ఫాల్ ఆఫ్ మాన్

-గీతాంజలి

డా.గీతాంజలి

“ఈ సారి వుమెన్స్ డేకి నా పిల్లలతో ఆడం & ఈవ్ నాటకం – ఫాల్ ఆఫ్ ఏ మాన్ … కొద్దిగా మార్చివేయిస్తున్నా. స్టాఫ్ లో మొగాళ్లంతా ఎప్పటిలాగా ఏడ్చి చస్తారు!” మీనాక్షి చిలిపిగా నవ్వుతూ చెప్తోంది, తాగుతున్న కాఫీ కప్ టేబుల్ మీద పెడ్తూ.                                                    “నీకిలాంటి సాహసాలు మామూలేగా!” చిన్నగా తనూ నవ్వుతూ అన్నది మందాకిని.
ఇద్దరూ యాభై పడిలో పడ్డవారే. మందాకిని తెలుగు డిపార్ట్ మెంట్ లో ప్రొఫెసర్ అయితే మీనాక్షి జండర్ స్టడీస్ లో ప్రొఫెసర్. గత ఇరవై ఏళ్ల నుంచీ, ఇద్దరూ కల్సి ఒకే యూనివర్సిటీ కాంపస్ లో పని చేస్తున్నారు. ఇద్దరి మధ్య దాపరికాలు లేని చక్కని స్నేహం గత ఇరవై అయిదేళ్లుగా అల్లుకుపోయి ఉన్నది. కేంటీన్లో కాఫీ తాగుతూ ఇద్దరూ కలవడం ఒక దినచర్యగా మారింది.

***
“తుచ్ఛ మానవుడా! ఆడం! నిన్ను ఈ స్వర్గంలాంటి ఈడెన్ గార్డెన్ లో ఉంచి నీ కోసం నా పక్కటెముక నించి ఈ స్త్రీని సృష్టించి ఇచ్చాను. ‘ఈ తోటలో అన్ని ఫలాలూ తినండి. కమ్మని నీళ్లు తాగండి. కానీ ఈ జ్ఞానసంపద నిండిన చెట్టు ఫలాన్ని మాత్రం తినకండి,’ అన్న నా షరతును మీరు పాటించలేదు. నేనిపుడు మిమ్మల్ని శపిస్తాను.” దేవుడు కోపంతో, ఆవేశంతో ఊగిపోతూ అరుస్తున్నాడు.
ఆడం, చెట్టు వెనుక భయంగా నక్కాడు. బయటకు రావట్లేదు. మొల చుట్టూ ఫిగ్ చెట్ల ఆకులు కప్పుకొన్నాడు. తన నగ్నత్వానికి సిగ్గుపడుతున్నాడు. అంతకు ముందు ఈ లక్షణం లేదు. తను పూర్తి నగ్నంగా వదిలేసిన ఈ ఆడం ఇప్పుడిలా సిగ్గుపడ్తున్నాడేంటి? దేవుడి కోపం క్షణక్షణానికీ పెరిగిపోయింది.
“నన్ను నువ్వే సృష్టించావు. నేనడిగానా? ఈ స్త్రీని నా కోసం సృష్టించమని. ఇదిగో ఈమె నాకు జ్ఞానఫలాన్ని అందించింది. నాకో చిన్న ముక్క మాత్రమే యిచ్చి తను మొత్తం తినేసింది. నాకు వెంటనే సిగ్గు, భయం పుట్టుకొచ్చాయి. ఈ నగ్నత్వం మంచిది కాదు కదా! అనే తెలివిడి వచ్చింది. ఆమె తనకు ఆకులు కప్పుకొని ఇదిగో నాకూ కప్పింది.” ఆడం ఒణికిపోతూ స్త్రీ వైపు వేలు చూపించాడు.
“నా తప్పేముంది ప్రభూ? అదిగో ఈ పాము, ఆ ఫలాన్ని తినమని నాకు చెప్పింది. ఆ జ్ఞానఫలం తింటే నేను కూడా నీలాగా మంచి చెడు సిగ్గు భయం, లజ్జా లాంటి విచక్షణలోకి పోతాం అని. ‘ఎన్ని రోజులిట్లా సిగ్గు లేకుండా ఉంటారు? ఆ ప్రభువు మీరు తెలివిడి పడకుండా కుట్ర పన్నుతున్నాడు.’ అన్నది. నాకు సరైనదే అన్పించింది. అయినా నువ్వు నన్ను పురుషుడి పక్కటెముకనుంచి తయారు చేయటం ఏమిటి? ఈ పురుషుణ్ణి ప్రత్యేకంగా మట్టిలోంచి తయారు చేస్తావా? నాకంటూ ప్రత్యేక అస్థిత్వం – ఉనికి లేవా?” ఈవ్ కోపంగా అంటోంది. ఆమె కళ్లు ఎర్రబడ్డాయి.
“అవును! నువ్వు పురుషుని ఎముకలో ఎముకవి–మాంసంలో మాంసంవి. నీకు ప్రత్యేకమైన ఉనికి లేదు. పురుషుడిలో–పురుషునితో-పురుషుడి కోసం ఉండాల్సిందే. పురుషుడి ఎముకలోంచి తయారు చేస్తేనే ఇంత ఉత్పాతం కలిగించావే? ఇంక నిన్ను ప్రత్యేకంగా సృష్టిస్తే ఏమన్నా ఉందా? ఈ సృష్టినే మార్చి పడెయ్యవూ?” ప్రభువు కోపంగా అరిచాడు.
“ఇది మరీ బాగుంది–నువ్వేమో ఎముక నించి తయారు చేసానని అరుస్తావు. జెవిట్ అనే శాస్త్రవేత్తేమో పురుషుడి జననాంగం నుంచి నన్ను తయారు చేశారంటాడు. స్త్రీలం మేం లేకుండా, మా గర్భకుహరాలు లేకుండా నువ్వు కూడా జన్మించలేవు. స్త్రీలలోనే మీ పురుషుల అస్థిత్వం ఉంది. ఇదిగో నువ్వు ఈ ఆడంను సిగ్గు లేకుండా బతకడం నేర్పించావు. నేనితనికి ఇదిగో ఈ ఆకులు కప్పి సిగ్గూ, లజ్జా నేర్పించాను. తప్పేముంది?” ఈవ్ కూడా కాస్త రెచ్చిపోయే అరిచింది. “అయినా ఈ పాము మంచి పనే చేసింది.” పడగ విప్పి విలాసంగా ఆడుతున్న పాము వైపు చూపించి, ఈవ్ చిన్నగా నవ్వింది. ఎగిరి మరో ఫిగ్ చెట్టు ఆకుని తెంపి ఆడం నడుముకి చుట్టింది.
పాము వైపు కోపంగా చూసి ‘ఏం?’ అన్నట్లు దేవుడు కనుబొమ్మలెగరేశాడు.
“మరి నువ్వు మనుషుల్ని సిగ్గు లేకుండా, మంచి చెడు విచక్షణ లేకుండా అంధ విశ్వాసంలో ఉంచవచ్చా? ముఖ్యంగా స్త్రీలను? ఈవ్ ను ఆడంకి తోడుగా, అతనికి వండి పెట్టి పిల్లలని కనటానికి, ఆడం కాలక్షేపం కోసం తయారు చేయవచ్చా? పైగా ఈ జ్ఞానఫలాన్ని తినొద్దని షరతొకటి! ప్రజలందరూ జ్ఞానం లేని మూర్ఖులుగా ఉంటేనే నీకు లాభం కదూ?” పాము కూడా కోపంగా బుసలు కొడ్తూ అంది.
దేవుడు కోపంగా ఊగిపోయాడు. “నా మాట కాదని, ఈ స్త్రీ మాయలో పడి, నువ్వు పురుషుడివై ఉండీ పతనం అయిపోయావు. నిన్ను ఈడెన్ గార్డెన్ అనే స్వర్గపు తోటలోంచి మట్టితో నిండిన భూమి మీదకు తోసేస్తున్నాను. ఫో!” అని ఒక తాపు తన్నాడు ఆడంని. దొర్లుకొంటూ దొర్లుకొంటూ ఆడం భూమి మీదకు పడిపోయాడు.
“ఇక ఈవ్. నువ్వు నేను సృష్టించిన పురుషుణ్ణి పతనం చేశావు. నువ్వు జీవితాంతం పంటలు పండిస్తూ, పురుషుని ఇంట్లో వంటలు చేస్తూ, గొడ్డు చాకిరీ చేయడమే కాదు. భయంకరమైన ప్రసవపు నొప్పులు అనుభవిస్తూ ఈ సృష్టిని నడిపిస్తావు. అంతే కాదు. పురుషునికి నీ మీద ఆధిపత్యాన్ని పెత్తనాన్ని యిస్తున్నా.” అంటూ దేవుడు వికటాట్టహాసం చేశాడు.
“ఇక నువ్వు…కాళ్లు లేకుండా మట్టిలోనే ఉంటావు. మన్నునే తింటావు. నిన్ను ఈ సమస్త మానవ జాతికీ శత్రువుని చేస్తున్నా. ఇద్దరు పరస్పరం ఒకరికొకరు హాని చేసుకుంటుంటారు.” అన్నాడు పాము వైపు చేస్తూ.
పామూ – ఈవ్ పగలబడి నవ్వారు. దేవుడు తెల్లబోయాడు.
“నీ మేజిక్ ఈ స్వర్గంలో ఫలించిందా? భూమ్మీద ఫలించడానికి. ఇక్కడి కంటే భూమ్మీద మరింత చైతన్యంతో ఉంటాం పో! నా తల రాతను రాసేది నువ్వు కాదు. మన కథ మార్చి రాస్తున్న రచయిత. గుర్తు పెట్టుకో. అయినా ఆడం అంటే నువ్వు సృష్టించిన పురుషుడు. నీ వల్లనే పతనమయ్యాడు. నా వల్ల కాదు. నా వల్ల బాగయ్యాడు. నువ్వు సృష్టించిన ఈ పురుషుడికి భూమ్మీద కూడా స్త్రీల పట్ల గౌరవం, మర్యాద, సిగ్గుతో మెలగడం నేర్పిస్తాం పో!’ అని ఈవ్- పాము చెట్టాపట్టాలేసుకొని భూమి వైపు దూకేశారు.
దేవుడు తెల్లబోయాడు. “ఈ తోటలోకి పాముని రాకుండా ముందుగా చూస్కొని, సిగ్గులేని నగ్న ఆడంను ఆ తర్వాత తయారు చేయాల్సింది.” అని పశ్చాత్తాపపడ్డాడు. దిగులు మొహంతో ఏడ్చుకొంటూ వెళ్లిపోయాడు.
తెర పడింది. కరతాళధ్వనులతో హాలు మారుమ్రోగిపోయింది. ఈవ్ వేషం వేసిన దర్శిత, మీనాక్షి వైపుకి ‘మేడం!’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. మీనాక్షి ‘వెల్ డన్. బాగా చేశావమ్మాయ్!’ అని అభినందించింది. మందాకినికి కూడా విష్ చేసింది దర్శిత. దర్శిత ముఖంలో ఎంతో ఆనందం-ఆత్మ విశ్వాసం కన్పిస్తున్నాయి.

***
దర్శిత ఒకబ్బాయిని ప్రేమించింది. మూడేళ్ల పరిచయం ఇద్దర్దీ. ఆ అబ్బాయి నార్త్ ఇండియన్ అనీ, సరిపడదనీ చెప్పి తల్లిదండ్రులు తమ కులంలో ఒక ఇంజనీర్ కిచ్చి దర్శితకి పెళ్లి చేశారు. తల్లిదండ్రుల కోసం ప్రేమను వదులుకొంది దర్శిత. కానీ తొలి రాత్రే భర్త తనను బలవంతంగా రేప్ చేసినంత పని చేశాడు. తీవ్ర రక్త పాతంతో విలవిల్లాడిపోయింది. పశువులాంటి మనిషి భర్త. తాళి అనే లైసెన్స్ తో తనను మెరైటల్ రేప్ చేసిన భర్త. అతడు చేసిన గాయాన్ని భరించలేకపోయింది. మర్చిపోలేకపోయింది. ఇతను నా సహచరుడిగా పనికి రాడని తెగతెంపులు చేస్కోని, ఆపేసిన చదువును కొనసాగిస్తున్నది. మేరేజ్ కౌన్సిలర్ యిచ్చిన కౌన్సిలింగ్ తో తన మీద ఆధిపత్య దాడి చేసిన భర్తకి ఆ ఆధిపత్యం ఎక్కడనుంచి వచ్చిందో తెలుసుకోవటానికి, జెండర్ స్టడీస్ లో చేరింది.
“నాకిష్టం దర్శితంటే. ఒక్కసారి తన మీద అత్యాచారం చేసిన భర్తని వదిలేసింది. అతను కాపురానికి పనికి రాడంది. కానీ-మనం? భరిస్తూనే ఉన్నాం కదూ?” మందాకిని ముఖంలోకి సూటిగా సహానుభూతితో చూస్తూ మీనాక్షి అంటోంది. మందాకిని నిట్టూర్చింది. “అమ్మో- గైనకాలిజిస్ట్ అపాయింట్ మెంట్ ఉన్నది వెళ్లాలి. బై!” అని చెప్పి బయలుదేరింది.

అతడు ఊరెళ్లాడు. రెండు మూడు రోజులకు కానీ రాడు. తనకీ సెలవులే. అతను లేని ఏకాంతం బాగుంది. కానీ, అతను చేస్తున్న గాయాలతో, ఎడారిలో ముళ్ల చెట్టుకి చిక్కి గాలికి తెగలేక రెపరెపలాడ్తున్న దారపు పోగులా, మనసు వణుకుతున్నది. ఇంతలో ఫోన్.
“అమ్మా! ఎలా ఉన్నావు? నాన్నెలా ఉన్నాడు? ఇద్దరూ కొట్లాడుకొంటున్నారా ఎప్పటిలాగా? నాకు జీతం పెరిగిందమ్మా. హెచ్ వన్ మళ్లీ అప్లై చేశా. ఆ! అవును. ట్రంప్ వచ్చాడుగా. ఏం చేస్తాడో తెల్వదు. ఏముంది ఇండియా వచ్చేస్తా. నో వర్రీస్. నేను కూడా మొన్న ఇక్కడి వుమెన్ వింగ్ లో కలిసా. కల్సి ఆడవాళ్ల మీద ట్రంప్ చేసిన అసభ్యమైన కూతలకు వ్యతిరేకంగా చేసిన ధర్నాలో పాల్గొన్నా. ఓకే అమ్మా! డాక్టర్ దగ్గరకు రెగ్యులర్ గా వెళ్లు.”
తపస్య గొంతు ఆగని నదీ ప్రవాహం. తపస్య కోసమే కదా ఇతని దుర్మార్గాన్ని భరిస్తోంది? మొన్నటి దాకా, ఒక ఐదు సంవత్సరాల క్రితం వరకూ బాగానే ఉండేవాడు. తనకు మెనోపాజ్ మొదలైనప్పటినుండీ తన పట్ల ఇతని ధోరణి మారింది. తననొక పనికిరాని చిల్లుకుండలా చూస్తున్నాడు.
విసుగ్గా, చెప్పలేని ఆత్రంతో దేన్నించో తప్పించుకోవాలని మందాకిని బాల్కనీలోకి వెళ్లింది. ఇంటి పక్కన పొలాలు. పొలాలకావల దట్టమైన చెట్లలో అడవి. నగరం శివార్లలో ప్రశాంతంగా ఉంటుందని కట్టుకొన్న యిల్లు. కానీ, ప్రశాంతత ఎక్కడిది? ప్రేమ, ఆప్యాయత, కరుణ లేని కాపురం ఎన్నాళ్లని భరించడం?
మందాకిని అక్కడి వాలుకుర్చీలో కూర్చొంది. చీకటికీ ఏకాంతానికీ తనను తాను బంధించుకున్నది. ఆకాశం చుక్కల కళ్లేస్కుని వంగి మందాకిని ముఖంలోకి గుచ్చి గుచ్చి చూస్తున్నట్లుగా ఉంది. చిన్న దిండుని గుండెలకు హత్తుకుని మెల్లగా కళ్లు మూస్కొంది మందాకిని. ఆమె కనురెప్పలు ఆమెలోకి చీకటిని ఒంపుతూ మూస్కున్నాయి. ఫాల్ ఆఫ్ ఏ మాన్ నాటకంలో ప్రభువుతో తగువులాడ్తున్న ఈవ్ గుర్తొచ్చింది.
‘మగాడి కోసం, ఆడం కోసం మాత్రమే నన్నెందుకు తయారు చేశావు? నన్ను విడిగా ఒక వ్యక్తిగా ఎందుకు తయారు చేయలేదు? అందుకే ఈ జ్ఞానఫలం తిని తెలివిడి తెచ్చుకొన్నా’ ఈవ్ పగలబడి నవ్వుతోంది.
ఆ నవ్వుకు మందాకినికి ఒక్కసారిగా మెలకువ వచ్చింది.
-అతను నన్ను కౌగలించుకొని గట్టిగా హృదయానికి హత్తుకుంటూ నన్నింకా ప్రేమిస్తున్నట్లు చెబితే ఎంత బాగుంటుంది అన్పిస్తుంది. అతనికే కాదు. చాలా మందికి తెలియదు. నెలసరులు ఆగిపోయో, గర్భసంచులు కోల్పోయో ఉన్న మా దేహాల్ని, మనసుని కలిపి చూడాలనీ, అర్థం చేస్కోవాలనీ. ఇతనికైతే అసలే తెలీదు. నా అస్థిత్వం అంటే ఒక్క దేహమేనా? హార్మోన్లు ఆగిపోయి నా హృదయంలా ఎండిపోయిన నా యోనీ, గర్భ కుహరాలేనా?
-నేనేంటో నాకు చెప్పాలని చూస్తాడు. నన్ను ఫలానా అని నిర్వచిస్తాడు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెత్త సలహాలిస్తాడు. ‘నా స్థితి నాకు మాత్రమే తెల్సు. నీ సలహాలు ఎందుకు? నా స్థితి గురించి నేనే మాట్లాడుతాను. నాకు తెలుసు నా ఈ స్థితి నా దేహంలో హార్మోన్లలో మార్పు వలన’ అని చెప్పాలనిపిస్తుంది. కానీ, తను దీన్ని అర్థం చేస్కొంటాడా? అతనంతట అతనే నా కోపం, ఆవేశం, దుఃఖం, డిప్రెషన్, చిరాకు పంచుకోవచ్చు కదా? నన్ను దగ్గర్కి తీస్కోని ఓదార్చవచ్చును కదా? పోనీ నన్నంటుకుని ఉండక పోయినా నీ కష్టకాలంలో నేనున్నానూ అని తోడుగా ఉండచ్చుకదా!
-అలా ఉండకుండా, నువ్వు మారాలి అని అరుస్తాడెందుకు? నేను నాలాగే ఉన్నా మొన్నటి దాకా. నేను కచ్చితంగా మారాను హార్మోన్ల వలన. కానీ నువ్వు మారింది హార్మోన్ల వల్లనేనా? లేక నీ మగబుద్ధి వలనా? నీకు ఒక్కసారిగా సెక్స్ హార్మోన్లు పెరిగిపోయి ఈ వేషాలు వేస్తున్నావా? ఎంత సేపూ తనని అర్థం చేస్కోమంటాడు. నన్నేదైనా డిన్నర్ కి తీసుకుపోవచ్చు. నా పాత హాబీ అయిన బొమ్మలు వేయడానికి నాకు కుంచెలూ, రంగులూ బహుమతిగా ఇవ్వచ్చును. నేను మెనోపాజ్ అనే కొత్త మనోదైహికస్థితిలోకి మారే ప్రయాణానికి తనే దగ్గరుండి మార్గాలు వేయొచ్చు. నిన్నెంత మెచ్చుకొంటా నేను?
ప్రొఫెసర్ లక్ష్మి మాటలు గుర్తొచ్చాయి సడన్ గా మందాకినికి.
‘భార్య మెనోపాజ్ దశకు చేరుకొంటే – భర్తకు అది మిడ్ లైఫ్ క్రైసిస్. ఈ దశలో భర్తలు చాలా మంది భార్యలకు నమ్మకద్రోహం చేస్తారట. జాగ్రత్త సుమా! అయినా భర్తలు మన చేతిలో ఉంటారా ఏమిటి?’ అంటూ నిట్టూర్చింది ప్రొఫెసర్ లక్ష్మి. ఆమెకేం బాధలున్నాయో మరి భర్త వల్ల?
-కొంపదీసి ఈయన కూడా నమ్మకద్రోహం చేస్తాడా? ఏమో! భర్త పోయిన 35 సంవత్సరాల సావిత్రి అప్పుడప్పుడు ఆఫీసుఫైల్స్ పట్టుకొని యింటికి వస్తుంది. ఆమె అణువణువునీ అతడు ఎంత ఆబగా చూస్తాడని! కళ్లెగరేసి ‘ఆమెకెంతో తెలుసా ఏజీ ? 25 సంవత్సరాలు.’ గర్వంగా చెప్తాడు. అదేదో ఆమెకి వయసక్కడే ఆగిపోయినట్లు, నాకేదో పెరిగినట్లూ. తన ఏజి నేను అడిగానా? ఏం వెతుకుతాడు ఆమె దేహంలో? నేను కోల్పోయిన యవ్వనాన్నా? అతను కోల్పోలేదా? తనవైపెప్పుడైనా చూస్తున్నాడా అసలు? పోనీ నా కళ్లలోకి చూస్తున్నాడా తను? నాతో పాటు ఇతనూ మెనోపాజ్ లో ఉన్నాడన్న స్పృహ ఉందా ఇతనికి? ఒక్కసారిగా క్లినిక్ లో డాక్టర్ జ్యోతి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మందాకినికి. ‘వీళ్లకి లేదా డాక్టర్ మెనోపాజ్?’ అని తను అడిగితే పగలబడి నవ్వింది. నవ్వాక, ‘ఎందుకు లేదూ? వీళ్ల జబ్బును ADAM అంటారు. అంటే Androgen Deficiency of the aging male అన్నమాట. దీన్ని ఆండ్రోపాజ్ అని కూడా అంటారు. వీళ్లకి పురుష సెక్స్ హార్మోన్లు తగ్గిపోతుంటాయి. అది మనకు తెలియదనుకొంటారు. వీళ్లకీ నడివయసులో కోర్కెలు తగ్గుతుంటాయి. శక్తి తక్కువుంటుంది. డిప్రెషన్, కోపం, ఉద్రేకం మూడ్ మారుతుండటం –కండరాల క్షీణత, శరీరంలో నడుమూ, పిరుదులు, పొట్ట, ముఖం, కంఠంలో కొవ్వు పేరుకుపోవడం; ఒంట్లో మనకొచ్చినట్లు వేడి ఆవిర్లు వస్తాయి. అంగస్థంభన కూడా సరిగా ఉండదు.’ చెప్పింది డాక్టర్ జ్యోతి.
‘మా ఆయన తనకలా ఉండదన్నట్లే ఉంటాడు. విటమిన్స్ వేస్కోంటాడు రాత్రి. ఆయనకంత యవ్వనమెక్కడిది డాక్టర్? చూడు నాకెంత పవర్ ఉందో – ఎంత గట్టిగా ఉందో అని సిగ్గు లేకుండా చూపిస్తాడు.’ అంది తాను కోపంతో.
‘అవి విటమిన్స్ కాదేమో? ఈ సారి ప్రిస్క్రిప్షన్, ఆయన వాడే మందులూ తీసుకురా చెప్తాను.’ అంది డాక్టర్ జ్యోతి. తన భర్త తననెంత చిన్న చూపు చూస్తాడో ఆమెకి చెప్పి, తన బాధను దించుకునే ప్రయత్నం చేస్తుంటుంది మందాకిని.
ఒక్కసారి మళ్లీ జ్ఞాపకాల్లోంచి బయట పడింది.
తన కొలీగ్ మీనాక్షి గుర్తొచ్చింది. ఆమె నిర్వేదం గుర్తొచ్చింది. తన జెండర్ స్టడీస్ జ్ఞానమతా ఆడపిల్లలకు ఒక కసితో చెప్పటం గుర్తొచ్చింది. మీనాక్షి భర్త శేఖర్ మీనాక్షినొదిలి తన వయసులో సగం ఉన్న స్త్రీతో ఉంటున్నాడు. రేపోమాపో విడాకుల నోటీసు పంపిస్తాడట. మీనాక్షికి ఐదేళ్ల క్రితం గర్భసంచిలో ఫైబ్రాయిడ్ గడ్డలైతే, అవి ఉంటే ప్రమాదమని గర్భసంచినే తీసేశారు. గర్భ సంచితో పాటు స్త్రీ హార్మోన్లు స్రవించే అండాశయాలనూ తీసేశారట. ఎంతసేపు ‘నువ్వొక ఖాళీ కుండవు. నీకిక స్త్రీత్వం లేదు. నువ్వసలు నాకు ఆడదానిలాగే కన్పించడం లేదు. నీకన్నీ ఎండిపోయాయి.’ అని ఎద్దేవా చేస్తుంటాడట. ‘పిల్ల పెళ్లైయ్యాక, నేను అతనికి విడాకులిస్తానని చెప్పాను. అతనితో నేను వేగలేకపోతున్నాను.’ అంది మీనాక్షి. హార్మోన్ల లోపంతో చర్మమంతా ఎండినట్లున్న మీనాక్షి కళ్లనిండా ఒక శుష్కమైన, ఎండిపోయిన కాంతి! భార్య నునుపైన కాంతివంతమైన యవ్వనంతో, మంచి దేహ బిగువుతో ఎప్పటికీ ఉండిపోవాలి వీళ్లకు. దేహమన్నాక వడలిపోకుండా, వంగిపోకుండా ఉంటుందా? వాళ్లుంటున్నారా మరి? నున్నగా దృఢంగా గొప్ప వెడల్పైన ఛాతీతో? ఛాతీ మీద నల్లటి వెంట్రుకలతో మగతనం ఉట్టిపడుతూ? (ఇది ఆయన వాడే మాట) అసలు పొట్ట లేకుండా, భుజాలు వంగకుండా? ఎంత అసహ్యంగా కుండ బోర్లించినట్లో – తొమ్మిది నెలల గర్భం ఉన్నట్లు ఉంటాడు?
-అలాంటి పొట్టతో తన మీదా భల్లూకంలా పడ్డప్పుడు, పొరలుపొరలుగా కొవ్వెక్కిన ఆ పొట్ట భారంతో ఊపిరాడక తాను, దడదడ కొట్టుకుంటున్న గుండెతో; అతడి శరీరాన్ని సున్నితంగా పక్కకి తోసినా, తిరస్కారం అనుకొని ఎంత ఆగ్రహంతో ఊగిపోతాడనీ. అలిగి పక్కకు తిరుగుతాడనీ?
-తనకు ముసలి వయస్సు మొదలై అతను యవ్వనంలోనే ఆగిపోలేడు కదా? అతనికి సెక్స్ హార్మోన్లు తగ్గిపోయి, అన్నీ ఆగిపోయో; వడలిపోయో, ఉబ్బిపోయో, ముడుచుకుపోయో; చేతులపై, కనుబొమ్మలపై, ముక్కుల్లో, చెవుల్లో, గడ్డంలో, ఛాతీ వెంట్రుకల్లో; ఒక్కటేమిటి? ఒళ్లంతా తెల్ల వెంట్రుకలతో నల్ల వెంట్రుకలు కల్సిపోయి భల్లూకంలా ఉంటాడు కదా? తనన్నెడన్నా నువ్విలా అసహ్యంగా ఉన్నావనో, నిన్ను చూస్తే నాకు కూడా కోరిక పుట్టటం లేదనో; లేదూ అచ్చం మీనాక్షి మొగుడెట్లా అంటాడో, అలాగా ఇతను అన్నప్పుడల్లా తను అనలేదే? అయినా ఇతన్ని చూస్తే తనకెప్పుడూ కలిగిందని కోరిక? అసలు కోరిక కలగటం అనే అనుభూతి ఎలా ఉంటుందో కూడా ఎరగదే. పోనీ నీ వల్ల నాకేమీ సుఖం లేదని తను అనలేదే, ఎన్నడూ ఇంత సుదీర్ఘమైన దాంపత్య జీవితంలో? అబ్బా! అతన్నిలా నగ్న జంతువులా చూడ్డం ఎంత నరకమో కదా తనకు? తనతో ఎన్ని సార్లన్నాడు నిన్నిలా ఉబ్బిన సొరకాయలా, నడుముకు వేలాడ్తున్న మహేంద్ర టైర్లతో చూడలేకపోతున్నా అని? తనకు లేవా కొవ్వెక్కి వేలాడే టైర్లు?
అలసటతో మందాకిని కనురెప్పలు నీరసంగా వాలిపోయాయి.
-ఎప్పటికైనా అర్థం అవుతుందా ఈ మనిషికి? నెలసరి ఆగిపోయినప్పట్నించీ తన దేహం, మనసూ తనకే అర్థం కావట్లేదు. అతనికేం అర్థం అవుతుందసలు? ఇతని దేహంలో, మనసులో వస్తున్న మార్పులు తనకైతే స్పష్టంగా అర్థం అవుతున్నాయి. ఎంతసేపూ దేహం గురించే మాట్లాడతాడు. వడలిపోవడం, వాడిపోవడం, ఎండిపోవడం – ‘ఓహ్ యూ హేవ్ డ్రైడ్ టోటల్లీ…’ అంటూ, తన సెక్స్ లైఫ్ యాభై నాలుగేళ్లకే ముగిసిపోయిందా అని విలవిల్లాడతాడు. అసలు అందరు మగాళ్లూ ఇలానే ఉంటారా? లేదా ఇతనికేమన్నా జీన్స్ సమస్యా?
మందాకినికి ఉన్నట్లుండి వాళ్లత్తగారు సుగుణ గుర్తొచ్చింది. పండగనీ–నెలలో ఉందనీ–జ్వరమనీ–పిల్లలు ఎదిగి చూస్తున్నారనీ; ఆఖర్కి పెళ్లికీ–పుట్టింటికి వెళ్లినా–అత్త పక్కకొచ్చి కోరిక తీర్చి వెళ్లాల్సిందే! లేక పోతే తన్నులు- లకారాల్లో తిట్లు. ‘కాదంటున్నావు. ఎవర్ని తగులుకున్నావే?’ లాంటి అసభ్యకరమైన మాటలు. తప్పేది కాదు. ఒక రోజు ‘మందాకినీ. తట్టుకోలేక పోతున్నా. మీ మామకి ఈ వయసులో కూడా ఇంత పిచ్చేంటమ్మా. నాకిక శక్తి లేదు. ఆయనకు ఏదైనా మందు చూసి పెట్టమ్మా. లేదంటే నేను ఏదన్నా మందు మింగి చస్తాను.’ అని ఏడ్చేది. ఆఖర్కి ఆమె కోరుకొన్నదే జరిగింది. మామగారికి ప్రోస్టేటు కేన్సరు వచ్చి చచ్చిపోయాడు. అయినా, శవం పక్కన కూర్చున్న అత్త కళ్లలో ఒక్క కన్నీటి చుక్క రాలలేదు. సరికదా ఆమెలో ఎంతో ప్రశాంతత అన్పించింది. ఆమెకేమో కానీ తనకైతే అమ్మయ్య! అత్త ఇంక నిమ్మళంగా ఉండచ్చునైతే అన్పించింది. ఇదిగో ఈయనకీ అదే పిచ్చి…
నిద్ర పట్టని మందాకిని అసహనంగా దొర్లింది. రాత్రిళ్లు అసలు నిద్ర పట్టదు. నిద్ర ముంచుకొచ్చిన రాత్రిళ్లు, పాల కోసం పసిపిల్లల ఏడ్పులు, ఉచ్చలు, ముడ్డి కడగడాలు, మిగిలిన సమయం ఈయన కోర్కెలు తీర్చడంలో సరిపోయేది. పిల్లలు ఎదిగే కొద్దీ స్కూలు, కాలేజీ సమయాలు మారడం, తర్వాత ఉద్యోగాల్లో నైట్ షిఫ్ట్స్, వాళ్లతో పాటు తెల్లారిలోంచి రాత్రిళ్లకి ప్రయాణాలు, తెల్లారి మూడు గంటల దాకా ఎదురు చూడటాలు లేదా వండటాలు. దీంతోనే తన నిద్ర ఎక్కడికో ఎగిరిపోయింది. మెల్లగా కళ్ల మీదకు వాలి కమ్మగా తనలోకి తీస్కునే నిద్ర తననుంచి వీడిపోయింది. పిల్లలు ఎదిగిపోయి ఎగిరిపోయిన తర్వాత నిద్ర పోదామంటే ఈ హార్మోన్లు మెదడులో నృత్యం చేస్తున్నాయి. దీనికి తోడు ఈయన చేసే అవమానాల గాయాలు రాత్రి వేళ ఇంకా ఎక్కువ జ్ఞాపకం వస్తూ ఆ కొద్ది నిద్రనూ చంపుతున్నాయి. నిద్ర … నిద్ర … కమ్మటి నిద్ర… ఎక్కడ ఉన్నావు? అమ్మ ఒడి నుండి ఎక్కడికి జారిపోయాను? ఎవరైనా నిద్ర పుచ్చి పోతే బాగుణ్ణు. డాక్టరిచ్చిన రెస్టిల్ వేస్కోంటేనే మెదడుకు రెస్టు. లేకపోతే రాత్రంతా తెరిచి పెట్టిన కనురెప్పల బరువుకు నొప్పెట్టే కనులు. ‘ఆలోచించకమ్మా!’ అంటాడు డాక్టరు. వందోసారి కాంపోజో, జోల్ ప్రెశ్శో, రెస్టిలో, తేలో, జెర్రో – జీవితమంతా కలత నిద్రపై కనులపై పాకిన తేలో జెర్రో… ఇవన్నీ నిద్ర పట్టని ఆడాళ్ల మందులై పోయాయి.
‘ఏం ఆలోచిస్తారమ్మా?’ అంటాడు డాక్టరు తెగ ఆశ్చర్యపోతూ. ‘పిల్లలు ఎదిగిపోయారు కదా. ఇంక రిలాక్స్ కావాలి,’ అంటూ ఒక ఉచితసలహా పాడేస్తాడు మూలాల్లోకెళ్లి ఆలోచించకుండా; ఆడవాళ్ల మానసిక, శారీరక, సెక్స్ సమస్యలకు – నిద్ర లేములకు కారణాలు కేవలం వాళ్ల బుర్ర తక్కువతనం వల్లనే అని కొట్టిపారేస్తారు ఈ డాక్టర్లు.
-ఒక వేళ తెలిసినా పురుషులైనందుకు పట్టించుకోనితనం కాకపోతే మరేమిటి? అసలెలా ఆలోచించకుండా ఉండటం? ఎండిపోయావంటాడు. ఎండిపోయిన తనలోకి ప్రవేశించేటపుడు ‘మంట…ఛీ వెధవ మంట’ అంటాడు. తనకెంత నరకంగా ఉంటుందో ఆలోచించడు. రొమ్ములు వాలిపోయి చేతులకు నిండుతనం తగలట్లేదంటాడు. అసలు నిన్ను చూస్తేనే కోర్కె చచ్చిపోతుందంటాడు. నీ కంటే పక్కింటి తెల్లతోలు సునీత కైపెక్కిస్తుందంటాడు. వాళ్ల మామ జానకి రామయ్యను కలిసే నెపంతో ఆమె ఇంట్లో దూరిపోయి ఆమెను చూసి చొంగలు కారుస్తూ నిట్టూరుస్తూ వస్తాడు. ఆఫీసులో కూతురి వయస్సున్న 35 ఏళ్ల నళిని పిచ్చెక్కిస్తుందంటూ వాగుతుంటాడు.
నిజానికి తనకు మెనోపాజ్ అంటాడు కానీ, అతనికే ఇంపోటెంసీ ఉందేమో అని తనకు అనుమానం. ఒక్కోసారి మెత్తబడిపోయినట్లే నిస్సత్తువగా అటు తిరిగి పడుకొంటాడు. విటమిన్స్ వాడినపుడు మాత్రం రెచ్చిపోతాడు. ఆ విటమిన్స్ వేసుకొన్నప్పుడైతే తన పరిస్థితి ఘోరాతిఘోరంగా ఉంటుంది. ఎందుకో మరి? అసలా విటమిన్స్ ఏంటో, అవి విటమిన్ టాబ్లెట్లేనా? డాక్టరు జ్యోతి కాదంటుంది. మందాకిని మెల్లిగా లేచి అతని ప్రిస్క్రిప్షన్ వెతికింది. ఆమెకి అతని ప్రిస్క్రిప్షన్, టాబ్లెట్లు దొరికాయి. వాటి మీద ‘సుహాగ్రా’ అని ఉంది.
ఇదీ, తను విన్న వయాగ్రా ఒకటేనా? డాక్టర్ జ్యోతిని అడుగుదాం అనుకొంది మందాకిని.

“అసలు ఇవి విటమిన్ టాబ్లెట్స్ కావు మేడమ్! అంగస్థంభన సామర్థ్యం తగ్గి పోయి ఆండ్రోపాజ్ కి చేరుకొన్న పురుషులు తమ అంగం గట్టి పడటానికి, వాడే వయాగ్రానే! కచ్చితంగా మీ ఆయన ఇవి వాడుతూనే మీతో సెక్స్ చేస్తున్నాడు. తన లోపాన్ని కప్పి పుచ్చుతున్నాడు.” అంది డాక్టర్ జ్యోతి.
మందాకిని కోపంతో రగిలిపోయింది.
-ఆమెకి అవమానకరంగా ఉన్నది. ఆమెకి గతమంతా మళ్లీ తాజాగా గుర్తుకొచ్చింది. నెలసరి ఆగిపోయి మనసే కాదు; దేహం, దేహంలోని అన్ని పొరలూ, ద్రవాలూ ఎండిపోయి తానొక తేమ ఎండిపోయిన బావిలా, నదిలా ఉంటే ఈ భయానకమైన వయాగ్రాలు ఒకటి. తనకు తెలీకుండా రహస్యంగా మింగి అతనొక చురకత్తిలా, గునపంలా, తన ఎండిపోయిన దేహాన్ని సర్రుమని కోస్తే ఎంత మంటో!
-వద్దు వద్దు అంటున్నా వినకుండా అర్ధగంట పాటు సాగే పోట్లకు తన యోని చీలిపోయి, ఎండిన దేహపు కుహరం రక్తంతో చెమ్మబారి, విలవిలలాడ్తూ, పెదాలు బిగించి భరిస్తూ, కన్నీళ్లు కారుస్తూ; అంతసేపూ ఎత్తి పట్టిన తొడలు, నడుమూ గుంజుతున్నా ఆపడే! గాయం లోపలికి సూదిని గుచ్చుతున్నట్లే. ఎవడు? ఎవడు? ఏ కంపెనీ వాడు కనుక్కొన్నాడో కదా మగాణ్ణి కత్తి నుంచి గునపంలా మార్చి ఆడదాని సున్నిత దేహాన్ని తవ్వి తవ్వి రక్తపుటేరులు పారించడానికి? అసలా మాత్రలు వేస్కుంటున్నానని ఎన్నడైనా ఒప్పుకొంటాడా? ఏంటవి అంటే విటమిన్స్, నీరసం తగ్గటానికి అంటాడే తప్ప. దొరక్కుండా ప్రిస్క్రిప్షన్ దాచుకొన్నాడు. దాన్ని ఎలాగో సంపాదించింది తాను.
-‘లేదు. నాకేం తక్కువని. నువ్వే పనికి రాకుండా ఎండిపోయిన బావిలాగా అయిపోయావు. ప్రతి రాత్రి తొలిరాత్రి ఏడ్చే కన్నెలాగా ఏడుస్తావే ముట్లుడిగిపోయినా? నువ్వు ఒప్పుకోకపోతే ఎవరూ లేరనుకొన్నావా? ఇదిగో చిటికె వేస్తే వస్తారు నాకోసం తెలుసా?’ నొప్పి తాళలేక కొన్ని సార్లు కచ్చితంగా తిరస్కరించే తనని చిటికె వేసి బెదిరిస్తూ మాట్లాడతాడు.
ఆ కళ్లలో ఎంత అహంకారం? ఈ మగాళ్ల కోసం వయాగ్రా కనిపెట్టిన కంపెనీ వాణ్ణి తగలెట్టాలి. వాడి పెళ్లాన్ని కూడా ఈ వయాగ్రా టేబ్లెట్లేసుకొని వాడూ ఇలాగే సతాయిస్తాడా?
-మొన్నెంత ఘోరం జరిగి పోయిందీ? తమ అపార్ట్ మెంట్ లో థర్డ్ ఫ్లోర్ ధనుంజయ రావు అనే 68 ఏళ్ల ముసలివాడు సెకండ్ ఫ్లోర్ లో ఉండి ఉద్యోగాలు చేసుకొనే సాగర్–మేనకల నాలుగేళ్ల పాపాయిని ‘నీ తాతయ్యని … తాతయ్యని’ అని చేరదీసి ఆ చిన్నారిపైన ఘోరం చేశాడట. రక్తం కారిపోతూ స్పృహ తప్పిన పాపని వాళ్ల ఇంటి ముందు వదిలేసి పారిపోతుంటే పట్టుకొన్నారట. పోలీసులు అరెస్టు చేశాక వాడి ఇల్లు సోదా చేస్తే అన్నీ బూతు సీడీలు, కంప్యూటర్ లో బూతు సైట్లు, విస్కీ సీసాలు, కండోమ్ పాకెట్లు, వయాగ్రా మందులు దొరికాయట. ఆ నీచుడి మృగత్వానికి ఆ చిన్నారి దేహం రెండుగా చీలిపోయి చనిపోయింది. ఆ తల్లికి దాదాపు పిచ్చెక్కినంత పనై చాలా నెలలు సైక్రియాట్రీ మందులు వాడారట. పెళ్లైన ఆరేళ్లకు లేక లేక కలిగిన సంతానం. ఇల్లమ్మేసి వేరే జిల్లాకే మారిపోయినారు.
‘అతడు టూర్ వెళ్లాడు. రాత్రికి వస్తాడు. ఈ దొంగని పట్టి తీరాలి ఈ రోజు. తనలో కూడా లోపం పెట్టుకొని తననే చిన్న చూపు చూస్తూ అవమానిస్తూ వచ్చిన ఈ వయాగ్రా మగ ధీరుణ్ణి చచ్చిన పాముని చేసి తీరాలి.’ మందాకిని దృఢంగా నిర్ణయించుకొంది.

‘డాడీ! అమ్మనెందుకు అర్థం చేస్కోవు? అమ్మ మెనోపాజ్ కి రీచ్ అయ్యింది. అమ్మ హార్మోనల్ ఇంబాలెన్స్ తోనే ఈ ఇరిటేషన్. కోపం, చిరాకు-స్వతహాగా అమ్మ లక్షణాలు కావు ఇవి. హార్మోనల్ థెరపీ తో అమ్మకి నయమవుతుంది. ఈ దశలో అమ్మకి సహచరుడిగా నీ సహకారం అవసరం డాడీ! బీ లైక్ ఏ ఫ్రెండ్ విత్ మామ్!
‘నిజం చెప్పు డాడ్! అమ్మతో పాటు నువ్వు ముసలాడివై పోయావుగా! అమ్మ మాత్రమే ముసలిదయినట్లు ఎందుకు బిహేవ్ చేస్తావు? డాడీ! అమ్మకి కాదు – నువ్వు ఆండ్రోజన్ ప్రొఫైల్ చేయించుకో. చూడు నీ సెక్స్ హార్మోన్స్ కూడా ఎంత ఇంబాలెంసెడ్ గా ఉంటాయో. ఊహూ! చేయించుకోవు. అమ్మకు మెన్సస్ ఆగిపోయాయి కాబట్టి ఫ్రూఫ్ ఉంటది. మరి నీకో? అది అమ్మకే కచ్చితంగా తెలుస్తుంది. నీతో అమ్మ బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఈ ఏజ్ లో ఆమెకి బీపీ పెరగకుండా చూస్కోవాల్సింది పోయి ఇంకా డిప్రెస్ చేస్తున్నావు. షీ నీడ్స్ యువర్ హెల్ప్. ఒక స్త్రీగా చెప్తున్నా. రేపు నాకు కూడా ఇదే స్థితి వచ్చి నీలాంటి భర్త వస్తే ఎలా అని బెంగటిల్లుతున్నా డాడీ! ప్లీజ్ డోంట్ హర్ట్ మామ్. ఐ బెగ్ యూ డాడ్! అమ్మని వాకింగ్ కి తీస్కెళ్లు. ఈస్ట్రోజన్ హార్మోన్స్ పెరిగే సోయా ఫుడ్ తెచ్చి పెట్టు. సినిమాలకీ, డిన్నర్లకీ తీస్కెళ్లు. నీ తోడు నేనున్నా అని భరోసా యివ్వు.’
మందాకినికి కన్నీళ్లు ఆగలేదు. తపస్య తండ్రితో చేసిన సంభాషణ. మెయిల్ ఆఫ్ చేసి వెళ్లడం మర్చిపోయాడు.

రాత్రి తొమ్మిదైయ్యింది. బాల్కనీలో సిగరెట్ తాగుతూ తిరుగుతున్న భర్తను చూస్తోంది మందాకిని. ఆమెకు కోపం ఎక్కువవుతున్నది. ఆమెలో సహనం నశిస్తున్నది. ఆమె చేతిలో అతని వయాగ్రా ప్రిస్క్రిప్షన్ నలిగిపోతున్నది. దాంట్లో అంగస్థంభన లోపం (ED) అని ఉన్నది. ఈడీతో బాటు ఈగో కూడా ఈయనకు ఉన్నది. ఈడీ అందుకే వచ్చింది.
రాత్రి పదకొండైయ్యింది.
మందాకిని వెనుక నుంచి భర్తను హత్తుకొంది. అతను ఇబ్బందిగా కదిలాడు. కొద్ది సేపు అయ్యాక అతన్ని స్పర్శించడం మొదలెట్టింది.
“ఏంటండీ కుండ బోర్లించినట్లు ఈ పొట్ట?” అతని పొట్టని నిమురుతూ, ఒక్కటిచ్చింది పొట్టమీద. అతను కొద్దిగా ఆశ్చర్యపోయాడు. కొద్దిగా దూరంగా జరిగాడు ఆమెనించి విడివడదామని. ఆమె మరింత దగ్గరకు జరిగింది. అతను మంచం మీద నుంచి లేవబోయాడు.
“ఎక్కడికెళుతున్నావు? వయాగ్రా వేసుకొని వస్తావా? నిత్య యవ్వనుడివి గదా! వయాగ్రా ఎందుకు?” అంటూ ఒక్కుదుటున లేచి అతని లుంగీ లాగేసి గది మూలకు విసిరేసింది. అతను బక్క చిక్కి పోయాడు. నగ్నంగా అచ్చం ఆడంలా తోచాడు.
మందాకిని పగలబడి నవ్వింది. కళ్లెర్రబడేదాకా, కళ్లలో నీళ్లు తిరిగే దాకా.
తర్వాత తన జాకెట్ లో దాచిన వయాగ్రా టేబ్లెట్లు–ప్రిస్క్రిప్షన్ తీసి అతని ముఖం మీద విసిరి కొట్టింది. ఆమెకెందుకో తనకు తాను పురుషుడి నగ్నత్వాన్ని కప్పి–సిగ్గు నేర్పిన ఈవ్ లాగా అన్పించింది. కాకపోతే ఈవ్ బట్ట కప్పింది. తాను ఈ ఆడం బట్ట విప్పింది.
పరుగున పోయి మూలనున్న లుంగీ అందుకొని గబగబా చుట్టుకొంటూ, ఆగ్రహంతో పులిలా ఊగుతూనే, పగలబడి నవ్వుతున్న భార్యని చూస్తూ; మందాకిని భర్త, గది బయటకు పరుగుదీశాడు.
***

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలుPermalink

2 Responses to ఫాల్ ఆఫ్ మాన్

  1. Varalakshmi says:

    ఈ కథ రాయడానికెంత సాహసం కావాలి! ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు.

  2. aslam khan says:

    చాల బాగా రాస్యారు మేడం గారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)