జ్ఞాపకం-11 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

                                       వినీల  ఆమెనే చూస్తూ చేతులు  చాపి ‘‘లేవగానే నన్ను నేను చూసుకునే టైం నాకెక్కడుంది అత్తయ్యా! దిగ్గున నిద్రలేచి మంచం దిగి వస్తే చీర, జుట్టు ఇలా వుండక ఇంకెలా వుంటాయి? నేనేమైనా తలస్నానం చేసి, తులసి కోట చుట్టూ తిరిగి పూజ చేసి వస్తున్నానా? నీ చిన్న కొడుకు అనే మాటలు  వింటున్నావుగా! మనిషన్నాక నిద్ర వుండదా? లోకంలో నేనొక్కదాన్నే నిద్రపోతున్నానా? ఇంకెవరూ నిద్ర పోరా! అదేంటో ఇలాంటి పద్ధతులన్నీ ఈ ఇంట్లోనే వున్నాయి. ఇంకా ఏ ముఖం పెట్టుకొని నిద్రపోవాలి? అందుకే ఆ దిక్కు మాలిన నిద్ర లేకపోతే పోయిందని లేచి వచ్చాను’’ అంది .ఇంత పెద్ద గొంతేసుకుని అరుస్తూ.
                                       వినీల  ఎప్పుడైనా అలాగే మాట్లాడుతుంది. పక్క ఊరు. ఏదో తండ్రిలేని పిల్ల. వున్న అన్నయ్య కూడా మెకానికల్‌ షెడ్డులో పని చేస్తున్నాడు. కష్టం, సుఖం తెలిసి వుంటుంది. చెప్పిన మాట వింటుంది అని రాజారాంకి ఇచ్చి పెళ్లి చేస్తే ` మాటకు నాలుగు మాటలు  సమాధానం చెప్పి మనసును కత్తితో పొడిచినట్లు గాయపరస్తూ వుంటుంది.
వినీకి ఇంకా నిద్ర పోవాలని ఉందో ఏమో ! ‘‘నాతోపాటు పెళ్లిళ్లయిన నా స్నేహితురాళ్లు ఎంతసేపు కావాలoటే అంతసేపు నిద్రపోతున్నారట… వాళ్లకున్న స్వేచ్ఛ నాకు లేదు. నిశ్చింతగా నిద్రపోయి ఎన్నాళ్లయిందో. ఇదేం ఖర్మో నిద్రకి ముఖం వాచి చస్తున్నా….’’ అంటూ గొణిగింది.
                                        వంటగది ముందే నిలబడి వున్న తిలక్‌ ఆ మాటలు  విని ‘‘ఇది ఖర్మ కాదు. ముందుగా నిద్రలేస్తే ముందుగా తినొచ్చు. ఎప్పుడు చూసినా పడుకుని ఇంకెప్పుడో నిద్రలేస్తే తిండెప్పుడు తినాలి?’’ అన్నాడు.
రాజారాం బ్రష్‌ చేసుకోవాలని వంట గది పక్కన వున్న టాప్‌ దగ్గరికి వెళ్లాడు.వినీల  పాము బుసకొట్టినట్లు నిట్టూర్చి ‘వీడికెప్పుడూ తిండి పిచ్చి. ఆ సంలేఖకేమో చదువుపిచ్చి తగ్గి కథలు  రాసే పిచ్చి పట్టుకుంది. శ్రీవారికేమో పిల్లలకు పాఠాలు  చెప్పుకునే పిచ్చి. ఏ పిచ్చీ లేంది తనకే… ఏదో హాయిగా
                                         ఉoదనుకుంటే ఈ తిలక్‌ గాడి నసతో చచ్చిపోతున్నా!’ అని మనసులో విసుక్కుంటూ సింక్‌ దగ్గర కొళాయిని తిప్పి ముఖం మీద నీళ్లు చల్లుకుంది . ఆ నీళ్లు వెళ్లి స్టౌ దగ్గర నిలబడి వున్న సులోచనమ్మ మీద పడి చీర తడిసింది.
                                        ఆమె చిరాగ్గా చూస్తూ ‘‘బయటకెళ్లి కడుక్కునిరా వినీలా! వంటగది ఇప్పుడే తుడుచుకున్నాను. నీళ్లు పడితే నడవాలoటేనే జారుతుంది.’’ అంది.
                                        అది పాతకాలoనాటి ఇల్లే అయినా లోపల  మాత్రం ఈ మధ్యనే కొత్తగా కొన్ని సౌకర్యాలను కల్పించుకున్నారు. వంట గదిలో సింక్‌, కొళాయి, బయట రెండు కొళాయిలు , నేలమీద పాలిష్‌ రాళ్లు… చూడటానికి నేల  పాలిష్‌ రాళ్లతో బాగానే వుందికాని నీళ్లు పడి మరకలు  పడినప్పుడు ఒక్క సులోచనమ్మ మాత్రమే తుడుస్తుంది. వినీల  చెబితేనే తుడుస్తుంది. అదీ కూడా ఇటు తుడవమంటే అటు. అటు తుడవమంటే ఇటు ఆగి ఆగి తుడుస్తుంది. కొంచెం తుడవగానే నిల బడి అటు ఇటు చూస్తుంది. అత్తగారు చూడకపోతే మిగిలింది తుడవకుండానే వదిలేస్తుంది. అది తెలిసిన సులోచనమ్మ కోడలు  సరిగా తుడుస్తుందో లేదోనన్న అనుమానంతో ఆమె ఏ పనిలో వున్నా కోడలినే గమనిస్తూ వుంటుంది. ఇది తెలిసి ‘నాచేత తుడిచిన దగ్గరే తుడిపిస్తుంది. ఇదేం అత్తరా బాబు!’ అని వినీలోని లోపలి మనిషి ఆగ్రహిస్తుంది. అది గుర్తుచేసుకుంటూ కళ్ల మీదున్న నీళ్లను చేతులతో తుడుచుకుంటూ.
                                       ‘‘మీరందరూ ఎందుకండీ నా మీద ఇంత కక్ష కట్టారు? నేను ఏ పని చేసినా మీకు నచ్చదా? అక్కడ కడిగితే ఇక్కడంటారు. ఇక్కడ కడిగితే అక్కడుoటారు. అసలు  నా ముఖానికి ఎన్ని నీళ్లు పడతాయని బయటికెళ్ళి కడుక్కోమంటున్నారు?’’ అంది.
                                         సులోచనమ్మ మాట్లాడకుండా నుదుటి మీద చేత్తో కొట్టుకోబోయి ఆ పనికూడా చెయ్యకుండా వినీలను వుద్ధేశించి ‘‘చూడు వినీలా ! నువ్వు స్టౌమీద వున్న పాలు  పొంగుతాయేమో చూస్తుండు. బయట అరుగు మీద మీ మామయ్య గారు తాగిన కాఫీ గ్లాసులున్నాయి. వెళ్లి పట్టుకొస్తాను.’’ అంటూ ఆ గదిలోంచి వెళ్లబోయింది.

– అంగులూరి అంజనీదేవి

———————————————————————————————————————————–

జ్ఞాపకం, ధారావాహికలు, , Permalink

Comments are closed.