మేఘసందేశం-02 – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

మహాకవి కాళిదాసుకు స్త్రీ ప్రకృతిరూపియై కనబడుతుందట. ప్రకృతివలెనే కాళిదాసు స్త్రీలు నిసర్గ సౌందర్యవంతులు. ఆభరణాలు ఉన్నా లేకపోయినా వారు సౌందర్యవంతులే! కరుణాది రసాలకన్నా శృంగారమే అతనికి అభిమానం. కాళిదాసు సరస సరళ స్వభావం గల కవి. ప్రకృతి మొత్తం సౌందర్యంగా శృంగారంగా కనబడడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కాళిదాసు రచనల్లో భారతనారి సంపూర్ణ రూపంతో సాక్షాత్కరిస్తుంది. భర్తయందు అత్యంత అనురాగం గల స్త్రీలను చిత్రించి, భార్య లేని జీవితాన్ని భర్త ఎలా నిరర్ధమనుకుంటాడో వర్ణిస్తాడు. కాళిదాసు కేవలం స్త్రీల బాహ్యసౌందర్యమే కాక అంతస్సౌందర్యం కూడా విశేషంగా చిత్రించాడు.

మనం మళ్ళీ మేఘసందేశం కధలోకి వద్దాం. గతమాసం జరిగిన కధలో యక్షుడు మేఘాలను చూచి విలవిలలాడిపోయాడు. పర్వతాన్ని కౌగలించుకున్నట్లున్న మేఘాన్ని చూడగానే తన ప్రేయసి వక్షోరుహాలింగనం గుర్తుకు వచ్చింది. విరహబాధతో విలవిలలాడి పోయాడు. వెంటనే మేఘుని ద్వారా సందేశాన్ని తన భార్యకు పంపదలుచుకున్నాడు. కానీ ఎలా ముందుకెళ్ళాలి? మేఘుడిని ఎలా ప్రసన్నుడిని చేసుకోవాలి?

శ్లో.4. ప్రత్యాసన్నే నభసి దయితాజీవితాలంబనార్థీ
జీమూతేన స్వకుశలమయీం హారయిష్యన్ప్రవృత్తిమ్
స ప్రత్యగ్రైః కుటజకుసుమైః కల్పితార్ఘాయ తస్మై
ప్రీతః ప్రీతిప్రముఖవచనం స్వాగతం వ్యాజహార.

భావం : ఆ యక్షుడు, వర్షాకాలంలో రెండవ మాసమైన శ్రావణమాసం సమీపిస్తున్నందున భార్య జీవితాలంబనాన్ని ఆశించి, తన క్షేమవృత్తాంతాన్ని, ఆమెకు పంపగోరినవాడై, ముందుగా మేఘుడిని మర్యాద చేయదలచి, స్వభావ సిద్ధంగా ఆషాఢమాసంలో మాత్రమే పుష్పించే కొండమల్లెల పుష్పాలతో ప్రీతి కలిగేటట్లుగా మేఘుని పూజించి స్వాగత వచనాలు పలికి ఆ మేఘుని కుశలాన్ని..కుశలగమనాన్ని అడిగాడు అని భావం.

విశేషాలు : విరహార్తులకు వర్షఋతువు మిక్కిలి ఉద్దీపకమైనది. ఆ ఋతువులో విరహబాధ మరీ ఎక్కువ అవుతుంది. విశేషం ఏమిటంటే మేఘానికి ఉన్న పర్యాయ పదాల్లోంచి జీమూతమనే పదాన్ని తీసుకొని ఇక్కడ చాలా అర్థవంతంగా వాడాడు. ఆ పదానికి అర్థం “జీవనానికి” మూట. జీవనం అంటే బ్రతుకు, మరియూ నీరు అని కూడా అర్థాలున్నాయి. నాయకుని కుశలాన్ని నాయికకు తెలిపి ఆమెకు “జీవనాన్ని” లేక బ్రతుకునివ్వబోతున్నాడు అని ముందే మనకు స్ఫురించే విధంగా ఉపయోగించాడు. ఎవరికైన పని అప్పజెప్పే సమయంలో కేవలం దాన్నే ప్రస్తావించక, తగిన మంచిమాటలాడి ఎదుటివారిని కుశలాదులడిగి, బాగా ప్రసన్నం చేసుకొన్న తరువాత, ఈ పని చేసి పెట్టవలసినది అని పురమాయిస్తే, జరగకపోవడం ఉండదన్న చక్కని లోకవ్యవహారాన్ని కాళిదాసు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. “కుటజ కుసుమాల” ను అంటే మల్లెలను కొండమీద కూడా పూయించే కాళిదాసు సున్నితహృదయాన్ని ఏమని పొగడవచ్చు? “ప్రీతి” అనే పదం వాడడం ద్వారా తీపి గుర్తుకొస్తుంది. ప్రీతిగా మట్లాడే మాటలు నోరు తీపి అయితే కలిగే ఆనందాన్ని మనకు కలిగిస్తాడు కాళిదాసు. “కుశలం” అన్న పదం ఎంతో అర్ధవంతంగా వాడిన మాటగా మనం గుర్తించవచ్చు.

ముఖ్యమైన అర్ధములు: నభసి = శ్రావణ మాసం; దయితా = ప్రియురాలి యొక్క; జీమూతుడు = మేఘుడు; ప్రత్యగ్రై: = అప్పుడే వికసించిన; కూటజకుసుమై: = కొండమల్లె పూలు; ప్రీతి ప్రముఖ వచనం = ప్రేమతో, ఆప్యాయతతో కూడిన మాటలు; వ్యాజహార = పలికెను.

శ్లో.5. ధూమజ్యోతి స్సలిలమరుతాం సన్నిపాత: స్వమేఘ:
సందేశార్ధా: క్వపటుకరణై: ప్రాణిభి: ప్రాపణీయా:
ఇత్యౌత్సుక్యాదపరిగణ యంగుహ్యకస్తం యయాచే
కామార్తా హి ప్రకృతి కృపణా శ్చేతనా చేతనేషు.

భావం చెప్పబోయేముందు ఒక్క మాట తెలుసుకోవాలి. ఏమంటే…విరహబాధలో ఉన్నవారికి సాధ్యాసాధ్యాల బేరీజు వెసుకోవడం, ఇంగితజ్ఞానం వంటివి ఉండనే ఉండవని చెబుతాడు ఈ శ్లోకం ద్వారా కాళిదాసు. ఈ శ్లోకం నుండి నాయకుడైన యక్షుని మనఃస్థితిని అర్థం చేసుకుని తద్వారా సందేహాలు లేకుండా మేఘసందేశం చదివేయొచ్చన్న అనుభూతిని మనకు అందిస్తాడు కాళిదాసు.

భావం : ప్రాణం ఉన్నదైతే ఏదైన పని చేయగలుగుతుంది.పొగ, అగ్ని, జలం, వాయువు ఇవన్నీ కలసి మేఘం అయింది. కానీ దానికి ప్రాణం లేదు. అది అచేతనమైనది. అటువంటి మేఘం ద్వారా తన భార్యకు వర్తమానం పంపాలని భావించాడు యక్షుడు. చేతన సాధయమైన పనిని ఇలా అచేతనమైన మేఘం ద్వారా చేయించాలనుకోవడం అవివేకం కదా!

విశేషాలు : శ్లోకంలో చివరిపాదంతో చెప్పిన విషయాన్ని పూర్వం పైన చెప్పిన విషయాన్ని సమర్ధించడం వల్ల అర్ధాంతన్యాసాలంకారం అవుతుంది అంతే కాక విరుద్ధకార్య సంఘటనలవల్ల విషమాలంకారం కూడా ఇందులో వుంది.

ముఖ్యమైన అర్ధములు: ధూమం = పొగ; జ్యోతి = అగ్ని; సలిల = నీరు; మరుతాం = గాలి; సన్నిపాత: = సమ్మేళనం; పటుకరణై: = బలమైన ఇంద్రియములు గల; కామార్తా: = కామంచే పీడింపబడే వారు; ప్రకృతి కృపణా: హి = సహజంగా మందబుద్ధులు కదా!

శ్లో.6. జాతం వంశే భువనవిదితే పుష్కలావర్తకానాం
జానామి త్వాం ప్రకృతిపురుషం కామరూపం మఘోనః
తేనార్థిత్వం త్వయి విధివశాద్దూరబంధుర్గతో౭హం
యాంచా మోఘా వరమధిగుణే నాధమే లబ్ధకామా

భావం : నిన్ను, భువనాల్లో ప్రసిద్ధమైన పుష్కలావర్తకాలనే మేఘాలయొక్క వంశంలో పుట్టినవానిగాను, ఇచ్చ వచ్చిన రూపం ధరింప గల శక్తి కలిగిన వాని గాను, ఇంద్రునకు ప్రధాన వ్యక్తిగాను, నేనెరుగుదును. విధివశంవల్ల దూరప్రదేశంలో బంధువులు గల కారణంచేత నిన్ను యాచిస్తున్నాను. గుణాలు అధికంగా గలవానిని యాచించిన యాచన, వ్యర్థమైనా, ఇంచుక ప్రియమైనది. అధములను ఆశ్రయించి, పొందిన కోరిక, ఫలించినదైనా ప్రియమైనది కాదు. ఉత్తమమైంది కాదు.

విశేషాలు : మేఘుడి వంశాన్ని, సామర్థ్యాన్ని, పలుకుబడిని పొగుడుతున్నాడు. నిజమే కదా! పొగడ్తలకు లొంగని వాడెవరు? ప్రసన్నుడు కానివాడెవ్వడు? ఆకాలంలోనే కాదు. ఈకాలంలో కూడా మనం గమనిస్తే
పని చేసిపెట్టేవారిని పొగిడితే పడిపోయి మన కార్యం అయిపోతుందనే విషయం తెలిసినదే కదా! లోకరీతిని ఇలా వర్ణించి కాళిదాసు కార్యార్ధులు ఎలా ప్రవర్తించాలో మనకు చెబుతున్నాడు. ఇంకా.. కామరూపం వల్ల మేఘుడు మానవరూపం ఇంకా ఏరూపమైనా ధరించగలడని తెలుస్తోంది. అందువల్ల యక్షునిగానో మానవునిగానో, గంధర్వునిగానో రూపు ధరించి నా కార్యం చేయమని అడుగుతున్నట్టు చెప్పుకోవచ్చు. “నాకు సహాయం చేస్తే, నీ వంశం భువన ప్రసిద్ధమవుతుంది” అని కూడా యక్షుడు, మేఘునితో చెప్పినట్లుగా భావించవచ్చు.
ఇందులో అర్ధాంతన్యాసాలంకారమే గాక ప్రేయోలంకారం కూడా ఉన్నది.

ముఖ్యమైన అర్ధములు: మఘోన: = యింద్రునికి సంబంధించిన; కామరూపం = కోరినరూపం ధరించగల; జానామి = యెరుగుదును; తేన = అందువల్ల; లబ్ధకామా = కోరిక తీరినప్పటికీ; యాచ్జా = కోరుట; నవరం = మంచిది కాదు.

శ్లో.7. సంతప్తానాం త్వమసి శరణం తత్పయోద ప్రియాయా
స్సందేశం మే హర ధనపతి క్రోధవిశ్లేషితస్య
గంతవ్యా తే వసతి రలకా నామ యక్షేశ్వరాణాం
బాహ్యోద్యానస్థితహరశిరశ్చంద్రికాధౌతహర్మ్యా

భావం : ఓ మేఘుడా! విరహంచేత తపించేవారికి శరణం అవుతున్నావు. ఆ కారణంవల్ల, కుబేరుని కోపంచేత ఎడమైన నా సందేశాన్ని, ప్రియురాలికి అందించు. పట్టణానికి వెలుపల ఉన్న తోటలో ఉన్న శివుని శిరస్సునందలి వెన్నెలచేత, శుభ్రములైన మేడలుగల, యక్షేశ్వరులకు స్థానమైన, “అలకా” అని పేరు గల పట్టణం నీవు తప్పక పోదగినది.

విశేషాలు : ఇక్కడ కుబేరుని కోపమే యక్షుని తపింపచేసిన ఎండగాను, విరహబాధను కలుగచేసినట్లుగా మనం భావించవచ్చు. “శరణం” అనే మాట తిరుగులేని అస్త్రం. ఎవరైనా వశం అవుతారు. కుబేరుడిని శ్లోకాల్లో సంబోధిన విధం చూడండి ఒకసారి. మొదటి శ్లోకంలో “భర్త” అని సంబోధించాడు. అనగా యజమాని. యజమానికి కోపంవస్తే, శిక్ష విధిస్తాడు. 3 వ శ్లోకంలో కుబేరుని “రాజ రాజు” అని అంటాడు. రాజుకు కోపంవస్తే, దేశబహిష్కారశిక్ష కూడా విధించే అధికారం గలవాడు అని అర్ధంలో. ఇప్పుడు యక్షుడు “దూరసంస్థే” అంటే.. నా ప్రియురాలు దూరప్రదేశంలో ఉంది అని మేఘునితో అంటున్నాడు. ఈ శ్లోకంలో నీవు “అలకాపురి” వెళ్ళాలి సుమా అని చెప్తున్నాడు. మఱి ఆ అలకాపురి కుబేరునిది. అందుకనే ఆయనను ” ధనపతి ” అని సంబోధించాడు. దేవతలలో ధనానికి అధిష్ఠానదేవత కుబేరుడు అని తెలిసిన విషయమే. ఆ పట్టణం గొప్పదనం చెప్పడం కోసమే “ధనపతి” అనే పదం కాళిదాసు వాడడం గమనార్హం. కుబేరుడు శివభక్తుడు. ఆ విషయం ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అలకాపురి ఉద్యానవనంలో శివుడున్నాడని, ఆయన ధరించిన చంద్రుని వెన్నెలతో అక్కడి మేడలనీ కడుగబడ్డాయి అని వర్ణించడం ద్వారా, కాళిదాసు తన అసలైన కవిత్వంలోకి, వర్ణనలలోకి తాను ప్రవేశిస్తున్నాడు ఇక్కడనుండే!

ముఖ్యమైన అర్ధములు: హేపయోధ : ఓ మేఘుడా!; సంతప్తానాం = తాపం పొందినవారికి; విశ్లేషితస్య = ఎడబాటుపొందిన; హర = అందించు; శిరశ్చంద్రికా = తలమీద చంద్రుని వెన్నెల చేత; ధౌత = తెల్లగా చేయబడడం; గంతవ్యా = వెళ్ళదగినది.

శ్లో.8. త్వామారూఢం పవనపదవీముద్గృహీతాలకాంతాః
ప్రేక్షిష్యంతే పథికవనితాః ప్రత్యయాదాశ్వసన్త్యః
కః సన్నద్ధే విరహవిధురాం త్వయ్యుపేక్షేత జాయాం
న స్యాదన్యో౭ప్యహమివ జనో యః పరాధీనవృత్తిః

భావం : మేఘుడా! నీవు నాపని మీద ఆకాశంలో పయనిస్తూ ఉండగా తమ పురుషులు దూరదేశాలకు పోయినందువల్ల ఇంటనే ఉండి విరహబాధను అనుభవిస్తున్నటువంటివారు నిన్ను చూడగానే తమ ప్రియులు వస్తారు అనే నమ్మకం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. వారు వారి ముంగురుల కొనలు ఎత్తి పట్టుకొని,నిన్ను చూడగలరు. నీవు వ్యాపిస్తూండగా, విరహంతో బాధపడుతున్న ప్రియురాలిని ఎవడు విడువగలడు? ఎవడు కూడా నాలా అస్వాతంత్రులు గా ఉండడు అని వాపోతున్నాడు యక్షుడు.

విశేషాలు: ఇక్కడ మేఘునికి ఏదొ లాభం వస్తుందని యక్షుడు సూచించడం ఏమిటంటే విరహంలో ఉన్న స్త్రీలకు తన దర్శనంతోనే విరహతాపం కొంత తగ్గుతుంది. మఱి ఆ పుణ్యం మీకే కదా దక్కేది. మేఘునికి ఒక “బిస్కెట్” వేస్తున్నాడు యక్షుడు అదే నీకు “పుణ్యం” దక్కుతుంది అనడం. మనం కూడా ఏదైన పని ఎవరికైన చెప్పేటప్పుడు “నీకు పుణ్యం ఉంటుంది బాబూ..కొంచెం ఈ పని చేసిపెట్టు అంటుంటాము సహజంగా. ఆడవారు నిన్ను ముంగురులు (నుదిటిమీద పడే వెంట్రుకలు) వాటిని వెనక్కి తోసుకొంటూ చూస్తారంటే.. మేఘుడా…నీవు ఎన్ని అందాలను చూస్తావు అని చెప్పడం. బాటసారుల స్త్రీలు అని అర్థం వచ్చేలా ” పథిక వనితలు” అని అద్భుతంగా వాడాడు కాళిదాసు. పరాధీనవృత్తి ఎంత అసహ్యమో ఎంత సహించలేనిదో.. స్వాధీనవృత్తి ఎంత హాయో చెబుతున్నాడు యక్షుడు. తన పొందు కోసం వువ్విళ్ళూరుతున్న భార్యను వివేకవంతులు ఉపేక్షింపడు కదా! అలా చేస్తే అది అది అధర్మం అవుతుంది సుమా అని చెబుతున్నాడు.

ముఖ్యమైన అర్ధములు: ఆరూఢం = యెక్కి ఉన్న; పధికవనితా: = ప్రవాసంలో ఉన్న వనితలు; ఉద్గృహీతా: = పైకి లాగబడిన; అలకాంతా: = కురుల కొనలు; అశ్వసంత్య = ఊరడిల్లినవారై; ప్రేక్షిస్యంతే = చూడగలరు; జాయాం = భార్యను; ఉపక్ష్యేత = నిర్లక్ష్యం చేయగలడు ?

టేకుమళ్ళ వెంకటప్పయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

మేఘ సందేశం, వ్యాసాలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)