తెలుగులో లేఖా సాహిత్యం-బొడ్డు మహేందర్ 

ISSN 2278-478

“తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది.”

సాంకేతికత, సమాచార వేగం విస్తారమై, విస్తృతమైన ఈ ఆధునిక కాలంలో ఉత్తరం గురించిన ఈ పొడుపు కథని విప్పేదెంత మంది? ఆంగ్ల భాషా మైకం ఒక పడగలా కమ్ముకున్న నేటి పరిస్థితులలో అసలు లేఖ,జాబు, ఉత్తరం అంటే అర్ధమయ్యేది ఎందరికి? ఒకప్పుడు ఇంట్లో మనిషిలా, చదువుతున్నప్పుడల్లా  మనసుకి అక్షర బంధనాలు వేసే ఆ ప్రేమైక గంధాలు ఇప్పుడు ఏమైనట్లు? తెలుగులో ఒక సాహిత్య ప్రక్రియగా కూడ విలసిల్లిన  “లేఖలు” గమ్యం చేరకుండానే గాడి తప్పిపోయాయి ఎందుకని? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికే ప్రయత్నమే ఈ వ్యాసం.

                         లేఖ – “లిఖ్” అనే ధాతువు నుండి పుట్టిన ఈ పదానికి అర్ధం లిఖించడం(రాయడం). లిఖించినది అంతా సాహిత్యం కాకపోయినా, వ్యక్తిగత బంధాలని పలకరిస్తూనే, వ్యవస్థా పరమైన మార్పులను , ఆకాంక్షలను ప్రతిఫలిస్తూ రాసే భావోద్వేగ భావాల రచనే “లేఖ”గా సాహితీలోకంలో గుర్తించబడుతోంది. ఇది పరస్పర సమాచార భావ వినిమయానికి ఒక వారధిలాగా తోడ్పడుతుంది. నిజానికి ఏ నిఘంటువులు కూడ లేఖని నిర్వచిస్తూ ఒక పరిపూర్ణమైన భావన ఇవ్వలేకపోయాయి. అయితే  వాస్తవిక వ్యక్తుల మధ్యగానీ, ఊహాజనిత వ్యక్తుల ద్వారా గానీ  సాగే ఈ ఆత్మాశ్రయ గద్య రచన- మనసుతో మనసు పలికే ఓ ఆర్ద్ర సంభాషణ. కవిత్వం లానే లేఖా రచన కూడ ఒక కళ. విషయానుగుణంగా, భాషా పరమైన చమత్కరాలని జోడిస్తూ, చదవగానే గుండెకు హత్తుకునేలా రాయడం అందరికీ చేతకాదు. అందుకే మనం లేఖల విషయం ప్రస్తావించేటప్పుడు కూడ మార్క్స్ ఏంగెల్స్, అబ్రహం లింకన్, జవహర్ లాల్ నెహ్రూ,గాంధీ, స్వామి వివేకానంద,చలం, వరలక్ష్మమ్మ, గుంటూరు శేషేంద్ర శర్మ అంటూ ఏదో కొందరి నాయకుల పేర్లో, రచయితల పేర్లో చెబుతుంటాం. అయితే అవే ప్రామాణికం కాకపోయినా ప్రసిద్ధి చెందినవిగా వాటిని మనం గమనించవచ్చు.

                చారిత్రకంగా చూస్తే  క్రీ.శ. 2వ శతాబ్ధానికి చెందిన ఆచార్య నాగార్జునుడు తన మిత్రుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి ప్రాకృత భాషలో రాసిన “సుహృల్లేఖ”యే ప్రపంచంలో వెలువడిన మొదటి లేఖ గా తెలుస్తోంది. రచనల పరంగా చూస్తే భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి సారిగా ఈ లేఖా ప్రస్తావన మహాకవి కాళిదాసు సంస్కృతంలో  రచించిన “అభిజ్ఞాన శాకుంతలం”లో కనిపిస్తుంది. తెలుగు విషయానికొస్తే  అష్టదిగ్గజ కవులలో ఒకడైన  పింగళి సూరన రచించిన “ప్రభావతీ ప్రద్యుమ్నం” అనే కావ్యంలో కన్పిస్తుంది. అలాగే చాణక్యుడి “అర్ధశాస్త్రం”లో, మడికి సింగన “సకల నీతి సమ్మతం” లో కూడ లేఖ యొక్క లక్షణాలు, ఉద్దేశ్యాలు వర్ణించబడ్డాయి. అయినా ప్రాచీన కాలంలో లేఖ అంటే కేవలం రాజులు, ఇతర పెద్దలు తమ సందేశాలని, రాయబారాలని పంపే ఉపకరణం మాత్రమే. ఆధునిక యుగంలో ఆ పరిమితినే ఎప్పుడో దాటేసింది లేఖ. తెలుగులో ఈ  సాహిత్య ప్రక్రియ వ్యాప్తికి విశేషంగా కృషి చేసింది ఆంగ్లేయుడైన సి.పి. బ్రౌన్.  ప్రముఖులు రాసిన లేఖల్ని సేకరించడంతో పాటు, స్వయంగా ఆయన కూడ లేఖలు రాసేవారు. అలా ఆయన చూపిన బాటలో కందుకూరి వీరేశలింగం మొదలు గురజాడ, ఆరుద్ర, కొడవటిగంటి, కె.వి. రమణారెడ్డి, బంగోరె, బోయి భీమన్న  తదితరులెందరో లేఖా సాహిత్యానికి వన్నెలద్దారు. వీరిలో కొందరివి గ్రంథాలుగా కూడ ముద్రితమై ప్రసిద్ధి చెందాయి.అటువంటి కొన్ని వ్యాసాలని, వ్యాసకర్తల గురించి ఇప్పుడు చూద్దాం.

                    18వ శతాబ్దంలో తెలుగు భాషా సాహిత్యాల పరిరక్షణకి ఒక వ్యక్తిలాగా కాక ఒక సంస్థలా ముందుండి నడిచి, భావితరాలకి బంగారు బాట వేసిన సి.పి బ్రౌన్- ఆ కాలం నాటి ముఖ్య తెలుగు పండితులకి రాసిన లేఖలు పరిశీలిస్తే, ఆయన వ్యక్తిత్వంతో పాటు నాటి సామాజిక స్థితిగతులు తేటతెల్లం అవుతాయి. కావ్యాల సేకరణ, ముద్రణ కోసం ఆయన పడిన పాట్లు, తెలుగు భాష పట్ల ఆయనుకున్న అవ్యాజ్యమైన ప్రేమ గోచరిస్తాయి. ఆయన రాసిన లేఖలన్నీ  “బంగోరె” పరిశోధనతో వెలుగులోకి వచ్చాయి. వాటిని “బ్రౌన్ లేఖలు-ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర శకలాలు” గా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ప్రచురించడం జరిగింది.

                     యిక ఆధునిక యుగ పురుషుడిగా, సంఘ సంస్కర్తగా విశేష ప్రాచుర్యం పొందిన కందుకూరి వీరేశలింగం తన లేఖలతో కూడ గద్య తిక్కన అని నిరూపించుకున్నారు. ప్రత్యేకంగా లేఖా సాహిత్యం అని రాయకున్నా, తన సమకాలికులతో ఆయనకున్న సంబంధ బాంధవ్యాలు, దైవభక్తి, సంఘసంస్కరణాభిలాష, రచనాభిలాషలని ఆ లేఖలు తేటపరుస్తాయి. “కందుకూరి డైరీలు –లేఖలు” పేరుతో ప్రచురితమైన ఆయన లేఖలు వారి జీవితాదర్శాలకి, వైఖరులకి దర్పణాలు. అభ్యుదయవాదిగా, నవయుగ వైతాళికుడిగా పేరొందిన కవి, రచయిత గురజాడ అప్పారావు లేఖల ద్వార కూడ నాటి సామాజిక స్థితిగతులతో పాటుగా భాషా, సాహిత్యాలకి సంబంధించిన రసవత్తరమైన చర్చ కనిపిస్తుంది. “:నా ఉద్యమం ప్రజల ఉద్యమం. సంస్కృతి పరుల భావ సంపద నాకు అండగా ఉంది.” అంటూ తన ఆధునిక వ్యవహారిక భాషోద్యమానికి సంబంధించిన తన ఆలోచనలు, అనుభవాలని మిత్రులతో పంచుకున్నాడు. అలాగే మరో లేఖలో “వేశ్యాకులంలో పుట్టి,ఆ వృత్తి ధర్మాన్ని సాగిస్తున్న వేశ్యలను చూసి దుఃఖిస్తాను కానీ,వ్యక్తిగతంగా వారిని నిందించను”అని వేశ్యా సమస్యపై స్పందించాడు. ఇలా అసంఖ్యాకమైన తన లేఖల ద్వారా ఆయనలోని నిబద్ధతని చాటే నిఖార్సయిన నాయకుడు మనకు కానవస్తాడు. సాహిత్యపరంగా గురజాడ లేఖలకి విశేష ప్రాధాన్యమున్నందునే అవన్నీ కలిపి అవసరాల సూర్యారావు “లేఖలు”పేరిట 1958లో ఒక సంకలనాన్ని  ముద్రించారు.

                 సి.ఆర్.రెడ్డి గా ఎంతో ప్రసిద్ధుడైన ప్రముఖ సాహితీవేత్త,విమర్శకుడు, రాజనీతిజ్ఞుడు అయిన కట్టమంచి రామలింగా రెడ్డి లేఖలు వ్రాయడంలో మంచి నేర్పరి. ఎక్కువగా ఆంగ్లంలోనే కొనసాగిన వీరి లేఖా రచన, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మతో మాత్రం తెలుగు సారస్వత విషయాలపై కొనసాగింది.  ఇవి వారిద్దరి మధ్యన ఉన్న అనుబంధానికి తార్కాణాలుగా నిలుస్తాయి. స్థూలంగా ఈ లేఖలు ఆయన అభిరుచులకు, ఆలోచనా వైఖరులకు నిదర్శనాలు. “వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడో తెల్పుడి” గేయరచనతో  కవిరాజుగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ హేతువాది, సంఘ సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి-తాను రాసిన  లేఖల్లో కూడా అదే -మన సనాతన కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల పట్ల ఆయన దృక్పథం,  బ్రాహ్మణాచారాలపై ఆయన నిరసన భావం కనిపిస్తాయి. బారిష్టర్ చదువు కోసం విదేశాలకి వెళ్ళిన సందర్భంలో అక్కడి నుండి “కృష్ణా పత్రిక” సంపాదకుడు ముట్నూరి కృష్ణారావుకి రాసిన అనేక లేఖల్లో ఆయన తన ప్రయాణానుభవాలు, విదేశీ, స్వదేశీ సంస్కృతుల మధ్య తేడాలు, నాటకాల రచన పట్ల ఆయన ఉద్దేశ్యాలు కనబడుతాయి. ఇతర లేఖలలో ఆయన వ్యక్తిగత అలవాట్లతో పాటు, దేశాభిమానం, స్వాతంత్ర్య కాంక్ష ప్రస్ఫుటమవుతాయి.

                          స్త్రీ స్వేచ్ఛ, ప్రేమ, శృంగారాల  పట్ల తన అభిప్రాయాలని రచనలుగా మలిచి, తెలుగు సాహిత్యంలో వివాదాస్పద రచయితగా పేరుగాంచిన  గుడిపాటి వెంకటాచలం, అదే దృక్పథాన్ని తన వ్యక్తిగత లేఖల్లోనూ కొనసాగించారు. లేఖ ప్రాధాన్యత తెలిసిన వాడు కాబట్టి తన “ప్రేమలేఖలు” రచనని గురించి చెబుతూ “సర్వకాల సర్వావస్థల్లో నిన్నే అన్వేషిస్తున్నాని జ్ఞాపకం చెయ్యడమే లేఖ” అంటాడు. చలం లేఖలు ఆయన విజ్ఞాన సర్వస్వానికి ప్రతీకలుగా గ్రహించవచ్చు. చలం జీవిత పరిణామక్రమం- కాలనుగుణంగా ఆయనలో వచ్చిన మార్పులు, వైఖరులు అన్నీ తన లేఖల్లో స్పష్టంగా కనిపిస్తాయి. శృంగార మోహితుడిగా అనిపించుకున్న వాడే ఆధ్యాత్మిక సాధకుడిగా మారి చేసిన జ్ఞానబోధలు కూడ మనం ఆయన లేఖల్లో చూడవచ్చు.  మనిషి మనస్తత్వాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచిన ఆయన రచనలు మనో వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనలకు కూడ ఉపయుక్తమవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

                         యిక తెలుగులో ఉత్తరాల రచనలో ప్రసిద్ధి చెందిన వాడు – డా.సంజీవ్ దేవ్. ఈయన ప్రతీ ఉత్తరం ఓ చిత్రకావ్యం. వాక్య నిర్మాణ శైలి అబ్బురపరుస్తుంది. “నిమ్మంటే నాకిష్టం, దానిమ్మంటే నాకిష్టం / బొమ్మంటే నాకిష్టం, లేని అమ్మంటే నాకిష్టం.” అంటూ తన కవి హృదయాన్ని వ్యక్తపరిచాడు ఓ లేఖలో. ఆయన లేఖల్లో ఎక్కువగా వేదాంత, తాత్విక విషయాలే దొర్లాడినా కొన్ని లేఖల్లో సంగీత, సాహిత్యాల పట్ల తన వైఖరి , ఇతర కవులపై తన అభిప్రాయాలు కూడ లిఖితమయ్యాయి. “గద్యం అనేది ఆలోచన, పద్యం అనేది వేదన,సంగీతం అనేది సంవేదన.” అంటూ వాటి ప్రాధాన్యతని వివరిస్తూ “గద్యం అనేది భూమి, పద్యం అనేది ఆకాశం,సంగీతం అనేది ఇంద్ర ధనుస్సు” అని పోలుస్తాడు ఒక లేఖలో. పేరుకి ఇవే లేఖలే అయినా వ్యాసంలాగా సుదీర్ఘంగా ఉంటాయి చాలా వరకు. అయితే  ఆయన ప్రతీ లేఖ ఆకట్టుకునే పదబంధాలతో, సందేశాత్మక లక్ష్యంతో జనరంజకంగా కొనసాగుతాయి.

                       లేఖా సాహిత్యంలో తెలుగు రచయిత్రులకి మార్గదర్శకంగా నిలిచినటువంటి కనపర్తి వరలక్ష్మమ్మ తన “శారదా లేఖలు”తో ఎన్నటికీ చెరగని కీర్తిని సంపాదించుకున్నారు. ఇంతవరకు పైన చెప్పుకున్న లేఖలన్నీ వాస్తవిక వ్యక్తుల మధ్య నడిచిన యదార్ధ సమాచారానికి దీపికలయితే, వరలక్ష్మమ్మ రాసినవి కల్పిత పాత్రలతో కూడిన మహిళా చైతన్య దివిటీలు. ఇవి సరళ గ్రాంథికంలో “గృహలక్ష్మి” అనే మాస పత్రికలో ప్రచురితమైన ధారావాహికలు. లేఖల ద్వారా సామాజిక ప్రయోజనం ఆశించి కూర్చిన వీటిలో బాల్యవివాహాలు, కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారాలపై స్త్రీల కోణం నుండి నిరసన కనిపిస్తుంది. అయితే ఈ లేఖలు వాటికే పరిమితం కాకుండా మూఢ నమ్మకాలపై విశ్లేషణ, యాత్రా స్థలాల వర్ణన,ప్రముఖుల జీవిత చిత్రణ, ఆంధ్ర భాషాభిమానంతో పాటు, నాటి సమకాలీన సామాజిక సమస్యలపై  కూడ సందర్భోచిత వ్యాఖ్యానాలతో కూడి ఉంటాయి.

                         ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇంకా ఎందఱో రచయితలు లేఖల ద్వారా తమ భావ హృదయాన్ని ఆవిష్కరించారు. “అమృతం కురిసిన రాత్రి” కవితా సంపుటితో జన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిన దేవరకొండ బాలా గంగాధర్ తిలక్ తన  లేఖల్లో అనేక సాహితీ అంశాలు స్పృశించాడు. “సున్నితమైన ఊహ, ఉద్రేకం ఉంటేనే” గొప్ప రచనలు వస్తాయని ఓ లేఖలో పేర్కొన్నాడు. లేఖ ప్రాధాన్యతని, లేఖల్ని బట్వాడా చేసే పోస్ట్ మ్యాన్ నేపథ్యంలో  రాసిన “తపాలా బంట్రోతు” కవిత, మరియు “సైనికుని ఉత్తరం”కవిత  ఎందరో హృదయాలని తట్టిలేపాయి.అలాగే త్రిపురనేని గోపీచంద్ రాసిన “పోస్టు చేయని ఉత్తరాలు” , “ఉభయకుశలోపరి” , తిరుపతి వేంకటేశ్వర కవి రచించిన “గీరతము” , బోయి భీమన్న “జానపదుని జాబులు” , తదితర  కవుల లేఖా సంకలనాలు లేఖకున్న ప్రాశస్త్యాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ఇలా చెప్తూ పోతే కేవలం తెలుగు వారి లేఖలే కాకుండా ప్రముఖులైన వారి అనువాద లేఖలు కూడ తెలుగు లేఖా సాహిత్యాన్ని  ప్రభావితం చేసి, సుసంపన్నం చేసాయనే చెప్పాలి. జవహర్ లాల్ నెహ్రూ లేఖల్ని కాటూరి వెంకటేశ్వర రావు, బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటర్జీ లేఖల్ని పురాణ రాఘవ శాస్త్రి అనువదించారు. ఎల్లలు లేని భావ మధురిమ ఏ భాషలో అయినా ఆకట్టుకుంటుంది కాబట్టే లేఖల అనువాదాలు కొనసాగుతున్నాయి. లేఖలకున్న ఈ భావ విస్తృతిని గమనించే సి.హెచ్. సీతాలక్ష్మి మరియు మలయశ్రీ లు లేఖా సాహిత్యంపై పరిశోధనలు చేసారు. ఇదే బాటలో మరికొంతమంది కూడా పరిశోధకులు ఉద్యుక్తులవుతున్నారు.

                                ఒకప్పుడు వ్యక్తిగతానికే పరిమితమైన లేఖలు కాలక్రమంలో శాస్త్ర సాంకేతిక, సాంఘిక,రాజకీయ, భాషా సాహిత్య, సాంస్కృతిక పరమైన అంశాలని చర్చించే వేదికలుగా మారాయి. ముఖ్యంగా రాజకీయంగా బహిరంగ లేఖల ఘట్టాలు తరచూ చూస్తున్నాం కదా.  సినిమా పాటల్లో సన్నివేశాల్లో కూడ లేఖల ప్రస్తావన వస్తున్నా ప్రేక్షకులని ఆకట్టుకునే ఒక వాణిజ్య అంశంగానే అక్కడ గుర్తించబడుతోంది. వాస్తవాలని పరిశీలిస్తే ప్రస్తుతం విద్యార్థులకు పాఠ్య ప్రణాళికల్లో; పాఠకుల ప్రతిస్పందనల కోసమని పత్రికల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్న ఈ లేఖా ప్రక్రియ సామాన్య జన వ్యవహారికంలో బాగా తగ్గిపోయింది. ఫోన్లు, కంప్యూటర్ల వినియోగంతో, కెరీర్ అంటూ కాలంతో పరుగెడుతున్న సగటు జీవికి కాసేపు తీరికగా తనలోని భావాలని కలంతో ఆవిష్కరించే తీరిక దొరకట్లేదు. దొరికినా సాంకేతిక మాయాజాలం కలాన్ని కాకుండా కంప్యూటర్ కీ బోర్డుని పట్టేలా ప్రోత్సహిస్తోంది. దాంతో లేఖా సాహిత్యం ఈమెయిల్ సాహిత్యంగా, ఆన్ లైన్ సాహిత్యంగా  పరిణామం చెందింది. అయితే ఆ సాహిత్యానికి పరిధి ఎక్కువే కానీ  పాఠకుల సంఖ్య స్వల్పం. కారణం ఆన్లైన్లో సాహిత్యాన్ని ఎక్కువ సమయం కేటాయించి చదవడం అనేది అననకూలమైన అభ్యాసంగా ఉంటుంది. అయితే ఇప్పటికీ తెలుగు వెలుగు వంటి కొన్ని మ్యాగజైన్లలో, అన్ని వార్తాపత్రికలలోనూ పాఠకుల స్పందన కోసం లేఖల కోసం కొంత స్థలం కేటాయించబడుతోంది. అయితే వాటిలో ఎక్కువ శాతం సామాజిక సమస్యలపై స్పందనల్లాగే ఉన్నా, భాషా సాంస్కృతిక పరమైన కొన్ని పర్వదినాల్లో మాత్రం సాహితీ పరిమళం గుబాళిస్తోంది. మిగతా సాహితీ ప్రక్రియల్లా లేఖా సాహిత్యం విస్తరించకపోయినా, ప్రస్తుత కాలమాన పరిస్థితులని బట్టి విస్తరించే అవకాశం కనబడకపోయినా- ఉన్న వాటినైనా  పరిరక్షిస్తే మేలు.

                                                                                                                                 – బొడ్డు మహేందర్ 

———————————————————————————————————————

వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు ​, Uncategorized, , Permalink

One Response to తెలుగులో లేఖా సాహిత్యం-బొడ్డు మహేందర్ 

  1. santhaiah says:

    చాలా బాగుంది. నా బాల్యాన్ని గుర్తు చేసారు. చిన్నప్పుడు ఉత్తరం వస్తే ఇంట్లో అందరు చుట్టూ కూర్చొని వినే వారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)