నా కళ్లతో అమెరికా-63-(యాత్రా సాహిత్యం )- కె .గీత

హానోలూలూ- హవాయి(చివరి భాగం)

మా హవాయీ యాత్రలో చివరి రోజది. హానోలూలూ నించి తిరిగి ఇంటికి వెళ్లాల్సిన రోజు. రాత్రి తొమ్మిది గంటల వేళ మా తిరుగు ప్రయాణపు ఫ్లయిటు. ఆ రోజు హోటలు ఖాళీ చేసేస్తాం కాబట్టి ఇక ఆ రోజు సముద్ర తీరంలో ఆటలు లేవు. దూరానికి వెళ్తే సమయానికి తిరిగి రావడం కష్టం కాబట్టి ఆ రోజు దగ్గర్లో ఉన్న ముఖ్య విశేషాలు కాస్త త్వరగా చూసి రావాలని అనుకున్నాం. శనివారం కావడంతో అందరం తలస్నానాలు చేసి ముందు రోజు ఎబిసి స్టోర్లలో కొన్న హవాయీ తెల్ల టీ షర్టులు, దేవ గన్నేరు పూల దండలు వేసుకుని ఫోటోలు తీసుకున్నాం. బయట ఎత్తైన భవంతుల మీద వెలుగుతున్న తొలి సూర్య కిరణలు కాంతులన్నీ మా హృదయాలకి చేరినట్లు నవ్వుతూ తుళ్లుతూ సామాన్లు సర్దేం. పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికి వెళ్లడం ఎందుకో చాలా ఇష్టం. తిరిగి ఇంటికి వెళ్లగానే వరు ఎప్పుడూ “హోమ్ స్వీట్ హోమ్ , హియర్ ఇటీజ్” అంటుంది. అదొక కారణం కాగా అసలు హావాయీ లో చూడాలనుకున్న వాటిలో పెరల్ హార్బర్ చూడడానికి వెళ్లడం మరొక కారణం.

పెరల్ హార్బర్ : పది గంటల వేళ తిన్నగా పెరల్ హార్బర్ కు చేరేం. మా హోటలు నించి అరగంట వ్యవధిలోనే ఉంది పెరల్ హార్బర్. అమెరికా పశ్చిమ సరిహద్దు నౌకా దళ స్థావరం. రెండవ ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్ మీద జపాను దాడి చెయ్యడం వల్ల జరిగిన తరువాతి పరిణామాలు ఎవ్వరూ ఎప్పటికీ మరిచిపోగలిగినవి కావు.
పెరల్ హార్బర్ చరిత్రని పిల్లలకి చెప్తూ ముందుకు దారి తీసేం. హార్బర్ అంటే వరుసగా తేలే పడవలో, లోపలికి ఎంతో దూరం వరకూ సాగే జెట్టీలు ఉంటాయనుకున్నాను.

తీరా చూస్తే సముద్ర తీరాన్నానుకుని వరసగా షెడ్లు వేసి ఉన్న పార్కు లాంటి చోట ఆగేం. ఆమూల నించి ఈ మూల వరకూ కారు పార్కింగు స్థలాలే. అయినా ఎక్కడా ఖాళీ లేవు.

పొద్దున్నే అక్కడ రకరకాల టూర్ లు ప్రారంభమవడమే అందుకు కారణం. అక్కడ రకరకాల ఖరీదుల్లో రకరకాల టూర్లు ఉన్నాయి. అందులో అన్నీ చూడాలంటే ఒక రోజు ఖచ్చితంగా సరిపోదు. ఇక మేమనుకున్న కొద్ది గంటల కాలం అసలే సరిపోదు. తక్కువలో తక్కువ ప్రతీ టూరూకీ 3, 4 గంటల వ్యవధి పడుతుంది. అంతే కాదు ఆన్ లైనులో ఉదయపు టూర్లన్నీ అప్పటికే అమ్ముడయిపోయాయి కూడా.

అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అర్థమయినదేవిటంటే పెరల్ హార్బర్ లో ప్రధానంగా చూడవల్సిన టూర్ “యూఎస్ ఎస్ ఆరిజోనా నౌకా స్మృతి (USS Arizona)”. పెరల్ హార్బర్ మీద జరిగిన దాడిలో ముంచి వేసిన యుద్ధ నౌకల్లో అత్యధికంగా ప్రాణ నష్టం కలిగిన నౌక “యూఎస్ ఎస్ ఆరిజోనా”. మునిగిపోయి అక్కడే నీళ్ల కింద సమాధి అయిపోయిన నౌకా శిధిలాలమీద మీద నిర్మించిన మెమోరియల్ పైకి వెళ్ళి చూడగలిగే బోట్ టూర్ అందరికీ ఫ్రీ. ఆ టూరుకి టిక్కెట్లు ఎవరూ మూందుగా ఆన్లైనులో బుక్ చేసుకోలేరు. అక్కడికి వచ్చి లైనులో నిలబడి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ గంటకు ఒక సారి ఉండే ఆ టూరులో మాకు మధ్యాహ్నం రెండు గంటల టూరుకి టిక్కెట్లు దొరికేయి.

ఇక అక్కడే ఉన్న చిన్న మ్యూజియం, ఆరిజోనా నించి బయటకు తీసిన పెద్ద చుక్కాని, యుద్ధ నౌకల్లో ప్రధాన విశేషాలు, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బాంబింగు కి వాడిన కాప్సూల్స్, జపా ను మీద అణుబాంబు జరిపిన కాప్సూల్ మొదలైనవి ఆరుబయటే ఉండడం తో చుట్టూ తిరిగి చూడొచ్చు. ఇక టిక్కెట్లు పెట్టు కుని చూడవలసిన జలాంతర్గామి, ఇతర నౌకల్ని మేం వాయిదా వేసేం.

హవాయీ సెనేట్ భవనం & అయోలని రాజ భవనం: ఇక మధ్యాహ్నం రెండు గంటల వరకూ అక్కడే ఉండే బదులు అప్పటికి పదకొండు మాత్రమే కావడంతో ఊర్లోకి వెళ్లి హవాయీ సెనేట్ భవనం చూద్దామని మళ్లీ ఊళ్లోకి తీసుకెళ్ళేను. శనివారం కావడం వల్ల అన్నీ మూసేసి ఉన్నాయి.

అయితే ఆ ప్రాంగణాన్ని ఆనుకుని మరొక గొప్ప భవనం కనిపించింది. అది హవాయీ మహారాజులు కమాహమేహాలు నివసించిన “అయోలని రాజ భవనం”. అక్కడ భవనంలో తూర్ కోసం ప్రయత్నించాం. కానీ భవనం లోపలికి టూర్లు కూడా ఉన్నాయి. కానీ టూరుకి కి కనీసం రెండు గంటలు పడుతుందన్నారు. మాకు అంత సమయం లేక పోవడం వల్ల బయటి నించే ఫోటోలు తీసుకున్నాం. సెనేట్ భవనం లైబ్రరీలా ఉంది. మధ్యలో ఆకాశం కనిపిస్తూ చుట్టూ నాలుగైదు అంతస్తులతో విశాలంగా ఉంది. ఆ ప్రాంగణంలో ఉన్న మహారాజా, మహారాణి ల విగ్రహాలతో ఫోటోలు తీసుకు ని అక్కడే చుట్టూ ఉన్న పార్కులో పెద్ద ఊడల మర్రి చెట్టు కింద దుప్పటీ పరిచి తెచ్చుకున్నదేదో తిని కాస్సేపు విశ్రమించాం. ఆ రోజంతా మబ్బు కమ్మి అప్పుడప్పుడూ చినుకులు పడ్తూనే ఉన్నా ఆరుబయట చెట్టు కింద ఆహ్లాదంగా కూచున్నాం. సిరి సంతోషంగా గడ్డిలో ఆడింది కాస్సేపు.

ఆరిజోనా మెమోరియల్ : ఒంటిగంట ప్రాంతంలో మళ్లీ తిరిగి పెరల్ హార్బర్ కు వచ్చి బోట్ కోసం లైనులో నిలబడ్డాం.
అయిదు నిమిషాల లోనే సముద్ర తీరంలోనే ఎదురుగా ఉన్న ఆరిజోనా మెమోరియల్ అనబడే పడవ ఆకారంలో కట్టిన పొడవైన హాలులోకి ప్రవేశించాం.

అక్కడి నుంచి కింద నీళ్లలోకి చూస్తే మునిపోయిన నౌక మీద అడ్డంగా ఈ హాలు నిర్మించారని అర్థమవుతూంది.
తుప్పు పట్టిన స్తంభాలు పైకి కనిపిస్తూ , ఓడిపోయినా చేతులు పైకెత్తి ఉనికిని తెలియజేస్తూ , అలిసి సొలసి నిద్ర పోతున్న పలుచని నీళ్ల కింద భారమై మునిగిపోయిన యుద్ధ నౌకని చూస్తూ ఉంటే తెలీని దు:ఖం పొంగుకు వచ్చింది.
అక్కడ గోడ మీద ప్రాణాలు కోల్పోయిన రెండు వేల సైనికుల పేర్లు , పుష్ప గుచ్చాలు, నిశ్శబ్దంగా కెరటాల అలల కింద సమాధిలో నుంచి రోదనగా కదలాడుతున్న నౌకా శిధిలపు చిత్రాలు ఒక విధమైన బాధని రగిలించాయి.

పెరల్ హార్బర్ మీద దాడిలో మొత్తం 5 యుద్ధ నౌకల్తో బాటూ, మరో 13 నౌకలు నీట మునిగాయి. మొత్తం 2400 మంది మరణించగా 1200 మంది గాయపడ్డారు.

అరగంట అక్కడ నిశ్శబ్దంగా తిరిగి చూసేక మూడు గంటల వేళ తిరిగి ఒడ్డుకు చేరుకున్నా ఇంకా అటే చూస్తూ మనసు మొరాయించింది.

మరో గంట సేపు చుట్టూ తిరిగి ఎగ్జిబిట్లన్నిటినీ చూసి, మ్యూజియం లోకి ప్రవేశించాం. రెండవ ప్రపంచ యుద్ధ సంఘటనలన్నీ అక్కడ అన్ని మీడియాలలో ప్రదర్శనకు ఉంచారు.

వరు ఏడవ తరగతిలో అమెరికా ఆధునిక చరిత్రని చదువుతున్నందు వల్ల చాలా ఆసక్తితో అన్నీ చదివితేనేగానీ రానని పట్టుబట్టింది.

దాదాపు సాయంత్రం అయిదు గంటల వరకూ అక్కడే గడిపేం. పెరల్ హార్బర్ గిఫ్ట్ షాపుని ఆనుకుని ఉన్న చిన్న ఫుడ్ కోర్ట్ లో నాచోస్ చిప్స్, చీజ్ తిని బయలుదేరేం.

అక్కడే బతికున్న ఆల్చిప్పల్ని చిదిమి, ముత్యాల్ని తీసిచ్చే ఖరీదయిన గిఫ్ట్ షాపుని చూసి భయంతో పరుగెత్తేరు పిల్లలు.

మా ఫ్లయిటు తొమ్మిది గంటలకు కావడంతో మరో గంట సేపు షాపింగు కోసం కేటాయిద్దామని ఫేమస్ ఓపెన్ మార్కెట్ కం ఎగ్జిబిషన్ వంటి చోటికి బయలుదేరేం. తీరా అక్కడికి చేరేక ఎక్కడా పార్కింగు దొరకక ఆగలేకపోయేం. ఒక్కళ్లం కారులో ఉండి, మరొకళ్ళు వెళ్లి ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తులు కొని తెచ్చుకుని తిన్నాం.

పెద్ద ఓడ ఆకారంలో ఉన్న భవనాన్ని చుట్టుకుని తిరిగి రోడ్డు మీదికి వచ్చి ఇక ఎక్కడా ఆగకుండా తిన్నగా ఎయిర్ పోర్టుకి చేరుకున్నాం.

ఆ సాయంత్రఫు సంధ్యాసమయంలో హవాయీలో డ్రైవ్ చేస్తూ గత అయిదు రోజులుగా కలిగిన అన్ని అనుభూతుల్నీ, అనుభవాల్నీ నెమరువేసుకున్నాం.

ఇక్కడ క్లిక్ చేసి ఛాయా చిత్రాలను చూడండి.

అందమైన సముద్ర తీరాలు, కంప్యూటర్లతో సంబంధం లేని సహజ సిద్ధమైన స్వచ్ఛమైన మట్టి జీవితంతో కళ కళ్లాడుతున్న నును వెచ్చని హవాయీ దీవులను వదిలి విమానం పైకి లేవగానే ఒక విధమైన బెంగ చుట్టుకుంది నన్ను.

సుఖాంతం: అయితే కథ అక్కడితో అయిపోయిందనుకుంటే పొరబాటే.

మా టూరు కాస్ట్ కో ఎకానమీ పేకేజ్ కావడం వల్ల మేం మా ఊరు దాటి వెయ్యి మైళ్ల తూర్పు వైపు ఉన్న సాల్ట్ లేక్ సిటీ లో ముందు దిగి, అక్కడి నుంచి మరో రెండు గంటల తరువాత కాలిఫోర్నియా ప్లయిటు ఎక్కి ఇంటికి చేరాలి.

సాల్ట్ లేక్ సిటీ లో మా ఫ్లయిటు మూడు గంటలు లేటుగా నడవడం వల్ల వెయిటింగు ఏరియాలో చాలా సేపు కూర్చుండిపోయాం. అంతసేపు పిల్లలకు బోరు కొట్టకుండా ఉండడం కోసం వాళ్లతో ఆడుతూ, కబుర్లు చెప్తూ గడిపేము. చివరి గంటలో నేను నా సెల్ఫోను కి చార్జింగ్ లేదని గమనించేను. మా సీట్ల మధ్య ఉన్న సాకెట్లో చార్జింగు పెట్టేను. ఎందుకైనా మంచిదని సైలంట్ మోడ్ లో పెట్టేను. ఇక సిరి అటూ ఇటూ పరుగెత్తుతుండడంతో తనతో ఆడుతూ విమానం లైను కోసం పిలుపు వచ్చేసరికి సత్యని అన్నీ తీసుకురమ్మని కేక వేసి నేను సిరిని తీసుకుని లైనులోకి వెళ్ళి నిల్చున్నాను.

విమానం బయలుదేరి గాలిలోకి లేచేక, తన పాకెట్లో నుంచి నా సెల్పోను తీసి ఇమ్మని అడిగాను. బదులుగా “ఏ సెల్ ఫోను?” అన్నాడు సత్య. అప్పుడు అర్థమైంది నేను చేసిన తప్పు. సత్యకి నేను అన్నీ తెమ్మని చెప్పేను గానీ, లగేజీ ని ఆనుకుని అక్కడే ఉన్న సెల్ఫోను తెమ్మని సరిగా చెప్పలేదు. అదే నేనయ్యి ఉంటే చుట్టూ తప్పకుండా పరిశీలించి వస్తువుల్ని ఎక్కడా మర్చిపోకుండా తెచ్చేదాన్ని. కానీ సత్య నాలా కాదు, తనకి చెప్పకపోతే పొరబాటున కూడా చుట్టూ ఉన్న మరే విషయాన్నీ చూడడు.

ఇక అక్కడి నుంచి గంటన్నరలో శాన్ ఫ్రాన్సిస్కోలో దిగి వెంటనే ఎంక్వయిరీ కౌంటర్లో నన్ను మళ్లీ సాల్ట్ లేక్ సిటీ పంపించమని అడిగాను. వాళ్ళు ముందే టిక్కెట్టు తీసుకోకుండా ఎలా కుదురు తుంది? అని ఆశ్చర్యపోయారు. ఇక అక్కడే రిపోర్టు చేసినా ఫలితం లేకపోయింది. ఆన్లైను లో ఎయిర్ లైన్సు లాస్ట్ & ఫౌండ్ లో రిపోర్టు ఇమ్మన్నారు.
ఇంటికి ఈసురోమని వచ్చి ప్రయాణం చివర్లో ఇలా జరిగిందేవిటా అని బాధ పడ్తూ కూచున్నాను. అసలే ఐ-ఫోను అది.
నా బాధ చూళ్లేక, ఇక ఆ ఫోను పోయినట్లేనని మరొక ఫోను ఆ సాయంత్రమే వెళ్లి కొనితెచ్చాడు సత్య.

అయితే నా ఫోనుని ఆన్లైనులో లాక్ చేసి, దాని మీద ఎవరికి దొరికినా కాల్ చేయాల్సిన నంబరు అంటూ స్క్రీన్ మీద మెసేజ్ డిస్ప్లే అయ్యేట్లు చేసేడు సత్య.
మర్నాడు ఉదయం లేస్తూనే నాకు ఎయిర్పోర్టు లో క్లీనింగు చేస్తున్న వ్యక్తి నుంచి ఫోను వచ్చింది. అది లాస్ట్ & ఫౌండ్ లో చేర్చుతామని పది డాలర్లు పోస్టెజీ కడితే స్పీడ్ పోస్టులో ఇంటికి పంపుతామని.

మర్నాటికల్లా గుమ్మం బయట కవరులో నా ఫోను చూసి హవాయీ యాత్రలో చివరి భాగం సుఖాంతమయినందుకు గంతులు వేసాను.

-కె.గీత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యంPermalink

Comments are closed.