నా జీవనయానంలో (ఆత్మ కథ )-67 మళ్లీ కలుద్దాం – కె. వరలక్ష్మి

కె.వరలక్ష్మి

ఆ సాయంకాలం హైస్కూల్లో నాకు పాఠాలు చెప్పిన హిందీ టీచర్ విమలాదేవి గారింటికి వెళ్లేను . ఎప్పుడూ ఆవిడ దగ్గర హిందీ పరీక్షలకి అటెండయ్యే వాళ్లు చాలా మంది ఉంటారు . నాక్కూడా ట్యూషన్ చెప్పమని అడిగేను . ఆవిడ ఇది వరకటి సమాధానమే చెప్పేరు . “ నువ్వు ప్రాధమిక మాధ్యమిక రాయక్కర్లేదు . డైరెక్ట్ గా రాష్ట్ర భాషకు వెళ్ళొచ్చు . నీకు ట్యూషన్ అక్కర్లేదు . నువ్వే చదివేసుకోగలవు . నీకు కావాల్సిన బుక్స్ నేనిస్తాలే . పరీక్షకి ఫీజు కట్టేముందు వద్దువుగాని “ అన్నారు . అలా అన్నారే గాని ఆవిడకి ట్రాన్స్ ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోవడం వల్ల ప్రవీణ వరకూ నేనే స్వయంగా చదువుకుని రాయాల్సి వచ్చింది

ప్రవీణ తర్వాత నాకే అన్పించింది . పై చదువులు చదవాలనుకుని ఇలా పక్కదారి పట్టే నేంటి ‘ అని . హిందీ చదువు అక్కడికి ఆపి , ఇంటర్మీడియేట్ నుంచి ప్రారంభించి M.A వరకూ ఆరేళ్లు ఏకబిగిన చదివి పాసయ్యాను .

మొదటిసారి సెలవులు ముగిసి స్కూలు రీఓపెన్ చేసాను . సెలవులకి రాజమండ్రి ఇంటికెళ్ళిన ఇంగ్లీష్ టీచర్ రాలేదు . అదో టెన్షన్ . రెండు రోజులు చూసి మోహన్ రాజమండ్రి వెళ్లేడు . బార్బరా ఇంకెవర్నో పెళ్లి చేసుకుని పాపాయితో బాటు మద్రాసెళ్లి పోయిందట . ఇంకా పెళ్లి కాని మరో అమ్మాయిని వెంటబెట్టుకొచ్చేడు. ఆ అమ్మాయిని చూసి నేనే చూపు తిప్పుకోలేకపోయేను . అంతటి అందాల రాణి . అన్నీ చూసుకుని వెళ్లి మర్నాడు తన బోయ్ ఫ్రెండ్ తో కలిసి వచ్చింది . అతను బ్లేక్ సంతతికి చెందిన ఆంగ్లో ఇండియన్ . ఆ అమ్మాయి ఎంత తెలుపో అతనంత నలుపు . అతను నేవీలో వర్క్ చేస్తూ సెలవులకి వచ్చేడట . వస్తూ బోలెడు లిక్కర్ బోటిల్స్ తెచ్చేడు . సాయంకాలం స్కూల్ ముగిసేక ఇద్దరూ తాగేసి రావి చెట్టు వైపు పెరట్లో డేన్స్ చేసేవారు . అతను తెచ్చినవి అయిపోయేక ఇద్దరూ కలిసి చెత్తా పట్టాలేసుకుని సెంటర్లో ఉన్న బ్రాందీ షాపులో తాగేసి వచ్చే వాళ్లు . డబ్బులు చాలక పోతే నాటు సారాయి తాగేసే వాళ్లట . రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ముద్దులు పెట్టుకోవడం , కలబడి కొట్టుకోవడం – అవన్నీ వింటుంటే నాకు మతి పోయినట్టైంది . నెల కాగానే ఒక నమస్కారం పెట్టేసి పంపించేసేను . నేను రాసిన ‘ ఇదీ ఓ బతుకు కథే ?’కథ ఆ అమ్మాయి గురించి రాసిందే .

క్రమంగా స్కూల్లో పిల్లల సంఖ్య పెరగ జొచ్చింది . నా చిన్ననాటి స్నేహితురాలు భాగ్యం వచ్చి “ ఇంట్లో ఇబ్బందిగా ఉంది “ అంది . తను మంచి టీచరయ్యింది తర్వాతి కాలంలో . చుట్టు పక్కల ఇళ్ళల్లోని పదో తరగతి చదువుకున్న బ్రాహ్మణుల అమ్మాయిలు టీచర్స్ గా చేరసాగారు. చిన్నక్లాసులే కదా రెండు రోజులూ నేర్పిస్తే సరిపోయేది. హేండ్ రైటింగ్ బావుంటేనే తీసుకునేదాన్ని. 20 మంది పిల్లలకు ఒకో టీచర్, అది ప్రధానంగా తూర్పు ముఖపు ఇల్లు, పొడవైన పెద్ద అరుగులు, నేను చదువుకునే రోజుల్లో మా నాన్న కోసం రేడియోతో పాటు కొనితెచ్చిన టేకు కర్ర టేబుల్, కుర్చీ ఇప్పుడు అవసరం పడ్డాయి. మా అమ్మా వాళ్ళింటి నుంచి వాటిని తెచ్చుకుని అరుగు మధ్యలో వేసుకున్నాను. అదే నా ఆఫీస్ రూం. నాకు రెండువైపులా తరగతులు టేబుల్ పైన అడ్మిషన్ రిజిస్టర్, ఫీస్ నోట్ చేసుకునే బుక్కు, అటెండెన్స్ రిజిస్టర్లు, నేనూ ఒక టీచర్నే. ఒకవేళ టేబుల్ దగ్గర వర్క్ లో ఉన్నా టీచర్స్ ఏం చెప్తున్నారో, ఎలా చెప్తున్నారో తెలుస్తూ ఉండేది. అరుగులు నిండాక క్రమంగా గదుల్లో కూడా క్లాసులు నడిచేది. ఆ రోజుల్లో జయమణి అనే అమ్మాయి టీచర్ గా రావడం నాకెంతో ప్లస్ పాయింటయ్యింది. తను గుంటూరు జిల్లా రేపల్లె నుంచి ఇక్కడ ANMగా చేస్తున్న వాళ్ళ అక్కయ్య ఇంటికి సాయంగా వచ్చింది. డిగ్రీ పాసై టీచర్గా చేస్తూ ఉండేదట. ముత్యాల్లాంటి చేతివ్రాత ఖంగున మ్రోగే గొంతు, పిల్లలతో ఆదరంగానూ, అవసరమైనప్పుడు భయపెడుతూనూ నడుచుకునేది. తన దగ్గర టీచింగులో ప్రాథమిక సూత్రాలు చాలా నేర్చుకున్నాను. దొంతికుర్రులో పరిచయమైన వరలక్ష్మికి ఉత్తరం రాసి పిలిచి ఒక గది ఇచ్చాను. తనూ ఒక టీచర్, అందరూ పిల్లల్తోనే కాదు. నాతోనూ ఎంతో ఆత్మీయంగా మసలుకునేవారు. ఎనిమిదవ తరగతి చదివిన మా చిన్న చెల్లెలు ఒక ఎల్.కే.జీ క్లాసుకి టీచర్, రేపటికి నెల అవుతుందంటే ముందు రోజే టీచర్లకి జీతాలు ఇచ్చేసేదాన్ని.

నేవీబ్లూ అండ్ వైట్ యూనీఫాంలో స్కూలు పిల్లలు ఉదయాన్నే శుభ్రంగా ముత్యాల్లా మెరుస్తూ వచ్చేవాళ్ళు. కొందరు తల్లులు రోజుల తరబడి యూనిఫాం ఉతకకుండా మురికిగా పంపేసేవారు. అలాంటి వారి ఇంటికి సాయంకాలాలు వెళ్ళి ఓర్పుగా నచ్చజెప్పేదాన్ని. చీకటినే లేచి పెరట్లో కర్రలపొయ్యి మీద స్నానాలకు నీళ్ళు, బొగ్గులపొయ్యి కిరోసిన్ గేస్ స్టవ్ ల మీద వంట కానిచ్చి మా పిల్లల్ని తయారుచేసి నేను తయారై టైం కన్నా ముందే స్కూల్లో ఉండే దాన్ని. మోహన్ ఊళ్ళోనే చేస్తుంటే ఫర్వాలేదు. లేకపోతే తన కేరియర్ సర్ది పంపించేదాన్ని. మోహన్ కూడా పిల్లలకు స్నానాలు చేయించి యూనిఫామ్స్ వేసి తయారు చేసేవాడు. కొందరు తల్లిదండ్రులు ;ఆంగ్లో ఇండియన్ టీచర్ కావాలని అడుగుతుండటంతో మోహన్ మళ్లీ రాజమండ్రి రైల్వే క్వార్టర్స్ లో ప్రయత్నించి బార్బరా విలియమ్స్ అనే ఆవిడను తీసుకువచ్చాడు. పెద్దగా చదువుకోకపోయినా టీచింగ్ బాగానే చేసేది. ముఖ్యంగా పిల్లలకి ఇంగ్లీషు మాట్లాడటం రావాలని పేరెంట్ల కోరిక అది తీరింది. బార్బరా మంచిగా నడుచుకునేది. మా ఇంత్లోనే భోజనం ఒక గది ఇచ్చాం, స్కూలు ముగిసాక సాయంకాలం కాంపౌండులో ఖాళీస్థలంలో ఎవరి క్లాసు పిల్లలని వాళ్ళం ఆటలాడిస్తూ వల్లె వేయిస్తూ ఉండేవాళ్లం. పెద్దల ఎదుట పిల్లలు నడుచుకోవాల్సిన విధానాల్నీ, సత్ప్రవర్తననూ బోధించేవాళ్ళం. బార్బరా దగ్గర చాలా మంది ఆడవాళ్ళు ఇంగ్లీష్ టాకింగ్ ట్యూషన్స్ పెట్టుకున్నారు. వాళ్ల ఇళ్లకెళ్ళి ట్యూషన్స్ చెప్పి వచ్చేది. స్కూలు గబగబా డెవలప్ అయింది. మోహన్ కి సాంఘికంగా ఉన్నతస్థాయిలో ఉండాలనీ, ఆర్థికంగా ఎదగాలని ఉండేది కాదు. తన జీతంతో బాటు స్కూలు ఆదాయాన్ని కూడా ఖర్చు పెట్టేసేవాడు. నేను అడ్డుకోబోతే, ఎక్కడ తగిలెందీ చూడకుండా కొట్టేసేవాడు. తిక్క మరీ ముదిరితే రాత్రంతా అన్నం తిననీయకుండా నిద్ర పోనీయకుండా కూర్చోబెట్టి ఒరిగినప్పుడల్లా ఫట్ మని కొట్టేవాడు. రాత్రంతా ఎంత నరకం చూసినా స్కూలు కోసం ఉదయాన్నేలేచి ముఖానికి నవ్వు అతికించుకుని రెడీ అయ్యేదాన్ని. ఇలాంటివి జరిగినపుడు నేనెక్కడ అతని నుంచి విడిపోతానో అని మా అమ్మ మోహన్రావు మనిషి మంచోడే డబ్బు కోసమే పెద్దపులి అయిపోతాడు అంటూ ఉండేది. ఆ పెద్ద పులి ఒక్కోసారి పోబైటికి నీ ప్లేసులో అప్పలమ్మని కూర్చోబెట్టిన స్కూలు నడుస్తుంది అనేవాడు తనే మళ్ళీ ఇల్లు కదిలి చూడు ఎక్కడున్నా వచ్చి నరికేస్తాను అనేవాడు. ఈ ఘోరమైన విషయాలు బైటికొస్తే స్కూలుకు చెడ్డపేరు వస్తుందని పళ్ళ బిగువున భరించేదాన్ని. సకలకళా వల్లభుడికి ఆర్థికపరమైన వెసులుబాటు వచ్చేసరికి అన్ని రకాల అలవాట్లు అయ్యాయి. అన్నిటితో బాటు సినిమాలలో నటించాలనే పిచ్చి ఒకటి పట్టుకుంది. ఏ మాత్రం సెలవులొచ్చినా ముప్పై నలభై వేలు అప్పు తీసుకుని మద్రాసెళ్ళి ఖర్చుపెట్టుకుని వచ్చేసేవాడు. ఆ అప్పు తీర్చమని నన్ను హింసిస్తూ ఉండేవాడు. నాలోపల ఎంత బాధ ఉన్నా నా నవ్వు దానికి ముసుగు వేసేసేది. నా స్కూల్లో టీచర్స్ అందరూ ఆడవాళ్ళే. నాతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారు. జయమణి అయితే మరీనూ నేను ఆదివారం పుట్టాననితెల్సి ఆదేవుడు మిమ్మల్ని తీరిగ్గా కూర్చుని సృష్టించాడు అంది. ఎవరెంత మెచ్చుకున్నా నాలోని లోపాలేంటో నాకు తెల్సు. నా నైజంలోనే అణకువ ఉండటం వల్ల అక్కర్లేని అభిజాత్యాలు, భేషజాలు, గర్వాలు, అహంభావాలు నన్నంటకుండా జాగ్రత్త పడ్డాను. ఏ తుఫానుకైనా గడ్డిపోచలాగా తల వంచి అధిగమించాను. పెద్దలంతా నన్ను ఆశీర్వదించారు. పిన్నలు నన్ను అనుకరించడానికి ప్రయత్నించేవారు. హైస్కూల్లో నాకు ఇంగ్లీషు నేర్పిన మా వారణాసి జోగారావు మాస్టారు రిటైరై కొడుకుల దగ్గరకి వెళ్ళిపోయినా మమకారం కొద్దీ తరచుగా వచ్చేవారు. వచ్చినప్పుడల్లా నా స్కూలుకి వచ్చి గుండ్రటి అక్షరాలకోసం నేను పిల్లల చేత రాయిస్తున్న కాపీ రైటింగులు చూసి మెచ్చుకునేవారు. అవసరమైతే సలహాలిచ్చేవారు. స్కూల్లో పాఠాలు చెప్పి వెళ్ళిపోవడం వేరు. ఎన్నెన్ని టెన్షన్లు భరించాల్సి వచ్చేదో, మోహన్ నుంచి ఎలాంటి సహకారం లభించేది కాదు. పైగా ఒకనియంతలాగా వ్యవహరించేవాడు.

1993లో మా ఊరి గ్రంథాలయానికి కొత్త పుస్తకాలొచ్చాయి. రంగనాయకమ్మ వాసిరెడ్డిసీతాదేవి, మాదిరెడ్డి సులోచన గార్ల రచనలతో బాటు జీవితాన్ని వామపక్ష భావజాలంతో సూత్రీకరించే కొ.కు వంటి వారి పుస్తకాలు వచ్చాయి. ఎంత పని ఉన్నా గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకం మార్చి పుస్తకం తెచ్చుకోవడం తప్పనిసరిగా పాటించేదాన్ని. ఆ పుస్తక పఠనంతో బాటు సాయంకాలాలు స్కూలు పిల్లలు వెళ్లాక నా ముగ్గురు చిన్ని బుడతలతో తేలికపాటి బంతాట లాంటివి ఆడుకోవడం నాకు గొప్ప రిలీఫ్ అన్పించేది. పిల్లల్ని కాన్వెంటులో చదివించాలని ఉన్నా పది రూపాయల ఫీసు కట్టలేక యూనిఫాం పుస్తకాలు కొనలేక ఇబ్బంది పడుతున్న కొందరు తల్లిదండ్రుల్ని గమనించాక నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. నా వంతుగా ఫీజు తీసుకోవడం మానేసి, ఆర్థికంగా బాగా ఉన్న కొందరి సహాయంతో బట్టలు, పుస్తకాలు కొని వచ్చేమోనని ఒక ఆదివారం నాడు జయమణి టీచర్ని వెంట బెట్టుకుని డా. గోలి శ్రీరాములు గార్ని కలిసాను. ఆయన చాలా ప్రశ్నలు వేసి కొంతసేపు వెయిట్ చేయించి ఐదు రూపాయలు ఇచ్చారు. అక్కడినుంచి డా. జయగారి దగ్గరకి వచ్చాం. ఈయన ఇంకొన్ని ప్రశ్నలు వేసి మధ్యాహ్నం వరకూ కూర్చోబెట్టి ‘ఇంట్లో అడిగి చెప్తాను రేపు రండి అన్నారు. ఆ సంఘటన నాకు గొప్ప కనువిప్పు కలిగించింది. ఎవరికి ఏ సాయమైనా మన దగ్గరుంటే చేయాలి. మరొకరి దగ్గర చెయ్యి చాచి అడగకూడదని అర్థమైంది. అందుకే ఆ తర్వాతి రోజుల్లో పేద విద్యార్థులకి బట్టలు, పుస్తకాలు ఇచ్చి ఉచితంగా విద్యని అందించాను. దివిసీమ తుఫానుకి కూడా అదే పాటించాను.

బ్రాహ్మణులంటే భూసురులని, పెద్దవాళ్లనుంచి చంటి పిల్లలవరకూ పవిత్రంగా జీవిస్తారని అసూయ ద్వేషాలకి అతీతంగా ఉంటారని అప్పటికి నాకొక అపోహ ఉండేది. ఆ వీధిలోకి వచ్చాక కులాన్ని బట్టి గుణాలు రావనీ, ఎవరూ దేనికీ అతీతులు కారనీ నా కర్థమైంది. ఆ వీధిలో నిప్పులు కడిగే కుటుంబంలోని ఒక పౌరోహిత్యం చేసే కుర్రాడు రోడ్లు తుడవడానికొచ్చే ఒక పాకీ అమ్మాయిని పాడుపడిన ఎదురింట్లోకి తీసుకెళ్ళి అరగంట తర్వాత బైటికొచ్చి రొంటిన ఉన్న పావలానో,ఆ పిల్ల చేతిలో పెట్టి వెళ్ళిపోయేవాడు. మరొక ధనిక వైశ్య కుటుంబం సోమవారం సంత రోజు ఉదయాన్నే వచ్చి క్యూలో నిల్చున్న అడుక్కునేవాళ్ళకి ఒక్కొక్క నయాపైసా దానం చేసేవారు. ఏనాడూ ఎవరికీ రెండు పైసలు ఇచ్చినట్లు వినలేదు అందరూ అలాగే ఉంటారని కాదు. ఇలాంటి సంఘటనలు నాలో సుడులు తిరుగుతూ రాయమని ప్రోత్సహిస్తూ ఉండేవి, రాసేదాన్ని కాని ఏ పత్రికకూ పంపడానికి సాహసించేదాన్ని కాదు. తిరిగొస్తే అనే పెద్ద ప్రశ్న గుర్తు నన్ను కొక్కెంలా వెనక్కి లాగేది. ఇది నా పాతికేళ్ళ ప్రాధమిక జీవితం. అసలైన జీవితం అంతా ముందుందని అప్పటికి నాకు తెలీదు. నేను రాసిన కథలు లేదా నా రచనలు కొందరైనా చదువుతారని అవి గుర్తింపు పొందుతాయని ఊహలోకైనా రానంతగా సంసార సాగరంలో ఈదుతున్న రోజులవి.

దీన్ని ఇక్కడికి ఆపుతున్నాను. తర్వాతి జీవితాన్ని జ్ఞాపకాలు పేరుతో రాయాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళుగా నా జీవనయానాన్ని చదువుతూ తమ అమూల్యమైన అభిప్రాయాల్ని అందిస్తూ ప్రేమను పంచిన అందరికీ నమస్సుమాంజలి.

– కె. వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో