సూక్ష్మవిషయాలను కూడా పరిగణన లోకి తీసుకొని, కాళిదాసు వ్రాస్తున్నాడు. నీరు తగ్గిపోతే మేఘం చిక్కిపోతుంది. మరల ఆవిరితో రూపు కడుతుంది. స్మృతి, మతి, ప్రజ్ఞ అనే మూడుశక్తుల కలయికే బుద్ధి. ఆ బుద్ధి అపారం కాబట్టే కాళిదాసు అద్భుతంగా రాయగలిగాడు ఈ కావ్యం.

ముఖ్యమైన అర్ధములు: త్వత్ప్రయాణానురూపం = నీ ప్రయాణానికనుకూలమైన; శ్రోష్యసి = వినగలవు; ఖిన్న: ఖిన్న: = అలసిన ప్రతిసారి; స్రోతసాం = నదీ ప్రవాహల యొక్క; పరిలఘు = తేలికైన; పయ: = నీటిని; ఉపభుజ్య = తాగి; గంతాసి = వెళుదువుగాని.

-టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)