20అక్షరాల కవితకి 20ఏళ్ళు- బొడ్డు మహేందర్

     

                                                                                                                                                                                                                                                          కాలంలాగే కవిత్వం కూడమార్పుని ఆహ్వానిస్తుంది.మనిషిని, మనసుని ప్రభావితం చేస్తుంది. అందుకే వందల ఏళ్ళుగా ఛందోబద్ధమైన గ్రాంథిక పద్య సంకెళ్ళలో నలిగిపోయిన సాహితీ కన్య, నేడు సరళ వచన, భావ, ఆధునిక కవితా రీతులలో ఒదిగిపోయి, పండిత పామరుల్లో రసానుభూతిని కలిగిస్తోంది. “వాక్యం రసాత్మకం కావ్యమ్” అన్న స్ఫూర్తితో అల్పాక్షరాల్లో అన ల్పార్ధ రచన చేయాలనుకున్న కొందరు కవుల ఆలోచనా, రచనా ఫలితంగా మినీ కవితగా  కూడ ఆవిర్భవించి; భావ పరిమళాన్ని, భాషా పరిమళంతో సంయోగం చేసి విశ్వవ్యాప్తమవుతోంది. ఈ క్రమంలోనే వచ్చింది ప్రముఖ రచయిత డాక్టర్ ఎన్.గోపి మానస సాహితీ పుత్రిక “నానీ”. అందుకే ఆయనని “నానీల నాన్న” గా పిలుస్తారు. యాదృశ్చికంగా రూపొందించబడి, 1997లో వార్త దినపత్రిక-ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైన ఈ నూతన ప్రక్రియ అచిరకాలంలోనే ఆశేష జనవాహినిని ఆకట్టుకుంది.

                                “ఎండ పొడల్లో

                                 తడిగా నానీలు

                                  రక్తంతో శృతి చేసిన

                                   వినూత్న బాణీలు” ( ఎన్.గోపి)

                  తెలుగు కవితా వనంలో, నాలుగు పాదాలతో 20 నుండి 25 అక్షరాల పరిమితితో సాగుతున్న ఈ లఘు కవితా రూపం అప్పటికప్పుడు అనేక వర్ధమాన కవులని తయారు చేయడంలో సఫలీకృతం అయింది. అలతి అలతి పదాలతోనే అద్భుత భావ సంపదని సృజించింది. కొత్తగా కవిత్వం రాయాలనుకునే ఔత్సాహికులకి ఆదిగురువు లాగా, కల్పతరువు లాగా కనిపించింది. అందుకే 20ఏళ్ళయినా వస్తు వైవధ్యాలతో, అద్భుత నిర్మాణ కౌశలాలతో అలరారుతోంది “నానీ”. దీని ప్రేరణతో రెక్కలు, నానోలు వంటి మరెన్నో లఘు కవితా ప్రక్రియలు ఈ మధ్య కాలంలో వచ్చినా నానీల ఘనత తగ్గలేదు. ఆధునిక కాలంలో తెలుగులో కాల పరీక్షకి నిలిచి, సర్వామోదం పొందిన ప్రక్రియ “నానీ”. గురజాడ అప్పారావు “ముత్యాల సరం” తర్వాత  అంతగా పేరొందిన కవితా ప్రక్రియ “నానీ”. ప్రస్తుతం దీనిపై ఎం.ఫిల్, పి.హెచ్.డి స్థాయిల్లో విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి అంటే సాహితీ లోకంలో దీని యొక్క ప్రభావాన్ని అంచనా వేయొచ్చు. దేశీ కవితగా పేరుగాంచిన ఈ నానీలకి ఆ పేరే ఒక విచిత్రంగా తోస్తుంది ఎవరికైనా. దీని గురించి గోపి వివరిస్తూ “నావి నీవి వెరసి మనవి అని; నానీలంటే చిన్న పిల్లలు, చిట్టి పద్యాలు” అని అన్నారు.

            కేవలం అక్షరాల పరిమితితో రాసే ప్రతి వచనం నానీ కాదు. శతక పద్యాలలాగా ఇవి ముక్తకాలు. మినీ కవితే అయినా దీనికి శీర్షిక ఉండదు. రెండు రెండు పాదాలు-రెండు భాగాలుగా, మొత్తం నాలుగు పాదాలలో రాసే నానీలు సరికొత్త కవితా సౌందర్యానికి ప్రతీకలు. నానీలలో ప్రతీ పదం ఎంతో గాఢతని, భావ సాంద్రీకరణని కలిగి ఉంటుంది, ఉండాలి కూడ. వస్తు వైవిధ్యత తో పాటు రచయిత భాషా పరిజ్ఞానం, సాహిత్య స్పృహ, సామాజిక పరిశీలన ఇందుకు తోడ్పడుతాయి. హైకూ ల లాగా ఇవి తాత్వికతకో, ప్రకృతి వర్ణనకో పరిమితమైన ప్రక్రియ కాదు. అక్షరాలలోనే పరిమితి తప్ప భావాలలోనో, విషయాంశాల పైనో కాదు. అందుకే వీటిని విభాగాల వారీగా వర్గీకరించడం కష్టంతో కూడుకున్న పని. “కాదేదీ కవితకనర్హం” అన్నట్లుగా, కాదేదీ నానీలకి అనర్హం అయి కూర్చుంది. సీమ నానీలు, దళిత నానీలు, నేతన్న నానీలు  నల్లగొండ నానీలు, గుంటూరు నానీలు, హైదరాబాద్ నానీలు, ముంబాయి ముత్యాలు, దంపతీ నానీలు తదితర పేర్లతో ప్రచురితమైన సంపుటాలే ఇందుకు తార్కాణం. నానీలని ఒక కవితా ఉద్యమంగా పేర్కొనకపోయినా, నానీలలో మాత్రం అనేక వర్తమాన ఉద్యమాలు దాగి ఉన్నాయి. సమకాలీన ఉద్వేగాలు ఉన్నాయి. ఇది వస్తు పరమైన భావ స్వేచ్ఛ కల్పించిన ఒక సానుకూలాంశం. అలాగే అత్యల్ప సంవిధానం, కంఠస్థ యోగ్యం, సూటిదనం అనేక మంది కవులకి ఈ ప్రక్రియని మరింత దగ్గర చేసాయి.

                      నానీలు ఒక ప్రక్రియగా 1997లో రూపొందినా, అవి పుస్తక రూపంలోకి రావడానికి ఏడాది పైనే పట్టింది. 365 నానీలతో గోపి “నానీలు”పేరుతో తన స్వీయ తొలి నానీల సంకలనాన్ని  బయటికి తెచ్చాక, వాటికి మెల్లిగా ప్రాచుర్యం రావడం మొదలైంది. ఆ తర్వాత మరికొద్ది కాలానికి మరో 365 నానీలతో మరో సంకలనాన్ని తెచ్చారు గోపి. అలా 730నానీలని మాత్రమే రాసి వదిలేసారు. అయితే నవతర కవులతో పాటు పాతతరం వారు కూడ ఉత్సాహం చూపడంతో సందర్భానుసారంగా నానీల ప్రక్రియను గురించిన వ్యాసాలు, ఉపన్యాసాల ద్వారా ఉత్తేజపరచడం మొదలు పెట్టారు ఎన్.గోపి. నానీల సంపుటాల్లో పీఠికలు రాస్తూ సందర్భానుసారం నానీల విశేషాలని, వాటి నిర్మాణ మర్మాలని వెల్లడిస్తూ వచ్చారు. “నానీల పీఠికా ప్రస్థానం” పేరుతో డా.పత్తిపాక మోహన్ వీటన్నిటిని సంకలనం చేసారు. ఈ విధంగా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా కనీసం ఒక వెయ్యిమందికి పైగా కవుల కలాల్లో, గలాల్లో నానీ ఒదిగిపోయింది. ప్రస్తుత వర్ధమాన కవుల్లో కొందరికి సాహిత్య సింహద్వారమై నిలిచి, తొలి సంపుటంగా రచించేలా ప్రేరేపించింది నానీయే అంటే అతిశయోక్తి కాదు. ఇందులో ఎందఱో కవయిత్రులూ ఉన్నారు.

                          ఇంతకు మునుపు మనం చెప్పుకున్నట్లుగా నానీ ఏ ఒక్క భావ ఉద్యమానికి పరిమితమవని ప్రక్రియ అవడం చేత అన్ని రకాల ఉద్యమాల్లోనూ నానీలని ఇమిడ్చారు మన కవులు, రచయితలు. అలా స్త్రీవాదానికి ఆలంబనగా చేసుకొని అద్భుతమైన నానీలు రచించారు చిల్లర భవానీ దేవి. “భవానీ నానీలు” పేరుతో ఆమె ఒక సంకలనాన్ని కూడ వెలువరిచి, నానీలు రాసిన తొలి కవయిత్రిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆమె రాసిన ఒక ప్రసిద్ధ నానీ :

                                           “వివాహమా

                                            ఎంత పనిచేశావు?

                                            నన్ను పుట్టింటికి

                                             అతిథిని చేశావు”

ఆమె బాటలోనే పదుల సంఖ్యలో కవయిత్రులు నానీల సంపుటిలను వెలువరించారు. ఉదహరణకి

                                            “పెద్ద చదువు

                                              పింగాణి కల

                                              వంటింటి తాలింపు

                                               వీడని వల”

అని రంగనాయకి “సూరీడు చెంపలు” అనే సంకలనంలో వ్రాసిన నానీలు స్త్రీల విద్యా స్థితిగతులని వ్యక్తపరుస్తాయి.అలాగే అడవి పుత్రుల గొప్ప సంస్కృతిని,వారి దీన గాథల్ని సరళమైన భాషలో, అందరికీ అర్ధమయ్యేలా నానీల రూపంలో అందించిన కవయిత్రి డా.సుర్యాధనుంజయ్. “బంజారా నానీలు”పేరుతో వెలువడిన ఈ సంపుటిలో తండాల్లో జరుగుతున్న అమానవీయ దృశ్యాలను వర్ణించారు.  ఇలా నానీలని తమ వాదాన్ని, నాదాన్ని, నినాదాన్ని తెలియజేయడానికి ఉపయోగించుకున్న కవులు ఎందరో. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తమ నినాదాలకి నానీలనే వేదికగా మలుచుకున్నారు. తెలంగాణ నానీలు(సబ్బని లక్ష్మీ నారాయణ), నూరు తెలంగాణ నానీలు(కోట్ల వెంకటేశ్వర రెడ్డి) తదితర పేర్లతో కవితా సంకలనాలని వెలువరిచారు.

                           యిక 2004లో టి.పృధ్వీరాజ్ “అడుగులు” అనే నానీల సంపుటిని ప్రచురించడంతో పాటుగా, అప్పటికే రచించియున్న ప్రసిద్ధ కవుల నానీలని ఒక చోట చేర్చి “నానీ బాణీలు” పేరుతో  ఆడియో రూపంలో ఒక సీడీని విడుదల చేయడం జరిగింది. అలాగే 2010లో నానీ అవార్డుల సందర్భంగా “నలుదిక్కుల నానీలు” (నలుగురు కవుల నానీల తొలి సంకలనం)ని ఆవిష్కరించడంతో పాటుగా, “నానీ దృశ్యాలు” పేర్లతో  అవార్డు పొందిన నానీలని వీడియో రూపంలోకి కూడ మార్చడం జరిగింది. ఇందులో కొన్ని ప్రస్తుతం యూట్యూబ్ లో కూడ లభ్యమవుతున్నాయి. మచ్చుకు అందులోని ఒక నానీ : (ద్వానా శాస్త్రి రాసిన “సాహిత్య నానీలు” లోనిది)

                                            “కాలాన్ని నిద్రపోనివ్వని

                                              వేమన గోపి

                                               నానీల

                                               భువనగిరి”

యిక ఈ నానీల ప్రక్రియని మరింత స్థిర పరచాలనే ఉద్దేశ్యంతో, నానీల కవులని ప్రోత్సహించే లక్ష్యంతో ఈయనే 2005 నుండి పురస్కారాలు కూడ ఇవ్వడం మొదలు పెట్టారు. అలా తొలి పురస్కారాన్ని ఎస్. రఘు రచించిన “జీవన లిపి” అనే నానీల సంపుటికి ఇచ్చారు. అందులోని ఒక నానీ :

                                                “పుస్తకాలకు

                                                 రెక్కలుండవు

                                                  చదివితే

                                                  మనకు పుట్టుకొస్తాయి”

ఈ ఆవార్డు పొందిన సీనియర్ కవి ప్రముఖుల్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా.నలిమెల భాస్కర్ కూడ ఉన్నారు. 2006లో ప్రచురించిన “మట్టి ముత్యాలు” నానీల సంకలనానికి గాను ఆయన ఈ బహుమతి పొందారు. అందులోంచి ఒక నానీ :

                                                       “అన్నం

                                                       కుతకుత ఉడుకుతోంది

                                                        వండించిన వాడికి

                                                        అందలేదనేమో”

                      2001 నుండి నానీలని రాస్తూ, “నానీల శిక్షణాలయం” పేరుతో కార్యశాలలు నిర్వహిస్తూ కోనసీమలో యువకులకు మార్గదర్శకంగా నిలిచిన కవి నల్లా నరసింహమూర్తి. నడక ఉద్యమంలో భాగంగా నానీల ద్వారా ఆరోగ్య సందేశాలని అందిస్తూ నడక నానీలు, నడక నడిస్తే, నడక నడిచే వేళ, నడక ఆరోగ్యం, నడక నా తల్లి వంటి అనేక సంపుటాలు ప్రచురించారు.

                       మొత్తంగా నానీల ప్రస్థానాన్ని గమనిస్తే, ఆ ప్రక్రియ నచ్చి  కవులు స్వయంగా ఉత్తేజం చెంది రాసినది కొంత అయితే, ఆ ప్రక్రియని ప్రజలకి మరింత చేరువ చేయాలనే తలంపుతో అనేక మంది కవులు, ఔత్సాహిక కవులని రాయమని ప్రోత్సహిస్తూ సృజించినవి మరికొన్ని. ఇలా నానీ అనే ప్రక్రియ స్థిరపడటంలో చాలామంది కృషి దాగి ఉంది. అందుకే తెలంగాణలో దీర్ఘ కవిత ప్రక్రియ తర్వాత అత్యధిక కవితా సంపుటాలు వెలువడినది నానీల ద్వారానే. గడిచిన ఈ రెండు దశాబ్దాలలో దాదాపు 300వరకి సంపుటాలు వెలువడ్డాయని ఒక అంచనా. ఈ స్థితిని గమనించే ప్రముఖ కవి, విమర్శకుడు దాస్యం సేనాధిపతి “నానీ కవుల డైరెక్టరీ”ని ముద్రించారు. “శతాధిక కవుల నానీలు” పేరుతో ద్వానా శాస్త్రి ఒక సంకలాన్ని తెచ్చారు. “నవ్య కవితారూపం-నానీ వివేచన” పేరుతో చింతకింది శ్రీనివాస రావు, “అత్యాధునిక కవితారూప ప్రక్రియ – నానీ” పేరుతో చలపాక ప్రకాష్  తమ సిద్ధాంత గ్రంథాలని వెలువరించారు.  నానీల సమాలోచనం అంటూ ఎం. నారాయణ శర్మ, ఎస్.ఆర్ భల్లం నానీల విశిష్టతని విశ్లేషించారు. ఇంకా గోపీ నానీల సమాలోచనం, నానీలు – సంవీక్షణం, నానీల దశాబ్ది(1997-07)-ప్రసంగ వ్యాసాలు అనే మూడు గ్రంథాలు కూడ నానీల పరిణామ క్రమాన్ని, ప్రభావ శీలాన్ని చక్కగా విశ్లేషిస్తాయి.

                        అయితే ఇప్పటిదాకా ప్రస్తావించినవన్నీ ఈ ప్రక్రియకి సంబంధించిన అనుకూల కోణాలు. అలా అని వీటిపై వ్యతిరేకత లేదనుకోవడానికి వీలు లేదు. అసలు ఇది సాహిత్యమే కాదనుకునే వారు కోకొల్లలు. ఇవి చమత్కార ప్రధానంగా రంజింప జేస్తాయి గానీ, కవితాత్మక భావ ధారతో పాఠకుల్ని చైతన్యపరచలేవని విమర్శకుల అసహనం. ఇవి కవి అపరిపక్వతని, ప్రతిభా శూన్యతని సూచిస్తాయని వారి విశ్వాసం. అలాగే నానీల పేర్లతో వెలువడ్డ అన్నీ రచనల్లోనూ కవిత్వం పొంగిపొర్లిందని చెప్పలేం. బియ్యపు గింజలలో వడ్ల గింజల చందంగా కొందరు నినాదాలను, హితోక్తులని కూడ నానీలు అని ముద్రించారు. అయితే సూక్ష్మంలోనే మోక్షం అన్న చందంగా వెలువడిన నానీలలో మేలి ముత్యాలు ఇంకా వస్తుండటం మూలానే వీటికి కాలదోషం పట్టలేదు. ఈ సందర్భంలో ఎన్.గోపి రాసిన ఒక నానీని ప్రస్తావిస్తూ ఈ వ్యాసానికి ముగింపు పలుకుదాం.

                                               “దారం పేరు ఆశ

                                                కుట్టి ఉండకపోతే

                                               గుండె ఎప్పుడో

                                                పగిలిపోయుండేది”

 అన్నట్లుగా సాహిత్యంలో కూడ కాలానుగుణ్యత, భాషాభినివేశం లేకపోతే కవిత్వం ఎప్పుడో అంతమయ్యేది. నానీలకి ఇంకా ఆ దుస్థితి దాపరించలేదు కనుకే మరో 20ఏళ్ళు అయినా నిలకడగా కొనసాగుతాయని ఆశిస్తున్నాను.

                                                                                                               –బొడ్డు మహేందర్  

———————————————————————————————————————–

    

వ్యాసాలు, UncategorizedPermalink

Comments are closed.