ఆంధ్ర, క్రైస్తవ కవి సార్వభౌముడు పురుషోత్తమ చౌధరి ` క్రైస్తవ శతకాలు(సాహిత్య వ్యాసం) -ఎమ్‌.మధుకుమార్‌

ISSN 2278-478

ఆంధ్ర, క్రైస్తవ వాగ్గేయకారులలో అగ్రగణ్యుడు, బహుభాషాకోవిదుడైన పురుషోత్తమ చౌధరి 1803 సెప్టెంబర్‌ 5వ తేదిన పర్లాఖిమిడి సమీపంలో గల  మదనాపురిలో సనాతన బ్రాహ్మణకుటుంబంలో జన్మించారు. ‘చౌధరి’ అనునది పూర్వీకుల  నుండి సంక్రమించిన బిరుదే కానీ ఆంధ్ర రాష్ట్రములోని కమ్మవారికి వీరికి ఎట్టి సంబంధము లేదు. పురుషోత్తమ చౌధరి ఏకసంధాగ్రాహి, ఉపాధ్యాయునిగా ఉంటూనే విష్ణుస్తోత్రం, శివస్తోత్రం, గురుస్తోత్రం, కృష్ణలీల , నీలాచల  విలాసం, దశరధ రామశతకం మొదలగు హైందవ రచనలు  చేసాడు. కానీ ఇవన్నీ అలభ్యo.

పురుషోత్తమ చౌదరి జిజ్ఞాసి, భక్తి, జ్ఞాన, కర్మ, యోగాది సాధనమున్నింటిలో శిక్షణ పొంది ఆత్మలో శాంతి పొందుటకు పరితపించాడు. అవధూతగా, అఘోరిగా దిగంబర సాధువులతో సాంగత్యం చేసినా, శాంతి లేక మోక్షమార్గము తెలియక సతమతమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో అనగా 1825లో విలియం కేరీ రచించిన ‘క్రీస్తు మత గురువు ఈ సీమ సమస్త జనులకు వ్రాసిన పత్రిక’ లో ఉన్న ‘‘దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే అతడే యేసుక్రీస్తు’’. అనే  సారాంశాన్ని గ్రహించాడు. 400 మైళ్ళు కాలినడకన పాదిరీ దొర దగ్గరకు వెళ్లి బైబిలు ను చదివి అనుమానాన్ని నివృత్తి చేసుకున్నాడు. 10.06.1833 లో జంధ్యమును త్యజించి బాప్తిస్మం పొందాడు. క్రైస్తవ మత దీక్ష తీసుకున్నందుకు కుటుంబ సభ్యులు , బంధువులు , హీనంగా చూసారు. అవమానపరిచారు. కొందరు కొట్టారు. అన్ని సంతోషంగా సహించాడు. తన అనుభవాలను కీర్తనలుగా, పద్యాలుగా వివిధ ప్రక్రియలోనికి మలిచి తెలుగు క్రైస్తవ సాహితీ లోకాన్ని సుసంపన్నం చేసాడు.

ఈ మహాకవి కలం  నుండి జాలు వారిన క్రైస్తవ కవితా ఆణిముత్యాలు కులాచార పరీక్ష (1833), అంత్యన్యాయ తీర్పు(1836), మోక్షమార్గము (1837), యేసునాయక శతకం (1845), యేసు క్రీస్తు ప్రభు శతకం (1845), రక్షణ చరిత్రము (1846), నిస్తార రత్నాకరము (1846), విగ్రహ నిర్మాణము (1847), పంచామర పన్నము (1847), పంచరత్నము (1847), క్రైస్తవ నీతి ప్రకాశము (1851), హిందూమత ప్రదర్శనము (1860),, మనస్సేమూము (1863), సత్యవేద సారసంగ్రహము (1861), సత్యభజన (1874), దైవకుమార వర్ణనము (1884), వివిధ సందర్భాలలో రచించిన 200 పైగా కీర్తనలు )

అనువాదాలు  :
1. విశ్వాసము ఎవరిమీద నుంచవలిసినదనే దాని విచారణ (1836)
మూలం  : In whom shall we trust – Candy. T
2. నిజమైన ఆశ్రయము (1861)
మూలం  : The true refuge – W.H. DearCe
3. అంధకార నాశనము (1861)
మూలం  : Darkeness Dispelled – W. Carey
4. జగన్నాధ పరీక్ష (1861)
మూలం  : On the worship of Jagannath
5. బ్రహ్మజ్ఞానమును గురించినది (1861)
మూలo  : On Pantheism – William Clark son
6. వేలుగుకును , చీకటికును  యేమి సాంగత్యము (1862) మూలం: What concord Between light and Darkness
7. మశూచిక విశూచి సంకటమును గురించి కలిగిన బ్రాంతి నివృత్తి (1862) మూం : On the Small pox and Cholera – Jhon W. Gordon

పురుషోత్తమ చౌదరి రచనలో హైందవ రచనలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. క్రైస్తవ రచనలు  కొన్ని మరుగున పడ్డాయి. ఇటీవలే పురుషోత్తమ చౌదరి 5వ తరానికి చెందిన జేమ్స్‌ జయశీల్‌ చౌధరి (విజయనగరం) బ్రిటిష్‌ మ్యూజియం లైబ్రరీ లం డన్‌లో ఉన్న పురుషోత్తమ కవి క్రైస్తవ రచనలు  సేకరించి, ముద్రించి, తెలుగు క్రైస్తవ సాహితీ  లోకానికి మహోపకారం చేసారు.
తెలుగు సాహిత్యంలో శాఖోపశాఖలుగా అభివృద్ధి చెందిన సాహితీ ప్రక్రియలో శతక ప్రక్రియ ఒకటి. ఇది 12వ శతాబ్దంలో ఆవిర్భవించింది. తెలుగులో వెలసిన శతకాలలో భక్తి శతకాలు విశిష్టమైనవి. శివకేశవులను  స్తుతిస్తూ రచించిన శైవ వైష్ణవ భక్తిశతకాలు , లక్ష్మి, పార్వతి, సరస్వతి మొదలగు  దేవతపై రచించిన శతకాలు  కోకొల్లలు , పురుషోత్తమ చౌదరి రచించిన ‘యేసునాయక శతకం’ యేసుక్రీస్తు ప్రభు శతకం పరిశీనార్హాలు . ఈ రెండు శతకాలను క్రిస్టియన్‌ లిటరరీ సొసైటీ (సి.ఎల్‌.ఎస్‌) వారు 1953లో ముద్రించారు.

శ్రీకారంతో కావ్యాన్ని ప్రారంభించడం పూర్వకవుల  సంప్రదాయం. పురుషోత్తమ చౌదరి కవితా ధర్మాలను పాటించి ఈ రెండు శతకాలకు శ్రీకారం చుట్టాడు.

‘‘ శ్రీకరమైన సుధీజనవశీకరమై….. యేసు నాయకా’’ (యేసు నాయక శతకం)
‘‘ శ్రీరాజిల్లు  భవత్పదాబ్జము ………. యేసు క్రీస్తు ప్రభో’’ (యేసు క్రీస్తు ప్రభు శతకం)
భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన పవిత్ర నామాన్ని శతధా సహస్రధా కీర్తించడం, స్తుతలు , స్తోత్రాలు  చెల్లించడం భక్తమండలి చేసే నిత్య కృత్యం. భక్తాగ్రేసరుడైన చౌదరి యేసునాయకుని పాదాలను ఆత్మలో తలచుకుని, వందనాలు  అర్పించి, యేసు అనే సుందర దివ్య నామామృతాన్ని గ్రోలి ఆత్మీయానందాన్ని కలిగించమని వేడుకున్నాడు.

కష్టాలు  కలిగిన సమయంలో దైవసాన్నిధ్యంలో కన్నీటి ప్రార్థన చేయడం నిజభక్తులకు అలవాటు. బైబిల్‌లో ఇలాంటి దృష్టాంతాలు  అనేకం. భక్త శిఖామణియైన చౌదరికి కూడా ఈఅలవాటు ఉంది.

‘‘ నను గన రాగదె దినదినంబు భవత్సముఖంబు నందు నా కనుగవ నీరధారలివె గారుచు నున్నవి నీ పదాబ్జముల్‌ మునుగగ జేసి స్తోత్రమను పువ్వు పూజు చేతు……. యేసు నాయకా’’
(యేసు నాయక శతకం పురుషోత్తమ చౌదరి పద్య సంఖ్య ` 78)

యేసు నాయకా! నీ సన్నిధిలో నీ పాదాలు  మునిగేంతగా కన్నీరుకార్చి, నీ పాదముకు స్తోత్రములనే పువ్వు పూజలు  చేస్తాను. అని తన భక్తిని చాటుకున్నాడు. నిజానికి పువ్వుతో భగవంతుని పూజించడం క్రైస్తవ మతంలో అరుదు. అందుకే స్తోత్రాలనే పువ్వులతో పూజిస్తానని, తనపై దయ చూపించమని దైవాన్ని వేడుకున్నాడు.

ఇంద్రియ నిగ్రహం కలిగిఉండడం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఆ భారాన్ని భగవంతునిపై వేసి ప్రార్థిస్తారు.
‘‘ ముచ్చటూర నీ చరితమున్‌ వినగోరెడు వీనులాత్మలో నచ్చున వేసినట్లు భవదంఘ్రిము జూచెడు కన్నుదోయిని పచ్చర దోసముల్‌ చిదుము పావన నామము బల్కి  జిహ్వనా కిచ్చి కృతార్ధుజేసి దయ నేవె యెప్పుడు యేసు నాయకా’’ (యేసు నాయక శతకం పురుషోత్తమ చౌదరి పద్య సంఖ్య ` 79)

ముచ్చట గొలుపుతున్న యేసునాయకుని చరితాన్ని వినాలనే ఉబలాటపడే చెవులు , ఆయన పాదాలను మనసులో ముద్రించుకొనేట్లు చూసే కన్ను, దారిద్య్రాన్ని, దోషాలను పరిహరించే పవిత్ర నామాన్ని ఉచ్చరించే నాలుకను, దయతో ఇచ్చి కృతార్ధుడిని చేయమని భగవంతునికి విజ్ఞాపన చేస్తున్నాడు.

సాధారణంగా భక్తులు  , ధన, కనక, వస్తు, వాహనాలను కోరుకుంటారు. కానీ భగవంతుని పూజించడానికి కావలసిన ఇంద్రియాలను అనుగ్రహించమని వేడుకొనడం చౌదరి పరిపూర్ణ భక్తికి నిదర్శనం.

పురాణేతిహాసాల  నుండి వస్తువును స్వీకరించి దానిని ఇష్టప్రక్రియలో రచించడం మన పూర్వకవుల  సంప్రదాయం. అలాగే చౌదరి కూడా బైబిల్‌లో యేసు చేసిన అద్భుతాలను, స్వస్థతను కవిత్వీకరించిన తీరు అత్యద్భుతంగా ఉంటుంది.

‘‘ అంధు జాడ గల్గిరి మహా బధిరుల్విని రుగ్రభూత సం బంధు బంధమ్వుదలి బాగయి ర్లెడ సర్వరోగ ని ర్బంధు స్వస్థులైరి మృతి బ్పాడు వారు సజీవులైరి పా పేందన వహ్ని నీ వచనమెంత మహత్వము యేసునాయకా!’’ (యేసు నాయక శతకం పురుషోత్తమ చౌధరి పద్య సంఖ్య ` 86)

పరిశుద్ధ బైబిల్‌ నందు మత్తయి సువార్త 11:5, 9:27, 29:32, 33 లో ఈ అద్భుతము చూడవచ్చు. యేసుక్రీస్తు చేసిన స్వస్థతలో గ్రుడ్డివారు చూపుపొందారు. చెవిటివారు బాగుపడ్డారు. దెయ్యాలచేత బాధింపబడేవారు విడుదల  పొందారు. రోగాల  చేత పీడిoపబడేవారు బాగుపడ్డారు. చివరకు చనిపోయినవారు కూడా తిరిగి బ్రతికించబడ్డారు. ఈ శతకంలో చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించడం, సిలువలో దొంగను రక్షించడం, మగ్ధలేనె  మరియపై దయచూపించడం. సౌలును పౌలుగా మార్చడం మొదలగు బైబిల్‌ దృష్టాంతాన్ని చౌదరి అత్యద్భుతంగా వివరించారు.

చౌదరి మూఢాచారాలను నిరసించాడు. విగ్రహారాధనల  పట్ల విముఖత చూపించాడు. ‘‘కనవినరాని బొమ్మకు కానుకలిచ్చుట’’టను ఆక్షేపించాడు. నామకార్థ క్రైస్తవులను గద్ధించాడు. పుణ్యనదీ స్నానం పాప పరిహారం చేస్తుందని హైందవుల  నమ్మకం యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తం వన పాప క్షమాపణ కలుగుతుందని క్రైస్తవుల  విశ్వాసం. గనుక ‘‘కరచరణారవిందము గారెడి రక్తములో మునింగి’’ పాపాలను కడుగుకొని మానసిక ప్రశాంతతను పొంది తుదకు సద్గతిని పొందుతారని విశ్వసించాడు.

ఇక యేసు క్రీస్తు ప్రభు శతకంలో ప్రధానంగా స్తోత్రాలు , ప్రార్థనలు , పాపపుటొప్పుకోలు , వాక్యం గొప్పదనం, తగ్గింపు స్వభావం, రక్షణ, పరిశుద్ధాత్మ, విగ్రహారాధన ఖండన,జంతు బలుల ఖండన, తాను పొందిన ఆధ్యాత్మిక అనుభవాలు , అవమానాలు  మొదగు అంశాలను వ్యక్తీకరించాడు.

పాపం చేయడం, మానవనైజం, దైవసాన్నిద్యంలో పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాప పడి పాపాన్ని విడిచి పెట్టడం, విశ్వాసి ల క్షణం.పాపాత్ముడను, పాపకర్ముడను, దౌర్భాగ్యుడను, మూర్ఖుడను, కామ, క్రోద, మద గర్వ క్రూర చిత్తుడను, ఇంతటి పాపినైన నేను నీ పాదము చెంత చేరాను. నన్ను తన్నేసినా పోను అని అన్నాడు భక్తుడైన ‘యాకోబు’ దేవునితో పెనుగులాడినట్లు చౌదరి కూడా దేవుడు ఆశీర్వదించే వరకూ పోరాడుతానని వేరే దిక్కులేదని ప్రార్థిస్తున్నాడు.

‘‘ నా కన్నన్‌ కడు పాప కర్ముఠుడొకడైనన్‌ లేడు భూమండలిన్‌’’ (యేసు క్రీస్తు ప్రభు శతకం 21) ‘‘ పదివేల్‌ నాలుకలైన జావిక నా పాపంబు లెన్నంగ’’ (11) ‘‘ పాపాత్ముల్‌ భువి లేరె నా కొది’’ (15) అంటూ తన దీనస్థితిని భగవంతునికి నివేదించుకుంటున్నాడు. నిజానికి ఈ పద్య భావాలను ప్రతి మనిషికి వర్తిస్తాయి.

తల్లిదండ్రులు  బిడ్డల  అవసరాలను ముందే తెలుసుకుని ప్రేమతో వారికి కావలసినవి సమకూరుస్తారు. అలాగే తన అవసరాలను తీర్చే, పాపాలను పరిహరించే తండ్రిని నిరoతరము పూజిస్తానని చెబుతున్నాడు.

‘‘ కడు పారంగనుకున్న బిడ్డలెడ నే కాంబు నందెట్లు పా……. …………………. తండ్రి నిం దతు పేర్మిన్‌ యేసుక్రీస్తు ప్రభో’’ (24)

పై పద్య తాత్పర్యమే ధూర్జటి రచించిన ‘‘ శ్రీకాళహస్తీశ్వర శతకం’’ లో మనకు కనిపిస్తుంది. ‘‘పాలున్‌ బువ్వయు బెట్టిదన్‌ గుడువరా పాపన్న…………….. (1)

(శ్రీకాళహస్తిశ్వర శతకం ` ధూర్జటి పద్యసంఖ్య ` 30)

అదే విధంగా సారంభౌ కదళీ వనాంతర ఫ శ్రద్ధాశన సక్తమౌ కీరంబుల్‌ వెసరే పండ్లు దిన నంగీకారముల్‌ సేయునే నీ రమ్యంబగు ప్రేమ నామరుచి తేనెల్‌ గ్రోలు  సత్క్రైస్తవుల్‌ క్రూరా చారపు మ్పే న్వెదుక బోరె యేసుక్రీస్తు ప్రభో’’ (1)
పై పద్య భావాన్ని పోలిన పద్యం పోతనామాత్యుని భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో కనబడుతుంది.
‘‘ మందార మకరంద మాధుర్యమున దేలు  మధుపంబు పోవున్‌ మదనముకు ’’
పై పద్యాల వలన పురుషోత్తమ చౌధరి కలo కొన్ని  సందర్భాలలో ధూర్జటి కలంతోను, మరికొన్ని సందర్భాలో పోతన కలంతోనూ స్నేహం నెరపినట్లు కనబడుతుంది. భక్తిభావంలో మునిగిపోయిన వారికి ఆ భక్తి తీవ్రత పరాకాష్టకు చేరిన సందర్భంలో వారు ఏ మత సంప్రదాయాన్నినుసరించినా, వారి ఆలోచనా దృక్ఫధం ఒకేలా ఉంటుందనిపిస్తుంది.

ఈ శతకాలను ఎవరైతే మంచి మనసుతో చదువుతారో వారికి ప్రభువు శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తాడని శతకాంతంలో ఫలశృతి చెప్పుకున్నాడు.

‘‘ యేసు నాయక శతకం భావాల్లోను, పద్యనిర్మాణంలోనూ, అన్నింటిలో కూడా దాశరధీ శతకంతో తులతూగుతుందనీ, యేసుక్రీస్తు ప్రభో శతకాన్ని ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకం సరసన కూర్చుండ బెట్టి చందస్సుతో చూసినా, ఆర్తి చూసినా, సమాజం మీద వేసిన చురకు చూసినా ధూర్జటికి ఈయన వారసుడిలా అనిపిస్తుంది’’ అని బేతవోలు  రామబ్రహ్మం వారి అభిప్రాయం.

‘‘ ఈ రెండు శతకాలు  ప్రాచీన భక్తి శతకముతో తులతూగుతున్నట్లున్నవని’’ ఆంధ్ర శతక వాఙ్మయకర్త డా॥ కె. గోపాల కృష్ణారావు గారి తీర్పు.

మొత్తానికి యేసునాయక, యేసుక్రీస్తు ప్రభు శతకాలను పరిశీలించినపుడు పురుషోత్తమ చౌదరికి కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలతో పాటు సమాజంపై ఆయనకు గల  మక్కువ, సంఘ సంస్కరణాభిలాష, మూఢనమ్మకాల  పట్ల విముఖత, మొదలగు అంశాలు  కనిపిస్తాయి. అందుకే క్రైస్తవ సాహితీవనంలో ఎప్పటికీ వాడిపోని పారిజాతంలా ఈ కవి శోభిల్లుతాడు  అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

సంప్రదించిన గ్రంధాలు  :
1. పురుషోత్తమ కవి జీవిత చరిత్రము ` బాబుజాన్‌ చౌదరి
2. యేసునాయక శతకము ` పురుషోత్తమ చౌదరి 
3. యేసు క్రీస్తు ప్రభు శతకం ` పురుషోత్తమ చౌధరి
4. శ్రీకాళహస్తీశ్వర శతకం ` ధూర్జటి
5. ఆంధ్ర మహాభాగవతం ` పోతన
6. ఆంధ్రశతక వాఙ్మయము ` డా॥ కె. గోపాకృష్ణారావు
7. పరిశుద్ధ గ్రంధము` బైబిల్‌సొసైటి ఆఫ్‌ ఇండియా.

                                                                                                ఎమ్‌. మధుకుమార్‌ ఎమ్‌.ఎ., ఎమ్‌.ఫిల్‌,
                                                                                                                           పరిశోధక విద్యార్ధి ,

                                                                                                                సాహిత్య పీఠం , బొమ్మూరు .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సాహిత్య వ్యాసాలు ​Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)