జ్ఞాపకం-18 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

డబ్బుంటే ఎక్కడైనా ఇల్లు కట్టించేవాళ్లని, పొలాలు కొనే వాళ్లని, పిల్లలకి లగ్జరీలైఫ్‌ని అలవాటు చేసేవాళ్లని, ఇంకా కావాలంటే ఖరీదైన డ్రిoక్‌ తాగి, విపరీతంగా తినేవాళ్లని చూస్తున్నాం. అసలు ఎక్కడ చూసినా వాళ్లే కన్పిస్తున్నారు. వంద ఎకరాలు సంపాయించి చనిపోయిన రైతు శవాలను కూడా వూరికి దూరంగా వుండే శ్మశానంలో వేసి వస్తున్నారు. వాటి మీద గుర్తుగా ఓ చిన్నరాయిని మాత్రమే పెట్టి వస్తుంటారు. కొంతమందినైతే ఎక్కడ వేసి వస్తారో కూడా తెలియదు. స్మశానంలో స్థలంలేక వేసిన చోటే వేస్తున్నారు. అదేం అంటే అలా ప్రతి ఒక్క శవానికి ప్రత్యేకమైన స్థలం కేటాయించాలంటే వూళ్లు వుండవు. శ్మశానాలే వుంటాయంటున్నారట… నానమ్మకి అప్పట్లో ఇలాంటి రియల్‌ ఎస్టేట్‌ ఆలోచనలు రాలేదేమో తాతయ్యను చనిపోయాక సొంత పొలంలోనే వేయించుకుంది. తను చనిపోయాక తనని తాతయ్య పక్కనే వెయ్యమని ` అలా వేస్తారో లేదో నన్న అనుమానంతో ఆమె చనిపోకముందే సగం సమాధి కట్టించుకుని చివరకి షుగరు వ్యాధితో చనిపోయింది. అయినా చనిపోయిన శవాలకి ఇంత రక్షణ అవసరమా! ఇదేం సాంప్రదాయం. మనుషులు మరీ ఇంత సెంటిమెంటల్‌గా ఎలా వుంటారో ఏమో! అని ఆలోచిస్తున్నాడు తిలక్‌.

‘‘ఏంటి అన్నయ్యా! ఆలోచిస్తున్నావ్‌! బస్‌ త్వరగా వస్తే బావుండు’’ అంది. ఎంతకీ రాని బస్‌ని తిట్టుకుంటూ. అదేం కాదు. ‘‘నీకోవిషయం చెప్పనా! ఎక్కడో తప్ప డబ్బు బలంతో తెగ బలిసిన వాళ్లను కూడా చనిపోయాక పంటపండే పొలాల్లో వెయ్యరు. అలా వేస్తే చివరకి పొలాల్లేకుండా సమాధులే ఉంటాయని… అయినా డబ్బు బాగా ఎక్కువయిన వాళ్లు కూడా ఇలాంటి మతిలేని పనులు చెయ్యరు.’’ అన్నాడు. తను ఎంత అడిగినా డబ్బులివ్వని తండ్రి మీద వున్న కోపాన్నంతా తాతయ్య వాళ్ల సమాధుల మీద చూపిస్తూ…

‘‘నీ పరిశీలన తప్పో, రైటో నాకు తెలియదు కాని వేల అడుగుల భూమిని సంపాదించి ‘ఈ భూమ్మీద చూడు నేనెంత నేను సంపాదించానో’ అని అరిచిన వాళ్లకి కూడా చివర్లో ఆరు అడుగుల నేలే అవసరం అవుతుంది. అయినా ఎక్కడో తాజ్‌మహల్‌ వుందని అన్ని చోట్లా వుంటుందా అన్నయ్యా? ఇప్పుడు నాన్న చేస్తున్న పని కూడా అలాంటిదే’’. అంది. ఆమెకు ఎప్పుడైనా తండ్రి చేసే పనులు నచ్చుతాయి. తండ్రికే సపోర్టు చేస్తుంది. ఆయన్ని ఎవరేమన్నా ఒప్పుకోదు.

‘‘నా కళ్లకి తాజ్‌మహల్‌, చార్మినార్‌ కన్పించడం లేదు. నాన్న చేస్తున్న డబ్బు దుర్వినియోగం కన్పిస్తోంది. అదీ సరదాకి, సంతోషాలకి వాడుకోవలసిన డబ్బును తీసికెళ్లి ఎప్పుడో చనిపోయిన వాళ్ల తల్లి, దండ్రుల సమాధుల్లో పొయ్యటం, ఇది ఎంతవరకు కరెక్టో చెప్పు !. కడుపు రగిలిపోతోంది’’ అంటూ పొట్టకేసి కొట్టుకున్నాడు.

‘‘నువ్విలా అంటావనే మొద్దు పోయ్య డబ్బులిచ్చిన విషయం నాన్న నీతో చెప్పలేదు. చెబితే ఆ డబ్బుతో నువ్వు బైక్‌ కొనిమ్మనే వాడివి… నాన్నను నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో ఏమో !’’ అంది.

‘‘బైక్‌ కొంటే హాయిగా దానిమీద తిరగొచ్చు. నాన్న చేస్తున్న పని వల్ల ఏమొస్తుందో చెప్పు ?’’ అన్నాడు.

‘‘ఎవరైనా చేసే ప్రతి పనికీ ఏమొస్తుంది? అని లెక్కలు చూసుకునే చేస్తున్నారా ? మరి జూదమాడితే ఏమొస్తుంది ? తాగితే ఏమొస్తుంది ? తిరిగితే ఏమొస్తుంది ? ఇవన్నీ చేసే వాళ్లంతా ఏమో వస్తుందనే చేస్తున్నారా? ఇంతెందుకు దిలీప్‌ వాళ్ల నాన్న గారు జూదంతో తన జీతం డబ్బులన్నీ పోగొట్టుకొని భార్య జీతం డబ్బుల్ని ఎన్నిసార్లు దొంగతనం చెయ్యలేదు? గతంలో దిలీప్‌కు ఆకలయినప్రతిసారి ఏదో ఒక ఫంక్షన్‌ హాల్‌కి వెళ్లి తినిరావడం మనకి తెలుసు. ఇదంతా వాళ్ల నాన్న జూదం వల్ల ఏర్పడిన దరిద్రమేగా ! జూదగాడిలో దొంగ తప్పకుండా వుంటాడట.

కాని మన నాన్న జూదగాడు కాదు, దొంగ కాదు. ఆయన చేస్తున్న పని ఎంతో ఉన్నతమైంది, ఉదాత్తమైంది. ఎందుకంటే నాన్న మనల్ని ప్రేమించినట్లే చనిపోయిన తన తల్లి, దండ్రుల్ని కూడా ప్రేమిస్తున్నాడు. అదే ఓ తండ్రి తాగుబోతో, జూదగాడో అయితే పిల్లల్ని ప్రేమించడు. కుటుంబాన్ని ప్రేమించడు. పైగా పిల్లలకి తిండికి ఖర్చు చేసే డబ్బు కూడా తనకే వుంటే ఇంకొంచెం తాగొచ్చనో ! ఇంకొంచెం జూదం ఆడొచ్చనో చూస్తాడు. కాని మన నాన్న జూదం ఆడడం లేదు. తాగటం లేదు. ఇంకేమో చెయ్యటం లేదు. చెడు అలవాట్లున్న తండ్రి వల్ల వచ్చే కష్టనష్టాలు మనకు లేవు. మన ఫ్రెండ్స్‌లోనే చాలా మంది తమ తండ్రుల ద్వారా ప్రేమాభిమానాలు అందని వాళ్లే వున్నారు. వాళ్ల కన్నా మనమెంతో మెరుగ్గా వున్నాం. నాన్నను నువ్వు అర్థం చేసుకో…’’ అంది.

తిలక్‌ ఆమె మాటల్ని వినకుండా ‘‘అయినా తాతయ్య మనకి ఇచ్చింది మామూలు కొంప. రెండెకరాల భూమి. దీనికే నాన్న తాతయ్య, నాన్నమ్మ పట్ల అంత కృతజ్ఞత చూపాలా?’’ అన్నాడు.

‘‘తాతయ్య విలువ నీకు తెలిసింది అంతవరకే . అందుకే నీ ఆలోచనలు కూడా అక్కడే ఆగిపోయాయి. అయినా నాన్న చేస్తున్న పనిలో వుండేది కృతజ్ఞత కాదు. ఆత్మతృప్తి. కృతజ్ఞత అనేది మనకు వాళ్లు ఏమిచ్చారు? ఎంత ఇచ్చారు? అని లెక్కలు కట్టుకుంటూ వ్యాపార కోణంలో చూసేది కాదు. అయినా నాన్నను వ్యతిరేక దృష్టితో చూడడం నీకు బాగా అలవాటైపోయింది. ఈ విషయంలో నువ్వు ఆయన్ని వేలెత్తి చూపకు. ఇబ్బంది పెట్టకు. కొందరు చేసే పనులకు కొన్ని విలువలు వుంటాయి. ఎందుకా విలువలు ? ఏం చేసుకుంటారు వాటిని? ఎందుకు పనికొస్తాయి అవి? అన్న ప్రశ్నతో కాకుండా దేన్ని ఎలా చూడాలో అలాగే చూడు. అప్పుడే మనం చేసే పనులు కూడా అందంగా కన్పిస్తాయి’’ అంది.
“లేకుంటే అందంగా కన్పించవా…? చిన్న చిన్న కథలు రాస్తూ, సీరియల్స్‌ రాస్తూ అన్నయ్యకే క్లాసు తీసుకుంటున్నావు. ఎంతయినా నేను నీకన్నా పెద్దవాడిని…’’ అని తిలక్‌ అంటుంటే ఆదిపురికి వెళ్లే బస్‌ రాకుండా ఆదిపురి నుండి వస్తున్న బస్సు వచ్చి ఆగింది. ఆ బస్‌ను చూడగానే ‘ఓ షిట్‌’ అంటూ తల పట్టుకున్నారు సంలేఖ, తిలక్‌. వాళ్లు ఎంత త్వరగా వెళ్లాలను కుంటున్నారో అంత ఆలస్యం అవుతోంది. వాళ్లకి తెలియకుండానే లోలోన కంగారు మొదలైంది. అయినా కూడా నిస్సహాయంగా చూడడం తప్ప మరో మార్గం లేదక్కడ…

అంతలో బస్‌లోంచి ఆదిపురికి సంబంధించిన మనుషులు కొందరు సుడిగాలిలా బస్‌దిగి ఆటోవైపు పరుగు తీస్తూ కన్పించారు. వాళ్లలో వున్న ఆ ఊరి సర్పంచి తిలక్‌ను, సంలేఖను చూసి ‘‘మీరింకా ఇక్కడే వున్నారా? వచ్చి ఆటో ఎక్కండి! మీ అన్నయ్యను 108 అంబులెన్స్‌లో ఎక్కించుకొని ఇదే సిటీలో వున్న గవర్నమెంట్‌ హాస్పిటల్‌కి తీసుకొచ్చారట. అది తెలిసి నేను మన వూరి వాళ్లను వెంటబెట్టుకొని వస్తున్నాను.’’ అంటూ సంలేఖను, తిలక్‌ను ఆటోలో ఎక్కించాడు.

ఆయన ఆ ఊరిలో ఎవరకి ఏ ఆపద వచ్చినా ఇలాగే స్పందిస్తాడు. ఆయన చేస్తున్న హడావుడిలో ఆత్మీయత వుంటుంది. ఎవరికి ఏ అవసరం వచ్చి‘అన్నా’ అంటే ‘వున్నా’అంటూ పరిగెత్తుకొస్తాడు.అందుకే ఆయన్ని చూడగానే ధైర్యం వచ్చింది తిలక్‌కి, సంలేఖకి… వాళ్ల దగ్గర బస్‌పాసు తప్ప ఆటో అతనికి ఇవ్వడానికి డబ్బుల్లేవు. అదంతా ఆ ఊరి సర్పంచిగారే చూసుకుంటారన్న నమ్మకంతో వున్నారు. హాస్పిటల్‌ రాగానే వాళ్లేకాదు ఆటోలోంచి ఎవరిపాటికి వాళ్లు దిగి పరిగెత్తుకుంటూ, కొంత మంది ముక్కు చీదుకుంటూ, మరికొంత మంది పైకే ‘అయ్యో ! వినీలా ! ఎంతపని జరిగిందే !’ అంటూ హాస్పిటల్‌లోకి ప్రవేశించారు. వాళ్లలో ఆదిపురికి పక్క ఊరైన వినీల వాళ్ల ఊరు కొండాపురం వాళ్లు కూడా వున్నారు. ప్రవాహానికి ఆనకట్ట వేసినట్లు డోర్‌ దగ్గర కాపలా వున్న వ్యక్తి ఒక్కొక్కరినే లోపలికి వెళ్లనిస్తున్నాడు. చాలామంది బయటే ఆగిపోయారు.

– అంగులూరి అంజనీదేవి
————————————————————————————————–

జ్ఞాపకం, ధారావాహికలు, , , , , Permalink

One Response to జ్ఞాపకం-18 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

  1. Nageswararao says:

    Reality కి చాలా దగ్గరిగా వున్న మీ serial చాలాబాగుంది.మీ serial చదివైనా ఈ సమాజం లో కొంత మందైనా మారాలని ఆశిస్తూ మీ అభిమాని,,,,,,