అల చిన్న ఊరిలో.. అందాల ముగ్గుల పోటీలు – కె. వరలక్ష్మి

ఈ సంవత్సరం భోగి ముందు రోజు పోర్టికోలో కూర్చుని ఏదో పత్రిక చదువుతున్నాను. గేటు తెరుచుకుని నలుగురు టీనేజ్ అబ్బాయిలు లోపలికి వచ్చారు. ముఖాల్లో పల్లెటూళ్లలో పెరిగిన పిల్లల్లో ఉండే బిడియం కన్పిస్తోంది.
సంశయంగా చూస్తూ ‘మేడమ్, మా ఊళ్ళో రేపు ముగ్గులపోటీ పెట్టాలనుకుంటున్నాం. మార్కులు వెయ్యడానికి మీరు రాగలరా..’ అన్నారు. అందరూ కూడబలుక్కుని
‘ ఏ ఊరు?’
‘బలభద్రపురం’
‘అనపర్తి దగ్గరదా?’
‘కాదండీ ఇక్కడే కొత్తూరు దగ్గరది’
‘మీరేం చేస్తుంటారు?’
‘మేం ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్నామండీ. మా పేర్లు శ్రీనివాస్, కణేశ్, విష్ణు, అశోక్. మొదటిసారిగా ఊళ్ళో ఏదైనా చెయ్యాలన్పించి కుర్రాళ్ళం పూనుకున్నాం. అది విని పెద్దవాళ్ళంతా అంగీకరించి తలో చెయ్యీ వేశారు. పంట ఇంటికొచ్చిన కోతరోజులు కదాండీ,’ అందులో ఒకబ్బాయి హుషారుగా అన్నాడు.
జగ్గంపేటలో ఎక్కడే పోటీలు జరిగినా వెళ్ళి మార్కులు వెయ్యడం అలవాటు.
‘సరే’ అన్నాను.

భోగిరోజు ఉదయం పదిన్నర అన్నది పదకొండున్నరకి కణేశ్, విష్ణు, కలిసి ఆటో తీసుకుని వచ్చారు. టైం పాటించలేదని కోప్పడాలనుకుని కొత్తపిల్లలు బెదిరిపోతారని ఊరుకున్నాను.

‘ముగ్గు వెయ్యడం పూర్తయ్యేసరికి మిమ్మల్ని తీసుకెళ్దామని అనుకున్నామండీ, మనం వెళ్ళేసరికి పూర్తవుతాయి అన్నాడు కణేశ్ సంజాయిషీగా. విష్ణు చనువుగా నా చేతిలోంచి తాళం కప్పలు తీసుకుని ఇంటికి, గ్రిల్స్ కి తాళాలు వేశాడు.
మరొకరెవరైనా ఉంటే బావుంటుందని మా దగ్గర్లో ఉన్న అంగన్ వాడీ ఆయాను పిల్చుకెళ్ళాను.

మా ఊరికి ఉత్తరంగా మన్యంలోకి వెళ్ళేవైపు మొదటగా తగిలేది కొత్తూరు. జగ్గంపేట ఊరు అటువైపుగా పెరుగుతూండడం వలన ఇంచుమించు జగ్గంపేట అంచులో ఉంటుంది. కొత్తూరు ఊరి మధ్యనుంచి ఆటో కుడివైపు మట్టిరోడ్డుకి మలుపు తిరిగింది. కోతలు ముగిసిన వరిచేలు గడ్డిదుబ్బుల్తో బూడిదరంగులో ఉన్నాయి. ఆ చేలమధ్య గతుకుల రోడ్డులో ఐదు కిలో మీటర్లు పైగా వెళ్తే బలభద్రపురం చేరుకున్నాం. ఎల్(L) ఆకారంలో ఉన్న అతి చిన్నఊరు. అన్నీ కలిపి ఓ వంద గడపలు ఉంటాయో లేదో! కాని, శుభ్రంగా పచ్చగా పూలమొక్కల్తో అందంగా ఉంది.

ఊరి మొదట్లో ఆటోదిగి ఒకొక్క ముగ్గునూ చూసుకుంటూ అవతలి రోడ్డు చివరివరకూ వెళ్ళి తిరిగి రెండో పక్క చూసుకుంటూ మొదటిముగ్గు దగ్గరకొచ్చాను. అదే విధంగా మరోసారి చూస్తూ మార్కులు వేస్తూ వెళ్ళాను. మొదటి సారి పరిశీలనలో నన్ను పిలిచిన అబ్బాయిలు వెంట వచ్చారు. హఠాత్తుగా ఓ పెద్దాయన రోడ్డు మీదకొచ్చి ‘మీరు ఎంట ఉండి మీ వోళ్లకి మార్కులేయించేత్తారా’ అంటూ కేకలు మొదలుపెట్టాడు. పెద్ద గొడవ పెట్టేస్తాడేమో అన్పించింది. నిజానికి వాళ్ల వాళ్ళు కూడా ముగ్గులేసారని ఆ పిల్లలు చెప్పనే లేదు. నేను అబ్బాయిల్ని రావొద్దని చెప్పి ఆయన దగ్గరకెళ్ళి సాత్త్వికంగా మాట్లాడి శాంతపరిచాను.

మొదటిసారి వాళ్ల ఊళ్ళో ఈ పోటీలు జరుగుతూండడం వలన ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయో చూడాలని ఉత్సుకత అందరిదీ. నాతో ఉన్న మరొకామె అభిప్రాయం కూడా తీసుకుంటూ మార్కులు వేసేసాను. మొత్తం 28 ముగ్గులు.
ఊరి మధ్య రోడ్డు పక్కనే ఉన్న వినాయకుడి గుడి అరుగుమీద మాకు కుర్చీలు వేసి, పళ్లరసాలిచ్చి మర్యాద చేశారు. యువకులు సరే, ఊరిపెద్దలు కూడా మమ్మల్ని గౌరవంగా ఆదరించారు. నేను ఊరు గురించి వివరాలడిగాను. ఊరికి విడిగా పంచాయితీ లేదట. గుర్రప్పాలెం పంచాయితీలో కలిసి ఉంటుందట. ఓ ఎలిమెంటరీ స్కూలు, అంగన్ వాడీ కేంద్రం ఉన్నాయట. 5వ తరగతి తర్వాత హైస్కూలు చదువుకోసం జగ్గంపేట గవర్నమెంట్ హైస్కూలుకో, ప్రైవేటు స్కూల్స్ కో వెళ్లాల్సిందేనట. ఇంటింటా సైకిలో, మోటార్ బైకో ఉన్నాయట. ఊళ్ళో ఎక్కడ బోరు తవ్వినా సుద్దనీరే పడుతుందట. అందుకని ఒకటే పెద్దబోరు తవ్వి ఇంటింటికీ వాడుకనీరు కుళాయిల ద్వారా అందిస్తున్నారట. తాగడానికి మాత్రం జగ్గంపేట నుంచి శుభ్రపరిచిన 20 లీటర్ల నీటి సీసాలు తెప్పించుకుంటారట.

మా ఊరికీ ఆ ఊరికీ మధ్యలో ఉన్న జటాద్రి కొండ మాత్రం ఇంకా క్షేమంగా నిలిచి ఉన్నందుకు ఆనందం కలిగింది. ఆ కొండ పైనున్న చింతచెట్టు కిందే చుట్టుపక్కల రైతులంతా వరికోతలయ్యాక పాలు పొంగించి రాజుల పండుగ చేసుకుంటారు.
ఓ పక్క ఊరిపెద్దలు, మరో పక్క యువకులు ఎదురు చూస్తున్నారు. ఇంకో పక్క ముగ్గులేసిన అమ్మాయిలు – కొందరు చీరల్లో, కొందరు చుడీదారుల్లో ఉన్నారు. పెద్దలుండడం వల్ల వాళ్ల తల్లులు గడపల లోపలి నుంచి తొంగి చూస్తున్నారు. నేలమీద రంగురంగుల ముగ్గులు, అందానికే అందాలద్దిన దృశ్యం. అన్ని ముగ్గులూ బావున్నాయి. తప్పదు కాబట్టి ముగ్గుర్ని ఎన్నుకున్నాం. ఆ మాటే చెప్పి ఎవర్నీ నిరుత్సాహపడద్దని చెప్పాను.

మొదటి బహుమతి గ్రైండర్, రెండో బహుమతి మిక్సీ, మూడో బహుమతి వెయ్యి రూపాయలు. పాల్గొన్న వాళ్లందరికీ ప్రోత్సాహక బహుమతులుగా అందమైన ఫ్లాస్టిక్ పెద్ద బాక్సులు ఇచ్చారు.

జగ్గంపేట పట్టణంగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో నెలరోజులుగా ప్రయత్నించినా అటుకులకోసం ధాన్యం దొరకలేదు. పర్స్ లో డబ్బులు తీసి ఓ రెండు కుంచాల ధాన్యం కొనిపెట్టమని ఓ అబ్బాయికి నెమ్మదిగా చెప్పానో లేదో అది విన్న రైతు ఒకాయన సంచితో మూడు కుంచాల ధాన్యం తెచ్చి మా ఆటోలో పెట్టాడు. ఎంత చెప్పినా డబ్బులు తీసుకోలేదు.

సమావేశం ముగిసేసరికి యువకులకోసం నేను పట్టుకెళ్ళిన పుస్తకాల్లోంచి నా కథ ‘పాప’ చదివి చక్కగా విశ్లేషించాడొకాయన. తాగుడు కుటుంబాన్ని ఎలా కూల్చేస్తుందో చెప్పి, రాబోయే తరాలైనా దానికి లొంగకుందా ఉండే కథలు రాయండి అని మంచి సలహా ఇచ్చాడు. అందరి ముఖాల్లో ఆనందం వెల్లి విరుస్తూండగా వెనుదిరిగి ఆటో దగ్గరకి నడుస్తున్నాం. మరో పెద్దాయన మొదటి బహుమతి వచ్చిన ముగ్గులోని ప్రత్యేకత ఏమిటి?’ అని అడిగి తెలుసుకున్నాడు.

ఈ బలభద్రపురానికి RTC బస్సు సౌకర్యం లేదు. అయినా ఆ ఊరి అబ్బాయిలు, అమ్మాయిలు ప్రైవేట్ స్కూలు బస్సుల్లో జగ్గంపేటకీ, వేరే ఊళ్ళకీ వెళ్ళి చదువుకుంటున్నారని తెలిసి ఆనందం కలిగింది. దిగబెట్టడానికి వచ్చిన అబ్బాయిల్తో ‘అమ్మాయిలంటే ముగ్గులే కాదు. ఇంకా మంచి మంచి విషయాల్లో పోటీలు పెట్టి ప్రోత్సహించండి. మీకేవైనా సలహాలు, సహాయం కావాలంటే నేనిస్తాను’ అన్నాను. ఈ సంవత్సరం భోగి పండుగ అలా పిల్లలమధ్య సంబరంలా గడిచింది.
తిరిగి వచ్చేటప్పుడు నాతో వచ్చిన ఆయమ్మ తన మెడలోని బంగారు గుళ్ల హారాన్ని అబ్బాయిలకి చూపిస్తూ ‘నేను అధికారపార్టీలో తిరుగుతాను. నేను ఉద్యోగం వేయించిన ఒక అబ్బాయి నాకు దీన్ని బహుమతిగా ఇచ్చాడు. ఎవరికైనా ఉద్యోగాలు కావాలంటే చెప్పండి, వేయిస్తాను’ అంది.

దీని భావమేమి తిరుమలేశ?

– కె. వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , Permalink

Comments are closed.