నా జీవనయానంలో (ఆత్మ కథ )- 61.. బాలయోగి సందర్శనం – కె వరలక్ష్మి

బట్టలు మార్చుకుంటున్న మోహన్ కాలుతో ఫట్ మని నా మొహం మీద తన్నాడు. బాబు బిత్తరపోయి నవ్వు ఆపేసి కెవ్వుమని ఏడుపు మొదలు పెట్టాడు. మోహన్ కి ఉద్యోగం వచ్చాక నా జీవితంలో గొప్ప మార్పేదో వస్తుందని నేను కన్న కలలు నిజాలు కావని నాకర్థమైంది. ఏ విషయంలోనూ అతన్నెదిరించడానికి గానీ, పోట్లాడ్డానికి గానీ, నాకు ఓపిక ఉండేది కాదు. సంసారాన్ని వీధిలో పెట్టుకోకూడదనే పిచ్చి నమ్మకం ఒకటి, తోడూ నీడా లేని ఒంటరితనం అన్పించేది. నాకు ప్రియమైన నేస్తాలు పుస్తకాలు ఎక్కడా దొరికేవి కావు. రోజంతా బాబును చూస్తూ వాడు చేసే అల్లరి పనులకు ఆనందిస్తూ, వాడికి ఏ కొంచెం నలత చేసినా భయపడి ఏడ్చేస్తూ రోజులు గడుస్తూండేవి. అదృష్టం కొద్దీ మాపక్క పోర్షన్లో అద్దెకున్న కుటుంబంలో అతను కందికుప్పలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో కాంపౌండరు, అతని భార్య, ఎనిమిదేళ్ళ పాప, నాలుగేళ్ల అబ్బాయి అందరికీ బాబంటే మహా ఇష్టం. ఎత్తుకుని తీసుకెళ్ళి పోయేవాళ్ళు. ఏ టిఫినో, పాలో తిన్పించినా, తాగించినా ఆ గిన్నో, గ్లాసో పట్టుకుని పాక్కుంటూ వచ్చేసేవాడు. అది వాళ్లకి పెద్ద సరదాగా ఉండేది. వాడి బుగ్గలు పిండేసి, ఎర్రగా కందిపోయేలా ముద్దులు పెట్టేసుకునేవాళ్ళు.

ఒకసారి కాంపౌండరు గారు ‘మా డాక్టరుగారి భార్యది మీ ఊరేనంటండీ, ఆవిడ పేరు పాపాజీ, కోమట్లు. మీ పేరడిగిరమ్మన్నారు.’ అన్నాడు. తను నాతో ఐదో తరగతి వరకూ చదివిన కొత్తవారమ్మాయి పాపాజీ. దేశం కాని దేశంలో మన ఊరివాళ్ళొకళ్ళు కన్పించినంత ఆనందం కలిగింది. రెండు మూడు సార్లు కలుసుకుని కబుర్లు చెప్పుకున్నాం. ఓ రెండుసార్లు అమలాపురం వెళ్ళి కృష్ణగారి సినిమాలు ‘గూఢచారి, మోసగాళ్ళకు మోసగాడు’ చూసాం. మేం వెళ్ళేది మేట్నీకి కావడం వల్ల తలుపులు మూసి సినిమా మొదలవగానే బాబు ఏడుపు మొదలుపెట్టేవాడు. బైట వెలుతురులోకి వెళ్తే గానీ ఏడుపు ఆపేవాడు కాదు. పాపం రెండు సార్లూ మోహన్ ఎత్తుకుని బైట నిలబడ్డాడు. పిల్లవాడ్ని ఇబ్బంది పెట్టడం వద్దులే అనుకుని నేనింక అక్కడున్నన్నాళ్ళూ సినిమాలకి వెళ్ళలేదు. శివరాత్రికి బాలయోగిని చూడాలని మా అమ్మ దొంతికుర్రు వచ్చింది. మేం కూడా తన వెంట ముమ్మిడివరం వెళ్ళాం. కిక్కిరిసిన బస్సులో ప్రయాణం, ముమ్మిడివరంలో విపరీతమైన జనసందోహం, చాలా దూరం నుంచి ఏర్పాటు చేసిన క్యూలు, బాలయోగి గది బైట ఎత్తైన ప్రదేశంలో స్టేజీ మీద పద్మాసనంలో కూర్చున్నాడు. జనం ఎడమవైపు నుంచి మెట్లెక్కి ఆయన ముందు నడిచి కుడివైపు నుంచి కిందికి దిగాలి. అప్పటికి కొంత ముందు బాలయోగి తమ్ముడు చిన్న బాలయోగి కూడా తపస్సులో కూర్చున్నాడట. అతన్ని ఆ గదిలోకి వెళ్ళి చూసొచ్చేం. పెద్ద పెద్ద జడలు కట్టిన జుట్టు, పొడవుగా పెరిగినగోళ్ళు, మెరిసే దేహం, పెద్ద బాలయోగి పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుని కూర్చున్న ఆయన ఉండుండి జోగినట్టై ఒరిగిపోయినప్పుడల్లా క్యూ ఆగిపోయేది. తిరిగి మొదలు కావడానికి అరగంటో, గంటో పట్టేది. సినీనటుడు ఎస్.వి రంగారావుగారు క్యూలో మా వెనుక ఉండటం వల్ల ఆయనని చూశాం. రోజంతా భరించలేని ఎండవేడికి పెద్దవాళ్ళమే సొమ్మసిల్లినట్టైపోయాం. ఇంక బాబుకైతే మోషన్స్ పట్టుకుని కళ్ళు తేలేశాడు. బస్సు దొరకడం కష్టమై పోయింది. ఎలాగో అర్థరాత్రికి ఇంటికి చేరుకుని కాంపౌండరు గారిచ్చిన మందులు వేసి రాత్రంతా ఏడుస్తూ మా అమ్మా, నేనూ మేల్కొని కూర్చున్నాం.

కాలవ కవతల ఎదురింత్లో మీనాక్షి అని ఓ యువతి ఉండేది. పొట్టిగా, నల్లగా భుజాల వరకే ఉన్న జుట్టుతో, నవ్వితే పళ్లన్నీ కన్పిస్తూ ఉండేది. రోజూ నేను కనబడగానే నవ్వుతూ పలకరించేది. వాళ్ళింట్లో ఏం వండుకున్నా తెచ్చి ఇచ్చేది. గుళ్ళో ప్రసాదంగా ఇచ్చేలాంటి చిట్టివడలు తరచుగా చేసేది. అక్కడ నేను కొత్తగా చూసిన తీపి వంటకం రోటి తొక్కుడుండలు. ఉప్పుడు బియ్యాన్ని నూనె లేకుండా వేపి, తిరగలిలో సన్నని రవ్వగా విసిరేవాళ్ళు. ఆ రవ్వలో పచ్చి కొబ్బరికోరు, కొత్తబెల్లం గుండ వేసి మధ్యమధ్యలో నెయ్యి పోస్తూ దంపుడు రోట్లో పాకం వచ్చేవరకూ దంచేవాళ్ళు. ఆ ముద్దను బైటికి తీసి ఉండలుగా చుట్టే వాళ్ళు. వాటి రుచి చెప్పనలవి కానట్టుండేది. ఒకసారి మీనాక్షి వాళ్ళింటికి ఎవరో చుట్టాలొచ్చేరు. ఓణీ వేసుకున్న ఒక అందమైన అమ్మాయి, తన వెంట ముగ్గురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, వాళ్ళమ్మ కూడా చాలా అందమైనది. వచ్చింది మొదలు అలా నాగరికంగా కన్పించేవాళ్ళని నేను అదే చూడడం. ఆ అమ్మాయి ముఖంలోని సాత్త్వికత నాకెంతో నచ్చింది. నవ్వుల్తోనే పలకరింపులయ్యాక మా ఇంటికి రమ్మని పిలిచాను. వచ్చింది. తన కథ విన్నాక నా మనసు కరిగి నీరైంది. వాళ్ళ నాన్నగారు బర్మాలో వ్యాపారం చేసేవారట. వీళ్ళంతా అక్కడే పుట్టారట. రెండేళ్ళ క్రితం వచ్చేసి ఓ స్నేహితుడితో కలిసి రాజమండ్రిలో, వైజాగ్లో ఇళ్ల స్థలాలు కొని వ్యాపారం ప్రారంభించారట. క్రితం నెలలో విపరీతమైన తలనొప్పి వస్తే వైజాగ్ లో బ్రెయిన్ ట్యూమర్ అని ఆపరేషన్ చేశారట. ఆపరేషన్లోనే ఆయన ప్రాణం పోయిందట. వ్యాపారానికి సంబంధించిన వివరాలేవీ భార్యకి కూడా చెప్పలేదట. ఆ స్నేహితుడు తనకేమీ తెలీదన్నాడట. వీళ్ళమ్మగారి నగలు అమ్మేసి హాస్పిటల్ బిల్లు కట్టేసి ఇలా వీళ్ళమ్మమ్మగారింటికి వచ్చేశారట. తను రాజమండ్రిలో పదో తరగతి పాసై హిందీ పరీక్షలు కట్టబోతోందట. ఆ అమ్మాయి ఎంత ఆత్మీయత ఫీలై ఇదంతా చెప్పిందో, మేమిద్దరం మంచి స్నేహితులమైపోయి ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. తర్వాతి కాలంలో నేను స్కూలు ప్రారంభించాక తనకి రాజమండ్రి మునిసిపల్ స్కూల్లో హిందీ టీచర్ గా ఉద్యోగంవచ్చేవరకూ నా దగ్గరే టీచర్ గా వర్క్ చేసింది. ఇంతకీ తన పేరు కూడా వరలక్ష్మి. ఇప్పటికీ తనని తల్చుకుంటే ఎంతో ఆత్మీయంగా అనిపిస్తుంది.
1970 ఫిబ్రవరి నెల వచ్చేసింది. బాబు పుట్టినరోజు నాలుగురోజుల్లోకి వచ్చేసినా మోహన్ బాబుకి కొత్త బట్టలు కొనలేదు. పేకాటలో డబ్బులు పోగొట్టుకోవడం వలన ఆ నెలలో డబ్బులు లేవట. వీధిలో అమ్మడానికి వచ్చిన బట్టల మూట దగ్గర మూడు రూపాయలకి ఎర్ర రంగు కాటన్ ముక్క కొని చేతులు లేని జుబ్బా, చెడ్డీ కుట్టాను. జుబ్బా కుట్టడానికి టైలరింగ్ రానక్కర్లేదు. చేతికుట్టు వస్తే చాలు. అదే వాడికి మొదటి పుట్టినరోజు డ్రస్.

మోహన్ ఉత్తరంలో రాసినట్టున్నాడు మోహన్ ఫ్రెండ్ సత్యన్నారాయణ శాస్త్రి వచ్చాడు. తను అప్పటికి రామచంద్రపురం హైస్కూల్లో జాబ్లో చేరినట్టున్నాడు. మోహన్ మధ్యాహ్నం స్కూలునుంచి వస్తూనే సాయంకాలం మా స్కూలు టీచర్లందరినీ పార్టీకి పిలిచాను అన్నాడు. కందికుప్పనుంచి స్వీట్లు, బూందీ, బిస్కెట్లు తెచ్చాడు. నేను ఇంట్లో పకోడీలు, టీ చేశాను. ముందురోజే ఒక మాస్టారు తాలూకువాళ్ళెవరో దొంతికుర్రులో ఫ్లాస్టిక్ వస్తువుల షాపు పెట్టారట. ఇంచుమించు అందరూ ఓ ఫ్లాస్టిక్ గ్లాసో, కప్పో తెచ్చి బాబుకి ఇచ్చారు. ఇద్దరేమో చెరో అర్ధరూపాయి, ఒకావిడ ఒకరూపాయి ఇచ్చారు. ఇంటి అరుగుల మీద చాపలు, వాకిట్లో కాలవ పక్కన అందరిళ్ళల్లోంచి తెచ్చిన కుర్చీలు వేశాం. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. బాగానే జరిగిందని తృప్తిపడ్డాం. కందికుప్పనుంచి ఫొటోగ్రాఫరొచ్చి బాబుకి ఫోటో తీశాడు. సాయంకాలం సత్యనారాయణ శాస్త్రి వెళ్తూ మోహన్ చూడకుండా బాబు చేతిలో పదిరూపాయల నోటు పెట్టి ‘ మావాడికి చెప్పకండి, ఏ పేకాటకో తగలేస్తాడు. నా పేరుతో బాబుకి ఏదైనా కొనిపెట్టండి.’ అన్నాడు. పదిరూపాయలంటే అప్పటికి ఎక్కువే. జగ్గంపేట వెళ్ళేటప్పుడు కాకినాడ బంగారం షాపులో పన్నెండు రూపాయలకి ముత్యం పొదిగిన రెండు గ్రాముల బంగారం ఉంగరం కొన్నాను. హైస్కూల్లో చేరినప్పుడు వేలికి పెడితే మా వాడు కొరికి కొరికి ముత్యం పోగొట్టేడు. కంసాలికిస్తే ముత్యం లేదని కెంపురంగు రాయి వేశాడు. మొదట కొనుక్కున్న వస్తువు అనే సెంటిమెంటుతో ఆ ఉంగరం ఇప్పటికీ నా ఎడంచేతి ఉంగరం వేలుకి ఉంటుంది.

బాబు పుట్టినరోజు జరిగిన మరుసటి నెలలో నా ఒంట్లో మళ్లీ ప్రెగ్నెన్సీ లక్షణాలు కన్పించాయి. ఈసారి వికారం వాంతులు మొదలుకాగానే నాకు అర్థమైపోయింది. నేను లేవలేక పడిఉంటే ఎదురింటి మీనాక్షి వచ్చి సాయం చేసేది. వాళ్లింట్లోంచి వేపుడు జావ తెచ్చి నన్ను లేపి కూర్చోబెట్టి తాగించేది. నేను సొమ్మసిల్లి పడి ఉంటే బాబు పాకుతూ వెళ్ళి పొయ్యిలో కొబ్బరి డొక్కలు పెట్టి, పొయ్యి మీద పెనం పెట్టి అట్లకాడతో కలుపుతూండేవాడు. ఇంకోరోజు డొక్కలమీద కిరసనాయిలు వంపి అగ్గిపెట్టె చేతిలోకి తీసుకున్నాడు. మరోరోజు వెలుగుతున్న పొయ్యి ముందు కష్టపడి లేచి నిలబడి ఉడుకుతున్న అన్నంలో గరిట పెట్టాలని ప్రయత్నించేడు. వెంటనే మా నాన్నకు ఓ కార్డు రాసాను. మా నాన్నొచ్చి నన్నూ బాబునీ జగ్గంపేట తీసుకెళ్ళారు. డా.జయగారు వాంతులు మరీ బాధించకుండా ఉండటానికి ఎవామిన్ టాబ్లెట్లు ఇచ్చారు. మరుసటి వారం మోహన్ వచ్చినపుడు బయలుదేరుతుంటే మా వాళ్ళు బాబుని పంపడానికి ఒప్పుకోలేదు. ‘అమ్మో పిల్లోడు పొయ్యి దగ్గరకి వెళ్ళిపోతున్నాడంటున్నావ్, ఇంకేమైనా ఉందా’ అంటూ.

మేం తిరిగొచ్చాక నాకేం తినాలనుందో అడిగి చేసి తెచ్చి పెట్టేది మీనాక్షి, పెళ్ళైన కొద్దికాలానికే మీనాక్షి భర్తనుంచి విడిపోయిందట. పక్కింటి కాంపౌండరు పెళ్లాం మీనాక్షికీ, మోహన్ కీ అక్రమ సంబంధం అంట కడుతూ మాట్లాడేది. కొత్తల్లో నేనూ నమ్మేసి ఉడుక్కునేదాన్ని. తర్వాత తర్వాత ఆమెనైజం అర్థమయ్యాక నా తప్పు తెలుసుకున్నాను. పల్లెటూళ్ళలో ఎంత తొందరగా సంబంధాలు అంట గడతారో నాకు తెలుసు. మోహన్కి ట్రాన్స్ఫర్ అయి మేం అక్కడినుంచి వచ్చేటప్పుడు మీనాక్షికి మరీ మరీ కృతజ్ఞతలు చెప్పాను. రెండేళ్లక్రితం మా అబ్బాయి కుటుంబంతో కలిసి ఆ ఊరెళ్లినపుడు సగం కూలిపోయిన ఆ ఎదురింట్లో మీనాక్షి ఒక్కత్తే ఉంది. వయసు మీద పడింది. ఎంత చెప్పినా నన్ను గుర్తు పట్టలేదు కానీ, ఆ రోజుకి ఉండమనీ, భోంచేసి వెళ్ళమనీ తన సహజ నైజంతో అంది. మేం నివసించిన ఇల్లు కూడా ఇప్పుడు లేదు. కాలవలో నీళ్ళు లేవు. ఊరేమీ వృద్ధి చెందినట్టు కనబడలేదు, ఒకప్పుడు బర్మా వెళ్ళినట్టు ఇప్పుడు యువత అంతా హైదరాబాద్కో, ఎబ్రాడ్స్కో వలసలు పోయారు.

జగ్గంపేటకి అభేదానంద అనే స్వామీజీ వచ్చి గీత ప్రవచనాలు చేస్తున్నారనీ, చాలా బావుంటున్నాయనీ, మా ఇంట్లో వాళ్ళంతా రోజూ వెళ్తున్నారనీ, అక్కడ మా బాబును చూస్తున్నాననీ, వాడికి చకచకా నడవడం వచ్చేసిందనీ జగ్గంపేటనుంచీ నా ఫ్రెండ్ మీనాక్షి ఉత్తరం రాసింది. నేను స్వయంగా చదువుకోవాలని భగవద్గీతకోసం చాలా ప్రయత్నించాను. అక్కడ ఎక్కడా దొరకలేదు. తిరిగి జగ్గంపేట వెళ్ళింతర్వాత భగవద్గీత మాస్టారినడిగి తీసుకుని చదివాను. అప్పుడే మనసులో నిర్ణయించుకున్నాను. పుట్టబోయే బిడ్డకు గీతామాధవుడి పేరు పెట్టాలని నా ఫ్రెండు ఉత్తరంలో ఓ చోట అభేదానంద చిన్న వయసు వాడనీ, ఎంతటి అందగాడంటే నల్లనివాడు కాకుంటే శ్రీకృష్ణుడు ఇలాగే ఉండి ఉంటాడేమో అంటూ రాసింది. ఆ అందమే ఆయన చుట్టూ స్త్రీలను చేర్చి స్వామీజీ స్థానం నుంచి ఆయన్ని కిందికి పడదోసిందనీ తర్వాతెప్పుడో తెలిసింది.
మెడిసిన్ చదవాలనుకున్న నా ఫ్రెండ్ ఆదిలక్ష్మి పి.యు.సి థర్డ్ క్లాసులో పాసవడం వల్ల డొనేషన్ కట్టాల్సిన పదివేలు కట్నంగా ఇచ్చి దానికి వాళ్ల మేనమామతో పెళ్ళి నిశ్చయించారట. ఆ విషయం రాస్తూ ‘ఏమే, నీ చెంపలు, చేతులు, కాళ్ళు, అంత మృదువుగా ఉండటానికి ఏం వాడతావో చెప్పవా’ అంటూ ఉత్తరం రాసింది. ఏం జవాబు రాయాలో నాకు తెలీలేదు. అసలు నేనేమైనా వాడితే కదా! కానీ పత్రికల్లో చదివిన టిప్స్ కొన్ని రాశాను. ‘ఏమే, నువ్వేదో ఎవరికీ తెలీకుండా రహస్యంగా చెప్తావనుకుంటే ఇంత పబ్లిగ్గా ఉత్తరంలో రాస్తావా’ అంటూ కోప్పడుతూ రాసింది. ఆ రోజుల్లో అంతదూరంనుంచి రహస్యంగా ఎలా చెప్పాలబ్బా? నాకిప్పటికీ అర్థం కాలేదు.

మార్చి మొదటివారం నాటికే దొంతికుర్రులో నూతులన్నీ ఎండిపోయాయి. తాగడానికి ఎప్పుడూ దొరికే ఉప్పునీళ్ళు కూడా లేకుండా పోయాయి. కాలవగట్టు వెంబడే నడిస్తే ఊరికాచివరెక్కడో ఒక నుయ్యి ఉంది. ఊరంతటికీ అదే ఆధారం. ఊరిన నీళ్ళు ఊరినట్టే మట్టితో ఊడ్చి తోడేసేవారు.

-కె వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, నా జీవన యానంలో..., , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో