బడ్జెట్ భానుమతి(కథ )- ఉమాదేవి అద్దేపల్లి

” అమ్మాయ్ మేఘనా !”
గదిలోంచి భానుమతి అత్తయ్య పిలుపు వినిపించింది ..

”ఏంటత్తా!” కంప్యూటర్ నుండి దృష్టి మరల్చకుండానే అడిగింది మేఘన .
”సాయంత్రం అలా ‘లక్ష్మి గణపతి స్టోర్ కి వెళ్ళాలి ..గుర్తుంది కదా ! ఎక్కడికీ వెళ్ళకు..” పైకి మాత్రం”సరే ”అన్నాదే కానీ గుండెల్లో రాయిపడింది.కావాలంటే అర్ధరాత్రి స్ట్రీట్ లైట్స్ లేకపోయినా నగర మంతా తిరిగి వచ్చెయ్యమంటే ధైర్యంగా వెళ్లి రాగలను కానీ అత్తయ్యతో షాపుకి వెళ్ళడం అంటే మాత్రం చచ్చేంత భయం.అలా అని ఒకసారి వాళ్ళమ్మ తో అంటే ,

”తప్పే.పాపం పెద్దామె.మనమీద అభిమానంతో ఇంతదూరం లక్షలు ఖర్చు పెట్టుకొని వస్తుంటారు .వచ్చినపుడల్లా అందరికీ బోలెడన్ని విలువయిన వస్తువులు తెస్తునే వుంటారు కానీ మననుండి ఏమీ ఆశించరు..ఏదో నువ్వయితే బైక్
మీద తీసుకెళతావని అలా షాపింగ్ కి నీతో వెళ్లి ఏదో తనకి కావలసినవి కొనుక్కుందామని తాపత్రయం ..ఆ మాత్రం చెయ్యకపోతే నొచ్చుకుంటారు .”అని మేఘన నోటికి తాళం వేసింది తల్లి .

భానుమతి మేఘన తండ్రికి అక్కయ్య .ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయారు ఆమె కుటుంబం.మాతృ దేశం ,పుట్టినిల్లు మమకారం ఎక్కువ ఆమెకి .అందుకే రెండు సంవత్సరాలకొకసారి ఇండియా వస్తుందామె .చెన్నైలో సిటీ మధ్యలో ఆమెకి అపార్ట్మెంట్ వున్నా ,తమ్ముడు ,మరదలు బలవంతం మీద వారింట్లో దిగుతుంది.

మనిషి చాలా మంచిదే ,మనసు కూడా కల్లాకపటం లేనిదే.. అవసరం అనుకుంటే వెయ్యి రూపాయలను పది రూపాయల్లా ఖర్చు పెడుతుంది.లేదంటే పది రూపాయలని వెయ్యి రూపాయల్లా పట్టి వెనక్కి లాగుతుంది..అదే మేఘనకి నచ్చదు. దేనికయినా కొంచం పట్టు విడుపు వుండాలి అనుకుంటుందామే మనసులో ..బయటకి అంటే ఇంతే సంగతులు.ఇక షాపింగ్ విషయానికి వస్తే ,

” అమ్మాయ్ మేఘం! మంచి బట్టలషాపుకి తీసుకెళ్ళు .నేనో మంచిచీర కొనుక్కోవాలి ”అంది ఒకసారి .
కొత్తగా ఓపెన్ చేసిన మాల్ కి వెళ్ళి చీరల సెక్షన్ కి తీసుకెళ్లింది మేఘన .భానుమతి అత్తయ్య పాతకాలం నటి భానుమతిలాగే కాస్త ఎర్రగా ,బుర్రగా ,హుందాగా వుంటుంది .వెళ్ళగానే షాపు వాళ్ళు నమస్కారాలు చేస్తూ ,ఏ తరహా చీరలు కావాలి అని అడగకుండానే పెద్ద తరహాగా కనిపిస్తోందని పట్టు చీరలు చూపించారు. అక్కడ బోర్డ్ మీద ఆ సెక్షన్ లో ఎంత రేంజ్ లో ఉంటాయో లిస్టు వుంటుంది .ఒక లక్ష ఏభై వేలు నుండి పది వేలు ఖరీదు వరకు వుంటాయక్కడ..ముందు లక్షా ఏభై వేల రూపాయల చీర చూపించమంది ..షాపువాళ్ళ ఆనందానికి అవదుల్లేవు..మేనేజర్ స్వయంగా వచ్చి చీరలు తియ్యడానికి ముందే

”మేడం ! కాఫీ తాగుతారా ! కూల్ డ్రింకా!” అడిగాడు మర్యాదగా .

”కాఫీ ” అంది .

”రెండు కాఫీ ..”అని అటెండర్ కి చెప్పి,చీరలు జాగ్రత్తగా తీసుకొచ్చి ,మడత నలగకుండా విప్పి చూపించి దాని నాణ్యత
గురించి ఏకరువు పెట్టాడు.

”బాగానే వుందికానీ ,యీ శారీ కలర్ కి ,యీ పల్లు నప్పలేదు…” అంది ముఖం అదోలా పెట్టి ..
పట్టు వదలని విక్రమార్కుడిలా,

”ఇది చూడండి మేడం !..ఇలా మడత మీద వేసుకుంటే బాగుంటుంది ..మీరు తెల్లగా వుంటారు కదా ! ఈ చీర ,రంగు మీకు బాగా నప్పుతాయి ”అంటూ పాపం కాసేపు తాను మగవాడినని మరచిపోయి,చీరలు ఒకదాని తర్వాత ఒకటి పైట వేసుకొని కొన్ని ,పైట జార్చుకొని కొన్ని రకరకాల ఆడ భంగిమల్లో పోజులిచ్చిఆమెని ఇంప్రెస్ చెయ్యాలని ,కనీసం ఒక్కచీర ఆమె చేత కొనిపించాలని చాలా తంటాలు పడ్డాడు.చివరి ప్రయోగంగా ఆమెని పొగిడితే ఉబ్బు లింగడవుతుందని ఆశ పడ్డట్టున్నాడు ..లక్ష రూపాల చీర కొనిపించాలంటే ఇన్ని తంటాలు పడాలన్నమాట ..అనుకోని జాలి పడింది మేఘన వాళ్ళ మీద.. అత్త మనసు మాత్రం కరగలేదు ..

”సరే నండీ ! నేను మరొక నెల వుంటాను .ఈ లోపల ఏదయినా కొత్త స్టాక్ వస్తే చెప్పండి ..నేనే ఫోన్ చేస్తాను లెండి మీకు ”అంటూ మరొక సెక్షన్ కి వెళ్ళింది.

అక్కడన్నీ వర్క్ శారీస్ .పది వేలనుండి వెయ్యి రూపాయలు ..ఆ సెక్షన్ వాళ్ళ సహనానికి కూడా పరీక్షపెట్టాలని తీర్మానించుకున్నట్టు ఖడేరావులా బైఠాయించింది..అక్కడ ఒక గంటసేపు వాళ్ళ బుర్ర తిన్నాక ,

“వర్క్ శారీస్ నాకు బాగోవు ..” అనుకుంటూ లేచి పోచం పల్లి వైపు దారి తీసింది .

”ఈ సంగతి ముందు తెలియదా ! పెద్ద కొనేసేదానిలా మా దుంప తెంప పోతే..” సేల్స్ మాన్ ఎవరికో తెలుగోచ్చు కాబోలు ,నెమ్మదిగా గొణుక్కుంటూన్నాడు..

”అత్త చెవిని పడలేదు అదృష్ట వశాత్తూ..లేదంటే ఇతగాడి భరతం పట్టేది.నా చెవిని పడింది” ,

” నేను మనసులో అనుకుంటున్న మాట నువ్వు బయటకి చెప్పావు తమ్ముడూ!” అని మనసులోనే అనుకోని ,దీనంగా ఆ కుర్రాడి వైపు చూసి ,అత్తననుసరించింది . .

అసలు అన్నిటి కన్నా కష్టమైన పని బట్టల షాపులో సేల్స్ మాన్ పని అనిపించింది ఆమెకి మొదటిసారి ..ఒక చీర కొంటారు కొందరు ,అసలు కొనే కొనకుండా ఊరికే అలా కుప్పలు కుప్పలుగా రాశి పోయించి ఒక్కటి కూడా నచ్చలేదని వెళ్ళిపోతారు కొందరు ..పాపం ఇవన్నీమడతలు పెట్టి యధాస్థానంలో పెట్టాలి వాళ్ళు .

మేడమీద వున్నవన్నీచూసి ,
”ఇక్కడ ఏమీ బాగులేవు .కిందకి వెళ్దాం పద .” అంది .

క్రింద అన్నీ కాజువల్ ,కాటన్ శారీస్ వుంటాయి ..కాటన్ శారీస్ వైపు వెళ్తుంటే ”మా బడ్జెట్ భానుమతి అత్తని చూసి భారీ బడ్జెట్ అనుకోని సాదరంగా ఆహ్వానిస్తున్నారు.అయిపోయేర్రాబాబూ!”మనసులో అనుకుంది మేఘన .
తీరుబాటుగా స్టూల్ మీద కూర్చొని ,

”అబ్బాయ్! మంచినీళ్ళు ఉన్నాయా !” అడిగింది భానుమతి .

”ఒరేయ్ .మేడం గారికి మంచినీళ్ళ బాటిల్ తీసుకురా !” సేల్స్ మాన్ చెప్పగానే క్రింద వున్నఎటెండర్ బయటకి పరుగెత్తి రెండు నిముషాల్లో చల్లని నీళ్ళ బాటిల్ తెచ్చి అందించాడు.అందుకొని గడగడా సగం తాగేసి ”నీకు కావాలా !”అడిగింది మేఘనని ..వద్దనగానే ఆ మిగిలిన సగం తానే తాగేసి ఖాళీ బాటిల్ ఆమెకిచ్చింది .ట్రాష్ లో బాటిల్ పడెయ్యడానిక వెళ్తూ అనుకుందామే .
”చీరలు చూసి చూసి అలసిపోయిన నువ్వే ఒక బాటిల్ నీళ్ళు తాగావంటే ,నీకు చూపించిన వాళ్ళు ఇంకెన్ని బాటిల్స్ నీళ్ళు తాగాలో ..”

” చెప్పండి మేడం ..ధర్మవరం ,కంజీవరం ,గద్వాల ,ఆరణి, కొత్త స్టాక్ కాటన్ శారీస్ ” ఉత్సాహంగా అడిగాడు ..

”గద్వాల ,ధర్మవరం చూపించండి ..”పైన దొంతరలు చూస్తూ అంది ..ఒక గంటసేపు అక్కడ వాళ్ళని గుంటలో పెట్టి గంట
వాయించి ,

”మరీ ఇంత కాటన్ మేము మైన్ టైన్ చెయ్యలేము ఆ దేశంలో ..”అని లేవబోతుంటే ,

”సిల్క్ మిక్సేడ్ కాటన్ కూడా వుంది మేడం !” అంటుంటే

”నీ ఓపికకి జోహార్లు .’అనుకున్నది మనసులో మేఘన .

”మళ్ళీ వస్తాలే ..అక్కడేవో హంగర్స్ కి వున్నవి కూడా చూసి .” అంటూ అటు వెళ్ళింది..ఒక అరగంట పైనే వెతికి చివరకి ఒకచీర తీసుకొని ,

”ఇదిగో .. ఇది పాక్ చేయించు.”అని మేఘనకి ఇచ్చింది.

”అమ్మయ్య .ఇప్పటికి కనీశం ఒక్కచీర దొరికింది యీమె గారికి ఇంత పెద్ద మాల్ లో .”అనుకుంది మేఘన .

”ఏమిటోనే అమ్మడు! పండుగల్లో అయితే డిస్కౌంట్ ఉంటుందేమో ..” అత్త మాటకి ,చీర చూసి అనుమానం వచ్చి ఖరీదు చూసింది .రెండు వందల ఏభై రూపాయలు.

”హతోస్మి ” అనుకుంది .
కొన్నదేమో రెండు వందల ఏభై రూపాయల చీర .రెండు కప్పుల కాఫీ ,ఒక మంచినీళ్ళ బాటిల్ ముప్పై రూపాయలు.ఇవి చాలవా అత్తా నీకు డిస్కౌంట్ గా” .అనుకోని త్వరగా పరుగెత్తింది కౌంటర్ వైపు ,లేదంటే మళ్ళీ ఎక్కడో ఏవో కెలుకుతుంది..
బైక్ ఎక్కబోతూ,

”అత్తా ! నీ బడ్జెట్ మూడు వందల లోపు అయినప్పుడు నువ్వు లక్ష రూపాయల చీర దగ్గరనుండి ఎందుకు చూపించ మన్నావు .?” అడగకుండా ఉండలేకపోయింది . .

”బడ్జెట్ అంటూ ఎమీలేదే అమ్మడు ..నచ్చితే,అవసరం అనుకుంటే కొనుక్కోనేదాన్ని..”

”మరి ఇప్పుడు కొన్న చీర నచ్చిందా !”

”నచ్చిందని కాదు .ఇంతసేపు కాళ్ళరిగేలా షాపంతా తిరిగేము కదా ! ఈ మాత్రం కొనపోతే ఏంబాగుంటుంది అని కొన్నానంతే .”

”నీకు కాళ్ళరిగాయి షాపంతా తిరిగి .మరి వాళ్లకి చేతులు నొప్పి పెట్టావా అన్నీసి చీరలు మడతలు విప్పి చూపిస్తే..”

”వాళ్ళ ఉద్యోగమే అది .చూపించి తీరాలి ..”
స్కూటీ సీటు పైకి ఎత్తి ,చీర దానిలో పెడుతూ ,

”అత్తా ! ఇక్కడ ఇలా లెక్క పెడుతున్నావు కదా ! మరి అమెరికాలో షాపింగ్ ఇలాగే చేస్తావా !”

” ఇక్కడ ఇంకాతక్కువ అక్కడయితే పొద్దుట వెళ్ళిపోతే సాయంత్రం వరకూ అలా అన్నీ చెక్కబెట్టుకుంటాను..మాకు
పండుగలలో మంచి డిస్కౌంట్ లుంటాయి..”

”’అదీ సంగతి .ఆ దేశం గాలి వంటపట్టిన వారితో ఇక్కడ షాపింగ్ కి రాకూడదు బాబూ!”మనసులో అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసింది .

సాయంత్రం ఐదు గంటలకి అత్త రెడీ అయిపొయింది షాపు కి..ఇక తప్పేదేముంది..తానూ బయలుదేరింది మేఘన .బట్టల షాపు అయితే గంటలకొద్దీ వెతకాలి ,కానీ డిపార్ట్ మెంటల్ స్టోర్ అయితే టివీ ల దగ్గర నుండి ,పిన్నుల వరకూ టాగ్ లు వుంటాయి .కనుక పర్వాలేదు..

వీక్ ఎండ్ అయితే జనం వుంటారు .వర్కింగ్ డేస్ కనుక ఆరు దాటితే కాని అంత రద్దీ వుండదు..భానుమతి అత్త ఒక్కో కార్నర్ చూసుకుంటూ,కార్ట్ లో తనకి కావలసినవి పడేస్కుంటూ ఒక గంట లోపలే షాపింగ్ ముగించింది.అప్పటికి కొంచం జనం పెరిగారు .కౌంటర్స్ రెండే వుండడం వలన క్యూ బాగానే వుంది .అత్త క్యూ లో నిలబడింది.మేఘన ఫ్రెండ్ కాల్ చేసినట్టుంది ,మొబైల్ రింగ్ అయింది . ”ఒక్క నిముషం అత్తా !”అంటూ బయటకి వెళ్ళింది .ఈ లోపల అత్త బిల్ పే చేసి వచ్చేస్తుంది అనుకుంది అనుకుంటూ .

కానీ లోపలకి తిరిగి వచ్చేసరికి అత్త సీరియస్ గా కౌంటర్ లో వున్న అమ్మాయితో ఏదో వాదిస్తోంది .దగ్గరకు వెళ్లి అడిగింది ఏమయిందత్తా! అని. కౌంటర్ లో వున్నామె కలుగజేసుకొని చెప్పింది .

”బిల్ రెండు వందల తొంభై ఎనిమిది అయింది మేడం ..మూడు వందలు ఇచ్చారు.రెండు రూపాయలు చేంజ్ లేదు .చాక్లెట్ ఇచ్చాను .”

”ఈ చాక్లెట్స్ మేము తినము .నాకు రెండు రూపాయలు కావాలి ”మొండిగా అంది అత్త .నాకు తల కొట్టేసినట్టు అయింది .ఒక రెండు రూపాయల కోసం వేలు వేలు ఖర్చు చెయ్యగల స్తోమతు ఉన్నామె అలా వాదిస్తుంటే ,క్యూ లో వాళ్ళు అదోలా చూస్తుంటే చాలా అవమానం అనిపించింది .

”పోనీలే అత్తా ! అక్కర లేకపోతె చాక్లెట్ వదిలెయ్యి ..రెండు రూపాయలకోసం వాదనేందుకు.పద .వెళ్దాం .”కార్ట్ తీసుకుంటూ అంది మేఘన .

”రెండు రూపాయలు డబ్బులు కాదా ! ఎందుకొదలాలి..!”

”చిల్లర లేదని చెప్తోందిగా..”

”అలా చెప్పేస్తే వదిలెయ్యాలా ! చిల్లర వుంచుకోవాలి..ప్రతి వాళ్ళు లెక్కపెట్టి డబ్బులు తీసుకు రాలేరు కదా ! ఈ లెక్కని ఎంతమంది ఎన్ని రూపాయలు ,రెండు రూపాయలు వదులుకుంటారు ! అసలెందుకు వదులుకోవాలి !”లాజిక్ మొదలెట్టింది .అంతలో అటు ఇటు అక్కడే తచ్చాడుతున్న మేనేజర్ ఆపద్భాందవుడి లా వచ్చి వచ్చి ,విషయం తెలుసుకొని ,పక్క కౌంటర్ నుండి రెండు రూపాయలు తీసుకొచ్చి అత్త చేతిలో పెట్టాక కానీ కదల లేదు..మేఘనకి చాలా కోపం వచ్చింది అత్తమీద .మాటాడకుండా బయటకు రాగానే బైక్ స్టార్ట్ చేసింది . ..
ఇంటికి వచ్చాక అత్త బాత్ రూమ్ కి వెళ్ళగానే అమ్మతో సీరియస్ గా అంది ,

”ఇక నేను యీవిడ గారితో షాపింగ్ వెళ్ళను.వెళ్ళమని చెప్పకు ”

”గట్టిగా మాటాడకు .మీ అత్త వింటే బాగోదు ..ఏమయిందసలు..?”

”నేను చెప్తాను .” బాత్ రూమ్ నుండి వచ్చిన భానుమతి అనడంతో ఇద్దరు ఉలికి పడ్డారు .

”ఓహ్ ..వినేసిందన్న మాట ” అనుకుంటూ .మెల్లగా మేఘన లోపలకి జారుకోబోతుంటే ,

”అమ్మడు ! ఇలా రా .కూర్చో ముందు .”అంది తాను డైనింగ్ టేబిల్ వద్ద కుర్చీ లో కూర్చుంటూ .

”చచ్చానురా దేముడా ! ఇప్పుడు క్లాస్ పీకుతుంది కాబోలు .”అనుకుంటూ చేసేది లేక తాను చతికిల పడింది కుర్చీలో .
”ఏమయింది వదినా !” తాను కూర్చుంటూ అడిగింది కాత్యాయని .
షాపులో జరిగిన విషయం అంతా చెప్పి ,

” అదీ జరిగిన సంగతి కాత్యాయని .నేను రెండు రూపాయలకోసం గొడవచేసానని నీ కూతురుకి కోపం వచ్చి ముఖం ముడుచుకుంది . కదా బేబీ !” నవ్వుతూ మేఘన వైపు చూసింది భానుమతి.

” చిన్న పిల్ల .దానినేమీ పట్టించుకోకండి .కానీ వదినా ! మీకు కొత్త కనుక అలా అనిపించింది.మాకు అలవాటే .సూపర్ మార్కెట్ లో వెజిటబుల్ మార్కెట్ లో కూడా చిల్లర వుండదు..బాటా షాప్ వాడు చూడండి..తొంభై తొమ్మిది అంటాడు ,నూరు రూపాయల నోటు ఇస్తే తిరిగి రూపాయి ఇవ్వడు.అందుకే మేము వాటిని పెద్దగా పట్టించుకోము.ఇక పాల పేకెట్టు వాళ్ళయితే సరిపడా డబ్బులు తీసుకెళితేనె..లేదంటే రూపాయో,రెండు రూపాయలో నోక్కేస్తారు .’వాటి బదులు చాక్లెట్స్ ఇస్తారు ..”

”ఇది పబ్లిక్ దోపిడీ కాత్యాయనీ ! మనదగ్గర రెండు రూపాయలు ,మనలాగే ఒక వెయ్యిమంది వస్తే రెండు వేల రూపాయలు..ఉరికే అలా కూర్చొని కొట్టెయ్యడం .మనలాటివారు రెండు రూపాయలే అనుకుంటాము.బిజినెస్ చేసేవాడు అలా అనుకోడు ,మనకి ఆఫ్టరాల్ అనిపించిన రెండు రూపాయలతో లక్షలు పోగుచేసుకుంటాడు.అదీ బిజినెస్సంటే..బిందు బిందువు కలిస్తే సింధువవుతుంది. నదులన్నీ సముద్రం లో కలిసినట్టు వ్యాపారస్తులే అన్ని విధాలా లాభపడతారు.ఆ ఒక్కో రూపాయి ,రెండు రూపాయలు మనం ఎందుకు పోగుచేసుకోకూడదు…లేని వాడి దగ్గర బేరాలు చేస్తాము ,పెద్ద వ్యాపారస్తుల దగ్గర ఇలా నష్ట పోతాము .”

”చిల్లర డబ్బులు వుండవు ,దొరకడం కష్టం అంటున్నారోదినా”

”డిమాండ్ పెరిగేతే ఉత్పత్తి పెరుగుతుంది.అక్కడ రెండు రూపాయలు పెట్టు .అని ఖచ్చితంగా అందరు అడిగితే ,మర్నాడే గల్లా పెట్టి చిల్లరతో నింపుతారు..”

”నువ్వు చెప్పింది ఒక పాయింటే అక్కా ! చిన్నపుడు అమ్మ చెప్తుండేది ‘నన్ను పెంచితే నిన్ను పెంచుతాను అంటుంది కనుక రూపాయిని పాపాయిలా పెంచాలి !’ అని .ఇవన్నీ ఆర్ధిక శాస్త్రానికి మూల సూత్రాలు .” అప్పుడే బయటకు వెళ్ళిన విశ్వం లోనికి వస్తూ ఆమె మాటలు విని జవాబు ఇచ్చాడు .

” అంతే కదరా తమ్ముడూ ! అమెరికాలో తొమ్మిది డాలర్స్ తొంభై తొమ్మిది సెంట్లు ఇచ్చి ఒక వస్తువుకొంటే ,మనం మరచిపోయినా మనని పిలిచి మరీ సెంట్ తిరిగి ఇస్తారు .అలా నేను పోగుచేసిన సెంట్లు కొన్ని బ్యాంకు లో ఇచ్చి నోట్లు తెచ్చుకున్నాను.మరొక సంగతి , మొన్న చీరల షాపులో గంటలు వేస్ట్ చేసానని ,ఏమీ కొనలేదని నీ కూతురు అలిగింది..దేనికయినా మనలాటి మధ్య తరగతి వారికి ఒక బడ్జెట్ ఉండాలిరా. అంబానీ భార్య ,ఐశ్వర్యా రాయ్ కోట్ల ఖరీదయిన చీర ఒకసారి కట్టి పారేస్తారు .అంబానీ ప్రజల సొమ్ముతో బిజినెస్ చేస్తున్నాడు. ఐశ్వర్యా రాయ్ కుటుంబం లో ఒక సినిమాకి కొన్ని కోట్లు తీసుకుంటారు.అదీ ప్రజాధనమే. అన్నేసి కొట్లలో మూడు నాలుగు కోట్లు సముద్రం లో కాకిరెట్ట.పైగా వాళ్లకి చీరలు నేసిన వాళ్లకి పబ్లిసిటీ కనుక ఊరికే కూడా ఇచ్చేస్తారు.లక్షలు వేలు పెట్టి మనం కొనేముందు ఆలోచించాలి.ఏ పెళ్ళిళ్ళకో పేరంటానికో ఒకసారికన్నా అటువంటి చీరలు కట్టలేరు .మహా అయితే రెండు మూడు ఫంక్షన్స్ కన్నా ఒక చీర కట్టరు మనవాళ్ళు .ఈ లోపల ట్రెండ్ మారుతుంది.కొన్న విలువయిన చీరలు బీరువాలో..కొన్నాళ్ళకిలక్షల పురుగుల్ని చంపి నేసిన పట్టు చీరలు కాస్త పురుగులు మేసేస్తాయి. లక్ష రూపాయల చీర మహా అయితే ఏ వెయ్యిరూపాయలకో షాపులో అమ్మేస్తే తీసుకుంటారు. దానికన్నా నార పట్టుతో నేసిన నూలు చీర నయమే కదా !వాడినంతకాలం వాడి తరవాత ఏ పేదవారికో ఇచ్చేస్తే వాళ్లకి ఉపయోగం. నా మట్టుకు నేను సుక్ష్మం లో మోక్షం మంచిదంటాను.జనాలకి ఆడంబరాల మీద మోజు తగ్గాలిరా ..బంగారం షాపులు చూడు..బంగారం ధర ఆకాశాన్నంటు తోంది.అయినా షాపులు క్రిక్కిరిసి వుంటాయి. కనీసం ఒక గొలుసు మెడలో వేసుకొని బయటకి వెళ్ళడానికి జనానికి భయం .ఆ పాటిదానికి వేలం వెర్రిగా ఎందుకు కొనడం ! ..కొన్నవి చూపించడం కోసం ఫంక్షన్ లు ..ఎందుకురా ఇవన్నీ.తొంభై శాతం జనం మనదేశం లో ఇలా ఆడంబరాలకి డబ్బు తగలెడుతుంటే ,”భారత దేశం లో దుర్భర దారిద్ర్యం” అంటూ పెంటకుప్పల్లో,మురికి వాడల్లో ఫోటోలు తీసి పేస్ బుక్కులో ,ట్విట్టర్లో,టివి చానల్స్ లో ”ఇదే మా భారత దేశం” అని చూపించడం.. ,ఒకరి మెప్పుకోసం వెంపర లాడుతూ గుర్తింపు అడుక్కొనే వాళ్ళు కొల్లలు .ఆర్ధిక దరిద్రం ఒకరిదయితే ,భావ దరిద్రం ఇంకొకరిది..మొత్తానికి అందరూ
దరిద్రులే. బిచ్చగాళ్ళే.మానసిక బలహీనులే …”

” నీ పాయింట్ కరెక్టే ,కాకపోతే చిన్న డౌట్..అన్ని వైపులా అంతగా ఆలోచించే నువ్వు షాపులో వాళ్ళని ఎందుకు అలా చీరలు చూపించమన్నావు..? అది వారిని ఇబ్బంది పెట్టడం కదా !” అంతసేపటికి మళ్ళీ మామూలు మూడ్ లోకి వస్తు అంది మేఘన ,

” సరుకులో పస ఏమిటో చూడాలి అనిపించింది.కళ్ళు జిగేల్ మని కనిపించడానికి లక్షల చీర కట్టినా అందం చీరలో వుండదు ,అది కట్టిన మనిషిలో వుండాలి ..మసి పాతకట్టినా మాణిక్యం లా మెరిసేదే నిజమైన అందం…”

”నిన్ను మన దేశ ఆర్ధిక మంత్రిని చేస్తే అప్పుడు దేశం బాగుపడుతుందేమోఅత్తా ! .” నవ్విందిమేఘన .

”మా ఫ్యామిలీ ఫైనాన్స్ మినిస్టర్ ని నేనే కనుక ఇప్పటి వరకూ అంత పెద్ద కుటుంబాన్ని అతి సామాన్య స్థితి నుండి అంత స్థాయికి పెంచ గలిగాను.ఇంట గెలిచిన వారికి రచ్చ గెలవడం పెద్ద కష్టం కాదు .అయినా నా లాటి దాన్ని ఉపయోగించుకొనే అదృష్టం దేశానికి ఉండొద్దా !”

” ఏమయినా మా బడ్జెట్ భానుమతి అత్త గ్రేట్ ..”
నవ్వుకున్నారంతా హాయిగా ….

– ఉమాదేవి అద్దేపల్లి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , Permalink

5 Responses to బడ్జెట్ భానుమతి(కథ )- ఉమాదేవి అద్దేపల్లి

 1. Chandranaga Srinivasa Rao Desu says:

  ఉమాదేవి గారి ఈ కథ చాలా బాగుంది

 2. sahiti says:

  సరదా కథ

  • నైస్ స్టోరీ ఐ లైవ్ ఇన్ అమెరికా టూ లాస్ట్ ౨౦ఏఅర్స్ ఇలాగె ఉంటుంది మేము ఇండియా కి వస్తే !!!!!!!!!!!!

  • ఉమాదేవి says:

   థాంక్స్ సాహితీ గారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)