ప్రపంచ రెండవ మహిళా రాయబారి – అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో 19-3-1872 లో జన్మించింది .తండ్రి జనరల్ మైఖేల్ అలెక్సీ డోమంటో విచ్ 13 వ శతాబ్ది యుక్రెయిన్ కొస్సాక్ సంతతి వాడు .రష్యాటర్కీయుద్ధం లో రష్యాకు బల్గేరియా లో రష్యన్ అడ్మిని స్ట్రేషన్ కు సలహాదారుడు .ఉదార భావాలున్న వ్యక్తిగా ప్రసిద్ధుడు .కాని కడు పేద . మసాలినా మ్రావిన్స్కయా అనే ధనికురాలిని పెళ్లి చేసుకొన్నాడు . వీరిద్దరి కుమార్తెయే మైఖలోవానా .ఈమెను చిన్నప్పుడు అందరూ ‘’షుర ‘’అని పిలిచేవారు . తండ్రిదగ్గర చనువు ఎక్కువ .తండ్రి అభిప్రాయాలకు విలువ నిచ్చి హిస్టరీ తోపాటు అనేక భాషలు నేర్చింది. తల్లితో ఫ్రెంచ్ ,స్నేహితులతో ఇంగ్లిష్ ,రైతులతో ఫిన్నిష్ భాషలో మాట్లాడేది .యూని వర్సిటి లో చేరి చదువు కోవాలను కొన్నదికాని తల్లికి ఆడపిల్లలు ఉన్నత విద్య చదవటం ఇష్టం లేదు . యూని వర్సిటీ లో రాడికల్ భావాలు తీవ్రంగా విద్యార్ధులను ప్రభావితం చేస్తాయనే భయమూ ఉండేది .కనుక తల్లి ఇష్ట ప్రకారమే స్కూల్ టీచర్ గా ఉద్యోగానికి కావలసిన సర్టిఫికేట్ సాధించింది .

1889 -90 కాలం లో 19 వ ఏట ఇంజినీరింగ్ చదువుతూ మిలిటరీ ఇన్ స్టి ట్యూట్ లో పేరు నమోదు చేసుకొన్నపేద వ్లాడిమిర్ లుద్విగోవిచ్ కొల్లాంటి తో పరిచయమై పెళ్లి చేసుకోవాలను కొన్నది . ఆ నిరుపేద తో పెళ్ళికి తల్లి ఒప్పుకోకపోతే ,టీచర్ ఉద్యోగం తో సంసారం గడుపుతామని సమాధానం చెప్పి౦ది .కాని ఆమెను పశ్చిమ యూరప్ లో టూర్ చేయమని మిషతో పంపారు.ఆమె ప్రేమ బలమై ,ప్రేమించిన వాడినే1893 లో పెళ్లి చేసుకొని పంతం నెగ్గించుకొన్నది .కొద్దికాలానికే గర్భవతి అయి కొడుకు మైఖేల్ ను కన్నది.తీవ్ర వామ భావాల రాజకీయ సాహిత్యం అధ్యయనం చేస్తూ ఫిక్షన్ రాసింది .

భర్త వ్లాడిమిర్ రైతు ఆధార సంఘాన్ని పునర్నిర్మించాలనే పూనికతో ఉన్నాడు .యాంత్రికత తో విప్లవభావాలతో నవీన రష్యా ను నిర్మించాలన్న ఆలోచన కార్మిక కర్షకులలోవ్యాపించి పోయింది .పిరికిగా భయం భయంగా లైబ్రరీలలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ గడుపుతున్నాడు .ఇంతలో ఎలీనా స్టాసోవాఅనే మార్క్సిస్ట్ ఉద్యమకారునితో పరిచయమై ,అతను ఇస్తున్న చట్ట వ్యతిరేక రచనల పార్సిళ్ళను కొరియర్ గా అజ్ఞాత వ్యక్తులకు చేర వేస్తున్నాడు .తాను కుట్రకు గురయ్యానని గ్రహించి ప్రేమ వివాహం విచ్చిన్నమై కొడుకు మైఖేల్ ను తలిదండ్రులకు అప్పగించి ఆమె ఎకనామిక్స్ చదవటానికి స్విట్జర్ లాండ్ లోని జూరిచ్ కు 1898 లో వెళ్ళిపోయింది .అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్లి లేబర్ పార్టీ నాయకులతో పరిచయం పొందింది . మళ్ళీ1899లో రష్యా వచ్చివ్లాడిమిర్ లెనిన్ తో గాఢ పరిచయం పెంపొందిం చుకొన్నది .ఇదే ఆమె జీవితాన్ని కొత్త మలుపు త్రిప్పింది . 27 వ ఏట ‘’రష్యన్ సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ ‘’సభ్యత్వం పొంది 1905 లో సెయింట్ పీటర్స్ బర్గ్ లో వింటర్ పాలెస్ ముందు జరిగిన ‘’బ్లడీ సండే ‘’కు ప్రత్యక్ష సాక్షి అయింది .

1905 లో జర్మనీ కి ప్రవాసం వెళ్ళింది .’’ఫిన్లాండ్ అండ్ సోషలిజం ‘’పుస్తకం రాసి ఫిన్లాండ్ ప్రజలను రష్యా జార్ నియంతల సామ్రాజ్య వాదానికి ఎదురు తిరిగి పోరాటం చేయమని ప్రోత్సహించింది .ఇంగ్లాండ్ జర్మని ఫ్రాన్స్ లలో పర్యటించి రోసా రుక్సే౦ బర్గ్ ,కార్ల్ లీబ్నేట్ లను పరిచయం చేసుకొన్నది .1914 లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే యుద్ధ వ్యతిరేకి కనుక జర్మనీ వదిలి డెన్మార్క్ చేరి ,అక్కడ ఆ దేశం కూడా యుద్ధాన్ని సమర్దిస్తోందని గ్రహించి నిరాశ చెంది , స్వీడెన్ వెళ్లి అక్కడ తన ఉపన్యాసాలతో, రచనలతో వారిని యుద్ధ వ్యతిరేకులుగా మార్చాలను కొన్నది .కాని ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలులో పెట్టింది .విడుదలకాగానే నార్వే వెళ్లి అక్కడి సోషలిస్ట్ కమ్యూనిటి తన భావాలకు గౌరవమివ్వటం వలన 1917 వరకు అక్కడే ఉండి పోయింది .1917 లో రష్యాలో కాలు పెట్టగానే జార్ నియంతల సామ్రాజ్యం పతనమై రష్యా రివల్యూషన్ ఊపులో ఉందని గ్రహించింది .

తాను సభ్యత్వం తీసుకొన్న పార్టీ జూలియస్ మార్టోవ్ నాయకత్వం లో మెన్షెవిక్ పార్టీ గా ,లెనిన్ నాయకత్వం లో బోల్షెవిక్ పార్టీ గా చీలి పోయింది .మొదట్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకపోయినా 1904 లో లెనిన్ పార్టీ బోల్షెవిక్ లకు మద్దతు నిచ్చింది .1917 అక్టోబర్ విప్లవం తర్వాత కొల్లాంటి రాజకీయ జీవితం ప్రారంభమైంది .సోషల్ వెల్ఫేర్ కు పీపుల్స్ కమ్మిస్సార్ అయింది. 1919 లో’’ మహిళా డిపార్ట్ మెంట్ ‘’ ఏర్పరచి దేశం లో పరిపాలన యంత్రాంగం లో బాగా ప్రాముఖ్యాన్ని పొందింది . ఈ సంస్థ స్త్రీ సంక్షేమానికి, విద్య కు ,ఉపాధికి ,వివాహాలకు కృషి చేసింది .విప్లవ సమయం లో మహిళలకు చేసిన వాగ్దానాలన్నీ నెర వేరేట్లు చేసింది . మిగిలిన మహిళా నాయకుల భావాలకు వ్యతిరేకంగా ‘’లిబరల్ ఫెమినిజం ‘’ను వ్యతిరేకించింది .ఆ భావాన్ని బూర్జువా భావం అన్నది .1930 లో డిపార్ట్ మెంట్ మూసేశారు .1917 లో పావెల్ డేబెంకో ను పెళ్లి చేసుకొన్నది .

ప్రభుత్వం లో ఉంటూనే కమ్యూనిస్ట్ పార్టీ చేసే తప్పులను తెలియ బరుస్తూ ,అలేక్సాండర్ షిప్లికోవ్ తో కలిసి ‘’వర్కర్స్ అపోజిషన్ ‘’ఏర్పాటు చేసింది .లెనిన్ దీన్ని రద్దు చేసి ,ఆమె కు ప్రాముఖ్యం తగ్గించేశాడు .1920 నుంచి అనేక డిప్లమాటిక్ స్థాయిలలో పని చేసి ,రష్యాలో మహిళా సాధికారత కోసం తీవ్ర కృషి చేసింది .1923 లో నార్వే రాయబారిగా పని చేసింది .ప్రపంచం లో రెండవ మహిళా రాయబారి గా రికార్డ్ నెలకొల్పింది .మొదటి ఆమె డయానా అబ్గర్ జపాన్ లో అమెరికా రాయబారి గా చరిత్ర సృష్టించింది . తర్వాత మెక్సికో, స్వీడెన్ దేశ రాయబారిగా1926 నుంచి 1945 వరకు సుదీర్ఘకాలం పని చేసి సమర్ధతను నిరూపించుకొన్నది ..ఆమె స్టాక్ హోం లో ఉండగానే

‘’వింటర్ వార్ ‘’ రష్యా ,ఫిన్లాండ్ మధ్య జరిగింది . ఆమె ప్రభావంతో స్వీడెన్ తటస్థంగా ఉండి పోయింది .యుద్ధానంతరం ఆమె ‘’వ్యాచస్లావ్ మోలోటోవ్ ‘’పురస్కారం పొందింది .అనేక శాంతి సంభాషణలలో చురుకైన పాత్ర పోషించింది .లీగ్ ఆఫ్ నేషన్స్ కు రష్యా డెలిగేషన్ లో మెంబర్ గా ఉన్నది .కార్మిక మాతకు తన ,పర భేదం ఉండరాదని హితవు చెప్పేది .మాతృత్వానికి విలువనివ్వాలని కోరేది.

అలేక్సాండ్రా కొల్లాంటి 80 వ ఏట మాస్కో లో 9-3-1952 న మరణించింది .ఆమె పై ‘’వేవ్ ఆఫ్ పాషన్ ‘’సినిమా తీశారు . బ్రిటన్ ,అమెరికాలలో 1960 లో రాడికలిజం ,1970 లో ఫెమినిస్ట్ ఉద్యమం రావటానికి ముఖ్య కారణం ఆమె రచనలే .అంతటి ప్రభావ శీలి ఆమె .

– గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

వ్యాసాలు, Permalink

Comments are closed.