నా జీవనయానంలో (ఆత్మ కథ )-66 జ్ఞానోదయం– కె. వరలక్ష్మి

కె.వరలక్ష్మి

“ ఇంకా లైటు వెలుగుతోంది , మేలుకునే ఉన్నట్టున్నారు , పాపాయిని కాస్సేపు ఎత్తుకుని వెళ్దాం “ అని వచ్చేరట . తిన్నగా నేనున్నా చోటికి వచ్చి నా స్థితిని చూసేరు . అప్పటికే నాకు వికారం , స్పృహ కోల్పోయే స్థితి మొదలైంది .” మోహన్రావు ఇంకా రాలేదా ?” అంటూనే సెంటర్లోకి పరుగెత్తి రిక్షా పిల్చుకొచ్చేరు. దారిలో పాపాయిని మా అమ్మకు ఇచ్చేసి నన్ను డా. జయ గారి హాస్పటల్ లో చేర్పించారు . రోజూ రాత్రి భోజనాల తర్వాత శాంత , మాచిన్న చెల్లి రవిని , గీతను తీసుకుని మా అమ్మ వాళ్లింటికి వెళ్లిపోయే వారు . అందుకని ఇంట్లో ఎవరూ లేరు .

డాక్టరు ఏం వైద్యం చేసేరో , ఎలా చేసేరో కాని రాత్రంతా నన్ను నిద్ర పోనీయకుండా చేసేరు . మర్నాడు ఇంటికి పంపించేటప్పుడు నావైపు నిశితంగా చూస్తూ “ మీరింత పిరికి వారనుకోలేదు “ అని మాత్రం అన్నారు . నేను పుట్టినప్పటి నుంచీ ఆయనే నా డాక్టరు . ఈ మధ్యనే నన్ను “మీరు “ అంటున్నారు . నేను చాలా సిగ్గు పడిపోయేను. రాత్రంతా మా అమ్మ , నాన్న నిద్ర మానేసి నా దగ్గరే ఉండిపోయారు. నన్ను హాస్పటల్ ఎదుటే ఉన్న మా అమ్మమ్మ గారింటికి తీసుకొచ్చి పడుకోబెట్టేరు . “ ఈ పిల్లల్ని , ముక్కు పచ్చలారని వాళ్లని ఏం చేద్దామనుకున్నావు “? అంటూ ఇద్దరూ ఒకటే ఏడుపు .

పేకాట నుంచి తెల్ల వారుఝాము నెప్పుడో వచ్చిన మోహన హాయిగా ఉదయం పది వరకు నిద్రపోయి స్థిమితంగా తయారై వచ్చేడు . ఏమైంది , ఎలా ఉంది అని కూడా అడగకుండా ఒక వ్యంగ్యపు నవ్వొకటి నవ్వేసి ,”వెళ్లు వెళ్లు , అక్కడ స్కూలుకి పిల్లలోచ్చేసారు “ అని వెళ్లిపోయాడు . ‘అతని కోసమా నేనింత వర్రీ అవుతున్నాను !” అన్పించింది అతనికి సంసార బాధ్యత పట్టదని కూడా అర్ధమైంది .పిల్లలు ముగ్గుర్నీ దగ్గరకు తీసుకుని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను . ‘కష్టమో , సుఖమో ఇక పైన ఇలాంటి పిచ్చి పన్లు చెయ్యకుండా నా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాను , వీళ్ల కోసం నేను బతకాలి . అది కూడా ధైర్యంగా బతకాలి ‘ అని .

నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు మా దేవుడు గది అరుగు మీద కూర్చుని ఏదో పిల్లల పత్రిక చదువుతున్నాను . ఒక కథలో ఒక బాలుడు ఒక రాయిని విసిరి అడుగులు లెక్క పెట్టి ఎంత కాలం బతుకుతాడో ఆకాశవాణి చెప్తే నిర్దారించుకుంటాడు . పుస్తకాన్ని పక్కన పెట్టి నేను కూడా ఒక చిన్న రాయి తీసుకుని మా గేటు వైపు విసిరేను . అడుగులు దగ్గర దగ్గరగా వేసుకుంటూ నడిస్తే ఒకసారి 29 , మరోసారి 32 లెక్కతేలాయి. అంతే నేను ముప్పై రెండేళ్లు బతుకుతానన్నమాట అని నిర్ధారించుకున్నాను . ఆ వయసుకి ముప్పై రెండంటే చాలా ఎక్కువ అన్పించింది . ఇప్పుడది గుర్తుకొచ్చింది . ఈ సంఘటన జరిగే నాటికి నాకు 24వ ఏడు నడుస్తుంది . అంటే ఇంకొక ఎమినిదేళ్ళు బతుకుతానన్నమాట ! అమ్మో , అప్పటికి పిల్లలు ఇంకా పెద్ద వాళ్లు కారే !.

రాత్రే చచ్చి పోవాలనుకున్న నేను తెల్ల వారి ఎలా ఆలోచిస్తున్నానో ! అంత సెంటిమెంటల్ ఫూల్ గా ఉండేదాన్ని . చిన్న వయసులోని అపరిపక్వత వల్ల నేను చదివిన సాహిత్య ప్రభావం మా మీద పూర్తిగా పడలేదు . జీవితంలోని అశాంతికి కారణం ఏమిటో అర్ధం చేసుకునే వయసింకా రాలేదు . తర్వాతి కాలంలో కూడా నేను పరిపక్వతను సాధించానని అనుకోను . అందుకే నన్ను అశాంతికి గురి చేసే వాళ్ల నుంచి మానసికంగా దూరంగా పారిపోతూ వచ్చాను . నా లోపలి దుఖం నాలో ఒక పట్టుదల రేపింది . అనుకున్నదేదైనా సాధించే శక్తినిచ్చింది . నా ప్రస్తుత కర్తవ్యం నేను ఆర్ధికంగా నిలదొక్కుకోవడం . ఎవరి దగ్గరా దేహీ అని చెయ్యి చాచకుండా జీవించడం . శారీరికంగా బలహీనురాలినైనా మానసిక స్థైర్యాన్ని ప్రోది చేసుకున్నాను . అందుకే పూర్తి ధ్యాసను నా స్కూలు మీదే కేంద్రికరించాను . పిల్లలకు మెరుగైన విద్యను అందించడానికి పరిపరి విధాల ఆలోచనలు చేసేదాన్ని . పిల్లల తోటే లోకమైపోయింది . ఉన్న కొద్ది మంది పిల్లల్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని నేననుకున్న పద్ధతిలో బోధన సాగించేదాన్ని , త్వరలోనే ఫలితం కన్పించ సాగింది. పిల్లలు తెలుగు , ఇంగ్లీషు , హిందీ తప్పులు లేకుండా రాస్తున్నారు . సంస్కృత శ్లోకాల్ని , శతక పద్యాల్ని స్పష్టంగా ఉచ్చరిస్తున్నారు . వేళ్ళు లెక్క పెట్టుకుంటూ లెక్కలు చేస్తున్నారు . అలా పిల్లల మధ్య గడపడం ఎంతో బావుండేది . మనం నాటిన విత్తనాలు చిన్ని మొక్కలుగా తలలేత్తుకోవడం చూసిన ఆనందం కలిగేది . రాత్రి ఆవరించుకున్న దుఖం తెల్లవారి సూర్య కిరణాల్లో కరిగిపోయేది. నాలోంచి మరో నేను ఉద్భవించిందప్పుడే .

ఈ సందట్లో నేను నా పిల్లవాడిని ప్రత్యేకంగా పట్టించుకోలేదు . ఇంకా చిన్నవాడు కదా , నెమ్మదిగా నేర్చుకుంటాడులే అనుకున్నాను . ఒక రోజు హఠాత్తుగా తెలుగు అక్షరాలు అన్నీ , ఇంగ్లీషు అక్షరాలు నాలుగు బర్లు రాసి చూపించి నన్ను ఆశ్చర్యపరిచాడు వాడి చేత ప్రత్యేకంగా ఏనాడు దిద్దించలేదు .” ఇవన్నీ ఎలా వచ్చాయి నాన్నా ?”అనడిగితే గోడల మీది చార్ట్లు చూపించాడు . రోజూ వల్లే వేయించడం వలన వాటిని ఉచ్ఛరించడమూ వచ్చేసింది . ఇక గీత పాపాయి అందాలు వొలక బోస్తూ స్కూలు గదిలోనూ , ఇల్లంతానూ నడిచేస్తుండేది . ఇల్లు గల వాళ్లు రిపేరు కోసం తెప్పించిన యిసకలో కూర్చుని ఆడుతూండేది . పక్కనే బొగ్గుల పొయ్యి మీద ఉడుకుతున్న కూరల్లో ఇసుక పోసేసేది . కొన్ని సార్లు ఇసుకతో నింపేసేది . ఇక చంటి పాపాయి బొద్దుగా , ముద్దుగా నవ్వు లోలక బోస్తూ ఉండేది . వీళ్ళను వదిలేసా నేను చచ్చి పోవాలనుకున్నది ! వాళ్లను చూస్తూ నేను జీవితం మీద ఆశను పెంచుకున్నాను .

అబ్బాయి మాటలొచ్చే వేళకి అక్కడుండడం వల్ల మా అమ్మనూ , నాన్ననూ అమ్మ నాన్న అని , మా చెల్లెళ్ళని అక్కలనీ , మా తమ్ముళ్ళను అన్నయ్యలనీ పిలిచే వాడు . నన్ను పెద్దక్క అని , మోహన్ ని బాగారు (బావగారు ) అనడం ; మమ్మల్నీ అమ్మ అనాన్న అనకుంటే తికమక పడడంతో మమ్మీ , డాడీ అని నేర్పించాం . అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న కాన్వెంట్స్ ప్రభావం వల్ల కూడా తల్లిదండ్రులు మమ్మీ డాడీ అని పిలిపించుకోవడం ఫేషనైంది . వర్షం వస్తే ఇల్లు బాగా కురిసేస్తోందని ఇల్లు గల వాళ్లు ఒక సెలవు రోజు పైన టాప్ విప్పించేరు . ఆ రాత్రి నేను నడుస్తూ ఉంటే చెత్త లోంచి ఎర్ర తేలోకటి కుట్టేసింది . మళ్లీ మామూలే ఆ వెలి వరకే ఆగింది కాని ఆ నొప్పిని భరించలేకపోతున్నాను . పక్క గదిలోని అనసూయ వచ్చి ఉల్లిపాయ గుజ్జు వేసి రుద్దింది . ఇంకా ఏమేమో సపర్యలు చేస్తోంది . నొప్పి బాగా ఎక్కువై పోయాక నాకు తెలీకుండానే పక పకా నవ్వుతున్నాను ,మొదటి సారిలాగే . అది చూసి అనసూయను వాళ్లాయన ఒక్క కసురు కసిరి లోపలి పిలిచేసాడు . ఇక రాత్రంతా ఒక్క దాన్నే ఆ బాధని భరిస్తూ , నవ్వ్వుతూ , ఏడుస్తూ …..

ఊరు జనాభా పరంగానే కాకుండా ఆర్ధికంగా కూడా వైశ్యుల భాగస్వామ్యం ఎక్కువ . అప్పుడప్పుడే నా స్కూల్లో వైశ్యుల పిల్లల్ని చేరుస్తున్నారు . ఒకరోజు ఆ వీధి పిల్లలు ఎక్కిన రిక్షా రెండెడ్ల బండి ‘కాడికి ‘తగులుకుంది . అప్పట్లో కాకినాడ రోడ్డుకి రెండు వైపులా పెద్ద కందకం లాంటి దిగుడు ఉండేది . మేమున్న వైపు మరీ ఎక్కువగా ఉండేది . వర్షా కాలంలో కొండల మీద కురిసిన నీరు పోయే కాలవ అది .రోడ్డు పక్క యల్లా వాళ్లు తాటి వాసాలు పరిచి నడుస్తూండే వాళ్లు . బస్సును చూసి బెదిరిన ఎడ్లు రిక్షాను లాక్కుని పరుగెత్తాయి . పిల్లల్ని రిక్షాలోకి ఎక్కిస్తున్న నేను గాభరాతో ఒక చేత్తో రిక్షాను పట్టుకుని వదలకుండా పరుగెత్తేను . నా వెనక రిక్షావాలా . కొంత దూరం వెళ్ళేక రిక్షా కాడి నుంచి జారి కాలవలో పడిపోయింది . పిల్లలకేమైందో ననే భయంతో నేను కొయ్యబారిపోయేను. అదృష్టం కొద్దీ చిన్నగా గీసుకోవడం తప్ప పిల్లలకేమీకాలేదు . సెంటర్లోంచి చాలా మంది పరుగెత్తుకొచ్చి పిల్లల్ని పైకి తీసుకొచ్చేరు .

ఆ మర్నాడు కొత్త క్రిష్ణ గారు వచ్చి “ మేమంతా పిల్లలని మీ దగ్గరే చదివించాలనుకుంటున్నాం . కాని , ఇక్కడికి పంపించాలంటే భయం వేస్తోంది . కొంగల రావి చెట్టు పక్కనే మా ఇల్లొకటి ఇలాంటిది ఉంది . అక్కడైతే స్కూలు ఊరి మధ్యలో ఉన్నట్టువుతుంది . అద్దె ఇక్కడెంత ఇస్తున్నారో అంతే ఇవ్వండి “ అన్నారు . చిన్నమ్మాయికి కూడా వేణు గోపాలస్వామి ఆలయం లోనే పెద్ద పిల్లలిద్దరికిలాగానే మా నూజిళ్ల మాస్టారి చేతే శ్రీలలిత అని పేరు పెట్టించాం . పుట్టుక ముందు మూడవ బిడ్డ వద్దు అనుకున్నాం కాని , పుట్టిన తర్వాత అది అందరికీ గారాల పాపాయి అయిపొయింది .

ఆ సంవత్సరం ఫిభ్రవరి 22 కి అబ్బాయికి అయిదవ ఏడు రాగానే తిరుపతి ప్రయాణం పెట్టుకున్నాం . వాడికి అప్పటికే జుట్టు బాగా పెరిగిపోయి పెద్ద పెద్ద రెండు జడలు వెయ్యాల్సి వచ్చేది . మా అత్తగారు క్రిస్టియన్ కాబట్టి అమ్మను తీసుకు వెళ్లేం . రెండు పాత చీరలు తెచ్చి బెర్తుల మధ్యలో రెండు ఉయ్యాలలు కట్టేసింది . గీతను , లలితను ఆ ఉయ్యాలల్లో పడుకోబెట్టి ప్రయాణం చేసాం . ఆ రోజుల్లో తిరుమలలో ఇప్పటంత రద్దీ ఉండేది కాదు . ఉచిత సత్రం గదిలో దిగి పిల్లలు ముగ్గురికీ పుట్టు వెంట్రుకలు తీయించి , స్వామి దర్శనం చేసుకుని బస్సులో కిందికి వచ్చేసరికి ముగ్గురి తలలపైనా నీటి పోక్కుల్లా దట్టంగా వచ్చేసి జ్వారాలు వచ్చేసి మూసినా కన్ను తెరవకుండా అయిపోయారు . దిగువ సత్రంలో ఉన్న వైద్యశాలకి పరుగెత్తేం . డాక్టరు పెర్మాంగనేటుద్రవం పూసి,ఇంజక్షన్లు చేసాడు . జుట్టు తీసిన కత్తి శుభ్రం చేయక అలా అయ్యిందట . పెద్ద వాళ్లం దిగాలు పడిపోయాం . మా అమ్మైతే పిల్లలకేం కాకూడదనీ , మళ్లీ వస్తామనీ మొక్కేసింది . ఊళ్లోనే కంసాలి చేత వెండి ఉయ్యాల చేయించి తెచ్చాను . దాన్ని కాళహస్తి ఆలయంలో దేవి ఉయ్యాలకు కట్టి అప్పుడెప్పుడో నేను అనుకున్న మొక్కు చెల్లించేను. మర్నాడు పిల్లల జ్వరాలు తగ్గే వరకూ తిరుపతి ఉంచిత సత్రంలో ఉంది గోవిందరాజస్వామి , అలివేలు మంగాదేవి ఆలయాలు చూసుకుని , కంచి వెళ్లి అక్కడి శివ , విష్ణు ఆలయాలు చూసి , పిల్లల చేత బంగారు , వెండి బల్లుల్ని తాకించి , దారిలో విజయవాడలో దుర్గ గుడి దర్శించి వచ్చాం . ఈ ప్రయాణం మా అమ్మకు చాలా సంతోషం కలిగించింది . తను లేకపోతే ముగ్గురు పిల్లల్తో మాకు చాలా కష్టమైపోయేది . ముఖ్యంగా గీత ఉన్న చోట ఉండేది కాదు . ఎంత జాగ్రత్తగా చూసుకున్నా తిరుమలలో ఒకసారి , విజయవాడలో ఒకసారి తప్పిపోయి దొరికింది . స్కూలుకు సెలవులిచ్చాక మే నెలలో కొత్త ఇంట్లోకి మారాలనుకున్నాం . వెళ్లి చూస్తే కాంపౌండ్ వాల్ లోపల ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ స్థలంలో నిలువెత్తు పిచ్చి మొక్కలు , తుప్పలు నిండి పోయి ఉన్నాయి . పక్కనే గోడను ఆనుకుని ఉన్న కొంగల రావి చెట్టు ఆకులన్నీ గుట్టలుగా రాలిపడి ఉన్నాయి . ఇల్లు కూడా మధ్య గది తప్ప మిగిలిన గదులన్నీ దుమ్ము ధూళితో నిండిపోయి ఉన్నాయి . మేం వేల్తామన్న రోజుకి ఇల్లు గల వాళ్లు శుభ్రం చేయించనే లేదు . దాంతో ఆ పని మొత్తం మా మీదే పడింది . మా చెల్లినీ , శాంతనూ సాయం తీసుకుని రోజూ కొంత కొంత చొప్పున శుభ్రం చేసి నివాస యోగ్యంగా మార్చుకున్నాను . ఈ లోపల గీత గునగునా నడుచుకుంటూ పిచ్చి మొక్కల్లోకి వెళ్ళిపోయేది . ఎక్కడుందో కన్పించేది కాదు . మేం వెదికే లోపల ఇంటి చుట్టూ తిరిగి వచ్చేసేది .

ఆ సెలవుల్లో మోహన్ సీలేరు వెళ్లేడు. మా పెద్ద ఆడపడుచు రాణి వాళ్లాయన సీలేరు ప్రాజెక్టు లో జూనియార్ ఇంజనీర్ జాయినయ్యేడట. కడుతూ ఉన్న సీలేరు ప్రాజెక్ట్ వర్క్ , ఆ పరిసరాలు చూడాలని మనసులో చాలా అన్పిస్తున్నా తనాలా నేను బయలు దేరలేకపోయాను . చిన్న పిల్లల్తో మే నెల ఎండల్లో ప్రయాణం అంటే భయం ఒకటి . సెలవులయ్యే సరికి కొత్త ఇంటిని , పెరదుని శుభ్రం చేసి స్కూలు కోసం సిద్ధ పరచడ మొకటి , అప్పటికి నా స్కూలుకు నేనే ప్రిన్సి పాల్ ని , నేనే స్వీపర్ ని .

మోహన్ తో రాణి కూడా వచ్చింది . రానికి పిల్లలు కలగా లేదు . తను చిన్న పాపాయిని పెంచుకుంటానని అడిగిందట , మోహన్ సరే అని మాట ఇచ్చేసేడట. ‘ అదేంటి , కన్న బిడ్డని అలా ఎలా ఇచ్చేస్తాం?,… వాళ్ల ఎదుట ఏమీ అనలేకపోతున్నాను కానీ , నా గుండెల్లో రాయిపడినట్టయ్యింది. పాపాయి పాలు తాగుతూ అమాయకంగా నా మొహం లోకి చూసి నవ్వుతూ ఉంటె దుఖంతో నా మనసు నిండిపోయేది. రాత్రులు కన్నీటితో దిండు తడిసిపోయేది. నా నుంచి పాపాయిని దూరం చేసేస్తారేమో అనే బాధతో తినికీ నిద్రకూ దూరమైపోయాను . తను వారంపైగా నిరీక్షించి బాధతో , కోపంతో ఏమేమో అనేసి తిరిగెళ్ళిపోయింది .

మేమున్నది చిన్నప్పుడు నేను చదువుకున్న ఎలిమెంటరీ స్కూలు పరిసరాల్లో . ఓ పక్క బ్రాహ్మణ వీధి , మరోపక్క కోమట్ల వీధి . ఓ రోజు మధ్యాహ్నం ఒక బ్రహ్మణావిడ వీధి తలుపు తెరుచుకుని మా ఇంట్లోకి వచ్చింది . మనిషి బక్క చిక్కి ఎముకలు లెక్క పెట్టచ్చు అన్నట్టుంది . మాసికల చీర .”ఈ పూట వంట చెయ్యలేదు , కొంచెం బియ్యం ఉంటె పెడతావామ్మా “ అంది . నేను వెంటనే లేచి ఒక షేరు గిన్నెతో బియ్యం తెచ్చి ఆవిడ సంచిలో పోసాను . తర్వాత తెలిసింది , ఆవిడ హైస్కూల్లో పెద్ద హిందీ మాస్టారి భార్య అట . ఆయననేమో తెల్లని ఇస్త్రీ పంచె , చొక్కా , షూ, సాక్సు వేసుకుని సోగ్గాడే చిన్నినాయనా అన్నట్టుంటాడు . అవతలి మర్రి మొక్క వీధిలో సెంకడ్ సెటప్ పెట్టి ఇంట్లో డబ్బు లివ్వడం మానేసేడట. ఈవిడ తొమ్మండుగురు పిల్లల తల్లి . అమ్మో , నాకెప్పుడూ అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి అందు కోసం స్కూలు మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి .

– కె. వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో