మూడు తరాలు

                     – కాదంబరి

                  బామ్మ సణుగుడు విరామమెరుగని ఆమె గొణుగుడు సాగుతూనే ఉన్నది.

ఇంట్లోకి అప్పుడే అడుగుపెట్టిన అన్నయ్య కేసి చూస్తూ,

“ఏమిటన్నయ్యా! బయట మళ్ళీ ఏం విడ్డూరాలు అగుపడ్డాయి? ఇంత కుంభవృష్టిలో ఇద్దరూ ఎక్కడైనా ఆగి,

నెమ్మదిగా  రావాల్సింది! ఇలాగ తడిసి ముద్దలౌతూ వచ్చారు?” తువ్వాళ్ళు ఇద్దరికీ ఇస్తూ అన్నాడు ప్రదీప్.

ప్రదీప్ కి స్కూటర్ తాళాలను ఇస్తూ చిన్నగా నవ్వేసాడు అనురాగ్.

వంటింట్లోకి వెళ్ళి పాలగిన్నెను స్టవ్వుపై పెట్టేసి, చక్కెర, అక్కడే ఫిల్టర్ లో ఉన్న

డికాక్షన్ ను గిన్నెలో కలిపి, వేడి కాఫీని ఒక స్టీలు గ్లాసులో పోసి బామ్మకు ఇచ్చాడు.

వానలో తడిసి, చలికి వణుకుతూనే చీర మార్చుకున్నది.

కాసె పోసి, మడి కట్టుకునే ఆ ఏడు గజాల చీరకట్టు తెలుగుదనపు అందానికి ప్రతీక.

అనురాగ్ బామ్మకు పొగలు కక్కుతూన్న కాఫీ గ్లాసును అందించాడు.

ఆమె కోపం కాస్త చల్లబడింది.

మేడ మీదనుంచి అమ్మ వచ్చింది.

“కేకేసి పిలిస్తే వచ్చేదాన్నిగా! కాఫీ మీరే కలుపుకున్నారే!” కాస్తంత నొచ్చుకొంటూ అన్నది.

“మన  యువతరం పిల్లకాయల్లో బద్ధకాన్ని పోషించేది

ఇలాటి అమాయకపు సాంప్రదాయపు మాతృమూర్తుల ప్రేమలే, కదరా అన్నాయ్!”

తమ్ముడు ప్రవీణ్ గడుసు మాటలకు చిరునవ్వును బదులుగా ఇచ్చాడు అనురాగ్.

‘వీడెప్పుడూ ఇంతే! పోసుకోలు కబుర్ల రాయుడు! తామిద్దరూ లోనికి రాగానే

టీ కలిపి ఇచ్చి సేదదీర్చే ప్రయత్నాలేమీ చేయడు,

కానీ అమ్మ లాంటి వాళ్ళను మాత్రం- బోల్తా కొట్టించే డైలాగు బాణాలను తన మాటల తూణీరంలో

అట్టిపెట్టుకుంటాడు ‘

సెగల పానీయం అంగిట్లోకి జారాక, బామ్మ శాంతించింది.

కోడలుతో అన్నది-

“చూశావా కలికాలం చోద్యాలు కాకపోతే ఇదేమిటి?

మన కాలంలో ఎరుగుదుమా?”

కిసుక్కున నవ్వాడు ప్రవీణ్.

అతని వైపు కొరకొరా చూసింది బామ్మ.

” అనురాగ్ నెమ్మది, వీడెప్పుడూ ఇంతే! పెద్దవాళ్ళను లెక్క పెట్టడు. గంపలు గంపల నిర్లక్ష్యాన్ని

వసతో కలిపి పోసి ఉంటుంది తన ముద్దుల కోడలు!” అనుకుంది .

పరిస్థితిని బ్యాలెన్సు చేస్తూ అన్నాడు అనురాగ్.

“దారిలో ఓ చిన్న ఇన్సిడెంటు జరిగింది”

ప్రవీణ్ సోఫాలోకి ఒక్క గంతు వేసి, కూర్చుంటూ అడిగాడు.

బామ్మ, అనురాగ్ ల వివరణలతో వెలువడిన కథా సారాంశం ఇది.

***                           ***                             ***                              ***

అనురాగ్ , బామ్మను గుడికి తీసుకువెళ్ళాడు.

గంట తర్వాత బయలుదేరుతూంటే దేవళంలో బామ్మ యొక్క చిన్ననాటి స్నేహితులు తారసిల్లారు.

అనుకోకుండా కలవడంతో అందరూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఇంకేం! ఆ పాత స్నేహితుల ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళారు.

పాత స్నేహాలతో కొత్త చుట్టరికాలను కలిపేసింది బామ్మ!

అదే, తన పెద్ద మనుమడితో ఆ ఇంటి కన్యామణితో వివాహ బంధాన్ని కుదిరించేసింది.

***                            ***                               ***                                ***

 “మన బామ్మకు హ్యాట్సాఫ్ అన్నాయ్! ఇదే ఏ మ్యారేజ్ బ్యూరో ద్వారానో ఐతే

దండిగా ఫీజులు అయ్యేవి. ఒక్క దమ్మిడీ ఖర్చు చేయకండానే నీకు పెళ్ళి కుదిర్చేసింది,

బామ్మా! నా మ్యారేజ్ కికూడా నువ్వే బాధ్యత తీసుకోవాలి”

“అంతకంటేనా? భగవంతుడు శీతకన్ను వేయకుండా ఉంటే  నీక్కూడా బాసికం కట్టడం నా చేతుల మీదుగానే

జరిపిస్తానురా భడవా!”

***                                     ***                                 ***                                   ***

దారి మళ్ళిన సంభాషణను చెవి పట్టుకుని,

మళ్ళీ అసలు సంగతికి తెచ్చారు.

ఇంటికి తిరిగివస్తూన్నారు, అంతలోనే కుండపోత వాన.

“మనం ఏదైనా పనిమీద వస్తేనే ఇలాటి అవాంతరాలన్నీను!  హ్హు, ఇలాగ అంకపొంకాల వాన,

నా చిన్నప్పుడు తిరునాళ్ళకు వెళూంటే కురిసింది.

మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఇలాగ ఈ దబాటు వాన!”

బామ్మ విసురుతూన్న నానార్ధాలను వినాలనిపించిందో ఏమో-

వాన చినుకులు నింగికీ నేలకూ ఏకధారలుగా మారాయి.

“Rain! rain! gO away!” పిల్లలు కేరింతలాడ్తూన్నారు.

“కురిసింది వాన! నా గుండెలోన…..” కుర్రకారు హమ్ చేస్తూన్నారు.

అంతలోనే చిన్న సంఘటన!

ఆట్టే బయటికి రాని బామ్మకు  అది సహించరాని విషయమే!

కింద కాలువలుగా నీళ్ళు వడివడిగా ప్రవహిస్తూన్నాయి. పాదం లోతు జల ప్రవాహాలు రోడ్డు అంతటా!

అందరూ స్కూటర్లూ, బల్కులూ, మోపెడ్లనూ ఆపేసారు. షాపుల ముందరా, బస్ స్టాండులలో,

షెల్టర్లు ఎక్కడ దొరికితే అక్కడ ముడుచుకునుంటూ నిలబడ్డారు.

బామ్మతో బాటుగా అనురాగ్ కూడా ఒక ఇంటి చూరులాంటి చోటులో నిలుచున్నాడు.

అప్పటికే చాలామంది పిప్పళ్ళ బస్తాలో కూరినట్లుగా ఉన్నారు జనం. ‘బామ్మకు అసలే మడి. మడి పేరుతో

ఎవ్వరినీ, ఇంట్లో వాళ్ళను కూడా తాకకుండా ఉండే అలవాటును చేసిన సాంప్రదాయం…..’

“ఛి ఛీ!” అనుకుంటూ ఎవ్వరినీ తాకకుండా పక్కకు పక్కకు ఒదుగుతూ

పాపం! ఆమె నానా అవస్థలు పడుతూన్నది. ఇప్పుడు అందరూ అటుకేసి చూస్తూన్నారు

హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనను.

ఒక యువకుడు తన గర్ల్ ఫ్రెండును చటుక్కున రెండు చేతుల్లో ఎత్తుకుని

దబ్బున ఆ సన్నని ప్రవాహాన్ని దబ్బున దాటేశాడు.

అతడి కరకమలాలలో ప్రేయసి కిలకిలా నవ్వుల గ్రుమ్మరింతలు.

బామ్మ లాంటి వాళ్ళు నిశ్చేష్ఠులౌతూ, కాస్సేపటిదాకా అలాగే ఉన్నారు

‘ఇంతలు కన్నులుండ విప్పార్చి అలాగే వీక్షిస్తూ…………..’

యువత, పిల్లలూ ఆట్టే రియాక్టు అవలేదు కానీ,

ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కామెంట్సు చేస్తూ మాట్లాడుకుంటూన్నారు.

“గురుడు సినిమాల్లో హీరోగా ట్రై చేసుకోవచ్చు”

“లవరేనంటావా?” “ఝనక్ ఝనక్ పాయల్ నో? పుస్కి పుస్కీనో ఐ ఉంటుంది”

“ఇలాటి వానలో తడుస్తూంటే ఇప్పుడు బాగానే ఉంటుంది,

రేపు జలుబూ, దగ్గూ….”

అప్పటికే మరి కొందరు ఆరుబైటకు అడుగేశారు, జడివానకు జడియకుండా.

అప్పటికి కాస్త తగ్గుముఖంపడ్తూన్న వానను చూస్తూనే బామ్మ “ఇక! పద! త్వరగా ఇల్లు చేరదాము”

“బామ్మా! నువ్వూ తాతయ్యా మీ పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడైనా సరదాగా

వర్షంలో తడుస్తూ ఆటలాడుకున్నారా?”

ప్రవీణ్ చిలిపితనానికి తల్లి, అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన తండ్రి ముసిముసినవ్వులు నవ్వుకుంటూ

వంటింట్లోకి వేళ్ళి, భోజనపదార్ధాలను  మైక్రో ఓవెన్ లోనూ, స్టవ్వు మీదా వేడి చేసే కార్యక్రామాన్ని మొదలెట్టారు.

అనురాగ్ “తనకు ఇందాక బామ్మ ద్వారా పరిచయం ఐన కన్నెపిల్ల బొమ్మని మనసులో ప్రతిష్ఠించుకుని” తన

కలకు వన్నెలను అద్దుతున్నాడు.

ప్రవీణ్ కొంటె మాటలకు బదులుగా బామ్మ తర్జని చూపిస్తూ అన్నది

“భడవా! పెద్దంతరం చిన్నంతరం ఎరగరు కదా ఈ కాలం పిల్లలు  మరీ కలికాలం కదూ! ” *

కథలుPermalink

2 Responses to మూడు తరాలు

  1. Madhavi says:

    బావుంది… 🙂

  2. p.padmavatisarma says:

    కధ చాలా బావుంది