జ్ఞాపకం-12 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

                    ‘‘గ్లాసుపని తర్వాత. ఇంటి ముందు ఇంతవరకు ముగ్గే వెయ్యలేదు. సంలేఖ ఎక్కడుందో పిలువు. అదైనా వేస్తుంది.’’ అన్నాడు రాఘవరాయుడు కోడలికి ఏ పని చెబితే ఏం ముంచుకొస్తుందో అని. మామయ్య గారు అలా అనగానే అక్కడ నుండి కదిలింది వినీల.  పరిగెత్తుకుంటూ వెళ్లి వంటగది బయట కొళాయి దగ్గర వున్న నీళ్లున్న బకెట్‌ పట్టుకొచ్చింది ‘‘గ్లాసు పని, ముగ్గుపని నేను చూస్తాను. లేకుంటే ఆ చదువేదో నా వల్లనే  సరిగా సాగడం లేదని సంలేఖ అంటుంది అత్తయ్యా! పిలవకండి’’ అంటూ నీళ్ల బక్కెట, ముగ్గు డబ్బాతో బయటకెళ్లింది వినీల.
                                          
                   తిలక్‌ ఎప్పుడూ ఓ ధ్యేయం పెట్టుకుని చదవలేదు కాబట్టి అతనికి ఎలాగూ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోవచ్చు.కానీ సంలేఖ ? క్లాసులో తనని మించి పోవాలన్న లక్ష్యంతో చదివిన సంలేఖ చివరికి ఏమైంది? దానికి కారణం ఎవరు? తనే కదూ! అప్పుడలా జరిగివుండకపోతే ఈరోజు ఆమె కూడా ఏదో ఒక కంపెనీలో తనలాగే చార్టెడ్‌ అకౌంటెంట్‌ అయివుండేది. కుటుంబ బాధ్యతల్ని అవలీగా దాటించగలిగేది… అసలీ బాధలనేవి వాళ్ల ఇంటి దరిదాపుల్లోకి కూడా వచ్చి వుండేవి కావు.  

                  ఇదంతా పరోక్షంగానైనా తన వల్లనే  జరిగింది. అలా అని సంలేఖ కోసం వచ్చానని ఎలా చెప్పగలడు? అలా చెబితే అసలు  సంలేఖ నమ్ముతుందా? ఆ నమ్మకాన్ని తనేకదా పోగొట్టుకున్నాడు!! కానీ ఎందుకో ఈ మధ్యన దిలీప్‌ సంలేఖ కథ గురించి చెప్పకముందు కూడా సంలేఖ తనకి గుర్తురావడం ఆశ్చర్యం అన్పించింది. తనకి తెలియకుండానే తన మనసు సంలేఖ గురించి ఆలోచిస్తుందేమో! తనిలా చెబితే ఆమె నమ్ముతుందా? లోపలికెళ్లి రాఘవరాయుడుతో మాట్లాడాలని, తనెవరో పరిచయం చేసుకోవాలని వుంది… కానీ అంత సాహసం చెయ్యలేకపోతున్నాడు. నడుస్తున్నాడే కాని అతన్ని ఒక విధంగా నిరాశా, నిస్పృహలు  ఆవరించాయి. ఇప్పుడు సంలేఖను కలవకుండా నేరుగా హైదరాబాద్‌ వెళ్లిపోతే మళ్లీ జీవితంలో సంలేఖను కవలేనేమో అన్పించింది.[spacer height=”20px”]
                    అందుకే ‘ఎలా చేస్తే బావుంటుంది…?’ అని ఆలోచిస్తూ అడుగులేస్తున్నాడు.అతని పక్కనే పెద్దగా హారన్‌ మోగించుకుంటూ ఓ బస్‌వెళ్లి కొద్దిదూరంలో ఆగింది. ఏ మాత్రం ఆలోచించకుండా సంలేఖను కాలేజీలో కలవాలని ఆ బస్కెక్కి కూర్చున్నాడు జయంత్‌. బస్‌లో కూర్చున్నాక కూడా అతను సంలేఖ ఇంటి వాతావరణం గురించే ఆలోచిస్తున్నాడు.[spacer height=”20px”]
                    సిటీ రాగానే బస్‌ దిగిన జయంత్‌ నేరుగా హోటల్‌కి వెళ్లి ప్రెషప్పయి, దిలీప్‌కి ఫోన్‌ చేసాడు. వెంటనే దిలీప్‌ వెళ్లి హోటల్‌లో వున్న జయంత్‌ని కలిసాడు. తరుచుగా ఫోన్లో మాట్లాడుకుంటున్నా ఎంతో కాలం  తర్వాత కలిసిన మిత్రుల్లా ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకున్నారు, మాట్లాడుకున్నారు.[spacer height=”20px”]
‘‘రా ! జయంత్‌ ! ఇంటి కెళ్దాం ! ’’ అంటూ జయంత్‌ని తన ఇంటికి తీసుకెళ్లాడు దిలీప్‌.దిలీప్‌ ఇంట్లో, దిలీప్‌కి ఎదురుగా సోఫాలో కూర్చున్న జయంత్‌ ఆలోచనలు  వేరేగా వున్నాయి. ‘హస్విత రాదేం? తనని పకరించదేం ? ఇంట్లో లేదా ?’ అని మనసులో అనుకుంటున్నాడు.[spacer height=”20px”]
                    ‘‘ఉద్యోగంలో సెటిల్‌ అయ్యావు కదా ! పెళ్లెప్పుడు చేసుకుంటావ్‌ జయంత్‌ ?’’ అడిగాడు దిలీప్‌.ఆ మాటకు సమాదానం చెప్పేముందు తను కూర్చున్న హాలుని పరిశీనగా చూశాడు జయంత్‌. పెళ్లయి, భార్య వచ్చాక దిలీప్‌ లైఫ్‌స్టైలే మారిపోయింది. పెళ్లికి ముందు ఒక చిన్న గదిలో ఫ్రెండ్స్‌తో వుండే వాడు ఒకసారి తనొచ్చినప్పుడు స్వయంగా వండి పెట్టాడు. ఆ తర్వాత ఇప్పుడే రావటం. పెళ్లికి రాలేకపోయాడు… ఇంటి నిండా వస్తువులు  డబ్బుంటే వుంటాయి. వాటిని శుభ్రంగా వుంచుకోవడం, ఏది ఎక్కడ వుంచాలో చూసుకోవడం, భార్యపని. ఆపని సక్రమంగా చేస్తేనే ఇంటితో పాటు ఆ ఇల్లాలికి కూడా అందం వస్తుంది. దిలీప్‌ భార్య హస్విత ఆ పనిని చాలా చక్కగా చేస్తున్నట్లు చూడగానే తెలిసిపోతోంది.

            హస్వితకి మనసులోనే వందకి వంద మార్కులు  వేస్తూ దిలీప్‌ వైపు తిరిగి… ‘‘ఏమడిగావ్‌ ? ఉద్యోగంలో సెటియ్యావు కదా ! పెళ్లెప్పుడు అనా ? పెళ్లంటేనే భయంగా ఉంది దిలీప్‌ !’’ అన్నాడు జయంత్‌.ఆశ్చర్యపోతూ ‘‘భయందేనికి?’’ అడిగాడు జయంత్‌.
‘‘పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి ఎలా వుంటుందో ఏమో అని…’’ అన్నాడు జయంత్‌.
అర్థంకాక ‘‘అదేం సందేహం జయంత్‌ ?’’ అన్నాడు దిలీప్‌.

– అంగులూరి అంజనీదేవి

———————————————————————————————–

జ్ఞాపకం, ధారావాహికలు, , , Permalink

Comments are closed.