భోజరాజీయం –గోవ్యాఘ్ర సంవాదం – సామాజిక నీతి(సాహిత్య వ్యాసం )- లక్ష్మణ్ ఆదిమూలం

ISSN 2278-478

క్రీ .శ 11 వ శతాబ్దం ఆది కవి నన్నయ్య రచించిన ఆంద్ర మహా భారత రచనతో తెలుగు సాహిత్యంలో కావ్య రచన ఆరంభమయ్యింది . అంతకు పూర్వం నుంచి తెలుగు భాష , సాహిత్యం కన్పిస్తూనే ఉంది . సంస్కృత సాహిత్య ప్రభావంతో ప్రాచీన కాలంలో అనువాద కావ్యాలు రావడం జరిగింది . విమర్శకుల అభిప్రాయం ప్రకారం సాహిత్యాన్ని ప్రాచీన , ఆధునిక సాహిత్యంగా రెండు రకాలుగా విభజించారు . క్రీ.శ 11 వ శతాబ్దం నుంచి నేటి వరకు ఆధునిక సాహిత్యంగా పరిగణిస్తున్నారు .

ప్రాచీన సాహిత్యంలో కావ్యాలు , పురాణాలు , ఇతిహాసాలు , నాటకాలు , ప్రబంధాలు , యక్షగానాలు వంటి ఎన్నో ప్రక్రియలలో కవులు , కవియిత్రులు రచనలు చేసారు . ఈ ప్రక్రియలలో కథా కావ్యాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది . ప్రాచీన సాహిత్యంలో పురాణ కథలు , సంప్రదాయాలు , వర్ణనలు , కల్పనలు తో కాలక్షేపంగా రచనలు వచినా వాటితో పాటు వ్యక్తిని నిర్దేశించడానికి , సమాజంలో తన చుట్టూ ఉన్న వారితో కలిసి మెలిసి జీవనం సాగించడానికి అనువైన విషయాలను కావ్యాలలో అంతర్లీనంగా బోధించిన రచనలు ఉన్నాయి .

ఈ తరహా రచనలను ప్రస్తావించినప్పుడు శతకాలు , కథా కావ్యాలు , చాటువులు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దే విధంగా రచనలలోని వస్తువు కన్పిస్తుంది . ముఖ్యంగా కథా కావ్యాలలో నీతి , సమాజంలోని వైఖరి , పరిస్థితులు , మనిషి మనుగడ వంటి విషయాలపై ఎన్నో కథలతో కూడిన కావ్యాలే కథా కావ్యాలు .

సంస్కృత సాహిత్య ప్రభావంతో కథా కావ్యాలు తెలుగులోకి వచ్చాయి . క్రీ.శ 13 వ శతాబ్దంలో తిక్కన్న యుగం నుంచి తెలుగు కథా కావ్యాల రచనలు ఆరంభమయ్యాయి . అంతకు ముందు రచనలలో కథలు ఉన్నా వాటి దృష్టి కోణం వేరు . అవి ప్రధాన కథ కి అను సంధానం గా సాగిన కథలే . ప్రధాన కథకి బలం కూర్చుతూ కథని ముందుకు నడుపుతూ సాగిన కథలు .

తిక్కన్న యుగంలో తిక్కన శిష్యుడు మూల ఘటిక కేతన్న రచించిన దశాకోమార చరిత్ర . తెలుగులో కథా కావ్యాలలో మొదటిది . ఇది సంస్కృతంలో దండి రచించిన దశకుమార చరిత్ర కావ్యానికి తెలుగు అనువాదం . కేతనకి “ అభినవ దండి “ అనే బిరుదు ఉంది . కేతన తన దశకుమార చరిత్రను తన గురువు తిక్కన్నకి అంకితం ఇచ్చాడు . మంచన “కేయూర బాహు చరిత్ర “, జక్కన “విక్రమార్క చరిత్ర “, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక “, అనంతామాత్యుని “ భోజరాజీయం , పాలవేకరి కదరీపతి “ శుకసప్తశతి” వంటి ఎన్నో కథా కావ్యాలు వెలువడ్డాయి .
క్రీ .శ 16 వ శతాబ్దం తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగం . ఈ కాలంలో వచ్చిన కథా కావ్యాలలో ప్రముఖమైనడి భోజరాజీయము . రచించిన కవి అనంతామాత్యుడు . సర్పతి అనే సిద్దుడు భోజరాజునికి చెప్పిన కథల సమాహారమే భోజరాజీయం కాతా కావ్యం . భోజరాజీయం 7 ఆశ్వాసాల కథా కావ్యం .జన వ్యావహారంలో మిక్కిలి ప్రచారంలో ఉన్న గోవ్యాఘ్ర సంవాదం కథ ఈ కావ్యంలోనిదే . ఈ కథలో కథను జంతువులతో నడిపించిన సగటు మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకోవడానికి కావాల్సిన విషయాలను తెలియజేసాడు కవి అనంతుడు .

ఆవులన్నీ కలిసి పచ్చిక మేయడానికి అడవిలోకి వెళ్తాయి . అక్కడికి పులి రావడం గమనించిన ఆవులు అక్కడ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాయి . వాటిలో ఒక ఆవు పులికి చిక్కుతుంది . ఆకలితో ఉన్న పిలు ఆవును చంపి తినాలని ముందుకు వస్తుంది . అప్పుడు ఆవు అయ్యా ! నా తొలి సంతానం కలిగి ఏడెనిమిది రోజులు మాత్రమే , డానికి గడ్డి మేయడం కూడా రాదు . కడుపు నిండా పాలిచ్చి వెంటనే వస్తాను . దయతో నన్ను పోయిరాని అని ఆవు పులి అడుగుతుంది . పులి ఒప్పించి తన కుమారుని దగ్గరకు వెళ్లి కడుపార పాలిచ్చి , తిరిగి పులి దగ్గరకు ఆహారం కావడానికి వస్తుంది ఆవు .

ఆవును చూసిన పులి ఆశ్చర్యపోతుంది . నీది మంచి మనసు , అన్న మాట నిలబెట్టుకున్నందుకు , నిన్ను మేచుకున్తున్నాను . నిన్ను చంపలేను . ఇప్పుడు నీ ధర్మమే నిన్ను కాపాడింది . నీ యిటికి నువ్వు వెళ్లు అని ఆవును వదిలివేస్తుంది పులి .

ఆవు పులిని ఒప్పించి కొడుకు దగ్గరకు వెళ్లే ప్రయత్నంలో వ్యక్తి నడవడిక ఏ విధంగా ఉండాలో వివరిస్తుంది .

“ ప్రల్లద మాడి పెద్దలకు బాధ యొనార్చు నతుండు, తండ్రికిం
దల్లికి మారు పల్కెడు నతండును , నాకొని వచ్చి యొడ్లచే
నుల్ల మెలర్ప మేయ జనుచున్న వృషంబు నదల్చునాతడుం
ద్రెళ్లెడు నట్టి దుర్గతుల ద్రెళ్లుదు నేనిటు రాక తక్కినన్ “ .

కఠినమైన మాటలు మాట్లాడి పెద్దలకు బాధ కలిగించే వాడు . తండ్రికి , తల్లికి ఎదురు మాట్లాడే వాడు , ఆకలితో గట్ల వెంబడి గడ్డిని మేస్తున్న పశువును వెళ్ళ కొట్టేవాడు , ఏ నరకాలలో పడతారో ! తిరిగి నీ దగ్గరికి రాకుంటే నేను ఆ నరకాల్లోనే పడతాను .

పులి అంగీకారం తీసుకుని వెళ్లి తన కొడుకు వద్దకు వెళ్లిన ఆవు కొడుకుని పాలిస్తూ ఎన్నో విషయాలను బోధిస్తుంది . అసత్యపు మాటలు మాట్లాడకు , అక్కరకు రాణి వారితో కలిసి ఉండకు . ఇతరులెవరైనా నీకు కీడు కలిగించే మాటలు మాట్లాడితే భయపడకు . వినీ విననట్లుగా ఉంది ఎదురు జవాబు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపో……….

” ఆడకు మసత్య భాషలు
కూడకు గొరగాని వాణి గొంకక యేరు లే
గ్గాడిన నెదురు త్తరమీ
జూడకు విని వినని వాణి చొప్పున జనుమీ “

పాలిచ్చి పులి దగ్గరకు ఆహారం కావడానికి తిరిగి వచ్చిన ఆవును చూసి ఆశ్చర్యపోతుంది పులి .

“ఇట్టి మహానుభావులకు హింస యొనర్చి దురంత దోషముల్
గట్టి కొనంగ జాల , మరి కల్గవె మాంసము లొండు చోట , నీ
పుట్టువు నందు నన్ను మును పుట్టగ జేసిన యట్టి దైవ మీ
పట్టున బూరి మే పెడినె ! ప్రాణము లింతనె పోవుచున్నవే !

ఆవు గొప్పతనాన్ని గ్రహించి ఇటువంటి మహాత్ములను హింసించి , అంతం లేని పాపం మూట గట్టుకోలేను . కావాలంటే నాకు మాసం ఎక్కడైనా దొరుకుతుంది . ఇంత మాత్రానికే ప్రాణాలు పోతాయా అంటూ వ్యక్తిత్వాన్ని బోధిస్తుంది .

ఈ విధంగా భోజరాజీయంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలను తెలియజేసాడు కవి అనంతామాత్యుడు .

(ప్రాచీన సాహిత్యంలో – వ్యక్తిత్వ వికాసం 2015 , ఫిభ్రవరి 26 ,27 శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సదస్సు )

— లక్ష్మణ్ ఆదిమూలం ఏం,ఏ . ఏం .ఫిల్ 

పి హెచ్ .డి పరిశోధక విద్యార్ధి 

పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం ,

బొమ్మూరు .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Comments are closed.