పత్ర చిత్రకారిణి సుహాసినితో ముఖాముఖి- రవి కుమార్ పెరుమాళ్ల

రవి : నమస్కారo మేడం 
సుహా: నమస్కారo రవి,విహంగ పాఠకులకి అభివాదాలు.

రవి:మేడం ఇటీవల మీరు పనిచేసిన కళాశాల లోని గ్రంధాలయంలో మీ పేరున ఆర్ట్ కార్నర్ పెట్టారని విన్నాను.చాలా సంతోషం.దాని గురించి చెప్పండి.

నేను పనిచేస్తున్న మహిళా కళాశాలలోనే నన్నొక కళాకారిణిగా గుర్తించడం, నాపేరుతో ఒక కార్నర్‌ని ఏర్పాటు చెయ్యడం నేను, నా ఆచరణ, నా కళ విద్యార్థులకి ఇన్ఫిరేషన్‌గా వుంటుంది అని వాళ్ళు భావించడం ఎంతో ఆనందం కలిగించింది.
బతికుండగానే ఇలాంటి గౌరవం దక్కడం కన్నా ఏ కళాకారులైనా కోరుకునేదేముంటుంది. నా చిత్ర ప్రస్థానంలో జూలై 10 ఒక మైలురాయి. ముప్ఫై సం॥గా వున్న ఊర్లో, పనిచేసిన కాలేజీలోనే నాకు  గౌరవం దక్కడం అనూహ్యమైన విజయం. అప్పుడు, ఆరోజు నేను భారతదేశంలో లేకపోవడం, ప్రత్యక్షంగా పాల్గొనలేకపోవడం ఒక చిన్న ముల్లులా  గుచ్చుతున్నా, తిరిగి రాగానే మా సహోపాధ్యాయినులతో కలిసి `   లక్ష్మీసుహాసిని ఇకో ఫ్రండ్లీ ఆర్ట్‌ కార్నర్‌లో బూరెలు  తింటూ, టీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకోడం ఎంతో సంతోషంగా అనిపించింది.

రవి: మీ కళా ప్రవేశం గురించి చెప్పండి ?

లక్ష్మీ:నేను కళాకారిణిగా రూపాంతరం చెందడం యాదృచ్ఛికమే. అంతవరకూ  సామాజిక స్పృహ కలిగిన కవయిత్రిగా, గాయకురాలిగా, విమర్శకురాలిగా, కళారంగంలోనే వున్నా చిత్రకారిణిని కాగలను అనుకోలేదు. పెద్దక్క అన్నపూర్ణ, చిన్నక్క డి.వి. రమణీ తమ తైల  వర్ణ చిత్రాలతో మంచిపేరు తెచ్చుకున్నారు. నిరక్షరాస్యులైన స్త్రీని చేరడానికి కవిత్వం కన్నా ఏదైనా దృశ్యమాధ్యమం ఉపయోగపడుతుందనే ఆలోచన ఒకటి వుండేది… నాటకాలు  రాద్దామా, నాటకాలు   వేద్దాం అనైతే తరుచూ  చెప్పేదాన్ని.కుటుంబ సంక్షోభం, అనుకోని తీవ్ర అస్వస్థత నన్ను 11 నెలలపాటు ఇంటికే పరిమితం చేసింది.అప్పుడు నా కార్యరంగం పూర్తిగా కాగితమే అయినప్పుడు చిత్ర కళా రంగం లో ప్రవహించి అక్కడ ఘనీభవించానన్నమాట 

రవి : మీ స్త్రీల  చిత్రాలు చాలా ప్రత్యేకంగా వుంటాయి. అది ఎలా సాధించారు?

అయితే ప్రముఖుల  చిత్రాలలో సహితం స్త్రీని, దేవతామూర్తుని చిత్రించే పద్ధతి నచ్చేది కాదు. స్త్రీని అందంగా చిత్రించడం అంటే ఇది కాదు ` ఇలాకాదు అనిపించేది. బాపూగారి బొమ్మల్ని చూసినా ` ఒంపులే అందంకాదు అనిపించేది. నిజమైన అందం వ్యక్తిత్వం… అది స్ఫురించేలా చిత్రించాలి. అంతర్గతంగా ఇమిడి వున్న ఆలోచన ` ఆత్మ కనిపించాలి అనిపించేది… అది వారి చూపులో, నవ్వులో, ముఖం వంచిన కోణంలో స్ఫురింపచెయ్యాలి అనుకునేదాన్ని.

రవి : మీరు మొదలు  పెట్టడమే ఆకుతో మొదలు పెట్టారా లేక కొన్నాళ్ళు చిత్రాలు వేసి, సాధన చేశాక ఈ మాధ్యమంలోకి వచ్చారా?

పూర్వరంగం ఏమీ లేదు… అప్పటికే మహిళా హక్కుల  కోసం పనిచేస్తూ వుండేదాన్ని. అప్పటికే సారావ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించిన అనుభవం, గ్రామీణ స్త్రీలను కూడగట్టడానికి ప్రచార కార్యక్రమాలలో భాగంగా వారితో మమేకమై పనిచేసిన అనుభవం ఉంది.మా సంఘం ఎంబ్లంతయారుచేయాలనుకున్నప్పుడు  కొత్తదనంకోసం వెతికే క్రమంలో ఈ మాధ్యమాన్ని ఎంచుకున్నాను.

రవి: ఆ కళా ప్రస్థానాన్ని కొంచెం వివరించరూ?
తప్పకుండా… ఈ తొలి అడుగుకు ముందు నేపధ్యం  లో నేను బోటనీ స్టూడెంటుని కావడం, నాన్న చనిపోయినప్పుడు ఆ దిగులు  పోగొట్టుకోడం కోసం ఆకులు  సేకరించి నిర్జలీకరించి భద్రపరిచే హాబీ వుండడం వల్ల  ఒకసారి ఆకుతో చేద్దామనుకోగానే ముడి సరుకుకి వెతుకక్కోనక్కర లేకపోయింది.అసలు  ఈ ఆకుల  బొమ్మలో ప్రధానమైన అడ్డంకి ఆకుని సక్రమంగా నిర్జలీకరించడమే… అది 2000 సం॥ ఫిబ్రవరి 8వ తారీఖున ప్రారంభించి మార్చి 7వ తారీఖులోగా తొలి 25 బొమ్మలు  చేసి ప్రదర్శనకు పెట్టాను. నా తొలి ప్రదర్శన మార్చి 8వ తారీఖున నేను పనిచేసే కాలేజీ బోటనీ లాబ్‌లో నిర్వహించాను.
                 

                    తరువాత ఏప్రిల్‌ 1, 2వ తేదీలో నెల్లూరు  టౌన్‌హాల్‌ రీడిoగ్‌ రూమ్‌లో రెండో ప్రదర్శన నిర్వహించాను. స్త్రీల  నుంచి మంచి స్పందన వచ్చింది. తమ జీవితాన్ని అద్దంలో చూసుకున్నట్లుంది అనేవారు. వరకట్న వేధింపుల  మీద ఇంటి చాకిరీ మీద గృహహింస మీద నాతొలి చిత్రాలున్నాయి. అవి మా విద్యార్థినుల  నుంచి మంచి స్పందనని పొందడంతో ఇదే మాధ్యమంలో కొనసాగించాను.
                2004లో నా ఎండుటాకుల  కళ లిమ్కా బుక్‌లో స్థానం సంపాదించినా, అది నా దృష్టికి రాలేదు. రెండోసారి 2008లో వేసిన మంటలో మహిళ చిత్రం 2010లో పెటల్స్‌ విభాగంలో ఎక్కువ సంఖ్యలో పూరేకులతో చేసిన చిత్రంగా లిమ్కాబుక్‌లో నమోదైంది. అదీ నాదృష్టికి జేరనేలేదు.వీళ్ళు గుర్తించలేదనుకుని 2013లో మళ్ళీ ‘‘మంటలో మహిళ’’ చిత్రాన్ని పంపినప్పుడు లిమ్కా బుక్‌ ఎడిటర్‌ ఆర్తీసింగ్‌ ఈ చిత్రం మా రికార్డులో వుంది, మీరు మల్టిపుల్‌ రికార్డ్‌ హ్డోర్‌గా మా లిస్టులో వున్నారు అని చెప్పినప్పుడు మాత్రమే నా కళ తొలిసారి నేనే ఆవిష్కరించానని అర్థమైంది.
ఒక్కసారి కూడా గుర్తింపబడలేదే అని దిగులుపడిన నాకు అప్పటికే రెండుసార్లు అదీ  10 సం॥ క్రితమే తొలి ప్రయత్నంగా గుర్తింపబడడం`చాలా సంతోషం కలిగింది. ఆ ప్రయాణం అలా మొదలైంది.

నిజమే. అప్పుడో అనుమానం వచ్చింది. అప్పుడు రికార్డా? ఇప్పటికీ రికార్డా? అని ఆ మీమాంస లో వుండగానే తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్‌ వెంకాచారి గారు ఫోన్‌ చేసి లిమ్కాబుక్‌లోవున్నమంటల్లో  మహిళ చిత్రానికి  వాళ్లు రికార్డుగా గుర్తిస్తున్నామని , వాళ్ళ బుక్‌లో వేసుకోవడానికి పర్మిషన్‌ అడిగారు.   2013లో తెలుగు బుక్‌, మిరాకిల్‌ బుక్‌ ఆ చిత్రాన్ని రికార్డుగా గుర్తించారు. 2014 నాటికి ఇండియా బుక్‌, ఏసియాబుక్‌  రెండూ గింజ విభాగంలో వేసిన చిత్రాన్ని కూడా తొలిచిత్రంగా గుర్తించా రు. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో కూడా 2014లో రికార్డయ్యింది.

రవి:రెండు విభాగాలో రికార్డుపొందారా?
ఆకు విభాగంలో, పూరేకు విభాగంలో, గింజ విభాగంలో తొలి అత్యుత్తమ చిత్రంగా మూడు విభాగాలో రికార్డు నయోదయ్యాయి. వండర్‌ బుక్‌, అమేజింగ్‌ బుక్‌, భారత్‌ బుక్‌లు  మూడు విభాగాలో నా రికార్డుని నమోదు చేశారు. రికార్డు హోల్డర్స్ రిపబ్లిక్‌, గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, గోల్డెన్‌ స్టార్‌ రికార్డ్‌ హోల్డర్స్  రికార్డ్స్‌లో రెండేసి విభాగాలో రికార్డు నమోదయ్యాయి.

రవి:మీ రికార్డు మీరే తిరగరాసుకున్నారని విన్నాను.అది ఎంతవరకు నిజము ?
ఔను. దాన్ని సెల్ఫ్‌ రికార్డ్‌ బ్రేకింగ్‌ రికార్డ్‌ అంటారు…ఆకు విభాగంలో తొలి పత్రచిత్రకారిణిగా వున్న రికార్డుని 40 కుటుంబాలకు చెందిన ఆకులు  సేకరించి 1000 మహిళా చిత్రాలు  చిత్రించడం ద్వారా యూనీక్‌ లీఫ్‌ ఆర్టిస్టుగా కొత్తరికార్డును ఆవిష్కరించాను. సావిత్రీబాయి చిత్రంతో భారత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో నమోదైంది.
గింజ విభాగంలో 6000 గింజలతో వున్న 22’’ 28’’ సైజులో వున్న చిత్రాన్ని 1560 గింజతో 36’’ 22’’ సైజులో ‘‘కణ్ణంగి’’ చిత్రాన్ని రాచరికాన్ని ధిక్కరించిన మహిళ చిత్రాన్ని చిత్రించి ` కొత్త రికార్డు నెలకొల్పాను. ఈ చిత్రం భారత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, అమేజింగ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం పొందింది.

రవి:చిన్న అనుమానం మేడమ్‌. అవార్డుకి మరియు రివార్డ్ కి తేడా ఉందా ? ఉంటే ఆ తేడా ఏంటో చెప్పగలరా ?
చాలా తేడా వుంది. అంతవరకు ఎవరూ చేయనిది రికార్డు. అకాడమీలు , యూనివర్సిటీలు , స్వచ్ఛంద సంస్థలు సాహిత్య సంస్థలు సంస్మరణగా ఇచ్చే పురస్కారాలు , అభినందనా పురస్కారాలు అవార్డులు , ధన, కనక, వస్తురూపంలో, సన్మానరూపంలో వుంటాయి. ఇక తొలిసారి గుర్తింపబడే స్థాయిలో చేసే మానవ ప్రయత్నాన్ని  రికార్డు అంటారు. అవి మానవుడు సాధించగలిగినవి, ప్రయత్నపూర్వకంగా ఎవరైనా అంతకృషి చేసి అధిగమించగలిగినవి అయి వుంటాయి. రికార్డు స్థాయిలో కృషి చెయ్యడం అంటారు అందుకే.

 రవి:మీ రికార్డు ఎవరైనా అధిగమించారా?
ఇంకాలేదు…రవి … నా రికార్డ్ లను నేనే అప్ గ్రేడ్  చేశాను. ఇలా ఎన్‌హాన్స్‌ చెయ్యడం  ఇంకొంచెం కష్టం.
రవి:గ్రేట్‌ మేడం . మీకు స్ఫూర్తి ఎవరు ?
విని ఆకుతో చేసిన జంతువు బొమ్మలు  తొలి ప్రేరణ అని చెప్పవచ్చు. నేను కొన్ని ప్రదర్శనలు  నిర్వహించాక మా కొలిగ్‌ ఆంగ్లోపాధ్యాయిని డా॥ జి. అరుణ మేడమ్‌ ఆకుతో చేసే గ్రీటింగ్‌ కార్డు నాకూ, నా స్త్రీ చిత్రాలు  ఆమెకి పరస్పర ప్రేరణయ్యాయి. ఆ తర్వాతే నేను వాల్‌ హాంగింగ్స్‌, గ్రీట్స్‌, పేజ్‌మార్కర్స్‌ చేశాను.
రవి: స్త్రీ మీ చిత్రాలకు ప్రేరణా?

నా విద్యార్థులు , సహోద్యోగులు , గ్రామీణ స్త్రీలు , మా నెల్లూరు  జిల్లా పల్లెలు , పల్లె పడచులు , సారా పోరాటం, మహిళా కార్యకర్తలు .
రవి:మీరు ఎవరినైనా శిష్యులుగా తయారు చేసుకున్నారా?
కావలి విశ్వోదయ హైస్కూల్‌ ఒకటీ, మా కాలేజీలో నాలుగు వర్క్‌షాప్స్‌ నిర్వహించాను. హైదరాబాద్‌ వచ్చాక రెండు నిర్వహించాను. ప్రతీ పాఠశాలలో సగటున 200 మంది దాకా పాల్గొని  చాలా మంచి స్పందనతో వెళ్ళారు. వాళ్లు నేర్చుకున్న ఆకు చిత్రాలు చివరిలో ప్రదర్శించేవాళ్ళం కూడా. గ్రీటింగ్‌ కార్డు, లాండ్‌స్కేప్స్‌ చేసేవారు, స్త్రీ చిత్రాల దాకా రాలేకపోయారు.

రవి: మీ రేపటి పథకాలు , భవిష్యత్‌ కార్యక్రమాలు  ఏమిటి ?
కొన్ని థీమాటిక్‌ పిక్చర్స్‌ వెయ్యాలి. భూనిర్వాసితుల  మీద కొన్ని వరస చిత్రాలు  వేస్తున్నాను. అది యు.ఎస్‌. వెళ్ళడానికి ముందు స్టార్ట్‌ చేసాను. కొన్ని కొత్తరకాల  ఆకులు తెచ్చుకున్నాను కూడా. పోరాట స్ఫూర్తిని ఇచ్చే గ్రామీణ స్త్రీ చిత్రాలు  కొన్ని వెయ్యాలి. రెండోది కొన్ని వర్క్‌షాప్స్‌ కండక్ట్‌ చేయ్యాలకుంటున్నాను. ఇవన్నీ నా తక్షణ పథకాలు . అయితే నాకున్న భవిష్యత్‌ కార్యక్రమం ఒక్కటే. అది నేను ప్రారంభించిన కళ కొనసాగించడానికి ఒక ఆర్ట్‌ అకాడమీని ప్రారంభించి సాధ్యమైనంత ఈ కళని ప్రచారం చెయ్యడం, ఆ అకాడమీకి అనుసంధానంగా ఒక ఎండుటాకు చిత్రకళా ప్రదర్శనని ఏర్పాటు చేసి ఆ నేర్చుకునే విద్యార్థులకి ఉదాహరణ ప్రాయంగా దానిని నిoపడం ఆమూలంగా అడుగులు  వేస్తున్నాను.

– రవి కుమార్ పెరుమాళ్ల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ముఖాముఖిPermalink

One Response to పత్ర చిత్రకారిణి సుహాసినితో ముఖాముఖి- రవి కుమార్ పెరుమాళ్ల

  1. కెక్యూబ్ వర్మ says:

    Great work madam record breaking always owned by you