నా కళ్ల తో అమెరికా -67-(యాత్రా సాహిత్యం )- డా.కె.గీత

మెక్సికో నౌకా యాత్ర- భాగం-4

ఇక అక్కడి నించి ఎనిమిదో అంతస్థు లోకి దిగే సరికి పెద్ద పెద్ద పెర్ఫార్మింగ్ హాల్సు, థియేటర్లు ఉంటాయి.
ఏడో అంతస్థులో ఈ మూల నించి ఈ మూల వరకు, కేసినో, ఫోటో స్టూ డియోలు ఉంటాయి. ఆరో అంతస్థులోఅన్నీ షాపులు బట్టలు, గిఫ్ట్ ఐటమ్సు. అన్నిటినీ మించి ఒక మోస్తరు ఖరీదు నించి, బాగా ఖరీదైన రాళ్ళ నగల వరకూ అమ్ముతూంటారు. షాపింగు ఫెస్టివల్ కూడా చివరి రోజు పెట్టేరు.

ప్రతీ అంతస్థులో ఈ చివర నించి ఆ చివర వరకూ ఇలా చూసుకుంటూ మేం మొదట బయట నుంచి ప్రవేశించిన అయిదో అంతస్థులోకి వచ్చే సరికి మళ్లీ రాత్రి భోజనాల వేళ అయిపోయింది.వరు వయసు పిల్లలకి ఉచితంగా “యూత్ క్లబ్” అనీ, చిన్నపిల్లలకు “కిడ్స్ క్లబ్స్” అనీ ఉన్నాయి.

షిప్పు ఎక్కిన దగ్గర్నించీ వరు సాయంత్రం ఈ యూత్ క్లబ్బుకి వెళ్తానని పేచీ మొదలు పెట్టింది.
ఇందులో ఆ వయసు పిల్లలకి కబుర్లు చెప్పుకోవడానికి మంచి సిట్టింగ్ ఏరియాలు, చిన్న టీవీ, బోర్డు గేమ్స్ వగైరా ఎంటర్టైన్మెంట్లు చాలా ఉన్నాయి.

వాళ్లని కాపలా కాయడానికి, సహకరించడానికీ నలుగురైదుగురు కోచ్ లు కూడా ఉన్నారు.
ఈ క్లబ్బు సాయంత్రం ఆరు నించి పదకొండు గంటల వరకు ఉంటుంది.
షిప్పులోని టీనేజ్ పిల్లలంతా అక్కడే ఉన్నారు.

ఇక సిరి కిడ్స్ క్లబ్బు ఏక్టివిటీస్ నిర్ణీత సమయాల్లోనే బాచ్ ల వారీగా ఉంటాయి. రాత్రి 9 గంటలకు బాచ్ లు క్లోజ్ అయిపోయాక, ఇంకా పిల్లల్ని కొనసాగించాలనుకుంటే 11 గంటల వరకు గంటకి పది డాలర్ల చొప్పున కట్టి ఉంచవచ్చు.

మేం వరుని సాయంత్రం 6 గంటలకే పంపకుండా మాతో బాటూ డిన్నర్ అయ్యాక దాదాపు రాత్రి 8.30 గంటల వేళ పంపేవాళ్ళం ఆ రెండు రోజులూ.

సిరినైతే రోజు మొత్తమ్మీద మహా అయితే అరగంట సేపు వదిలి ఉంటాం. అంతే. ఏదేవైనా భార్యాభర్తలు ఇద్దరూ షిప్పంతా తిరిగి హాయిగా ఎంజాయ్ చెయ్యడానికి వీలుగా షిప్పులో ఇలా పిల్లల ఎంటెర్టైన్ మెంటు సెంటర్లు ఉండడం విశేషం.

క్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.

సాయంత్రం పెద్దవాళ్లకు, పిల్లలకు కలిపిన ఎంటర్టైన్మెంట్ థియేటర్ లో వెల్ కమ్ డాన్సులు, కామెడీ ప్రోగ్రామ్, పాటల కార్యక్రమం చూసేం. ప్రతీ హాలు బయటా కూల్ డ్రింకుల పాసులు కొనుక్కున్న వారికి టిప్పు ఇస్తే హాలు లోపలికి తెచ్చి ఇచ్చే మనుషులు ఉంటారు. లేదా మనమైనా వెళ్లి ఎన్ని సార్లయినా తెచ్చుకోవచ్చు. ఆరంజి, ఏపిల్ జ్యూసులు కూడా అందులోని భాగమే.

దాదాపు పదకొండు గంటల ప్రాంతలో అందరం గదికి చేరుకుని ఆదమరిచి నిద్రపోయేం. షిప్పు బయలుదేరిన దగ్గర్నించీ సముద్ర కెరటాల కదలికలు అంత పెద్ద షిప్పులోనూ లైటుగా తెలుస్తూనే ఉన్నాయి. చిన్నగా బుర్ర తిరుగుతున్నట్లు అనిపించసాగింది నాకు ఓడలో ఉన్నంతసేపు. ఇక సముద్రం అంతర్భాగం లోకి ప్రవేశించినట్లు న్న రాత్రి పూటైతే బాగా ఎక్కువగా కెరటాలలో ఓడ అటూ ఇటూ ఊగడం బాగా తెలిసింది.

పైగా మేం బస ఉన్న అంతస్థు కిటికీ దిగువన కెరటాలు కనిపిస్తూ , సముద్రం వైపు గది కావడం వల్ల దబ్బు దబ్బున ఓడని కొట్టుకునే నీళ్ల సవ్వడికి అసలు నిద్ర సరిగా పట్టలేదు నాకు.

ఉదయం ఏడు గంటలకే మా ఓడ తీరాన్ని చేరనుందని ఎనౌన్సుమెంటు వచ్చింది. కిటికీ లోకి ఎక్కి కూచునే గట్టు ఉండడం వల్ల లేస్తూనే అందులోకి ఎక్కి కూచుని ఒడ్డున కనిపిస్తున్న వరస పర్వతాల్ని, బూడిద రంగు నీళ్లని తెల్లని నురగ కత్తులతో కోసుకెళ్తున్న ఓడ అంచుని చూస్తూ ఒక మహాద్భుత ఉదయాన్ని తిలకిస్తూ ఉంటే నా చిన్నతనంలో ప్రతీ వేసవిలోనూ గది కిటికీ గట్టు మీద కూచుని టామ్ సాయర్, హకల్ బెరీ ఫిన్ ఆశ్చర్యానందాల్తో పదేపదే చదవడం జ్ఞాపకం వచ్చింది.

మబ్బు కమ్ముకుని ఉండడం వల్ల ఉదయం ఆహ్లాదంగా కనిపిస్తున్నప్పటికీ, అయ్యో! ఇవేళంతా బయట తిరగాలి కదా, వర్షం పట్టుకుంటుందేమో అని దిగులు పడ్డాం.

అయితే మేం దిగే సరికి చక్కగా ఎండ కాస్తున్నందు వల్ల సముద్రం లోపల ఉన్న వాతావరణం వేరు, తీరాన వాతావరణం వేరు అని అర్థం అయింది.

మొత్తం ప్రయాణంలో ఆ రోజు రెండవ రోజు. ట్రిప్పు వాళ్ల నిర్ణీత అజండా ప్రకారం ఆ రోజు మేం మెక్సికో భూభాగంలో దిగి నగర సందర్శన చేస్తాం. నగర సందర్శనలో భాగంగా రకరకాల టూర్లు ఉన్నాయి. అవి షిప్పు టిక్కెట్టు తో సంబంధం లేకుండా విడిగా కొనుక్కోవాలి. వైన్ టూర్, ఫుడ్ టూర్, బీచ్ టూర్ మొదలైనవి. వైను టూర్ల వంటి వాటికి మేం ఎప్పుడూ, ఎక్కడా వెళ్ళం. ఇక దూరాభారాలకి నడిచి తిరిగి చూసేవాటికి సిరితో చాలా కష్టం. అస్సలు నడవకుండా మాటిమాటికీ ఎత్తుకోమని పేచీ పెడుతుంది. కాబట్టి ఉన్న టూర్లలో ఒక ఫుడ్డు టూరొకటి బుక్ చేసుకున్నాం.

ఇలా భూభాగంమీద ఏ టూరుకీ వెళ్లని వారు సముద్ర తీర ప్రాంతపు స్నోర్కిలింగు వంటికి టూర్లకు వెళ్లవచ్చు, లేదా షిప్పులోనే సేద తీరొచ్చు.

(ఇంకా ఉంది)

– డా. కె .గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

నా కళ్ళతో అమెరికా, యాత్రా సాహిత్యంPermalink

Comments are closed.