జ్ఞాపకం-21 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

                                    ఎంతయినా తన కొడుకు రాజారాం సహృదయుడు. ఎక్కడ ఏ పని వున్నా ‘నేను వెళ్తానులే నాన్నా ! నువ్వేం కంగారుపడకు’ అంటాడు. శుభకార్యానికి గాని, అశుభకార్యానికి గాని ఏ మాత్రం సందేహించకుండా స్కూల్‌కి సెలవుపెట్టి వెళ్తాడు. ‘నీ తర్వాత నేనేగా నాన్నా ఈ ఇంటికి పెద్దవాణ్ణి. నేను వెళితే సరిపోతుందిలే’ అంటాడు. బంధువుల్లో చాలా మందికి రాజారాం తెలిసినంతగా తిలక్‌ తెలియడు. అది గుర్తొచ్చి కంట్లో ఏదో నలక పడితే నీళ్లు వూరినట్లు రాఘవరాయుడు కళ్లు తడిశాయి.
                                       మొన్న మేస్త్రీ వచ్చి ‘‘మాకు వేరే పనులున్నాయి రాఘవయ్యా ! వాటిల్లోకి వెళ్లామంటే నీకు మళ్లీ మేము దొరకడం కష్టం ఈ పని త్వరగా పూర్తి కావాలంటే మెటీరియల్ని అందుబాటులో వుంచుకో. పిల్లర్స్  మూడు అడుగులు  లేవగానే చుట్టూ భీము పోసి, చువ్వ అల్లి, స్లాబ్‌ పోద్దాం ! ఈ లోపల  పాత వాటిని పూర్తిగా తొలగించకుండా శిఖరాలను మాత్రమే తీసి, సరిగ్గా వాటి స్థానంలోనే స్లాబ్‌మీద కొత్త సమాధుల్ని నిర్మిద్దాం ! అప్పుడవి గట్టిగా వుండి కదలవు. ఎంతకాలమైనా నెర్రలు  రావు. శిలా శాసనంగా వుండి పోతాయి. ఆ తరువాత 9 అడుగుల  ఎత్తులో పిల్లర్స్  లేపి మళ్లీ శ్లాబ్‌ పోద్దాం ! అప్పుడు సమాధులు  ఎండకి ఎండవు. వానకి తడవవు. శ్లాబ్‌ మీద రెండు అడుగుల  ఎత్తున పిట్ట గోడకట్టి, ఆ గోడకి మీ అమ్మా, నాన్న పేర్లు రాయించావంటే దారిన పోయే జనాలకి దూరంనుండే స్పష్టంగా కన్పిస్తాయి.
                                       ఇలా కట్టించావంటే చూడటానికి చాలా బావుంటుంది. వాళ్ల ఆత్మలు  తృప్తిపడి, శాంతిస్తాయి. ఇక ఆఖర్లో నువ్వు ఆ సమాధులకి టైల్స్‌ వేయిస్తావో, మార్బుల్‌ వేయిస్తావో, గ్రానైట్‌ వేయిస్తావో అది నీ ఇష్టం, నీ ఓపిక…’’ అంటూ స్కెచ్‌ ఇచ్చి వెళ్లారు. ఆ స్కెచ్‌ మనసులో మెదిలినప్పుడల్లా చిత్రమైన పులకింత. త్వరగా కట్టించి కళ్లతో చూసుకోవాలన్న ఆశ.
                                           కానీ వాళ్లు చెప్పిన పనుల్లో ఒక్క పనికూడా ఇంత వరకు కాలేదు. పిల్లర్స్  కోసం పాత వాటి చుట్టూ రెండు అడుగులోతున నేను తవ్వి, గుంటలు  మాత్రం తీసి పెట్టారు. అంతే ! వాళ్లు చెప్పినవన్నీ అతి వేగంగా జరిగిపోవాలి. అలా జరిగి ఆ పని పూర్తి అయ్యాక ఎలా వుంటుందో వూహించుకుంటుంటే ఆనందంగా వుంది. నిజానికి ఇలాంటి అవకాశం ఎంతమంది కొడుకులకి వస్తుంది…? లక్షలు , కోట్లు సంపాయించిన కొడుకుకి వస్తుందా ? ఒక్క రూపాయి దానం చేస్తే తమకున్న కోట్ల రూపాయలో ఒక రూపాయి తగ్గిపోతుందని అతి జాగ్రత్తగా బ్రతికి చివరకి తమ కోట్లను కొడుకుకి వదిలేసి వెళ్లిన ధనికులైన తల్లి, దండ్రులకి ఇలాంటి నమూనా గల  జ్ఞాపక చిహ్నాలు  వున్నాయా ?నిజంగా ఈ కట్టడం పూర్తి అయితే తన జన్మ ధన్యమైనట్లే. ఆలోచిస్తూ ఇంటికెళ్లాడు రాఘవరాయుడు.
                                    సులోచనమ్మ పెద్దకొడుకుని తలుచుకుంటూ కళ్ల నీళ్లు తుడుచుకుంటూ ఇంటి పనులు  చూసుకుంటోంది.సంలేఖ కాలేజీకి వెళ్లకుండా అన్నయ్య వుండే హాస్పటల్‌కి వెళ్లింది. వెళ్లేటప్పుడు వినీలకి, తిలక్ కి  పెట్టించిన లంచ్‌ బాక్స్‌ తీసికెళ్లింది. రాజారాంకి ఇడ్లీ పెడితే మంచిదనగానే తిలక్‌ని పంపి ఇడ్ల్లీ తెప్పించింది సంలేఖ. ఒక ఇడ్లీ సగం తిని ఇక చాలన్నాడు రాజారాం. అతను తినకపోవడం చూసి మళ్లీ ఏడ్చింది వినీల . పక్కనే వున్న ఆమె తల్లి ప్రభావతమ్మ వినీల ను ఓదార్చింది. ఆమె అలా ఏడ్చి  వెళ్లింది. మళ్లీ రాలేదు. ఫోన్లో మాట్లాడేది.
                                             తిలక్‌, సంలేఖ డాక్టర్‌గారు వస్తే మాట్లాడదామని అక్కడే కూర్చుని ఎదురు చూస్తున్నారు. తిలక్  ఈ లోపల  ఒకసారి అన్నయ్య దగ్గరికి వెళ్లి పాన్‌పట్టి వచ్చాడు. ఆ పని అతనికి తప్పటం లేదు. ఆ పని పూర్తి చేసి ఒక్కోసారి ఎలా వున్న అన్నయ్య ఎలా అయిపోయాడని అన్నయ్య దగ్గరే కూర్చుంటాడు. తిలక్‌ అలా కూర్చున్నప్పుడు అన్న, దమ్ము ఏం మాట్లాడుకుంటున్నారో ఏమో అని చుట్టుపక్కల  ఎక్కడ వున్నా వచ్చి రాజారాం బెడ్‌ పక్కన కూర్చుంటుంది వినీల. ఆయనతో మాట్లాడే అవకాశాన్ని ఎవరికీ పెద్దగా ఇవ్వదు. ముఖ్యంగా తిలక్‌కి, సంలేఖకి.

ఇంతెందుకు రాజారాం హాస్పిటల్‌లో చేరిన క్షణం నుండి చాలామంది వచ్చి చూసి వెళ్లారు. అతను మత్తుగా పడుకొని వున్నందువల్ల  ఎవరినీ చూడలేక పోయాడు.

కళ్లు తెరిచాక ‘‘మిమ్మల్ని చూడటానికి ఎవరూ రాలేదు. మీరైతే అందరికి వెళ్తుంటారు. ఇప్పుడు ఒక్కరన్నా వచ్చారేమో చూడండి ! ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వెళ్లి చూడాలని మీరే అంటుంటారు. ఇప్పుడు మీరు ఆపదలో లేరా?’’ అంటుంది. రాజారాం మౌనంగా వుండటం తప్ప వినీలతో మాట్లాడడు. ఈ మాటలన్నీ పక్కనే వుండి వింటున్న సంలేఖకి మాత్రం కష్టంగా అన్పిస్తుంటాయి. వెంటనే అన్నయ్య దగ్గరకి వెళ్లి ‘వదిన మాటలు  అబద్దం. నీకిలా జరిగిందని తెలిసి చాలా మంది వచ్చారు. ఆత్మీయంగా కంటతడి పెట్టుకొని వెళ్లారు.’ అని చెప్పాలనుకుంటుంది.

– అంగులూరి అంజనీదేవి

(ఇంకా ఉంది )

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో