మెక్సికో నౌకా యాత్ర- భాగం-2
లాంగ్ బీచ్ లోని పోర్టు నించి దాదాపు అరగంట వ్యవధి లో ఉంది మా హోటల్. అయితే ప్రత్యేకించి మాలాగా క్రూయిజ్ కు వెళ్లే వాళ్ల కోసం ఉచిత కారు పార్కింగు, డ్రాపింగు సర్వీసు అక్కడ ఉన్నందున ఉదయం స్థిమితంగా నిద్ర లేచేం.
అన్నిటికన్నా పై అంతస్థులో ఉన్న రెస్టారెంటులో బ్రేక్ ఫాస్టు చేసి, అక్కణ్ణించి కనిపిస్తూన్న నగర సౌందర్యాన్ని ఆస్వాదించేం.
పై నించి కార్లన్నీ చిన్న బొమ్మ కార్లలా కనిపించసాగేయి. దగ్గర్లోని నాలుగు రోడ్ల కూడలిలో సిగ్నల్ పనిచెయ్యడం మానేసినట్లుంది.
కార్లన్నీ ఒక క్రమ పద్ధతిలో ఒక దాని తర్వాత ఒకటి వెళ్తున్నాయి. అమెరికాలో సిగ్నళ్లు పనిచెయ్యక పోతే స్టాపు సిగ్నల్ పద్ధతిని పాటించాలి. అంటే ఒక్కొక్క కారు చొప్పున ఎవరు ముందు వచ్చి సిగ్నల్ దగ్గర ఆగితే, వాళ్లు వెళ్లాలి.
ఎక్కడా పొరబాటున కూడా ఇద్దరు వచ్చి కూడలిలో గొడవ పడకుండా ఎవరి దారిన వారు క్రమ శిక్షణతో వెళ్తూన్న దృశ్యాన్ని పై నించి పిల్లలకు చూపించి, “ఇతర గ్రహాల నించి ఏలియన్సు వస్తే ఈ క్రమశిక్షణకి మురిసిపోతారు ముందు” అన్నాను.
“ఏలియన్సు వరకూ ఎందుకు? భూగోళానికి అవతలి నుంచి వచ్చిన మనమే మురిసిపోవట్లే” అన్నాడు సత్య.
“ఇక్కడి నుంచి హార్బరు అనిపించడం లేదు గానీ, లేకపోతే మమ్మీ కవిత్వం రాయడం మొదలు పెడ్తుంది” అంది వరు.
మొత్తానికి పదకొండు గంటల వేళకల్లా మా సామాన్లు సర్దుకుని హోటలు పార్కింగులో మా కారు వదిలేసి, హోటలు షటిల్ లో పోర్టుకి చేరుకున్నాం.
మంచి ఎండగా ఉండడం వల్ల సముద్ర తీరంలో ఆహ్లాదంగా ఉంది.పోర్టు లో మా షటిల్ మమ్మల్ని దించే చోటనే సూట్ కేసులని ట్యాగులతో కట్టి షిప్పులోకి కేబిను లగేజీ గా తీసుకునే సౌకర్యం ఉంది. మేం కాస్త ఎక్కువ టిప్పు ఇచ్చేసరికి షటిల్ డ్రైవరు దిగి వచ్చి మా లగేజీనంతటినీ దించడానికీ, షిప్పు కేబిను లగేజీ కార్టులలో ఎక్కించడానికీ సహాయం చేసేడు.
ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.
పోర్టు ఎంట్రెన్సు పెద్ద డోమ్ ఆకారంలో ఆకర్షణీయంగా ఉంది. ఆ పక్కనే పెద్ద షిప్పు కనిపిస్తూండడంతో అదే మా షిప్పని అనుకున్నాం. కానీ తర్వాత అర్థమయ్యింది. అది హోటలుగా మలిచిన పాత షిప్పని.
ఇక గ్లోబు లోని ఎంట్రెన్సుకి బయటి నించే పెద్ద లైను, సెక్యూరిటీ ఉన్నాయి.
విమాన ప్రయాణానికున్న హంగులన్నీ ఉన్నాయి. విమాన ప్రయాణపు చెకింగు పాయింటు లాగే ఇక్కడా వాటర్ బాటిల్సు నిషిద్ధం కనుక మాతో తెచ్చిన వాటర్ బాటిల్సు అక్కడ పడెయ్య వలసి వచ్చింది. లైన్లలో వరసగా వెళ్లి టిక్కెట్లు చూపించడం వరకూ సజావుగా జరిగాయి.
ఇక మాకు బోర్డింగు పాసులు ఇవ్వడానికి పాసుపోర్టులు, వీసా కాగితాలు పుచ్చుకుని కౌంటరు లోని వ్యక్తి మమ్మల్ని అరగంటకి పైగా నిలబెట్టేడు. లోపలికి వెళ్లడం, ఎవరితోనో మాట్లాడడం మళ్లీ వచ్చి ఇంకెవరితోనో మాట్లాడడం, మళ్లీ లోపలికెక్కడికో వెళ్లడం…మాకు నీరసం రావడం మొదలు పెట్టింది.
మా పక్క కౌంటరులన్నీ గబగబా కదిలిపోతున్నాయి. మొత్తానికి మా టిక్కెట్ల మీద స్టాంపు ముద్రించి బోర్డింగు పాసులు చేతికిచ్చి “హావ్ ఎ నైస్ జర్నీ” అన్నాడు కౌంటరు లోని వ్యక్తి.
“హమ్మయ్య” అని ఊపిరి పీల్చుకుని అక్కణ్ణించి లిప్ఠు ఎక్కి పై అంతస్థుకి వెళ్లేం. డోము బిల్డింగు దాటి చిన్న బ్రిడ్జి మీద ప్రవేశించాం.
ఎదురుగా పదంతస్థుల భవనం కనిపించింది. చుట్టూ నీటిని చూస్తే మాత్రమే అది భవనం కాదు అందంగా నీటి మీద ఠీవిగా తేలియాడే అతి పెద్ద నౌక అని అర్థం అవుతుంది.
బ్రిడ్జి దాటి నౌకలోని ఆరో అంతస్థులోకి ప్రవేశించాం.చుట్టూ బంగారు రంగు లతలతో, ఎర్ర కార్పెటుతో, ఖరీదైన సామగ్రితో విలాసవంతమైన నౌక గొప్ప ఇంద్ర భవనంలా ఉంది లోపల.
ఏదో ఫైవ్ స్టార్ హోటల్ లోకి ప్రవేశించినట్లు మధ్య హాలులోంచి చుట్టూ కనిపిస్తున్న అంతస్థులు, గ్లాస్ లిఫ్టు.
గుమ్మం దగ్గిరే పూర్తిగా తువ్వాళ్లతో తయారు చేసిన దుస్తులలో పెద్ద ఏనుగు ఆకారపు మనిషి చిన్న పిల్లలకు ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాడు.
పిల్లలు ఫోటోలు తీసుకుంటుండడంతో సిరి అటు దుముకింది “ఆఫెంట్” (ఎలిఫెంట్ ని సిరి “ఆఫెంట్” అంటుంది) అంటూ.
అక్కడి ఫోటో గ్రాఫర్తో బాటూ నేనూ ఫోటో తీసేను. చప్పున నా దగ్గిరికి వచ్చి అలా వాళ్లు ఫోటోలు తీస్తున్నపుడు అదే ఫోజులు మేం తియ్యకూడదని చెప్పేడు ఫోటోగ్రాఫర్. ఎందుకనేది చివరిరోజు అర్థమయ్యింది. ఇలా అక్కడక్కడా తీసిన ఫోటోలని ప్రింటు చేసి అమ్మకానికి పెడతారు.
ఒక్కొక్క కాపీకి పదిహేను డాలర్ల చొ.న వసూలు చేస్తారు. అదీ సంగతి. మేం ప్రవేశించిన అంతస్థులో పై నించి సూర్యకాంతి లోపలికి పడేటట్లు పై డూముకి అద్దాలు బిగించి ఉన్నాయి.
ఎదురుగా హాలు మధ్య చుట్టూ ఎత్తు కుర్చీలతో బార్ ఉంది. చుట్టూ ఉన్న రకరకాల గిఫ్ట్ షాపులకు, ఈ బార్ కు మధ్య ఉన్న ఎత్తు వరండాలో నిలబడి మధ్య కనిపిస్తూన్న అంతస్థుల గుండా పైకి చూసినా, కిందికి చూసినా వేనవేల నక్షత్రాలు తల చుట్టూ తిరుగుతున్నట్లు కాంతుల తళత్తళలు. అందులో అడుగడుగూ అత్యద్భుతం.
బార్ దగ్గర ఉన్న చిన్న స్టేజీ దగ్గిర గంటకోసారి గిటారు ఆర్టిస్టులు వచ్చి మంచి సంగీతం వాయిస్తూ పాటలు పాడుతూ చుట్టూ అందరినీ అలరిస్తున్నారు.
ముందుగా మా గదికి వెళ్లి, సామాన్లు భద్రపరుచుకుని, భోజనం చేసి వచ్చి, ఆ రోజంతా అసలు షిప్పులో ఒక్కో ఫ్లోరు తిరిగి విశేషాలన్నీ ఒక రౌండు చూసి రావాలని అనుకున్నాం.
షిప్పులో మేం ప్రవేశించిన అంతస్తుకి దిగువన ఉన్న అంతస్తు మాంచి ఖరీదైన గదులతో కూడినది. నాలుగు, మూడు అంతస్తుల లో ఉన్న రెండు వందల గదులలో సముద్రం కనిపించే అంచుల వైపు ఉన్న గదులు, సముద్రం కనిపించని వైపు గదుల కంటే కాస్త ఎక్కువ ఖరీదైనవి.
షిప్పులో దాదాపు 75% ప్రయాణీకులు అక్కడే బస చేసినట్లు ఎక్కడా ఖాళీ లు లేవు. అంతకు కింది అంతస్తు నౌకా సిబ్బంది నివాసం. ఆ అంతస్తుకి, దిగువన నౌకా యంత్రాంగం. అందు లోకి సిబ్బందికి తప్ప ఎవరికీ ప్రవేశం లేదని రాసి ఉంది.
నాకైతే షిప్పులో పనిచేసే మిత్రులో, చుట్టాలో ఉంటే బావుణ్ణు ఆ అంతస్తులు కూడా చూసి రావడానికి అని అనిపించింది.
ఇక మూడో అంతస్తు లో సముద్రం కనిపించే వైపు ఉన్న గది మాది. అంతే కాకుండా ఫామిలీ రూము. బహుశా: అన్ని గదులకూ పరిమాణం ఒక్కటే. ఫామిలీ రూములో డబల్ బెడ్డు పైన, పక్కన మరో రెండు సింగిల్ బెడ్లు గాలిలో వాల్చుకుని పడుకునే అవకాశం ఉంది.
నిజానికి ఇద్దరు పిల్లలతో మాకు ఆ గదిలో బెడ్లు ఎక్కువే అని చెప్పాలి. మరో ఇద్దరు పెద్ద వాళ్ళు కూడా మాతో బాటూ ఉండొచ్చు. గది మొదట్లోనే అతి చిన్న బాత్రూము. కానీ అమెరికాలోని ఏ మంచి ఖరీదైన హోటల్ కు తీసిపోనట్లు దీటుగా ఉన్నాయి ఆ గదిలోని ఏర్పాట్లు. గోడకి చిన్న టీవీ కనిపించగానే పిల్లలు ప్రోగ్రాములు చూద్దామని సంబరపడ్డారు.
కానీ అందులో కేవలం షిప్పు కు సంబంధించిన లోకల్ చానల్సు మాత్రమే వస్తున్నాయని చూసి నిరాశ పడ్డారు.
కానీ నిజానికి గదిలో నుంచి బయటకు అడుగు పెట్టిందగ్గర్నించి ఎదురయ్యే ఎన్నో విశేషాల మధ్య అసలు గదుల్లో కూచోవడానికే సమయం చాలదని అర్థమయ్యింది మాకు.
(ఇంకా ఉంది)
-కె .గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~