మనసుకు మరోరూపం (కథ ) -డేగల అనితాసూరి

కొందర్ని చూడగానే మంచి అభిప్రాయం ఇట్టే వచ్చేస్తుంది. అలాగే ఎందుకో తెలియదు గానీ మరి కొందర్ని చూస్తూనే అనవసర చిరాకు మనలో తొంగిచూస్తుంది. అంటే, కళ్ళు రూపాన్ని చూసి మనసును అంచనా వేస్తుందా? అది నిజమేనా?అంటే-
నూటికి నూరుపాళ్ళు అవుననే నమ్ముతుంది సుమలత. ఆమె అంచనా ప్రకారం మనిషి నైజమేంటో ఇట్టే పసిగట్టేయడం లో ముఖం మనసుకు అద్దం లాంటిదని తన ప్రగాఢ విశ్వాసం.
“అయ్య బాబోయ్! అప్పుడే పదిగంటలు అవుతోందా?” కంగారుగా రిస్ట్ వాచ్ కేసి చూస్కుని ఆఫీసుకు టైమై పోతుండటం తో గబగబా తలుపుకు తాళం పెట్టి వడివడిగా వీధిలోకి అడుగులు వేయసాగింది సుమలత.
బస్టాప్ చేరుకోడానికి మరో పది నిమిషాలైనా అయ్యేలా వుంది. ఇవాళ్టికి ఆటో ఎక్కక తప్పేలా లేదు” అనుకుంటూ చుట్టూ చూసింది.
తనకెప్పుడు అవసరమై వెతికినా అదే ఆటో ఎప్పుడూ ఆటో స్టాండ్ ముందు సిద్ధం గా కనిపిస్తుంది. అయినా తనుమాత్రం పొరపాటున కూడా ఎక్కడానికి ఇష్టపడదు. అందుకే, అసలే టెన్షన్ గా వుందేమో ఆపైన అస్సలు నచ్చని ఆటో అతను ఆశగా అనను ఆటో కట్టమని అడుగుతుందేమో అని ఎదురుచూస్తుంటే చరచరా నాలుగైదు ఆటోలు దాటి ముందుకెళ్ళి పాతిక రూపాయలు కూడా కాని దూరానికి యాభై రూపాయలిస్తానంటూ మాట్లాడి కిమ్మనకుండా ఎక్కి కూర్చుంది సుమలత.
                                                 ************************
సుమలతగారూ..ఆలస్యమైనట్టుంది?” అంటూ పలకరించాడు కొలీగ్ ప్రసాద్.
“లేదు లేదు..ఆఖరి నిమిషం లో అందింది లెండి ” హ్యాండ్ బ్యాగ్ ని ముందున్న టేబుల్ మీద పెట్టి క్యారియర్ బ్యాగ్ లోంచి మంచినీళ్ళ బాటిల్ తీస్తూ అంది సుమలత.
ఐతే, ఇవ్వాళ కూడా ఆటోనా?” నేను కరెక్టే కదా? అన్నట్టు అంది ప్రక్క సెక్షన్ రమ.
“అవునండీ. మన అవసరాన్ని గమనించి ఆటో వాళ్ళు చెలరేగిపోతారు ” కంప్యూటర్ లోకి కళ్ళు సారిస్తూ వుడుక్కుంది సుమలత.
“ఎంత గుంజాడేమిటి వాడిమీద అంత గుర్రుగా వున్నారు?” అడిగాడు ప్రసాద్.
“ముప్పై అయినా ఎక్కువే. కానీ, యాభై తీస్కున్నాడు ” చెప్పింది.
“సర్లెండి. మరి పెట్రోల్ ధరలు కూడా కొండవీటి చాంతాడులా పెరుగుతూనే పోతుందాయె. వాళ్ళుమాత్రం ఏం చేస్తారు? ” ఆటో వాలా వైపు వకాల్తా పుచ్చుకున్నట్టు అని నవ్వింది ఎదురుసీటు జ్యోతి.
“అబ్బో…చాలా ఉదారత్వం మీది. తనది కాకుంటే కాశీ దాకా ఎలాగో వెళ్ళమన్నాడుట వెనుకటికెవరో ” వళ్ళు మండి అంది సుమలత.
ఇంతలో, “మేడం సార్ పిలుస్తున్నారు” అంటూ వచ్చాడు అటెండర్.
                                                         
                                                     **************************
“ఎవర్ని నమ్మాలో ఎవర్ని నమ్మ కూడదో తెలీకుండా పోతోందీమధ్య. నేరాలు, మోసాలు ఎక్కువైపోతోంది ” పేపర్ లోంచి తలెత్తి సుమలత అందించిన కాఫీ కప్పువందుకుంటూ అన్నాడు విజయ్.
“ప్రతిరోజూ పత్రికలు, టీవీ లు అదే విషయాన్ని కోడై కూస్తున్నా ఈ జనానికి అర్ధం కాదేంటో ” తనూ ప్రక్కన చైర్ లో కూర్చుంటూ అని మెయిన్ పేపర్ అందుకుంది సుమలత.
“అదేంటి సుమా అలా అంటావ్? ఎందరు చెప్పినా ఎవరికేం తెలుస్తుంది చెప్పు మోసగాళ్ళు నేరగాళ్ళని ముఖాలపై రాసి వుండదుగా? అమాయకం గా నటిస్తూనే అపరాధాలు చేస్తారు. అమాయక ప్రజలు పాపం బలైపోతారు ” అన్నాడు విజయ్ ఖాళీ కప్పు టీపాయ్ మీద పెడ్తూ.
“మొన్నా మధ్య టీవీ లో చూశాను. ఆ నేరగాళ్ళు ఎంత భయంకరం గా వున్నారో! ప్రయాణాల్లో ముఖ్యం గా కాబ్ లు, ఆటోలు లాంటివి ఎక్కే ముందు వాడి వాలకం గమనించి ఎక్కితే మూడొంతులు ఇలాంటి నేరాలు ఆగుతాయి. మా ఆడవాళ్ళూ అలాగే వున్నారు. ఎవరో ఒకరని ఎక్కేయడం. ఏదైనా జరిగాక లబోదిబో మనటం ” విసుగ్గా అంది సుమలత.
“మరి నమ్మిన వాళ్ళనే గా ఎవరైనా మోసంచేయగలిగేది. అందుకే అమాయకం గా ముఖాలు పెట్టుకొస్తారు. అంతెందుకు..బ్యాంక్ వాళ్ళమని పిన్ నెంబర్ అడిగినా నమ్ముతున్నారు. బంగారం రెట్టింపుచేస్తామన్నా నమ్ముతున్నారు.”అప్పుడే తలస్నానం ముగించి వచ్చిన రేవంత్ అన్నాడు టవల్ తో తల రుద్దుకుంటూ.
“కనిపించని వాళ్ళైతే ఏమో అనుకోవచ్చు దొంగముఖాలతో రౌడీల్లా కనిపించేవాళ్ళను కూడా నమ్మి నేరాలు ఘోరాలు చేశారని అంటారే అలాంటి వాళ్ళ గురించి అంటున్నాన్నేను. కూర్చోండి మీకూ కాఫీ తీసుకొస్తా” చెప్పేసి కిచెన్ లో కెళ్ళింది సుమలత.
“రా రా..మా పెళ్ళైన సంవత్సరానికి వచ్చావ్. ఇప్పటికి ఎన్నిసార్లు ఈ మధ్యలో ఆఫీస్ పనిగా హైదరాబాద్ వచ్చావో. ఇప్పటికైనా నేనిక్కడ వున్నట్టు గుర్తొచ్చి వచ్చినందుకు సంతోషం” స్నేహితునిపై వున్న ఇష్టాన్ని నిష్టూరంగా వెలిబుచ్చాడు విజయ్.
“అదేం కాదురా. కొత్తగా పెళ్ళైన మీ మధ్య పానకం లో పుడకలా నేనెందుకని ” అన్నాడు రేవంత్.
“గోడమీద పిడకేం కాదూ? ఇంకా కొత్తేంట్రా. ఇంతకీ నువ్వెప్పుడు పెళ్ళిపీటలు ఎక్కబోతున్నావ్? ” అడిగాడు విజయ్.
“మరికొంత కాలం నన్నిలా హాయిగా వుండనివ్వరా బాబూ ” అంటూ సుమలత ఇచ్చిన కాఫీ కప్పు తీసుకున్నాడు రేవంత్.
ముగ్గురూ కబుర్లతో టిఫిన్లు ముగించి ఆఫీసులకు బయలుదేరారు.
                                                 ********************************
“సుమా! నేనో ముఖ్యమైన ఆఫీస్ మీటింగ్ కి బెంగళూరు వెళ్ళి అటెండ్ కావాలి. రాత్రికి సూట్ కేస్ సర్దవోయ్ ” అన్నాడు విజయ్ సాయంత్రం ఇంటికి వచ్చీరాగానే.
“నేనూ ఓ గవర్నమెంట్ ఉద్యోగిని చేస్కుని వుంటే బాగుండేది. నా ఫ్రెండ్ రమ లా ఇద్దరూ పదింటికి ఇంట్లో బయలుదేరితే మళ్ళీ సాయంత్రం ఆరింటికి ఇద్దరూ ఇల్లు చేరొచ్చు. మీ ప్రైవేట్ జాబేమోగానీ నెలకో వారం రోజులు ఊళ్ళు పట్టుకు తిరుగుతారు. నేనేమో ఈ చుట్టుప్రక్కల ఇంకా సరిగా డెవలప్ కాకుండా విసిరి వేసినట్లున్న ఇళ్ళమధ్య బిక్కుబిక్కు మంటూ వుండాలి. నా వల్ల కాదు ” అంటూ వుడుక్కుంది సుమలత.
“నేనూ అదే అనుకుంటున్నా. నా ప్రక్క సీటు లావణ్యను చేస్కుంటే ఎంచక్కా ఇద్దరం ఆఫీసు తరఫునే ఊళ్ళు తిరుగుతూ ప్రతినెలా హనీమూన్ చేస్కునే వాడ్ని కదా అని. పోనీ ఈసారలా కుదుర్తుందేమో ట్రై చేద్దామా?” అన్నాడు ఆటపట్టిస్తూ.
“మీకంతా వేళాకోళమే. బయటకెళ్ళి చూస్తే తెలుస్తుంది. రోజూ ఎన్ని దొంగతనాలు, ఆగడాలు జరుగుతున్నాయో ” చపాతీలకు పిండి కలుపుతూ అంది.
“ఈసారి నీకేం భయం లేదు. ఒక్కరోజుకే వెళ్ళడం. రేపు మార్నింగ్ వెళ్ళడం, ఎల్లుండి సాయంత్రం వచ్చేయడం ” అన్నాడు విజయ్.
“అయితే, రమకు ఫోన్ చేసి రేపు లీవని చెప్పమంటా ఆఫీసులో. ఇద్దరం కలిసే బెంగుళూరు వెళ్దాం ” ఆశగా అంది సుమలత.
“రేపు సాయంత్రం రేవంత్ కూడా విజయవాడ కు బయలుదేరుతాడు. ఇద్దరం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? ” అన్నాడు విజయ్.
“అవును కదూ? పోనీ అతనికో తాళం చెవి ఇచ్చేసి వెళ్దాం. ఇంకో రెండుమూడు రోజులుండి, మా కజిన్ వాళ్ళింటికెళ్ళి హ్యాప్పీ గా బెంగళూర్ చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. వాళ్ళు కూడా రమ్మని పిలిచి పిలిచి మానుకున్నారు కోపం వచ్చి ” సంబరపడిపోతూ అంది సుమలత.
“బాబూ..! వాడ్ని చూశావా? ఆ మాట అన్నామంటే ఇప్పుడే తెగ ఫీలైపోయి మనల్ని ఇబ్బంది పెట్టేశానని తెగ బాధపడిపోయి ఈ రాత్రికే ఏ హోటల్ రూమో చూస్కుంటాడు ” అన్నాడు విజయ్.
రేవంత్ తెల్లగా పొడవుగా హిందీ సినిమా హీరోలా వుంటాడు. వయసులో విజయ్ కన్నా ఏడాది పెద్దయినా రెండేళ్ళు చిన్నాడిలా కనిపిస్తాడు. బేబీ ఫేస్ లా వుంటుందేమో మాన్లీనెస్ కంటే ఎక్కువ అమాయకత్వం కనిపిస్తుంటుంది. దానికితోడు మొహమాటం ఎక్కువే అన్న సంగతి మనసులోనే గుర్తొచ్చి “అవును పాపం ” అనుకుంది సుమలత కూడా.
*******************************
మర్నాడు కూరగాయల బండి దగ్గర ఎదురింటి శారద పలకరింపుగా నవ్వింది.
                                     
   “నిన్న మీరు ఆటోలో వెళ్తూ కనిపింవారు నేను ఆఫీస్ నుంచీ వస్తుంటే. అయినా అతనిబాటో ఎలా ఎక్కారండీ బాబూ ” అని శారదని అనవసరం గా భయపెట్టేసింది సుమలత
“ఎందుకండీ. వాడు మీకు తెలుసా? ఏంచేశాడు? ” గాభరాగా అడిగింది బిత్తరపోయిన శారద.
“భలే వాళ్ళండీ మీరు. ప్రత్యేకం గా తెలియటం దేనికి? తుమ్మ మొద్దులా వున్నాడు. గిరజాల జుట్టూ బుగ్గమీదో గాటు. ఎర్రటి కళ్ళు, మెడలో గళ్ళ కర్చీఫు నోట్లో పాను. అమ్మో చూపులైతే మరీ ఘోరం.
చూడగానే ఇట్టే తెలిసిపోతుంది వాడో రౌడీ ఫెలో అని ” ఇంతమాత్రం పసిగట్టలేకపోతే ఎలా? అన్నట్టు ముఖం పెట్టింది.
“అవునండోయ్…అలాగే వున్నాడు. మరెప్పుడూ ఎక్కను బాబూ” అంది జ్ఞానోదయమైనట్టు శారద.
“అన్నీ అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు చెబితే గానీ తెలీని అమాయకుల్లా ఎలా వుంటారో ఎంత చదువులు చదివినా ఈ వెర్రి జనాలు ” అనుకుని నిట్టూర్చి తన తెలివికి తానే మురిసిపోతూ  ఇంట్లోకి వచ్చింది సుమలత.
                                                *************************************
“ఓకే సుమా. బై జాగ్రత్త మరి. ఎల్లుండి ఉదయానికల్లా నీ ముందుంటాగా? అంటూ ఆఫీస్ కార్లో ఎయిర్ పోర్ట్ కి బయలుదేరి వెళ్ళిపోయాడు విజయ్.
సాయంత్రం త్వరగా ఇంటికొచ్చేసింది సుమలత రేవంత్ ఆరింటికే ఊరెళ్తాడని. అతన్ని సాగనంపాలి కాబట్టి. 
ఆరున్నర అవుతున్నా రేవంత్ జాడలేదు. అతను వెళ్ళిపోతే దగ్గర్లోని షాపింగ్ మాల్ కెళ్ళి చిన్న షాపింగ్ చేయాలని కూడా ఎదురు చూస్తోంది సుమలత ఆత్రుతగా.
చివరికి ఏడవుతుండగా సరాసరి ఆటో తీసుకుని వచ్చేశాడు రేవంత్. “సుమగారూ లగేజ్ ఇవ్వండి టైం లేదు. ఇటే వెళ్ళి పోతా” అంటూ ఆత్రుతగా అడిగాడు.
“అయ్యో ఇంతాలస్యం చేశారే. నేనుకూడా షాపింగ్ కి వెళ్ళబోయి మీకోసం ఎసురుచూస్తున్నా” అంది సుమలత హడావిడిగా చీకటైపోతుందని తనూ లగేజ్ రేవంత్ కి అందించేసి తలుపుకు తాళం వేస్తూ.
” అయితే రండి. మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తా ” అని మరోమాటకు అవకాశం ఇవ్వకుండా సుమలతను చనువుగా చేయిపట్టుకుని ఆటోలోకి ఎక్కించేశాడు రేవంత్.
“ఏదోలే ఈ కాలం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లంతా ఇంతేనేమో కాస్త ఫాస్ట్. పైగా విజయ్ ఫ్రెండ్ కదా అందుకే కాస్త చనువుగా ప్రవర్తించాడని ఊరుకుంది సుమలత.
కానీ, ఆటో బయలుదేరిన ఐదునిమిషాలకే మాటలు మొదలుపెట్టాడు “మా వాడికసలు మీ అంత అందమైన అమ్మాయి దొరుకుతుందనుకోలేదు. నేను కూడా మీ అంత అందమైన అమ్మాయినే చేస్కుంటా. మీ కళ్ళు అరవిందాలు, మీ రంగు పసిమిపచ్చ ” అంటూ పొగడ్తలతో మొహమాటపెడ్తూనే కుదుపుల్లో జరిగినట్టు దగ్గరగా జరుగుతూ ముట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఇబ్బంది పెట్టసాగాడు రేవంత్.
“ఇతనేంటి..చాలా మంచివాడు, బుద్ధిమంతుడనుకుంటే ఇలా బిహేవ్ చేస్తున్నాడు ?” ఏం చెయ్యాలో అర్ధం కాక సతమతమై ఏడుపొక్కటే తక్కువన్నట్టుంది సుమలత పరిస్థితి.
ఇంతలో ఆటో ఠక్కున ఆగిపోయింది. ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు.
“సార్. నా ఆటో రిపేరైంది. మీరు వేరే ఆటోలో వెళ్ళండి ” అన్నాడు.
అప్పుడు గమనించింది అతను ఎవరో కాదు తాను అసహ్యించుకునే ఆటోవాలానే అని.
“ఓ.కే. రండి సుమగారూ వేరే ఆటోలో వెళ్దాం ” అన్నాడు అతివినయంగా.
“మీరెళ్ళండి బాబూ అమ్మగారు నాకు తెల్సు. నేను జాగ్రత్తగా తీసుకెళ్తాలే” అని దారిలో వెళ్తున్న ఆటోని ఆపి రేవంత్ ని ఎక్కించి పంపేశాడు.
వెనక్కొచ్చి మామూలుగా ఆటోని స్టార్ట్ చేసి ” ఊరికే చెప్పానమ్మా. ఏమీ అనుకోకండి. ఆ మీ ఇంటికొచ్చిన చుట్టం కావచ్చుగానీ నాకెందుకో ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడ్తున్నాడనిపించింది. అందుకే అలాచేశా. బాగా చదువుకున్నోళ్ళే ఇలా తయారయ్యారు. ఇయ్యాళ రేపు ముఖం జూసి ఎవర్నీ పోల్చుకోలేకున్నాం ” అంటూ వచ్చి ఇంటిదగ్గర దింపి వెళ్ళాడు జాగ్రత్తగా.
మర్నాడు కూరగాయలు కొని వస్తుంటే నిన్న తనకన్ని నీతులు చెప్పిన సుమలత అదే ఆటో లో ఆఫీసుకెళ్తూ కనిపించేసరికి ఏమీ అర్ధం కాక అటే చూస్తూ వుండిపోయింది శారద. 

                                                                                                                       –డేగల అనితాసూరి

—————————————————————————————————————————–

                       
కథలుPermalink

2 Responses to మనసుకు మరోరూపం (కథ ) -డేగల అనితాసూరి

  1. Desu Chandra Naga Srinivasa Rao says:

    అనితాసూరి గారి ఈ కథ చాలా బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)