మెక్సికో నౌకా యానం- భాగం-1
అమెరికాలో ఇప్పటి వరకు మేం కార్లలోనూ, విమానాల్లోనూ తిరిగే టూర్లకే వెళ్ళేం. కానీ జల యాత్ర చెయ్యలేదు. అంటే చిన్న బోట్లలోనో, పడవల్లోనో ఆ రేవు నించి ఈ రేవు వరకూ ఎక్కి దిగడం కాదు. సముద్రం మీద రోజుల పాటు ప్రయాణం చేసే నౌక యాత్ర. గాంధీ ఆత్మకథ లో ఆయన మూడేసి నెలలు నౌక యానం చేసిన సందర్భాలు చదివినప్పుడల్లా, నౌకా యాత్ర ఎలా ఉంటుందోననే కుతూహలం కలుగుతూ ఉండేది.
అమెరికాలో పాపులర్ టూర్లలో క్రూయిజ్ టూర్ ఒకటి. ఇది కోట్లలో వ్యాపారం. కార్నివాల్, డిస్ని మొ.న ప్రతిష్టాత్మకమైన క్రూయిజ్ కంపెనీలు దాదాపు పది అంతస్థుల అపార్టుమెంట్లంత అతి పెద్ద నౌకలమీద విహార యాత్రలు నిర్వహిస్తూ ఉంటాయి.
ఆసక్తి ఉన్నా, క్రూయిజ్ అంటే నాకు ఒక విధంగా భయం. ఇంతకు ముందు ఒకట్రెండు సార్లు సముద్రంలోకి అరగంట, గంట టూర్లకి వెళ్ళిన ప్రతీ సారీ విపరీతమైన సిక్ నెస్ కి లోనయ్యి, వాంతులు పట్టుకున్నాయి. ఆ భయంతో ఇక సముద్రంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. పెద్ద షిప్పులలో అలాంటి సిక్ నెస్ ఉండదని సత్య నాకు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అనేదాన్ని.
అయితే సత్యకి, పిల్లలకి ఎన్నాళ్లుగానో క్రూయిజ్ కి వెళ్లాలని బాగా సరదా ఉండడంతో ఈ మధ్య సెలవులు వచ్చినపుడల్లా ఎక్కడికి వెళ్దాం? అనగానే క్రూయిజ్ అనడం మొదలు పెట్టేరు. దాంతో ఒక్క సారి వెళ్లి చూద్దామని నిర్ణయించుకున్నాను. జూన్, జూలై నెలలు వేసవి సెలవులు ఇక్కడ. ఏప్రిల్ లోనే పేచీ మొదలెట్టేరు. ఇక్కడ మామూలుగానే క్రూయిజ్ లకు గిరాకీ ఎక్కువ. చలికాలంలో అన్ని క్రూయిజ్ లూ తిరగవు. ఇక వేసవి సెలవుల్లో డిమాండ్ విపరీతం. ఏప్రిల్ లోనే టిక్కెట్ల కోసం ప్రయత్నించినా మాకు జూన్, జూలైలలో ఎక్కడా బుకింగు దొరకలేదు. చివరికి వెతగ్గా వెతగ్గా మొత్తానికి ఆగష్టు నెల మొదటి వారంలో దొరికాయి. ఎలాగూ ఆగస్టు రెండవ వారంలో స్కూలు తెరుస్తారు కాబట్టి ఫర్వాలేదనుకుని బుక్ చేసుకున్నాం. క్రూయిజ్ బుకింగుకి కాస్ట్ కో ఇతరత్రా మధ్యవర్తిత్వపు సైట్లలో కంటే తిన్నగా క్రూయిజ్ సైటులో బుక్ చేసుకుంటేనే చవక, పైగా మనకి కావలసిన ఫెసిలిటీలు కూడా దొరుకుతాయి. ఆలా మాకు సముద్రం కనిపించే కిటికీ ఉన్న గది కేవలం క్రూయిజ్ సైటు లోనే దొరికింది. ఇక టిక్కెట్లలో అతి తక్కువ నించి అత్యంత ఖరీదు వరకూ విభాగాలుంటాయి. అత్యంత ఖరీదైన గదులకు పర్సనల్ బాల్కనీ వంటి సదుపాయాలే కాకుండా, వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండే విభాగాలు కూడా ఉంటాయి. మేం ఎకానమీ ప్యాకేజీ తీసుకున్నా ఉన్న వాటిలో కాస్త బెస్ట్ గా ఉండే ఫామిలీ రూమ్ విత్, సీ వ్యూ తీసుకున్నాం.
అమెరికాలో క్రూయిజ్ లు అటు తూర్పున అట్లాంటిక్ సముద్రంలోనూ, ఇటు దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మెక్సికో లోనూ, ఇటు పశ్చిమాన పసిఫిక్ తీరం లోనూ యాత్రలకు తిరుగుతూ ఉంటాయి. ఇందులో మూడు రోజుల నించి, నెల రోజుల వరకూ సమయాలలో రకరకాల ప్రదేశాలు చూసేందుకు వీలు కలిపిస్తున్న రకరకాల నౌకా యాత్రలున్నాయి.
ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.
శాన్ ఫ్రాన్సిస్కో పేరు గాంచిన నౌకా తీరం. పైగా మేమున్న బే ఏరియా నించి గంట దూరంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడి నించే ఆ యాత్ర ఏదో చేద్దామని ముందు ఇక్కడి నుంచి తిరిగే యాత్రల పట్టిక వెతికాం. అందులో తొమ్మిది రోజుల నించి పై చిలుకే ఉన్నాయి యాత్రలన్నీ. పిలలకైతే సెలవులు గానీ, మా ఇద్దరికీ మహా అయితే అయిదు రోజుల కంటే సెలవు దొరకదు. పైగా అన్నేసి రోజులు నౌకా యాత్రలంటే తక్కువ ఖరీదు కూడా కాదు.
మేం వెతికిన 3-5 రోజుల టూర్ల లో లాస్ ఏంజిల్సు నించి బయలుదేరే మెక్సికో క్రూయిజ్ అన్నిటికీ అనువుగా అనిపించింది మాకు. మూడు రోజుల యాత్రలో లాంగ్ బీచ్ నించి బయలుదేరి మెక్సికో లో ఎన్ సినాడా వరకూ వెళ్లి, ఒక రోజు ఆ ఊర్లో హాల్టు వేసి, తిరిగి తీసుకు వస్తారు. నాలుగు రోజుల యాత్రలో మధ్యలో ఒక రోజు కేటలీనా ద్వీపం కూడా చూపిస్తారు. కేటలీనా మేం ఇది వరకే చూసినందువల్ల మూడు రోజుల క్రూయిజ్ నే ఎంపిక చేసుకున్నాం. ఎలాగూ అటూ ఇటూ రెండు రోజులు రానూ పోనూ మా ఊరి నించి లాస్ ఏంజిల్సు వరకూ డ్రైవ్లో పోతుంది.
ఇక బుక్ చేసుకునే ముందు వచ్చిన ముఖ్యమైన సందేహాల్లో మొదటిది వీసా సమస్య. మెక్సికో అంటే అమెరికా సరిహద్దు దేశం. సరిహద్దు దాటి వెళ్లడం వల్ల ఒకసారి అక్కడ పోర్టులో దిగి మళ్లీ అమెరికా భూభాగంలో అడుగుపెట్టాలంటే వీసా తప్పనిసరి. ఇండియా నుంచి ఉద్యోగరీత్యా వచ్చినా, విజిటింగుకి వచ్చినా తాత్కాలిక వీసా కిందే లెక్క. తాత్కాలిక వీసా లో ఉన్న వాళ్లు బోర్డరు దాటి వెళ్తే ముందే క్యాన్సిలేట్ నించి అధికారిక అనుమతి ఉండాలా? అవసరం లేదా? అనేది మా సందేహం. టిక్కెట్లు బుక్ చేసుకునే ముందే రకరకాల సైట్లు చదివేం. తెల్సిన ఒకరిద్దరిని అడిగినా వారంతా ఇక్కడ సిటిజన్లు కావడంతో సరైన సమాచారం దొరకలేదు. టిక్కెట్లు అమ్మే సైటు సపోర్టు వాళ్లకి ఈ-మెయిల్ పెట్టి కనుక్కున్నాం. అంతా చెప్పేదీ ఒక్కటే నిబంధనలకు సరిపడే “వేలీడ్” వీసా ఉంటే చాలునని. నిబంధనలకు సరిపడే వీసా ఉన్నా, మాకొచ్చిన సందేహం ఏవిటంటే మళ్లీ కాన్సిలేటుకి వీసా స్టామ్పింగుకి వెళ్ళాలా? అని. అది మాత్రం ఎవరూ చెప్పలేకపోయారు. ఇక అయ్యేదేదో అవుతుందని ధైర్యంగా బుక్ చేసేసుకున్నాం. ఈ వీసా తమాషా ఏం జరిగిందో అక్కడి వరకూ వచ్చేక వివరిస్తాను. కానీ ప్రయాణానుభవం వల్ల తెలిసినదేవిటంటే అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్లు, సిటీజన్లు కాక ముందు దేశం దాటి వెళ్లే ఇలాంటి టూర్లకి వెళ్లకపోవడమే మంచిదని.
ఇక తరువాతి సందేహం ఖరీదుకి సంబంధించి. ఆన్ లైనులో చూపిస్తున్న టిక్కెట్టు ఖరీదు మనిషి చొప్పున. అందులో మా ఎకామిడేషను కలుస్తూందా? లేదా మళ్లీ ఎకమడేషను కొనుక్కోవాలా? అనేది మా ప్రశ్న. మొత్తానికి కనిపెట్టినదేవిటంటే ఆ టిక్కెట్టు లోనే ఎకమడేషను కలుస్తుంది. అంతే కాదు ఇంకొక ఆనందదాయకమైన విషయమేవిటంటే మేం వెళ్ళిన కార్నివాల్ క్రూయిజ్ లో ఫుడ్ కూడా ఆ టిక్కెట్టులోనే భాగం. విడిగా కొనుక్కోనవసరం లేదు. ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. తాగడానికి మాత్రం రోజు మొత్తానికి కలిపి ఒక్కో టిక్కెట్టు చొప్పున విభాగాల ప్రకారం ఉన్న ఖరీదు టిక్కెట్లు కొనుక్కోవాలి. ఈ టిక్కెట్లు ఆల్కహాలు తాగే వారికి ఉపయోగకరం. రోజు మొత్తం మీద కొనుక్కున ఒక్క టిక్కెట్టుతో ఎన్ని సార్లయినా తాగొచ్చు. మాలా కూల్ డ్రింకులు తాగే వారికి అసలు అలాంటి టిక్కెట్టు అనవసరం. ఎందుకంటే అక్కడ ఫుడ్ కౌంటర్లలో కూల్ డ్రింకులు, జ్యూసులు ఎడాపెడా తాగొచ్చు. ఇది తెలియక మేం మొదటే నాలుగు రోజులకి ఫామిలీ లో ప్రతీ ఒక్కరికీ జ్యూస్ టిక్కెట్లు కొనేసాం.
ఇక ఇన్సూరెన్సులు, టిప్పులు వగైరా కూడా టిక్కెట్టుతో బాటే కట్టేసరికి మా ఇద్దరికీ , పిల్లలిద్దరికీ కలిపి దాదాపు రెండు వేల డాలర్లు వదిలాయి. అయినా అనంత సాగరపు అలల మీద రేయింబగళ్లు కలల రెక్కలు సాచుకుని విహంగాల్లా స్వేచ్ఛగా తేలియాడాలన్న ఔత్సాహిక మానసాలకి వెలకట్టలేని ఆనందమే ఒక పరమాంబుధి కదా!
ఇక షిప్పులోని ఆటపాటలూ, చూడాల్సిన విశేషాలూ వెబ్సైటుల్లో ఎంత చదివినా కళ్లారా చూస్తే గానీ అర్థం కానంత విశేషమైనవి.
షిప్పులో ఒక రాత్రి ప్రత్యేకించి భోజనానికి వేసుకోవల్సిన ఫార్మల్ డ్రెస్సుల కోసం షాపింగుతో మా ప్రయాణం హడావిడి మొదలయ్యింది.
మొత్తం మూడు రోజుల షిప్పు ప్రయాణానికి లాస్ ఏంజల్సు వరకూ రెండు రోజులు అటూ ఇటూ మా ప్రయాణం కలుపుకుంటే మొత్తం అయిదు రోజులకు సరిపడా తలా ఒక బాగు సర్దుకున్నాం.
ఆగస్టు నెల మొదటి వారంలో ఇంకా వేసవి వేడిమి ఉండి, నును వెచ్చగా ఉండి ఆహ్లాదంగా ఉంటుందిక్కడ. చక్కగా తేలికపాటి దుస్తులు వేసుకుని హాయిగా తిరొగొచ్చు. ఇక షిప్పులో ఉండే స్విమ్మింగు యాక్టివిటీల కోసం అంతా స్విమ్మింగు డ్రెస్సులు, మరో నాలుగైదు జతల లోదుస్తులు సర్దుకోవడం మర్చిపోలేదు.
షిప్పులో ఇచ్చిన లిస్టులో ఉన్న ఏ యాక్టివిటీలోనూ పాల్గొనే మనస్తత్వం లేని నేను షిప్పు డెక్ మీద కూచుని హాయిగా చదువుకుందుకు ఇటీవలే ఒక మిత్రురాలు బహుమతిగా ఇచ్చిన బిపిన్ చంద్ర “సహవాసి” పుస్తకాన్ని తోడుగా తీసుకెళ్లేను. లాంగ్ డ్రైవ్ లకి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు సత్య, నేను పుస్తకాల్ని ఒకళ్లు చదువుతూంటే మరొకళ్లు వింటూ డ్రైవ్ చేస్తూ ఉంటాం.
ఈ ప్రయాణంలో నౌకాయానంలోనూ, కారు ప్రయాణంలోనూ ఈ పుస్తకం మాకు నిజంగా సహవాసి అయింది.
గురువారం సాయంత్రం అయిదు గంటలకు షిప్పు బయలుదేరుతుంది. కానీ ఒంటి గంటకే బోర్డింగు ప్రారంభమయ్యిపోతుంది. మా ఇంటి నుంచి లాస్ ఏంజల్సు అయిదారు గంటల డ్రెవ్ లో ఉంటుంది. అక్కడి నుంచి షిప్పు ఎక్కాల్సిన పోర్టు లాంగ్ బీచ్ మరో గంట. అయితే ఎక్కడ ట్రాఫిక్ జాములో ఇరుక్కున్నా సరైన సమయానికి చేరడం కష్టం. ఇక అదే రోజు తెల్లారగట్ల ఇంటి నుంచి బయలుదేరి చిన్న పిల్లల్తో హడావిడి పడడం ఎందుకని ముందురోజే లాస్ ఏంజల్సుకి చేరుకున్నాం.
ఇక కారు పార్కింగుకి లాంగ్ బీచ్ పోర్టులో మూడు రోజుల పాటు కట్టే డబ్బులు ఆదా చెయ్యడం కోసం అసలు ఇలా షిప్పు ప్రయాణాల ట్రాన్స్ పోర్టు కనెక్టివిటీ అందించే హోటలులోనే బస చేసేం. ఆన్ లైనులో వెతికితే వచ్చే ఆప్షన్ లలో మాకు బాగా నచ్చే హిల్టన్ గ్రూప్ హోటల్సులో ఒకటి దొరికింది. అక్కడ ఒక రోజు ఎకామడేషనుతో బాటూ ఇలా క్రూయిజ్ వెళ్లే వాళ్లకి కారు పార్కింగు ఫ్రీ.
ఎప్పటిలానే రోజంతా నవ్వుతు, తుళ్ళుతూ కారు ప్రయాణాన్ని ఆహ్లాదంగా అనుభూతిస్తూ లాస్ ఎంజిల్సుకి చేరేం.
అలా ముందు రోజు వెళ్ళడం వల్ల కారు ప్రయాణపు బడలిక తీరి మర్నాడు షిప్పు ప్రయాణానికి ఉత్సాహంగా తయారయ్యేం.
(ఇంకా ఉంది)
-కె.గీత
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~