మేఘసందేశం – వ్యాఖ్యానం : టేకుమళ్ళ వెంకటప్పయ్య

టేకుమళ్ళ వెంకటప్పయ్య గారి ”మహాకవి కాళిదాసు – మేఘసందేశం” వ్యాఖ్యానం ధారావాహికగా విహంగ పాఠకుల కోసం ….

                         కాళిదాసు రచించిన “మేఘసందేశం” కావ్యంలోకి వెళ్ళబోయేముందు కవికులగురువు కాళిదాసును గురించి తెలుసుకోవడం అవసరం. కాళిదాసు పేరు వినని భారతీయుడుండడు. కాళిదాసు కేవలం భారతీయ కవి మాత్రమే కాదు. విశ్వకవి. ప్రపంచకవుల్లోనే అగ్రగణ్యుడైన కవి. భారతీయాత్మను కాళిదాసు చిత్రించినంత హృద్యంగా మరే కవీ ఆవిష్కరించలేదంటే అతిశయోక్తి గానేరదు. ఎందుకంటే, భారతదేశపు భౌతికస్వరూపాలను అంటే నదీనదాలను, పర్వతాలను, పట్టణాలను, ఆశ్రమాలను, వృక్షలతాదులను, కాళిదాసు వర్ణించినంత సమగ్రంగా, సమర్ధవంతంగా మరే కవీ వర్ణించి సాక్షాత్కరింపజేయలేకపోయాడు. అందుకే విమర్శకులు అంటారు “కాళిదాసు కవిత్వం సార్వభౌమికమే కాదు సార్వజనీకం కూడా” అని.
                             

                 మన తెలుగు ప్రబంధకవులు కావ్యావతారికలలో చెప్పుకున్నట్లు కాళిదాసు ఎక్కడా తన గురించి చెప్పుకోలేదు. అసలు పూర్వకవులలో ఈ ఆచారం ఉన్నట్టు కనపడదు. అందువల్ల ఇతర ఆధారాలతోనే వారి జన్మ విశేషాలను ఊహించడం జరిగింది. అయితే ఈ ఊహల్లో బేధాభిప్రాయాలు  చాలా ఉన్నాయి. కాళిదాసు జీవితకాలం విషయంలో క్రీ.పూ. 8 వ శతాబ్ది నుండి క్రీ.శ.10వ శతాబ్దం వరకూ ఉన్నట్లుగా రకరకాలుగా ఈ ఊహాగానాలు అల్లుకున్నాయి. అయితే ఎక్కువమంది చరిత్రకారులు చెప్పిన దాన్ని బట్టి జీవితకాలం క్రీ.పూ.150 సం.నుండి క్రీ.శ 634 సం మధ్యలో ఎక్కడో ఉంది. క్రీ.శ 6వ శతాబ్దంవాడని ఓ వాదం, గుప్తుల కాలం వాడని ఒక వాదం, విక్రమ శకారంభం వాడని అంటే 6 వ శతాబ్దికి చెందిన వాడని మూడు వాదాలు బలంగా ప్రజల్లో బలపడ్డాయి. ఇంకా సూక్ష్మపరిశీలన చేస్తే కాళిదాసు ఉజ్జయినీ ప్రాంతం వాడని మనం చెప్పుకోవచ్చు.

                                        ఉజ్జయినీ పాలకుడైన విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉన్నాడని “ధన్వంతరి, క్షపణకామరసింహా శంఖ బేటాళభట్ట ఘటకర్పర కాళిదాసా:” అనే శ్లోకం ద్వారా తెలుస్తోంది. అంతే కాక ప్రస్తుతం మనం చదవబోయే “మేఘసందేశం” కావ్యంలో యక్షుడు మేఘునికి అలకానగర మార్గాన్ని చెప్పే సమయంలో చెప్పిన “వక్ర: పన్ ధాయదపి భవత:” అనే శ్లోకార్ధం తీసుకుంటే “నీ ప్రయాణం కొంచెం వక్ర మార్గమయినా పర్వాలేదు, ఉజ్జయినీ నగర దర్శన భాగ్యం పోగొట్టుకోకు” అని చెప్తాడు. అంతే కాక ఈ నగరశోభను 16 శ్లోకాల్లో సుదీర్ఘంగా వర్ణించడం వల్ల అతనికి ఉజ్జయినీపై గల అభిమానం వ్యక్తమౌతుంది. అంతే కాక విక్రమాదిత్యుని అభినందన కృతి “రామచరితం” లో “ఖ్యాతి కామపి కాళిదాస కృతయోనీతా: శకారాతినా” అన్న శ్లోకంలో కాళిదాసు ప్రశంస ఉంది. “విక్రమోర్వశీయం” నాటకం ఊర్వశీపురూరవులకు సంబంధించినది కదా! అందువల్ల “పురూరవోర్వశీయం” అనడం సబబు. కానీ కాళిదాసు అలా అనకుండా తన చక్రవర్తి విక్రమసింహుని పేరులో ఉన్న “విక్రమ” శబ్దం వాడడం కూడా అదే సూచిస్తున్నదని చరిత్ర,సాహిత్యకారులు బలంగా విశ్వసిస్తున్నారు.
                         

          కాళిదాసు విక్రమోర్వశీయంఅనే మహాకావ్యాలు, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం, అభిజ్ఞానశాకుంతలం అనే నాటకాలు, ఋతుసంహారం అనే లఘుకావ్యం రాశాడు. శృతబోధమనే ఛందోగ్రంధము, జ్యోతిర్విద్యాభరణం, ఉత్తరకాలమృతం అనే జ్యోతిశ్శాస్త్ర గ్రంధాలను కూడా రచించాడని చెప్తారు. ఇతని రచనా శైలిని గూర్చి కూడా కొంత పరిచయం అవసరం. ఈతని రచన మృదుమధురమైన పదాలతో లలితంగా, చక్కని అలంకారాలతో ఉండి అక్కడక్కడా దీర్ఘ సమాసాలు వాడినప్పటికీ, సులభ గ్రాహ్యంగా ఉంటుంది. ఈతని కవిత్వ రీతి “వైదర్భీరీతి” అంటారు.
 

“బంధ పారుష్య రహితా శబ్ద కాఠిన్య వర్జితా
నాతి దీర్ఘ సమాసాచ వైదర్భీ రీతిరిష్యతే”
పదాలు పరుషంగా ఉండవు. కఠినమైన శబ్దాలు ఉండవు. దీర్ఘ సమాస ప్రయోగం ఉండదు. దీనినే వైదర్భీరీతి అని లాక్షణికులు అంటారు. కాళిదాసు ప్రకృతిపరిశీలనాశక్తి మనలను ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా అలంకారాలు వాడడంలో కాళిదాసు దిట్ట. అందుకే ఆయనను “ఉపమా కాళిదాసస్య” అంటారు.

“వాగర్ధావివ సంపౄక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ”:
రఘువంశం ప్రార్ధనా శ్లోకంలో వాక్కు-అర్థము అన్నవి విడిగాఉన్నా విడదీయలేనివి, అటువంటి ఆదిదంపతులగు పార్వతీపరమేశ్వరులకు నా వందనం అన్నాడు. ఆ శ్లోకం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్ని కోట్లమంది జపించి వుంటారో తెలియదు.

వ్యాఖ్యాన సార్వభౌముడైన కోలాచలం మల్లినాధసూరి అతని కవిత్వానికి ముగ్ధుడై “కాళిదాస గిరాంసారం కాళిదాస్సరస్వతీ| చతుర్ముఖోధవా విద్యాద్విదుర్నాన్యేతు మాదృశా: ||” అన్నాడు. అంటే “కాళిదాసు కవిత్వాన్ని ఆతని వాక్కుల యొక్క సారాంశాన్ని కేవలం కాళిదాసు, బ్రహ్మ, సరస్వతీదేవి మాత్రమే అర్ధం చేసుకోగలరు. నా వంటి వారికి సాధ్యంకాదు” అని అర్ధం.

         మేఘసందేశ కావ్య కథ  క్లుప్తంగా చెప్పి శ్లోకార్ధభావాలను చూద్దాం. పూర్వసర్గ, ఉత్తరసర్గ అని రెండు సర్గలుగా సాగిన ఈ కావ్యంలో, కుబేరుడు యక్షగణానికి రాజు. ఆయన వద్ద ఉన్న ఓ యక్షుడు ఉద్యోగధర్మ నిర్వహణలో చిన్న తప్పిదం చేశాడు. కుబేరుడు కోపించి ఒక సంవత్సర కాలం ఇల్లు విడిచి వెళ్ళాలని శాపం ఇచ్చాడు. ఆ యక్షుడు రామగిరి అనే ప్రాంతంలో నివాసం ఉన్నాడు. ఎనిమిది నెలలు అతిభారంగా గడిచిపోయాయి. ఆషాఢమాసం వచ్చింది. ఒకనాడు యక్షుడు తన భార్యను తలుచుకొని దు:ఖిస్తూ మేఘాలను చూసి, ఆ మేఘుడిని తగినవిధంగా సంభావించి తన భార్యకు తన సందేశాన్ని వినిపింపవలసినదిగా కోరాడు.

                                  యక్షుడు తన భార్య నివసించే అలకానగరానికి చేరవలసిన మార్గాన్ని వర్ణిస్తూ మధ్యలో తన నగరమైన ఉజ్జయినీ వైభవాన్ని అతి సుందరoగా వర్ణిస్తాడు. నదీనదాలను, పర్వతాలను, పట్టణాలను, ఆశ్రమాలను, వృక్షలతాదులను అతి హృద్యంగా వర్ణిస్తాడు. కైలాసానికి చేరువలో వున్న అలకాపట్టణం యక్షుడు చేరడంతో మొదటి సర్గ ముగుస్తుంది. ఉత్తరసర్గ (రెండవ) సర్గలో అలకానగరాన్ని అక్కడి భవంతులను, అక్కడి యక్ష పురుషస్త్రీ భోగవిశేషాలను తెలుపుతూ తన యింటికి దారి చెప్పి భార్య క్షేమ సమాచారం అడగమని ఆవిధంగానైనా తనకు ఊరట కలిగించమనీ మేఘుని వేడుకుంటాడు. మేఘుడు ఆవిధంగా దేవభాషలో యక్షుని సందేశాన్ని వినిపించగా ఆ సందేశాన్ని విన్న కుబేరుడు దయతో శాపకాలాన్ని తగ్గించి వారికి సమాగమాన్ని కలిగించడంతో కథ  సుఖాంతం అవుతుంది.
                     

                కాళిదాసుకు పూర్వం కూడా ఇటువంటి సందేశ రాయబార విశేషాలు వేదాలలో, కావ్యాలలో, పురాణాలలోనూ ఉన్నవి. ఋగ్వేదంలో సరమదౌత్యఘట్టం సుప్రసిద్ధం. మహాభారతంలో నలదమయంతుల హంసదౌత్యం, రామాయణంలో హనుమంతుని దౌత్యం జగద్విఖ్యాతం. ఇవి బహుశ: కాళిదాసుకు ప్రేరణ కలిగించి ఉండవచ్చు. కాళిదాసుకు బద్ధవైరి అని భావించబడుతున్న ఘటకర్పరుడు అనే సంస్కృత కవి ఒకానొక స్త్రీ విరహబాధను భరించలేక మేఘంద్వారా భార్యకు సందేశం పంపడం గురించి ఒక సందేశ కావ్యాన్ని రచించాడని సాహిత్యకారులు చెప్పడం గమనించ దగ్గ విశేషం. ఆ కవితో గల స్పర్ధతోనో లేక ఇతర కావ్యాలలో ఉన్న సందేశసంఘటనల ప్రభావమో ఇధమిత్తమని చెప్పలేము గానీ కాళిదాస విరచిత “మేఘసందేశం” వచ్చింది. తద్వారా మిగతా సందేశ కావ్యాలన్నీ సూర్యుని ముందు దివిటీలై నిలిచాయి. మేఘసందేశాన్ని ఆదర్శంగా తీసుకుని కొన్ని వందల కావ్యాలు సంస్కృతం, తెలుగు, ఇతర భాషల్లో వెలువడ్డాయి. విచిత్రం ఏమిటంటే మేఘసందేశం లోని ప్రతి శ్లోకo  నాల్గవ పాదాన్ని తీసుకుని విక్రమకవి “నేమిదూతం” రచించాడు. తెలుగులో ఇటీవల వచ్చిన గుర్రం జాషువా “గబ్బిలం” కూడా దళితుని సందేశ కావ్యమే! ఆకోవలో వచ్చిన డా.ఎండ్లూరి సుధాకర్ రాసిన “కొత్తగబ్బిలం” జాషువా రచనకు అక్షరాలా అనుసరణీయమే!
                               

                               మేఘసందేశం కావ్యంలో ఉన్న శ్లోకాలపై భిన్నాభిప్రాయాలను పరిశీలిస్తే ప్రస్తుతం మనకు లభిస్తున్న ప్రతుల్లో 124 శ్లోకాలు ఉన్నాయి. అయితే పూర్ణసరస్వతి 110 శ్లోకాలకు మాత్రమే వ్యాఖ్యానం రాయగా, వల్లభదేవుడు 111 శ్లోకాలకు, భరతసేనుడు 114 కు, మల్లినాధసూరి 121 శ్లోకాలకు వ్యాఖ్యానాలు వెలయించారు. పోనుపోనూ శ్లోకాల సంఖ్య పెరగడం గమనార్హం. ప్రక్షిప్తాలా లేక పై కవులు వ్యాఖ్యానాలు వెలయించినప్పుడు ఆ శ్లోకాలు అలభ్యాలా అనే విషయంపై సరయిన వివరణ చరిత్రకారులకు అందలేదు.
                       

                        124 శ్లోకాల మేఘసందేశం కావ్యం మొత్తం “మందాక్రాంతం” అనే వృత్తంతోనే సాగింది. గుర్వక్షరాలతో మందం మందంగా నడిచే ఛందస్సు కరుణరసానికి సరిపోతుందనే భావన కాళిదాసుకు ఉండడం అతని ఛందో పరిజ్ఞానాన్ని తెలుపుతుందని పెద్దలు అంటారు. వృత్తం పెద్దది అందువల్ల విషయం ఎక్కువగా విస్తరించి చెప్పడానికి వీలయ్యే  విధంగా ఉన్నది. కాళిదాసు మందాక్రాంతం ప్రయోగించిన తర్వాతికాలంలో ఈ వృతానికి మంచి ప్రచారం వచ్చింది. కావ్యారంభంలో “మగణం” శుభదాయకం. ఈ ఛందస్సులో మ,భ,న,త,త అనే గణాల తర్వాత రెండు గురువులు వస్తాయి. ప్రతిపాదంలో 4,6,7 అక్షరాల తర్వాత పదాంత విశ్రాంతి. మందాక్రాంతవృత్తము ఒక పాటవంటిది. అందుకే దీనికి సంస్కృతంలో మూడు యతుల విశ్రాంతి ఇచ్చారు. ఇది కేవలం సంస్కృత మర్యాద. తెలుగులో లాగా ప్రాసనియతిగానీ అక్షరయతి నియమం గానీ సంస్కృతంలో లేదు. కన్నడంలో, తమిళంలో, మలయాళంలో కూడా యతి పట్టింపులేదు. యతిలేకుండా శ్రవణసుభగం ప్రదర్శించడం కష్టసాధ్యమైనప్పటికీ సంస్కృతంలో పదాంత విశ్రాంతి 4,6,7 స్థానాలలో ఇవ్వడం ద్వారా ఆ సౌలభ్యం సాధించబడింది. తెలుగు మందాక్రాంతం అవే గణాలతో సంస్కృతం నుండి దిగుమతి అయినప్పటికీ తెలుగు మర్యాదగా 1-11 అక్షరయతి, ప్రాస నియమం ఉన్నాయి. అయితే సంస్కృతంలో లాగా ఎక్కడికక్కడ పాదం తెగిపోయే విధంగా కాకుండా తెలుగు కవులు దీనిని మిగిలిన వృత్తాలవలె ఒక పాదంనుండి మరొక పాదానికి చొచ్చుకుబోయేటట్లు రాశారు. అందువల్ల ఇది సంగీతం కోల్పోయిన ఒక కష్టతర వచనంలా పరిణమించిందనే భావన కవిపండిత లోకంలో ఉంది. గతంలో మేఘదూతమును బాలాంత్రపు రజనీకాంతరావుగారి సంగీత నిర్దేశకత్వంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గాత్రముతో విని శ్రోతలు పులకించిపోయారట.
                               

                               ఒకానొక సమయంలో కాళిదాసు కూడా భార్యావియోగంతో బాధపడ్డాడనీ, ఆ విరహవేదనే యక్షుని రూపంలో బహిర్గతమయినదనే చరిత్రకారుల అభిప్రాయంతో పెద్దగా విబేధించేందుకు ఏమీ లేదు కానీ, ఏదో ఒకవిధమైన అంత:ప్రేరణ లేకపోతే ఇటువంటి సహజచిత్రణతో కూడిన అభివ్యక్తి సాధ్యం కాదని పాఠకులకూ అనిపిస్తుంది. కవిహృదయానుభూతులను రేపింది స్వానుభవం అనుకోవడంలో దోషం ఏమీ కనపడదు. ఈ కావ్యంలో ప్రతి శ్లోకంలో వున్న వర్ణిత దృశ్యాలను ఒక చిత్రపటంగా గీయవచ్చు. పాఠకుడు మన:పటలం మీద దృశ్యాన్ని తిలకించి తన్మయుడవుతూ మరో శ్లోకానికి సాగిపోతాడు. అందుకే “మేఘే మేఘే గతం వయ:” అన్న ఉక్తిలో అతిశయోక్తి లేదు.

       మనమూ ఆ శ్లోకాలు చదివితే మన హృదయాలు కూడా రసప్లావితం అవుతాయి. మనం పూర్వమేఘం (మొదటిసర్గ) లోనికి ప్రవేశిద్దాం…. నడవండి….. కావ్యసౌరభాలను ఆస్వాదించవలసినదిగా “విహంగ” పాఠకలోకాన్ని వినమ్రంగా ఆహ్వానిస్తున్నాను.

        (పూర్వమేఘం) ప్రధమ సర్గ

               మేఘదూతమునందలి ప్రథమ శ్లోకంలో కథా సందర్భమును వివరించాడు. కుబేరుడు ఉత్తరదిక్పాలకుడు. యక్షగణాలకు రాజు. అతని రాజధాని అలకాపురి. కుబేరుని కొలువులో ఉన్న హేమమాలి అనే యక్షుడు ఉద్యోగనిర్వహణలో చేసిన తప్పిదం వల్ల శపించబడి దండకావనములో రామగిరిలోని ఒక ఆశ్రమములో తన కాలమును వెళ్లబుచ్చుతున్నాడు.

శ్లో.1. కశ్చిత్కాంతా విరహగురుణా స్వాధికారాత్ప్రమత్త:
శాపేనాస్తంగమితమహిమా వర్షభోగ్యేన భర్తు:
యక్షశ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు
స్నిగ్ధఛ్చాయాతరుషు వసతిం రామగిర్యాశ్రమేషు.

భావం: ఒకానొక యక్షుడు తన ఉద్యోగ బాధ్యతలో ఏదో తప్పుచేసి తన ప్రభువైన కుబేరుని ఆగ్రహానికి గురయ్యాడు. కుబేరుడా యక్షుని ఒక ఏడాదిపాటు తన యింటిని, భార్యను వదలి వెళ్ళాలని శపించాడు. ఇది దేశ బహిష్కార శిక్ష. యక్షుడు భూలోకంలో రామగిరి అనే పర్వత ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. త్రేతాయుగంలో వనవాసకాలంలో సీతారామలక్ష్మణులు అదే ప్రాంతంలో నివసించడం వల్ల సీతాదేవి అక్కడ స్నానం చేయడం వలన ఆ నీరు పవిత్రమైనదని, అక్కడ గొప్ప నీడనిచ్చే మహావృక్షాలు ఉన్నాయట.

ముఖ్యమైన అర్ధములు: కశ్చిత్ = ఒకానొక; స్వాధికారాత్ = ఉద్యోగ బాధ్యతలనుండి; గురుణా = బరువైన; వర్షభోగ్యేన = ఒక సంవత్సరకాలం పాటు అనుభవించవలసిన; భర్తు: = ఉద్యోగమిచ్చిన యజమాని యొక్క; స్నిగ్ధ = దట్టమైనటువంటి; తరుషు = వృక్షములు కలిగిన; చక్రే = చేసెను.

శ్లో.2. తస్నిన్నద్రౌ కతిచిదబలా విప్రయుక్తస్స కామీ
నీత్వా మాసా మాసాన్ కనక వలయ భ్రంశరిక్త ప్రకోష్ట:
ఆషాఢస్య ప్రధమదివసే మేఘమాశ్లిష్ట సానుం
వప్రక్రీడా పరిణత గజప్రేక్షణీయం దదర్శ.

యక్షులకు యెన్నో శక్తులు ఉంటాయి. కుబేరుని శాపంవల్ల ఆ శక్తులన్నీ కోల్పోయాడు యక్షుడు. దైన్య స్థితిలో రామగిరి ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడు.

భావం: కుబేరుని శాపంవలన భార్యకు దూరమై దురవస్థలపాలయిన యక్షుడు భార్య యందు అమిత ప్రేమతో ఉండేవాడు. వియోగ విచారం వలన శరీరం బక్కచిక్కిపోయినది. అందువలన ముంజేతి కడియం వదులయిపోయి జారిపోతూ ఉన్నది. అలా ఎనిమిది మాసాలు గడచిపోయాయి. ఆషాఢ మాసం మొదటిరోజున పర్వతానికి సమీపంలో వప్రక్రీడలో ఉన్న ఏనుగు వలె కనిపించే ఒక మేఘాన్ని యక్షుడు దర్శించాడు.

వప్రక్రీడ అనగా మదించిన ఏనుగులు తమ దంతాలతో దగ్గరలో ఉన్న రాళ్ళు రప్పలూ పైకి విరజిమ్ముతూ ఆడే ఆట.

ముఖ్యమైన అర్ధములు: కామీ = కాంతయెడల ప్రేమగలవాడు; భ్రంశ = స్థానభ్రంశం అంటే ముoజేతికి ఉన్న కడియం జారడం; ప్రకోష్ట = ముంజేయి; కత్చిత్ = కొన్ని; నీత్వా = గడపుట; ఆషాఢస్య = ఆషాఢ మాసంలో; ప్రధమ దివసే = మొదటి రోజున; అశ్లిష్టాసానుం = కొండచరియను అంటిపెట్టుకుని వున్న; పరిణత = నిమగ్నమై ఉన్న; దదర్శ = చూచెను.

శ్లో.3. తస్యస్థిత్వా కధమపి కౌతుకాధాన హేతో
రంతర్బాష్పశ్చిర మనుచరో రాజరాజస్య దధ్యౌ
మేఘాలోకే భవతి సుఖినోప్యన్యధా వృత్తిచేత:
కంఠాశ్లేష ప్రణయిని జనే కిం పునర్దూరసంస్థే.

భావం: యక్షుడు ఆ మేఘాలను చూడగానే విలవిలలాడిపోయాడు. పర్వతాన్ని కౌగలించుకున్నట్లున్న మేఘాన్ని చూడగానే తన ప్రేయసి వక్షోరుహాలింగనం గుర్తుకు వచ్చింది. మేఘము అసలే విరహోద్దీపికం. అలాంటి మేఘం ముందు కంటినీటిని అతికష్టం మీద ఆపుకుని చాలా సేపు విచారించాడు. సమాగంలో ఉన్న ప్రేయసీప్రియులే మేఘదర్శనం అయితే తట్టుకోలేరు. అలాంటిది ఒంటరిగా ఉన్న యక్షుడు ఎలా భరించగలడు ఈ తాపం?

ఒకవిషయాన్ని మరో విషయంతో సమర్ధించినట్లయితే అది అర్ధాంతాన్యాసాలంకారము. మొదటి సగం లో చెప్పిన విషయాన్ని రెండో సగంలో సమర్ధించడం జరిగింది. సమాగంలో ఉన్న ప్రేయసీప్రియులే మేఘదర్శనం అయితే తట్టుకోలేరు. మరి ప్రియా వియోగంలో నిండి ఉన్న యక్షుని కలత సహజం కదా!

ముఖ్యమైన అర్ధములు: కౌతుక+ఆదానహేతో = తాపాన్ని కలిగించడానికి కారణమయిన; పుర: = ఎదుటగా; కధమపి = మిక్కిలి కష్టంతో; స్థిత్వా = నిలబడి; అంతర్భాష్ప: = కన్నీళ్ళను లోలోపల దాచుకోవడం; చిరం = ఎక్కువసేపు; సుఖిన:అపి = భార్యతో గూడి సుఖించే వానికి కూడా; అన్యధావృత్తి = ఇంకోవిధంగా; కంఠాశ్లేషప్రణయని = మెడను కౌగలించుకోవాలనే ఆసక్తి; కింపున: = ఇంక చెప్పవలసినది ఏమున్నది.

(ఇంకా ఉంది )

– టేకుమళ్ళ వెంకటప్పయ్య

మేఘ సందేశం, , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)